"బ్లాగుల్లో చాలామంది సినిమా రివ్యూలు రాసుకుంటున్నారు. నేనెందుకు రాయకూడదు?"
"ఎవడొద్దన్నాడు? భేషుగ్గా రాసుకో. చదివి పెడతా. ఏ సినిమా రివ్యూ రాస్తున్నావ్? అందరూ 'దూకుడు' రివ్యూలు రాస్తున్నారు."
"నాకా దూకుడూ, పీకుడూ గూర్చి తెలీదు. మొన్నామధ్య చూసిన సినిమా గూర్చి రాస్తా."
"సరే! రాసుకో. బుద్ధిలేక నీ బ్లాగులోకొచ్చా. చదవక ఛస్తానా!"
"థాంక్యూ!"
సినిమా పేరు.. నువ్వే కావాలి
తారాగణం.. రోజారమణి కొడుకు, ఇంకా ఎవరెవరో..
ఎలా ఉంది?.. పరమ చెత్త.
రేటింగ్.. 0/5
"హోల్డాన్. నువ్వు ఫ్రెష్ గా ఈమధ్యన చూసిన సినిమా రాస్తావనుకుంటే.. "
"నేనూ ఫ్రెష్ గా పదేళ్ళ క్రితం సినిమా గూర్చే రాస్తుంట! మాఊళ్ళో హోటళ్ళల్లో గారెలూ, బజ్జీలూ పూర్తిగా అయిపొయ్యి.. తరవాత వాయ వచ్చేదాకా అన్నీ ఫ్రెష్షే! అందుకే ఫ్రెష్షుగా నిన్నటి గారే, మొన్నటి బజ్జీ అమ్ముతుంటారు. మేం తింటుంటాం. నేను నువ్వే కావాలి సినిమా తరవాత ఇంకేసినిమా చూళ్ళేదు. కాబట్టి.. నా రివ్యూ ఫ్రెష్షే!"
"నిన్నూ, ఈ దేశాన్నీ బాగుచెయ్యటం నావల్ల కాదు. సర్లే! నాదో చిన్న సలహా. నీ బ్లాగు టైటిల్ 'పని లేక'ని.. 'మతి లేక' అని మార్చకూడదూ!"
"కూడదు. పదేళ్ళక్రితం ఆ సినిమాకెళ్ళిన రోజు ఏం జరిగిందో నీకు తెలిస్తే ఇంత వెటకారంగా మాట్లాడవ్."
"మరెందుకాలస్యం? తొందరగా చెప్పెహె!"
నేను సినిమాలు చూట్టం మానేసి చాలా ఏళ్ళయ్యింది. రెండు గంటలు ఒక సీట్లో కూర్చొని తెరమీద బొమ్మల్ని చూసే ఓపిక లేదు. పాతరోజుల్లో సినిమా బాగోకపోతే ప్రశాంతంగా నిద్రబోయే సౌలభ్యం ఉండేది. నేటి రెహమాన్లూ, మణిశర్మలూ సంగీతం పేరున వాయించే చెంబులూ, తప్పేళాల మోతవల్ల మనకాపాటి ఫెసిలిటీ కూడా దూరమైంది. అవ్విధముగా సినిమా చూడకుండా ప్రశాంత జీవనము గడుపుచున్న నాకు.. ఖర్మకాలి.. నువ్వే కావాలి, నన్నే చూడాలి అంటూ ఒక చిత్రరాజం వెంటాడింది.
'నువ్వే కావాలి' సినిమా ఘోరమైన హిట్టనీ.. చూడని జన్మ వ్యర్ధమనీ నాభార్య టికెట్లు తెప్పించింది. సినిమా తప్పించుకోటానికి నాదగ్గరున్న అన్నిఅస్త్రాలు గురి తప్పిన కారణాన.. చచ్చినట్లు సినిమాకి వెళ్ళాల్సొచ్చింది. ఆరేళ్ళ మా అమ్మాయి నోరు తెరుచుకు సినిమా చూస్తుంది. కానీ.. మూడేళ్ళ పుత్రరత్నం మాత్రం సినిమా శబ్దాలకి ఏడుపు లంకించుకుంటున్నాడు. బయటకి తీసికెళ్ళి ఆడిస్తే హాయిగా నవ్వుతున్నాడు. ఈవిధంగా లోపలకీ, బయటకీ తిరిగి తిరిగి.. కాళ్ళు నొప్పి పుట్టుట చేత.. సెకండాఫ్ అంతా హాలు బయట కేంటీన్ దగ్గర కాలక్షేపం చేస్తూ గడపసాగాను.
