Monday 21 January 2013

అవే కళ్ళు!


భయంగా ఉంది. దడగా ఉంది. కాళ్ళల్లో వణుకు. అప్పటికీ భయమేసినప్పుడల్లా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాను. అయినా లాభం లేకపోతుంది. భీతి గొలిపే శబ్దాలతొ హాలంతా మారుమోగుతుంది. సినిమాలో ఎప్పుడు ఎవడు చస్తాడోనని టెన్షన్తో వణికి చస్తున్నాను.

అసలు ఇంట్లోనే ఉండిపోతే హాయిగా ఉండేది. నాకు బుద్ధి లేదు. హాయిగా రాము గాడితో గోళీలాట ఆడుకుంటే పొయ్యేది. నా సినిమా పిచ్చే నా కొంప ముంచింది.  పోయిపోయి ఈ భయానక సినిమాలోకొచ్చి పడ్డాను. 'హే భగవాన్! ఈ సినిమా తొందరగా అయిపోయేట్లు చెయ్యి తండ్రి!'

నాకు సినిమాలంటే వెర్రి అభిమానం. సినిమా హాల్ గేట్ దగ్గర టిక్కెట్లు చించే వాళ్ళు నా హీరోలు. వెనక బొక్కల్లోంచి సినిమా వేసే ప్రొజక్షనిస్టులు నా దృష్టిలో గొప్ప ఇంజనీర్లు. వాళ్ళని కళ్ళార్పకుండా ఎడ్మైరింగ్ గా చూసేవాడిని. ఇంచక్కా రోజూ సినిమా అన్ని ఆటలు ఫ్రీగా చూస్తున్న అదృష్టవంతులు వారు.. కొద్దిగా కుళ్ళుగా ఉండేది.

ఆ రోజుల్లోనే పెద్దయ్యాక సినిమా హాల్లోనే ఏదోక ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించేసుకున్నాను. అయితే ఎవరన్నా అడిగితే 'పెద్దయ్యాక డాక్టర్నవుతాను' అని గొప్ప కోసం అబద్దం చెప్పేవాడిని. ఏ ఉద్యోగం చేసినా.. ఎంత సంపాదించినా.. రోజుకి కనీసం మూడు సినిమాలు చూడాలని మాత్రం ఎప్పుడో డిసైడయిపొయ్యాను. జేబు నిండుగా డబ్బులుంచుకుని కూడా సినిమా చూడని ఈ పెద్దవాళ్ళు ఎంత అజ్ఞానులో కదా!

ఇంతటి సినిమా పిచ్చి గల నేను.. పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి సినిమా చూడ్డానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని మనవి చేసుకుంటున్నాను. రోజుకో సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని మా బ్రాడీపేట శివాలయంలో నుదుటిన అడ్డంగా విబూది రాసుకుని, ఎగ్గిరి గంట కొట్టి మరీ ప్రార్ధించేవాణ్ని.

దేవుడు దయామయుడు. బాలల పక్షపాతి. అందుకే నా సినిమా వీక్షక యజ్ఞం అవిచ్చిన్నంగా కొనసాగింది. అయితే అన్ని రోజులు మనవి కావు. నా జీవితంలో ఓ దుర్దినాన.. చిన్న మావయ్య, అన్నయ్య సినిమాకి బయలుదేరారు. మా బ్రాడీపేటలో గల ఏకైక సినిమా హాలు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్. అందులో ఏదో 'అవేకళ్ళు' అనే సినిమా అట. అందునా అది పంచ రంగుల చిత్రం. వదలివేయు నా తరమా! నేనూ బయల్దేరాను.

సినిమా అంతా రంగుల మయం. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడూ చూసే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తెల్లగా కనిపించే ఆకాశం ఇప్పుడు నీలంగానూ, నల్లగా కనబడే రక్తం ఎర్రగానూ కనిపిస్తుంటే.. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సినిమా సరదాగా మొదలైంది. కానీ క్రమేపి హత్యలతో సస్పెన్స్ గా మారిపోయింది. ఒక్కొక్క క్యారెక్టర్ చచ్చిపోసాగింది. సినిమా సరీగ్గా అర్ధమై చావట్లేదు గానీ.. బాగా భయం వెయ్యసాగింది.

ఉన్నట్లుండి సినిమా హాలు ఒక స్మశానంగానూ, ప్రేక్షకులంతా నన్ను పీక్కుదినబోయే రక్తపిశాచాల్లాగానూ కనిపించసాగారు. ఏమిటి నాకీ దుస్థితి? ఈ భీకర సినిమాలో ఇట్లా ఇరుక్కుపోయానేంటబ్బా! మొత్తానికి చివరకి హంతకుడెవరో తెలిసింది. (అందరూ అనుకున్నట్లు రాజనాల హంతకుడు కాదు.) ఆ హంతక విలన్ హీరో కృష్ణ చేతిలో చావను కూడా చచ్చాడు. ఇక్కడ భయంతో నేను చచ్చే చావు చస్తున్నాను. హాల్లో లైట్లేశారు. హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ హాల్లోంచి బయటపడ్డాను.

రాత్రి సరీగ్గా నిద్ర పట్టలేదు. పంచరంగుల సినిమా అని ముచ్చటపడ్డాను గానీ.. ఆ ఎర్రటి నెత్తురు గుర్తొస్తేనే భయమేస్తుంది. నిద్రలో ఒక పీడ కల. సినిమాలో కనిపించిన హంతకుడు నన్నూ చంపేశాడు. నా ఒళ్ళంతా ఒకటే నెత్తురు. ధారలుగా కారిపోతుంది. ఆ నెత్తురుతో పక్కంతా చల్లగా అయినట్లు అనిపించింది. ఆ తరవాత ఏమైందో గుర్తు లేదు!

