Monday, 30 September 2013

'షావుకారు' చెంగయ్య మనస్తత్వం.. కొన్ని ఆలోచనలు


మంచి సినిమా అనగానేమి? దాని రంగు, రుచి, వాసన ఎట్లుండును? ఈ ప్రశ్నలకి నాకు తోచిన సమాధానం రాస్తాను. చాలాసార్లు ఒక సినిమాని casual గా చూట్టం మొదలెడతాం. కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మర్చిపోతాం. ఇంకొద్దిసేపటికి సినిమా కథలో పూర్తిగా engross అయిపోతాం. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాలు మన చుట్టూతా జరుగుతున్నట్లుగా ఉంటాయి. అంటే సన్నివేశాల్లో పాత్రల మధ్య (passive గా) మనం కూడా ఉంటాం. ఈ అనుభూతి కలిగించే ఏ సినిమా అయినా మంచి సినిమానే అవుతుంది. ఈ విషయంలో సలహా కోసం మనం సినీపండితుల వైపు చూడనవసరం లేదు.

నా దృష్టిలో మంచి సినిమా అంటే ఏంటో చెప్పాను కదా! ఈ నిర్వచనం ఫాలో అయితే విజయావారి 'షావుకారు' ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే.. ప్రశాంత నదీ తీరాన చెలి చెంతన ఫిల్టర్ కాఫీ తాగుతూ sweet nothings (అంటే చెలితో మాట్లాడేప్పుడు nothing is sweet అని అర్ధం కాదు) మాట్లాడుకున్నంత హాయిగా ఉంటుంది. ఒక పల్లెటూర్లో కొన్నిగంటలపాటు బస చేసిన భావన కూడా కలుగుతుంది. సినిమాలో కనబడే సహజ పల్లెవాతావరణం.. పాత్రలు, పాత్రధారుల ప్రతిభల గూర్చి చాలా రాయొచ్చు. ఇప్పుడంత ఓపిక లేదు కావున.. ప్రస్తుతానికి షావుకారు చెంగయ్యకి పరిమితమవుతాను.

చెంగయ్య షావుకారు. వడ్డీవ్యాపారం చేస్తూ చాలా డబ్బు కూడబెడతాడు (ఈ వడ్డీవ్యాపారం సర్వకాల సర్వావస్థల యందు గిట్టుబాటుగానే ఉంటుంది). చెంగయ్యకి పక్కింటి అమ్మాయి సుబ్బులు (షావుకారు జానకి) అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయం. ఒకరకంగా సుబ్బులు, చెంగయ్యలు స్నేహితులు కూడా (సుబ్బులు చెంగయ్యని ఆట పట్టిస్తుంటుంది). డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే చెంగయ్య.. సుబ్బులుకి బంగారు నగ బహుమతిగా ఇస్తాడు. ఇటువంటి దృశ్యాలతో చెంగయ్యకి సుబ్బులు పట్ల గల ప్రేమాభిమానాల్ని చక్కగా establish చేస్తాడు దర్శకుడు.


చెంగయ్య దగ్గర లౌక్యం కూడా బాగానే ఉంది. కాబట్టే సున్నం రంగడు (ఎస్వీరంగారావు), పంతులు (వంగర వెంకట సుబ్బయ్య) మాట కాదనలేకపోతున్నట్లుగా.. వరాలు (రేలంగి) తండ్రి శెట్టికి సత్రంలో అంగడి నడుపుకోడానికి మౌనంగా అంగీకరిస్తాడు. వాస్తవానికి సత్రంపై చెంగయ్యకి హక్కు లేదు. అది ఊరుమ్మడి. ఆ విషయం చెంగయ్యకి కూడా తెలుసు. సుబ్బులు తండ్రి రామయ్య (శ్రీవాత్సవ) ఆ నిజాన్నే సాక్ష్యంగా చెబుతాడు. అందుకు రామయ్యపై కక్ష పెట్టుకుంటాడు. సుబ్బులు అన్న నారాయణ (వల్లభజోశ్యుల శివరాం) తనపై నోరు చెసుకున్నందుకు అవమానంగా భావిస్తాడు. అందువల్ల తప్పుడు కేసు బనాయించి నారాయణని జైలు పాలు చేస్తాడు.

తను చేస్తున్నదని సరికాదనీ, తప్పు కూడాననే భావన చెంగయ్యని ఇబ్బంది పెడుతుంటుంది. చెంగయ్యలోని ఈ మంచిచెడుల conflict ని దర్శకుడు చాలా జాగ్రత్తగా maintain చేసుకుంటూ వస్తాడు. అందుకే తనలోని guilt feelings లోంచి బయటపడేందుకు.. జరుగుతున్నదానిలో తన తప్పేమీ లేదనీ, ఈ తతంగం మొత్తానికి రామయ్య, నారాయణల ప్రవర్తనే కారణం అనుకుంటూ.. rationalization చేసుకుంటాడు చెంగయ్య.

తీరా తన కొడుకు సత్యం (ఎన్టీరామారావు) కూడా చెయ్యని నేరానికి జైలు పాలయినందుకు తల్లడిల్లిపోతాడు. ఇక్కణ్నించి చెంగయ్యలో self introspection మొదలవుతుంది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు. అందుకే ఊరివాళ్ళతో మానసికంగా సంబంధాలు తెంచేసుకుని isolation కోరుకుంటాడు. తన అవసరం ఎవరికీ లేదనీ, తనకీ శాస్తి జరగవలసిందేనని self-reproach కి లోనవుతాడు. depressed state of mind ఉన్నవారిలో ఈ రకమైన ఆలోచన సహజం.


'దొంగలు వచ్చి చంపేస్తారు మామా!' అంటూ సుబ్బులు ఏడుస్తూ వచ్చి చెబుతుంది. తప్పించుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. తప్పు చేసిన తనకి శిక్ష పడవలసిందేనని భావిస్తాడు. అపరాధ భావంలోంచి బయటపడ్డానికి శిక్షకి మించిన పరిహారం మరొకటి లేదు. అందుకే బలవంతంగా సుబ్బులుని పంపేస్తాడు. చివరికి సుబ్బులు ప్రాణానికి ముప్పు ఏర్పడ్డప్పుడు మాత్రమే దొంగలకి తాళం చెవులు సంగతి చెబుతాడు. ఇవి షావుకారు చెంగయ్య వైపు నుండి కథలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు .

ఇంతకీ చెంగయ్య ఎవరు? 'షావుకారు' కథకి నాయకుడా? ప్రతినాయకుడా? రంగడు ద్వారా దొంగబంగారం కొంటాడు. కొడుకులాంటి నారాయణపై కక్షతో దొంగ సాక్ష్యం చెప్పాడు. అందువల్ల చెంగయ్య చెడ్డవాడే అయి ఉండాలి. మరైతే.. రామి (కనకం) దగ్గర చిన్నపిల్లాళ్ళా బావురుమంటాడెందుకు? కావున మంచివాడే అయ్యుంటాడు. అర్ధం కావట్లేదు కదూ?

