Tuesday, 6 September 2011

సినిమా డాక్టర్లు


రాముడు మంచిబాలుడు, మన సినిమా డాక్టర్లంతా రాముళ్ళే! నున్నగా గీసిన గడ్డం, నూనెరాసి ఒద్దికగా దువ్వుకున్న తల, వెడల్పు ఫ్రేములో సోడాబుడ్డి కళ్ళద్దాలు, డాక్టరు కోటు (సాధారణంగా డాక్టర్ పాత్ర వేసేది చిన్నాచితకా నటుడైన కారణాన - అద్దె యాప్రాన్ పొడుగ్గానో పొట్టిగానో, వదులుగానో బిగుతుగానో ఉంటుంది), చేతిలో తోలుసంచి, శివుడి మెళ్ళో పాములా స్టెత్‌స్కోప్ - ఇదీ డాక్టరుగారి వేషం! రౌడీ పాత్రలకి బుగ్గన పులిపిరి, అడ్డచారల టీషర్టు, మెళ్ళో కర్చీఫ్ ఉంటేగానీ అతగాడు 'రౌడీ' అని ప్రేక్షకులకి తెలీదు. తెలుగు సినిమా డాక్టర్లదీ ఇదే దుస్థితి!

ఐతే - ఈ సినిమా డాక్టర్ గొప్ప ప్రతిభావంతుడు. నిజజీవితంలో డాక్టరు సాధించలేని అద్భుతాలు ఎన్నో చెయ్యగలడు. గుమ్మడి ఉత్కంఠతో ఎదురు చూస్తుంటుండగా - హీరో చెల్లెలి నాడిని అరక్షణం మాత్రమే పరీక్షించి, ఇంకో పావుక్షణం ఆలోచించి, ఆమె గర్భవతని తేల్చేస్తాడు! 

గుమ్మడి "పాపిష్టిదానా! మన వంశగౌరవం.. కుటుంబప్రతిష్ట.. " అంటూ కుంచెంసేపు ఆవేశపడి గుండె పట్టుకుని కూలబడిపోతాడు. అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి బావిలో దూకేస్తుంది (ఆడపిల్ల 'శీలం' పోయినా బ్రతకొచ్చనే సంగతి నాకు పెద్దయ్యేదాకా తెలీదు). పిమ్మట గుండెల్ని పిండేసే సన్నాయి వాయిద్యం, ఘంటసాల బూమింగ్ వాయిస్‌తో ఒక హెవీ సాంగ్.

కథకడ్డం రాకుండా, దర్శకుడు తనకిచ్చిన అరనిమిషంలో సమయపాలన చేస్తూ, కథని మలుపు తిప్పే గొప్పసన్నివేశంలో యాంత్రికంగా, వినయంగా తనపని తను చేసుకుపోయి క్రమశిక్షణ పాటించేవాడు మన సినిమా డాక్టర్! 

సినిమా డాక్టర్లది వాస్తవిక దృక్పథం. అందుకే వారికి - తెలుగు ప్రేక్షకలోకం హీరో చెల్లెలు గర్భవతైన తర్వాత వచ్చే సీన్లో ఘంటసాల పాట కోసం, గుమ్మడి గుండెపోటు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు! అందుకే ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ సమయం వృధా చెయ్యరు. వీళ్ళు నిజాయితీపరులు కూడా. అందుకే వాళ్ళు వున్న రోగానికే వైద్యం చేస్తారు గానీ, నిజజీవిత డాక్టర్లకి మల్లె లేని జబ్బులకి డబ్బులు గుంజరు!  

మన సినిమా డాక్టరు సాధించిన మరొక అద్భుత విన్యాసం రక్తమార్పిడి ప్రక్రియ! అందుకే రక్తం ఇస్తున్నవారి (డోనార్) రక్తం భూమ్యాకర్షణ సిద్ధంతానికి విరుద్ధంగా (తెలుగు సినిమాల్లో న్యూటన్ సూత్రాలెందుకు చెప్పండి) సెలైన్ స్టాండ్ మీదనున్న సీసాలోకి ఎక్కుతుంది! ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్తో కడవలు కొద్దీ కన్నీళ్లు కార్పించిన ఈ మహత్తర విన్యాసం హాలీవుడ్‌వారిక్కూడా అర్ధం కాలేదు. దటీజ్ అవర్ సినిమా డాక్టర్!

ఈ బాక్సాఫీస్ ఫార్ములానే మన్మోహన్ దేశాయ్ అనే హిందీ దర్శకుడు ఇంకొకడుగు ముందుకేయించాడు. ఆయన 'అమర్ అక్బర్ ఆంథోనీ' అనే సినిమాలో ఏకంగా ముగ్గురు కొడుకుల రక్తాన్ని సెలైన్ స్టాండ్ పైనున్న సీసాల్లోకి పంపి, అక్కణ్ణించి తల్లి ఒంట్లోకి డైరక్టుగా ఎక్కే యేర్పాటు చేశాడు (హిందీసిన్మాలకి బడ్జటెక్కువ)! ఇలా తమ తల్లిప్రాణాన్ని దక్కించుకున్న ముగ్గురు హీరోల్ని చూసి యావద్దేశం పులకించిపోయింది, తద్వారా మన్మోహన్ దేశాయ్ బేంక్ బ్యాలెన్స్ కూడా పెరిగింది. 

