Friday, 9 September 2011

సాంబారు.. ఒక చెరగని ముద్ర


"నాన్నోయ్! ఇక్కడ సాంబారిడ్లి సూపరుంది."

ఆదివారం ఉదయం గీతా కేఫ్‌లో ఇడ్లీ సాంబారు తింటూ నా పుత్రరత్నం కామెంట్. 

"నీకంతగా నచ్చితే రెండ్రోజుల్లో మళ్ళీ వద్దాం. అప్పుడు మళ్ళీ తిందువుగాన్లే." అంటూ - జ్ఞాపకాల్లోకి జారిపోయాను. 
                      
కొన్నాళ్ళక్రితం ఒంగోలు వెళ్ళాల్సిన పని పడింది. ఉదయం కార్లో బయల్దేరాను. దార్లో టిఫిన్ (మనం బ్రేక్‌ఫాస్ట్‌ని 'టిఫిన్' అంటాం, తెలుగేతరులకి టిఫిన్ అంటే అర్ధంకాదు) కోసం డ్రైవర్ చిలకలూరిపేటలో కారాపాడు. హోటల్ పేరు పధ్మనాభ హోటల్. విశాలమైన హాల్. పదిపదిహేను దాకా టేబుళ్ళు, డజన్లకొద్దీ కుర్చీలు. కూర్చునే ప్లేస్ కోసం వెయిట్ చెయ్యాల్సొచ్చింది. ఓ పక్కన్నిలబడి అక్కడి వాతావరణాన్ని గమనించసాగాను. 

దాదాపు అందరూ ఇడ్లీ, వడ సాంబారు తింటున్నారు. ఓ పక్కన పెద్ద ఇత్తడి గంగాళాలు నాలుగైదు నిలబెట్టి ఉన్నయ్. వాటినిండా పొగలు గక్కుతూ చిక్కటి సాంబారుంది. వంటగదిలోంచి పెద్దపాత్రల్లో వేడివేడి ఇడ్లీలు, గారెలు మోసుకొచ్చి ఓ గంగాళంలో పడేస్తున్నారు. అవన్నీ సాంబారులో పూర్తిగా మునిగేట్లుగా ఒకతను పెద్ద చిల్లుల గరిటెతో వాటిని నొక్కుతున్నాడు. 

ఇంకో గంగాళంలో - సాంబారు పీల్చుకుని ఉబ్బిపోయున్న ఇడ్లీల్నీ, గారెల్నీ - స్టీలు హస్తంతో పక్కనే వున్న టేబుల్ మీద వరుసగా పేర్చబడున్న ప్లేట్లల్లోకి.. ఇడ్లీ, గారెలు ఏమాత్రం విరక్కుండా, చెదిరిపోకుండా అత్యంత లాఘవంగా మారుస్తున్నాడు.      

కొంతరు - విమానం నడపటం, గుండె ఆపరేషన్ చేయటం వంటి సంక్లిష్టమైన పన్లని అలవాటైపోయి - చాలా సింపుల్‌గా, మెకానికల్‌గా చేసేస్తారు. చూసేవారికి అదేమంత గొప్పపనిగా అనిపించదు. కానీ - దానివెనక ఎంతో సాధన ఉంటుంది. సాంబారిడ్లీల్ని పేర్చే వ్యక్తి కూడా ఆ కోవలోకే వస్తాడని అనిపించింది. కొద్దిసేపు అతణ్నలా ఎడ్మైరింగ్‌గా చూస్తుండిపోయాను.    

అమ్మయ్య! ఇప్పుడు నాకో కుర్చీ దొరికింది. ఆర్డర్ తీసుకోకుండానే (అక్కడందరూ ఫస్ట్ గేర్ సాంబారుతోనే వేస్తారేమో) నాముందుకు పొగలు గక్కుతున్న ఇడ్లీవడ సాంబారు వచ్చి చేరింది. అంతదారుణమైన వేడితో సాంబారిడ్లీ తినే ధైర్యం లేనందున, కొంచెం వేడి తగ్గాక తిందామని నిర్ణయించుకుని - ఆ విశాలమైన హాలుని మరొకసారి పరికించాను. 

సర్దా కబుర్లు చెప్పుకుంటూ తినే హోటలు వాతావరణం నాకలవాటు. కానీ అక్కడెవరూ కబుర్లు చెప్పుకోటల్లేదు! సీరియస్‌గా స్పూన్లతో గారెల్నీ,ఇడ్లీల్నీ గుచ్చుతూ, పొడుస్తూ, ముక్కలుగా (నరుకుతూ) చేసుకుని తింటున్నారు.  

