Sunday, 3 February 2013

వెంటవచ్చునదదే యశస్సు... - బి. శశాంక్


చుండూరు కేసు విషయంలో ఎటువంటి ఒత్తిళ్ళు, ఆర్థిక ప్రలోభాలకు తలొగ్గకుండా, ఏనాడూ చుండూరు మొహం చూడని కొందరు దళిత నేతలు, బ్రాహ్మణుడు మనకేం చేస్తాడు అని కావాలని విషం చిమ్మినా అన్నిటినీ భరించి ప్రపంచంలో దేనినైనా డబ్బుతో కొనగలం అన్న ధీమాతో ఉన్న వారికి అది తప్పు చంద్రశేఖర్ ఉన్నాడు.. ఖబడ్దార్ అని చాటాడు. డబ్బు కంటే ఆశయం గొప్పదని చాటారు. ధర్మమే చుండూరు బాధితులకు రక్ష. 

'అన్నదమ్ములును, ఆలుబిడ్డలును, కన్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు వెంటరారు తుదిన్. వెంటవచ్చునది అదే యశస్సు. అదే సత్యము. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిన్ సాగిరావు. ఏరికి ఏసరికి ఏ పాటి విధించెనో విధి. అదే అవశ్యప్రాప్తంబు' అనే హరిశ్చంద్ర నాటకంలోని పద్యము నాన్న ఎక్కువగా వింటూ తన్మయత్వం పొందేవాడు. అదే జీవిత సత్యంగా గుర్తించిన అతికొద్దిమందిలో నాన్న ఒకడు. ఆ పద్యం అర్థాన్నేకాక దాని భావసారాన్ని కూడా పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తి ఆయన. 

సంపదను గడ్డిపోచతో సమానంగా భావించి నిజమైన సంపద అనగా 'జ్ఞానం' అని నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు. ఆస్తులు మానవ సంబంధాలకు అవరోధాలు అనే ఉద్దేశం కలిగిన వ్యక్తి ఆయన. సమాజ హితము కోరే వ్యక్తులు ఎందరున్నా సామాజిక సమస్యల పట్ల ఆయన దృక్పథం చాలా భిన్నంగా ఉండేది. సమస్యల మూల కారణాలను అన్వేషించడంలో ఆయన నిమగ్నం అయ్యేవాడు. ఆధునికతను అన్ని సమస్యలకు మూల కారణంగా గుర్తించిన వ్యక్తి ఆయన. ఆధునికత మానవుడ్ని ప్రకృతి నుంచి దూరం చేసి మనిషిని ఒక వినియోగ దారునిగా మార్చివేసిందని ఆయన బాధపడుతుండేవాడు.

మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చివేయడంలో మార్కెట్ ప్రధాన భూమిక పోషించిందని దానిలో భాగంగానే హక్కుల ఉద్యమాలు పుట్టుకొచ్చాయని ఆయన అంటుంటేవారు. హక్కులనేవి మార్కెట్ వేగంగా విస్తరించి సమాజంలో చొచ్చుకుపోవడానికి దోహదపడే రహదారుల వంటివని ఆయన అభిప్రాయం. మనిషి అనేవాడు సమూహంలో ఉన్నాననే భ్రమలో ఉన్నాడు గానీ అతనిని ఆధునికత ఒక 'atomistic individual' కిందికి మార్చివేసిందని, దాంతో మనిషి సమాజ నియంత్రణ నుంచి బయటపడి ఒక స్వార్థపూరిత వైఖరిని అలవర్చుకున్నాడని ఆయన తరచు చెబుతుండేవారు. 

అందుకే ఆయన ఆధునికతను విడిచిపెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ కృష్ణానదీ తీరాన దైద అమరలింగస్వామి గుడి చేరువలో పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానార్జన చేసుకుంటూ ఐహిక సుఖాల్ని విడనాడి కాలం గడపడానికి నిర్ణయం తీసుకున్నారు. నగరం పట్ల ఆయనకున్న ఏహ్య భావాన్ని అర్థం చేసుకోవడానికి సండే ఇండియన్‌లో ప్రచురితమైన ఆయన వ్యాసం చదివితే చాలు. ఆయన ప్రస్థానం అనేక సామాజిక ఉద్యమాలు దాటుతూ ప్రకృతి వైపు సాగింది. దాన్ని కొందరు తిరోగమనం అని భావించినా అది ఆధునిక అభివృద్ధి రాక్షసి చేసే విధ్వంసం కన్నా ప్రాకృతిక జీవనం వల్ల కలిగే ఆత్మసంతృప్తి చాలా గొప్పది. 

