Thursday, 24 April 2014

మనసు బాధతో మూలిగిన వేళ!


ఈ ఫొటో చూస్తుంటే నా మనసు బాధతో మూలుగుతుంది. 'ఎక్కడైనా రోగిష్టి మనిషి నీరసంతో మూలుగుతాడు, తోక తెగిన కుక్క ఏడుస్తూ మూలుగుతుంది, సూడిపంది డజన్లకొద్దీ పిల్లల్ని కనేప్పుడు ప్రసవవేదనతో మూలుగుతుంది. ఇవేమీ లేకపోయినా, డబ్బులిస్తే సినిమా యాక్టర్లు మూలుగుతారు (దీన్నే నటన అందురు). కానీ - మనసు కూడా మూలుగుతుందని ఇప్పుడే వినడం, అంటే ఏంటి?' అంటూ కష్టమైన ప్రశ్నలేస్తే, నాదగ్గర సమాధానం లేదు.

ఈ ఫొటోలోని తెల్లగడ్డం వ్యక్తి నా చిన్నప్పట్నించి రాజకీయాల్లో ఉన్నాడు. కాకలు తీరిన రాజకీయనాయకుడు. ఆయన స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా రాజకీయాలే ఆలోచిస్తాడు, చేస్తాడు. ఒకప్పుడు దేశరాజకీయాల్ని శాసించాడు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళపాటు అభివృద్ధికి పోస్టర్ బాయ్. రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో.. ప్రతిపక్ష నాయకులు అన్యాయంగా కుట్ర పన్ని.. రాజ్యాధికారాన్ని లాగేసుకుని.. (ఆ విధంగా) రాష్ట్రాభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. ఆనాటి నుండి బాధతో పక్షులు ఎగరడం మానేశాయి, చేపలు నీళ్ళు తాగడం మానేశాయి, పశువులు గడ్డి తినడం మానేశాయి, మనుషులు మందు తాగడం ఎక్కువ చేశారు. ఇదంతా పాతకధే!

ఫొటోలోని నల్లగడ్డం వ్యక్తి ఒక సినిమా నటుడు. ఇతని అన్నయ్య చాలా పాపులర్ హీరో. తెలుగు సినిమాల్లో వారసత్వం అనే అర్హత లేకుండా హీరో అవ్వలేరు. అంచేత - ఇతను కూడా అన్నయ్య వారసుడిగా, అన్నయ్య కనుసన్నల్లో తెలుగు సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం పెద్దహీరోగా వెలుగొందుతున్నాడు. కొన్నాళ్ళకి ఎందరో సినిమా నటులకి మల్లే ఈ నటుడిక్కూడా రాజకీయ దురద పట్టుకుంది, మంచిది. ఇందు నిమిత్తం ఏదో పుస్తకం కూడా రాసుకున్నాడు, మరీ మంచిది. చాలా ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తాడు, మరీమరీ మంచిది. 

లంచాలు మరిగిన అధికారి లంచాలకి వ్యతిరేకంగా మాట్లాడరాదని రూలేమీ లేదు, అలాగే - వారసత్వంతో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తికి వారసత్వ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉండకూడదని కూడా రూలేమీ లేదు. బంగారం అమ్మి పొలం కొనుక్కోవచ్చు, పొలం అమ్మి ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే సినిమా హీరోలు తమ వెర్రి అభిమానుల్ని గొర్రెల మందలుగా మార్చి తమ రాజకీయ సోపానానికి మెట్లుగా కూడా మార్చుకోవచ్చు. 

నీ మనసు మూలుగుతుందన్నావు, ఎందుకో చెప్పకుండా ఈ సోదంతా ఏమిటి?

అమెరికావాడు ఇండియావాణ్ని అప్పడిగినట్లు, పులి తన పిల్లల పాల కోసం పిల్లిని అర్ధిస్తున్నట్లు.. అంత పెద్దనాయకుడు, ఒక సినిమా నటుణ్ని (ఇంటికి వెళ్లి మరీ) సహకరించమని అడుక్కోవడం ఎంత ఘోరం! ఇది తెలుగుజాతికే అవమానం. 

నీ మొహం! ఒక తెలుగువాడు సాటి తెలుగువాణ్ని అడుక్కోవటం తెలుగుజాతికి అవమానం ఎలా అవుతుంది? అవ్వదు. అయినా ఇవన్నీ రాజకీయాలు, నీకర్ధం కావులే! మూలిగింది చాలు, ఇంక ఆపు!

(photo courtesy : Google)

Wednesday, 23 April 2014

'చెత్త' కబుర్లు


GHMC పారిశుధ్య కార్మికుల సమ్మె అట, హైదరాబాద్ రోడ్లన్నీ చెత్తతో నిండిపొయ్యుంటాయి. నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు, వారికి నా సానుభూతి.

సమాజంలో అనేక రకాల వృత్తులున్నయ్. క్షురక వృత్తి, చెప్పులు కుట్టే వృత్తి, న్యాయవాద వృత్తి, వైద్య వృత్తి.. ఇలా ఎన్నోరకాలు. 'తమలో ఎవరు గొప్ప?' అంటూ కళ్ళూ, చెవులు, ముక్కు వాదించుకునే ఓ సరదా కథ మనకి తెలిసిందే. అదేవిధంగా.. సమాజానికి అత్యంత అవసరమైన వృత్తి ఏది? అనే చర్చ చేస్తే, చెత్తని శుభ్రం చేసే పారిశుధ్య కార్మిక వృత్తే అత్యంత ముఖ్యమైనదని నా అభిప్రాయం.

ఎలా చెప్పగలం? సింపుల్. ఒక వృత్తి యొక్క విలువ తెలియాలంటే..ఆ వృత్తి సేవలు బంద్ చేసి, జరిగే నష్టాన్ని చూసుకోవాలి. వైద్యులు సమ్మె చేసినప్పుడు రోగులు చచ్చిపోతున్నారని మీడియా బాగా హైలైట్ చేస్తుంది. మరి - సమ్మె చెయ్యనప్పుడు ఆ చావులేమన్నా తగ్గుతున్నయ్యా? అనేది మాత్రం మీడియా రిపోర్ట్ చెయ్యదు. అందువల్ల వైద్యుల వల్ల మరణాలు తగ్గుతున్నయ్యని చెప్పేందుకు తగిన ఆధారాల్లేవు. అయితే - పారిశుధ్య కార్మికుల సమ్మె వల్ల సమాజానికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందని చెప్పేందుకు మీడియా అవసరం లేదు.. సమ్మె సమయంలో వీధిలోకొస్తే చాలు, భరింపరాని దుర్గంధమే చాలా ఎఫెక్టివ్ గా చెబుతుంది.

