Tuesday, 17 September 2013

వాహిని వారి 'పెద్దమనుషులు'.. నా పన్లేని పనులు

సృష్టిలోని సమస్త జంతుజాలంలో మనిషే తెలివైన జంతువని అంటారు. ఈ మనిషి రోజువారీగా చాలా పనులు చేస్తుంటాడు. వీటిలో కొన్ని పనికొచ్చే పనులు. ఎక్కువగా పన్లేని పనులు. ఈ పన్లేని పనుల్లో సినిమా చూట్టం కూడా ఒకటని కొందరి అభిప్రాయం. మరెందుకో కొందరు పనిగట్టుకుని ఆ పన్లేని పనే చేస్తారు. ఆనక పనికిమాలిన సినిమా చూశామని బావురుమంటారు. వీరు దౌర్భాగ్యులు. ఈ దౌర్భాగ్యుల్లో నేను కూడా ఒకణ్నన్న సంగతి వాహినీ వారి 'పెద్దమనుషులు' అనే సినిమా చూసినప్పుడే నాకు తెలిసింది.

'పెద్దమనుషులు'. నా చిన్నప్పుడు ఈ సినిమా గూర్చి కొందరు సినీజీవులు గొప్పగా చెప్పగా విన్నాను. అలా చెప్పిన వాళ్ళెవరూ ఈ సినిమా సరీగ్గా చూళ్ళేదనే అనుమానం ఇప్పుడు నన్ను పీడిస్తుంది. ఈ సినిమా 1954 లో రిలీజయ్యింది. అప్పటికి మన తెలుగువాళ్ళు సినిమాని సినిమాగానే తీస్తున్నారు. మరి ఈ సినిమాకి ఏం రోగమొచ్చిందో! బొత్తిగా పరిషత్తు నాటకంలా ఉంది. నన్ను చాలా నిరుత్సాహపరిచింది.

మరప్పుడు ఈ సినిమాకి అంతగా పేరెందుకొచ్చిందబ్బా? ఈ ఇంటర్నెట్ యుగంలో అనుకోవాలే గానీ, తెలుసుకోవటం ఎంతసేపు? అంచేత సినిమా సంబంధిన పాత రివ్యూలు చూశాను. ఆది నుండి తెలుగు సినిమాలే కాదు.. సినిమా రివ్యూలు కూడా అతిశయోక్తులు, అసత్యాలే!

ఈ సినిమాకి హెన్రిక్ ఇస్బెన్ రాసిన 'పిల్లర్స్ ఆఫ్ సొసైటి' నాటకం ఆధారం అని ఒకాయన రాయగా.. అందరూ అవునంటూ నొక్కి వక్కాణించారు. ఆ ఇస్బెనుడు రాసిన నాటకం గూర్చి వికీలో చూస్తే ఆ నాటకానికి, ఈ సినిమాకి వెంట్రుక వాసి చుట్టరికం కూడా లేదని అర్ధమవుతుంది. ముదిగొండ లింగమూర్తి తన కెరీర్లో మొదటిసారిగా ఈ సినిమాలోనే పాజిటివ్ క్యారెక్టర్ వేశాట్ట! అంటే 'యోగివేమన'లో ఆయన నటించిన అభిరాముడు నెగటివ్ క్యారెక్టరా?

దాదాపు అన్ని రివ్యూలలో ఇదే సమాచారం! అనగా ఎవడో తలకి మాసిన వెధవ మొదట్లో ఏదో రివ్యూ రాస్తే, ఎవడికి వాడు తామే కనుగొన్నట్లు అదే సమాచారాన్ని కాపీ కొట్టేశారు (పరీక్షల్లో కాపీ కొట్టటం తెలుసు గానీ.. సినిమా రివ్యూలు కూడా కాపీ కొట్టి రాస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను). దరిద్రపుగొట్టు సినిమాకి పరమ దరిద్రపుగొట్టు రివ్యూలు. అనాదిగా మన తెలుగు సినీ జర్నలిస్టుల తెలివి ఈ విధంగా ఏడిచింది!

