"నాన్నతో చివరిసారిగా మాట్లాడాలనుకుంటే అర్జంటుగా హైదరాబాద్ బయలుదేరి వచ్చెయ్యి." రాత్రి ఎనిమిదింటికి శశాంక్ (చంద్ర కొడుకు) ఫోన్ వినంగాన్లే కాళ్ళూ, చేతులు వణికిపొయ్యాయి. విపరీతమైన anxiety కి గురయ్యాను.
ఆ రోజు నా భార్య జనరల్ హాస్పిటల్లో డ్యూటీ ఫిజీషియన్ గా నైట్ డ్యూటీలో ఉంది. పిల్లల్ని వదిలేసి అప్పటికప్పుడు బయల్దేరే అవకాశం లేదు. హైదరాబాద్ బయల్దేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను.
ఇంతలోనే మిత్రుల నుండి వరస ఫొన్లు. భారతి.. సాహితి.. 'చంద్ర సడన్ గా బేడ్ అయిపోయాట్ట. నిజమేనా?' అంటూ. కొద్దిసేపట్లోనే గోపరాజు రవి ఫోన్.. 'రమణా! చంద్రా ఈజ్ నో మోర్.'
మెదడు మొద్దుబారిపోయింది. అచేతన స్థితిలో అలాగే ఉండిపోయాను. కన్నీళ్ళు ధారగా కారిపోసాగాయి. పిల్లలు నన్నే చూస్తున్నారు. బెడ్రూంలోకి వెళ్లి విలపించాను. నా భార్య ఓదార్చసాగింది. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా నేనంతగా విలపించలేదు.
మానవుడికి పుట్టుక ఒక యాక్సిడెంట్. జీవనగమనంలో అనేకమందిని కలుస్తుంటాం. ఆ కలయికలన్నీ కూడా యాక్సిడెంట్లే! కొందరి స్నేహం హాయిగా ఉంటుంది. వారిలోని ప్రతిభ, కమిట్మెంట్, శక్తిసామర్ధ్యాల్ని చూస్తూంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ముచ్చటేస్తుంది. అటువంటి అరుదైన వారిలో నా మిత్రుడు భువనగిరి చంద్రశేఖర్ ఒకడు. నాలాంటి స్నేహితులకి 'చంద్ర'.
చంద్ర మనతో ఉంటే హుషారుగా ఉంటుంది. ఉత్తేజం కలుగుతుంది. చంద్ర ఓ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ వైర్. అందులో ఎల్లప్పుడూ కరెంట్ ప్రవహిస్తూనే ఉంటుంది. చాలా డైనమిక్ గా ఉంటాడు. అతని రూపం, మాట తీరు విలక్షణమైనది. మన కామిక్స్ లో సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉన్నారు. ఆ పరిభాషలో చంద్రని మేగ్నెట్ మ్యాన్ (అయస్కాంత మనిషి) అనవచ్చు.
చంద్ర నాకు ఎనభైలలో గోపరాజు రవి ఇంట్లో (ఆ రోజుల్లో ఆ ఇల్లు మా అడ్డా) పరిచయం. మా పరిచయం సిగరెట్లు, కాఫీలతో దినదినాభివృద్ధి చెందింది. చంద్రాకి రాజకీయంగా చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి.చంద్రా తన అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా, సూటిగా చెప్తాడు. ఒక్కోసారి చాలా తీవ్రంగా వాదిస్తాడు. అతను ఏం చెప్పినా చాలా నిజాయితీ ధ్వనిస్తుంది. అతని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. నేను చంద్రని అభిమానించడానికి అతనిలోని ఈ లక్షణం కూడా ఓ కారణం. అయితే.. ఈ లక్షణం కొందరికి ఇబ్బందిగా ఉండేది.