ఎంతో ముఖ్యమైన ఈ చెత్త శుభ్రం చేసేవారి వృత్తి సమస్యల పట్ల మనం పెద్దగా స్పందించం. కుళ్ళు కంపు, ఈగల గుంపు మధ్యన పని చేస్తున్న ఆ కార్మికుల్ని అసలే పట్టించుకోం (నాకు పతంజలి 'ఖాకీవనం' గుర్తొస్తుంది.. పారిశుధ్య కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది). అత్యంత దుర్గంధ భూరితమైన ఈ పెంట పని చేసే కార్మికులు కూడా తప్పనిసరి పరిస్తితుల్లో మాత్రమే ఈ పని చేస్తుంటారు. అందుక్కొన్ని సామాజిక కారణాలు ఉన్నాయి. 

మధ్యతరగతి మేధావులు కులం పేరెత్తితేనే మొహం చిట్లిస్తారు, వాళ్ళ దృష్టిలో 'కులం' అనే పదం ఒక బూతుమాటతో సమానం. అసలు రోగాన్నే గుర్తించడానికే ఇష్టపడనప్పుడు వైద్యం ఎలా చేస్తాం? పారిశుధ్య కార్మికుల్లో అత్యధికులు అట్టడుగు కులాల వారవడం యాధృచ్చికం కాదు, ఇది మన పురాతనమైన కుల వ్యవస్థకి అద్దం పడుతుంది. ఈ విషయం మనం గుర్తించకపోతే, సమాజం అర్ధం కాదు. (మన దేశంలో కులం, దాని ప్రభావం అర్ధం చెసుకోదలచినవారు జైళ్ళలో ఎక్కువమంది తక్కువ కులంవారే ఎందుకుంటారో కూడా ఆలోచన చెయ్యాలి).

చివరగా - మనం ఆరోగ్యంగా జీవించడానికి, మన పరిసరాలు శుభ్రంగా ఉండడానికి పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో అవసరం. కావున ఇది చాలా పవిత్రమైన వృత్తి. పారిశుధ్య కార్మికుల సేవల్ని గుర్తిద్దాం, గౌరవిద్దాం. ఈ వృత్తిలో జీవిస్తున్నవారు చాల పేదవారు. కావున వీరి న్యాయమైన కోర్కెలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, అందుకు సభ్యసమాజం కూడా ప్రభుత్వాలపై తగినంత ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నాను.


(photos courtesy : Google)

Monday, 21 April 2014

హేమమాలిని! బెస్టాఫ్ లక్


పులిని చూపించి 'ఇది పులి' అని చెప్తే నవ్వొస్తుంది. అలాగే పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు 'హేమమాలిని' అని రాస్తే కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే - హేమమాలిని పరిచయం అవసరం లేని వ్యక్తి (ముఖ్యంగా మా వయసు వాళ్లకి).

హేమమాలిని ప్రస్తుతం బిజెపి తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఉంది. ఆవిడ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ఫొటోలు అడపా దడపా న్యూస్ పేపర్లల్లో కనబడుతూనే ఉన్నయ్. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా నాకు పాతరోజులు గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుంది.

నేను పదో క్లాసులో ఉండగా నాజ్ అప్సరలో 'సీతా ఔర్ గీతా' అనే హిందీ సినిమా విడుదలైంది. హేమమాలిని ద్విపాత్రాభినయం. నాకు హేమమాలిని పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే సినిమా రెండుమూడుసార్లు చూశాను. కానీ బయటకి చెప్పుకోలేని దుస్థితి. అందుక్కొన్ని కారణాలున్నయ్! ఏమిటవి?

అడవికి సింహం రాజు. కవులు సింహం జూలు, సన్నని నడుం అందానికి చిహ్నంగా రాస్తారు. అడవిలోని జంతువులకి కవులకున్న కళాహృదయం ఉండదు, కానీ - చావు భయం మాత్రం ఉంటుది. అందుకే వాటికి సింహం పంజా దెబ్బన్నా, కండల్ని చీల్చేసే వాడికోరలన్నా భయం. అంచేత సింహం కనబడితే అవి భయం చేత పక్కకి తప్పుకుంటాయ్. రాజంటే కూడా సామాన్య ప్రజలు అలాగే భయపడాలని కవుల అభిప్రాయం కావొచ్చు, అందుకే సింహాన్ని మృగరాజుగా నిర్ణయించేశారు.

సరే! ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం (ఉన్నామా?!), ప్రజలు ఓట్లేస్తేనే లీడర్. అందుకే వాళ్ళు ఓట్లేయించుకోడానికి కుక్కపాట్లు పడతారు. ఎలక్షన్ల సమయంలో సామాన్య ప్రజలు తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువమంది ఓట్లేస్తారు. మేధావులు ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువమంది ఓట్లేస్తారు!

అడవిలో సింహం కాకున్నా, ఎలక్షన్లో నించోకున్నా.. సూర్యం మా బ్రాడీపేట గ్యాంగ్ నాయకుడుగా ఉన్నాడు. బంగారానికి వెండి తలవంచినట్లు, హెడ్ కానిస్టేబుల్ కి కానిస్టేబుళ్లు ఒదిగుండినట్లు మేం కూడా సూర్యం లీడర్షిప్పుని ఒప్పేసుకున్నాం (మా బ్రాడీపేట గ్యాంగ్ గూర్చి ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్  అనే పోస్టులో కొంత రాశాను).

ప్రజాస్వామ్య స్పూర్తిలో సూర్యానికి ఇందిరా గాంధీ ఆదర్శం. అందుకే - సూర్యానికి నచ్చినవే మనక్కూడా నచ్చాలి, నచ్చకపోతే మనక్కూడా నచ్చరాదు. ఎదురు మాట్లాడినవాడు అసమ్మతివాదిగా నింద మొయ్యాలి. వాడిపై సిబిఐ, ఎఫ్బిఐ మొదలైన నిఘాలు కూడా ఉంచబడతాయ్. ఇది మాకందరికీ ఏదోక స్థాయిలో అనుభవమే కాబట్టి 'బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్'గా ఉండేవాళ్ళం (లేనిచో బ్రతుకు దుర్భరం చేస్తాడని తెలుసు).