ఏ మనిషీ పూర్తిగా మంచివాడుగానో, చెడ్డవాడు గానో ఉండడు. పరిస్థితుల బట్టి ప్రవర్తన ఉంటుంది. మంచి చెడ్డలూ మారుతుంటాయి. సుబ్బులుని చిన్నప్పట్నుండి ప్రేమగా పెంచిన చెంగయ్య చెడ్డవాడయ్యే అవకాశం లేదు. పిల్లల్ని, పుస్తకాల్ని ప్రేమించేవారు ఎప్పుడూ మంచివారే (ఈ అభిప్రాయం మాత్రం పూర్తిగా వ్యక్తిగతం.. biased కూడా).

రామయ్య సాక్ష్యం వల్ల తన పరువు పోయిందనే ఉక్రొశం, నారాయణ పెడ మాటల వల్ల కోపం తప్ప (చెంగయ్యది egocentric personality కాదుగానీ.. ఆ traits కొన్ని ఉన్నాయి).. చెంగయ్య మనసులో వేరే దుష్ట భావనలు ఉన్నట్లు తోచదు. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటాడు చెంగయ్య. ఏ క్షణంలోనైనా రామయ్య వచ్చి "ఏంటి బావా ఇదంతా?" అని ఒక చిన్న మాటన్నా జరిగిందంతా మర్చిపోదామన్న ఆత్రుతతో ఉన్నవాడిలా కూడా కనిపిస్తాడు. అయితే రామయ్య చెంగయ్యకి అంత అదృష్టం పట్టనివ్వడు!

నేను షావుకారు చెంగయ్య మనసు చదివేసినట్లు.. ఆయన తరఫున వకాలత్ పుచ్చుకున్నట్లు రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు చెంగయ్య మనసు చక్కగా అర్ధమైంది. ఇందుకు కారకులు ఇద్దరు. షావుకారు చెంగయ్య పాత్రని ఎల్వీప్రసాద్ అనే శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతమైన శిల్పంగా మలిస్తే.. గోవిందరాజుల సుబ్బారావు ప్రాణం పోశాడు. మహానటుడు ఎలా ఉంటాడు? అచ్చు గోవిందరాజుల సుబ్బారావులా ఉంటాడు!


అవును. గోవిందరాజుల సుబ్బారావు మహానటుడే! కన్యాశుల్కంలో నశ్యం పీల్చుకుంటూ, జంధ్యం సరిచేసుకుంటూ లుబ్దావధానులుగా ఒక పరమలోభిని మనముందు ఆవిష్కరించాడు (గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!). ఇప్పుడీ షావుకారు సినిమాలో సంక్లిష్టమైన చెంగయ్యని మనముందు నిలబెట్టాడు. ఒక పాత్రకి.. ఆ పాత్ర గుణగణాలని దుస్తులుగా తొడిగి.. పాత్రోచితంగా ప్రవర్తిస్తూ.. మనని కథలో లీనమయ్యేట్లు చెయ్యడమే ఒక మంచి నటుడి బాధ్యత. ఆ బాధ్యతని అత్యంత ప్రతిభావంతంగా నెరవేర్చేవాడే మహానటుడు.

నాకీ మధ్య ఒక అనుమానం పట్టుకుంది. నాకు పాతతరం నటుల ప్రతిభ సరీగ్గా తెలీదు. ఏ అంచనా లేకుండా ఒక సినిమా చూస్తాను. ఆ సినిమా బాగా నచ్చుతుంది. నటీనటులు ఇంకా బాగా నచ్చుతారు. అంచేత ఆ సినిమానీ. నటుల్నీ ఆకాశానికెత్తేస్తూ రాసేస్తున్నానా? అని. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి మొదలైన నటుల విషయంలో నాలో ఈ surprise element  పనిచేసిందా?

కావున నేను ఇకనుండి ఏ నటుడికైనా మార్కులు వేసేప్పుడు పిసినిగొట్టుగా వ్యవహరించవలసిందేనని నిర్ణయించుకున్నాను. షావుకారు సినిమా నచ్చింది. చెంగయ్య పాత్రధారణ చాలా బాగా నచ్చింది. కానీ.. ఇకపై ఇట్లాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతీ గుర్తుంది. అంచేత సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు అభినయాన్ని లెక్కల మేస్టర్లా గుచ్చిగుచ్చి చూస్తూ.. చూశాను.

అయితే 'షావుకారు'ని ఇలా చూడ్డం వల్ల నాకు ఒక నష్టం కలిగింది. చెంగయ్య సుబ్బులుపై వాత్సల్యం కురిపిస్తున్నప్పుడు (సుబ్బులు నా బంగారుకొండ).. రామయ్య ఖచ్చితమైన సాక్ష్యం చెప్పి చెంగయ్య పరువు తీసినప్పుడు (ఏం? ఆమాత్రం నాకు మాట సాయం చెయ్యడా?).. నారాయణ చెంగయ్యపై నోరు పారేసుకుంటున్నప్పుడు (నా కళ్ళ ముందే పెరిగాడు.. వెధవకి ఎంత అహంకారం?).. చెంగయ్య కలిగిన భావాలన్నీ నాక్కూడా కలిగినయ్.

కొడుకు తనని అసహ్యించుకున్నప్పుడు.. 'అనవసరంగా పట్టుదలకి పోయి స్నేహితుని కుటుంబాన్ని కష్టాలు పెట్టానే' అనే అపరాధ భావంతో చెంగయ్య దహించుకుపోతున్నప్పుడు నాక్కూడా బాధగా అనిపించింది. అందుకే ఆయన రామి దగ్గర భోరున విలపించినప్పుడు నాక్కూడా కన్నీరు ఆగలేదు (నేనెందుకిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను? ఇందర్ని ఏడిపించి ఏం బావుకుందామని? ఏమిటీ నాకీ ఖర్మ?).


ఇలా సినిమా అంతా నన్ను తనతో పాటు ప్రతి సన్నివేశంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఎంతో ఉద్వేగానికి గురిచేశాడు గోవిందరాజుల సుబ్బారావు. ఒక ప్రేక్షకునికి ఇంత అనుభూతిని కలిగించడం ఒక గొప్ప నటుడి ప్రతిభకి తార్కాణం అని అనుకుంటున్నాను. కావున షావుకారు చెంగయ్య పాత్రపోషణ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటనకి కొండగుర్తుగా భావిస్తున్నాను.

ఇప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు పల్లెటూరు వాతావరణం తెలీదు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెజీవితాన్ని అనుభవించి ఎరుగను. వ్యవసాయం తెలీదు. వడ్డీవ్యాపారం అంటే అసలే తెలీదు. అయినా నేను చెంగయ్యతో పూర్తిగా empathize అయ్యాను. (సరీగ్గా ఇలాగే ఫీలవుతూ గుండమ్మ తరఫున 'సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ' రాశాను). కారణం? నేను ప్రధానపాత్రతో identify అయ్యేలా చెయ్యటం అనేది దర్శకుడి ప్రతిభ, నటుడి గొప్పదనం. మంచి సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి కూడా.