తెల్లవారింది. ఎవరో అరుస్తున్నారు. ఎవరు చెప్మా? ఇంకెవరు? అక్క! ఎవర్నో తిడుతుంది. గుడ్లు నులుముకుంటూ, బాగా మెలకువ తెచ్చుకుని, కళ్ళు చిలికించి చూశాను. అక్క తిట్టేది ఎవర్నో కాదు. నన్నే! గదంతా బాత్రూం కంపు.

"అమ్మడూ! వాడి పక్కబట్టలు విడిగా ఒక బకెట్లో నానబెట్టవే. కనబడిన ప్రతి అడ్డమైన సినిమాకి పోవడం.. రాత్రుళ్ళు పక్క ఖరాబు చెయ్యడం. దొంగ గాడిద కొడుకు. ఆ ఉచ్చగుడ్డలు వాడితోనే ఉతికిస్తే గాని బుద్ధి రాదు." నాన్న ఎగురుతున్నాడు.

అమ్మ అన్నయ్యని కేకలేసింది. "చిన్నపిల్లల్ని అట్లాంటి సినిమాలకి ఎవరైనా తీసుకెళ్తారా? ఆ దరిద్రపుగొట్టు సినిమా చూసి బిడ్డ దడుచుకున్నాడు. పాపం! వాడు మాత్రం ఏం చేస్తాడు." అంటూ 'నేరం నాది కాదు.. సినిమాది' అని తేల్చేసింది.

సిగ్గుతో, లజ్జతో.. అవమాన భారంతో.. తేలు కుట్టిన దొంగవలె (దొంగలనే తేళ్ళు ఎందుకు కుడతాయో!) నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి నిష్క్రమించాను. ఇదీ నా 'అవేకళ్ళు' కథ. మిత్రులారా! ఇక్కడ దాకా చదువుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ కంటితోనే ఈ సూపర్ హిట్ సాంగ్ కూడా చూసి ఆనందించండి.

(

photo courtesy : Google)

9 comments:

  1. డాక్టర్ గారు,

    పోస్ట్ బాగుంది, సాంగు ఇంకా బాగుంది

    అయినా మీరు సావిత్రి ఫాన్స్, పాతకాలపు సినిమాలలో నాకైతే దేవికానే నాకు ఇష్టమైన హీరోయిన్.

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
    Replies
    1. ఈ పాట నాకు ఇష్టం. పాట కోసమే పోస్టు రాశాను.

      ఈ సినిమాకథ పోలికతో హిందీలో 'గుమ్ నామ్' అనే మనోజ్ కుమార్ సినిమా కూడా ఒకటి వచ్చింది.

      Delete
  2. రమణ గారు,
    ఉబలాటం కొద్దీ చిన్నప్పుడు చూసిన సి.ఐ.డి.రాజు,గుండెలు తీసిన మొనగాడు,బుల్లెమ్మాబుల్లొడు వగైరా సినిమాల్ని మరోసారి మీ blog ద్వారా గుర్తుతెచ్చుకున్నాము.ఇంతకీ పిల్లల్లో ఇలాంటి సినిమాలు చూడాలనె కోరికను మీ psycjology లో ఏమంటారో కూడా రాస్తే మేమూ నాలుగు ముక్కలు నేర్చుకుంటాము కదా.......

    ReplyDelete
    Replies
    1. ప్రతి మనిషి వినోదాన్ని ఇష్టపడతాడు. పిల్లలకది మరింత ఇష్టం. అంతకన్నా నాకూ తెలీదు.

      Delete
  3. ramesh babu gaaru,
    she's kanchana not devika.

    ReplyDelete
  4. ramana,
    it is nice have the fear rekindled once again by you by taking us
    think nearly 40 yrs back.keep writing and entertain us.
    pardhu

    ReplyDelete
  5. పార్ధు కూడా కామెంటెట్టాడు!!!కాంచన, ఆరోజుల్లోనే ఎయిర్ హోస్టెస్ గా ఎంచుకోబడిన అందమైన నటి! చాలామంది మనసుల్ని ఉర్రూతలూగించింది!!! సినిమా అంటే కాదు , లేదు, రాను అనని కొంతమందిలో నేను కూడా ఒకణ్ణి!! ఈపాట నాక్కూడా చాలాఇష్టమే! అందుకనే దీన్ని మా అలస్కా క్రూఇజ్ మెడ్లీలో ఇరికించాము...నువ్వు చూసావోలేదో!
    నిజంగా అంత భయపడ్డావా? నాకంత భయపడ్డట్టు గుర్తు లేదు! హోల్ మొత్తం కుటుంబంతో చూడ్డం మూలానేమో!

    గౌతం

    ReplyDelete
  6. పార్ధు కూడా కామెంటెట్టాడు!!!కాంచన, ఆరోజుల్లోనే ఎయిర్ హోస్టెస్ గా ఎంచుకోబడిన అందమైన నటి! చాలామంది మనసుల్ని ఉర్రూతలూగించింది!!! సినిమా అంటే కాదు , లేదు, రాను అనని కొంతమందిలో నేను కూడా ఒకణ్ణి!! ఈపాట నాక్కూడా చాలాఇష్టమే! అందుకనే దీన్ని మా అలస్కా క్రూఇజ్ మెడ్లీలో ఇరికించాము...నువ్వు చూసావోలేదో!
    నిజంగా అంత భయపడ్డావా? నాకంత భయపడ్డట్టు గుర్తు లేదు! హోల్ మొత్తం కుటుంబంతో చూడ్డం మూలానేమో!

    గౌతం

    ReplyDelete
  7. అన్వేషణ సినిమా కూడా నన్ను ఇలానే భయపెట్టింది

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.