మా గ్యాంగ్ లో ఏ విషయంలోనైనా (ఏకపత్నీవ్రతుళ్ళా) ఒక్కళ్ళనే ఇష్టపడాలి. మేమందరం గుండప్ప విశ్వనాథ్ అభిమానులం. గవాస్కర్ అభిమానులకి మాలో చోటు లేదు. ఏకకాలంలో విశ్వనాథ్, గవాస్కర్ల అభిమానిగా ఉండరాదు, రూల్సు ఒప్పుకోవు! 

మా నాయకుడు సూర్యం రేఖ అభిమాని. కావున టెక్నికల్ గా నేను కూడా రేఖ అభిమానిని. ఇప్పుడు నాకు హేమమాలిని నచ్చిందంటే.. పార్టీ మారే రాజకీయ నాయకుళ్ళా చాలా వివరణ ఇచ్చుకోవాలి. అందుకు నేను సిద్ధంగా లేను.

నాజ్ అప్సర తెరపై 'సీతా ఔర్ గీతా' చూస్తున్నాను.

"కిశోర్ 'హవా కె సాథ్ సాథ్.. ' భలే పాడాడు కదూ?" 

'ఊతప్పానికి ఉల్లిపాయలే రుచి' అనే సత్యాన్ని ప్రపంచంలో మొదటిసారి కనుగొన్నవాళ్ళా అన్నాడు సూర్యం (మావాడికి కిశోర్ కుమార్ పిచ్చి).

"అవునవును" 

అమెరికా అధ్యక్షుడి మాటకి తల ఊపే ఇండియా ప్రధాన మంత్రిలా అన్నాను.

(కిశోర్ కుమారా? గాడిద గుడ్డేం కాదు! ఇక్కడ ఫుల్లుగా హేమమాలినిని చూసేస్తున్నా.)

'షోలే' మొదటిరోజు ఈవెనింగ్ షో చూశాం. దార్లో బ్రిడ్జ్ పక్కన బలరాం హోటల్లో టీ తాగుతున్నాం.

"సినిమాకి అమితాబ్ చచ్చిపోయ్యే సీన్ హైలైట్."

నిండుసభలో శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన పద్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా.. తల పంకిస్తూ అన్నాడు సూర్యం.

అదే సభలో ముందునించి మూడో వరసలో నించున్న నాలుగో భటుడిలా, వెంటనే.. "అవునవును!" అన్నాను.

కానీ నాకు హేమమాలిని 'బసంతి' సీన్లే నచ్చాయి. అయితే ద్రోహులే అతి వినయంగా ఉంటారని ఆ రోజు అనుభవ పూర్వకంగా గ్రహించాను. అందుకే - మనసులోని నా 'రాజద్రోహ కుట్ర' (హేమమాలిని అభిమానం) బయట పడనీకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాను.

మెడిసిన్ కోర్స్ అయిన వెంటనే సూర్యం బ్రాడీపేట వదిలేసి అమెరికా వెళ్ళిపొయ్యాడు. రాజు లేని రాజ్యం దిక్కులేనిదైపోయింది. అటు తరవాత సామంత రాజులూ దేశాలు పట్టిపోయారు. ఆ విధంగా మా బ్రాడీపేట గ్యాంగ్ ఆనతి కాలంలోనే ఎండలో ఉంచిన వెనిలా ఐస్ క్రీములా కరిగిపోయింది.

తరవాత కాలంలో హేమమాలిని ఏం చేసిందో తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలక్షన్ల సందర్భంగా హేమమాలిని మొహం కనబడుతుంది. ఆమెలో ఇంకా అదే అందం, అదే డిగ్నిటీ. వావ్!

ప్రతి మనిషికి జీవితంలో ఒక్కోదశ ఉంటుంది. చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం, సినిమాలంటే ప్రాణం. ఒకప్పుడు హేమమాలిని అందాన్ని అభిమానించాను. ఇవ్వాళ నా దృష్టిలో అందానికి వీసమెత్తు విలువ కూడా లేదు.. అదసలు విషయమే కాదు. ఇవన్నీ సహజమైన పరిణామాలని అనుకుంటున్నాను.

హేమమాలిని ఈరోజుకీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమైయ్యుంటుంది? బహుశా హేమమాలినికి సావిత్రి, మీనాకుమారిల్లాగా కష్టాలు లేకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నవాణ్ని వివాహం చేసుకున్న సినిమా హీరోయిన్లు (ఎక్కువమంది) ఇబ్బందుల్లో పడ్డారు. కొందరు మాత్రమే హేపీగా ఉన్నారు. ఆ కొందర్లో హేమమాలిని ఉంది. అందుకు ధర్మేంద్రని అభినందించాలి.

చివరగా - నా జీవితంలో ఒకానొక దశలో నన్ను అలరించి, ఆనందింపచేసిన హేమమాలిని.. కడదాకా ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బెస్టాఫ్ లక్ టు హేమమాలిని!

అంకితం :

నా జీవితంలో అతిముఖ్యమైన రోజుల్లో నాకు తోడుగా ఉన్నవాడు, నా ప్రియాతి ప్రియమైన నేస్తం సూర్యంకి (Dr.Surya P Ganti, cardiac anaesthesioligist, New Jersey, USA.).  

ఇప్పుడే అందిన ఫోటో :


హేమమాలినితో మా బ్రాడీపేట గ్యాంగ్ సభ్యుడు. పేరు తేజానంద్ గౌతం మూల్పూరు, వృత్తి నరాల వైద్యం (Neurologist), ఊరు వేటపాలెం (Huntsville, Alabama, USA).

(photo courtesy : Google)

Friday, 18 April 2014

ప్లాస్టిక్కుర్చీలూ! ఏడవకండేడవకండి


ఇది ఎన్నికల సీజన్. రాజకీయ పార్టీలకి అభ్యర్దుల్ని ఎంచుకోటం ఒక పెద్ద ఎక్సర్సైజ్. గెలిచే అవకాశాలున్న పార్టీల్లో టిక్కెట్టు కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. పార్టీ నాయకులు కిందా మీదా పడి అభ్యర్ధుల్ని నిర్ణయిస్తాయి. టిక్కెట్టు దక్కించుకోలేని ఆశావహులు (సహజంగానే) ఆవేశపడతారు, కోపంతో కుతకుతలాడిపోతారు.  

ప్రతి పార్టీ ఆఫీసులోనూ రంగురంగుల ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి. మామూలు రోజుల్లో ఇవి కూర్చోడానికి ఉపయోగపడతాయి. ఎన్నికల సమయంలో టిక్కెట్టు దక్కనివాళ్లకి తమ కోపం వెళ్ళగక్కడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. 