చంద్రా అప్పటికి లా స్టూడెంట్. అరండల్ పేట మేడపై ఒక చిన్న రూంలో ఉండేవాడు. అటు తరవాత అదే లైన్లో ఎదురుగా ఒక మూడు గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అందరి ప్లీడర్లకి లాగే ఇంటి ముందు గదిలో ఆఫీస్ ఉండేది. ఒక పాత టేబుల్, కుర్చీ, కొన్ని లా పుస్తకాలు. అదీ చంద్ర ఆఫీస్. అక్కడే బాలగోపాల్ తో నాకు పరిచయం. చాలాసార్లు బాలగోపాల్ బాత్రూంలో బట్టలు ఉతుక్కుని, గడ్డం చేసుకుని, స్నానం చేసేదాకా చంద్రతో కబుర్లు చెబుతుండేవాణ్ని.
అవి నేను పీజి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న రోజులు. ఒక డాక్టర్ గారి నర్స్ మూడో నెల గర్భంతో.. ఆయన ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకుంది. కేసులో డాక్టర్ గారు ప్రధాన నిందితుడు. ఆ పేద నర్స్ కుటుంబానికి చంద్ర ఎడ్వొకేట్. కేస్ ట్రయల్ కొచ్చింది.
ఒకరోజు తాలూకా ఎదురు టీ స్టాల్లో నేను, మా శరత్ (ఆ తర్వాత కాలంలో సైకియాట్రిస్ట్.. ఇప్పుడు లేడు) టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. నాకు కొద్దిగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ మాతో మాటలు కలిపి నెమ్మదిగా విషయం చెప్పాడు. ఆయన చంద్రకి లంచం ఇవ్వడానికి మమ్మల్ని వాడుకోదల్చుకున్నాడు. నాకు తరవాత తెలిసింది.. ఆ కేసులో చంద్రాని ప్రలోభ పెట్టడానికి అనేక ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని.
మనం ఎన్ని పుస్తకాలన్నా రాయొచ్చు. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ.. డబ్బు అవసరం ఉండి (డబ్బు వచ్చే అవకాశం ఉండి కూడా) డబ్బుని లెక్కజెయ్యనివాడు మహానుభావుడు అని నా అభిప్రాయం. ఆ సంఘటనతో చంద్ర నిజాయితీ నాకు అర్ధమైంది. కబుర్లు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు. ఆవేశంతో ఊగిపోతూ నీతులు వల్లె వేసి.. అదే పెట్టుబడిగా సొమ్ము సంపాదించుకున్న మేధావులు నాకు తెలుసు.
నా పెళ్ళిలో 'హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ' అనే ఒక పుస్తక దిండు నాకు ప్రెజంటేషన్ గా ఇచ్చాడు. 'ఈ పుస్తకం చదువు. మనం తరవాత చర్చించుకుందాం.' అన్నాడు. నా మిత్రుడు నన్ను నా పెళ్ళిలో కూడా ఎడ్యుకేట్ చెయ్యడానికి ప్రయత్నించాడు!
చంద్రలో కొందరికి యారోగెన్స్ కనిపిస్తుంది. కొందరికి ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఇంకొందరికి ధిక్కార ధోరణి కనిపిస్తుంది. నాకైతే ఆ లేత మొహంలో పిల్లతనపు చాయలు కూడా కనిపించేవి. ఇవన్నీ నిజాయితీపరుల లక్షణాలేమో! ఫలానా పోలీసు ఆఫీసర్ తనంటే భయపడి చచ్చాడని నవ్వుకుంటూ చెప్పేవాడు. 'జాగ్రత్త! ఏ చీకట్లోనో వెనక నుండి నీ బుర్ర రాంకీర్తన పాడిస్తాడు.' అనేవాణ్ణి.
చంద్రా చుండూరు కేసుతో వృత్తి రీత్యా ప్రసిద్ధుడయ్యాడు. అయితే ఈ చుండూరు కేసులో చంద్రా పడ్డ శ్రమ చాలా తీవ్రమైనది.. ఫిజికల్ గా, మెంటల్ గా కూడా. అతనికి ఈ కేసు ద్వారా వచ్చిన పేరుప్రతిష్టలు.. అతని శ్రమ, తపనతో పోలిస్తే అత్యల్పం అని నా అభిప్రాయం.