ఒక మంచినటుడికి మంచివాడిగానో, చెడ్డవాడిగానో నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు (నటన తెలీనివాడికి ఏదైనా కష్టమే). అటు మంచీ కాకుండా, ఇటు చెడూ కాకుండా.. సందర్భాన్ని బట్టి react అయ్యే 'మామూలు మనిషి'గా different shades చూపిస్తూ నటించాలంటే మాత్రం అసాధారణ ప్రతిభ కావాలి. ఈ ప్రతిభ గోవిందరాజుల సుబ్బారావు దగ్గర పుష్కలంగా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన తరవాత నాకనిపించింది.. గోవిందరాజుల సుబ్బారావు నటన ఒక అద్భుతమైన పూలతోట వంటిది. ఈ తోటకి అనేక ద్వారాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఒక ద్వారం.. షావుకారు ఇంకో ద్వారం. ఆ తోటలో ఒక్కో ద్వారం నుండి వెళ్తే ఒక్కోరకమైన పూలు.. అన్నిరకాల పూలూ చూడ్డానికే కాదు.. ఆఘ్రూణించడానిక్కూడా భేషుగ్గా ఉంటాయి.

సందేహం లేదు - ఈ గోవిందరాజుల సుబ్బారావు గొప్ప నటయోధుడు. ఆయన అసమాన నటనా ప్రతిభకి గులామునైపోయి సలాము చేస్తున్నాను.

(photos courtesy : Google)

Sunday, 22 September 2013

మానసిక రోగులూ మనుషులే


'ఫలానా నాయకుడికి పిచ్చెక్కింది.'

'ఫలానా నాయకుడిని పిచ్చాసుపత్రిలో చేర్పించి మా ఖర్చుతో వైద్యం చేయిస్తాం.'

ఈ మధ్య కొందరు రాజకీయ నాయకుల భాషలో ఇలాంటి కొత్త 'తిట్లు' వచ్చి చేరాయి. ఇంకొందరు ఒకడుగు ముందుకెళ్ళి ప్రభుత్వాసుపత్రిలోని మానసిక వైద్య విభాగాధిపతికి 'ఫలానా నాయకుడికి మానసిక వైద్యం అవసరం' అంటూ మీడియా సాక్షిగా వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు!

ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దుర్మార్గమైన ధోరణి. మానసిక రోగులు నేరస్థులు కాదు. బీపీ, షుగర్ పేషంట్ల లాగా సైకియాట్రీ పేషంట్లు కూడా ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. మానసిక వైద్యం అనేది వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బు వస్తుంది. మానసిక జబ్బులు మెదడులో కల న్యూరోట్రాన్మిటర్లలో సంభవించే రసాయన మార్పుల వల్ల వస్తున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు. విజ్ఞత కలిగిన వారెవరైనా మానసిక వైద్యం చేయించుకుంటున్న వారి పట్ల సానుభూతిగానే ఉంటారు. మరి మన పొలిటికల్ సెక్షన్‌కి మానసిక రోగుల పట్ల ఎందుకింత పరిహాసం? ఎందుకింత బాధ్యతా రాహిత్యం? ఇది వారి అవగాహన లోపమా? లేక నిర్లక్ష్యమా? 

అసలే మన దేశంలో మానసిక రోగాల పట్ల అవగాహన తక్కువ. సామాన్య ప్రజలు ఈ రోజుకీ దెయ్యాలు, భూతాలు, చేతబడి వంటి నమ్మకాలతో తమ విలువైన సమయాన్ని, డబ్బుని నష్టపోతున్నారు. మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే సమాజం తమని 'పిచ్చివాడు' అనే ముద్ర వేస్తుందేమోనని భయపడుతున్నారు.

అందుకే ఏపీ సైకియాట్రిక్ అసోసియేషన్ మానసిక వైద్యం పట్ల ప్రజల అవగాహన మెరుగు పరచడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మానసిక వైద్యులు కూడా ఈ రంగంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. తద్వారా ఇప్పుడిప్పుడే సామాన్య ప్రజలలో అవగాహన కొంత మెరుగవుతుంది.

మన నాయకులు మాత్రం తమ రాజకీయ భాషలో 'పిచ్చి', 'పిచ్చెక్కింది' వంటి అనాగరిక పదాలు వాడుతూ సమాజానికి నష్టం చేకూరుస్తున్నారు. ఈ రకమైన 'పిచ్చి' భాష మానసిక వైద్యం పొందుతున్న వారికి ఆవేదన కలిగిస్తుంది. ఈ భాష ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకి విరుద్ధం కూడా. కావున ఇట్లాంటి భాష మాట్లాడకుండా కఠినమైన నిబంధనలు విధించడమే కాకుండా... ఇలా మాట్లాడ్డం నేరంగా పరిగణించేలా కూడా వెంటనే చట్టంలో మార్పు తేవాలి.

- యడవల్లి రమణ

(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో పబ్లిష్ అయ్యింది)

(picture courtesy : Google)

Wednesday, 18 September 2013

ఎండే డొక్కల ఘోష



మిత్రులారా! గత నెల రోజులుగా సీమాంధ్ర వార్తాపత్రికలు (ఇప్పుడు పత్రికలు ప్రాంతాల వారిగా ఎడిషన్లు వేస్తున్నాయి), సీమాంధ్ర చానెళ్ళు (ఇక్కడ cable network వాళ్ళు తెలంగాణా వార్తలు చూపించే టీవీ చానెళ్ళని తీసేశారు) చూసిన మీదట ఎంతో విజ్ఞానవంతుడినయ్యాను.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాదులో చార్మినార్, గోల్కొండ మాత్రమే ఉండేవి. ఆ ఊరంతా రాళ్ళూరప్పలు, కొండలు గుట్టలు. అట్లాంటి దిక్కుమాలిన హైదరాబాదును మన సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు అహోరాత్రులు కష్టించి, శ్రమించి (తమతమ నియోజక వర్గాల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ) ఎంతగానో అభివృద్ధి చేశారు.

మనం సినిమా స్టూడియోలు కట్టాం, IMAX సినిమా హాళ్ళు కట్టాం, నెక్లెస్ రోడ్డు నిర్మించాం.. ఇలా ఎన్నని చెప్పను? తినటానికి తిండి కూడా లేని తెలంగాణా వాళ్లకి KFC రుచి కూడా చూపించాం. తెలంగాణా నాయకులు కృతజ్ఞత లేనివారు. అందుకే అభివృద్ధి అంతా అయ్యేదాకా వేచి చూసి.. ఇవ్వాళ మనని వెళ్లిపొమ్మంటున్నారు. ఎంత అన్యాయం! ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? కుదరదు. కుదరదు కాక కుదరదు. నేను సైతం.. నేను సైతం సమైక్యాంధ్రకి సమిధ నౌతాను.

