'చిత్తూరు నాగయ్య.. గొప్ప సైకోథెరపిస్ట్' అంటూ ఇంతకుముందో పోస్ట్ రాశాను. అందులో 'యోగి వేమన'లో నాగయ్య నటన గూర్చి కొంత రాశాను. అయితే - యోగి వేమన సినిమా గూర్చి ఒక పూర్తిస్థాయి పోస్ట్ రాద్దామనే నా ఆలోచన అలానే ఉండిపోయింది.
నాగయ్యపై పోస్ట్ రాసిన తరవాత కూడా ఈ సినిమా రెండుసార్లు చూశాను. మండుటెండలో చల్లని మజ్జిగ తాగినట్లు, యూట్యూబ్ లో పాటలు వింటూ ఆనందిస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా గిల్టీగా కూడా ఉంది - 'నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న ఈ మధురానుభూతి గూర్చి ఎంతోకొంత రాసి నలుగురితో పంచుకుంటే బాగుండును కదా!' అనిపించి, 'యోగి వేమన' గూర్చి నా ఆలోచనల్ని రికార్ద్ చేస్తున్నాను. ఇది నాకోసం నేను రాసుకుంటున్న పోస్ట్. ఎవరికైనా నా ఆలోచనలు నచ్చితే సంతోషం.
A.ప్రింట్ క్వాలిటీ బాగుంది. అరవైయ్యైదేళ్ళ క్రితం సినిమా ఈ క్వాలిటీలో ఉండటం ఆనందించదగిన విషయం. ఇందుకు ఎవరు కారకులో తెలీదు. CD లు మార్కెట్ చేసిన దివ్య విడియో వారు అభినందనీయులు (సినిమా పూర్తి నిడివి యూట్యూబులో లభ్యం).
B.విజయా / వాహిని వారి అన్ని సినిమాలకి మల్లే ఈ సినిమాలో కూడా ఫొటోగ్రఫీ కాంతివంతంగా, బ్రైట్ గా ఉంది. (కొన్ని పాత సినిమాలు చీకట్లో చూస్తున్నట్లుంటాయి - 'జయభేరి' ఒక ఉదాహరణ.) ఇందుకు కారకుడైన ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లే ని ఆభినందిద్దాం.
C.సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీషులోనే రాసుకునేవారని ఎక్కడో చదివాను. కె.వి.రెడ్డి ఎక్కువ ఇంగ్లీషులోనే సంభాషిస్తాడని కూడా చదివాను. CD కవరుపై నిర్మాత B.N.రెడ్డి అని ఉంది, టైటిల్ కార్డ్స్ లో produced and directed by K.V.Reddi అని ఉంది (ఇట్లాంటి పొరబాట్లని కనుక్కోవడంలో VAK రంగారావు సిద్దహస్తులు).
D.దర్శకుడు :- కె.వి.రెడ్డి
భోగలాలసుడైన వేమారెడ్డి, యోగి వేమనగా మారిన వైనం ఈ సినిమా సెంట్రల్ పాయింట్. కావున కథ పూర్తిగా వేమారెడ్డి వైపు నుండే నడుస్తుంది. వేమారెడ్డి విలాసపురుషుడు. అన్నగారు పెదవేమారెడ్డి (రామిరెడ్డి) రాచకార్యాలు చూస్తుంటాడు. వేమారెడ్డికి అన్న కూతురు జ్యోతి అంటే అంతులేని ప్రేమ. స్నేహితుడు అభిరాముడితో కలిసి బంగారం తయారుచేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. వేమారెడ్డి మోహనాంగి అనే వేశ్య మోజులో మునిగి తేలుతుంటాడు. మోహనాంగికి (కనకాభిషేకం చెయ్యడానికి) అన్నగారు వసూలు చేసిన శిస్తు సొమ్ము వాడేస్తాడు. ఫలితంగా పెదవేమారెడ్డి చెరసాల పాలవుతాడు. తనకెంతో ఇష్టమైన జ్యోతి జబ్బుచేసి 'చిన్నాన్న' అంటూ కలవరిస్తూ మరణిస్తుంది. విరక్తితో పిచ్చివాళ్ళా స్మశానాల వెంటా, గుళ్ళ వెంటా తిరుగుతాడు. శివయోగి (రాయప్రోలు) ఉపదేశంతో యోగిగా మారతాడు. చివరకి గుహప్రవేశం (సజీవ సమాధి?) చేస్తాడు. టూకీగా ఇదీ కథ.
సినిమా చూస్తుంటే ఒక నవల చదువుతున్నట్లుంటుంది. సన్నివేశాలు బిగువుగా, క్లుప్తంగా ఉంటాయి. సినిమా ప్రయాణం చాలా స్మూత్ గా, ఫోకస్డ్ గా ఉంటుంది, అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిడివి తగ్గిద్దామని ఎంత ప్రయత్నించినా, ఒక్క నిముషం కూడా ఎడిట్ చెయ్యలేం.
నాకు సినిమా గూర్చి సాంకేతిక పరిజ్ఞాం లేదు. అయితే ప్రతి సినిమా కథకి ఒక మూడ్ ఉంటుంది. సినిమా అసాంతం ఆ మూడ్ క్యారీ చెయ్యడం మంచి సినిమా లక్షణం అని నా అభిప్రాయం. ఆవారా, గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఈ అభిప్రాయం బలపడింది. ఆ రకంగా చూస్తే కె.వి.రెడ్డి నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు.