సినిమా డాక్టర్లకి ఇలా అనేక గొప్ప ప్రతిభాపాటవాలు తప్ప లోపాలు లేవా? ఎందుకు లేవు! ఉన్నాయి. వీళ్ళకి దెబ్బలకి కట్టు కట్టటం సరీగ్గా రాదు. తెల్లటి గాజుగుడ్డకి మధ్యలో ఒకప్పుడు నల్లటి పెద్దమరక (బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో), ఇప్పుడు ఎర్రటి పెద్దమరక (కలర్ సినిమాల్లో) లేకుండా కట్టు కట్టలేడు. 'ఆ కట్లు మేం కట్టలేదు, మా కాంపౌండర్ కట్టాడు.' అని తప్పించుకుంటే చేసేదేం లేదు. 

సినిమాల బజెట్ పెరిగింది. తదనుగుణంగా సినిమా డాక్టర్ కూడా తోలుసంచితో పేషంట్ల ఇళ్ళకి రావటం మానేసి, కార్పొరేట్ ఆస్పత్రిలోకి మారాడు. ఈ కార్పొరేట్ ఆస్పత్రికి మొదటి పేషంట్ 'ప్రేమనగర్' నాగేశ్వర్రావు !

పాపం! వాణిశ్రీ ప్రేమ కోసం నాగేశ్వర్రావు విషం (అది నిఝంగా విషమే! సీసామీద తాటికాయంత అక్షరాల్తో 'poison' అన్రాసుంది) తాగేస్తాడు. హీరోగారు ఎంత పనీపాట లేని ప్రేమికుడైనా జమిందారు, పైగా ప్రేమనగర్ అనే పెద్ద బిల్దింగుకి ఓనర్. కాబట్టి సింపుల్‌గా విషం కక్కించేస్తే సన్నివేశం పండదు, తేలిపోతుంది! పైగా ప్రేక్షకులు నాగేశ్వర్రావు బ్రతుకుతాడా లేదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కూడాను. ఈ విధంగా సన్నివేశం, హీరో, బజెట్ డిమాండ్ చేసిన కారణంగా విషాన్ని కక్కించడానికి బదులుగా ఆపరేషన్ చేసేశాడు మన సినిమా డాక్టర్!   

సినిమాల్లో వాస్తవికతని వెదుక్కునే చాదస్తులు ఎప్పుడూ వుంటూనే వుంటారు. రేసుగుర్రంలా పరిగెట్టే సినిమాకథని ఫాలో అవ్వలేని అజ్ణానులు వీరు. అందుకే 'అప్రధాన' విషయాలపై దృష్టి పెడుతుంటారు. కథకి హీరో చెల్లెలి గర్భం ముఖ్యంగానీ అదెట్లా నిర్ధారింపబడిందన్నది అనవసరం. తల్లీకొడుకుల మమకారాన్నాపే శక్తి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వుంటుందా! 

ప్రియురాలు వాణిశ్రీ కోసం విషం త్రాగి, లక్షలు ఖరీదు చేసే సెట్టులో, ఘంటసాల గొంతుతో దిక్కులు పిక్కటిల్లేలా 'ఎవరికోసం' అంటూ ఒరిగిపోతూ, ఒంగిపోతూ, పడుతూ, లేస్తూ పాడుతుంటే.. కెమెరా ఊగిపోతూ తిరిగిపోతూ.. ఆబ్బ! ఎంత గొప్ప సీను! ఇంత భీభత్స చిత్రీకరణ తరవాత కూడా సాదాసీదాగా విషం కక్కించేసి హీరోని రక్షిస్తే - సత్యజిత్ రే వంటి మేధావులు మెచ్చుకునేవారేమో గానీ.. తెలుగు ప్రేక్షకుడు ఒక్కరూపాయి విదిల్చేవాడా?

మన తెలుగు దర్శకులు జ్ఞానులు. తెలుగు సినిమా కధలెప్పుడూ రేసుగుర్రాలే! అందుకే అవి ఆగకుండా పరుగులు తీస్తుంటాయి. బెంగాలీ, మళయాళీ సినిమాలు మన పీరుసాయిబు కుంటి జట్కాగుర్రంలా ముక్కుతూ మూలుగుతూ, పడుతూ లేస్తూ నడుస్తుండేవి. 

