"అయాం సారీ! నేను వైజాగ్ రావట్లేదు." పొద్దున్నే మావాడి ఫోన్.
ఒక క్షణం మావాడు చెప్పేది అర్ధం కాలేదు. నా చిన్ననాటి స్నేహితులు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఎవరు ఇండియా వచ్చినా రోజంతా ఏదోక ఊళ్ళో.. ఓ హోటల్ రూంలో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తాం.
సిగరెట్లతో, సింగిల్ మాల్ట్ తో.. కబుర్లు నిరంతరంగా అలా సాగిపోతుంటాయి. అవొక అరాచక దుష్ట దుర్మార్గ వికృత నికృష్ట పిశాచాల శిఖరాగ్ర సమావేశాలు. ఇవి మా స్నేహబృందానికి అత్యంత ఇష్టం. ఇటువంటి పరమ పవిత్రమైన ప్రోగ్రాం ఒకటి రేపు వైజాగ్ లో ఉంది.
"నిన్నటిదాకా వస్తానని ఎగిరావుగా. అంతలోనే ఏం రోగమొచ్చింది?" కోపంగా అన్నాను.
"నిన్నటిదాకా వస్తానని ఎగిరావుగా. అంతలోనే ఏం రోగమొచ్చింది?" కోపంగా అన్నాను.
"అర్జంటుగా పనొకటి.. " నసిగాడు మా వాడు.
"నాకు తెలుసు. నీ భార్య వద్దనుంటుంది." నిష్టూరంగా అన్నాను.
"ఈ మధ్యనే గదా హైదరాబాదులో కలుసుకున్నారు. మళ్ళీ అంతలోనే ఎందుకని మా ఆవిడ అంటుంది." హత్యానేరం ఒప్పుకుంటున్న వాడిలా గొణిగాడు.
"అది ఆవిడ అభిప్రాయం. ఆవిడేమీ మనకి ప్రోగ్రాం డైరక్టర్ కాదు. నీ అభిప్రాయమేంటి? అది చెప్పు." గద్దించాను.
"మా ఆవిడని కాదని రావాలంటే నాకు భయంగా ఉంది." వణుకుతున్న కంఠంతో అన్నాడు మావాడు.
"అట్లా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదూ! ఒక పన్జెయ్యి. నీ భార్య మెళ్ళో మంగళ సూత్రం ఉంది కదా! దాన్ని నీ మెళ్ళో వేసుకో. పొద్దున్నే లేచి ఆవిడ కాళ్ళకి దణ్ణం పెట్టుకుని.. చీపురుతో వాకిలి చిమ్ముతూ 'ముత్యమంతా ఛాయ ముఖమంతా' అంటూ పాడుకో. ఆ తరవాత అంట్లు తోముకుంటూ తరించు." కసిగా అన్నాను.
"నువ్వలా అంటుంటే దిగులేస్తుంది. ఏదోక ఉపాయం ఆలోచించాలి.. " బేలగా అన్నాడు.
"చించకు. నువ్వు బాపు సినిమాలో సంగీతవి. విశ్వనాథ్ సినిమాలో జయప్రదవి. తాజ్ హోటల్లో కసబ్ వి." కర్కశంగా అన్నాను.
"ఏదోటి చెయ్యాలి. ఆలోచిస్తున్నాను." నీరసంగా అన్నాడు.
"అవును. తప్పకుండా చెయ్యాలి. నీ భార్య కాళ్ళ దగ్గర తోక ముడుచుకుని పడుకోవాలి!" అంటూ విసుగ్గా ఫోన్ కట్ చేశాను.
ఛీ.. ఛీ.. లోకంలో ఇట్లాంటి వెధవలు కూడా ఉంటారా! పనికిమాలిన సన్నాసి. ఇట్లాంటి దుష్టుల్ని దున్నపోతుల్తో కుమ్మించాలి. పూర్తిగా మూడాఫ్ అయిపొయింది.
ఇటువంటి సమయంలో.. మనశ్శాంతి కోసం యూట్యూబ్ లో పాత తెలుగు సినిమా పాటలు చూడటం నాకు అలవాటు, ఇష్టం. ఇప్పుడు ఒక మంచి పౌరాణిక చిత్రం పాట చూస్తాను. మరింత హాయిగా ఉంటుంది.
ఇంకెందుకాలస్యం? యూట్యూబ్ లోకి వెళ్లాను. నా అభిమాన నటుడు ఎన్టీఆర్. అన్నగారు! నమస్తే! నా అభిమాన గాయకుడు ఘంటసాల. మాస్టారు! మీకు పాదాభివందనం. ఏవిటబ్బా ఈ పాట? ఓహో! కృష్ణార్జున యుద్ధం. కె.వి.రెడ్డి కళాఖండం. కృష్ణుడి పాట. బాగుబాగు. ఇప్పుడే చూచెదను. ప్రశాంతత నొందెదను.