వేమారెడ్డి మోహనాంగితో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనక్కూడా హాయిగా ఉంటుంది. జ్యోతి మరణంతో ప్రేక్షకుడు కూడా వేమారెడ్డితో పాటు దుఃఖంలో కూరుకుపోతాడు. ఆపై హీరోతో పాటు మనకి కూడా జీవితం పట్ల అంతులేని విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. ఈ విధంగా కె.వి.రెడ్డి మనల్ని తీసుకెళ్ళి హోల్సేల్ గా వేమనకి అప్పగించేస్తాడు.
ప్రేక్షకుణ్ని ఇలా గైడ్ చేస్తూ ప్రధానపాత్రతో మనని మనం ఐడెంటిఫై చేసుకునేట్లు చెయ్యడం గొప్ప దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అని నా నమ్మకం. 'యోగి వేమన' గూర్చి ఆరున్నర దశాబ్దాల తరవాత కూడా నేను రాయడానికి ప్రధాన కారణం ఇదే.
సహకార దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కమలాకర కామేశ్వరరావుకి కూడా అభినందనలు.
సందర్భం కనుక ప్రస్తావిస్తున్నాను, 'యోగి వేమన' సినిమా శ్రీశ్రీకి నచ్చలేదు (మాలి, మాసపత్రిక, మే 1947).
"వేమన్న మూఢ విశ్వాసాలకి విరోధి. కానీ వేమన్న చిత్రాన్ని చూచిన తర్వాత మన ప్రజలలో మూఢవిశ్వసాలు మరింత పదిలమవుతాయి. వేమన జిజ్ఞాసి, సాధకుడు, మన అందరివంటి మానవుడు. అతనికి మానవాతీత శక్తులంటగట్టడం అనవసరం. గుడ్డిమనిషికి కళ్ళిచ్చాడని చూపించడం వల్ల వేమన్న ఆధిక్యం స్థాపించబడదు." (పేజ్ నంబర్ 329, శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990.)
శ్రీశ్రీ వేమన తత్వం గూర్చి మంచి అవగాహన కలిగినవాడు. ఆయన కె.వి.రెడ్డి దగ్గర్నుండి ఊహించినంత గొప్పగా సినిమా లేకపోవడంవల్ల చికాకుతో ఈ రివ్యూ రాశాడనుకుంటున్నాను.
E.నటీనటులు.
1.చిత్తూరు నాగయ్య :- వేమారెడ్డి / యోగి వేమన.
ఇంతకుముందు ఈ సినిమా చూసినప్పుడు వేమారెడ్డిగా నాగయ్య నటన ఏవరేజిగా అనిపించింది. నాకెందుకో ఆయన మోహనాంగి ఇంటికి వెళ్ళేప్పుడల్లా ఏదో శంకర విలాస్ లో కాఫీ తాగడానికి వెళ్తున్నట్లు అనిపించింది. వేశ్య దగ్గరకి వెళ్ళే వ్యక్తి విరహతాపంతో ఊగిపోవాలి, నాగయ్యలో నాకా ఫీలింగ్ కనబళ్ళేదు.
వేమారెడ్డిగా నాగయ్య యాంత్రికంగా నటించాడనడానికి ఒక ఉదాహరణ.. కొలనులోంచి తడచిన దుస్తులతో బయటకొచ్చిన మోహనాంగి (M.V.రాజమ్మ) నుండి దృష్టి మరల్చుకోలేం. కానీ నాగయ్య ఆవిడని సరీగ్గా చూడడు! పట్టించుకోడు, పైగా చీర కట్టుకు రమ్మంటాడు, ఔరా! ఇదేమి రసికత్వం!!
మోహనాంగి దగ్గరకి హడావుడిగా బయల్దేరతాడు వేమారెడ్డి.
అన్న కూతురు జ్యోతికి వళ్ళు బాగుండదు. 'నన్ను వదలి వెళ్ళకు చిన్నాయనా!' అంటుంది జ్యోతి.
అంతే! చిన్నపిల్ల అడగంగాన్లే మోహనాంగిని మర్చిపోయి.. ఆనందంగా, మధురంగా "అందాలు చిందేటి నా జ్యోతి.. " అంటూ పాడేస్తాడు.
పాప పట్ల ఎంత ప్రేమున్నా, సౌందర్యవతి సాంగత్యం కోసం తపించిపొయ్యేవాడి ముఖంలో డిజప్పాయింట్మెంట్ కనబడాలి. నాగయ్యలో నాకు లేశమాత్రమైనా ఆ భావం కనబడలేదు.
దాదాపు ఇవే సన్నివేశాలతో తీసిన ఎన్టీఆర్ 'పాండురంగ మహత్యం' గుర్తు తెచ్చుకోండి. బి.సరోజాదేవిపై మోహంతో ఎన్టీఆర్ తపించిపోతాడు. సినిమా మొదట్లో వేశ్యాసాంగత్యం కోసం ఎంతగా పరితపిస్తాడో.. తరవాత దైవభక్తిలో అంతగా చరితార్ధుడవుతాడు. మొదటి భాగంలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఉంటే రెండో భాగం అంత బాగా పండుతుంది. ఇది సింపుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్.
