Wednesday, 28 December 2011

ఇచ్చట అభివృద్ధి చేయబడును

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"యేమి నాయనా! ఇప్పుడే వస్తున్నానని అరగంట లేటుగా వచ్చావ్?" నవ్వుతూ అడిగాను.

"హోల్డాన్! నేరం నాదికాదు, ట్రాఫిక్‌ది. మెయిన్ రోడ్డు వెడల్పు చేస్తున్నార్ట, మొత్తం తవ్విపడేశారు, ట్రాఫిక్ జామ్. అభివృద్ధి పేరిట విధ్వంసం చేసెయ్యడం మనవాళ్ళ స్పెషాలిటీ." వ్యంగ్యంగా అన్నాడు సుబ్బు.

"రోడ్డు వెడల్పు చేస్తుంటే మంచిదేగా? విధ్వంసం అంటావేంటి!" ఆశ్చర్యంగా అడిగాను.

ఇంతలో వేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మనతోపాటే ఉండేది మన దేహం. వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లబడుతుంది, చర్మం ముడతలు పడుతుంది, నరాలు గిడసబారతాయి. మన ఊరు కూడా మనదేహం వంటిదే. శరీరానికి వయసొచ్చినట్లే ఊరిక్కూడా వయసొస్తుంది. మనం పిల్లల్ని కని సంతతిని పెంచుకున్నట్లే ఊరు కూడా జనాభాని పెంచుకుంటుంది. మన పెద్దల్ని గౌరవించినట్లే ఊరినీ గౌరవించాలి. ఇంట్లో మనుషులు ఎక్కువైపొయ్యారని వృద్ధులని బయటకి తరిమేస్తామా? నా దృష్టిలో రోడ్లు వెడల్పు చెయ్యడం వృద్ధుల్ని బయటకి గెంటటంతో సమానం."

"సుబ్బు! నాగరికత పెరుగుతుంది, మనిషి అవసరాలు మారుతున్నయ్. అందుకు తగ్గట్టుగా ఊరు కూడా మారాలి గదా!" అన్నాను.

"మిత్రమా! ఏది నాగరికత? ఇరుకు రోడ్లల్లో కార్లని నడపటం నాగరికతా! కార్లు, మోటార్ సైకిళ్ళ పరిశ్రమలకి రాయితీలిస్తారు. వందరూపాయిల డౌన్ పేమెంట్‌తో మోటర్ సైకిళ్ళూ, కార్లు అంటగడుతున్నారు. ప్రభుత్వాలకి పరిశ్రమలు ముఖ్యం, పన్ను వసూళ్ళు ముఖ్యం. అంతేకానీ ట్రాఫిక్‌ని తట్టుకోలేక 'కుయ్యో! మొర్రో!' మంటూ చేసే ఊరు ఆర్తనాదాలు ఎవరికీ పట్టదు. మనిషి కన్నా ఊరు ఎందులో తక్కువ? ఒకప్పుడు సైకిళ్ళు, రిక్షాల బరువుని అవలీలగా, హాయిగా మోసిన ఊరి నెత్తిన మోయరాని భారాన్ని మోపుతున్నారు. ఈ అనవసరపు బరువు మొయ్యలేక ఊరు ఒంగిపోతే ఆ బరువు తగ్గించే మార్గం వదిలేసి.. ఆ బరువు మోసేందుకు టానిక్కులిస్తున్నారు." ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సమాజం స్థిరంగా ఉండదు, మార్పు దాని సహజగుణం." అన్నాను.

"నిజమే, వొప్పుకుంటున్నాను. కానీ ఆ మార్పు అడ్డదిడ్డంగా వుండకూడదు. పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా చేసే మార్పులు, చేర్పులకి ఒక శాస్త్రీయవిధానం వుండాలి. ఊరి విశిష్టతని కాపాడాలి, మానవీయకోణంలో ఆలోచించాలి. ముందుగా కారు వెనక సీట్లో బద్దకంగా, ఒరిగిపోతూ కూర్చునేవాళ్ళ కోణం నుండి ఆలోచించడం మానెయ్యాలి. వాహనాలతో రోడ్లని ఓవర్‌లోడ్ చేసి రోడ్లు వెడల్పు చేస్తాననటం తలక్రిందుల వ్యవహారం."

"మన నాయకులు రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేసేస్తామంటున్నారు!" అన్నాను.