అంతమంది ఏకాగ్రతగా ఒకేసారి ఒకేపని చేస్తూండటం ఆశ్చర్యంగా వుంది. ఇది ఇడ్లీవడ సాంబారు తినే కార్ఖానానా! నాకీ వాతావరణం - ఒక కార్ల కంపెనీ తయారీ యూనిట్‌ని చూస్తున్నట్లుగా, స్పీల్‌బర్గ్ సినిమాలో నలుగురిని వందమందిగా చూపే గ్రాఫిక్ వర్క్‌లాగా అనిపించింది. ఈ సాంబారు - నిరంతరం ప్రవహించే గంగానదివలే, సాంబారు తాగేవారందరూ ఋషులవలే కనిపించసాగారు.         

సాంబారు వేడి తగ్గినందున - తిండం మొదలెట్టాను. అద్భుతం, అమోఘం అంటూ యేవో పడికట్టు పదాల రొటీన్ వర్ణనలు తప్ప, రుచుల్ని వివరిస్తూ రాయడం నాకు చేతకాదు. అయినా - ఇక్కడ ఇంతమంది ఋషులు సాంబారోపాసన చేస్తుంటే రుచి గూర్చి సర్టిఫికేట్ అవసరం వుందా! 

ప్రతిమనిషికీ తన ఇంటలెక్చువల్ స్థాయి, అభిరుచిలననుసరించి కొన్ని మధుర స్పృతులు, అనుభవాలు మదిలో నిక్షిప్తమైపోతాయి. అది కొందరికి తమ ఇష్టదైవం పాదపద్మముల దర్శనభాగ్యమైతే, మరికొందరికి ఇష్టసఖి ప్రేమగా తొలిసారి లాలనగా పిలిచినప్పుడు కలిగే పులకరింతా, పలవరింతా, థ్రిల్లింతా కావొచ్చు. 

నాకన్ని గొప్ప అనుభవాల్లేవు, పెద్ద ఇమేజినేషనూ లేదు. అభిరుచి అంటే అర్ధం తెలీదుగానీ - రుచి అంటే అర్ధం తెలియాల్సినదాని కన్నా కుంచెం ఎక్కువే తెలుసని తెలుసు. అందుకే చిలకలూరిపేట పద్మనాభ హోటల్ సాంబారిడ్లీ వడ నా మదిలో చెరగని ముద్రేసింది. కాబట్టే - నిన్నమొన్న జరిగినట్లు అనిపిస్తుంది.   

(photos courtesy : Google)         

29 comments:

  1. మీరింతలా చెప్పాక ఇంక తప్పుతుందా! ఈ సారి అటుకేసి వెళ్ళినప్పుడు చిలకలూరిపేట పద్మనాభ హోటల్ సాంబారిడ్లీ వడ రుచి చూడవలసినదే!

    ReplyDelete
  2. టిఫిన్ అనే పదం తెలుగువాళ్ళకు మాత్రం తెలిసినట్టు కేఫ్ అనే పదం కూడా అంతే. Cafe ఫ్రెంచి పదం, దాన్ని కఫే గా ఉచ్చరించాలని మనవాళ్ళకు ఎప్పుడు వంటబడుతుందో?

    ReplyDelete
  3. గీతాకేఫ్ అంటే గుంటూరు బ్రాడీ పేట నాలుగో లైను గీతాకెఫేనా??
    అదయితే సూపర్!!!!
    కాదా???
    అస్సలు బాగోవు (మా వూళ్ళో హోటళ్ళకి మినహాయింపు)

    ReplyDelete
  4. మా వూర్లో కూడా బకెట్ నిండుగా పొగలు కక్కే సాంబార్లో గారెలు(నేను వడలు అనను) అలా పడేసి ఉంచుతారు. దాన్ని అలాగే మోసుకొచ్చి మన ప్లేట్లో బాగా నానిన గారెలు వడ్డిస్తారు.భలే ఉంటాయి.

    రాజేంద్ర గారూ, గీతా కేఫ్ ఇంకోటుంటే నేనొప్పుకోనసలు! అదే అదే!