సినిమా వినబడుతూనే ఉంది. అనగనగా ఆకాశం ఉందంటూ ఒక బండగొంతు హాలు దుమ్ము దులిపేసింది. హీరో కుఱ్ఱాడు హీరోయిన్ కి తన ప్రేమ సంగతి మాత్రం చెప్పట్లేదు. విసుగ్గా ఉంది. సినిమాకి రానని మొండికెయ్యాల్సింది. అనవసరంగా అలవాటు లేని త్యాగరాజు పాత్ర పోషించి ఇరుక్కుపోయాను.
ఈలోపు మావాడు వరండాని పావనం చేశాడు. హాల్ ఊడిచే అమ్మాయిని పిలిచి కొంత డబ్బు ముట్టచెప్పి శుభ్రం చేయించాను. ఇంకా హీరో తన ప్రేమ చెప్పి చావలేదు. చెప్తే సినిమా అయిపోతుంది. కానీ.. చెప్పటానికి హీరోకి ధైర్యం చాలట్లేదు. భగవాన్! ఏమిటీ నాకీ శిక్ష?
కొంచెంసేపటికి మావాడు వరండాలో అడ్డదిడ్డంగా పరిగెత్తటం మొదలెట్టాడు. నాపని ఇంకా ఎక్కువైపోయింది. లోపల సీన్లు నడుస్తూనే ఉన్నయ్. హీరో దరిద్రుడుకి ఇంకా ధైర్యం రావట్లేదు. ఈ హీరోగాణ్ణి ఎవడైనా తంతే బాగుణ్ణు. కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకంటూ ఒక ఏడుపు పాట. కొద్దిసేపటికి సినిమా అయిపోయింది. నాకు మోక్షం లభించింది. దేవుడున్నాడు!
"మీరేంటి బుడుగుని బయటకి తీసికెళ్ళి.. మళ్ళీ కనబళ్ళేదు? మీరెళ్ళింతర్వాత సినిమా ఇంకా బావుంది తెలుసా." నాభార్య చెబుతున్న విషయం సరీగ్గా అర్ధం కాలేదు. నేను పక్కన లేకపోవటం బాగుందా? సినిమా బాగుందా?
హాలు బాల్కనీలోని నా పాట్లకి గుర్తింపు లేకపోగా.. సినిమా గూర్చి వ్యాఖ్యానాలు. మొదట కోపంతోనూ.. పిదప విరక్తితోనూ.. నేనేం మాట్లాళ్ళేదు. మనసులోనే నాకు నచ్చిన పాట "ఇదిగో దేవుడు చేసిన బొమ్మా.. " అంటూ పాడుకున్నాను. నాకీపాట పెళ్ళి కాకముందు అడుక్కునేవాళ్ళ పాటగా అనిపించేది. పెళ్ళయ్యాగ్గానీ ఇదెంత గొప్ప పాటో అర్ధం కాలేదు.
ఈ దుస్సంఘటన జరిగిన నాల్రోజులకి ఆ సినిమా హాలు ఓనరూ మరియూ ప్రముఖ దంతవైద్య నిపుణుడూ అయిన నా స్నేహితుడు ఒక పార్టీలో కలిశాడు.
"సినిమా తలనొప్పి. చెత్త. ఆ హీరో కుర్రాడు తన ప్రేమ గూర్చి హీరోయిన్ పిల్లకి చెప్పటానికి పజ్జెనిమిది రీళ్ళు తీసుకున్నాడు. అదదో మొదటి రీల్లోనే చెప్పేడవొచ్చుగా. తొందరగా ఇంటికి పొయ్యేవాణ్ణి." అన్నా.
"అసలు ఆ సినిమాతో మీకేం పని? మిమ్మల్నెవరు చూడమన్నారు?" సూటిగా చూస్తూ అడిగాడా హాలు ఓనరు.
బిత్తరబోయా. నేను సినిమాలు చూడకూడదన్న సంగతి నాకిప్పటిదాకా తెలీదు.
"అదేంటి! ఏదో ఇంట్లోవాళ్ళు ఫోర్స్ చేస్తే.. టికెట్ కొనుక్కుని.. " సంజాయిషీ ఇస్తున్నట్లు నసిగాను.
అతను పెద్దగా నవ్వాడు.
