Thursday 31 January 2013

స్త్రీలని గౌరవించండి.. లేదా అడుక్కుతినండి! (మా స్కూలు కబుర్లు)



అనగనగా ఒక బడి. ఆ బడి పేరు శ్రీమాజేటి గురవయ్య హైస్కూలు. అది గుంటూరు పురమునకే తలమానికముగా బ్రాడీపేట యందు వెలసియున్నది. మా బడి నావంటి ఎందఱో అజ్ఞానులకి విజ్ఞానాన్ని ప్రసాదించిన ఒక చదువుల నిలయం.

ఇప్పుడు నేను రాస్తున్న కబుర్లు ఎర్లీ సెవెంటీస్ (1970-3) నాటివి కావున.. అది ఆ రోజుల్లో ఒక రోజు. సమయం ఉదయం ఎనిమిది గంటలు. స్థలం మా స్కూల్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. విద్యార్ధులందరం తరగతుల వారిగా వరసలో నించునున్నాం. ఇలా నించోడాన్నే 'అసెంబ్లీ' అందురు.




మా స్కూల్లో 'వందేమాతరం' రికార్డుని పిన్ను మార్చకుండా అదే పనిగా వేలసార్లు తిప్పినందువల్ల.. రికార్డ్ అరిగిపోయి చాలా రోజులైంది. రికార్డ్ ప్లేయర్ కి 'కీ' ఇచ్చి పబ్లిక్ ఎడ్రెస్ సిస్టంలో (యాంత్రికంగా, నిర్వికారంగా) ప్లే చెయ్యడం మొదలెట్టాడు గోపాలరావు.

గోపాలరావు మా సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్. అతని శరీరచాయ నల్లగాను, తలంతా ముగ్గుబుట్టగాను ఉండుటచే బ్లాక్ అండ్ వైట్ ఫోటో నెగెటివ్ లా అనిపిస్తుంటాడు. చిటపట ధ్వనుల మధ్య.. వినబడీ వినబడనట్లు 'వందేమాతరం' అంటూ వణుకుతూ గీతం మొదలైంది.

మాకు హెడ్ మాస్టారు శ్రీ వల్లూరి జగన్నాధరావు గారు. తెల్ల చొక్కా, నల్ల పేంటు, దళసరి ఫ్రేము కళ్ళద్దాలు, దబ్బపండు శరీర చాయ. దుర్యోధనుని చేత గదా దండము వలె ఆయన చేతిలో పొడవాటి కేన్ బెత్తం. ఆయన సింహంలా స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. కనుసన్నల్లో అందర్నీ గమనిస్తున్నారు. ఆయనంటే మాకు భ..భ.. భయం. హ.. హ.. హఢల్!

అందుకు అనేక కారణాలు. మన కళ్ళల్లోకి చూస్తేనే ఆయనకి మనం చదువుతున్నామో, లేదో తెలిసిపోతుంది.. ట! అందుకే (తెలివిగా) నేనెప్పుడూ ఆయన కళ్ళల్లోకి చూళ్ళేదు. ఆయన కేన్ బెత్తాన్ని భారీగా వాడతారు. ఆయన రోజూ ఈ 'అసెంబ్లీ'ని పార్లమెంట్ స్థాయిలో చాలా సీరియస్ గా నిర్వహించేవారు.




'వందేమాతరం' అయిపొయింది. ఒక 'రాముడు బుద్ధిమంతుడు' వంటి విద్యార్ధి ఇంటి దగ్గర రాసుకొచ్చిన వివేకానందుని ప్రవచనాలు, గాంధీ సూక్తులు.. మైకులో పెద్దగా అరుస్తున్నట్లు చదివాడు (సాధారణంగా ఇట్లాంటి గొప్ప పనులు ఏ పుచ్చా గాడో, పాటిబండ్ల గాడో చేస్తుంటారు. వారిద్దరూ మైకు ముందున్న ఆ నాలుగు క్షణాలు దేశనాయకుల్లా తెగ ఫీలైపొయ్యేవాళ్ళు).

వల్లూరి జగన్నాధరావుగారు గొంతు సరి చేసుకుని మైక్ లో మాట్లాడటం మొదలెట్టారు.