    ReplyDelete
  5. కానీ సుజాత గారూ మొన్నామజ్జెన వెళ్ళినప్పుడు చూస్తే దాన్నో సగం స్టారు హోటల్ని జేసే ప్రయత్నాలేవో కనిపించాయి నాకు.గారె తెలుగుపదమండీ అలాగే పిలుద్దాం.

    ReplyDelete
  6. ఆ రెండు ఊళ్లు వెళ్ళా గానీ నన్నెవ్వరూ అక్కడకి తీసుకెళ్ళ లేదు. ఈ తడవ నేనే వెళ్తా. మనసులో మాటల్ని వ్రాత లోకి బాగా తర్జుమా చేసారు.

    ReplyDelete
  7. గీతా కేఫా? ఈ మధ్య ఏడ్చినట్టుంటున్నది, మౌర్యా మూసేశాడు, శంకర్ విలాస్ ఓ చెత్త, అసలు గుంటూరులో అట్టు తినాలి అంటే ఓ మాదిరి హోటర్ కుడా లేదు..

    రాజేంద్ర ప్రసాద్ గారు, పైన కాంఫరెన్స్ హాల్, రూములు కట్టినట్టున్నాడండి, కానీ వైజాగ్‌లో దస్‌పల్లా ధరణిలో రుచి అదుర్స్ ఎంతైనా మా తెనాలోల్లది కదా..

    ReplyDelete
  8. వడా? అయ్యా రమణగారు, గుంటూరోల్లు కుడా వడ అని మొదలడితే ఎట్టాగండి?

    ReplyDelete
  9. అట్టు తినాలంటే మా పొన్నూరు రండి(నేను లేనప్పుడు)
    శంకర్ విలాస్ పాత చోటు నుంచి మార్చినప్పుడేఒకటో రకం చెత్త అయ్యింది.
    గీతాకేఫ్ గురించి అందుకే అన్నా "దాన్నో సగం స్టారు హోటల్ని జేసే ప్రయత్నాలేవో కనిపించాయి"
    యింతకీ గీతాకేఫ్ తెన్లాలోళ్ళదా అయితే సూపర్.
    ఇహ తెనాల్లొ టిపినీలు జగద్విఖ్యాతం,అయ్యా,ఆ నవరంగ్ లో టిపినీ తినాలంటే నోచుకోని ఉండాలండి.(ఇప్పుడు మా చిన్నప్పుడు అంత లేకపోయినా).
    ప్రకటన:యావత్ప్రపంచంలో టిపినీలు తినాలీ అంటేమా ఆవిడ చేసినవీ(అంటే మా యింటికొచ్చెయ్యమని కాదు) తర్వాత తెనాలే.మా పొన్నూరు హోటళ్ళు కూడా తెనాలి ముందు రద్దే.
    అయినా గుంటూరులో అట్టు తినడానికి సరైన హోటలే లేదంటే పక్కనే ఉన్న బెజవాడ వాళ్ల ముందు,వోల్ సేల్ గా క్రిష్ణా జిల్లా వాళ్ల ముందు ఎంతవమానం????

    ReplyDelete
  10. ఇంతకీ నన్నే వూళ్ళో తినమంటారు?, ఇడ్లీ వడ(గారె), సాంబార్(పులుసు). గుంటూరు, తెనాలి, విజయవాడ ఒక ట్రిప్ లో వేసేయ్యోచ్చు. నరసరావుపేట, చిలకలూరిపేట, పొన్నూరు సైడ్ ట్రిప్ లో చెయ్యొచ్చు. విశాఖపట్నంలో పావన్ బేకరీ అంతే.

    ReplyDelete
  11. శంకర్ విలాస్ బ్రాడీపేట్ నాలుగో లైన్లోకి మార్చినపుడే చెత్తయింది.అవును,నేనూ వెళ్ళి భంగపడ్డా! గీతా కేఫ్ కి వెళ్ళి ఏళ్ళయిపోయింది.

    అట్టు తినాలంటే మా వూర్లో దుర్గా భవన్ బాగుండును. వాడికంటే బెస్ట్ ఆ హోటలు ఎదురుగా కోర్టు బిల్డింగ్స్ ముందు వేప చెట్టుకింద బండి వాడు. పేద్ద అట్టేసి దాని మీద ఎర్రటి చట్నీ రాసి, ఎర్రగా కాల్చి......అబ్బ, నేను మావూరెళ్ళిపోతా!