ఇవ్వాళ మా ఊళ్ళో 'మండే గుండెల ఘోష' ఏర్పాటయ్యింది. మండే గుండె అంటే హార్ట్ ఎటాక్ అనుకునేరు! కాదు.. కోపంతో గుండె మండుతుంది అని అర్ధం. సమైక్యాంధ్ర కోసం మొక్కవోని దీక్షతో పోరాడుతున్న, అలుపెరుగని ప్రజానాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన మన తెలుగు వాడవటం మనం చేసుకున్న అదృష్టం. ఇవ్వాళ సభకి ఆయన కూడా వస్తున్నాట్ట. అంతటి గొప్పనాయకుణ్ణి దర్శించుకునే భాగ్యం జీవితంలో నాకింత తొందరగా వస్తుందనుకోలేదు. ఏమి నా భాగ్యము!

'తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది' అని పాడుకుంటూ.. ఆత్రంగా, హడావుడిగా, వడివడిగా మండే గుండెల ఘోష సభ వద్దకి వెళ్లాను. అక్కడ విపరీతంగా జనం ఉన్నారు. వేదిక మరీ చిన్నదిగా ఉంది. కళ్ళజోడు మర్చిపోయ్యాను. సరీగ్గా కనపడి చావట్లేదు. కొద్దిగా ముందుకెళ్తాను. ఇక్కడ జనాలందరూ బక్కగా, పీలగా ఉన్నారు. పాపం! హైదరాబాదు పోతుందేమోనన్న బాధలో వీరంతా ఆహారం మానేసినట్లున్నారు.

తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! మీ సమైక్య స్పూర్తికి నా కడుపు తరుక్కుపోతుంది. మీ కోరిక నెరవేరుతుంది. మీ కష్టాలు ఈడేరుతాయి. ఏడవకండేవకండి.. చింత యేల? మన చెంత ముఖ్యమంత్రి ఉన్నాడు, గజల్ శ్రీనివాస్ ఉన్నాడు, పరకాల ప్రభాకర్ ఉన్నాడు, అశోక్ బాబు ఉన్నాడు.

వేదిక ఇంకా సరీగ్గా కనపడి ఛావట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అబ్బా! ఏమిటీ బీద వాసన? ఛీ.. ఛీ.. ఇదేదో ఆకలి కంపులా ఉందే! అందుకే చాలా రోతగా ఉంది. ఎంత హైదరాబాదు కోసం అయినా.. ఇంత దరిద్రపుగొట్టు వాతావరణాన్ని తట్టుకోడం నా వల్ల కావట్లేదు. వేదికపై ఎవడో బక్కచిక్కిన నాయకుడు ఆవేశంగా ఉపన్యాసం చెబుతున్నాడు. వేదికపై నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ లేడేమిటి? కొంపదీసి ఆయన ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయాడా ఏమిటి? అయ్యో! ఏమి నా దౌర్భాగ్యం!

అప్పుడు పడింది నా దృష్టి వేదికపైనున్న banner పై. ఆ banner పై 'మండే గుండెల ఘోష' అని లేదు. 'ఎండే డొక్కల ఘోష' అని రాసి ఉంది. సభ పేరు మార్చారా? ఖర్మ.. ఖర్మ. అడ్రెస్ సరీగ్గా తెలుసుకోకుండా వస్తే ఇదే తంటా.

పక్కనున్న చింకిపాతరగాణ్ని అడిగాను.

"ఇది సమైక్యాంధ్ర సభ కాదా?"

వాడు నావైపు నీరసంగా చూశాడు.

"బాబూ! అన్నం తిని చాల్రోజులయ్యింది. నీరసంతో చచ్చేట్లున్నాను. ప్రభుత్వానికి మా ఘోష వినిపించరూ?"

"ఆ సంగతి తర్వాత చూద్దాంలే. ముందు నేనడిగిందానికి సమాధానం చెప్పు. ఇది సమైక్యాంధ్ర సభ కాదా?" మళ్ళీ అడిగాను.

"కాదు బాబు! కాదు. ఇది 'ఎండే డొక్కల ఘోష' సభ. మా సభలో రైతులున్నారు. రైతు కూలీలున్నారు. ఈ సభని మేం సంవత్సరం పొడుగూతా జరుపుకుంటూనే ఉంటాం. కాకపొతే మీడియావాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు." అన్నాడు.

"సర్లే! మీరెందుకు సభ జరుపుకుంటే నాకెందుకు? ఇంతకీ గుండె మంట ఘోష సభ ఎక్కడ?" విసుగ్గా అడిగాను.

నేనడిగిన ప్రశ్న ఆ బక్క వెధవకి నచ్చినట్లు లేదు. కొద్దిసేపు ఆలోచించాడు. ఆ తరవాత నీరసంగా నవ్వాడు.

"బాబూ! నా కుటుంబం వీధిన పడ్డానికి కారణం ఎవరనుకుంటున్నావు? ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు, డాక్టర్లు. వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. ఏ యేటికా యేడు రెక్కలు ముక్కలవుతున్నాయే గానీ రూపాయి రాబడి లేదు. రైతు పని పూర్తిగా అయిపొయింది బాబు. అందుకే నా కొడుక్కి నా గతి పట్టకూడదనుకున్నాను. అప్పు చేసి మరీ వాణ్ని ప్రైవేటు స్కూల్లో చదివించాను. స్కూలువాళ్ళు పరీక్షలనీ, పుస్తకాలనీ వాయిదాల పద్ధతిలో వేలకివేలు వసూలు చేశారు బాబు."

ఎవడు వీడు? కొంపదీసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బ తియ్యడానికి కోదండరాం పంపించిన గూఢచారి కాదు గదా?

చింకిపాతర చెబుతూనే ఉంది.

"నాది పాడు జన్మ బాబు! నాలాంటోడు పుట్టినప్పుడే చావాల. దరిద్రం వదిలిపోద్ది. పోయినేడాది నా కొడుక్కి జరం వచ్చింది. అదేదో డెంగూ జరమన్నారు. బిల్లు లక్ష రూపాయలైంది. ఉన్న ఒక్క ఎకరవూ అయినకాడికి అమ్మేసి ఆస్పత్రి ఫీజులు కట్టా. ఒక్క ఎయ్యి రూపాయలైనా తగ్గించమని డాక్టర్ల కాళ్ళ మీద పడ్డా. కసాయోడికైనా జాలి గుండె ఉంటదేమో గానీ.. డాక్టర్లకి ఉండదని అర్ధమైంది. అన్నీ పొయ్యి ఇదిగో ఇలా ఒట్టి మనుషులం మిగిలాం బాబు!" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

వీడెవడో తలతిక్క వెధవలా ఉన్నాడు. నేనదిగిందేమిటి? వీడు చెప్పేదేమిటి?