"మనది పవిత్ర భారత దేశం. మనమంతా భారతీయులం. గాంధీ తాత ఎంతో కష్టపడి మనకి స్వాతంత్ర్యం తెచ్చారు. మనం ఈ పవిత్ర భారత దేశ పౌరులుగా గాంధీ గారి ఆశయాలు నెరవేర్చాలి. అందువల్ల మనమంతా అత్యంత బాధ్యతతో, క్రమశిక్షణగా జీవించాలి. అమ్మానాన్న దైవస్వరూపులు. వారిని గౌరవిద్దాం. మీరు ఉదయాన్నే ఫోరింటికి లేచి ఫైవింటి దాకా చదువుకోండి. సిక్సింటిదాకా అమ్మకి ఇంటి పనుల్లో సాయం చెయ్యండి. సెవెనింటికల్లా స్కూలుకి రెడీ అయిపోండి." (ఆయనకి 'ఇంటి' భాష అలవాటు.)

ఇంతలో మైక్ 'కుయ్' మని శబ్దం చేసింది. గోపాలరావు యాంప్లిఫైర్ కంట్రోల్స్ లో ఏదో మీటరు ముందుకి వెనక్కి తిప్పాడు. మొత్తానికి శబ్దం మాయమైంది. జగన్నాధరావుగారు మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు.

"స్త్రీలని గౌరవించండి. వారు లక్ష్మీ స్వరూపులు. సరస్వతి స్వరూపులు. అంటే దానర్ధం ఏమిటి? వారిలో లక్ష్మీ,సరస్వతి దేవతలు దాగి ఉంటారు. కానీ మనకి బయటిక్కనబడరు. అయితే మనమేమన్నా తప్పు చేస్తున్నామా అని లోపల్నుండి గమనిస్తుంటారు. అదే గమ్మత్తు. అంచేత మీరు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారో.. లక్ష్మీసరస్వతి దేవతలకి కోపం వస్తుంది. అప్పుడు సరస్వతీదేవి మీకు అన్ని పరీక్షల్లొ గుండుసున్నా వచ్చేట్లు చేస్తుంది. లక్ష్మీదేవి మీ జేబులో పైసా కూడా ఉండనివ్వదు. ఇప్పుడు రోడ్ల మీద అడుక్కు తింటున్నవాళ్ళంతా ఒకప్పుడు స్త్రీలని హింసించినవాళ్ళే. అర్ధమయ్యిందా.. " ఆయన ఉపన్యాసం ఈ ధోరణిలో ప్రతిరోజూ ఓ ఐదు నిముషాలు సాగుతుంది.

రోజూ 'సాగే' ఆయన ఉపన్యాసంలో ఎక్కువ భాగం రిపిటీషన్. నాకు విసుగు పుట్టేది. కాళ్ళు నొప్పెట్టేవి. ఆయన ఉపన్యాసం తరవాత దేశం కోసం రెండు నిముషాలు ధ్యానం! ధ్యానం అంటే ఏం లేదు. చేతులు జోడించి.. కళ్ళు మూసుకుని నిలబడాలి. ఆ రెండు నిముషాలు రెండు గంటల్లా అనిపించేది. (అయితే మన హెడ్ మాస్టర్ గారు కళ్ళు తెరిచి వాచ్ కేసి చూసుకుంటూ ధ్యానం సరీగ్గా చెయ్యరని తన దొంగచూపులతో మా సత్తాయ్ గాడు కనిపెట్టాడు.)



మీకు అసెంబ్లీ రావడం ఇష్టం లేదా? అంతసేపు నిలబడలేరా? అయితే ఒక ఫెసిలిటీ ఉంది. అదే భగవద్గీత క్లాస్. హాయిగా క్లాస్ రూంలో కూర్చోవచ్చు. బ్రహ్మాండం శీను (నా క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్), దీక్షితులు (నాకు ఒకేడాది జూనియర్) అక్కడ టీచర్లు. వారికి స్నేహమన్న అర్ధం తెలీదు. అందుకే వారికి స్నేహధర్మం లేదు. ఇద్దరూ కలిసి మమ్మల్ని చావగొట్టి చెవులు మూసేవాళ్ళు. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే.. ' అంటూ మొదలెడతారు. వాళ్ళు ఒక లైన్ చెబితే మనం కోరస్ గా అరుస్తూ ఆ లైన్ రిపీట్ చెయ్యాలి. ఈ క్లాస్ కనీసం అరగంట. ఇది అచ్చంగా పెనం మీద నుండి పొయ్యిలోకి పడటంలాంటి దన్నమాట!