ప్లాస్టిక్ కుర్చీలు కూర్చోడానికి అంత అనువుగా లేకపోయినా, విరక్కొట్టుకోడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. కార్యకర్తలు తమ ప్రతాపం చూపిస్తూ, నేలకేసి బాదినప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ విరిగిపోతాయి. అటుతరవాత, ఇంచక్కా చాలా సులభంగా ఇంకా చిన్న ముక్కలుగా కూడా విరక్కొట్టుకోవచ్చు. కొద్దిసేపటికే ఆ ప్లాస్టిక్ ముక్కలతో భీభత్స రణరంగాన్ని సృష్టించవచ్చు, ఆ విధంగా నాయకత్వానికి (పెద్దగా కష్టపడకుండానే) అసమ్మతి తెలియచెయ్యొచ్చు. 

ఈ మొత్తం చర్య ద్వారా కార్యకర్తలు ఎంతగానో తృప్తినొందుతారు. కుర్చీలన్నీ చస్తాయి గానీ.. మనుషులెవరికీ దెబ్బలు తగలవు. కాబట్టి, కేసులు గట్రా ఉండవు. ఆ కుర్చీలు పెద్ద ఖరీదు కాదు కావున, అటు తరవాత కొత్తవి కొనుక్కోడానికి పార్టీల వాళ్లకి పెద్ద ఇబ్బంది ఉండదు. 

చివరగా - ప్లాస్టిక్కుర్చీలకో మాట..

ప్లాస్టిక్కుర్చీలూ! ఏడవకండేవకండి. నాకు తెలుసు.. మీరు నిస్వార్ధ జీవులు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సందర్భాన మీరు చేస్తున్న ఈ త్యాగం నిరుపమానమైనది. బతికున్నంత కాలం దున్నపోతుల్లాంటి రాజకీయుల ఘోర శరీర బరువుని భారంగా, నిస్సహాయంగా మోయడమే కాకుండా.. చివరాఖరికి వారి చేతిలోనే దారుణహత్యకి గురవుతున్నారు. ఇది మిక్కిలి శోచనీయం. మీకు నా జోహార్లు.


(photos courtesy : Google)

Wednesday, 16 April 2014

ఆడవాళ్ళు ఆల్కహాల్ తాక్కూడదా!?


'ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు బాగా మందు తాగుతుందట! అంచేత ఆవిడ ఎన్నికల్లో నిలబడితే ఎవరూ ఓటెయ్యరట!'

ఇట్లాంటి చెత్త ఏ గల్లీస్థాయి కార్యకర్తో వాగితే.. అస్సలు పట్టించుకోం. కానీ - ఏదో ప్రొఫెసర్ గిరి, కేంద్రమంత్రి గిరి కూడా వెలగబెట్టిన ఓ ప్రబుద్ధుడు ఈ విధంగా సెలవిచ్చాడు. చదువుకి, సంస్కారానికి పొంతన ఉండాల్సిన అవసరం లేదని మరొకసారి ఋజువు చేశాడు.  

పబ్బులకి మగవాళ్ళు వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు మాత్రం వెళ్ళకూడదనే భావజాలం కలిగిన పార్టీకి చెందిన వ్యక్తిగా ఆ పెద్దమనిషికి అలా అనిపించొచ్చు. కాబట్టి ఆయనకి ఆల్కహాల్ తీసుకునే ఆడవాళ్ళు చెడ్డగా కనిపించొచ్చు.

సిగరెట్లు, ఆల్కహాల్ వాడటం ఆరోగ్యానికి హానికరం. ఇందులో వేరే అభిప్రాయానికి తావు లేదు. కానీ కొందరి దృష్టిలో ఈ అలవాట్లు మగవాళ్ళ విషయంలో తప్పుకాదు.. అడవారి విషయంలో మాత్రమే తప్పు! ఇందులో లాజిక్ అర్ధం కాకపోతే మీ ఖర్మ.  

చట్టప్రకారం కొన్నిరకాల అలవాట్లకి వయసు పరిమితులు ఉన్నాయే కానీ, ఆడామగా నిబంధనలు లేవు. ఈ విషయం ఆ మేధావిగారికి బాగానే తెలుసు. కానీ ఎన్నికల సమయం.. ఏదో చెత్త వాగితే నాలుగు ఓట్లు రాలకపోతాయా అనే విపరీత మనస్తత్వం, లేదా నాయకత్వ దృష్టిని ఆకర్షించుకునే చౌకబారు ఎత్తుగడ.

ఆల్కహాల్ మోతాదు మించి రోజువారీ తీసుకుంటే, దానికి అలవాటు పడిపోతారు. ఈ స్థితిని alcohol dependence syndrome అంటారు. క్రమేపి లివర్, మెదడు వంటి internal organs దెబ్బ తింటాయి. ఇదొక వైద్యం చేయాల్సిన మెడికల్ కండిషన్. anatomical గా ఆడామగలకి genital organs లో తప్ప మరే internal organs లో తేడా ఉండదు.. తేడా అంతా బుద్ధుల్లోనే!  

(picture courtesy : Google) 

Monday, 14 April 2014

జీవితమే సఫలము.. థాంక్స్ టు 'బైజూ బావ్రా'


మనది మానవ జన్మ, అంచేత మనని 'మనుషులు' అంటారు (ఈ విషయం చెప్పడానికి ఒక పోస్ట్ రాయడం చాలా అన్యాయం). మనలో చాలామంది చాలా అవుదామనుకుంటాం. చాలామంది పిల్లలు పెద్దయ్యాక డాక్టర్ అవుదామనుకుంటారు (బహుశా తాము కూడా డాక్టర్లై ఎదుటివారికి ఇంజక్షన్ పొడుద్దామనే ఉత్సాహం / కసి కారణం కావచ్చు), కానీ అందరూ డాక్టర్లు కాలేరు. పిల్లలు ఇంజనీర్ అవుదామని పెద్దగా అనుకోరు (ఇంజనీర్లు చేసే పనేంటో తెలీకపోడం వల్ల), కానీ చచ్చినట్లు అందరూ ఇంజనీర్లే అవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.

