Friday 6 September 2013

నీకెందుకు?


సుబ్బు తాపీగా కాఫీ తాగుతున్నాడు.

"సుబ్బు! రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది." దిగులుగా అన్నాను.

"ఆ బాధేదో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు పడతార్లే. నీకెందుకు?"

"కాంగ్రెస్ పార్టీ విషయం తేల్చకుండా నానుస్తుంది సుబ్బూ!" నిష్టూరంగా అన్నాను.

"దాని ఫలితం దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ అనుభవిస్తార్లే. నీకెందుకు?"

"రేపు హైదరాబాదులో మీటింగ్ ఎలా జరుగుతుందో!" ఆందోళనగా అన్నాను.

"APNGO లు జరిగేట్టు చూస్తారు. తెలంగాణావాదులు ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఏదోటి జరుగుతుందిలే. నీకెందుకు?"

"బొగ్గు ఫైళ్ళు మాయమయ్యాయి సుబ్బూ!" అసహనంగా అన్నాను.

"ఆ సంగతి ప్రతిపక్షాలు చూసుకుంటాయిలే. నీకెందుకు?"

నాకు చిరాకేస్తుంది. ఒక్క క్షణం ఆలోచించాను. ఐడియా!

"రూపాయి విలువ పడిపోతుంది సుబ్బూ!"

"ఆ సంగతి రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ చూసుకుంటాళ్ళే. నీకెందుకు?"

"అవుననుకో. కానీ ద్రవ్యోల్పణం మూలంగా కాఫీ రేటు విపరీతంగా పెరుగుతుంది సుబ్బూ!"

ఒక్కసారిగా ఉలిక్కిపడి ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. అటుపై ఆవేశంతో ఊగిపోయ్యాడు.

"ఎంత ఘోరం! కాఫీ రేటు పెరిగితే సామాన్య ప్రజానీకం ఎలా బ్రతికేది? పాలకుల అన్యాయం నశించాలి. కాఫీ రేటు తగ్గేదాకా పోరాటం ఆగదు. ఉద్యమం వర్ధిల్లాలి. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున నా దగ్గరకి పంపించండి. ఢిల్లీని గడగడలాడిస్తా. ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేస్తా!"

నేను ముసిముసిగా నవ్వుకున్నాను.

(photo courtesy : Google)

11 comments:

  1. భలే కీలెంచి వాత పెట్టారండీ రమణ గారూ. మీ ఇద్దరి వాదోపవాదాలలో మీరు నెగ్గడం ఇదే మొదటి సారి అనుకుంటా.

    ఒక పాత హిందీ సినిమా పాట గుర్తొచ్చింది:

    Kaun rota hai kisi aur ke qatir ai dost
    Sab ko apne hi kisi baat pe rona aayaa

    మీకు హిందీ రాదు కాబట్టి తర్జుమా ఇదిగో:
    ఎవరూ ఇతరుల కష్టాలకు ఏడవరు
    ప్రతి ఒక్కరికీ తన సమస్యలపై ఏడుపొస్తుంది

    ReplyDelete
  2. మా ఇంటి నుండి నేనొస్తున్నా! మా ఫ్రెండ్సును కూడా పట్టుకొస్తా! కాలేజీ క్లాసుల్లో కంటే కాఫీ అడ్డాల్లో తీవ్ర మేధోమధనాల్జేసి గిన్నిస్ బుక్కెక్కిన బ్రిలియంట్ బ్రూ కాఫీ బ్యాచ్ మాది! సుబ్బూకి చెప్పండి. ఉద్యమాన్ని ఉధృతం చేయమనండి. ప్రెస్ మీట్ పెట్టి ‘కాఫీ బచావో - అధిష్ఠాన్ హఠావో’ అని పోస్టర్ రిలీజ్ చేయమనండి. ‘మిలియన్ మార్చ్’ కు కార్యాచరణ ప్రకటించమనండి. ఢిల్లీని దిగ్బంధనం చేద్దాం. కాఫీ కప్పులో కల్లోలం సృష్టిద్దాం! కాఫీ ఉద్యమం వర్ధిల్లాలి! పాలకుల దాష్టీకం నశించాలి!! :-)

    ReplyDelete
    Replies
    1. నాగరాజు గారూ, కాఫీ ఉద్యమం అయితే ఫరవాలేదు, "కాపీ" ఉద్యమం మాత్రం వద్దు

      Delete
  3. Congrats! Finally one win over Subbu!

    ReplyDelete
  4. Jai గారు, హహ్హా... అంతేనంటారా! భావం బోధపడింది.
    కానీ, హస్తిన హస్తవాసి పుణ్యమాని కాఫీ ఉద్యమాలు, కాపీ ఉద్యమాలు కలగలసిపోయి పరిస్థితి కాస్తా గందరగోళంగా తయారై ‘చేయి’ దాటిపోయిందేమోనండి. చూస్తోంటే, ఇప్పుడు ఎవ్వరి మాటా ఎవ్వరూ వినేట్టు లేదు. ఇక సుబ్బూ సంగతి చెప్పనే అక్కర్లేదు :)

    ReplyDelete
  5. అద్ది మరి. సామాన్యుడి కోపం :)

    ReplyDelete
  6. బాగుంది.దెబ్బ మనకి తగిలేంత వరకూ మనకి ఏ విషయమూ పట్టదు.పట్టించుకోం.

    ReplyDelete
  7. after I read this and felt like having coffee ... ;-)

    ReplyDelete

  8. ఇదిగో సుబ్బూ,

    కాఫీ కోసం నే నీ తరపున పార్టీ లో జాయినవుతా ! హన్నా, కాఫీ ఖర్చు పెరిగి పొతే మన జీవితా లెట్లా గడుస్తాయి మరి !

    జిలేబి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.