చిన్నప్పట్నుండి నాది ద్వైదీభావ స్వభావం. హోటల్లో ఇడ్లీ తినాలా? అట్టు తినాలా? అన్నది కూడా తొందరగా తేల్చుకోలేను. కాబట్టి భగవద్గీత క్లాసులో నోరు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి.. వల్లూరు జగన్నాధరావు గారి నీతిబోధనలకి చెవులు నొప్పెట్టినప్పుడు అసెంబ్లీకి మారుతుండేవాణ్ని.



ఈ రెండూ తప్పించుకోడానికి మూడో మార్గం కూడా ఉంది. అయితే ఇది కొద్దిగా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అది అసెంబ్లీ అయిపొయ్యే సమయానికి బ్రాడీపేట ఐదో లైన్లోంచి గోడ దూకి దొడ్డి దోవన స్కూల్లోకి రావడం. స్కూల్ అటెండర్ పరుశురాముడి దృష్టిలో పడితే ఓ మూడు పైసలు లంచం ఇచ్చి తప్పించుకోవచ్చు. అదే డ్రిల్ మాస్టర్ రామబ్రహ్మం గారి కంట్లో పడితే మాత్రం పంబరేగ్గొడతారు. మా సత్తాయ్, భాస్కరాయ్, బోడా నాగేశ్వర్రావులు దీరోదాత్తులు. వారు మాత్రమే ఈ గోడ దూకే సాహస కృత్యం చేసేవాళ్ళు. నాకు చచ్చే భయం. అంచేత నేనెప్పుడూ గోడ దూకలేదు.

సరే! ఒక పక్కన అసెంబ్లీ.. ఇంకో పక్కన భగవద్గీత. ఈ కష్టాలన్నీ దాటాం గదాని సంబరపడరాదు! క్లాస్ రూంలో పాఠాల మధ్య చాన్స్ దొరికితే చాలు (దొరక్కపోయినా కలిపించుకుని మరీ).. పరిమి ఆంజనేయశర్మ గారు, కల్లూరి నరసింహమూర్తి గారు, మాడభూషి భవనాచారి గారు, పోలూరి శ్రీమన్నారాయణ గారు.. మా గురువు గార్ల లిస్టు పెద్దది.. నీతి బోధన వాయింపుడు కార్యక్రమం రోజూ ఉండనే ఉంటుంది.




"మీరు డాక్టర్లవుతారా, ఇంజనీర్లవుతారా అనేది మాకు అనవసరం. అవన్నీ భుక్తి కోసం విద్యలు. మీరు మంచి పౌరులుగా ఎదగాలని మా కోరిక. పొరబాటున కూడా సమాజానికి హాని చెయ్యరాదు. మా శిష్యు లైన మీరు వెధవ పనులు చేస్తే మాకు, మన స్కూలుకి అవమానం." అంటూ ఏదో సందర్భంలో చెబుతూనే ఉంటారు.

ఇప్పుడు చెప్పండి. పొద్దస్తమానం ఈ సూత్రాల మధ్యన పెరిగిన నేను.. చదువు నిర్లక్ష్యం చేస్తూ.. అమ్మాయిలకి సైట్లు కొడుతూ, బీట్లెయ్యాలంటేనే ఎంతో కష్టపడాలి. నేను పుట్టుకతో బద్దకస్తుడను. అంచేత.. కష్టపడుతూ ఆ పన్లన్నీ చేసే ఓపిక లేక.. చదువుకుని సుఖపడుతూ బాగుపడిపొయ్యాను. చెడిపోవలసిన వయసులో బాగుపడి పోవుట చేత.. అలవాటై పొయ్యి.. అదే కంటిన్యూ చేసేశాను.




మొన్నామధ్య నా గురవయ్య హై స్కూల్ స్నేహితుడు కలిశాడు. అతగాడు ఢిల్లీలో ఏదో డిఫెన్స్ లాబ్ లో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. మాటల సందర్భాన మా స్కూల్ ప్రస్తావన వచ్చింది. మావాడు మొహం ఆవదం తాగినట్లు పెట్టాడు.

