Thursday, 14 February 2013

'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!


"గురు గారు! నాకు దిగులుగా ఉంది. ఈ మధ్య నా బ్రతుకు మరీ ఆఫ్ఘనిస్తాన్ లా అయిపోయింది."

"అంత కష్టమేమొచ్చి పడింది శిష్యా!"

"నా భార్య పోరు పడలేకున్నాను. ఆవిడకి నా సంపాదన చాలట్లేదుట."

"పోనీ నచ్చజెప్పి చూడకపొయ్యావా?"

"ఆన్నీ అయిపొయ్యాయండీ. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసింది. మీరు మరో శిష్యుణ్ణి వెతుక్కోండి. సెలవు."

"తొందరపడకు శిష్యా! నే చెంతనుండగా నీకు చింతనేలా? సంగీత చికిత్సతో నీ భార్యలో పరివర్తన కలిగిద్దాం."

"సంగీత చికిత్సా?!అంటే?"

"పాత తెలుగు సినిమాల్లో బోల్డన్ని మంచి పాటలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో పాటకి ఒక్కో రకమైన వైద్య గుణం ఉంటుంది. మొన్నొక నిద్ర లేమి రోగం వాడొచ్చాడు. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని 'నిదురపోరా తమ్ముడా.. ' పాట వినమని సలహా ఇచ్చా. అంతే! ఆ రోజు నుండి వాడు రాత్రింబవళ్ళు గురకలు పెట్టి మరీ నిద్రోతున్నాడు."

"నిజంగానా! నా భార్యకి మీ సంగీత వైద్యం పని చేస్తుందంటారా?"

"నిస్సందేహంగా. సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు. ఆడవారి మనసు కరిగించేందుకు ఒక మంచి పాట చెబ్తాను. అది చూపి నీ భార్యని నీకు చరణదాసిగా చేసుకో. ఈ విడియో చూడు."



"పాట చాలా బాగుందండి."

"ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో తిరుమల లడ్డంత తియ్యదనం ఉందోయి. సదాశివ బ్రహ్మం కవిత్వం కాకరకాయ వేపుడంత కమ్మగా ఉంటుంది. ఘంటసాల, లీలల గానంలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మల్టిప్లై అయ్యి అణుక్షిపణి వలే శక్తివంతమవుతాయి. ఆ క్షిపణి నీ భార్య చెవులో కర్ణభేరిని తాకి మెదడులో ప్రకంపనలు కలిగిస్తుంది. అంతే! కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా కరిగిపోతుంది. పిమ్మట నీ భార్య గుండమ్మకథలో సావిత్రంత అనుకూలవతిగా మారిపోతుంది."

"గురు గారు! ఈ పాటని నాగేశ్వర్రావు, సావిత్రి  పాడుకున్నారు. వాళ్ళు పాడిన పాట నా భార్యనెట్లా మారుస్తుంది?"

"చూడు శిష్యా! ఇక్కడ ఎవరు ఎవరి కోసం పాడారన్నది కాదు పాయింట్. పాటలోని కంపనలు, ప్రకంపనలు ముఖ్యం. మనసులోని భూతులు, అనుభూతులూ ప్రధానం. అందుకే గత యాభయ్యారేళ్ళుగా ఈ పాట తెలుగు వారిని మందు కొట్టకుండానే మత్తెక్కిస్తుంది."

"మీరు చెప్పేది సరీగ్గా అర్ధం కావట్లేదు గానీ.. వింటానికి బానే ఉంది. వర్కౌట్ అవుతుందంటారా?"

"నా సలహా గురి తప్పదు శిష్యా! అయితే ఒక కండిషన్. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము. విజయుడవై రమ్ము!"


           *                                *                                 *                            *

"గురు గారు! కొంప మునిగింది."

"ఏమిటి నాయనా ఆ కంగారు? సత్తుబొచ్చెకి సొట్టల్లా వంటి నిండా ఆ దెబ్బలేమిటి?"

"మీ సలహా విన్న ఫలితం. మీరు కొండ నాలుక్కి మందేశారు.. ఉన్న నాలుక పోయింది."

"తిన్నగా చెప్పి అఘోరించు శిష్యా!"