మళ్ళీ మనం 'యోగి వేమన' కి వచ్చేద్దాం. వేమారెడ్డి, మొహానాంగిల మీటింగ్స్ మరీ మెకానికల్ గా ఉండటానికి కారణం ఏమిటబ్బా! నాకు తోచిన కొన్ని కారణాలు.
a)బహుశా 1947 (స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం) లో స్త్రీ లోలత్వాన్ని నటించడానికి కొద్దిగా మొహమాటాలు / మోరల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు.
b)ఈ సినిమా కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్యలది. వీళ్ళు మరీ సాత్వికులు, పెద్దమనుషులు. స్త్రీలోలుని చూపులు ఎలా ఉంటాయో నాగయ్యకి తెలీదు, చెప్పి చేయించుకోడానికి కె.వి.రెడ్డికీ తెలీదు. అందుకే నాగయ్యకి M.V.రాజమ్మని 'ఎలా చూస్తూ' నటించాలో తెలిసుండకపోవచ్చు!
c)ఇంకో కారణం. హీరో, దర్శకుడు.. ఇద్దరికీ పూర్తి ఫోకస్ వేమన మీదే. వేమన పార్ట్ కోసం వేమారెడ్డిని హడావుడిగా చుట్టేసినట్లు అనిపించింది.
ఈ సినిమాలోని ఇంత గొప్పలోపాన్ని కనుగొన్న నేను మిక్కిలి సంతసించాను. ఒక గొప్ప సినిమాలో అతి పెద్ద లోపాన్ని కనిపెట్టాను. శెభాష్! ఆలస్యమేలా? పోస్ట్ రాసేద్దాం. ఇంతలోనే ఒక అనుమానం. ఆపాటి ఆలోచన కె.వి.రెడ్డికి తట్టలేదా? నా అవగాహనలో ఎక్కడో ఏదో తేడా ఉంది! ఏమిటది? కావున, సినిమా మొత్తం మళ్ళీ చూశాను. పిమ్మట జ్ఞానోదయం కలిగింది.
'పాండురంగ మహత్యం' పుండరీకుడు వెధవన్నర వెధవ, అర్ధరాత్రి తలిదండ్రుల్ని వెళ్ళగొట్టిన కామాంధుడు. వాడికి కాళ్ళు పోయినప్పుడు మాత్రమే బుద్ధొస్తుంది. చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో దహించుకుపోతాడు. కాళ్ళొచ్చిన తరవాత భక్తుడిగా కంటిన్యూ అయిపోతాడు. పుండరీకునికీ, వేమనకీ అస్సలు సామ్యం లేదు.
వేమారెడ్డి సౌమ్యుడు, అభ్యుదయవాది. దేవుడి వస్త్రం తీసుకెళ్ళి చలికి వణుకుతున్న పేదవృద్ధురాలికి కప్పిన మానవతావాది. మోహనాంగిని కూడా నిజాయితిగానే ప్రేమిస్తాడు. అతనికి రాళ్ళనీ, రప్పల్నీ కొలవడం ఇష్టముండదు. అతనిలో జ్యోతి మరణం అంతులేని ఆవేదనని కలుగజేస్తుంది. చావుపుటకల మర్మం గూర్చి నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. తను పాపాలు చేశాననే భావం అతనికుండదు. అసలు పాపపుణ్యాల అస్థిత్వాన్నే ప్రశ్నించే యోగస్థాయికి చేరుకుంటాడు.
మరి - మొన్న ఈ సినిమాలో గొప్పలోపం కనిపెట్టాననుకుని గర్వించానే! కారణమేమి? అనాదిగా తెలుగు సినిమాల్లో పాత్రలు బ్లాక్ అండ్ వైట్ లో, స్టీరియోటైప్డ్ గా ఉంటున్నాయి. మనం వాటికే బాగా అలవాటయి ఉన్నాం. నేనూ ఆ ట్రాప్ లో పడ్డాను.
వేమారెడ్డి వేశ్యాలోలుడు. కాబట్టి చెడ్డవాడు. స్త్రీలోలులకి ఇంకే ప్రయారిటీస్ ఉండరాదు. నాకున్న ఈ చెత్త ఆలోచన మూలంగా.. వేమారెడ్డికి అన్నవదినల పట్ల గౌరవం, పసిదాని పట్ల అంతులేని ప్రేమ కలిగి ఉండటాన్ని అర్ధం చేసుకోలేకపొయ్యాను. వేమారెడ్డిలోని డిఫరెంట్ షేడ్స్ ని దర్శకుడు మొదట్నుండీ చూపుతూనే ఉన్నాడు. నాకే సరీగ్గా అర్ధం అయ్యి చావలేదు.
నేను వేమారెడ్డి పాత్రని అర్ధం చేసుకోడంలో పప్పులో కాలేశాను. కావున పై విషయాలు రాయకూడదనుకున్నాను. కానీ - ఈ పోస్ట్ యోగి వేమన సినిమా గూర్చి నా ఆలోచనలు. కావున అన్ సెన్సార్డ్ గా ఇన్ టోటో రాద్దామని నిర్ణయించుకుని, రాస్తున్నాను.
