Monday, 12 December 2011

'శంకరాభరణం' పై బాలగోపాల్

"మీరు తెలుగులో రాస్తున్న వ్యాసాలు కష్టంగా ఉంటున్నాయి. భాషని సింప్లిఫై చెయ్యొచ్చుగా." ఒక సందర్భంలో నేను బాలగోపాల్‌ని అడిగాను.

"నేను చెప్పదలుచుకున్న విషయం రాసేస్తాను. అది అందరికీ అర్ధం అయ్యేట్లుగా రాయలని అనుకోను." బాలగోపాల్ సమాధానం.

నేను ఆయన్ని వదలదల్చుకోలేదు. 

"మరి నా సంగతేంటి? నేనేం చెయ్యాలి?" బాలగోపాల్‌కి ఒక గొప్పప్రశ్న సంధించినందుకు మనసులో భలే ఆనందపడ్డాను. 

'బాలగోపాల్ అభిమానులారా! బీ రెడీ! నేటినుండి బాలగోపాల్ కలం నుండి కుటుంబరావు శైలిలో వ్యాసాలు రాబోతున్నాయి. ఈ క్రెడిట్టంతా నాదే!' 

"తెలుగు నేర్చుకోండి, లేదా నా వ్యాసాలు చదవటం మానేయండి." అన్నాడు బాలగోపాల్. 

నెత్తిమీద నీళ్ళు కుమ్మరించినట్లైంది. ఈ బాలగోపాల్ ఎంత నిర్దయుడు!

ఓ నెలరోజుల క్రితం విశాలాంధ్ర వారి ఎగ్జిబిషన్లో బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం 'రూపం సారం' కొన్నాను. కె.శ్రీనివాస్ ముందుమాటతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. పాతికేళ్ళ క్రితం చేరా, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని వెనక్కి పంపారు! కారణం తెలీదు.

'రూపం సారం'లో బాలగోపాల్ రాసిన శంకరాభరణం, మాభూమి సినిమా రివ్యూలు చదివాను. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చదువుకోడానికి హాయిగా వున్నాయి. అంటే - నేనీ వ్యాసాలు చదవకుండా బాలగోపాల్‌కో గొప్పసలహా ఇచ్చానన్నమాట, అదీ సంగతి!

పుస్తకంలో 'సామాజిక వ్యాఖ్యాత కొడవటిగంటి కుటుంబరావు' అనే చాప్టర్లో కుటుంబరావులాగా క్లిష్టమైన అంశాలు సరళంగా రాయటం ఎంత కష్టమో వివరంగా రాశాడు. కొకు రచనల్ని చాలా సాధికారంగా విశ్లేషించాడు బాలగోపాల్. మాటల్లోలాగే రాతల్లో కూడా - క్లుప్తత, సూటిదనం బాలగోపాల్ సొంతం.  

'రూపం సారం'లో శంకరాభరణం చిత్ర సమీక్ష చదువుతుంటే భలే నవ్వొచ్చింది. బాలగోపాల్ ఇంత సరదాగా కూడా రాయగలడని అప్పటిదాకా నాకు తెలీదు.

---------------------------------------------

శంకరాభరణం - సినిమా సమీక్ష :

ఈ సినిమా బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల కొరకు తీయబడిన సినిమా. నేను యిక్కడ 'బ్రాహ్మణుల'ని అంటున్నది కులం చేత బ్రాహ్మణులయిన వాళ్ళను మాత్రమే కాదు. 'భారతీయ సంస్కృతి' గా పిలవబడుతున్న దానికి వారసులుగా తమను తాము భావించుకుంటున్న వారందర్నీ. అంటే భారతీయ విద్యాభవన్ తరహా ఆలోచనా విధానం కలిగిన వారందర్నీ.

కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంగీతం పిచ్చి ఉన్న ఒక బ్రాహ్మణుడి కథ. శంకరాభరణం రాగం పాడడంలో అతను సుప్రసిద్ధుడు. ఈ బ్రాహ్మణుడు సంగీతం కోసం ఏమైనా చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించే ఒక వేశ్య కూతురి పక్షం వహించి ఆమె కోసం సంఘబహిష్కరణకి కూడా సిద్ధపడతాడు. వాళ్ళు నిజంగానే వెలివేస్తే ఆ కోపాన్నంతా తన ఇష్టదైవం మీద చూపించి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు. అపస్వరం పాడిందని తన కుమార్తె పెళ్ళిని దాదాపు చెడగొట్టినంత పని చేస్తాడు. ఆమెకు సాయం చేయబోయినందుకు పెళ్ళికొడుకును కూడా బిక్కచచ్చిపోయేలా చేస్తాడు.