అలాగే - (పెళ్లి కాకో, మొగుడి బాధలు తట్టుకోలేకో) మగాడిగా పుడితే బాగుండేదని అనుకునే ఆడాళ్ళు నాకు తెలుసు (ఆడదానిగా పుట్టినట్లైతే బాగుండేదని అనుకున్న మగాళ్ళని నేనెప్పుడూ చూళ్ళేదు). ఎక్కువమంది (నాతో సహా) డబ్బులున్న కొంపలో పుడిదే ఎంతో బాగుండేదని అనుకుంటారు (ఇది మాత్రం వాస్తవిక దృక్పధం). మనుషులకి ఇట్లాంటి ఆలోచనలు పలు సందర్భాల్లో వస్తుంటాయి.

ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది.. ఇంత ఉపోద్ఘాతం రాస్తున్నానంటే అది నా సొంత గోల రాసుకోడానికేనని. ఇప్పుడు నా గొడవ (ఇది కాళోజి 'నా గొడవ' కాదు, నా గొడవే). మానవునిగా జన్మించినందుకు నేను కొన్నిసార్లు చాలా దుఃఖించాను. ఒక్కోసారి నా జీవితం ఫైవ్ స్టార్ హోటల్లో మసాల దోసెలా రుచీపచీ లేకుండా దరిద్రంగా ఉందనిపించేది, ఇంకోసారి గోడ మీద బల్లిలా చలనం లేకుండా ఆగిపోయిందని కూడా అనిపించేది.

ఇప్పుడు కొన్ని నా దుఃఖసమయాలు (అనగా ఏడుపుగొట్టు సందర్భాలు అని అర్ధం). నేను ఇష్టపడ్డ అమ్మాయి తన పుట్టిన్రోజు పార్టీకి నన్ను పిలవకుండా, నా స్నేహితుణ్ని మాత్రమే పిలిచినప్పుడు.. శ్రీదేవి బోనీకపూర్ ని పెళ్లి చేసుకున్నప్పుడు.. పనికిమాలిన సినిమాలు చూట్టమే కాకుండా, తమ అభిమాన హీరో చెప్పిన రాజకీయ పార్టీకే ఓటేద్దామనుకునే వెర్రివెంగళప్పలైన సినిమా పిచ్చోళ్ళని గాంచినప్పుడు.. యిలాంటి సందర్భాలు చాలా రాయొచ్చు.

అయితే - నిజమైన, నిఖార్సైన దుఃఖసమయం మాత్రం పరీక్షల సమయమే. సబ్జక్టు పుస్తకాలు చదవలేక ఎన్నోసార్లు 'జన్మమెత్తితిరా.. అనుభవించితిరా.. ' అని పాడుకుంటూ మిక్కిలి దిగులు చెందేవాణ్ని. ఊర్వశి శారదలా డగ్గుత్తికతో 'దేవుడా! యిలాంటి కష్టం ఆ పగవాడిక్కూడా రానీయొద్దు' అని ఏడిచేవాణ్ని. 'ఓ అష్ట దిక్పాలకులారా! నేనే గనక మహా పతివ్రతనైతే ఈ పరీక్షలు నశించుగాక!' అని శపించేవాణ్ని. ఎన్నిరకాలు ప్రయత్నించినా పరీక్షలు ఆగేవి కావు.

జీవిత సత్యం, జీవన సారం, జన్మరహస్యం శోధించటానికి తీవ్రప్రయత్నం చేసేవాణ్ని. కానీ - గొప్పవిషయాలు ఆలోచించడానికి నా బుర్రలో ఇడ్లీసాంబారు, విఠాలాచార్య సినిమాల జ్ఞానం మించి మరేదీ లేదు. అయితే - మానవుడు తుచ్ఛజీవి (అందుకు ఉదాహరణ నేనే), అందుకే అర్ధం కాని విషయాల్ని కూడా బుర్ర వేడెక్కేలా ఆలోచిస్తాడు.

'అసలు ఒక జీవికి ఫలానా జన్మ అంటూ ఎలా నిర్ణయమవుతుంది? మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు గదా! మరి ఇంత గొప్పజన్మకి ఈ పరీక్షలెందుకు? మార్కులెందుకు?'. ఎంత ఆలోచించినా, సాహితీ పురస్కారం పొందిన తెలుగు కథలా.. విషయం మరింత కాంప్లికేట్ అయ్యేది తప్ప, ఛస్తే అర్ధమయ్యేది కాదు (మనకి అర్ధం కానివన్నీ గొప్ప విషయాలే.. ఏలననగా, గొప్పవిషయాలు మనకి అర్ధం కావు కాబట్టి).

నాకా దుఃఖ సమయంలో కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంటుంది. అవి హాయిగా తింటాయి, పడుకుంటాయి, టైమొస్తే సుఖంగా చచ్చిపోతాయి (వాటికి మనకిలా చచ్చేముందు ICU చెర కూడా ఉండదు కాబట్టి). పెళ్ళీపెటాకులు ఉండవు, కాబట్టి రక్కసులైన భార్యల పీడన కూడా ఉండదు. మరీ ముఖ్యంగా వాళ్లల్లో చంద్రబాబు నాయుళ్ళు, జగన్మోహన రెడ్లు ఉండరు. ఇవన్నీ ఆ జాతులు చేసుకున్న పుణ్యం. మరి నేనెందుకు మనిషిగా పుట్టాను?

ఈ దుఃఖాలన్నీ స్మశాన వైరాగ్యాల్లాగా, పరీక్షలవ్వంగాన్లే మాయమైపొయ్యేవి. 'మానవ జీవితం సేమ్యా పాయసమంత మధురమైనది, బాటా చెప్పంత విలువైనది, గవర్నమెంటు ఉద్యోగమంత స్థిరమైనది. దీనికి కె.విశ్వనాథ్ సినిమాల్లో కుంకుమ బొట్టుకున్నంత పవిత్రత కూడా ఉంది' అనిపించేది.

అటుపై నెమ్మదిగా మనిషికున్న లాభాలు ఒక్కొక్కటే గుర్తుకొచ్చేవి. కుక్కలు, పిల్లులు ఆనంద భవన్లో కుర్చీలో కూర్చుని మసాలా దోసె తిన్లేవు.. నేను తింటున్నాను. పక్షులు కాఫీ, విస్కీ, సిగరెట్లు తాగలేవు.. అవన్నీ నేను తాగుతున్నాను. కావునే పెద్దలు మానవ జన్మ గొప్పదనుంటారు.. ఒప్పుకుంటున్నాను.