"సమైక్యాంధ్ర సభ ఎక్కడ?" అసహనంగా, తీవ్రంగా అడిగాను.

ఆతను హఠాత్తుగా ఎర్రటి కళ్ళతో నన్ను చూశాడు.

"నా కొడుకు చదివిన స్కూల్ ఓనరు, అతని స్నేహితులైన ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు.. నా కొడుక్కి వైద్యం చేసిన డాక్టర్లు ఆ పక్క వీధిలో పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన సభ పెట్టుకున్నారు. అదేదో గుండె మంటంట. అటుగా పో!" ఈసడించుకున్నట్లుగా అన్నాడు వాడు.

నాక్కోపమొచ్చింది. గాలొస్తె ఎగిరిపోయ్యేట్లు ఉన్నాడు. వీడికెంత రోషం! దౌర్భాగ్యుడు. అందుకే తినడానికి తిండి కూడా లేకుండా ఛస్తున్నాడు. అయినా ఈ అలగా వెధవని పట్టించుకునేదెవరు?

నేను నా 'మండే గుండెల ఘోష సభ' కోసం పరుగుపరుగున బయల్దేరాను.. ఆలస్యమైతే నా అభిమాన నాయకుడు పరకాల ప్రభాకర్ ఉపన్యాసం తప్పిపోతానేమోనన్న ఆదుర్దాతో!

(picture courtesy : Google)

Tuesday, 17 September 2013

వాహిని వారి 'పెద్దమనుషులు'.. నా పన్లేని పనులు

సృష్టిలోని సమస్త జంతుజాలంలో మనిషే తెలివైన జంతువని అంటారు. ఈ మనిషి రోజువారీగా చాలా పనులు చేస్తుంటాడు. వీటిలో కొన్ని పనికొచ్చే పనులు. ఎక్కువగా పన్లేని పనులు. ఈ పన్లేని పనుల్లో సినిమా చూట్టం కూడా ఒకటని కొందరి అభిప్రాయం. మరెందుకో కొందరు పనిగట్టుకుని ఆ పన్లేని పనే చేస్తారు. ఆనక పనికిమాలిన సినిమా చూశామని బావురుమంటారు. వీరు దౌర్భాగ్యులు. ఈ దౌర్భాగ్యుల్లో నేను కూడా ఒకణ్నన్న సంగతి వాహినీ వారి 'పెద్దమనుషులు' అనే సినిమా చూసినప్పుడే నాకు తెలిసింది.

'పెద్దమనుషులు'. నా చిన్నప్పుడు ఈ సినిమా గూర్చి కొందరు సినీజీవులు గొప్పగా చెప్పగా విన్నాను. అలా చెప్పిన వాళ్ళెవరూ ఈ సినిమా సరీగ్గా చూళ్ళేదనే అనుమానం ఇప్పుడు నన్ను పీడిస్తుంది. ఈ సినిమా 1954 లో రిలీజయ్యింది. అప్పటికి మన తెలుగువాళ్ళు సినిమాని సినిమాగానే తీస్తున్నారు. మరి ఈ సినిమాకి ఏం రోగమొచ్చిందో! బొత్తిగా పరిషత్తు నాటకంలా ఉంది. నన్ను చాలా నిరుత్సాహపరిచింది.

మరప్పుడు ఈ సినిమాకి అంతగా పేరెందుకొచ్చిందబ్బా? ఈ ఇంటర్నెట్ యుగంలో అనుకోవాలే గానీ, తెలుసుకోవటం ఎంతసేపు? అంచేత సినిమా సంబంధిన పాత రివ్యూలు చూశాను. ఆది నుండి తెలుగు సినిమాలే కాదు.. సినిమా రివ్యూలు కూడా అతిశయోక్తులు, అసత్యాలే!

ఈ సినిమాకి హెన్రిక్ ఇస్బెన్ రాసిన 'పిల్లర్స్ ఆఫ్ సొసైటి' నాటకం ఆధారం అని ఒకాయన రాయగా.. అందరూ అవునంటూ నొక్కి వక్కాణించారు. ఆ ఇస్బెనుడు రాసిన నాటకం గూర్చి వికీలో చూస్తే ఆ నాటకానికి, ఈ సినిమాకి వెంట్రుక వాసి చుట్టరికం కూడా లేదని అర్ధమవుతుంది. ముదిగొండ లింగమూర్తి తన కెరీర్లో మొదటిసారిగా ఈ సినిమాలోనే పాజిటివ్ క్యారెక్టర్ వేశాట్ట! అంటే 'యోగివేమన'లో ఆయన నటించిన అభిరాముడు నెగటివ్ క్యారెక్టరా?

దాదాపు అన్ని రివ్యూలలో ఇదే సమాచారం! అనగా ఎవడో తలకి మాసిన వెధవ మొదట్లో ఏదో రివ్యూ రాస్తే, ఎవడికి వాడు తామే కనుగొన్నట్లు అదే సమాచారాన్ని కాపీ కొట్టేశారు (పరీక్షల్లో కాపీ కొట్టటం తెలుసు గానీ.. సినిమా రివ్యూలు కూడా కాపీ కొట్టి రాస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను). దరిద్రపుగొట్టు సినిమాకి పరమ దరిద్రపుగొట్టు రివ్యూలు. అనాదిగా మన తెలుగు సినీ జర్నలిస్టుల తెలివి ఈ విధంగా ఏడిచింది!

ఏ పాత్రకీ consistency లేకపోవటం ఈ పెద్దమనుషులు సినిమా ప్రత్యేకత. చైర్మన్ ధర్మారావు (జంధ్యాల గౌరినాథశాస్త్రి) ఇప్పటి మన రాజకీయ నాయకుల్లాంటి (ఆ రోజుల్లో ఇదొక వింత అయ్యుంటుంది) దొంగ గాడ్దె కొడుకు. చైర్మన్ని దేవుడుగా భావించే పత్రికా సంపాదకుడు రామదాసు (లింగమూర్తి) చాలా ఉత్తముడు.

చైర్మన్ రామదాసుతో మాట్లాడుతుండగా.. డ్రైవర్ తన చెల్లెలితో సరసాలాట్టం చూస్తాడు. కోపంలో డ్రైవర్ని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆ దుష్ట చైర్మెన్ని కాపాడటం కోసం నేరాన్ని తనమీద వేసుకుంటాడు రామదాసు (ఇట్లాంటి వెర్రిబాగుల మంచివాడి పాత్రలు అటు తరవాత గుమ్మడి చాలానే వేశాడు). నాకైతే ఇది చాలా అసంబద్దంగా అనిపించింది.