కావున చివరాకరికి చెప్పొచ్చేదేమంటే - మన దర్శకుల అభిరుచినీ, ప్రజల అభీష్టాన్నీ మన్నించి - సినిమా డాక్టర్లు కూడా తమవంతు పాత్ర(ల)ని పోషించారు. మనఇంట్లో, మనరోట్లో నూరిన గోంగూర పచ్చడి మనగ్గానీ ఎవడో పక్కింటోడి కోసం కాదుగాదా!

(picture courtesy : Google)                                               

13 comments:

  1. కేవ్వ్ టపా మాష్టారు,
    ఈ సినిమాల influence చాలా పెద్దది, ఎప్పుడో, ఎక్కడో ఒక మహానుభావుడు రాశాడు (హోమియో గురించి చెబుతూలేండి), ఇప్పటి దాక్టర్లు ఎంత డబ్బులు గుంజుతున్నారో కేవలం అరక్షణం నాడి పరీక్షించి చెప్పగలిగే దానికి కుడా అనవసరపు టెస్ట్లు చేయిస్తున్నారు అని.
    ఈ డైరెక్టర్ల ప్రతిభ చాలా గొప్పది మాములు ప్రేక్షకులే కాదు, స్వయం డాక్టర్లు అని చెప్పుకునే వారు కుడా నమ్మేసేట్టు ఉంటుంది (hcg అనేదొకటి ఉంటుందని తెలియని డాక్టర్లు).

    మీరు కుడా సినిమాలు చుసి వైద్యం నేర్చుకోవాలి మరి, లేదంటే మాటొచ్చేస్తది.

    ReplyDelete
  2. Well done... Unfortunately they (The cine doctors) become comedians also in some movies and act very silly.
    The high light of this writeup in addition to it's style... is AAA picture showing blood donation defying gravity and 3 in flow tubes and 1 out flow!
    Keep it up buddy - Gowtham

    ReplyDelete
  3. Hilarious! Had so much fun reading this post.

    ReplyDelete
  4. బాగా వ్రాశారు. నాకు ఇంకో సంఘటన గుర్తుకొస్తోంది మీరు చెప్పినదంతా చదువుతుంటే. మధుమాసం అనే సినిమాలో స్నేహకి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు కాని కట్టు మాత్రం మెడకి ఉంటుంది. ఎంతయినా ఇలాంటివన్నీ వాళ్ళకే చెల్లుతాయిలెండి.

    ReplyDelete
  5. దీనివల్ల నాకు అర్ధం అయ్యిందేంటంటే మీలో సినిమాలు సరిగ్గా చూసే కళ లేదని :))

    ReplyDelete
  6. ఒరేయి నీ సినిమా డాక్టర్ల 'బ్లాగ్' బాగుంది. అన్నీ చదువుతూనే వున్న కాని రిప్లై రాసేందుకు టైం దొరకటం లేదు. ఈ సంగతి మనందరికీ తెలిసినదే అయినా నువ్వు బాగా విడమరిచి చెప్పావు. నీకు ఇవ్వన్నీ రాయటానికి టైం దొరుకున్నదంటే నాకు చాలా అసూయగా వుంది. ఇలాంటి కోవకి చెందినదే సినిమాలో పోలీసు వాళ్ళు. ఎప్పుడు చివరలో అంతా అయ్యాకే వస్తారు. నీకు గుర్తుందో లేదో, నాకు హిందీ సరిగా రాని రోజుల్లో హిందీ సినిమాల్లో 'ఫారిన్ పోలీసు కో బులావో', అంటే ఇదేంటిరా వీళ్ళకి ఇండియా పోలీసులు పనికిరారా, ఫారిన్ పోలీసుల్ని పిలవమంటున్నాడు అని అనుకునేవాడ్ని.
    గో వె ర

    ReplyDelete
  7. కొంచం పిడకల వేట చేస్తాను.. మొన్నామధ్యన అలనాటి సూపర్ డూపర్ హిట్ 'డాక్టర్ చక్రవర్తి' సినిమా టీవీలో చూస్తున్నా.. సావిత్రి గర్భవతి.. ఆవిడ కడుపుకి ఎక్స్ రే తీశారు.. క్లోజప్ లో చూపించిన ఎక్స్ రే లో లంగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.... బాగుంది మీ టపా..

    ReplyDelete
  8. kevvu keka mestaaru..kadu dattaaru...after a long time reading a very witty blog...great observation..but i think because ur a doc...thats why u cd catch all this soo perfectly :):):)

    ReplyDelete
  9. Oh, only after reading a couple more posts is when I understood that you were writing all these with an intention to make us laugh (with sensible content though). Never mind my comment on 'Cinemala prabhavam' post.

    Very great sense of humor. Thanks for making me laugh so much.

    ReplyDelete
  10. dr k . ramachandra rao27 November 2011 at 06:08

    babu,
    antha saradaga rasavugani, theatre nundi bataku vachhi operation sucess ani dr chace break dance gurinchi rayaledu.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.