Friday 13 February 2015

డాక్టర్ కేశవరెడ్డి


ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ కేశవరెడ్డి ఇవ్వాల్టినుండి ఇకలేరు. ఆయన నాన్ హాడ్జికిన్స్ లింఫోమాతో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు, ఎక్కువ బాధ పడకుండా పోవాలని కోరుకున్నాను. మరణం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదు. నేనెప్పుడూ నాకు ఇష్టమైనవాళ్ళు హాయిగా, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ వుంటాను. ఇది మీకు సిల్లీగా అనిపించొచ్చు. నాకు మాత్రం - ఐసియుల్లో మృత్యువుతో పోరాడే అభాగ్యుల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా రచనలు రకరకాలు. సరదా రచనలు, వ్యంగ్య రచనలు, వాస్తవిక రచనలు, అధివాస్తవిక రచనలు, అర్ధం కాని రచనలు, అర్ధం పర్ధం లేని రచనలు - ఇలా. తెలుగు సాహిత్యం చెప్పుకోదగ్గంత స్థాయిలో లేదనేది నా అభిప్రాయం. అందుక్కారణం - భారద్దేశంలో, అందునా తెలుగు దేశంలో అక్షరాస్యులు బహుకొద్ది. ఆ కొద్దిలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఉపయోగపడే చదువులకి పరిమితం. కాబట్టి - తెలుగులో సాహిత్యం చదివేవాళ్ళు అతి తక్కువ. ఆ తక్కువ్వాళ్ళల్లో పుస్తకం కొని చదివేవాళ్ళు మరీ తక్కువ. అందువల్ల మనకి పత్రికలు తక్కువ, పుస్తకాలు తక్కువ, పబ్లిషర్లు తక్కువ. కావున - (సహజంగానే) రచయితలకి దరిద్రం ఎక్కువ!

తెలుగులో అనేక రకాల రచనలు. వాటిలో ఎక్కువ రచనలు బజ్జీలు, పునుగులు పొట్లాలుగా కట్టుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరావు. అతితక్కువ రచనలు మాత్రమే నాలుక్కాలాల పాటు భద్రంగా దాచుకోదగ్గవి. కొందరి రచనలు చదవడం బ్రాండెడ్ చికెన్ తిండంతో సమానం - తినేప్పుడు బాగుంటుంది కానీ, తిన్నాక కడుపు పాడవుతుంది! కేశవరెడ్డిది ఏ కేటగిరీయో ఆయా పాఠకులే నిర్ణయించుకోవాలి. 

నేను మాత్రం కేశవరెడ్డిని తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ రచయితల్లో ఒకడిగా భావిస్తున్నాను. నా ఈ భావనకి కొన్ని దశాబ్దాల చరిత్ర వుంది. ఆయన అప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా రాసిన 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్' చదివి (దళితుల జీవితం తెలీకపోవడం వల్ల అప్పుడు నాకు నవల సరీగ్గా అర్ధం కాలేదు) అర్జంటుగా కేశవరెడ్డి అభిమానిగా మారిపొయ్యాను.

గురజాడ అప్పారావు బ్రతికున్నప్పుడు - భవిష్యత్తరాలు తన రచనల గూర్చి (ఈ 'గూర్చి' పరిమాణంలో ఆయన రాసిన సాహిత్యం కన్నా ఎక్కువ) అంతకాలం మాట్లాడుకుంటారని ఆయనకి తెలీదు, తెలిసే అవకాశం లేదు. అలాగే కేశవరెడ్డి రచనలు కూడా వయసు ఎక్కువవుతున్న కొద్దీ (సింగిల్ మాల్ట్ విస్కీలాగా) మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయనే నమ్మకం నాకుంది.