పాట చూస్తుంటే స్టార్ హోటల్లో పెసరట్టు తిన్నంత వికారంగా అనిపించింది. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుక పోయినట్లు.. ప్రశాంతత కోసం యూట్యూబ్ లో కెళితే.. అశాంతతతో మనసంతా అల్లకల్లోలమై పోయింది. కె.వి.రెడ్డి వంటి మహానుభావుడు కూడా ఇట్లాంటి పాటల్ని చిత్రీకరిస్తే ఇక మగవాడి మొర ఆలకించే వారెవరు?
అయినా ఈ కృష్ణుడి కిదేం బుద్ధి! పదహారు వేల మంది భార్యలున్నారు గదా. ఎవరోకరి ఇంటికెళ్ళి.. ఏ గుత్తొంకాయ కూరతోనో నాలుగు ముద్దలు తిని హాయిగా దుప్పటి కప్పుకుని బజ్జోవచ్చు గదా! తగుదునమ్మా అంటూ కిరీటాన్ని తన్నించుకున్నదే గాక.. సత్యభామ కాలు కందిపోయిందేమోనని ఆందోళన చెందుతున్నాడు. చూడబోతే మావాడి వంటి భార్యా బానిసలకి ఈ శ్రీకృష్ణుడే ఆది పురుషుని వలె గోచరించుచున్నాడు.
సర్లే! పొరబాటున ఓ పాట చూసితిని. అన్నీ అలాగే ఉండాలని లేదు. ఇప్పుడు ఇంకో విడియో చూసి సేద తీరెదను. ఎన్టీఆర్, ఘంటసాల కాంబినేషన్ గిట్టుబాటుగా లేదు. వీళ్ళని వదిలేసి వేరొకరి విడియో చూస్తే! నో.. నో.. అట్లా పార్టీలు మార్చడానికి నేనేమన్నా పొలిటీషియన్నా! కాదు గదా! అంచేత.. ఇంకొకటి చూద్దాం. కావున.. ఇంకో పాట..మళ్ళీ ఎన్టీఆర్, ఘంటసాల కాంబినేషన్ లోనే.
చచ్చితిని. ఈ పాటలో కూడా కృష్ణుడు మళ్ళీ సత్యభామతో కిరీటాన్ని తన్నించుకున్నాడు. దానికి తోడు పాట చివర్న నంది తిమ్మన 'పారిజాతాపహరణం' పద్యమొకటి! చిరాకేసింది. లాప్ టాప్ షట్ డౌన్ చేశాను. కాఫీ తాగుతూ.. ఆలోచించసాగాను. బుర్ర పనిచెయ్యడం మొదలెట్టింది.
ఈ భార్యలతో తన్నించుకోడంలో నాకు అర్ధం కాని మర్మమేదో దాగియున్నది. ఎన్టీఆర్ అంతటి వాడే ఒకసారి ఎస్.వరలక్ష్మి, ఇంకోసారి జమున.. కాళ్ళ దగ్గరకి చేరాడంటే.. నా అవగాహనలో లోపమేమన్నా ఉందా!
అందునా మావాడి భార్య గట్టిది. ఒకసారి పండక్కి పట్టుచీర కొన్లేదని ఉరేసుకోబోయింది. ఆవిడ స్థూలకాయురాలు కావున తాడు తెగి కిందబడింది గానీ.. లేకపోతే పోలీసుల చేతిలో మావాడి తాడు తెగేది! మావాడు అర్భకుడు. అమాయకుడు. వీధి కుక్కని చూస్తేనే వణికిపోతాడు. అట్లాంటిది.. భార్యకి ఎదురొడ్డి ఎలా పోరాడగలడు? అయ్యో! మిత్రమా! నీ సాధక బాధలు గుర్తించక ఎన్నేసి మాటలన్నాను! ఈ పాపిని క్షమించు.
ఇంతలో మావాడి ఫోన్.
"మిత్రమా! కాకిలా నీకు నూరేళ్ళాయుష్షు. నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నా. నువ్వు వైజాగ్ రావద్దులే. నీ సమస్య నాకర్ధమైంది. ఇందాక నోరు చేసుకున్నాను. సారీ!" అన్నాను.
"నువ్వెందుకు సారీ చెబుతున్నావో నాకర్ధం కావట్లేదు. నువ్వు నా కళ్ళు తెరిపించిన జ్ఞానివి. నువ్వా మాత్రం నన్ను తిట్టకపోతే.. జీవితంలో స్నేహితులతో కలిసి మందు కొట్టడాన్ని మించిన ధర్మం వేరేది లేదనే జ్ఞానోదయం నాకు అయ్యేది కాదు. నాకు పట్టుదల పెరిగేదే కాదు. అందుకే రోశయ్య లాంటి నేను రాజశేఖరరెడ్డిలా అయిపోయ్యాను. నా భార్యని ఒప్పించేశాను."
"నువ్వెందుకు సారీ చెబుతున్నావో నాకర్ధం కావట్లేదు. నువ్వు నా కళ్ళు తెరిపించిన జ్ఞానివి. నువ్వా మాత్రం నన్ను తిట్టకపోతే.. జీవితంలో స్నేహితులతో కలిసి మందు కొట్టడాన్ని మించిన ధర్మం వేరేది లేదనే జ్ఞానోదయం నాకు అయ్యేది కాదు. నాకు పట్టుదల పెరిగేదే కాదు. అందుకే రోశయ్య లాంటి నేను రాజశేఖరరెడ్డిలా అయిపోయ్యాను. నా భార్యని ఒప్పించేశాను."
