Monday 28 January 2013

ఘంటసాల పాటొచ్చింది.. గేరు మార్చు!


"గురూ గారు!"

"ఏమిటి శిష్యా?"

"మీరీమధ్య బ్లాగుల్లో ఘంటసాల భజన చేస్తున్నరెందుకు?"


"పిచ్చివాడా! బ్లాగులున్నదే భజన చేసేందుకు! నాకు నచ్చినవి నా బ్లాగులో రాసుకోకపోతే ఇంకెక్కడ రాసుకోమంటావ్? నీ ఇంటి గోడ మీద రాయమంటావా?"

"ఆ పని మాత్రం చెయ్యకండి. మొన్ననే సున్నం కొట్టించాను. మీరీమధ్య 'ఘంటసాలా! ఓ ఘంటసాల!' అంటూ ఒక టపా రాశారు. ఘంటసాల పాట సినిమా కథని ఎలివేట్ చేస్తుందన్నారు. కథని ముందుకు నెడుతుందన్నారు. నాకైతే మీ రాత కొద్దిగా 'అతి' అనిపించింది."

"నీకలా అనిపించిందా శిష్యా! సర్లే! ఇలా వచ్చి నా పక్కన కూర్చో. నీకిప్పుడో యూట్యూబ్ విడియో చూపిస్తాను. శ్రద్ధగా మనసు పెట్టి చూడు. అప్పుడుగానీ నీకు సత్యం బోధపడదు."

"చూడక తప్పదంటారా?"


"తప్పదు గాక తప్పదు. ముందుగా ఈ 'దేవదాసు' పాట చూడు. పార్వతికి పెళ్ళైపోయింది. దేవదాసుకి ఇంక అంతా అంధకారమే! 'నెరవేరని ఈ మమకారాలేమో.. ' అంటూ ఘంటసాల గానం రాబోయే ఘోరమైన, దుర్మార్గమైన ఏడుపు సన్నివేశాలకి ప్రేక్షకుల మూడ్ ని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఈ పాట లేకుండా దేవదాసు తాగుడు మొదలెట్టేస్తే ప్రేక్షకులకి దేవదాసు పట్ల సానుభూతి అంతగా ఉండేది కాదు."




"చూశావు గదా! సినిమా టెక్నిక్ పట్ల ఎంతో అవగాహన, వాయిస్ మీద గొప్ప కంట్రోల్ ఉంటే తప్ప స్వరంలో అంత దుఃఖం పలకదు శిష్యా! దటీజ్ ఘంటసాల. ఏమంటావు?"

"కాదంటే మీరూరుకోరుగా!"

"ఋజువు చూపినా కూడా నీ బుర్రలో జ్ఞానద్వారాలు తెరుచుకోవట్లేదేమి శిశువా? అయితే ఇప్పుడు 'దొంగరాముడు' పాట చూడు. పాటలోనే కొంత కథ కూడా నడిపించేశాడు కె.వి.రెడ్డి. కాబట్టి సన్నివేశాలకి క్లుప్తత కూడా వచ్చింది. ఇటువంటి సారోఫుల్, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ని అనేక సినిమాల్లో ఘంటసాల రోట్లో వేసి చితక్కొట్టేశాడు. చపాతి పిండిలా పిసికేసాడు."



"ఎలా ఉంది?"

"గురూ గారు! నాకు సావిత్రి భలేగుంది."


"శిష్యా! నీకు విషయం మీద ఫోకస్ లేదు. అందుకే ఘంటసాలని వదిలేసి సావిత్రిని చూశావు. ఆడలేడీసుపై నీ దృష్టి మరలే అవకాశం లేకుండా ఇప్పుడు నీకు స్త్రీ పాత్ర లేని 'ఆత్మబంధువు' పాట చూపిస్తాను. చూడు."

"బాబోయ్! ఇప్పుడింకో పాట చూళ్ళేను. ఒప్పుకుంటున్నాను. ఘంటసాల గొప్పగాయకుడు."