    తార, దసపల్లా లో ఫుడ్డు బాగుండును. ఆ మధ్య వైజాగ్ ట్రిప్పులో అక్కడే నాలుగైదు భోజనాలు కానిచ్చాను.

    వాళ్ళే ఇప్పుడు మా మాదాపూర్ లో పెట్టారు. ఇంకా వెళ్ళలేదు మేము!

    అది సరే, తెనాలోళ్ళు ఒరియా పేరుతో వొటేలు పెట్టారేమబ్బా? దసపల్లా అంటే పది మెట్లు అని అర్థంట ఒరియాలో!

    ReplyDelete
  12. రమణగారు, నిన్నంతా ఆఫీస్ అంకితం అవటం వల్ల బ్లాగుల జోలికి రాలేదు, కాత్త లేట్ అయింది.
    అయినా సాంబారు వేడి తగ్గలేదు, ఇడ్లి పదును తగ్గలేదు. ఘుభాళింపూ అలాగే ఉంది సాంబారు మీద తేలుతున్న కొత్తిమీర ఆకంత తాజాగా.
    బాగుంది డాట్రారూ.
    ఇకపోతే ఐ సెకండు సుజాతఅక్క గారె, మినపట్టు, పెసరట్టు ఇవుండగా వడ, దోశల జోలికి నేనూ వెళ్ళను.

    ReplyDelete
  13. సుజాత గారు,
    దసపల్లా అంటే ఒరిస్సాలో అదేదో రాజ్యమండి, వైజాగ్‌లో దసపల్లా హోటల్ కట్టింది, ఆ రాజు ప్యాలస్ స్థలం కొని, ఇప్పటికీ ఆ ఇల్లు వాళ్ళ (Raja of Daspalla) కిందే ఉన్నది, మీరు చూడొచ్చును హోటల్ నుంచి, ఒకటే దారి రాకపోకలకి.

    ఇది చూడండి.
    http://en.wikipedia.org/wiki/Daspalla
    http://en.wikipedia.org/wiki/Pericchedi


    మాకు ఎర్రటి పచ్చడ్లు ఆనవండి, గొడ్డు కారం వెయ్యాల్సిందే..మా ఊళ్ళో కొన్ని బండ్లమీద కొబ్బరి పచ్చడి కుడా ఆకు పచ్చగా ఉంటుంది ( పచ్చి మిర్చి దట్టించే సరికి), చక్కగా పచ్చడిలో కుడా నెయ్యి వేసి ఇస్తాడు, కేకంతే..

    గీతా కేఫ్ తెనాలోల్లదా? ఏమో నండి, నేను అన్నది దసపల్లా గురించి, నా చిన్నప్పుడు అంటే ముఖ్యంగా 94-98 ప్రాంతంలో గీతా కేఫ్ అట్టు అంటే అదో విశేషం, తెనాలి అట్లకి పెరిగిన మినప ధరలు బాగా దెబ్బకొడుతున్నాయి, ప్చ్, ప్రియా హోటలే సాగలేక బోలెడు మంది చేతులు మారాయి, ఐనా తెనాల్లో అట్టు అంటే కొన్ని తోపుడు బండ్ల మీద వేసి ఇస్తారు, అవి కుడా బాగుంటాయి.

    తెనాల్లో ఇంకో స్పెషల్ ఇరానీ సమోసా, విజయవాడలో దొరుకుతుంది కానీ, తెనాల్లో బఠానీలు అవి దిట్టంగా వేసి ఇస్తాడు, నిమ్మకాయ పిండుకొని లాగించడమే.

    ReplyDelete
  14. ఇంతకీ నాలాగా సాంబార్ ఇడ్లీ, సాంబార్ గారె, వోల్ మొత్తంగా అసలు టిఫిన్లలోనే సాంబార్ అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

    ReplyDelete
  15. సుజాతగారూ, తారగారూ, దేవరపల్లిగారూ......అసలు ఈ టపా రాయటమే మాలాంటివారిపట్ల దారుణమైన అన్యాయం.. పైగా మీరు దాని వర్ణనలూనూ... అన్యాయం అనిపించటంలా....పాపం అనిపించటంలా!

    ReplyDelete
  16. @ తార,

    నేనున్నాను. :) అందుకే టపా మీద కామెంట్ ఇంకా రాయలేదు. కానీ ఈ టపా చూశాక ఈసారి అక్కడికి వెళ్లి తినాలని అనిపిస్తోంది...