"మీరేమో ఎప్పుడో ఎన్టీఆర్ యుగం వాళ్ళు. ఇప్పుడంతా యూత్ హవా. వాళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నారు. మా హాల్లో నువ్వే కావాలి బొమ్మకి (అతనికి సినిమాని 'బొమ్మ' అనే అలవాటు) యూత్ పిచ్చెక్కి డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళకోసం తీసిన సినిమా మీరు చూడటమే తప్పు. ఇంకా బాలేదని కామెంటు కూడానా! హన్నా!" అంటూ మళ్ళీ నవ్వాడు.
"తాగుబోతు బారుకెళతాడు. భక్తుడు గుడికెళ్తాడు. ఒకడి వాతావరణం ఇంకోడికి చికాగ్గా, రోతగా ఉంటుంది. అట్లాగే ఇప్పటి సినిమాలు మీలాంటివారికి నచ్చవు. ఇంకెప్పుడూ సినిమాలకి పోకండి." అని సలహా కూడా ఇచ్చాడు.
అతని సలహా నాకు బాగా నచ్చింది. అందుకే ఇప్పటిదాకా ఇంకే సినిమాకీ వెళ్ళే సాహసం చెయ్యలేదు.
"అమ్మయ్యా! నేను కూడా ఒక సినిమా రివ్యూ రాసానోచ్!"
"మీ ఊళ్ళో దీన్ని రివ్యూ అంటారా? కథ రాయలేదు. నటన గూర్చి రాయలేదు.. ఏవో నీ పీత కష్టాలు నాలుగు ముక్కలు రాసి పడేసి దాన్నే రివ్యూ అంటే ఎలా?"
"అవన్నీ రాయటానికి నే సినిమా పూర్తిగా చూస్తేగా! ఏదో రివ్యూ రాద్దామనే ఆవేశంతో రాసేశాను. దీన్నే రివ్యూగా ఎడ్జస్ట్ చేసుకోరాదూ!"
"రాదూ అంటే రాదు. సర్లే! ఏదోటి. అంత మంచి సినిమాని పరమ చెత్తని రాస్తే బాగోదు. కనీసం రేటింగైనా మార్చు."
"అన్నయ్యా! ఒఖ్ఖసారి కమిట్ అయితే నా రాత నేనే మార్చను. పదేళ్ళ నా మేనల్లుడు ఫైటింగుల్లేవని శంకరాభరణం సినిమాని చెత్తన్నాడు. నేకాదన్నానా? ఎవడి అభిప్రాయం వాడిది. సినిమా మొదటి భాగం 'కని'.. రెండోభాగం 'విని'.. 'కనీవినీ' ఎరగని రివ్యూ రాశాననీ.. నాకు పేరొస్తుందనీ నీకు కుళ్ళు. నీ మాట నేను వినను."
"నీ ఖర్మ!"
(photo courtesy : Google)
:)బాగుంది. ఇంత సుఖపడిపోయారా మీరు?
ReplyDeleteఈసారి హైలైట్ :
>>>>>"ఇదిగో దేవుడు చేసిన బొమ్మా.. " అంటూ పాడుకున్నాను. నాకీ పాట పెళ్ళి కాక ముందు అడుక్కునేవాళ్ళ పాటగా అనిపించేది. పెళ్ళయ్యాగ్గానీ ఇదెంత గొప్ప పాటో అర్ధం కాలేదు.
YOUR REVIW IS EXCELENT. DONT WORRY . NOW ALSO GOOD FILMS ARE AVAILABLE .DONT THINK -VE. BE +VE. ANY TRUTH IS NOT PERMANANT. CHANGE IS A GREAT THING .ALWAYS ALL TIMES , ALL PLACES , ALL THINGS AND THINKS THERE ARE GOOD AND BAD .
ReplyDeleteరివ్యూ అదిరినది.
ReplyDelete"తాగుబోతు బారుకెళతాడు. భక్తుడు గుడికెళ్తాడు. ఒకడి వాతావరణం ఇంకోడికి చికాగ్గా, రోతగా ఉంటుంది.
ReplyDelete-----------
మనస్సులో ఏదో బల్బు వెలిగింది. ఈ నగ్న సత్యాన్ని ఇంతవరకూ తెలుసుకోలేదేమిటా అని బాధగా ఉంది. ఈ విధంగా చూస్తే చాలా మందిని అర్ధం చేసుకోవచ్చు.
maa ayana ki meeru bandhuvulaa?? cinemaa lante paaripotharu..baagundandi..