"అసలు ఒక పట్టణంలా ఇంకో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాననటమే హాస్యాస్పదం. ప్రపంచంలో ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర వుంటుంది. ఆయా పట్టణాలు ఆయా ప్రజల అవసరాల మేరకు రూపాంతరం చెందాయి. ఎవరి అవసరాలు, ఇష్టాలు వారివి. అభివృద్ధి అంటే వృద్ధురాలు చీరకి బదులు మిడ్డీ వెయ్యటం కాదు, ఆమె ఆరోగ్యంగా వుండేట్టు చూడటమే అభివృద్ధి." అంటూ కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"మొత్తానికి ఈ రోడ్ల వెడల్పు నిన్ను బాగానే బాధ పెడుతుందే!" నవ్వుతూ అన్నాను.

"వెడల్పాటి రోడ్లమీద స్పీడ్ బైకులతో చక్కర్లు కొట్టటం థ్రిల్ నివ్వవచ్చు. రోడ్డుపక్కన నిలబడి బజ్జీలు తింటూ, ఆ ఘాటుకి కన్నీరు కారుస్తూ, గోళీసోడా తాగడం ఇంకా గొప్ప థ్రిల్. ఈ రోడ్డు వెడల్పు మన బజ్జీల సంస్కృతిని కూడా ధ్వంసం చేసేస్తుంది." అంటూ టైం చూసుకున్నాడు సుబ్బు.

"ఇది పిజ్జాలు బర్గర్ల కాలం సుబ్బూ! కొన్నాళ్ళకి బజ్జీలు, గోళీసోడాలు అంతరించిపోతాయ్." అన్నాను.

"అవును, కార్ల కోసం ఊరు మాయం. పిజ్జాల కోసం బజ్జీలు, గోళీసోడాలు మాయం. పాలకులు దీన్నే ముద్దుగా అభివృద్ధి అంటారు, మనం విధ్వంసం అంటాం. వస్తాను." అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.   

17 comments:

  1. ఆయన చెప్పిన మాటల్లో అవాస్తవం ఎంత మాత్రం లేదనిపిస్తోందండీ. రోడ్లను ఇలా వెడల్పు చేయడం కాదు కానీ ఎప్పటి నుంచో ఉన్న చెట్లన్నీ నేల కూల్చేస్తున్నారు. ఇది చాలా పెద్ద విపత్తు.

    ReplyDelete
  2. రమణగారు మీ సుబ్బుగారి ఆటోగ్రాఫ్ కావాలండి, వీలైతే నాలుగైదు పబ్లిక్ లెక్చర్ల కోసం డేట్స్ కూడా. ఇలా అన్నానని నన్నో వ్యక్తిపూజ క్యాండిడేట్ అనుకుంటాడేమో, క్యాజువల్‌గా అడుగుతున్నాని చెప్పి ఇప్పించరు ప్లీజ్ :)

    ReplyDelete
  3. How come your Subbu has not noticed the disappearence of simple houses in Brodiepet (one or 2 storied houses with a compound wall,surrounding yard - a few plants, trees - neem, mango etc) in the 15 years and rising of 5-10 storied buldings with "no compounds"? These are accomodating 20-30 times more families in the same area. Leave alone cars...even if all of them had 2 wheelers, cycles like we had in 80s, the roads will become small and narrow. The damage was done when the buildings multiplied, back and front yards disappeared. కాగా నేడు ఈఅభివ్రుద్ది, రోడ్లకు శస్త్ర చికిత్స అని బాధ పడుట ఎందులకు??

    ReplyDelete
  4. >>>డెవలప్మెంట్ అంటే మన అమ్మకి చీరకి బదులు మిడ్డీ వెయ్యటం కాదు. ఆమె ఆరోగ్యంగా ఉండేట్టు చూడటమే డెవలప్మెంట్. వారి కంత మోజుగా ఉంటే వాళ్ళ పిల్లల కోసం సింగపూర్, అమెరికా పద్ధతుల్లో ఊరవతల టౌన్ షిప్పులు నిర్మించుకొమ్మను. >>>>

    మీ సుబ్బు ఇలా అనుకోనేలాగా మాట్లాడేసి , చివర్లో ఆ మాటలు కూడా చెపుతాడండి.

    రోడ్డు వెడల్పు చెయ్యడం కన్నా ఉన్న రోడ్డు ని బాగు పరిస్తే బావుంటుంది నిజంగానే . మీ సుబ్బు కి బోర్న్ విటానో, హార్లిక్సో అలవాటు చెయ్యండి వీలయితే..కాఫీ మా ఆరోగ్యానికి మంచిది కాదు :)

    ReplyDelete
  5. మొత్తం మీద మన సుబ్బులు ఈ మారు 'రోడ్డున' పడ్డా డన్న మాట !