    ReplyDelete
  17. మీ టపా చదివాక ఒక పాత ప్రకటన గుర్తొస్తోంది.

    "గరం గరం సాంబార్ మే డూబె ఇడ్లీ"

    నాకైతే చెన్నయిలో శరవణ భవన్ లో దొరికే సాంబారుని మించింది ఎక్కడా కనపడలేదు. చెన్నయి వెళ్ళినప్పుడల్లా ఒక పట్టు పడతాను.

    ReplyDelete
  18. కొన్ని అబ్సర్వేషనులు.
    తెలుగు వారంతా గారె అనవలెను, వడ అనరాదు.
    గారెలు సాంబారులో నానబెట్టుటకంటే, బెల్లపు పులుసులో నానబెట్టిన యెడల మిగుల రుచిగా నుండును.
    తెలుగు హోటళ్ళ వారికి సాంబారు చేయుట చేతగాదు. వారు సాంబారు యను పేర వడ్డించు ద్రవపదార్ధము పప్పుచారునకు అప్పగారై యుండును.
    విజయవాడలోనూ కొంత తీరికగా కూర్చుని ఇడ్లీ గారె అట్టు తిను ప్రదేశములు కరువగుచున్నవి. ఇటీవలి ప్రయాణములో ఒక తారలపూటకూళ్ళింటికి చని గారె అట్టు కావలెనన్న, అచటివాడు నన్నొక బైతును చూచునట్టు చూచి, ఇచట శేండువిచ్చులు కేకులు మాత్రమే లభించునని గెంటివేసినాడు. పిదప కోర్టు బయట బండి దగ్గర నిలువబడియే ఆరగించితిని.
    రమణగారు, మీ రుచిప్రీతి, భోజనప్రీతి ముచ్చటగొల్పుచున్నవి.
    సాంబారులలోకెల్ల నాచే కాచబడిన సాంబారు శ్రేష్ఠమయినది.

    ReplyDelete
  19. సాంబారులలోకెల్ల నాచే కాచబడిన సాంబారు శ్రేష్ఠమయినది.
    ---------
    @కొత్తపాళీ గారూ మీ రెసిపీ అన్నా ఇవ్వండి లేక మీ ఇంటికి భోజనానికి పిలవండి. రెసిపీ ఇచ్చి భోజనానికి పిలిచినా సరే.

    ReplyDelete
  20. @లక్కరాజుగారు, ఎప్పుడైనా రావచ్చు. most welcome.

    ReplyDelete
  21. @కొత్తపాళీ గారూ మీరు యాన్ ఆర్బోర్ ఆ లేక డిట్రాయిట్ ఆ. పొద్దున్న ట్రైన్ ఎక్కి వచ్చి లంచ్ చేసి సాయంత్రం ట్రైన్ లో చికాగో వచ్చేస్తాను.

    ReplyDelete
  22. నా సాంబారు పోస్టుకి కామెంట్ రాసిన అతిధులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
    సాంబారు గంగాళాల్లో ఇడ్లీల్నీ, గారెల్నీ (కొత్తపాళీగారు ' వడ ' ని నిషేధించారు.) ముంచటం నేనెప్పుడూ చూడని కారణాన.. థ్రిల్లయిపోయి.. నాలుగు ముక్కలు రాశాను.
    హోటళ్ళు, సాంబారు.. సబ్జక్ట్ నందు మీ అందరికీ గల అమోఘమైన నాలెడ్జికి కళ్ళు బైర్లు గమ్మి.. సృహతప్పిపోయాను.
    మన బ్లాగర్ల సరదా కబుర్లకి కారణమైన చిలకలూరిపేట పద్మనాభ హోటల్ కి కృతజ్ణతలు.
    తాజా కలం : హోటల్ ఓనర్ పద్మనాభం పది రోజుల క్రితమే చనిపోయారు.

    ReplyDelete
  23. వారు సాంబారు యను పేర వడ్డించు ద్రవపదార్ధము పప్పుచారునకు అప్పగారై యుండును.___________దీన్ని నేను బలపరుస్తున్నపటికీ అది సాంబారు కంటే రుచికరంగా యుండుననని నొక్కి వక్కాణిస్తున్నాను

    పిదప కోర్టు బయట బండి దగ్గర __________ప్రతి వూళ్ళోనూ కోర్టు ముందు ఈ బండి యుండునన్నమాట

    ReplyDelete
  24. నేను సుజాత గారిని బలపరుచు చుంటిని. ఆహా ఆ ఉల్లిపాయ, టమేటా, పప్పు మరిగించిన వచ్చు నాసాగ్రముల మైమరిపించు సువాసనలు ఇడ్లీ లలో మిళితమైన ఏమి రుచి ఏమి రుచి. దానిని సాంబారు అనిననేమి పప్పుచారు అనిననేమి.