"నాకు మన స్కూల్ గూర్చి చెప్పకు. దానంత దరిద్రపు స్కూల్ ఈ లోకంలోనే లేదు." కసిగా అన్నాడు.

ఆశ్చర్యపోయాను. "నేనింకా మన గురవయ్య బళ్ళో చదువుకోడం అదృష్టం అనుకుంటున్నానే!" అంటూ నసిగాను.

"నీ మొహం అదృష్టం. అది కూడా ఒక స్కూలేనా? ప్రతిరోజూ 'స్త్రీలని గౌరవించండి, నెత్తిన పెట్టుకోండి, పూజించండి' అంటూ జగన్నాధరావు గారు నా బుర్రలో నాగార్జునా సిమెంటుతో చైనా వాల్ కట్టేశారు. నాకా దెబ్బకి ఆడాళ్లంటే గౌరవంతో కూడిన భయం లాంటిదేదో పట్టుకుంది. ఇదో రోగం. నిజం చెప్తున్నా.. ఆయన దెబ్బకి నా జీవితంలో ఏనాడూ ఒక్క ఆడపిల్ల మొహం వైపు కూడా ధైర్యంగా చూళ్ళేదు."

"అదా సంగతి!" అంటూ నవ్వాను.

"పెళ్ళయిన రోజు నుండి భార్యని కూడా గౌరవిస్తున్నాను. ఆమెని ఏనాడూ నోరెత్తి చిన్న మాట కూడా అన్లేదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే జగన్నాధరావు గారి లక్ష్మీసరస్వతుల అసెంబ్లీ పాఠం గుర్తొస్తుంది. పైగా ఆయన నాకేసి గుడ్లురుముతూ చూస్తున్నట్లనిపిస్తుంది. నాకింక నోరు పెగలదు. అందుకే మా ఆవిడ నన్నో వాజమ్మలా చూస్తుంది." దిగులుగా అన్నాడు.


మావాణ్ణి జాలిగా చూశాను. మెడిసిన్ సరైన మోతాదులో వాడితేనే ఫలితం బాగుంటుంది. అదే మెడిసిన్  ఓవర్ డోసేజ్ అయిపోతే కాంప్లికేషన్లొస్తాయి. మావాడు హెడ్ మాస్టర్ గారి బోధనలని మరీ సీరియస్ గా పట్టించుకుని.. దెబ్బతిన్నాడు. ఆ విధంగా స్కూళ్ళ వల్ల లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయని అర్ధమైంది.


మనవి..


ఈ పోస్ట్ నా గురవయ్య హైస్కూల్ స్నేహితుల కోసం రాశాను. కొందరికి విసుగనిపించవచ్చు. మన్నించగలరు. ఈ పోస్ట్ చదివిన మా స్కూల్ విద్యార్ధులు.. వల్లూరి జగన్నాధరావు గారి ఫోటో పంపిన యెడల.. ఆ ఫోటో ఈ పోస్టులో ప్రచురిస్తాను.

కృతజ్ఞతలు..

DSR.మూర్తి నా ప్రాణమిత్రుడు. 'మన స్కూల్ గూర్చి రాస్తున్నాన్రా' అనంగాన్లే.. సంతోషంగా, హడావుడిగా చక్కటి ఫోటోలు తీసి పంపాడు. (చివరి చిత్రం మా స్కూల్ సంస్థాపకులు శ్రీమాజేటి గురవయ్య గారిది.)

18 comments:

  1. ఒక 'రాముడు బుద్ధిమంతుడు' వంటి విద్యార్ధి ఇంటి దగ్గర రాసుకొచ్చిన వివేకానందుని ప్రవచనాలు, గాంధీ సూక్తులు.. మైకులో పెద్దగా అరుస్తున్నట్లు చదివాడు (సాధారణంగా ఇట్లాంటి గొప్ప పనులు "ఏ పుచ్చా గాడో, పాటిబండ్ల గాడో చేస్తుంటారు."

    కోట్ చేసిన పదాల అర్థం ఎంటొ కాస్త చెప్పగలరు,ఎందుకంటే చిన్నప్పుడు ఉపాధ్యాయుల బలవంతం,బెదిరుంపుల మేరకు నేను ఆ పని చెసే వాడిని!!నాది మా గ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాల సుమారు ప్రార్థన సమయం మీరు చెప్పిన విధంగానే ఉండేది!(2005 తో నా పాఠశాల రోజులు అయిపోయాయి ఈరోజు కాస్త గుర్తుకు తెప్పించారు కృతఙతలు).