రామదాసు నిజాయితీ మనిషి. ఉన్నత విలువలు కలిగిన పత్రికా సంపాదకుడు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న రామదాసు న్యాయానికి కొమ్ము కాయాలి. చైర్మెన్ చేసిన దారుణ నేరాన్ని అసహ్యించుకోవాలి. కోర్టులో సాక్ష్యం చెప్పి చైర్మన్ కి శిక్ష పడేట్లు చెయ్యాలి. కానీ రామదాసు ఇవేమీ చెయ్యడు. తన భార్యని, అంధురాలైన కూతుర్ని గాలికి వదిలేసి చెయ్యని నేరానికి జైలుకి వెళ్తాడు (పాత సినిమాల్లో ఇట్లాంటి పనికిమాలిన త్యాగాల డోసు ఎక్కువే). అలా జైలుకి వెళ్ళకపోతే హీరోకి (రామచంద్ర కాశ్యప) రామదాసు అడ్డం కదా!

హీరో చైర్మెన్ కొడుకు. కుర్ర డాక్టర్. ఊళ్ళో ఆస్పత్రి పెట్టి సేవ చేస్తుంటాడు. తండ్రో దౌర్భాగ్యుడు.. కొడుకో ఆదర్శ పురుషుడు! రామదాసు కూతురుకి కళ్ళు తెప్పించి పెళ్లి చేసుకుంటానంటాడు. షరా మామూలే! ఈ సీన్లన్నీ ఎంత ఇల్లాజికల్ గా ఉంటాయంటే.. ఒక్కోసారి నవ్వొస్తుంది. సినిమా అంతా ఇట్లాంటి అర్ధంపర్ధం లేని దిక్కుమాలిన క్యారెక్టర్లే.

అయితే నిజమైన దిక్కుమాలిన క్యారెక్టర్ మాత్రం రేలంగి వేసిన తిక్క శంకరయ్య పాత్ర. శంకరం పిచ్చివాడు(ట). చైర్మన్ కి స్వయాన తమ్ముడు. అన్నీ తెలిసినట్లే మాట్లాడుతుంటాడు గానీ.. ఏవీ తెలీని అమాయకుడు. అందుకే సినిమా చివర్లో శంకరానికి కాళ్ళూచేతులు కట్టి గుళ్ళో పడేసి కథకి అడ్డం లేకుండా చేసుకున్నాడు దర్శకుడు. మన సినీ విమర్శకులకి శంకరంలో గొప్ప మేధావి కనిపించాట్ట! నాకైతే ఒక దారీతెన్నూ లేని బుర్ర తక్కువ్వెధవ కనిపించాడు.

సామాజిక పరంగా చూస్తే ఈ సినిమాలో వంగర వెంకటసుబ్బయ్య, చదలవాడ కుటుంబరావు వేసిన సిద్ధాంతి, శెట్టి పాత్రలు కరెక్ట్ కాదు. మన ఫ్యూడల్ వ్యవస్థలో భూస్వాములకి (అగ్రకుల శూద్రులకి) కొన్ని వర్గాలవారు (తమ అవసరాల రీత్యా) ప్రజా దోపిడీకి సహకరించారే గానీ, ప్రత్యక్షంగా ఆ దోపిడీలో పాల్గొన్న దాఖలా లేదు (దర్శకుడిలో రాజకీయ అవగాహన కొరవడినప్పుడు ఇట్లాంటి తప్పులతడక పాత్రల్నే సృష్టిస్తాడు).

ఎప్పుడో 1954 లో వచ్చిన సినిమా గూర్చి ఇవ్వాళ నేను విసుక్కోవటం దేనికి? అయ్యా! ఈ సినిమా కె.వి.రెడ్డి ఎప్పుడు తీసినా, మొన్ననే చూసిన నాకు మాత్రం కొత్త సినిమానే గదా! అయినా నేనీ సినిమాని ఇప్పటి సినిమాలతో సాంకేతికంగా పోల్చి చూడట్లేదు. పాత్రల మంచిచెడ్డలు, వాటిని దర్శకుడు హేండిల్ చేసిన విధానం గూర్చి మాత్రమే చెబుతున్నాను (ఇదే కె.వి.రెడ్డి తీసిన ఎన్నో సినిమాలకి నేను గొప్ప అభిమానిని).

సినిమాలో రాసుకున్న అతి ముఖ్యమైన సీనే సరీగ్గా లేదు. చైర్మన్ ధర్మారావు బయటకి కనిపించని దుర్మార్గుడు. అటువంటివాడు తనని దేవుడిగా భావించే రామదాసు ముందు ఎటువంటి నేరమూ చెయ్యడు. రామదాసు లేని సమయం చూసుకుని.. నిదానంగా, తాపీగా తన డైవర్ని హత్య చేయిస్తాడు (సినిమా టైటిలే 'పెద్దమనుషులు' కదా).

నెగటివ్ పాత్రలు ప్రధాన పాత్రలుగా తెలుగులో మొదటిసారిగా వచ్చిన సినిమా అని రాశారు. అది మాత్రం వాస్తవం. అందుకేనేమో పాత్రల ప్రవర్తన ఎంత అసంబద్ధంగా ఉన్నా తెలుగు ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేశారు. ఆ మరుసటి సంవత్సరం (1955) వచ్చిన రోజులు మారాయి సినిమా ఈ నాటికీ సమాజానికి అద్దం పట్టే గొప్ప క్లాసిక్. ప్రతి పాత్రకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉంటుంది ('రోజులు మారాయి' గూర్చి తర్వాత రాస్తాను).

అసలీ 'పెద్దమనుషులు' గూర్చి ఇంత రాయవలసిన అవసరం లేదు. మనిషి చేసే పన్లేని పనుల్లో బ్లాగు రాయడం కూడా ఒకటని మా సుబ్బు అంటాడు. సినిమా చూట్టం అనే ఒక పన్లేని పని చెయ్యడమే కాక.. అంతకన్నా పన్లేని పనైన బ్లాగు రాస్తున్నానంటే నేనెంత పన్లేని ఘనుడనో మీరు అర్ధం చేసుకోవచ్చు.


(pictures courtesy : Google)

Wednesday, 11 September 2013

ఈరోజు 'ఆంధ్రజ్యోతి'లో నా వ్యాసం.. ప్రతీక పవిత్రతలు వద్దు


తెలుగుతల్లి, భారతమాత... ఇటువంటి విశేషణాత్మక పదాలు ప్రయోగించడం వల్ల భాషని, ప్రాంతాన్ని గౌరవించుకున్నట్లుగా కొందరు సంతోషించవచ్చును. కానీ ఈ పద ప్రయోగాలు భాషా విన్యాసాలు తప్ప మరేదీకాదు. అసలీ పదజాలంలోనే సంకుచిత రాజకీయాలు దాగున్నాయి. ప్రాంతాల పేరుతో, భాష పేరుతో జరిగే శ్రుతి మించిన రాజకీయ కార్యక్రమాల్ని సామాన్యుడు ప్రశ్నించకుండా చెయ్యటం అనే ఒక ఎత్తుగడ ఇందులో దాగుంది. ఇందుకు శివసేన జపించే 'మరాఠీ మానో' ఒక ఉదాహరణ.