ReplyDeletevasantham.
విజయభాస్కర్ సినిమాలన్నీ ఇంతే. ప్రేమని చెప్పలేకపోవడమే రెండున్నరగంటల సిన్మా.
ReplyDeleteకాముధ
kevvvvvvvvvvvvvvvvv
ReplyDelete:) :)
ReplyDelete:D
ReplyDeleteపదేళ్ళ నా మేనల్లుడు ఫైటింగుల్లేవని శంకరాభరణం సినిమాని చెత్తన్నాడు. నేకాదన్నానా? ఎవడి అభిప్రాయం వాడిది. nicely written. i agree with you.
ReplyDeleteఅయ్యా రమణా, నీ సినెమా "రివ్యూ" కథ బాగుంది. ఐతే ఇది రివ్యూ కంటే కంటెంపరరీ తెలుగు చిత్రాల మీద వ్యాఖ్యానం అంటాను. ఈ మధ్యటి సినెమాల మీద, సంగీతం మీద నాక్కూడా ఇలాటి అభిప్రాయమే. ఇదీ జెనరేషనల్ చేంజ్ - మీరు ముసలివాళ్ళయ్యార్లెండి అంటుంది నా భార్య.
ReplyDeleteబి ఎస్ ఆర్
కామెంటిన అతిధులకి ధన్యవాదాలు.
ReplyDelete@ బి ఎస్ ఆర్.. మీ భార్య వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తాను.
నా చిన్నప్పుడు ముసలాళ్ళు ప్రుధ్వీరాజ్ కపూర్, చిత్తూరు నాగయ్యల గూర్చి గొప్పగా చెప్పుకునేవాళ్ళు.
హాయిగా రామారావు సినిమాలు చూసుకోక ఈళ్ళగోలేందెహె! అనుకునేవాణ్ణి.
ఇప్పుడు మనకి ప్రమోషనొచ్చింది.
సీనియర్ సిటిజెన్లమైపోయాం.
సినిమాలతో "కనెక్షన్" పోయి చాలా కాలమైంది.
ఇది ప్రకృతి ధర్మమనుకుంటున్నాను.
వీళ్ళ సినిమా లకే దడుచుకుంటె రేపటి వీరోల సంగటి ఏమిటి? గౌతం, అకిరా నందన్ ఏమి ఐపోతారు
ReplyDelete@rajasekhar Dasari గారు..
ReplyDeleteధన్యవాదాలు.
మీర్రాసిన వాళ్ళు ఎవరు?
కొత్త హీరోలకి కొత్త ప్రేక్షకులు పుట్టుకొస్తార్లేండి.
మార్పు సహజం.
మా రోజుల్లో రామారావుకి ఉన్మాదాభిమానులు ఉండేవాళ్ళు.
ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు తక్కువ.
ఇప్పుడు ఈ ఇంటర్ నెట్ యుగంలో ఆ వెఱ్ఱి అభిమానులు అంతరించిపోయారు.
మీ రివ్యూ బాగుంది. ఏదైనా కొత్త సినిమా చూసి ఇంకో రివ్యూ రాయండి.
ReplyDeleteచాలా బాగుందిరా నీ సినెమా రివ్యూ. సాయంత్రం బారులో పీకల దాకా తాగి ప్రొద్దున్నే గుడికి పోయే వాళ్ళు మనకి తెలిసి చాలామందే ఉండేవాళ్ళు. ఈసారి వాళ్ళ గురించి రాయవోయి ,బాగుంటుంది .
ReplyDeleteసూర్యం
రమణ గారు మీకు హీరోయిన్ ల కుమారులే గాని హీరోల కుమారులు తెలియదా? గౌతం మహేష్ బాబు కుమారుడు, అకీరా పవన్ కల్యాణ్ కుమారుడు. వీళ్ళే రేపటి వీరోలు
ReplyDeleteమీ ఫ్రెష్ రివ్య్యూ కి మరో ఫ్రెష్ కామెంట౦డోయ్... భలే నవ్వి౦చారు. డాక్టర్ గారు బ్లాగులోకూడా ట్రీట్ మెంట్ ఇచ్చేస్తున్నారే మనసు బాగోకపోతే మీ క్లినిక్ రానక్కర్లేదు, మీ బ్లాగు కొస్తే చాలు. థాంక్ యు.
ReplyDelete