    ReplyDelete
    Replies
    1. మా స్కూల్లో మైకులో ప్రార్ధన పాడేవాళ్ళూ, సూక్తులు చదివేవాళ్ళు సెలబ్రిటీలు. ఇక భగవద్గీత కోచ్ బ్రహ్మాండం శీనుగాడయితే లెజెండే!

      స్కూల్ చివరి రోజు.. ఎసెంబ్లీలో (పదో తరగతి పరీక్షల ముందు) మా పుచ్చా స్పీచ్ అద్భుతం. అది నాకింకా గుర్తుంది.

      ఇవన్నీ మేం అవకాశాలుగానే భావించాం.

      Delete
  2. ఈ పోస్టు చూసాక కూడా కామెంటెట్టకపోతే మన గురువులంతా ముక్త కంఠంతో రాత్రంతా నిద్రలో నా పని పడతారేమో అనే అనుమానంతో ఇది రాసే పడుకొందామని డిసైడయ్యా!! చక్కటి చిత్రాలు,మంచి మాటలతో రాయల్ రాత రాసావ్ రమణా. మళ్ళీ ఎర్లీ 70ల్లోకి తీసుకెళ్ళావ్! నాకు ఆ మూడో త్రోవ తెలీదు! తెలిసినా ఆ గోడ ఎక్కి దూకలేనని నా ప్రగాఢ నమ్మకం. నేను అసెంబ్లీ కే అటెండు అయ్యాను. సినిమాల్లో చూపి నట్లు చక్రం తిప్పి ఫ్లాష్ బాక్ కి తీసుకెళ్ళావుగా! మనందరం ఢిల్లీ మిత్రుడంతకాక పోయినా అంతో ఇంతో వంట బట్టించుకున్నాం గనుకనే ఇపుడిలావున్నమని నా అభిప్రాయం. అదే నా పిల్లలకు కూడా చెపుతూ ఉంటా! మంచి చిత్రా లందించినందుకు దారాము కి క్రుతగ్నతలు!!

    ReplyDelete
    Replies
    1. గౌతం,

      ఈ సృష్టిలో అత్యంత క్లిష్టమైనది ఉపాధ్యాయ వృత్తి అని నా అభిప్రాయం.

      కానీ ఎందుకనో వైద్య వృత్తికే గ్లామర్ ఎక్కువ. వైద్యవృత్తిలో పేషంట్ ఒక్కడితోనే డీల్ చెయ్యాల్సి వుంటుంది. కానీ ఉపాధ్యాయులు సమాజాన్నే తయారుచేస్తుంటారు. ఇది తల్లి బిడ్డని కనడం కంటే కష్టమైన పని.

      నాకు ఒకప్పటికన్నా ఇప్పుడే మన టీచర్ల విలువ అర్ధమవుతుంది. వాళ్ళు నిస్సందేహంగా dedicated people. వల్లూరి జగన్నాధరావు గారు మనని ఎసెంబ్లీలో భయపెట్టడమే కరెక్ట్. ఆ వయసు వారికి బ్లాక్ అండ్ వైట్ లోనే చెప్పాలి. ఆయన క్రమశిక్షణ, పరిమి ఆంజనేయశర్మ గారి శిక్షణ లేకపోతే.. నేను ప్రస్తుతం ఏ జాంకాయలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవాణ్ని (కాయలు అమ్ముకునేవారి పట్ల నాకు తక్కువ భావం లేదు. మా గురువు గార్ల గొప్పదనాన్ని హైలైట్ చెయ్యడానికి మాత్రమే ఈ ఉపమానం వాడాను).