ఏ పాత్రకీ consistency లేకపోవటం ఈ పెద్దమనుషులు సినిమా ప్రత్యేకత. చైర్మన్ ధర్మారావు (జంధ్యాల గౌరినాథశాస్త్రి) ఇప్పటి మన రాజకీయ నాయకుల్లాంటి (ఆ రోజుల్లో ఇదొక వింత అయ్యుంటుంది) దొంగ గాడ్దె కొడుకు. చైర్మన్ని దేవుడుగా భావించే పత్రికా సంపాదకుడు రామదాసు (లింగమూర్తి) చాలా ఉత్తముడు.

చైర్మన్ రామదాసుతో మాట్లాడుతుండగా.. డ్రైవర్ తన చెల్లెలితో సరసాలాట్టం చూస్తాడు. కోపంలో డ్రైవర్ని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆ దుష్ట చైర్మెన్ని కాపాడటం కోసం నేరాన్ని తనమీద వేసుకుంటాడు రామదాసు (ఇట్లాంటి వెర్రిబాగుల మంచివాడి పాత్రలు అటు తరవాత గుమ్మడి చాలానే వేశాడు). నాకైతే ఇది చాలా అసంబద్దంగా అనిపించింది.

రామదాసు నిజాయితీ మనిషి. ఉన్నత విలువలు కలిగిన పత్రికా సంపాదకుడు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న రామదాసు న్యాయానికి కొమ్ము కాయాలి. చైర్మెన్ చేసిన దారుణ నేరాన్ని అసహ్యించుకోవాలి. కోర్టులో సాక్ష్యం చెప్పి చైర్మన్ కి శిక్ష పడేట్లు చెయ్యాలి. కానీ రామదాసు ఇవేమీ చెయ్యడు. తన భార్యని, అంధురాలైన కూతుర్ని గాలికి వదిలేసి చెయ్యని నేరానికి జైలుకి వెళ్తాడు (పాత సినిమాల్లో ఇట్లాంటి పనికిమాలిన త్యాగాల డోసు ఎక్కువే). అలా జైలుకి వెళ్ళకపోతే హీరోకి (రామచంద్ర కాశ్యప) రామదాసు అడ్డం కదా!

హీరో చైర్మెన్ కొడుకు. కుర్ర డాక్టర్. ఊళ్ళో ఆస్పత్రి పెట్టి సేవ చేస్తుంటాడు. తండ్రో దౌర్భాగ్యుడు.. కొడుకో ఆదర్శ పురుషుడు! రామదాసు కూతురుకి కళ్ళు తెప్పించి పెళ్లి చేసుకుంటానంటాడు. షరా మామూలే! ఈ సీన్లన్నీ ఎంత ఇల్లాజికల్ గా ఉంటాయంటే.. ఒక్కోసారి నవ్వొస్తుంది. సినిమా అంతా ఇట్లాంటి అర్ధంపర్ధం లేని దిక్కుమాలిన క్యారెక్టర్లే.

అయితే నిజమైన దిక్కుమాలిన క్యారెక్టర్ మాత్రం రేలంగి వేసిన తిక్క శంకరయ్య పాత్ర. శంకరం పిచ్చివాడు(ట). చైర్మన్ కి స్వయాన తమ్ముడు. అన్నీ తెలిసినట్లే మాట్లాడుతుంటాడు గానీ.. ఏవీ తెలీని అమాయకుడు. అందుకే సినిమా చివర్లో శంకరానికి కాళ్ళూచేతులు కట్టి గుళ్ళో పడేసి కథకి అడ్డం లేకుండా చేసుకున్నాడు దర్శకుడు. మన సినీ విమర్శకులకి శంకరంలో గొప్ప మేధావి కనిపించాట్ట! నాకైతే ఒక దారీతెన్నూ లేని బుర్ర తక్కువ్వెధవ కనిపించాడు.