ఇక్కడో అసందర్భ ప్రస్తావన! తెలుగులో ఆల్రెడీ కొందరు రచయితల్ని దేవుళ్ళుగా చేసేశాం, వారి రచనల్ని పవిత్ర గ్రంధాలుగానూ చేసేశాం. ఇది తెలుగుజాతి ఆయా రచయితలకి చేసిన ద్రోహంగానే నేను భావిస్తున్నాను. కేశవరెడ్డిని ఒక మంచి రచయితగా 'మాత్రమే' పరిగణిస్తూ, ఆయన్నెత్తిన కిరీటం పెట్టకుండా, మనిషిగా భూమ్మీదే నిలబెట్టి - విశ్లేషణాత్మక, వివరణాత్మక చర్చలు జరగాలనీ, అటువంటి వాతావరణం వుండాలనీ కోరుకుంటున్నాను.

అయ్యా కేశవరెడ్డిగారూ! మా తెలుగుజాతికి మీ వంతుగా గొప్పసాహిత్యాన్ని సృష్టించి (మా మొహాన కొట్టి) తాపీగా వెళ్ళిపొయ్యారు. అందుగ్గానూ - మీకు మేం మిక్కిలిగా ఋణపడిపొయ్యాం. తెలుగుజాతి ఏం చేసినా ఈ ఋణం తీరేది కాదు కావున - అదలా వుంచేసుకుంటాం!

అన్నట్లు - శ్రీశ్రీ, రావిశాస్త్రి మొదలైనవారు బోల్డన్ని సిగెరెట్లు తగలేస్తూ పైన మీకోసం ఎదురు చూస్తున్నారని అభిజ్ఞు వర్గాల భోగట్టా! వాళ్ళు మీతో చాలా విషయాలు మాట్లాడాల్ట! ఈ లోకంలో కన్నా పై లోకంలోనే మీకు మంచి కంపెనీ వుందబ్బా! ఎంజాయ్!!

(photo courtesy : Google)

16 comments:

  1. ఇది తెలుగుజాతి ఆయా రచయితలకి చేసిన ద్రోహంగానే నేను భావిస్తున్నాను. అర్ధం కాలేదు.

    ReplyDelete
    Replies
    1. "రచయితల్ని దేవుళ్ళుగా చేసేశాం, వారి రచనల్ని పవిత్ర గ్రంధాలుగానూ చేసేశాం."
      స్పష్టంగా రాశాన్నుకున్నానే!? :)

      Delete
  2. డాక్టార్ గారు, ఏడుస్తున్న వాడిని కూడా నవ్వించడం మీకే తెలుసు! నాకు మాత్రం, కొకు,రావి శాస్త్రి, శ్రీ శ్రీ లాంటి ఆత్మియ రచయితల్లో ఆయన ఒక ఆత్మీయుడు. ఆయనకు నివాలలర్పించటం బాగుంది

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! హడావుడిగా రాసేశాను.

      ఇది కేశవరెడ్డికి నివాళి కాదు, ఆయన గూర్చి కొన్ని ఆలోచనలు మాత్రమే.

      Delete
  3. Did koku smoke? BTW Kesavareddy is that rare kind of being - even if anyone tries to elevate him to some exalted status, he would carefully and obstinately remain on the ground!

    ReplyDelete
    Replies
    1. I am deleting koku from the post. Thank you.

      Delete

  4. ఎర్నెస్ట్ హెమింగ్వే ఆఫ్ ఆంధ్ర - డాక్టర్ కేశవ్ రెడ్ది గారు .

    నవలా నాయికల కను సన్నుల తో, పడవలాంటి కార్లతో షికారు కొడుతున్న హీరో ల తో అలరారుతున్న తెలుగు నవలా లోకం ఉలిక్కి పడింది వారి రచనలతో . అతడు అడవిని జయించాడు సైకాలజీ పరం గా మాగ్నమ్ ఓపస్ ఆఫ్ రెడ్డి గారు .

    డాక్టర్ వృత్తి లో ఉండి హౌస్ సర్జన్ ద్వారా నాటి యువత కి స్ఫూర్తి నిచ్చిన కొమ్మూరి వారు ఒక ఎత్తైతే , డాక్టర్ వృత్తి లో ఉండి విభిన్న మైన నవల ల కథా వస్తువు తో , జనవాళీ మాండలీకం తో పాత్రలతో పలికించడం తో కేశవ్ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు .

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ జి,
      'కేశవరెడ్డి అంటే ఎవరు?' అనడక్కుండా ఆయన గూర్చి రాశారు! థాంక్యూ!
      మీ వ్యాఖ్యలో కొమ్మూరి ప్రస్తావన ఎందుకో నాకర్ధం కాలేదు.

      Delete

    2. కేశవ రెడ్డి గారెవరు అనే మొదలెట్టే నండోయ్ !! ఆ పై వారు మా జిల్లా వారు అన్ని చటుక్కున గుర్తుకొచ్చి అబ్బే బుకాయింపులు సాగవని :౦)

      కొమ్మూరి వారు కూడా డాటేరు బాబు గారే కదా వృత్తి రీత్యా ; అంతే గాక వారి కాలానికి వారు మంచి రచనలని అందించి న వారు కూడాను !!

      జిలేబి

      Delete
    3. ఓ! మీరు ఆ రూట్లో వచ్చారా!

      కొమ్మూరి, కేశవరెడ్డి - ఇద్దరూ వైద్యులే. పోలిక అంతటితో సమాప్తం.

      (కేశవరెడ్డిని పాపులర్ రచయితల్తో పోల్చడం అన్యాయం.)

      Delete
  5. >నేనెప్పుడూ నాకు ఇష్టమైనవాళ్ళు హాయిగా, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ వుంటాను. ఇది మీకు సిల్లీగా అనిపించొచ్చు.
    అలా ఎందుకు సిల్లీగా అనిపిస్తుందండీ?


    అనాయేసేన మరణం వినా దైన్యేన జీవనం
    దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతే

    అని పెద్దలు ఎప్పుడో భగవంతుడిని ప్రార్థిస్తూ చెప్పనేచెప్పారు కదా.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      అలాగా! నాకే అలా అనిపిస్తుందనుకున్నానే!:)

      అందుకే - మిడిమిడి జ్ఞానంతో బ్లాగకుండా, విషయాన్ని లోతుగా అధ్యయనం చెయ్యమన్నారు పెద్దలు! :)

      Delete
    2. మిత్రులు రమణగారు,

      ఏ విషయంలోనైనా తగినంతగా అధ్యయనం చేసి మాట్లాడటం సముచితంగా ఉంటుందనే అభిప్రాయం మన సమకాలీన బ్లాగుమేథావుల్లో కొందరికి సుతరామూ నచ్చటం లేదండీ. కొందరైతే మరింత ఉదారంగా, 'మాకు అర్థం కాని దంతా చెత్త కిందే లెక్క' అన్నట్లుగా కూడా ఉద్ఘోషిస్తున్నారు. కాలప్రభావాన్ని అనుసరించి, మౌనముత్తమ భాషణమ్‌ అనుకోవలసి వస్తున్నది. సానుకూలంగా అర్థంచేసుకున్నందుకు గాను అనేక ధన్యవాదాలు.

      Delete
    3. Sorry .. perhaps not the right spot, but just wanted to share it. Recently had a discussion with you about the catch words used by SVR in some of the Telugu Westerns. You are right - Dongre was his catch word in Jagath Jetteelu
      https://www.youtube.com/watch?v=p7QLkl9Keiw

      Delete
  6. వాలైంటైన్స్ డే గొడవ.... క్రికెట్ గొడవ లో డాక్టర్ పి.కేశవ రెడ్డి గారు మరణించారన్న వార్త నేను గమనించలేదు.... మీ బ్లాగ్ లో చూసేదాకా తెలియలేదు..... నిజంగా సారీ.... ఎప్పుడో 1998 లో మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె లు చదివిన తరువాత...కేశవ రెడ్డి గారి రచనా శైలి కి కూడా బానిస ను అయ్యాను... “అతడు అడివిని జయించాడు”, నిజంగా ఒక గొప్ప రచన... కేవలం ఒకే ఒక్క పాత్ర తో నవల మొత్తం మనలని విడవకుండా చదివింపచేస్తుంది...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.