డబ్బుకి ఏమాత్రం లొంగని మొండిఘటం. అందుకే ఒక ఇల్లు పట్టనన్ని పుస్తకాలు కొన్నాడు కానీ.. ఒక సొంత ఇల్లు కూడా ఏర్పరుచుకోలేకపొయ్యాడు. మన సమాజం నిజాయితీపరుల పట్ల నిర్ధాక్షిణ్యంగా ఉంటుంది. అందుకే వారిని ఇబ్బందులు పెడుతుంది.
చంద్రా బాలగోపాల్ అభిమాని. బాలగోపాల్ పట్ల చాలా ఇష్టంగా, గొప్పగా మాట్లాడేవాడు. బాలగోపాల్ మరణం చంద్రాని ఎంతో కృంగదీసింది. ఆ తెల్లవార్లూ దుఃఖిస్తూనే ఉన్నాడు (ఈ సంగతి నాకు చంద్రిక చెప్పింది). అంతకు చాలా కాలం ముందే బాలగోపాల్ తో చంద్రా విబేధించి 'మానవ హక్కుల వేదిక' నుండి బయటకొచ్చేశాడు. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో తీవ్రంగా విమర్శించుకోడం జరుగుతుంది. కానీ చంద్రా ఒక మినహాయింపు.
చంద్రా కన్నాభిరాన్ గూర్చి చెబుతుంటే.. ఆ కళ్ళల్లో 'గ్లో' కనిపించేది. అతనికి కన్నాభిరాన్ అంటే భక్తి, భయం, ఆరాధన. వినేవాడికి ఓపికుండాలే గాని.. కన్నాభిరాన్ గూర్చి గంటల తరబడి చెబుతూనే ఉంటాడు. కన్నాభిరాన్ ప్రస్తావన లేకుండా చంద్ర గూర్చి ఎంత రాసినా అది అసంపూర్ణమే అని నా అభిప్రాయం.
ఓ సందర్భంలో త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసం గూర్చి చాలా నోస్టాల్జిక్ గా గుర్తు చేసుకున్నాడు. 'విరసం'తో విబేధం. త్రిపురనేని అంటే ఎనలేని గౌరవం! దటీజ్ చంద్రా!
ఆ మధ్య ఉరిశిక్షపై సాక్షి టీవీ వారి చర్చా కార్యక్రమంలో చంద్రాని చూశాను. తరవాత ఫోన్ చేశాను.
"చంద్రా! ఇప్పుడే టీవీలో చూశాను. సబ్జక్ట్ గూర్చి చెప్పేదేమీ లేదు. జుట్టు పెంచుకోడంలో నువ్వు బాలగోపాల్ తో పోటీ పడకు. అర్జంటుగా క్రాఫ్ చేయించుకో."
ఒక క్షణం చంద్రాకి నే చెప్పేది అర్ధం కాలేదు. తరవాత పెద్దగా నవ్వాడు.
చంద్రాతో నా స్నేహం పునశ్చరణ చేసుకుంటే నాకొక విషయం అర్ధమవుతుంది. మొదటి నుండి మా స్నేహం మా వృత్తులకి అతీతంగానే కొనసాగింది. అందుకే మా సంభాషణ ఎప్పుడూ కాజువల్ గానే ఉండేది. ఆయన్నొక గొప్ప ప్లీడరుగా నేనేనాడు అనుకోలేదు. నాకతను 'చంద్ర'. అంతే! నేనో సైకియాట్రీ స్పెషలిస్టుగా చంద్రా కూడా గుర్తించలేదు.. నన్ను 'రమణ' గానే భావించాడు (ఒకసారి ఏదో సందర్భంలో 'నీ వృత్తి ఒక గ్లోరిఫైడ్ భూతవైద్యం.' అని మాత్రం అన్నాడు.)
చంద్రా శవమై గుంటూరు తిరిగొచ్చాడు. 'చంద్రాకి సెకండరీస్ అన్న విషయం అక్టోబర్ ఎనిమిదినే తెలుసు.' అని చంద్రా గురువు ప్రొఫెసర్ A.సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆశ్చర్యపోయాను.