చిన్నారి జ్యోతి చనిపోయిన తరవాత నాగయ్య నటన గూర్చి వర్ణించడానికి నాదగ్గర భాష లేదు. అంధ బిక్షకురాలి (అంజనీబాయి - సినిమాల్లో నటీమణులకి మేకప్ ఆర్టిస్ట్) బొచ్చెలోంచి అన్నం తింటూ నాగయ్య అద్భుత నటన ప్రదర్శించాడు. వేమన పద్యాలు ఆలపించేప్పుడు నాగయ్య అభినయం అద్భుతం. ఇక చివరి సీన్ తరవాత మహానటుడు నాగయ్య నటనా ప్రతిభకి చేతులెత్తి నమస్కరించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. నేనదే చేశాను!
2.లింగమూర్తి :- అభిరామ్.
ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ - ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే - చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.
అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని 'దుష్ట' లింగమూర్తి తెలుసు. 'సాత్విక' లింగమూర్తి తెలీదు.
'పెళ్లిచేసిచూడు' లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.
3.M.V.రాజమ్మ :- మోహనాంగి.
రాజమ్మ గూర్చి ఎంత రాసినా తక్కువే! అందం, అభినయం, గానం, నాట్యం.. అన్నీ అద్భుతమే! ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటీ! అయితే అప్పటికి నేనింకా పుట్టలేదు. అందువల్ల బి.ఆర్.పంతులు ఆ చాన్స్ కొట్టేశాడు. రాజమ్మ తన ఆటపాటలతో దుమ్ము దులిపేసింది.
రాజమ్మ గుళ్ళో ఆడిన పాటలో వెనక నల్లగా, పీలగా, నెత్తి మీద (తల కన్నా పెద్దదైన) పాగ పెట్టుకుని తాళం వేస్తూ ఒకాయన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన మన ఘంటసాల మాస్టారు! ఘంటసాల పక్కన బక్కగా, పొట్టిగా ఉన్న అమ్మాయి సీత (దేవదాసులో పార్వతి స్నేహితురాలు మనోరమ). సినిమాలో మోహనాంగి చెల్లెలు 'కనకం' పాత్ర వేసింది.
4.కాంతామణి :- మోహనాంగి తల్లి.
ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరచేంత సహజంగా నటించిన నటి. వేశ్యమాతగా నటించిన కాంతామణి సూర్యాకాంతం, చాయాదేవిలతో పోల్చదగినంతటి ప్రతిభావంతురాలు. ఆవిడ ఆంగికం, వాచకం గ్రేట్! ('దొంగరాముడు' లో 'నే చచ్చిపోతారా భద్రుడూ!' అంటూ రేలంగి తల్లిగా కూడా నటించింది.)
5.నరసమాంబ (వేమన వదిన) :- పార్వతీబాయి.
వేమారెడ్డి వదిన నరసమాంబగా పార్వతి బాయి చక్కగా ఉంది. వేమారెడ్డికి బాధ్యతల్ని గుర్తు చేస్తూ - ఒక పక్క అతనిపై ప్రేమ, అభిమానం.. ఇంకోవైపు చెడిపోతున్నాడన్న బాధ.. ఎంతో ఉదాత్తంగా, డిగ్నిఫైడ్ గా నటించింది.
6.జ్యోతి :- బేబీ కృష్ణవేణి.
ముద్దుగా చక్కగా చేసింది. ఈ పాపకి ఇప్పుడు డెబ్భైయ్యైదేళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడెవరైనా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు.
F.నేపధ్య గానం :-
1.నాగయ్య :-
నాగయ్య గానం గూర్చి రాసేంత శక్తిమంతుణ్ని కాదు.. శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప! అయితే చిన్న పాయింట్.. అందరూ 'అందాలు చిందేటి నా జ్యోతి.. ' పాటని మెచ్చుకుంటారు. నాకు మాత్రం శ్మశానంలో వచ్చే నేపధ్యగానం 'ఇదేనా.. ఇంతేనా.. ' పాట చాలా ఇష్టం. ఇంత మంద్రస్థాయిలో పాడటం నాగయ్యకే చెల్లింది. (ఈ పాట నన్నెంతగా ఏడిపించిందో ఇంతకు ముందు రాశాను.)
2.బెజవాడ రాజారత్నం :-
నాకు ఈ సినిమా చూసేదాకా బెజవాడ రాజారత్నం గూర్చి తెలీనందుకు సిగ్గుపడుతున్నాను. చాలా క్లీన్ వాయిస్. అద్భుత గానం. 'మాయలు పడకే మనసా.. ' అంటూ స్పాంటేనియస్ గా, అలవోకగా పాడేసింది. నేను ఈవిడ గూర్చి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది.
G.సంగీతం :- చిత్తూరు నాగయ్య
వేమన పద్యాలకి 'సంగీత దర్శకుడు' నాగయ్య చాలా భావయుక్తంగా ట్యూన్లు చేశాడు. 'గాయకుడు' నాగయ్యతో అద్భుతంగా పాడించాడు. ముఖ్యంగా 'గంగిగోవు పాలు చాలు.. ' సూపర్బ్.