      Delete
    2. రమణగారు,
      పోస్ట్ బాగుంది, కానీ నాకు ఈ నీతి భొధనలు అన్నా, పర్సనాలిటీ డెవలప్మెంట్ నవలన్నా మహా చెడ్డ చిరాకు, అసలు గాంధీ నీతి సూత్రాలు నేనెందుకు పాటించాలి? నాకొక్కటికుడా నచ్చదు, ఆ గీత శ్లోకాలు బట్టీవెయ్యడం అన్నా, మా స్కూళ్ళో కుడా అంతే ఈ గీత శ్లోకాలు వచ్చు అంటే మహా క్రేజ్, నాకేమో అసలు అవన్నీ గుర్తుంచుకుంటే కలిగే లాభం ఏమిటో అర్ధం అయ్యేది కాదు. ఈ నీతి బోధనలు, ఇవన్నీ ఓ పెద్ద టైంవేస్ట్ పనులు.
      ప్రత్యేకించి ఆ (మీ) జనరేషన్ టీచర్లు అంటే ఇంకా చెడ్డ చిరాకు ప్రతిదానికీ కర్రొకటి వాడతారు, నాకైతే ఆ కర్రలాక్కోని తిరిగి వాళ్ళనే బాదాలనిపించేది, నా జునియర్ ఒకడు అదే పని చేశాడు, అప్పుడు తప్పు అనిపించినా, ఇప్పుడు అది కరక్టే అనిపిస్తున్నది, పైగా నాకు బాగా చిరాకు తెప్పించేది ఒక గిరి గీసి ఇదే కరెక్టు అంటారు, దాన్ని ప్రశ్నించకూడదు ప్రశ్నించామా పెద్ద తప్పు, పెద్దల మాటకి ఎదురు చెప్పకూడదు అని ఓ బిల్డప్పు, ఇవన్నీ మహా చిరాకు నాకు, అసలు పిల్లలకి కుడా గౌరవం ఇవ్వాలి అని ఉండదు, ప్రతిదానికీ తప్పులు, చిన్న పొరపాటుకి ఓ పెద్ద గొడవ చేస్తారు, ఓ మాట చెబితే పోయేదానికి. అనవసరంగా సిస్టం ని కాంప్లికేట్ చేసి దానికి గౌరవం అన్న ముసుగు వెయ్యడం టీచర్ల దగ్గిరే మొదలవుతుంది మన దేశంలో, పెద్ద పెద్ద నోబుల్ లారెట్లు కుడా మెయిల్ ఇస్తే చక్కగా చేంతాడంత జవాబులు ఇస్తారు ఎంత చెత్త మెయిల్ ఐనా, ఇక్కడేమో అదో మహాపరాధం.

      ఇవన్నీ అనవసరపు పనులేనండి, ఎదో నెలకోక్కసారి ఐతే పర్లేదు కానీ, రోజూ చేయిస్తే అవన్నీ మొక్కుబడి పనులు అవుతాయి, పైగా మన న్యూస్ పేపర్లలో వచ్చేవి ఎక్కువగా కలలో వండి వడ్డించినవేగా

      Delete
    3. I mean may be dedication but in wrong way :-)

      Delete
  3. మీరు వివరించిన తీరు బాగుంది. మీ గురువుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని నేను అభినందిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! నాకు నా టీచర్ల పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉంది.

      Delete
  4. @గట్టిగా మాట్లాడాలంటే జగన్నాధరావు గారి లక్ష్మీసరస్వతుల అసెంబ్లీ పాఠం గుర్తొస్తుంది

    LoL

    ReplyDelete
  5. ఇంతలో మైక్ 'కుయ్' మని శబ్దం చేసింది. గోపాలరావు యాంప్లిఫైర్ కంట్రోల్స్ లో ఏదో మీటరు ముందుకి వెనక్కి తిప్పాడు. మొత్తానికి శబ్దం మాయమైంది.
    I think all the mikes had this problem ,in those days.

    This post remembers me, my school days.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. మీ హైస్కూల్ విశేషాలు చాలా బాగున్నాయి.
      ఇంచు మించు ఇలాగే, మా స్కూల్ లో కూడా జరిగేవి.
      రోజు వార్తలు చదవడం , ప్రేయర్ చెప్పడానికి ఎవర్నో ఒకరిని పిలిచేవాళ్ళు, ఎవరిని పిలుస్తారా అని దడుచుకుని చచ్చేవాళ్ళం.
      క్లాసు లలో స్త్రీలని గౌరవించండి అని, గురువులును పూజింపుము అని ఇంకా చాలా ఉండేవి.
      రోజు ప్రేయర్ తో పాటు మాతృ దేవోభవ , పితృ దేవోభావా అని చెప్పించేవాళ్ళు.
      ఏమైనా , చిన్నప్పటి స్కూల్ , అప్పటి టీచర్ ల మీద ఉన్న గౌరవం, స్థానం మన మనసులో ఒక మూల ఎప్పుడూ అలానే ఉంటాయి, ఆ తరువాత వచ్చే అనుభవాలన్నీ తరువాతి స్థానం లోకి వెళ్తాయి.
      పురుషులని గౌరవించండి అని ఎందుకు ఉండకూడదా అనే తిక్క ఆలోచనలు కూడా వచ్చేవి.
      మనుషులని గౌరవించండి అని ఉంటె బాగుంటుంది.