అసలు ఒక ప్రాంతాన్ని, భాష దేవతతో పోల్చడం ఎందుకు? ప్రపంచంలో ఎవరికైనా ఒక దేశం ఉంటుంది. వారికి ఆ దేశంలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ దేశానికి ఒక రాజ్యాంగం, క్రిమినల్ జస్టిస్ సిస్టం ఉంటాయి. ఆ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరునిగా బ్రతకాలంటే ఆ దేశ రాజ్యాంగ ఆదేశిత సూత్రాల్ని పాటించాలి. ఇందులో ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యమైనది. తమ దేశంపై గౌరవం, ప్రేమ కలిగిన వారెవరూ నేరాలకి (రాజకీయ నేరాలు కాదు) పాల్పడి జైలుకి వెళ్ళకూడదు. నేరం, నేరపూరిత మసస్తత్వం ఏ సమాజానికైనా హానికరం. జైళ్ళు నిర్వహింపబడేది ప్రజాధనంతో కాబట్టి, నేరాలు సమాజానికి ఆర్థిక భారం కూడా. ఇక అన్నిదేశాలకీ మునిసిపాలిటీల వంటి లోకల్ బాడీలు ఉంటాయి. ఆయా ప్రజలు వాటి నియమ నిబంధనలని పాటిస్తూ సక్రమంగా పన్నులు కడితే వారు ఉత్తమ పౌరులే. ఏ దేశానికైనా ఒక పౌరుడు ఇంతకన్నా చెయ్యగల ఉపకారం మరొకటి లేదు.

అయితే మనదేశంలో కొందరికి ఇది తృప్తినివ్వదు. కొన్ని మతాల్లో దేవుళ్ళు మనిషి రూపంలో ఉంటారు. వారిని పూజించటం వారికి ఒక పవిత్రకార్యం. అందుకని వీరు దేశాలకి, ప్రాంతాలకి కూడా దేవతా రూపం ఇస్తారు. వాటికి అలంకరణ చేస్తారు. పాటలు రాస్తారు. పూజలు చేస్తారు. ఇదంతా ఒక ఆదర్శ ధర్మంగా ప్రచారం చేస్తారు. పన్నులు ఎగ్గొట్టినా ఫరవాలేదు. కుల మతాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన చేసినా ఫరవాలేదు. గొంతు చించుకుని దేశమాతపై భక్తిగీతం పాడుతూ ఒక భజన కార్యక్రమం నిర్వహిస్తే చాలు. వారు నిఖార్సైన దేశభక్తులు!

భాష అనేది ఒక కమ్యూనికేటివ్ స్కిల్. అన్నిరకాల జంతువులు, పక్షులు ఈ కమ్యూనికేషన్ కోసం మాత్రమే భాషని వాడతాయి. ఏ భాషకైనా ఇంతకన్నా మహత్తర ప్రయోజనం ఏముంటుంది? అయితే కొందరు వ్యక్తులకి భాష కూడా దేవతే! ఆ దేవతని కీర్తిస్తూ పాటలు రాస్తారు. పూజలు చేస్తూ గర్విస్తారు!

అసలే మతపరమైన దేవతలతో సమస్యలున్న ఈ దేశంలో... ఈ భాషా దేవతల వల్ల మరిన్ని సమస్యలు తలెత్తటం మినహా చేకూరే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. స్త్రీకి గల అదనపు పవిత్రత ఏమిటి? నేనిక్కడ సామాజిక అంశాలని ప్రస్తావించట్లేదు. శరీర నిర్మాణశాస్త్ర పరంగా జననేంద్రియాలలో మాత్రమే స్త్రీపురుషులకి తేడా ఉంటుంది. ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడజంతువులు గర్భం దాల్చి పిల్లల్ని కంటాయి. ఇవన్నీ బయలాజికల్ విషయాలు. ఎంత ఇష్టపడ్డా మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. కాబట్టి మాతృత్వం అనేది ప్రకృతి పరంగా ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఈ మాతృత్వానికి కొందరు పవిత్రత అంటగడతారు. అలాగే స్త్రీలు గర్భాన్ని 'నవమాసాలు' మోయడంలో కూడా పవిత్రత ఏమీ లేదు. కుక్కలు, పిల్లులు రెండు నెలలు మోస్తాయి. ఒక్కో జాతికి ఒక్కో పీరియడ్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తక్కువలైతే ప్రమాదం కూడా. ఒక స్త్రీ తన 'పవిత్రమైన' గర్భాన్ని పదకొండు నెలలు మోసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుదామంటే ప్రకృతి ఊరుకోదు.

కొందరు పిల్లల్ని కని, పాలిచ్చి పెంచే ప్రక్రియని పరమ పవిత్రంగా చూస్తారు. కవిత్వం కూడా రాస్తారు. మంచిది. ఎవరి ఆలోచన వారిది. కానీ వారు ఆ స్త్రీ పవిత్రతకి అక్కడితో చెల్లుచీటి ఇచ్చేస్తారు. వారి సాంప్రదాయ సంస్కృతిలో ఆడవారి తెలివితేటలపై, నిర్ణయాత్మక శక్తిపై గౌరవభావం కలిగి ఉండటం కనబడదు. అంటే ఆడవారి పవిత్రత... గర్భం దాల్చడం, పిల్లల్ని కనటం, పాలివ్వటానికి మాత్రమే పరిమితమై ఉంటుందని అర్థం చేసుకోవాలి.

'తల్లి ప్రేమ' కూడా శాస్త్రీయ విశ్లేషణకి నిలబడదు. పిల్లలపై తండ్రుల కన్నా తల్లులే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారనటానికి శాస్త్రీయ ఆధారం లేదు. పిల్లల్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో తండ్రి పాత్ర తల్లికన్నా తక్కువేమీ కాదు. కేవలం గర్భసంచి లేని కారణాన, పిల్లల్ని కనే అవకాశం లేనందున పురుషుని స్త్రీ కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టడం జెండర్ వివక్ష కిందకి వస్తుంది.

మరప్పుడు ప్రాంతానికీ, భాషకీ 'తల్లి' అవసరం ఎందుకు?

విశాలమైన ఒక దేశానికి 'మాత' అంటూ, భాషకి 'తల్లి' అంటూ దేవతా రూపాలు ఇచ్చి పూజించటం అనేది ఒకరకమైన రాజకీయ భావజాల వ్యాప్తి ప్రచారం కోసం మాత్రమే. అలాగే స్త్రీలకి మాత్రమే అవకాశం ఉన్న గర్భం దాల్చే జీవశాస్త్ర అనివార్యతకి పవిత్రతని ఆపాదించటం కూడా ఒక రకం భావజాలానికి సాంస్కృతిక ముసుగు తొడగటం మించి మరేదీ కాదు.