సినిమా మూడ్ క్యారీ చెయ్యడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించిందని నా అభిప్రాయం.. ముఖ్యంగా చివరి సీన్లో.
H. మాటలు, పాటలు :- సముద్రాల రాఘవాచార్య
మాటలు మనం మన ఇంట్లో మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. ఏ పాత్రా ఒక్క వాక్యం కూడా 'అతి'గా మాట్లాడలేదు.నాకు మాటలు ఇలా పొదుపుగా ఉంటేనే ఇష్టం. ఇక పాటల సాహిత్యం గూర్చి ఇవ్వాళ నే కొత్తగా చెప్పేదేముంటుంది?!
I.మేకప్ :- హరిబాబు.
యోగసిద్ధి సాధించిన వేమనని కె.వి.రెడ్డి వేమన పద్యాలతో క్రమేపి వృద్ధుడిగా మార్చేస్తాడు. అసలీ ఐడియా వచ్చినందుకే కె.వి.రెడ్డిని మనం అభినందించాలి. ఇంకో దర్శకుడైతే కథని ముందుకు నెట్టడానికి ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడి చచ్చేవాడు. కె.వి.రెడ్డి మాత్రం ఈ ఫీట్ హరిబాబు మేకప్ (మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ కూడా) సాయంతో అవలీలగా చెయ్యగలిగాడు. ఈ మేకప్ హరిబాబు 1947 లోనే వండర్స్ చేశాడు.. అసాధ్యుడులాగున్నాడు.
ఇంతటితో యోగి వేమన సినిమా 'కంటెంట్' గూర్చి నా ఆలోచనలు రాయడం అయిపోయింది.
J.సినిమాతో సంబంధం లేని ఆలోచన.
ఈ సినిమా ఎప్పుడు చూసినా రెండ్రోజుల దాకా వైరాగ్యం నన్ను వదలదు.జీవితంపై విరక్తి కలుగుతుంది. 'రోగి ఎవ్వడు? డాక్టరెవ్వడు? భార్య ఎవరు? జీవితమంతయూ మిధ్యయే కాదా? మరప్పుడు ఈ వెధవ జీవితానికి అర్ధమేమిటో విశ్వదాభిరామ వినురవేమ!' అనే మూడ్ లో ఉండిపోతాను. (గుంటూరులో గుహలు లేవు కాబట్టి బ్రతికిపొయ్యాను. లేకపోతే నేనూ ముమ్మిడివరం బాలయోగిలా అయిపొయ్యేవాణ్ణేమో!)
అరవయ్యైదేళ్ళ తరవాత సినిమా చూసిన నాకే ఇంత వైరాగ్యం కలుగుతుందంటే, నటించిన నాగయ్యకి ఇంకెలా ఉండాలి? అందుకే నాగయ్య నిజజీవితంలో కూడా బైరాగి అయిపొయ్యాడు. కష్టాలు పడ్డాడు. నాగయ్య ఇలా అయిపోవడం occupational hazard క్రిందకి వస్తుందా?!
చివరి మాట :-
ఈ సినిమా గూర్చి నా ఆలోచనలు మొత్తంగా మూట కట్టి దాచుకోవాలనే కోరికే నన్నీ పోస్ట్ రాయించింది. చదువుకోడానికి కొద్దిగా నిడివి ఎక్కువైందని తెలుసు. క్షమించగలరు.
(ఈ పోస్ట్ నా సైకోథెరపిస్ట్ చిత్తూరు నాగయ్యకి నేను సమర్పించుకున్న ఫీజు. హమ్మయ్యా! ఇప్పుడు ఋణ విముక్తుడనైనాను.)
(photos courtesy : Google)
ఇంతేనా , మీ టపా :)
ReplyDeleteచాలా పొడవైన డవిలాగులు ఉన్నాయి సినిమాలో, మంచి కాన్సెప్ట్ లా ఉంది . సినిమాలోని మహిమలు పై శ్రీ శ్రీ గారి తో విభేదిస్తున్నాను. నాకు అవి సమంజసం గా తోచాయి మరి.
నేను కొని పంపిన జెన్ కధలు పుస్తకం విపరీతం గా చదివి సంతోషించిన బామ్మ గారికి ఈ సిన్మా చూపించాలని డిసైడ్ అయిపోయాను. బామ్మ పేరుతొ వీలయితే మిగిలిన అందరికీను ..
Mauli గారు,
Deleteమనం శ్రీశ్రీతో విభేదించవలసిన అవసరం ఏముంది! అది శ్రీశ్రీ అభిప్రాయం. ఇంకానయం! కె.వి.రెడ్డి శ్రీశ్రీతో స్క్రిప్ట్ రాయించాడు కాదు!!
మనం తెలుగువాళ్ళం. నచ్చిన వ్యక్తులకి దైవత్వం ఆపాదిస్తే గానీ.. తుత్తిగా ఉండదు.
శివయోగి బోధన, చూపు ప్రసాదించడం, బంగారం తయారవ్వడం.. ఇవన్నీ హేతుబద్ధంగా ఉండవు. అయితే నిర్మాతకి 'హిత'బద్ధంగా ఉంటాయి.