కానీ - మనకి మసాలా దోసెలు, కాఫీలున్నట్లే జంతువులక్కూడా ఏవో ఉండే ఉంటాయి. అయితే అవేమిటో మనకి తెలిసే అవకాశం లేదు.. ఎందుకంటే అవొచ్చి మనకి చెప్పవు కాబట్టి (లాంగ్వేజ్ ప్రాబ్లం). అన్ని జన్మల్లోకి మానవజన్మే గొప్పదని ప్రవచించిన ఆ మహానుభావుడు.. తన జన్మని జంతువులు, పక్షుల జన్మతో ఎలా తూచాడో మనకి తెలీదు.

మన తెలుగువాడికో రోగం ఉంది. తను తెలుగు మాట్లాడతాడు కాబట్టి 'తెలుగు లెస్స' అంటాడు. అపచారం, అపచారం.. ఈ మాట ఎవరో పి.వి.నరసింహారావులా అనేక భాషలు నేర్చుకున్న బహుభాషా కోవిదుడు (అసలు ఎవరైనా అన్ని భాషలు నేర్చుకోటం ఎందుకు? మాట్లాడుకోటానికి ఒకటి చాలు కదా.. కాదా?) చెప్పిన మాటయ్యుంటుంది.. కావున ఒప్పుకుందాం.

ఇంకా - ఆ తెలుగువాడే మన పంచెకట్టు గొప్పదంటాడు (అంత గొప్పదైతే రోజూ పంచె ఎందుకు కట్టుకోడు? ఉగాది రోజు మాత్రమే పంచె ఉత్తరీయంతో పగటి వేషం ఎందుకేస్తాడు? అదేమన్నా ప్రేమికుల రోజు లాగా పంచెల రోజా?) ఇవన్నీ మనం అడక్కూడదు. అడిగితే నీకు సంస్కృతి, సాంప్రదాయం (ఇలా అడుగుతున్నానని ఎవరికీ చెప్పకండి - అసలు సంస్కృతి, సాంప్రదాయం అంటే ఏంటి?) పట్ల గౌరవం లేదని గయ్యిమంటారు. అయినా ఇవన్నీ పెద్దపెద్ద విషయాలు.. మనలాంటి అల్పులు ప్రశ్నించరాదు (బ్లాగుల్లో రాసుకోవచ్చు).

జంతువులు, పక్షులు సినిమాలు తియ్యవు, పాటలు పాడవు, పుస్తకాలు రాయవు (ఎవరన్నా ఏ సత్యసాయిబాబా బూడిదలాంటిది వాటి నోట్లో కొడితే మాత్రం చెప్పలేం). అంచేత - మనిషి జన్మ మరీ నేననుకున్నంత నాసి కాదని అనిపిస్తుంది. మనిషికి మాత్రమే సాధ్యమైనవి, సంతోషించదగినవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టం, ఈ అవకాశాన్ని మనుషులందరూ వాడుకోరు (కొందరు తమ జీవితాన్ని పూర్తిగా డబ్బు సంపాదనకి మాత్రమే వెచ్చిస్తారు, వేరే ఇంకేదీ చెయ్యరు).

కొద్దిసేపు ఈ జన్మల గోల పక్కన బెట్టి అసలు విషయంలోకొస్తాను. విసుగ్గా ఉంటే కొందరు ధ్యానం చేస్తారు, మరికొందరు దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రోతారు, మా సుబ్బు రంగ మహల్లో స్పెషల్ నూన్ షోలుగా వేసే మలయాళం సినిమాలు చూసేవాడు (సత్రంలో ఒక రాత్రి, ఆమె అనుభవం, రతినిర్వేదం, అడవిలో అందగత్తెలు వంటి మహిళా చిత్రరాజములు).

దురదృష్టవశాత్తు నాకు ధ్యానం తెలీదు, నిద్ర కూడా అతితక్కువ, రంగ మహాల్ మూతబడి చాల్రోజులయ్యింది. అంచేత - విసుగ్గా అనిపించినప్పుడు యూట్యూబు చూస్తుంటాను. పాత సినిమా పాటలు వింటుంటాను. ఇవ్వాళ 'బైజూ బావ్రా'లో మహమద్ రఫీ పాడిన పాట చూశాను. వెంటనే విసుగు మాయమైంది. మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. 'జీవితమే సఫలము, రాగసుధా భరితము.. ' అని అనార్కలిలా పాడుకోసాగాను. 

(ఏవిటి మరీ చప్పగా రాస్తున్నాను? కొంచెం స్థాయి పెంచుతాను.)

'బైజూ బావ్రా' పాట వింటుంటే - ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. ఉదయాన్నే కురిసిన మంచు బిందువుల మృదుస్పర్శకి సిగ్గులమొగ్గైన మల్లెతీగ వంగి, పక్కగా నున్న బంతిపువ్వుని ముద్దాడినట్లు మనసు పరవశంతో బరువెక్కింది. మందార మకరందం గ్రోలిన తుమ్మెద ఆనందంగా ఝూమ్మంటూ చేస్తున్న రెక్కల చప్పుడు ఆనంద భైరవి రాగంలో విన్నట్లుగా పరమానందభరితుడనై వివశుణ్నయ్యాను. నౌషాద్, రఫీలు నా హృదయాన్ని ఒక తేనెలూరు మధుర సాగరంలో ముంచెత్తారు (ఇంకా పైకి తేల్లేదు).

హోల్డాన్! ఆగక్కడ. హేవిటీ అర్ధం పర్ధం లేని వర్ణనలు? నువ్వేమన్నా భావకవి వనుకుంటున్నావా? ఆ రోజులు చచ్చి చాల్రోజులైంది. ఇంతకీ నువ్వు చెప్పేది నీకాపాట బాగా నచ్చింది. అంతేనా?

ఏవిటో! మంచి రచనలకివి రోజులు కావు కదా!

నీకంత లేదు గానీ.. కొద్దిగా అర్ధమయ్యేట్లు మనుషుల భాషలో చెప్పవా?

ఓకే! ఏదో పేరొస్తుందని అలా రాద్దామనుకున్నాన్లే! తెలుగులో ఇట్లాంటి వర్ణనలు రాసి పెద్దాళ్ళైపోయినవాళ్ళు చాలామందే ఉన్నారు, వారి సరసన పీట కాకపోయినా కనీసం పట్టా అయినా వేసుకుని కూర్చుందామని ఓ చిరు ప్రయత్నం చేశాను. సర్లే! ఇప్పుడు నాకు నిజంగా ఎలా అనిపించిందో రాస్తాను, చదూకో.