"ఈ ముక్క నీ హృదయంలోంచి తన్నుకుంటూ రావాలి. నోట్లోంచి కాదు. ఈ 'ఆత్మబంధువు' పాట చూస్తే ఘంటసాల ఘనతేమిటో నీకే అర్ధమౌతుంది."




"గురూ గారు! నాదో డౌటు. అసలు సిన్మా మధ్యలో ఈ బ్యాక్ గ్రౌండ్ పాట లెందుకు? హాయిగా డ్యూయెట్ల తో సిన్మా లాగించెయ్యొచ్చుగా?"

"మంచి ప్రశ్నడిగావు! పూర్వం సిన్మాల్లో కథ ఉండేది. మోటార్ సైకిల్ నడిపేప్పుడు క్లచ్ తో ఎక్కువసేపు పనుండదు. కానీ మోటర్ సైకిల్ డ్రైవింగులో క్లచ్ అత్యంత ముఖ్యమైనది. అది లేకండా గేర్లు మార్చలేం. క్లచ్ నొక్కి గేరు మార్చినట్లు.. పాత సినిమాల్లో దర్శకులు 'ఘంటసాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్' అనే క్లచ్ నొక్కి కథకి గేర్లు మార్చేవాళ్ళు. నువ్వీ సినిమాలు పూర్తిగా చూస్తేగాని ఈ పాటల పరమార్ధం తెలీదు."

"అద్సరే గానీ.. ఈ పాటలు ఇంత బాగా ఇంకెవరూ పాడలేరంటారా?"

"పాడలేకేం? పాడతారు. అయితే.. ఘంటసాల తప్ప ఇంకెవరు పాడినా ఆ పాట ఏడిపించేట్లు ఉండదు. ఏడిసినట్లుంటుంది. అదీ విషయం."


"ఏంటో గురూ గారు! మీరేమో ఇంత నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈ సంగతులే నేను బయట చెబుతుంటే నా స్నేహితులకి కోపమొస్తుంది."

"ఓరి పిచ్చి నాగన్నా! అందరి మనోభావాలు గౌరవిస్తూ కూర్చోడానికి నువ్వేమన్నా కాంగ్రెస్ హై కమాండువా? 'కాఫీ రుచి కషాయం కన్నా మిన్న' అని చెబితే కొందరు కషాయ ప్రేమికుల మనోభావాలు దెబ్బతినొచ్చు. అంతమాత్రాన మన అభిప్రాయాలు చెప్పకుండా ఎలా ఉంటాం?"

"అవును గదా!"

"అవును. ఇకనుండీ నిన్ను ఎవరేమన్నా పట్టించుకోకు. ఘనమైన ఘంటసాల గానం గూర్చి గళమెత్తి గర్జించు. అర్ధమైందా?"

"చిత్తం. నేనలా చెయ్యాలంటే ఇప్పుడు మీరు నన్నొదిలి పెట్టాలి. శెలవు!"



(photos courtesy : Google)

18 comments:

  1. మిత్రమా,
    మరపు రాని బాధ కన్నా మధురమే లేదు.
    గతము తలచి వగచుట ..
    అంత సరి కాదని నా హితవు .
    కాలమే అన్ని గాయాలకూ మందు.

    ReplyDelete
    Replies
    1. మిత్రమా,

      నువ్వీ కామెంట్ చంద్రశేఖర్ ని ఉద్దేశించి రాసినట్లున్నావు. grief reaction ఇంత ఘోరంగా ఉంటుందని ఇప్పటిదాకా నాకూ తెలీదు.

      thank you for the nice words.

      Delete
  2. మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి.విషాద గీతాలు పాడటంలో ఘంటసాల ని మించిన సినీ గాయకుడు లేడు అనేది నా అభిప్రాయం.ఒక్కసారి ఈ పాట వినండి.
    http://www.ramaneeya.com/telugusongs.php?id=Galimedalu

    యూట్యూబులో ఈ పాట లింక్ ఎక్కడా లేదు.నిజంగా ఎంత ప్రాణప్రతిష్ట చేసారు ఈ పాటలోని భావానికి.ఎంత మంది వచ్చినా మాష్టారి స్థానం శాశ్వతం.