@ నచ్చిన వ్యక్తులకి దైవత్వం ఆపాదిస్తే గానీ.. తుత్తిగా ఉండదు.
Deleteకేవలం మీరు పెట్టిన నాలుగు క్లిప్స్ చూసి మొదటి వ్యాఖ్య చేసాను. బంగారం తయారవ్వడం ముందే జరిగింది కాబట్టి స్నేహితుడికి వేమన పై ఉన్న అపారమైన ప్రేమ వల్లే అతనే ప్రేమాతిశ యంతో ప్రచారం చేసాడు. అదే సమయంలో బంగారం విద్య అబ్బడం వల్ల జీవితం లో జరిగే పరిణామాలు చెప్పడం బావుంది. మహా మహా వారెన్ బఫెట్టే ఈ మాయా మోహం లో పడకుండా తప్పించుకొన్నారు. వీరికే పురాణాలు, దైవత్వం తెలుసనీ
ఇక చూపు ప్రసాదించడం, నాటకీయంగా ఉన్నా...అమాయక ప్రజలకి (సినిమా చూసేవాళ్ళకి)అంతకన్నా వివరించే మార్గం ఉందనుకోను. అతను ఆ ముష్టి ఆమె భోజనం తిన్నందుకు ఫలితం చూపాలి. అప్పుడే కదా జనానికి పరోపకార భావం కాస్తయినా కలిగేది. నా అసలు అనుమానం ఆరోజు ముష్టి ఆమెకి అన్నం పెట్టినవాళ్ళకి బంగారం దొరికిందా అని :)
Mauli గారు,
Deleteమీరు యోగి వేమన సినిమా సన్నివేశాల్ని బాగా గుర్తుంచుకున్నారు. అభినందనలు. నిజానికి ఈ పోస్ట్ కి నేను ఒక్క కామెంట్ కూడా ఆశించలేదు.
నేను యోగి వేమన "సినిమా" గూర్చి మాత్రమే రాశాను. ఈ సినిమా వేమన 'పరిశోధనాత్మక జీవిత చిత్రం' కాదు. వేమన గూర్చి కొన్ని పాయింట్లు తీసుకుని.. సముద్రాల, కె.వి.రెడ్డి కూర్చుని వారికి నచ్చినట్లు కథ తయారు చేసుకున్నారు. సినిమాకి అతి ముఖ్యమైన జ్యోతి పూర్తిగా కల్పిత పాత్ర! వేమన విగ్రహారాధనని వ్యతిరేకించిన హేతువాది. (సినిమాలో వేమన కాళ్ళకి అన్నావదినలతో సహా అందరూ మొక్కేస్తారు.) శ్రీశ్రీకి అందుకే ఈ సినిమా నచ్చలేదు. అందుకు కారణాలు చెబుతూ చాలా విలువైన పాయింట్లని కూడా రాశాడు.
ఇక్కడ మనం సముద్రాల పక్షమా? శ్రీశ్రీ పక్షమా? అన్న చర్చ అనవసరం. సినిమాలో డ్రామా కోసం అనేక కల్పిత పాత్రల్ని సృష్టించారు. సినిమా బాగుంది. అంతే!
వేమన గూర్చి ఎకడెమిక్ చర్చల్ని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, కట్టమంచి, ఆచార్య N.గోపి, శ్రీశ్రీ, బంగోరె వంటి ఉద్దండ పండితులకి వదిలేద్దాం. మనం హాయిగా సినిమా ఎంజాయ్ చేద్దాం!
ఎక్సల్లెంట్ డాటేరు గారు,
ReplyDeleteఇంతకీ వైరాగ్యం వదిలిందా లేదా ఆ తరువాయి ?
మరో మాట, రాజమ్మ తో 'లవ్వు లో రైజ్'- మీకు ఈ తరం లో ఈ ఆలోచన వచ్చిన, దీనిని సైకో తెరపి భాషలో ఏమి జబ్బు/లేక విశేషము అందురు !?
జిలేబి.
జిలేబి జీ,
Deleteఅది స్మశాన వైరాగ్యం వంటిది లేండి!
రాజమ్మపై నా ప్రేమని శంకించకండి. అది స్వచ్చమైన ప్రేమే! జబ్బు కాదు!!
మూవీ రివ్యూ, ఎనాలిసిస్ బాగుంది. కానీ మంచి పద్యాలు వ్రాయటానికి రాజమ్మ లాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని ఈ సినిమా తప్పుడు సమాచారం ఇస్తున్దేమోనని నా అనుమానం. అందుకని బడిపిల్లలు చూడటం మంచిదని అనిపించటల్లేదు.
ReplyDeleteఅవును. మీ అనుమానం కరక్టేననిపిస్తుంది.
Deleteఅందుకేనేమో.. కె.వి.రెడ్డి మోహనాంగిని డిగ్నిఫైడ్ గా చూపించాడు.
(మీ వ్యాఖ్యలో చిన్న సవరణ. 'రాజమ్మ' అని కాదు.. 'మోహనాంగి' అని రాయాలి.)
మీ ఎనాలిసిస్ చాలా బాగుంది డాక్టర్ గారు.
ReplyDeleteమీ అంత లోతు గా విశ్లేషించ లేను కాని, ఆ చివరి లో మీరు చెప్పిన వైరాగ్యం అనేది వచ్చింది నాకు ఈ సినిమా చూసి.