    ReplyDelete
  25. సాంబారు, పప్పుచారు వాసనలకు ఆకర్షితుడనై ఇటు వచ్చితిని. ఇంతకాలం ఈ బ్లాగు ఎలా మిస్ అయ్యానో అని విచారించితిని.

    ఏమైనా పప్పుచారు సాంబారు కన్నా రుచికరమైనది అన్న వాదనను బలపరుచుచుంటిని.

    సాంబారు ఇడ్లీ వచ్చేలోపుల మిగతా పోస్ట్స్ అన్నీ చదివేస్తా.

    ReplyDelete
  26. ఈ బ్లాగుని ఈమధ్యే చూట్టం వల్ల, ఆలస్యంగా ఐనా కొన్ని వివరణలూ,విశేషాలూ:

    వైజాగ్ & హైదరాబాద్ లోని దస్పల్లా హోటెల్సూ, గుంటూరు లోని గీతాకేఫూ (ఇప్పటి గీతా రెసిడెన్సీ) ఒకే యాజమాన్యం కింద నడుస్తున్నాయి. వీరే 70-80 దశకాల్లో తెనాల్లోని నవయుగా హోటెలు నడిపారు. కాకినాడలోని రమా రెసిడెన్సీ కూడా వీరిదే. వీరిది రేపల్లె దగ్గరి యలవర్రు అనుకుంటా..

    దస్ పల్లా అనే పేరు వెనక కధ ఇప్పటికే ఎవరో కరెక్టుగానే చెప్పారు..

    గీతాకేఫులోని టిఫిన్లు ఇప్పుడు కొంచెం చప్పబడ్డాయి, కాబట్టి నా ఉద్దేశంలో లక్శ్మీపురం లోని "మహాబోధి" మరియు కోర్టు ముందున్న హోటెలూ (?) టాప్ 2 అనుకోవచ్చు.

    ReplyDelete
  27. ఎంతైనా అట్లు తినాలంటే తెనాలి లోనే తినాలి.బస్టాండ్ దగ్గర సామ్రాట్ హోటల్ లో దోస తినకుండా తెనాలి నుంచి కదిలేవాడిని కాదు,ఓవర్ బ్రిడ్జి డౌన్ లో స్వతాత్ర విహార అనే పురాతన కాలం నాటి హోటల్ లో కూడా ట్రై చెయ్యండి.ఇప్పుడు అక్కడ రుచి ఎలా ఉందో తెలియదు..గుంటూరు లో అయితే బ్రదిపేట రెండో లైనులో రంగయ్య హోటల్ ఉంటుంది..అక్కడ ఒక పట్టు పట్తోచు ,శంకర్ విలాస్ లో రుచి అంతగా బావుండడం లేదు.వాసిరెడ్డి గారు చెప్పినట్టు మహాబోధి లో చాల బావుంటాయి టిఫిన్స్ ..ఇంతకు ముందు బ్రోదిపేట నాల్గవ లైనులో ఉండేది ఇప్పుడు అక్కడ తీసేసారు.

    ReplyDelete
  28. మాకు తెలిసే సరికే శంకర్ విలాస్ బ్రాడిపేట్ 4 లో వుండేది. 2004 లో డిగ్రీ కంప్లేతే చేసే దాక బానే వుండేది శంకర్ ఇలాస్ మరియు గీత కేఫ్ లో రుచి. ఇప్పుడు అబిమానం తో గుంటూరు వెళ్ళినా, పాత రుచులు పాడు చేసుకోవటం ఇష్టం లేక వెళ్ళటం మానేశాము.

    ReplyDelete
  29. సాంబారు తమిళ తంబీ ది. పప్పుచారు తెలుగు అన్నయ్యది. దేని రుచి దానిదే! ఇక వడ/ గారె అంటే నా పవిత్రమైన వోటు గారెకి! పప్పుచారుకి! ఆంధ్రదేశం లో నాకు పప్పుచారు కొన్ని ఇళ్ళల్లో తప్పితే భోజనశాలలో కనపడుటలేదు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.