    ReplyDelete
    Replies
    1. చాలా మంచి పాట గుర్తు చేశారు. ధన్యవాదాలు.

      మీ అభిప్రాయమే నాది కూడా!

      Delete
  3. టైటిల్ కి 100 శాతం న్యాయం చేసింది టపా !!
    *పిచ్చివాడా! బ్లాగులున్నదే భజన చేసేందుకు!
    *శిష్యా! నీకు విషయం మీద ఫోకస్ లేదు
    *నిన్ను ఎవరేమన్నా పట్టించుకోకు. ఘనమైన ఘంటసాల గానం గూర్చి గళమెత్తి గర్జించు.
    ఇంకా ప్రతి లైను , మీ శైలి సూపర్. యెంత శ్రద్దగా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండి.

      అసలు విషయం.. వారం రోజులుగా మనసేమి బాగుండక యూట్యూబ్ లో పాతపాటలు వింటున్నాను. (ఆ ప్రాసెస్ లో) నాకు నచ్చిన ఈ మూడు పాటలని (ఒక ఐడియాతో) కలుపుతూ ఈ పోస్ట్ రాశాను.

      Delete
  4. 'ఘంటసాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్' అనే క్లచ్ నొక్కి కథకి గేర్లు మార్చేవాళ్ళు'
    'ఇంకెవరు పాడినా ఆ పాట ఏడిపించేట్లు ఉండదు. ఏడిసినట్లుంటుంది' .... SUPERB

    ReplyDelete
  5. అందరి మనోభావాలు గౌరవిస్తూ కూర్చోడానికి నువ్వేమన్నా కాంగ్రెస్ హై కమాండువా?

    super

    ReplyDelete
  6. పని లేని డాటేరు గారు,

    'ఆడలేడీసు' అనగా అర్థము ఏమిటి ?

    ఘంటసాల 'క్లచ్చాయణం' లో ఈ బ్రేకుల వేట ఏమిటి అంటారా ?,

    మీ చేత మరో టపా రాయిద్డా మని !)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      మా ఊళ్ళో ఒక విషయాన్ని బాగా "నొక్కి" వక్కాణించడానికి ఇట్లాంటి బహుభాషాపదాలు వాడుతుంటాం.

      సైడుపక్క, పేపర్ కాయితం, చదువుకునే స్టూడెంటు కుర్రాళ్ళు.. మచ్చుకు కొన్ని!

      Delete
    2. మంచి మాట సెలవిచ్చారు. మరి కొన్ని బహుభాషాపదాలు కలపండి లిష్టుపట్టీలో
      అగ్గినిప్పు
      గేటుగుమ్మం
      హోలుమొత్తం
      ఇంకా కొన్ని ఉన్నాయి కాని సమయానికి గుర్తుకు రావటం లేదండి.

      Delete
  7. "బ్లాగులున్నదే భజన చేసేందుకు"
    నేను చేస్తున్నదీ‌ అదే! ధన్యుడిని.. విషయం చెప్పి పుణ్యం కట్టుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య నేనో కొత్త టెక్నిక్ అవలంబిస్తున్నాను. ఎదుటివారు చెయ్యబోయే విమర్శని ముందే ఊహించేసుకుని.. అదేదో నన్ను నేనే అనేసుకుని.. వారికి పని తగ్గిస్తున్నాను.

      (ఇది మీకు అసలు వర్తించదు.)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. భిషగ్వరులకు విన్నపం. నేను చేస్తున్నానని చెప్పినది నా‌ శ్యామలీయం బ్లాగులో నేను చేస్తున్న రామభజన గురించి.

      Delete
  8. Replies
    1. అవును. ఈ సినిమాలో SVR నటన అద్భుతం.

      Delete

comments will be moderated, will take sometime to appear.