అంటే ఆ రోజు తరవాత.. చంద్రా ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలీకుండానే.. ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడాను. బహుశా అక్టోబర్ చివర్లో అనుకుంటాను. 'రాణి శివశంకర శర్మ గారు వచ్చారు. రాకూడదు? కబుర్లు చెప్పుకుందాం.' అన్నాడు. నాకు కుదర్లేదు.
డిసెంబర్లోనే ఒక అజ్ఞాత అగంతక ఫోన్ కాల్. ఎవడో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. "నాకు పిచ్చా? నాకు నిద్రమాత్రలిచ్చి చంపేస్తావా? నీ సంగతి తేలుస్తాను. దమ్ముంటే ఆస్పత్రిలోంచి బయటకి రా! ఇవ్వాళ నువ్వు నా చేతిలో.... " ఫోన్ కట్ చేశాను.
ఎవడో పేషంటనుకుంటాను. బాగా తెలిసిన గొంతే! నర్స్ ని పిలిచి రోడ్డు మీద ఎవడన్నా ఉన్నాడేమో చూడమని చెప్పబోతుండగా.. మళ్ళీ ఫోన్.
"ఏంటి రమణా! మరీ అంత భయపడ్డావ్? నా గొంతు కూడా గుర్తు పట్టలేకపొయ్యావే!" ఫోన్లో పెద్దగా నవ్వుతూ చంద్రా!
జనవరి మూడున ఫోన్ చేసి 'పదిహేనున గురజాడ సాహిత్యం పంపిస్తాను.' అన్నాడు. పంపలేదు. పదిహేడున ఫోన్ చేశాను.
నీరసంగా 'ఎవరు?' అన్నాడు.
'నువ్వు పంపిన గురజాడ సాహిత్యం అందింది. థాంక్స్!' వ్యంగ్యంగా అన్నాను.
కొడుకు శశాంక్ ఫోన్ అందుకుని 'నాన్నకి నడుం నొప్పి, వంట్లో బాగా లేదు.' అన్నాడు.
తరవాత పెద్దగా రాయడానికి ఏమీ లేదు. నాలాంటి ఎందరో స్నేహితుల్ని దుఃఖసాగరంలో ముంచేసి చంద్ర వెళ్లిపోయాడు.
భారతి మాటలు నన్ను కదిలించాయి.
"నువ్వు అదృష్ట వంతుడువి రమణా! చంద్రాని చివరి స్థితిలో నువ్వు చూళ్ళేదు. అతను సరదాగా కబుర్లు చెప్పడం మాత్రమే నీకు గుర్తుండిపోతుంది. ఐసీయూలో చంద్రాని చూసిన తరవాత.. డెడ్ బాడీ లోనే చంద్ర ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. మనందరికీ నవ్వుతూ, హడావుడిగా, సరదాగా కనిపించిన చంద్రా వేరు.. హాస్పిటల్లో నొప్పితో నరకయాతన పడుతూ.. జీవం లేని కళ్ళతో.. మైగాడ్! నిమ్స్ కి ఎందుకు వెళ్ళానా అనిపించింది."
యాభై వసంతాలు కూడా చూడకుండానే వెళ్ళిపొయ్యాడు చంద్ర. పౌరహక్కుల ఉద్యమ కర్తలు బాలగోపాల్, కన్నాభిరాన్, చంద్రశేఖర్.. స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించారు. వీళ్ళ మధ్య ఏదైనా సీక్రెట్ అవగాహన ఉందా!? వీరి నిష్క్రమణతో పౌరసమాజానికి మాత్రం చాలా ఘోరమైన నష్టం కలిగింది.
ఏంటి చంద్రా! ఎందుకింత హడావుడిగా వెళ్లిపోయ్యావ్? అన్నిట్లోనూ హడావుడేనా? నాకు ఏ ఇబ్బంది కలిగినా ముందు నీకే ఫోన్ చేశాను. నీ మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది. నువ్వు లేని ఈ ప్రపంచం చాలా వెలితిగా, ఇరుగ్గా ఉంది మిత్రమా! ఐ మిస్ యూ మై బాయ్!