      Delete
  7. రమణ గారు మీ పోస్టులు, ముఖ్యంగా స్కూలు / చిన్ననాటి అనుభవాలు చెబుతుంటే చాలా ఇన్ స్పైరింగా ఉంటుంది. నాకూ వ్రాయాలనిపిస్తుంది. మా నాన్నగారు ఈ స్కూలులోనే కెరియర్ మొదలుపెట్టారు టీచర్ గా. తర్వాత హిందు హైస్కూలుకు బదిలీ అయ్యి, అక్కడే రిటైర్ కూడా అయ్యారు నాలుగైదు సంవత్సరాల క్రితం. మా చిన్నప్పుడు "ఆ రోజులే వేరు" అని ఎవరైనా పెద్దవాళ్ళు అంటుంటే నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ వయసు వచ్చాక "ఆ రోజులే వేరు" అని నాకూ అనిపిస్తుంది. నేను కూడా అదే కమిటీలోని హిందూ హైస్కూలు, ఆ తర్వాత హిందూ కాలేజీలో చదువుకున్నాను. పదేళ్ళ అనుబంధం ఆ స్కూలు, కాలేజీ తోటి!

    ReplyDelete
    Replies
    1. నేనూ హిందూ కాలేజ్ స్టూడెంటునే. గమ్మత్తేమంటే.. ఇవన్నీ గొప్ప అనుభూతులుగా మిగిలిపోతాయని.. నాకు చదువుకునే రోజుల్లో తెలీదు!

      Delete
  8. Those are some Very Good memories about our school. I guess I am your junior, we did not have bhagavadgeeta classes but we all read one sloka & meaning from book we carry in assembly every day. I have fond memories about NCC days & camps going out of Guntur with friends. Thanks for this great post!

    ReplyDelete
  9. రమణ గారూ ,
    1.తల్లిదండ్రులు , 2.ఉపాథ్యాయులు బాధ్యత వహించ గల్గితే మంచి సమాజాన్ని రూపొందించ వచ్చు .
    నాటి తరమే దీనికి నిదర్శనం .నేడు ఈ రెండు వ్యవస్థల వైఫల్యము కొట్టొచ్చినట్లు కన్పిస్తూ ఉంది .
    ఆ తరం హైస్కూలు ప్రథానోపాథ్యాయులు , ఉపాథ్యాయులు విద్యార్థుల బాగు , సమాజ హితం తప్ప కల్మషమెరుగరు . పేదరికం తాండవిస్తున్నా నియమం తప్పని మహానుభావులు . విద్యార్థులను గాలి కొదిలే వారు కాదు . కాస్త కఠినంగా వ్యవహరించినా వాళ్ళవి స్వచ్చమైన దృక్పథాలు . ఇప్పుడది కొరవడింది . అన్ని వృత్తుల లాగే ఉపాథ్యాయ వృత్తి కూడా బాధ్యతను వదిలేసింది . విద్యార్థి దశలో సక్రమ మైన మార్గ దర్శనం లేక - స్వార్థమనే పునాదుల మీద ఏర్పడ్డ ఉన్నత చదువుల - 'ఔన్నత్యం లేని' సమాజం మనది నేడు .


    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు,

      అవును. మీతో ఏకీభవిస్తున్నాను.

      Delete
  10. కాసేపు మతిపోయినోళ్ళు వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటుంటే
    మనం చూసి ఎలా అనుకుంటామో ... అలా చేశారు నన్ను ...
    అదృష్టం బాగుండి నన్నా సీనులో ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది...

    బాగుందండి ...
    థాంక్స్...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.