"మీరు చెప్పినట్లే నా భార్యకి 'ఓహో మేఘమాల.. ' విడియో చూపించాను. ఆవిడ ఆ పాట చూసి ఎంతగానో ఆనందించింది. మీ వైద్యం పంజేసిందని సంతోషించాను. సావిత్రి మెళ్ళో నాగేశ్వరరావు పెట్టిన హారం ఆవిడకి బాగా నచ్చిందిట. అదిప్పుడు అర్జంటుగా కావల్ట."

"అంత సొమ్ము నీ దగ్గరెక్కడిది?"

"నేనూ అదే సమాధానం చెప్పాను. 'సినిమాలో నాగేశ్వరరావు మాత్రం ఆ హారం కొని సావిత్రికి పెట్టాడా? కొట్టుకొచ్చిందేగా. ఆ మాత్రం నీకు చేత కాదా?' అంది."

"దొంగతనం మహాపాపం శిష్యా!"

"నేనూ ఆ ముక్కే అన్నాను. ఫలితంగా వంటి నిండా ఈ దెబ్బలు. హబ్బా! ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇప్పుడు నాకు దిక్కెవరు గురు గారు?"

"దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు నాయనా! అయినా.. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల! మొహం మీదే తలుపేస్తున్నందుకు ఏమీ అనుకోకు. అసలే చలికాలం. నాకు నిద్ర ముంచుకొస్తుంది."

"గురు గారు! గురు గారు.. "


(photos courtesy : Google)

9 comments:

  1. తన్నుటకు నీ భార్య యెవ్వరు? తన్నించుకొనుటకు నీవెవ్వరు? అంతా వాడి లీల!
    --------------------
    పోయి "జగమే మాయ" పాట పెట్టుకొని విను. మనస్సు శాంతిస్తుంది.

    ReplyDelete
  2. @కఠినమైన ఆమె మనసు క్వాలిటీ ఐస్ క్రీములా

    too much

    ReplyDelete
  3. నీ భార్యని ఇంటికి ఈశాన్యం మూలకి తీసుకెళ్ళి ఈ పాటని చూపించు. ఆ సమయంలో లాప్టాప్ తూర్పు దిక్కుకి తిప్పి ఉంచాలి. గుర్తుంచుకో. పొమ్ము.

    This is high lite of the post.

    ReplyDelete
  4. కంప్యూటరు స్క్రీను వాయవ్యం వైపు ఉండాలని చెప్పుండాల్సింది మిత్రమా!!! ఉత్త పాట వినిపించాలి కాని బొమ్మ కనపడకూడదని షరతు పెట్టి ఊండాలి.

    గౌతం

    ReplyDelete
    Replies
    1. గౌతం,

      దిక్కుల గూర్చి నీకున్నంత జ్ఞానం గురువుకి లేదు. అందుకే శిష్యుణ్ణి దిక్కు తోచని స్థితిలోకి నెట్టాడు.:)

      Delete
  5. చాలా బాగుంది ,చివర పంచ్ లైనుగా ఎదో మంచి పాట చెబుతావనుకున్నాను ,చెప్పలేదు చెప్పివుంటే బలరాం టీ స్టాల్ లో మలాయ్ చాయ్ తాగిన తరువాత వెలిగించిన్ పీల్చిన రెడ్ విల్స్ సిగరెట్ దమ్ము లా ఇంకా రసవంతరంగా ఉండేదేమో మిత్రమా

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకి గానూ ఓ వ్యాఖ్య రాసితివి. ధన్యవాదాలు.

      అవును. బాగుండేది. మన చాయ్, రెడ్ విల్స్ దమ్ము నీకింకా గుర్తున్నందుకు అభినందనలు.

      'ఓహో మేఘమాల.. ' పాట కొన్ని వందల సార్లు వినీవినీ.. పాట ఋణం తీర్చుకోడానికి ఈ పోస్ట్ రాశాను. పాట కోసం మాత్రమే రాసిన పోస్ట్ కావడంతో ఇంకే పాటని చేర్చదలచలేదు. అదీ సంగతి!

      Delete
  6. గాన వాస్తు వైద్య విరాట్ - డా. యరమణ - F.T.B.

    సంగీత వాస్తు నుపయోగించి అశరీరక రుగ్మతలు నయం చేయబడును

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.