'మీ ఇంగ్లీష్ వైద్యం ఒక బోగస్. ఇది ఒక వ్యవస్థీకృతమైన దోపిడీ. దీని మూలాలు... కొలనైజేషన్.. గ్లోబలైజేషన్.. అనార్కిజమ్.. మార్క్సిజం.. పోస్ట్ మోడర్నిజం.. ఏంటి మోడర్నిటి.. ఫ్రాయిడ్.. ఫూకు.. బౌమన్.. నీషే.. రస్సెల్.. ' హఠాత్తుగా మెళకువొచ్చింది.
అయ్యో! ఇదంతా కలా! ఇక నాకు చంద్రా కనిపించడా! వినిపించడా! ఈ కల నిజమైతే ఎంత బాగుణ్ను!
('Chandra' photos courtesy : బి.శశాంక్)
intha chesi chndra gari vayasu 50 data leda ? meeu me snehituduni chala ekkuva ga miss avutunnatlu unaru . Intha ki chandra garu kula tatvaniki vayithirekama ? tanu Brahma rikannai fallow ayyara ?
ReplyDeleteThough we, Suryam in 1981 and I in 1984 parted from you I've been frequently meeting you from 1995. We never discussed or met him...I feel you didn't introduce our replacement to us. wish you did!
ReplyDeleteమనం ఎన్ని పుస్తకాలన్నా రాయొచ్చు. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ.. డబ్బు అవసరం ఉండి (డబ్బు వచ్చే అవకాశం ఉండి కూడా) డబ్బుని లెక్కజెయ్యనివాడు మహానుభావుడు అని నా అభిప్రాయం.
ReplyDeleteనాది కూడా.
మీ స్నేహితుని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ
టపా బాగుంది. మీరెంత మంచివారండి. నా క్లాస్మేట్ కి మంచి మంచి గంధం బొమ్మ గిఫ్ట్ ఇవ్వాలని ఇస్కాన్ వాళ్ళ షాప్ కి వెళితే భగవద్గీత ఎటర్నల్ గిఫ్ట్ అని చెప్పి బాగా బ్రైన్వాష్ చేసి కొనిపించారు. అది కాస్త పెళ్ళికి వెళ్ళిన మా అందరి తరుపు బహుమతి అయ్యింది. గిఫ్ట్ పాక్లో ఏముందో తెలిసాక అందరు వింతగా చూసారు. పెళ్ళికొడుకు అయితే ఒక్కసారి కూడా దానిగురించి చెప్పలేదు. పెళ్ళికి భగవద్గీత కన్నా హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ ఇంకా గొప్పగా ఉంటుందా అని ఆలోచిస్తున్నా :)
ReplyDeleteఈ సారి పెళ్ళికి ఎవరు పిలుస్తారో :) :)
వాళ్ళిద్దరూ ముందు చనిపోవడం చంద్ర గారి పై ఇంకాస్త వత్తిడి పెంచింది. మీరు మనసు కష్టపెట్టుకోవడం వల్ల ఏమి రాదు.
ఎవరూ గుర్తు చేయకపోతే బాగుండుననుకుంటుంటే రోజూ ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రను మర్చిపోవడం బహుశా ఎవరికైనా కష్టమేనేమో!
ReplyDelete( గుంటూరు వచ్చినపుడు కలుద్దామనుకున్నాను. మీరు వచ్చారని తెలిసింది. ఫొటో చూస్తే సభలో చూసినట్టే అనిపిస్తోంది. నా ఉపన్యాసానికి దడుసుకుని మధ్యలోనే పారిపోయి ఉంటారనుకుంటున్నాను.)
రామ్మోహన్ గారు,
Deleteమొన్న రాణి శివశంకర శర్మ గారితో చాలసేపు మాట్లాడాను. ఆయనతో మాట్లాడిన విషయాల్లో కొన్ని టపాగా రాశాను (నిన్న ఆదివారం కావడం ఇంకో కారణం).
