Sunday, 27 January 2013

బి.చంద్రశేఖర్ జ్ఞాపకాలు



"చంద్రా! అర్జంటుగా నీ ఫొటో ఒకటి నాకు మెయిల్ చెయ్యి. ఇవ్వాళ నా బ్లాగులో నీగూర్చి రాస్తాను." ఉదయం పేపర్లో NHRC తీర్పు చదవంగాన్లే చంద్రశేఖర్‌కి ఫోన్ చేశాను.

"నువ్వు బజ్జీలు, సినిమాల గూర్చి సరదాగా రాస్తున్నావు. అలాగే కంటిన్యూ చెయ్యరాదా? నన్ను నీ స్నేహితుడిగా పరిచయం చేస్తే కొందరు రీడర్లు నీ బ్లాగుకి దూరమైపోతారు." నవ్వుతూ అన్నాడు.

"నా బ్లాగులో నా స్నేహితుడి గూర్చి రాసుకుందామనుకుంటున్నాను. ఏది రాయాలో, రాయకూడదో నాకు తెలుసు. నీ సలహా నాకనవసరం, మర్యాదగా నీ ఫోటో పంపించు." అన్నాను. 

"ఇప్పుడు ప్రెస్‌కి ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నా, మధ్యాహ్నం పంపిస్తా."

"నేనూ ఓపిలో బిజీగా ఉన్నాన్లే. ఈ లోపు వీలును బట్టి నీగూర్చి నాలుగు ముక్కలు రాస్తా."

అన్నట్లుగానే మధ్యాహ్నానికి కొన్ని ఫోటోలు మెయిల్ చేశాడు. నాకు నచ్చిన ఫోటో ఒకటి ప్రచురించాను.

నేను బాలగోపాల్ జ్ఞాపకాలు రాసినప్పుడు మరీ పొట్టిగా రాశానని విసుక్కున్నాడు. బాలగోపాల్, కన్నాభిరాన్ లు చంద్రాకి దేవుళ్ళతో సమానం. ఇప్పుడు తన గూర్చి రాసినప్పుడు ఇంకా పొట్టిగా రాశాను, కారణం సమయాభావం.

ఫోన్ చేసి చెప్పాను. పోస్ట్ పబ్లిష్ చేశానని, కాకపొతే మరీ చిన్నదిగా రాశానని.

"ఇంక చూసుకో! ఇన్నాళ్ళూ నువ్వొక డాక్టర్‌వని నిన్ను మర్యాదస్తుల లిస్టులో వేశారు, ఈ పోస్టు దెబ్బతో నువ్వు విలన్ల లిస్టులో చేరిపోతావు." అంటూ నవ్వాడు.

చంద్రశేఖర్‌పై నా బ్లాగులో విమర్శల వాన మొదలైంది. కొన్ని కామెంట్లు వ్యక్తిగత స్థాయిలో మరీ హీనంగా ఉన్నాయి. ఇది నాకు కొత్త, ఎలా రియాక్టవ్వాలో అర్ధం కాలేదు. చంద్రాకి ఫోన్ చేశాను, డిల్లీలో ఉన్నాట్ట.

"ఇప్పుడు నాకు NHRC చైర్మన్తో appointment ఉంది, ఔటర్ ఆఫీస్‌లో కూర్చునున్నాను." అంటూ హడావుడిగా ఓ నాలుగు లైన్ల రెస్పాన్స్ నా బ్లాగులో రాశాడు.

అటు తరవాత చంద్రాతో ఏదో మాటల సందర్భంలో అన్నాను.

"నా బ్లాగులో కొందరు నిన్ను ఘోరంగా తిట్టారు, వెరీ సారీ. ఆ కామెంట్లు డిలీట్ చేశాను."

"ఉంచేస్తే బాగుండేది. తిట్లు కూడా ఒక భావవ్యక్తీకరణే కదా! నాకయితే చంపేస్తామని కూడా లెటర్లు వస్తుంటాయి, పట్టించుకోను. ఆవోరకమైన లవ్ లెటర్లనుకుంటాను. నీకివన్నీ కొత్త, అందుకే నిన్నీ పోస్ట్ రాయొద్దన్నాను."

"కందకి లేని దురద కత్తిపీటకెందుకు? ఇన్నాళ్ళూ అనవసరంగా నీ గూర్చి ఫీలయ్యాను." నవ్వుతూ అన్నాను.

ఈ నెల రెండో తేదీనాడు కొద్దిసేపు గురజాడపై తను రాయబోతున్న పుస్తకం గూర్చి చెప్పాడు (ఆ వివరాలు ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ 'ఆదివారం అనుబంధం'లో రాశాడు).

చంద్రాలో నాకు నచ్చిందేమిటి? విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. తను చెప్పదలచుకున్న పాయింటుకి అనుకూలంగా రిఫరెన్సులు ఇస్తుంటాడు. సామాజిక, రాజకీయ అంశాల గూర్చి చక్కటి అవగాహన ఉంది. చాలా సీరియస్ అంశాల పట్ల కూడా జోక్స్ వేసే గొప్ప సెన్సాఫ్ హ్యూమరుంది.

చంద్రాలో నాకు నచ్చని అంశం? విషయాన్ని మరీ సీరియస్ గా తీసుకోవడం. చిలకలూరిపేట బస్ దహనం కేసు, చుండూరు దళితుల కేసుల సమయంలో చంద్రా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది. పుస్తకాలు, ఫైళ్ళ మధ్యలో దయ్యంలాగా పని చేసేవాడు (నేనే విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకొను).

చంద్రశేఖర్ వృత్తిపరంగా సాధించిన విజయాల పట్ల పత్రికలు రాస్తున్నాయి. నాకయితే వాటితో పెద్దగా సంబంధం లేదు. మాది దాదాపు ముప్పైయ్యేళ్ళ స్నేహం, పూర్తిగా వ్యక్తిగతం. నేను డాక్టర్నని, అతను లాయరని ఏనాడూ మాకు గుర్తుండేది కాదు. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.

చంద్రా! ఐ మిస్ యూ మేన్!

(fb post on 27/1/2018)

4 comments:

  1. థాంక్స్ రమణ గారు, శ్రీరామ రాజ్యం మళ్ళీ చదివాం, చంద్రగారికెందుకు నచ్చిందా అని :)

    ReplyDelete
  2. మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రమణ గారు. అంత మంచి మిత్రుడ్ని కోల్పోవడం ఎంత బాధకి గురిచేస్తుందో నాకు అనుభవ పూర్వకంగా తెలుసు.

    ReplyDelete
  3. రమణ గారు,

    ఈ రోజుల్లో కేన్సర్ వచ్చిన నయం చేస్తున్నారు కదా! కేన్సర్ ఉందని ముందుగా కనుక్కోలేదా?

    ReplyDelete
  4. మిత్రుల స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.