అసలైన తిరోగమనం అంటే ఆధునిక అభివృద్ధి పదం అనే మాయలో దూసుకుపోవడం తప్ప మరేదీకాదని ఆయన అనేవారు. ఆధునికతలో 'solution is the cause of the problem' అని గుర్తించిన వ్యక్తి ఆయన. ధైర్యం, తెగువ, తెలివి, ఆలోచన అన్నీ తీవ్రస్థాయిలో కలిగిన వ్యక్తి మా నాన్న. ఏదైనా ఒక కేసు ఒప్పుకుంటే ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొనైనా పూర్తిచేసేవాడు. 

ఉదాహరణకు ఆయనకు క్యాన్సర్ వచ్చిన రెండు నెలలకు 'de-facto complaint' తరపున జిల్లా కోర్టులోనే మొదటిసారిగా 'bail opposition petition' వాదించుటకు ఒప్పుకున్నారు. అది విచారణకు వచ్చేనాటికి ఆయన ఆసుపత్రిలో ఎముకలను పిండి చేసేంత తీవ్రమైన వెన్నునొప్పితో పడుకున్నారు కానీ తనను నమ్మిన క్లయింట్‌కు అన్యాయం జరగకూడదని కోటు, గౌను, పుస్తకాలు హాస్పిటల్ కి తెప్పించుకుని అక్కడే వాదనను సిద్ధం చేసుకున్నారు. 60 ఎంజి మార్ఫిన్ బిళ్ళలు వేసుకుని కోర్టులో కూర్చోలేని పరిస్థితిలో కారులో పడుకొని జడ్జి పిలవగానే నొప్పిని లెక్కచేయకుండా వెళ్ళి గంటసేపు నిల్చుని కోర్టు హాలు దద్దరిల్లే విధంగా వాదించి క్లయింట్‌కి న్యాయం చేసి తిరిగి హాస్పిటల్‌కి వెళ్ళి పడుకున్నారు. అదే ఆయన చివరిగా వాదించిన కేసు. ఆయనకు క్యాన్సర్అని తెలిసినప్పటినుంచి ఆయనతప్ప ఇంట్లో మిగతావారంతా రోదించారు.

ఆయన మాత్రం ఆ నాలుగు నెలలకాలంలో ఎప్పుడూ దిగులుగా కన్పించలేదు. అధైర్యమూ పడలేదు. పైగా నాతో 'నేను ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజేతగా నిలిచాను. క్యాన్సర్ నాకొక లెక్కా.. ఒకవేళ నేనీ పోరాటంలో ఓడినా నా ఆత్మ అనంత విశ్వంలో కలిసి ఉంటుంది. నెనెప్పుడూ నీ చుట్టూనే ఉంటాను. నీవు మాత్రం నీతి, నిజాయితీకి కట్టుబడి ఏదైనా పని ఒప్పుకుంటే పూర్తయ్యే దాకా వదలకు. జ్ఞానమే మనకు ఆస్తి' అని చెప్పేవారు. మృత్యువు తరుముకొస్తున్నా ఇంకొద్ది గంటలలో చనిపోతారనగా కూడా 'I will come back' అని తన శైలిలో గంభీర స్వరంతో పలికారు. క్యాన్సర్‌తో నాలుగు నెలల పోరాటమే ఆయన మొండితనం, ధైర్యానికి నిదర్శనం.