మొత్తం సినిమాలో ఒక సందేశం మన చెవులను పోటెత్తిస్తుంది. సంగీతం, కళలు ఉన్నది కామోద్రేకాల్ని రెచ్చగొట్టటానికి కాదు. లేబర్ క్లాస్ (ఆంధ్రులకి ఇష్టమైన మాటలో చెప్పాలంటే) అశ్లీల అభిరుచులను సంతృప్తి పరచడానికి కాదు. అవి ఉన్నది 'అద్వైత సిద్ధి'కి, 'అమరత్వ లబ్ధి'కి. ఈ సినిమా కొందరి కోసమే అన్నభావం కలిగించే ప్రయత్నం మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తుంది. ఎవరో కామెంట్ చేసినట్లు ఇది 'వాళ్ళకు' (అలగా జనానికి) అర్ధమయ్యే సినిమా కాదు.

--------------------------------

శంకరాభరణం సినిమాని రాజకీయ కోణంతో విమర్శించాడు బాలగోపాల్. రంగనాయకమ్మ, రావిశాస్త్రి కూడా అలాగే సమీక్షించారు. సినిమా విమర్శకులకీ రచయితలకీ వున్నా తేడా మనం గుర్తుంచుకోవాలి. 

శంకరాభరణం గూర్చి బాలగోపాల్ వివరంగా రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు balagopal.org లో ఇంగ్లీషులో కూడా చదువుకోవచ్చు. 

13 comments:

  1. సరళత్వం మాట ఎటున్నా.. ఆయన అభిప్రాయం తో మాత్రం ఏమాత్రం ఏకీభవించలేకపోతున్నాను...

    ReplyDelete
  2. శంకరాభరణం సినిమా అభిమానులు కొన్ని కామెంట్లు రాశారు.

    నా పోస్ట్ శంకరాభరణం సినిమా బాగోగుల గూర్చి కాదని రాశాను.

    కాబట్టి పబ్లిష్ చెయ్యటం లేదు.

    మన్నించగలరు.

    ReplyDelete
  3. రమణ గారూ, ఏ వస్తువయినా తనంతట తాను నిలబడలేదు, ఒక ప్రయోజనం ద్వారానే దానికి జీవం వస్తుంది. ఈ సూత్రానికి కళలు అతీతం కాలేవు.

    కళ కళ కోసం కాదు. ఈ విషయం మనం అంగీకరించాలి.

    PS (disclaimer): నాకు బాలగోపాల్ గారి communism నచ్చదు కానీ ఆయన మానవ హక్కుల కోసం చేసిన కృషి మెచ్చుకుంటాను. శంకరాభరణం సమర్థించిన విలువలు ఒప్పుకోను కానీ cinema అద్భుతంగా తీసారని చెప్పక తప్పదు.

    ReplyDelete
  4. బాల గోపాల్ సమీక్ష మీరు ప్రచురించారంటే మీకు నచ్చే కదా ??

    దానిలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నపుడు మీరు వ్రాయకుండా ఉండవలసిందేమో కదా ??

    ReplyDelete
  5. రమణగారు, బాలగోపాల్ తనని తాను ఆత్మ విమర్శ చేసుకొంటే ఆయన వ్యక్తిత్వం శంకర శాస్త్రి వ్యక్తిత్వానికి పెద్ద తేడాలేదని తెలిసి పోతుంది. శంకరాభరణం శంకర శాస్త్రి అయినా లేక బాలగోపాల్ అయినా వారు నమ్మిన దాని కొరకు జీవించారు. ఇటువంటి పాత్రలు అయాన్ రాండ్ రాసిన వాటిలో చూడవచ్చు.

    Sri

    ReplyDelete
  6. జై గారు, బాలగోపాల్ కమ్యూనిస్ట్ కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి ప్రయోజనాల కోసం నిర్దేశించబడినది కానీ సామాజిక ప్రయోజనాల కోసం నిర్దేశించబడినది కాదు. ఈ విషయం బాలగోపాల్‌కి తెలిసినా అతను మార్క్సిజాన్ని విమర్శిస్తూ వ్యాసాలు వ్రాసాడు. రంగనాయకమ్మ గారు వ్రాసిన "కొండని తవ్వి" అనే వ్యాసం చదవండి. బాలగోపాల్ ఐడియాలజీ ఏమిటో మీకు అర్థమవుతుంది. పెట్టుబడిదారీ దేశాలలో మానవ హక్కుల చట్టాల పేరుతో కొన్ని చట్టాలు ఉంటాయి. అధికారులలో ఉన్న అవినీతి వల్ల ఆ చట్టాలు సరిగా అమలు కావు. ఒక్క ప్రైవేట్ ఆస్తి హక్కు చట్టం మాత్రమే సక్రమంగా అమలు అవుతుంది. మిగితా చట్టాలని కూడా సక్రమంగా అమలు చెయ్యాలని అడ్వొకేట్ చేసిన కొద్ది మంది elite class వాళ్ళలో బాలగోపాల్ ఒకడు. శాంతి భద్రతల ముసుగులో పాలక వర్గం చేస్తున్న హత్యాకాండని బాలగోపాల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అదొక్కటే బాలగోపాల్‌లో నాకు నచ్చింది.