కావున మనం అర్జంటుగా భారత మాత, తెలుగు తల్లి వంటి ప్రతీక భాష వదిలించుకోవాలి. ఇట్లాంటి విషయాల్ని రాజకీయంగానే చర్చించుకోవాలి... పరిష్కరించుకోవాలి తప్ప, లేని పవిత్రతని ఆపాదించటాన్ని ఖండించాలి. అప్పుడే దేశం, ప్రాంతం, భాష మొదలైన విషయాలని ఎమోషనల్‌గా కాకుండా... విషయ పరిజ్ఞానంతో అవగాహన చేసుకోగలం... ఈ భావజాలంతో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతని ప్రశ్నించగలం.

Saturday, 7 September 2013

ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలేనా?


మన దేశంలో ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైనవి. అవి అనుక్షణం ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించాలి, ప్రజాశ్రేయస్సే ప్రధమ కర్తవ్యంగా భావించాలి. రాజకీయ పార్టీలకి ప్రజాసేవకి మించిన పవిత్ర కార్యం మరొకటి ఉండరాదు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాధమిక సూత్రాలు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయ పార్టీల రాజకీయాలు ఈ ప్రాధమిక సూత్రాలని అనుసరించి ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్ధకం. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయ పార్టీల కార్యాచరణ లేనప్పుడు అవకాశవాదమే పార్టీల విధానం అయిపోతుంది. రాజకీయాల్ని చదరంగం ఆటలో ఎత్తుల్లాగా మార్చేసుకున్నప్పుడు ప్రజాశ్రేయస్సు వెనక్కి వెళ్ళిపోతుంది.

ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో.. తెలంగాణాకి వ్యతిరేకం కాదు అని ఒక పార్టీ, మీరు తండ్రి వంటి పాత్ర (?) పోషించండి అని మరొక పార్టీ ఢిల్లీలో తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. తీరా ఢిల్లీ నుండి నిర్ణయం వెలువడ్డాక, తాము వెలువరించిన అభిప్రాయానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత నుండి తప్పుకుని, భుజాలు తుడిచేసుకున్నాయి.

ప్రస్తుతం ఎన్జీవో నాయకులు తెర ముందుకు వచ్చారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే పాత రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయి. పూర్వం పెళ్లి సంబంధంలో కట్నకానుకలు ఒక పెద్దమనిషి సమక్షంలో మాట్లాడుకునేవారు. కట్నం చెల్లింపులో తేడా వచ్చి పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడు.. అసలు పెద్దమనిషి మాయమైపోతాడు. కొత్త పెద్దమనుషులు సరికొత్తగా రంగప్రవేశం చేస్తారు. తామే అసలైన పెద్దమనుషులమని హడావుడి చేస్తారు.. ఇప్పుడు మన ఎన్జీవో నాయకుల్లాగా!

ఎన్జీవో సంఘాలు రాజకీయ వ్యవస్థలో భాగం కాదు. రాజకీయ నిర్ణయాల్ని అమలు చెయ్యడానికి రాజ్యంగ పరంగా ఏర్పడ్డ ప్రభుత్వ వ్యవస్థలో వారు భాగం. అనగా రాజకీయ నిర్ణయాలతో వారికి సంబంధం లేదు (ఆ నిర్ణయాలు వారి సర్వీసు హక్కులకి భంగం కలిగిస్తున్నప్పుడు తప్పించి). వారు ఇన్నాళ్ళు జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. నిర్ణయం వెలువడ్డాక రాజకీయ పార్టీలని పక్కన బెట్టి ఉద్యమం తలకెత్తుకున్నారు.

తాము విభజనకి అనుకూల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు సమ్మె బాట పడతారనే అవగాహన రాజకీయ పార్టీలకి లేదా? అదే నిజమైతే ఉద్యోగుల అభిప్రాయాల్ని అంచనా వెయ్యలేని రాజకీయ పార్టీల అసమర్దత ఇవ్వాళ స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలకి ముందుండి నడిపించవలసిన రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులైన రాజకీయ పార్టీలు.. ఉద్యోగ సంఘాల అడుగు జాడల్లో నడవాల్సి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యంగా భావించాలి.

ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రజల ఎజెండా ఉద్యోగ సంఘాలు నిర్ణయించలేవు.. నిర్ణయించజాలవు. రాజకీయ వ్యవస్థ వైఫల్యం వల్లనే ఇవ్వాళ ఒక ప్రాంత ప్రజలకి ఎన్జీవో సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు హీరోల్లా కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి బాగానే ఉన్నా, ఈ ధోరణి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

(photo courtesy : Google)

Friday, 6 September 2013

నీకెందుకు?


సుబ్బు తాపీగా కాఫీ తాగుతున్నాడు.

"సుబ్బు! రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది." దిగులుగా అన్నాను.

"ఆ బాధేదో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు పడతార్లే. నీకెందుకు?"

"కాంగ్రెస్ పార్టీ విషయం తేల్చకుండా నానుస్తుంది సుబ్బూ!" నిష్టూరంగా అన్నాను.

"దాని ఫలితం దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ అనుభవిస్తార్లే. నీకెందుకు?"

"రేపు హైదరాబాదులో మీటింగ్ ఎలా జరుగుతుందో!" ఆందోళనగా అన్నాను.

"APNGO లు జరిగేట్టు చూస్తారు. తెలంగాణావాదులు ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఏదోటి జరుగుతుందిలే. నీకెందుకు?"

"బొగ్గు ఫైళ్ళు మాయమయ్యాయి సుబ్బూ!" అసహనంగా అన్నాను.

"ఆ సంగతి ప్రతిపక్షాలు చూసుకుంటాయిలే. నీకెందుకు?"

నాకు చిరాకేస్తుంది. ఒక్క క్షణం ఆలోచించాను. ఐడియా!

"రూపాయి విలువ పడిపోతుంది సుబ్బూ!"

"ఆ సంగతి రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ చూసుకుంటాళ్ళే. నీకెందుకు?"

"అవుననుకో. కానీ ద్రవ్యోల్పణం మూలంగా కాఫీ రేటు విపరీతంగా పెరుగుతుంది సుబ్బూ!"

ఒక్కసారిగా ఉలిక్కిపడి ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. అటుపై ఆవేశంతో ఊగిపోయ్యాడు.

"ఎంత ఘోరం! కాఫీ రేటు పెరిగితే సామాన్య ప్రజానీకం ఎలా బ్రతికేది? పాలకుల అన్యాయం నశించాలి. కాఫీ రేటు తగ్గేదాకా పోరాటం ఆగదు. ఉద్యమం వర్ధిల్లాలి. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున నా దగ్గరకి పంపించండి. ఢిల్లీని గడగడలాడిస్తా. ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేస్తా!"

నేను ముసిముసిగా నవ్వుకున్నాను.

(photo courtesy : Google)