Friday 18 April 2014

ప్లాస్టిక్కుర్చీలూ! ఏడవకండేడవకండి


ఇది ఎన్నికల సీజన్. రాజకీయ పార్టీలకి అభ్యర్దుల్ని ఎంచుకోటం ఒక పెద్ద ఎక్సర్సైజ్. గెలిచే అవకాశాలున్న పార్టీల్లో టిక్కెట్టు కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. పార్టీ నాయకులు కిందా మీదా పడి అభ్యర్ధుల్ని నిర్ణయిస్తాయి. టిక్కెట్టు దక్కించుకోలేని ఆశావహులు (సహజంగానే) ఆవేశపడతారు, కోపంతో కుతకుతలాడిపోతారు.  

ప్రతి పార్టీ ఆఫీసులోనూ రంగురంగుల ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి. మామూలు రోజుల్లో ఇవి కూర్చోడానికి ఉపయోగపడతాయి. ఎన్నికల సమయంలో టిక్కెట్టు దక్కనివాళ్లకి తమ కోపం వెళ్ళగక్కడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. 

ప్లాస్టిక్ కుర్చీలు కూర్చోడానికి అంత అనువుగా లేకపోయినా, విరక్కొట్టుకోడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. కార్యకర్తలు తమ ప్రతాపం చూపిస్తూ, నేలకేసి బాదినప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ విరిగిపోతాయి. అటుతరవాత, ఇంచక్కా చాలా సులభంగా ఇంకా చిన్న ముక్కలుగా కూడా విరక్కొట్టుకోవచ్చు. కొద్దిసేపటికే ఆ ప్లాస్టిక్ ముక్కలతో భీభత్స రణరంగాన్ని సృష్టించవచ్చు, ఆ విధంగా నాయకత్వానికి (పెద్దగా కష్టపడకుండానే) అసమ్మతి తెలియచెయ్యొచ్చు. 

ఈ మొత్తం చర్య ద్వారా కార్యకర్తలు ఎంతగానో తృప్తినొందుతారు. కుర్చీలన్నీ చస్తాయి గానీ.. మనుషులెవరికీ దెబ్బలు తగలవు. కాబట్టి, కేసులు గట్రా ఉండవు. ఆ కుర్చీలు పెద్ద ఖరీదు కాదు కావున, అటు తరవాత కొత్తవి కొనుక్కోడానికి పార్టీల వాళ్లకి పెద్ద ఇబ్బంది ఉండదు. 

చివరగా - ప్లాస్టిక్కుర్చీలకో మాట..

ప్లాస్టిక్కుర్చీలూ! ఏడవకండేవకండి. నాకు తెలుసు.. మీరు నిస్వార్ధ జీవులు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సందర్భాన మీరు చేస్తున్న ఈ త్యాగం నిరుపమానమైనది. బతికున్నంత కాలం దున్నపోతుల్లాంటి రాజకీయుల ఘోర శరీర బరువుని భారంగా, నిస్సహాయంగా మోయడమే కాకుండా.. చివరాఖరికి వారి చేతిలోనే దారుణహత్యకి గురవుతున్నారు. ఇది మిక్కిలి శోచనీయం. మీకు నా జోహార్లు.


(photos courtesy : Google)

8 comments:

  1. కార్యకర్తల లాగా కుర్చీలు కూడా disposable కదా!

    ReplyDelete
  2. సార్, మీరు ప్లాష్టిక్ కుర్చీలను ఏడవకండి ఏడవకండి అంటున్నారా లేక మమ్మల్నీ ఏడవకండి ఏడవకండి అంటున్నారా? ఎందుకంటే మాది ఆ గతే కదా? అయిదు సంవత్సారాలు మేము వాళ్లని భరిస్తే మమ్మల్ణి (ప్రజల్ని ) కూడా దాదాపు అదే పని చేస్తున్నరు గా?

    ReplyDelete
  3. Dear Ramana, shouldn't it be ఏడవకండేడేవకండి?
    BSR

    ReplyDelete
    Replies
    1. Dear BSR,

      ఈ పదం శ్రీశ్రీ 'జగన్నాథుని రథచక్రాలు' లోది.
      'డ' మిస్ కొట్టాను, ఇప్పుడే సరిచేశాను.
      థాంక్యూ!

      Delete
    2. I meant the extra Da which I misspelt!

      Delete
  4. ఈ సీజన్లో ప్లాస్టిక్ కుర్చీల వ్యాపారం బాగుంటుందనుకుంటాను.

    అయినా ఇలాంటి విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఈ టపాలో చదవండి.

    http://bonagiri.wordpress.com/2014/04/15/mpmlacet-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D/

    ReplyDelete
  5. //ప్లాస్టిక్కుర్చీలూ! ఏడవకండేవకండి.// వస్తున్నారొస్తున్నారు ఇనుప ఫ్రేముల అన్నగారలు

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.