నేను సభకి వచ్చాను. మిమ్మల్ని కలవడం కూడా ఓ ఎజెండా. అయితే.. హాస్పిటల్లోంచి ఓ పెషంట్ పారిపొయ్యాడు. అంచేత హడావుడిగా కొద్దిసేపటికే వెళ్ళిపొయ్యాను.
నన్ను మీరు సభలో చూసే అవకాశం లేదు. నేను, పెనుగొండ లక్ష్మీనారాయణ ('అరసం' రాష్ట్ర అధ్యక్షుడు) కబుర్లు చెప్పుకుంటూ చివరి వరుసలో కూర్చునున్నాం.
స్పందించిన మిత్రులకి ధన్యవాదాలు.
ReplyDeleteచంద్రశేఖర్ గూర్చి పత్రికల్లో అనేక వ్యాసాలు వచ్చాయి. చంద్ర రచనలు పుస్తకాలుగా రాబోతున్నాయి. ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.
ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న వ్యాసాలకి భిన్నంగా.. ఈ పోస్ట్ పూర్తిగా ఒక స్నేహితుడి కోణం నుండి రాయబడింది.
చంద్ర ఆలోచన, ఆచరణ.. కాలంతో పాటే మారుతూ వచ్చింది. కొన్ని అభిప్రాయాలు పూర్తిగా U turn తీసుకున్నాయి.
ఈ మధ్య చాలాసార్లు రాణి శివశంకర శర్మ గారి (The Last Brahmin, Americanism ల రచయిత) అభిప్రాయాలని ప్రస్తావించాడు.. వాటితో ఏకీభవించాడు. అయితే.. వీటిని విశ్లేషించవలసి ఉంది.
మీ స్నేహితుడి జ్ఞాపకాలు, ఆలోచనలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇంతకన్నా ఏమి చెప్పాలో తెలియట్లేదు!! :-(
ReplyDeleteమంచి ఆర్టికల్.. మీ బ్లాగు లో ముందర మీరు రాసిన పోస్టులు చదివాకే నేను ఈయన గురించి.. చదవటం మొదలు పెట్టాను. అంతకు ముందు ఎవరో ఒక లాయర్ అన్నట్టు గా మాత్రమే తెలుసు. ( నా GK తక్కువే)
ReplyDeleteకొందరికి యారోగెన్స్ కనిపిస్తుంది. కొందరికి ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఇంకొందరికి ధిక్కార ధోరణి కనిపిస్తుంది. నాకైతే ఆ లేత మొహంలో పిల్లతనపు చాయలు కూడా కనిపించేవి. ఇవన్నీ నిజాయితీపరుల లక్షణాలేమో!
ReplyDeleteYes, TRUE
రమణ గారు మీ స్నేహితుడి గురించి చాల బాగా రాసారు. చంద్ర గారి అభిప్రాయాలతో, ఆలోచనతో n దృక్పదం తో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయన నిజాయితి ని అండ్ సింప్లిసిటీ ని ఎవరినా అబినందించి తీరుతారు. బ్రాడిపేట 4/7 సిండికేట్ బ్యాంకు ఎదురు రాము కొట్టు దగ్గర అప్పుడప్పుడు ప్రొద్దున సమయం లో చూస్తూ ఉండేవాడిని. కొట్టు లో ఉన్న ప్రతి దినపత్రికను అయన కొనడం చూసాను. ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైన తమ పంధాలోనే కొనసాగే వాళ్ళని చూస్తే ఒక రకమైన గౌరవం కలుగుతుంది. అదే వాళ్ళకి అలంకారం కూడా.
ReplyDeleteఎంత బాగా రాశారండి మీ మిత్రుడి గురించి, టపా చదివిన తరువాత చంద్రశెఖర్ గారు నాకు కూడా బాగా పరిచయమున్న వ్యక్తిలాగ అనిపించి కళ్ళనిండా నీళ్ళు వచ్చాయి, ఆ మహానుభావుని ఆత్మకు శాంతి కలగాలని కొరుకుంటూ.....
ReplyDelete-డా. రమేష్ బొబ్బిలి