    ReplyDelete
  7. నీహారిక గారు..

    అభ్యంతరకర పదాలు!!!

    బాలగోపాల్ రాసిన 'రూపం సారం' హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు 2011 లో పబ్లిష్ చేసారు. పేజీలు 339. ధర 150.

    నాకు ముచ్చటేసి (చాలా నచ్చి) పుస్తకం లోని 239 పేజీ మధ్య పేరా గ్రాఫ్ నా బ్లాగులో పెట్టాను.

    ఈ పుస్తకం 1986 లోనే తెలుగు సాహితీలోకంలో సంచలనం సృష్టించింది.

    బాలగోపాల్ విశ్లేషణలని తీవ్రంగా విమర్శించిన వ్యాసాలూ చాలానే ఉన్నాయి.

    ఆయన రాసిన 'చీకటి కోణాలు' ని విమర్శిస్తూ టన్నుల కొద్దీ వ్యాసాలొచ్చాయి.

    కానీ.. నాకు తెలిసి ఎవరూ, ఎప్పుడూ బాలగోపాల్ 'అభ్యంతరకర' రచనలు చేశాడని విమర్శించలేదు.

    దయచేసి బాలగోపాల్ 'రూపం సారం' పూర్తిగా చదవండి.

    ReplyDelete
  8. అయ్యో మొత్తం వ్యాసం పెట్టారనుకుని ఆశగా చదివానండీ...నిరాశ పరిచారు.
    కానీ ఆసక్తిని పెంచారు..ఈసారి రూపం-సారం కొనేసుకుంటా!

    ReplyDelete
  9. Thanks for introducing to the site balagopal.org
    It was sad not to know about him while he was alive. I came to know more about him through obituaries and other articles after he died. Unfortunate, but we come across many such instances where we know the greatness of a person after he/she dies.

    ReplyDelete
  10. @Praveen:

    బాలగోపాల్ గారి గురించి నాకు అంట బాగా తెలీదు. ఆయన కమ్యూనిస్ట్ అని అనుకునేవాణ్ణి. Thanks a lot for the clarification.

    ReplyDelete
  11. బాలగోపాల్ రాసిన 'రూపం సారం' బాలగోపాల్‌ ఆర్గ్‌ లో ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

    ReplyDelete
  12. తిరుపాలు గారు,

    రూపం సారం కన్నా బాలగోపాల్ రాసిన వ్యసాల సంకలనం మనిషి మార్క్సిజం బాగుంది. ఈ పుస్తకంలో వామ పక్ష వాదుల జార్గాన్స్ ఎక్కువగా వాడ కుండ సరళమైన భాషలో వ్యాసాలు రాశారు.

    రమణ గారు,
    మీ మిత్రుడు చంద్రశేఖర్ గారు యన్.జి.ఓ. ల రాసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? అంధ్రా కి వెళ్లినప్పుడు స్టాక్ లేక కొనలేకపోయాను. నెట్ ద్వారా కొనుకొనె అవకాశం ఉందా? కొంచెం వివరాలు ఆయన కుటుంబ సభ్యులను కనుకొని చెప్పగలరా?

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      sorry for the late reply, i thought i answered your query (blame it on my early dementia).

      నెల క్రితం చంద్రశేఖర్ రచనల సంకనలం 'చంద్రయానం' అన్న పుస్తకాన్ని ఆశిష్ నంది గుంటూర్లో ఆవిష్కరించాడు. అందులో కూడా NGO పుస్తకం ప్రస్తావన లేదు. నాదగ్గర రెండు కాపీలు ఉండాలి.. ఇప్పుడెక్కడున్నాయో! ప్రస్తుతానికి మాత్రం మార్కెట్లో అలభ్యం. ఈ విషయంలో కుటుంబ సభ్యులకి కూడా ఐడియా లేదు.

      (ఈ NGO పుస్తకంతో చంద్రాకి కొందరు మిత్రులు శత్రువులుగా మారారు.)

      Delete

comments will be moderated, will take sometime to appear.