నాకీ పాట వింటుంటే మైసూర్ కేఫ్ లో తింటున్న రెండో ఐడ్లీకి మూడోసారి సాంబారు పోయించుకున్నంత కమ్మగా ఉంది. పరమ ఏడుపు సినిమా మధ్యలో హఠాత్తుగా జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసినంత ఎక్సైటింగ్ గా ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి నన్నేకాదు, నా కాంపిటీటర్ని కూడా 'ఛీ' కొడితే కలిగేంత ఆనందంగా ఉంది. మండువేసవిలో చిల్డ్ బీర్ తాగినంత రిలీఫ్ గా ఉంది. ఆర్యూ హేపీ నౌ?

గుడ్, ఇప్పుడు నీ స్టైల్లో చెప్పావు. గో ఎహెడ్.

థాంక్యూ! ఇప్పుడు నన్ను ఎంతగానో ఆనందింపచేసిన 'బైజూ బావ్రా' పాటని ఇస్తున్నాను.. విని ఆనందించండి. 



(picture courtesy : Google)

Sunday, 6 April 2014

జనం


"బామ్మర్దీ!"

"ఏంది బావా?"

"అమ్మయ్యా! మొత్తానికి కిందామీదా పార్టీ టిక్కెట్టు సంపాదించా, ఓ పనైపోయింది." నాయకుడి ఆనందం.

"కంగ్రాట్స్ బావా!" 

"రేపట్నించి మన ప్రచారం దుమ్ము రేగిపోవాలి. కానీ - జనాల్లేరేంటి బామ్మర్ది?" నాయకుడి సందేహం.

"అందుక్కారణం నువ్వే బావా!" 

"నిజమా!?" నాయకుడి ఆశ్చర్యం.

"అవును బావా! నిన్న నువ్వు ప్రెస్సోళ్ళకి ఏం చెప్పావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో."

ఒకక్షణం కళ్ళు మూసుకున్నాడు నాయకుడు. నిన్న ప్రెస్ కి తనేం చెప్పాడో గుర్తొచ్చింది.

"ఓ అదా? అవినీతి, అక్రమాల్ని తరిమి కొడతానన్నాను. అందులో తప్పేంది? ఆ ముక్క అందరూ చెప్పేదేగా?" పెద్దగా నవ్వుతూ అన్నాడు నాయకుడు.

"అక్కడే దెబ్బ తిన్నావ్ బావా! నీ స్టేట్మెంట్ చూసి జనం నీరసపడిపొయ్యారు." పదేళ్ళు పరిశోధన చేసి భారద్దేశంలో పేదరికానికి కారణం కనుక్కున్న సైంటిస్టులా అన్నాడు బామ్మర్ది.

"ఏదో సీటొచ్చిందనే ఆనందంలో ఎదవ కూతలు కూశాను, జనం లేకపోతే మరి నా ప్రచారం ఎట్లా బామ్మర్ది?" నుదురు కొట్టుకున్నాడు నాయకుడు.

ఆపై - తను ముద్దుగా పెంచుకుంటున్న టామీకి ఇక పిల్లలు పుట్టరని తెలిసి దుఃఖించే దొరసానమ్మలా మిక్కిలి బాధ పడసాగాడు నాయకుడు.

బావ బాధ చూళ్లేకపొయ్యాడు బామ్మర్ది. పుట్టినప్పట్నుండి నొప్పంటే ఏంటో తెలీకుండా పెరిగిన సుకుమారి సున్నిత పాదాలు వేసవి మండుటెండలో సర్రున మండినచో కలుగు బాధ వంటిది బావలో కనిపించింది బామ్మర్దికి.

అంచేత అనునయంగా అన్నాడు బామ్మర్ది.

"సర్లే బావా! ఏదోటి చేసి రేపీపాటికి జనాల్ని పోగేయిస్తాలే. నువ్వు బాగా అలిసిపోయ్యావు. ఇవ్వాల్టికింక పడుకో."

అటుపై బామ్మర్ది మందు చప్పరిస్తూ, సిగరెట్లు తగలేస్తూ దీర్ఘముగా ఆలోచించెను. ఆ విధంగా ఒక 'నల్లకుక్క' బ్రాండు ఫుల్ బాటిల్ విస్కీ, మూడు పెట్టెల గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు ఖర్చు చేసెను. ధూమపానము మరియు సురాపానములు మెదడుని శుభ్రపరచి, ఆలోచనా నరములని పదును పెట్టునని ఆర్యోక్తి. అది నిజము కాబోలు.. అందుకే బామ్మర్దిక్కూడా ఒక కత్తిలాంటి ఐడియా వచ్చింది. పిమ్మట ఏదో పత్రికలో విలేఖరి పన్చేసే ఆత్మీయ స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఇరువురూ తాము చెయ్యాల్సిన పని గూర్చి వివరంగా చర్చించుకున్నారు.

మర్నాడు పేపర్ల నిండా నాయకుడి వార్తలే!

'ఫలానా నాయకుడు పార్టీవాళ్ళకి డబ్బిచ్చి టిక్కెట్టు కొనుక్కున్నాట్ట!'

'నాయకుడి ఫ్లాష్ బేక్ పరమ బేడంట, ఇంతకు మునుపు పార్టీవాళ్ళు ఏదో కార్పోరేషన్లో ఏదో పోస్టిస్తే.. కార్పోరేషన్ నిధులన్నీ మింగేశాట్ట.'

'అదేదే పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకు చేసి బాగా వెనకేశాట్ట!'

'అంతేనా? ఇంకా ఉంది. ఒకప్పుడు దొంగసారా అమ్మాడంటా, దొంగనోట్లు మార్చాట్ట, ముండల కంపెనీ నడిపాట్ట!'

'నాయకుడిది రక్తచరిత్ర కూడానంట!'

దాదాపు అన్ని తెలుగు పేపర్లలోనూ అటూఇటుగా ప్రముఖంగా ఈ వార్తలే! కొన్ని పేపర్లైతే బాక్సు కట్టి మరీ ప్రచురించాయి.

పొద్దున్నే పేపర్లు చూసి బావురుమన్నాడు నాయకుడు. అర్జంటుగా బామ్మర్దిని పిలిపించాడు.

హేంగోవర్ కారణాన.. బద్దకంగా, బడలికగా వచ్చాడు బామ్మర్ది.

"వామ్మో!వాయ్యో! ఏందీ వార్తలు బామ్మర్దీ?" నాయకుడి ఆందోళన.

"ఓ! ఆ వార్తలా? అవి రాయించింది నేనేలే బావా!" అంటూ చిద్విలాసంగా నవ్వాడు బామ్మర్ది.