ఆ తరువాత , ఎప్పుడు చూసినా ( యోగి వేమన సీన్స్ ) ఇలాంటి చిన్న వైరాగ్యం వస్తుంది.
మీకు మాత్రం చాలా కృతజ్ఞతలు , ఇప్పటి వరకు సినిమా అంటే సినిమానే అనుకునే వాణ్ని , మీ పోస్ట్ లు చదువుతుంటే సినిమా ని సినిమా లా కాదు , ఇంకో కోణం లో చూడాలని అర్ధం అయింది.
మీరు ఎప్పుడు ఏ సినిమా గూర్చి సడన్ గా వ్రాస్తారో తెలియడం లేదు , అందుకే నాగయ్య గారివి, సూర్యకాంతం గారి సినిమాలన్నీ చుసేస్తే అటు పిమ్మట మీరు ఏం వ్రాసినా వెను వెంటనే అర్ధం చేసుకోవచ్చు లేకపోతే మల్లి వెనక్కి వెళ్లి ఆ సీన్స్ చూడాల్సి వస్తుంది.
మీరు సినిమాలు గురించి రాసే విధానం మాత్రం అద్భుతం , చేప ని పొలుసు వలచి , జాగ్రత్త గా ముక్కలు చేసి , కూర వండి పెడుతున్నట్టు రాస్తారు .
venkat గారు,
Deleteధన్యవాదాలు.
>>మీరు ఎప్పుడు ఏ సినిమా గూర్చి సడన్ గా వ్రాస్తారో తెలియడం లేదు.<<
నాకు మాత్రం తెలుసునా? తెలీదు.
మీకు నచ్చినందుకు సంతోషం.
రమణ గారూ,
ReplyDeleteముందుగా మీకు శతాధికవందనాలు. మీ చిత్తూరు నాగయ్య గారి మొదటిటపా చదివిన పిమ్మట నాకు ఒక కొత్త కోణంలో నిజమైన యోగిలా శ్రీ నాగయ్య గారు కనిపించటం మొదలైంది. వెంటనే యోగివేమన చుసేసాను. అప్పుడే దాదాపు మీ అభిప్రాయాలే తట్టాయి. కానీ మీ విమర్సనాత్మక కోణం మాత్రం అనిపించలేదు. ఎందుకంటే మొదటినుండీ దర్శకులు వేమారెడ్డిని చంద్రునికో మచ్చ అన్న రీతిలో చిత్రీకరించారు. కనుక నాకు ఏ ఆక్షేపణలూ లేవు. వేమారెడ్డి గారు కామాంధులు అని అనుకోలేము. ఎందుకంటే రాజవంశీకులు కనుక కొంత స్త్రీలోలత్వం సహజమే. పైగా పెళ్ళిబంధంలో లేనివాడయ్యే. అందుకని మీరన్నట్టు ఇది పిల్లలకు చూపించి, పిమ్మట" స్త్రీలని గౌరవించండి.. లేదా అడుక్కుతినండి" ! అని హెచ్చరించవలెను.
నేదే చూసాను
నా అభిమాన థియేటర్ "పనిలేక" లో
-ఆత్రేయ
Athreya Ak గారు,
Deleteమీ అభిప్రాయం కరక్ట్. చరిత్ర ప్రకారం రాజవంశీయులు వేశ్యాగృహాలకి వెళ్ళడం తప్పు కాదు.. పైగా అదో హోదా కూడా! అయితే కె.వి.రెడ్డి దీన్నొక 'మచ్చ' అన్నట్లే తీశారు. దీన్ని మనం artistic freedom అనుకోవచ్చునేమో!
కె.వి.రెడ్డి interpretation సగటు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని చేసిందనిపిస్తుంది. లైబ్రరీలో వేమన చరిత్ర చదువుకోడం వేరు.. సినిమాగా ప్రజాబాహుళ్యానికి చూపించడం వేరు.
Superb sirji
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteవేమన సినిమా గురించి ఎంతో బాగా వ్రాసారు.నాగయ్య గారి గురించి విమర్శ కుడా మీరు చాల హంబుల్ గా వ్రాస్తారు. సాఫ్ట్ కార్నర్ అనుకుంటా మీకు ఆయన మీద.
సినిమా చుసిన తరువాత మీకు కలిగిన వైరాగ్యం గురించి, వేమన సినిమా చూస్తే వచ్చే వైరాగ్యం గురించి తెలియదు గాని ప్రభుత్వ ఆసుపత్రులకు అందులోను పెద్ద ఆసుపత్రి అనే వాటికి వెళ్తే వచ్చే వైరాగ్యం గురించి కొంత తెలుసు. వైరాగ్యం కలిగే వయసు కు ఇంకా కొంచెం దూరం లో ఉన్నప్పుడే హైదరబాద్ నిమ్స్ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు కొన్ని వారాల (నెలలో మరి) వరకు సరిపడే వైరాగ్యం కలిగింది. మీరు మానసిక వైద్యులు అందులోను ప్రైవేటు గా ప్రాక్టిసు చేస్తున్నారు కనుక, వెళ్తే బహుశా ఇది మీకు కుడా అనుభవం లోకి రావచ్చు. (అక్కడనే రోజు పని చేసే వారు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటారనే ఉద్దేశ్యం తో)
చంద్ర గారు,
Deleteనేను చిత్తూరు నాగయ్య అభిమానిననే మచ్చ నాపై పడిపోయింది. ఇదేదో బానే ఉందని అలా ఉంచేసుకున్నాను!