"ఎలా?" ఆసక్తిగా అడిగాను.
"నీకు తెలుసుగా.. మా ఆవిడ నాగార్జున ఫ్యాన్. అంచేత కల్యాణ్ జ్యూయెలర్స్ లో హారం కొనిస్తానని ప్రామిస్ చేశాను. పనీపాట లేకుండా బేకార్ గా రోడ్లంట తిరిగే మా బావమరిదికి ఉద్యోగం చూపిస్తానని కూడా నొక్కి వక్కాణించాను. మన ప్రోగ్రాంకి పర్మిషన్ సంపాదించాను. నన్ను ఎంతో ప్రేమగా తిట్టి నా కళ్ళు తెరిపించావ్. నీకు థాంక్స్! మన వైజాగ్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా?" ఉత్సాహంగా అడిగాడు.
"జాగ్రత్త. ఇబ్బందుల్లో పడతావేమో!" హెచ్చరించాను.
"అయితే ఏంటంటా?" అంటూ ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి..
"గాడిద గుడ్డేం కాదు. అంతోటి చంద్రబాబే ఎడాపెడా వాగ్దానాలు చేసేస్తుంటే ఆఫ్టరాల్ నేనెంత? అప్పుడు సంగతి అప్పుడే చూసుకోవచ్చులే! ఇంతకీ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయో లేదో చెప్పలేదు." అన్నాడు.
"నిన్ననే అయ్యాయి. సాయంత్రం కలుద్దాం." అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాను.
అమ్మయ్య! ఇప్పుడు నా మనసు ప్రశాంతంగానే కాదు.. ఆనందంతో తుళ్ళితుళ్ళి పడుతుంది. ఉత్సాహంతో ఎగిరెగిరి పడుతుంది.
చివరితోక..
నాకు ఈ పోస్టులో ఉంచిన రెండు పాటలు చాలా ఇష్టం. ఆ ముక్క రాసి లింక్ ఇచ్చేసి ఊరుకొవచ్చు.
కానీ.. ఇంతలో ఎప్పుడో చూసిన లారల్ అండ్ హార్డీ మూవీ గుర్తొచ్చింది. తన భర్త ఆలివర్ హార్డి, స్టాన్ లారల్ తో తిరిగి చెడిపోతున్నాడని.. హార్డి భార్య అతన్ని బయటకి పోనివ్వకుండా కాపలా కాస్తుంది.
ఆ స్టోరీ ఐడియా.. కృష్ణుడి పాటలకి కలిపేసి సరదాగా రాసేశాను.
(photo courtesy : Google)
సిగరెట్లతో, సింగిల్ మాల్ట్ తో.. కబుర్లు నిరంతరంగా అలా సాగిపోతుంటాయి.
ReplyDeleteI like this.
i understand!
Deletehilarious
ReplyDeleteఇంతకీ మీరు మీ ఆవిడ పర్మిషన్ తీసుకున్నారా?
ReplyDeleteఇవన్నీ టాప్ సీక్రెట్స్. చెప్పరాదు.
Deleteనాకయితే ఎందుకో అవే రోజుల్లో, అదే ఊళ్ళో ముఖ్యమైన కాన్ఫరెన్సులు జరుగుతుంటయ్! చిత్రం.. అంతా దైవలీల!
I understand, thanks a lot.
DeleteSorry for the brief comment in English. I need to go an important conference :)
chaala bagundi
ReplyDeleteఅమ్మయ్య! ఇన్నాళ్ళకి అర్ధమయ్యేట్లు ఒక కామెంట్ రాశావు. థాంక్యూ!
Deleteకృష్ణుడు తన్నించుకున్నాడంటే ఆయనకి ఇంత లావు కిరీటం అడ్డు. మనకి కనీసం తలపాగా లేనా లేవు. జాగ్రత్త సుమండీ.......దహా.
ReplyDeleteనాపై అభిమానంతో జాగ్రత్తలు చెబుతున్నారు. ఎంతైనా మనం మనం ఒకటి! కృతజ్ఞతలు.
Deleteకూడలి, హారంల జాబితాలో ఈ టపా ఇలా కూడ అనిపించింది.
ReplyDelete"పని లేక దేవుడు చేసిన మనుషులు."
(just for fun)
హ.. హ.. హా!
Deleteఈ 'పని లేక.. ' వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొన్నటి టపా ఇలా కూడా అనిపించొచ్చు. పని లేక రేప్..
ROFL@నువ్వు బాపు సినిమాలో సంగీతవి. విశ్వనాథ్ సినిమాలో జయప్రదవి.
ReplyDeleteథాంక్యూ!
Deleteఇది మా స్నేహితుల్లో చాలా సాధారణమైన తిట్టు.
తన్నించుకున్నది కృష్ణుడు కాదండీ, NTR. మీకు తెలీదా?
ReplyDelete