"ఎందుకు?" నాయకుడి అయోమయం.

నాయకుడి చెయ్యుచ్చుకుని ఇంటి ముందుకు లాక్కెళ్ళాడు బామ్మర్ది. ఇంటి ముందు గొర్రెల మందల్లా, ఈగల గుంపుల్లా జనం, జనం మరియు జనం. అక్కడంతా కోలాహలంగా ఉంది.. 'ఆల్కహాలా'హలంగా కూడా ఉంది. జనం ఉత్సాహంగా విజిల్స్ వేస్తున్నారు, ఆనందం పట్టలేక స్టెప్పులేస్తున్నారు, గుండెలు పగిలేలా స్లోగన్లిస్తున్నారు.

"పేదల పెన్నిధి మన నాయకుడు"

"వర్ధిల్లాలి"

"బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నాయకుడు."

"జిందాబాద్."

"ఈళ్ళందర్నీ ఎప్పుడు పోగేశా?" నాయకుడి ఆశ్చర్యం.

"నే పోగెయ్యలా, నీ గూర్చి పేపరోళ్ళు రాసిన వార్తలే వాళ్ళని పోగేశాయి." నవ్వుతూ అన్నాడు బామ్మర్ది.

ఆ జనం చేస్తున్న హడావుడికి నాయకుడు ఆనందంతో పొంగిపొయ్యాడు. అంతలోనే తన గూర్చి వచ్చిన వార్తలు గుర్తొచ్చి.. బిర్యానీలో బొద్దింకని చూసిన వాళ్ళా మొహం వికారంగా పెట్టాడు.

నల్లగా ఉండేవాణ్ని నల్లోడంటే కోపగించుకుంటాడు, బీదవాణ్ని దరిద్రుడంటే గింజుకుంటాడు. అంచేత - తనగూర్చి అన్నీ నిజాలే రాయించిన బామ్మర్ది పట్ల నాయకుడికి చికాకు కలిగింది. కానీ - బామ్మర్ది తన ఫ్లాష్ బ్యాకంతా తన మంచి కోసమే జనాలకి తెలియజెప్పాడు. ఇందులో బామ్మర్ది తప్పేం లేదు. కానీ - ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా.. బ్రాందీలో భృంగామలక తైలం కలిసినట్లుగా, ఫిష్ కర్రీలో ఫినాయిల్ ఒలికినట్లుగా.. వెగటుగా అనిపిస్తుంది.

"నాకా వార్తలు నచ్చలేదు." నాయకుడి ఇబ్బంది.

"అదేంటి బావా అట్లా అంటున్నావు! ఆ వార్తల్ని రాయించడానికి చాలా సొమ్ము, పలుకుబడి ఖర్చు పెట్టాను. నువ్విప్పుడు రాష్ట్రస్థాయి నాయకుడివయిపోయ్యావు, తెలుసా?" గర్వంగా అన్నాడు బామ్మర్ది.

"ఆవుననుకో.. " నాయకుడి నసుగుడు.

"బావా! బాధపడకు. ఇట్లాంటి నెగెటివ్ పబ్లిసిటీ పెళ్లిసంబంధానికైతే ఇబ్బంది గానీ.. రాజకీయాల్లో మాత్రం చాలా మంచిది. ఈ వార్తల్తో నీ అభ్యర్ధిత్వానికి గ్లామర్ కూడా జతయ్యింది, అర్ధం చేసుకో." నచ్చజెప్పచూశాడు బామ్మర్ది.

"కానీ.. " నాయకుడి పీకులాట.

"బావా! అడవిలో పులికి చేతిలో పంజా, నోట్లో కోరలే ఆయుధం, పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీకి తగ్గట్టుగానే పులి వేటాడాలి, తప్పదు.. అది దాని జాతిధర్మం. పులి అహింసావాది అయినట్లైతే ఆకలితో చావాల్సిందేగానీ, ఆహారం దొరికించుకోలేదు. అంచేత రాజకీయనాయకుళ్ళో నీతి, పులిలో సాత్వికత.. చూసేవాళ్ళతో చప్పట్లు కొట్టించుకొనుటకు బాగుండునేమో గానీ.. వారికి మాత్రం ఆత్మహత్యా సదృశం." తత్వం బోధించాడు బామ్మర్ది.

"అవునా?" నాయకుడి కుతూహలం. 

"అబ్బా బావా! నీతో ఇదే చిక్కు. నిన్నేమో ప్రచారానికి జనాలు లేరని బాధ పడ్డావు. ఇప్పుడేమో జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు, సంతోషించవేం? రాజకీయాల్లో పబ్లిసిటీ ముఖ్యం బావా! అది మంచిదా, చెడ్డదా అన్నది అనవసరం. నిన్న 'నేను నిజాయితీపరుణ్నంటూ' జనాలకి నువ్వు తప్పుడు సంకేతాలు పంపావు, ఇవ్వాళ్టి వార్తల్తో నువ్వెవరివో జనాలకి క్లియర్ గా అర్ధమైంది. నీక్కావలసింది వాళ్ళు చేసిపెడతారు, వాళ్ళక్కాల్సింది నువ్వు ఇచ్చేస్తావు, అంతే! సింపుల్." అన్నాడు బామ్మర్ది.

"అంతేనంటావా?" నాయకుడి నూతనోత్సాహం.

"ఓ బావా! నన్ను నమ్ము. రాజకీయాలు అత్యంత నీచమైనవి, హేయమైనవి. ఈ రంగంలో ఎవడైతే లోఫర్, దగుల్బాజి అన్న పేరొందగలడో వాడే రాణించగలడు. అందువలన నీవు సందేహింపక, అతి ఘనమైన నీ గతాన్ని గళమెత్తి చాటినచో నిశ్చయముగా నిన్ను విజయలక్ష్మి వరించును. నామాట విని నీతివాక్యములు వల్లించుట కట్టిపెట్టుము. నీతిమంతులు టీవీ స్టూడియెల్లో రాజకీయ చర్చలు జరపగలరు, ఎలక్షన్లలో డిపాజిట్ సాధింపలేరు. ఇది సత్యము." అంటూ గీతోపదేశం చేశాడు బామ్మర్ది.

"అవును కదా! నా కళ్ళు తెరిపించావ్, థాంక్సులు బామ్మర్దీ! థాంక్సులు." అంటూ ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా బామ్మర్దిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు నాయకుడు.

(picture courtesy : Google)