సామాజిక పరంగా చూస్తే ఈ సినిమాలో వంగర వెంకటసుబ్బయ్య, చదలవాడ కుటుంబరావు వేసిన సిద్ధాంతి, శెట్టి పాత్రలు కరెక్ట్ కాదు. మన ఫ్యూడల్ వ్యవస్థలో భూస్వాములకి (అగ్రకుల శూద్రులకి) కొన్ని వర్గాలవారు (తమ అవసరాల రీత్యా) ప్రజా దోపిడీకి సహకరించారే గానీ, ప్రత్యక్షంగా ఆ దోపిడీలో పాల్గొన్న దాఖలా లేదు (దర్శకుడిలో రాజకీయ అవగాహన కొరవడినప్పుడు ఇట్లాంటి తప్పులతడక పాత్రల్నే సృష్టిస్తాడు).

ఎప్పుడో 1954 లో వచ్చిన సినిమా గూర్చి ఇవ్వాళ నేను విసుక్కోవటం దేనికి? అయ్యా! ఈ సినిమా కె.వి.రెడ్డి ఎప్పుడు తీసినా, మొన్ననే చూసిన నాకు మాత్రం కొత్త సినిమానే గదా! అయినా నేనీ సినిమాని ఇప్పటి సినిమాలతో సాంకేతికంగా పోల్చి చూడట్లేదు. పాత్రల మంచిచెడ్డలు, వాటిని దర్శకుడు హేండిల్ చేసిన విధానం గూర్చి మాత్రమే చెబుతున్నాను (ఇదే కె.వి.రెడ్డి తీసిన ఎన్నో సినిమాలకి నేను గొప్ప అభిమానిని).

సినిమాలో రాసుకున్న అతి ముఖ్యమైన సీనే సరీగ్గా లేదు. చైర్మన్ ధర్మారావు బయటకి కనిపించని దుర్మార్గుడు. అటువంటివాడు తనని దేవుడిగా భావించే రామదాసు ముందు ఎటువంటి నేరమూ చెయ్యడు. రామదాసు లేని సమయం చూసుకుని.. నిదానంగా, తాపీగా తన డైవర్ని హత్య చేయిస్తాడు (సినిమా టైటిలే 'పెద్దమనుషులు' కదా).

నెగటివ్ పాత్రలు ప్రధాన పాత్రలుగా తెలుగులో మొదటిసారిగా వచ్చిన సినిమా అని రాశారు. అది మాత్రం వాస్తవం. అందుకేనేమో పాత్రల ప్రవర్తన ఎంత అసంబద్ధంగా ఉన్నా తెలుగు ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేశారు. ఆ మరుసటి సంవత్సరం (1955) వచ్చిన రోజులు మారాయి సినిమా ఈ నాటికీ సమాజానికి అద్దం పట్టే గొప్ప క్లాసిక్. ప్రతి పాత్రకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉంటుంది ('రోజులు మారాయి' గూర్చి తర్వాత రాస్తాను).

అసలీ 'పెద్దమనుషులు' గూర్చి ఇంత రాయవలసిన అవసరం లేదు. మనిషి చేసే పన్లేని పనుల్లో బ్లాగు రాయడం కూడా ఒకటని మా సుబ్బు అంటాడు. సినిమా చూట్టం అనే ఒక పన్లేని పని చెయ్యడమే కాక.. అంతకన్నా పన్లేని పనైన బ్లాగు రాస్తున్నానంటే నేనెంత పన్లేని ఘనుడనో మీరు అర్ధం చేసుకోవచ్చు.


(pictures courtesy : Google)

6 comments:

  1. ఆనాటి సినిమాను ఈనాటి కొలబద్దలతో చూడలేము!కే.వి.రెడ్డిసినిమా అని గౌరవ మర్యాదలతో చూసినా ఈ సినిమా ఆయన స్థాయిలో లేదనిపించినా నోరు మూసుకొని చూశాను!చాలా మంది సినిమా జర్నలిస్టులు అప్పుడూ ఇప్పుడూ మిడిమిడి జ్ఞానులే!ఒక దర్శకుడు తీసిన సినిమాలన్నీ ఒకేస్థాయిలో ఉండవులే అని సరిపెట్టుకున్నాను!మీకు పనిలేకపోవడంవల్ల మంచిపనే చేశారు!మీకు ఇలాగే పనిలేకుండా ఉంటే మంచి మంచి సమిక్షలు జాలువారుతాయని నా అభిమతం!