చుండూరు కేసు విషయంలో ఎటువంటి ఒత్తిళ్ళు, ఆర్థిక ప్రలోభాలకు తలొగ్గకుండా, ఏనాడూ చుండూరు మొహం చూడని కొందరు దళిత నేతలు, బ్రాహ్మణుడు మనకేం చేస్తాడు అని కావాలని విషం చిమ్మినా అన్నిటినీ భరించి ప్రపంచంలో దేనినైనా డబ్బుతో కొనగలం అన్న ధీమాతో ఉన్న వారికి అది తప్పు చంద్రశేఖర్ ఉన్నాడు.. ఖబడ్దార్ అని చాటాడు. కేసుని కిలోల లెక్కన అమ్ముకుందామని దుకాణాలు తెరిచిన ఎన్‌జీఓకి, ఇతర దుష్ట శక్తులకి కొరకరాని కొయ్యగా మారారు. డబ్బు కంటే ఆశయం గొప్పదని చాటారు. మా నాన్న చావుతో మళ్ళీ ఆ శక్తులు పునరుజ్జీవం పోసుకున్నాయి. కానీ ధర్మమే చుండూరు బాధితులకు రక్ష. 

ఆయనొక నిత్య విద్యార్ధి. పుస్తకాలను అమితంగా ప్రేమించేవాడు. ప్రతి పుస్తకాన్నీ ఒక భిన్న కోణంలో విశ్లేషించేవాడు. ప్రపంచం మొత్తం ఆకాశానికి ఎత్తిన పాలో కొయిలో రాసిన 'ది ఆల్కెమిస్ట్' నవలను, యాంటీ ముస్లిం నవల అని దానిమీద చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే విమర్శ రాసిన వ్యక్తి ఆయన. 

హాస్పిటల్‌లో డాక్టర్‌ని కూడా 'నాకు పెన్ను పేపరు ఇవ్వండి. నేను చాలా రాయాలి' అని అడిగాడు ఆయన. గురజాడ సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ ఒక పుస్తకం రాయాలనుకున్న ఆయన కలం అర్ధంతరంగా ఆగిపోయింది. ఆయన ఆత్మ అఖండాత్మలో లీనమైంది. 

నాకు తెలిసిన నాన్న మొండివాడు. భయం తెలియనివాడు. ఆడితప్పనివాడు. ఆధునికతకు వ్యతిరేకి. చుండూరు దళితుల ఆత్మగౌరవం నిలబెట్టిన ఒక బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళిపోతూ నా మీద చాలా బాధ్యత వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఆశయ సాధనకు నేను నా వంతు కృషి చేస్తా.... 
- బి. శశాంక్ 
(వ్యాసకర్త ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించిన సుప్రసిద్ధ చుండూరు కేసు న్యాయవాది బి.చంద్రశేఖర్ కుమారుడు)
(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ప్రచురితమైన వ్యాసం)

4 comments:

  1. సమాజమ్మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. సమాజంకోసం ఊపిరి పీల్చేవాళ్ళు అతికొద్ది మంది ఉంటారు. ఏవిటో ఈ సృష్టి విచిత్రం? ఎప్పటికీ అర్థం కాదు. కావాల్సింది కోల్పోతాం. అక్కరలేనివి అంటిపెట్టుకొని ఉంటాయి.
    కొన్ని మరణాలు బాధించవు. ఆలోచింప చేస్తాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చూపిస్తాయి.
    చంద్రశేఖర్ ఆశయ క్రాంతే ఆయన ఆత్మ శాంతి.

    -బ్రహ్మానందం

    ReplyDelete
  2. చంద్ర శేఖరుడు ప్రచండుడైన సూర్యుని వలే నిప్పులు కురిపిస్తే
    అదే భూమి పై నిలువ నీడ లేని వారికి వెన్ను దన్ను గా
    శశాంకుడు ముందుకు రావడం శ్లాఘనీయం.
    ALL THE BEST.
    - PUTCHA

    ReplyDelete
  3. రమణ గారు,

    నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం చదవలేదు, మీరు ప్రచురించినందుకు ధన్యవాదములు. ఆంధ్రజ్యోతివారు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసింది.
    బి.చంద్రశేఖర్ గారు నిజజీవితంలో చాలా అరుదుగా కనిపించే హీరోలలో ఒకరు. వారి కుమారుడు తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకుంటారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు కూడా వారి బాటలో పయనిస్తారని ఆశిద్దాం!

    --శ్రీనివాస్

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.