    'సుబ్బు రోలరు' రోడ్డు వెడల్పులని చెయ్యకుండా ఆపవలె.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. సుభ గారు..
    మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.
    చెట్లు కూల్చేవాళ్ళ మీద మర్దర్ కేస్ పెట్టాలి!

    ReplyDelete
  7. నాగార్జున గారు..
    అసలే మా సుబ్బు ఎడ్డెం అంటే తెడ్డెం అంటాడు.
    మీరిట్లా ఆటోగ్రాఫులూ, పబ్లిక్ లెక్చర్లు అంటే ఇంకా రెచ్చిపోతాడు.
    ప్రస్తుతానికి వాడినలా ఉండనిద్దాం.
    సుబ్బు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. TJ"Gowtham"Mulpur..
    కర్ణుడి చావుకి కారణాలు అనేకం.
    నీ పాయింట్ నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను.
    కొన్నాళ్ళ క్రితం ఒక పెళ్ళికి తెనాలి వెళ్ళాను.
    రోడ్లన్నీ కార్లు, మోటార్ సైకిళ్ళ మయం!
    ఒకప్పుడు నాకు తెనాలి వెళ్ళాలంటే చాలా ఇష్టం.
    కొ.కు., రచయిత శారద, గోపీచంద్, గోవిందరాజుల సుబ్బారావు లాంటి మహామహులు నడయాడిన భూమి తెనాలి.
    కానీ.. ఇప్పుడు తెనాలి వెళ్ళాలంటే నాకు భయం!

    ReplyDelete
  9. govindaraju ramana29 December 2011 at 09:20

    అంటే ఇంతకీ brodiepeta రోడ్లు మళ్లీ వెడల్పు చేస్తున్నరంటావు!
    మీ సుబ్బు చెప్పినట్టు, ఒక ఇంటికి రొండు మోటర్ సైకిళ్ళు, రొండు కార్లు వుంటే రోడ్లు ఎంత వెడల్పు చేసిన ఏమి ప్రయోజనం లేదు.
    గోవేర్నమేంటే కాక మనుషులకి కూడా కొంచెం ఊరి గురించి అభిమానం వుండాలి.
    దాని బాగోగులు, అభివ్రుది లో ఊరి ప్రజలకి కూడా పాలు పంచుకోవాలి.
    గో వె ర

    ReplyDelete
  10. Mauli గారు..
    మా సుబ్బు ఉప్మా పెసరట్టు, ఫిల్టర్ కాఫీ లేకుండా బతకలేడు!
    కాఫీ మానిపించటానికి ఒకసారి ప్రయత్నించాను.
    కాఫీ తాగనివాడు దున్నపోతై పుట్టునని నా మీద ఎదురు దాడి చేశాడు!
    మీ సలహా మేరకు మళ్ళీ ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  11. జిలేబి గారు..

    >>'సుబ్బు రోలరు' రోడ్డు వెడల్పులని చెయ్యకుండా ఆపవలె.

    సుబ్బు చేతల మనిషి కాదులేండి.

    ఒట్టి మాటల మనిషి!

    ReplyDelete
  12. గో వె ర..
    అవును.
    పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  13. పుచ్చా29 December 2011 at 10:56

    మనం వెడల్పు చెయ్యాల్సినవి రోడ్లు కాదు. మన బుర్రలు.
    ట్రాఫిక్ సెన్స్ లేకుండా ఎన్ని రోడ్లు వెడల్పు చేసినా ఉపయోగం లేదు.
    గౌతం చెప్పినట్లు జన సాంద్రత పెరిగితే ఈ బాధలు తప్పవు.
    ఐదు మైళ్ళ దూరం లో ఉన్న ఇంటిని మూడు లక్షలకి అమ్మి, పట్నం లో ముప్పై లక్షలకి రెండు బెడ్ రూంల ఇల్లు కొనే జనాలు ఉన్నంత కాలం ఈ తిప్ప తప్పదు.
    - పుచ్చా

    ReplyDelete
  14. In our olden days two or three families were used to live in a house. But now Single family wants to have two or more houses, like wise, every thing is in micro level including the attitude of a citizen towards the society. Explosion....... Only God has to help us........