నేను గవర్నమెంట్ సెటప్ లోనే MBBS చదివాను అని మనవి చేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆస్పత్రులకి వెళ్తే కలిగే వైరాగ్యం ఒకప్పుడు నాకూ కలిగింది. గుంటూరు మెడికల్ కాలేజిలో సీటొచ్చిందన్న ఆనందం.. ఎనాటమీ థియేటర్లో వరుసగా పడుకునున్న శవాల్ని చూడంగాన్లే ఆవిరైపోయింది. ఆ తరవాత జనరల్ ఆస్పత్రిలో అనేక రోగాల్తో ఇబ్బందుల పడుతున్న రోగుల్ని చూసి జడుసుకున్నాను. స్నేహితులతో కలిసి చదువుకుని వైద్యవిద్యార్ధినయ్యాను కానీ.. ఇలా రోగుల మధ్య, రోగాల్ని చదువుకుంటూ జీవనం సాగించాలనే స్పృహ/జ్ఞానం నాకు లేకపోయింది. తరవాత అలవాటైపోతుంది.
ఇప్పుడైతే మనకి ఆస్పత్రులేం ఖర్మ.. రెవిన్యూ ఆఫీస్, RTA ఆఫీస్, పాస్ పోర్ట్ ఆఫీస్, మునిసిపల్ ఆఫీస్.. ఇలా ఒకళ్ళేమిటి! అందరూ జీవితంపై విరక్తి కలిగిస్తున్నారు. అందరికీ వందనాలు!
Very good review. Perhaps K.V Reddy got carried away with some reddy sentiment towards Vema reddy hence might have made him look good with some additional greatness thrust on the character etc, that could also be the reason for irk of SriSri. ;)
ReplyDeleteramana u have taken me to the olden days movies wherein we used to sit and enjoy the movie after two intervals if i remember for yogi vemana.today it s difficult to sit and also not worth spending that time to see old movies.but i really watched all the songs and trying to hmm with the song.good continue
ReplyDeletepardhu
Good Analysis Doctor garu, specially when you said seeing black and white. Another thingh is Nagayya garu must have completely absorbed in the life of Vemana ( as the actors try and understand the life history of the charcters they play before hand to live in that character ) so must have already got the vairagya bhava before evn acting in the first half. So naturally the first half mohanangi scenes may not look that sensual to us.
ReplyDeleteపోస్ట్ బావుంది . కానీ ఎందుకో నేను confuse అయినట్లు ఉన్నాను . మీరు confuse అయ్యి మమ్మలిని confuse చేసేరా ? లేక నేనే అయ్యానా ?
ReplyDeleteకన్ఫ్యూజన్ మీలో లేదు. నాలోనే ఉంది. అందుకే శ్రీశ్రీ అభిప్రాయాన్ని కూడా రాశాను. వేమనకి దైవత్వం ఆపాదించడం వేమన తత్వానికే వ్యతిరేకం. శ్రీశ్రీ పూర్తిగా కరెక్ట్. కానీ.. నాకీ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకు!?
Delete'నాగయ్యని నేనెందుకు ఇష్టపడుతున్నాను?'. నాకు తెలీదు. నా ఇష్టానికి కారణం ఆయన నటన, గానం మాత్రమే కారణం కాకపోవచ్చు. నా నిజజీవితంలో నాకు ఉండాలని 'నేననుకుంటున్న' ట్రైట్స్ నాగయ్యకి ఉండటం ప్రధాన కారణం కావచ్చు.
(ఇది చదువుకోలేని వాడికి బాగా చదువుకున్నవాడి పట్ల గల fascination లాంటిది అయ్యుండొచ్చు.)
Thanks for your post. After Reading Ramana Maharshi and Sri Sai Baba Books my thoughts were changed and i can able to share my wealth with many less fortunate people now. Along with above 2 more people change my thinking were (1) Auto Biography of Yogi (2) Yogi Vemana movie by Sri Nagayya. I had hard copy of this Classic.
ReplyDeleteBooks and Great Persons change the people , i am live example.
Srinivas
అభినందనలు మహాశయా .మా అమ్మాయి కల్యాణి పుణ్యమా అని ఈనాటికి మీ బ్లాగ్ ని చూసే భాగ్యం కలిగింది .శ్రీశ్రీ గారినీ ,సాద్య్హాసాద్యాలనూ ,అన్నిటినీ పక్కన పెట్టి సినిమాని చూస్తాను .ఎన్నిసార్లు చూసినా అమ్మ నాకో ముద్ద అన్నం పెడతావా అని వేమన అనగానే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు వచేస్తాయి నాకు ఇప్పటికీ .ఎన్నో సార్లు చూసాను ఇప్పటికీ అంతే.నాగయ్యగారు చూపించిన ఆ సాత్వికాభినయం అనితరసాధ్యం.
ReplyDelete