    ReplyDelete
    Replies
    1. aurya prakash గారు,

      >>ఆనాటి సినిమాను ఈనాటి కొలబద్దలతో చూడలేము!

      నేనూ అదే అనుకుంటున్నాను.

      (అయితే మన ఇష్టాయిష్టాలు రికార్ద్ చేసుకోటానికి బ్లాగ్ ఒక వేదిక అనుకుంటున్నాను.)

      Delete
  2. సినిమా చూట్టం ఓ పన్లేని పనైతే, దానిపై పోస్టు రాయడం మరో పన్లేని పనైతే, ఆ పోస్టుపై కామెంటు ఇంకెంత పన్లేని పనో?! హహ్హా! పాపం, పెద్దమనుషులని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పోస్టుమార్టం నిర్వహించినట్టుంది మీరు. నేనూ అక్కడ నొక్కి చూశాను. ఇబ్సెన్ ప్లేకు, దీని కథకు ఏ సంబంధమూ లేనట్టే ఉంది. కెవి రెడ్డి తీసిన చిత్రరాజములు పట్టుమని పదకొండే కదాని, అన్నింటినీ చూసేద్దామని ఆ మధ్య ఓ వారం రోజులు ప్లాన్ చేస్కుని చూస్తే, అన్నీ చూడగలిగాము కానీ, మీరన్నట్టే పెద్దమనుషులు మాత్రం మరీ డ్రై గా ఉండి, ఫక్తు టెంపో లేని వీధి నాటకంలా నడుస్తుండడంతో చూట్టం మా వల్ల కాలేదు. అన్నట్టు, కేవలం కెవి రెడ్డి సినిమాలు ఓ పది చూట్టంతోనే కావలసినంత రసానుభూతి, అలాగే కేవలం మీ బ్లాగు చదవడం ద్వారా బోల్డంత విషయ పరిజ్ఞానం లభిస్తున్న నేపథ్యంలో... ఆ రెంటినీ మీ సుబ్బూ పన్లేని పనులుగా జమగట్టడం అహేతుకం, అసమంజసం, అప్రజాస్వామికం, ఆక్షేపణీయం, వగైరా వగైరా! :)

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      సుబ్బుని కంట్రోల్ చెయ్యదం నావల్ల కావట్లేదు. :)

      (కె.వి.రెడ్డి బెస్ట్ పిక్చర్ 'యోగివేమన' అనుకుంటున్నాను.)

      Delete
  3. 73 ఏళ్ల మా నాన్న ఇప్పటికీ వాహినీ వారి పెద్దమనుషులు అనే పదబంధాన్ని మోసగాళ్లు అనడానికి ప్రతీకగా వాడుతుంటాడు. ఆయనకి అంతలా గుర్తున్న సినిమాలోని డొల్లదనాన్ని ఎత్తిచూపారు. ఇది ఆయనకి చదివి వినిపించాలి. చదివి వినిపించనా, ఇదీ పన్లేమి పనే అని ఊరుకోనా.... కన్ఫ్యూజనేనాక్రాంతం చిత్తం కిం కర్తవ్యం, ఉపదేశం కురు రమాణార్యా..

    ReplyDelete
    Replies
    1. పూర్ణప్రజ్ఞాభారతి గారు,

      'వాహినీవారి పెద్దమనుషులు' అనే 'తిట్టు' ఆ రోజుల్లో చాలా పాపులర్. నేను కూడా ఒక పోస్టులో ఈ మాట వాడాను.

      ఈ సినిమా గూర్చి గొప్పగా చెప్పినవాళ్ళల్లో మా నాన్న కూడా ఉన్నాడు. ఆయన పోయి ఏడేళ్ళు అయ్యింది. ఆయన ఉన్నట్లయితే మా ఇద్దరికీ ఈ సినిమా విషయంలో ఇంకో తగాదా అయ్యేది!

      (నాన్నా! నన్ను క్షమించు!)

      Delete

comments will be moderated, will take sometime to appear.