    ReplyDelete
  15. రమణ,
    ఆలస్యంగా చూడటం కారణం కాగా లేట్ గా రాస్తున్నాను.
    చాలా విషయాలు ఆల్రెడీ కవర్ అయిపోయాయి.
    కాని చివర్లో సుబ్బు చెప్పినట్టు.. వాళ్ళకి కావాలంటే ఎక్కడన్నా ఓ టౌన్షిప్
    కట్టుకుని.. వాళ్ళు ఓ పడవ లాంటి కారు, వాళ్ళ పిల్లలకి గంటకి 120 కిలో మీటర్లు పోయే బైకులు కొనుక్కుని.. రోజు రేసులు పెట్టుకుని చావమనండి.
    అంతేకాని మీ కార్లు హద్దు ఆపు లేకుండా పోవటానికి మా ఇల్లు చెట్టు చేమా నాశనం చెయ్యాల్సిన అవసరం ఏముంది.
    ఆ హక్కు మీకెవరు ఇచ్చారు?
    నెక్లెస్ రోడ్డు మీదుగా అమీరపేట్ పంజాగుట్ట నించి హైటెక్ సిటి దాక
    నెక్ టూ నెక్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఒక్కొక్క పడవ లాంటి కార్లో ఒక్కొక్కళ్ళు మాత్రమే ప్రయాణిస్తూ యెంత పెట్రోలు తాగుతున్నారు!
    యెంత వాతావరణ కలుషితాన్ని కలగజేస్తున్నారు!
    అదేమంటే సాఫ్ట్వేర్ డబ్బులు అంటారు.
    అప్పిస్తున్నాము అంటే ఏనుగుని ఇంట్లో కట్టేయ్యమనే మనుషులు ఉన్నంత
    కాలం మనకి యీ బాధలు తప్పవు.
    సబ్సిడీలు ఇచ్చింది చాలక బెయిల్ అవుట్ కూడా మేమే చేస్తాము, మరి మాకేంటి? అనే పాలకులన్నత కాలం మన దౌర్భాగ్యాలు ఇంతే.
    సరదా రాతల్లోంచి సీరియస్ గా మారుతున్న నీ బ్లాగ్ లకు స్వాగతం పలుకుతూ..
    ravi

    ReplyDelete
  16. రమణ గారు నేను మీరు చెప్పింది కరెక్ట్ . నేను కూడా మన బ్రోదిపేట్ నుంచే ,బ్రోదిపేట్ నాల్గవ లైను లో మా ఇల్లు.మొన్న నేను సుమ్మెర్ లో ఇండియా వచినప్పుడు మన బ్రోదిపేట సహజత్వం కోల్పోయింది అనిపించింది .చాల వ్యాపారాత్మకం ఐపోయి ఆదునికత సంతరించికుంది .దానిని మనం మారుతున్న కాలం తో పాటు జరుగుతున్నా పోకడగ చుసుకోవాచు..మీరు చెప్పినట్టు నాకు కూడా బ్రాదిపేట్ లో నా స్కూల్ న కాలేజీ డేస్ గుర్తువచ్చి తిరిగి రావ్వు కదా ఆహ రోజులు అనిపించింది ...బ్రోదిపేట్ నాల్గవ లానే లో తిరిగే సిటీ బస్సులు ,శంకర్ విలాస్ నుంచి పద్నాల్గవ అడ్డరోడు దాక తిరుగుతూ మసాల బండి, బజ్జి బండి దగ్గర ఫ్రెండ్స్ తో కబురు చెప్పుకుంటూ ,రెండో లైన్లో రంగయ్య హోటల్ లో ప్రోదున్నే ఫ్రెండ్స్ తో కలిసి టిఫిన్ కే వెళ్ళడం..సండే చర్చి గ్రౌండ్ , పిచుకుల గుంత గ్రౌండ్స్ లో క్రికెట్ ,అప్పుడప్పుడు ఎగ్జామ్స్ టైం లో దేవుడు గుర్తుకు వచ్చి ఫ్రెండ్స్ తో కలిసి ఓంకార క్షేత్రానికి..ఆమిన మల్లి తిరిగి రానని రోజులు అవి..మొన్న చూసినప్పుడు స్టూడెంట్స్ తో ,కోచింగ్ సెంత్రేస్ తో చాల బిజీ గ ఐపోయింది.మీరు ఎక్కడ ఉంటారు అంది బ్రోదిపేట లో?

    ReplyDelete
  17. గవుడీయ మఠం నుంచి బస్ స్టాండ్ రోడ్డు వెడల్పు చేయటం వల్ల ఎంతో సౌకర్యంగా ఉంది.మార్పుని ఆపలేము.జనాభా నియంత్రణ లేనంతకాలం ఈ సమస్యలు తప్పవు...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.