Thursday, 5 March 2015

సిటీ బ్యూటిఫుల్


నిన్న డాక్టర్ కేశవరెడ్డి 'సిటీ బ్యూటిఫుల్' చదివాను. 'సీరియల్‌గా వచ్చినప్పుడు ఈ నవల మొత్తంగా చదివాను' అనుకున్నాను గానీ.. కొన్ని భాగాలు మిస్సయ్యానని చదువుతుంటే అర్ధమైంది. అసలీ నవల సీరియల్‌గా చదవడానికి అస్సలు బాగోదు, ఏకబిగిన చదివితేనే మజా!

ఈ మధ్యన వరసగా 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్', 'మూగవాని పిల్లనిగ్రోవి', 'చివరి గుడిసె', 'మునెమ్మ'ల్ని చదివేశాను. పల్లె వాతావరణం, దళితుల జీవితం నాకు తెలీదు కాబట్టి.. ఆయా నవలల్ని అర్ధం చేసుకుంటూ నిదానంగా చదవాల్సి వచ్చింది. అయితే 'సిటీ బ్యూటిఫుల్' మెడికల్ స్టూడెంట్ కథ కావడం కారణాన - హడావుడిగా, హాయిగా చదివేశాను.

ఇప్పుడు 'సిటీ బ్యూటిఫుల్' గూర్చి కొన్ని ఆలోచనలు -

నవల చదువుతుంటే సోమర్సెట్ మామ్ 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' గుర్తొచ్చింది. మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోతున్నందుకు ఫిలిప్ కూడా మన దేవీదాస్ లాగే క్షోభ పడతాడు. ఫిలిప్ తన క్లబ్ ఫుట్ (వంకర పాదం) గూర్చి బాధ పడితే, దేవీదాస్ తన ఎడమచేతి వాటం గూర్చి చికాగ్గా వుంటాడు. కొద్దిసేపు 'క్రైమ్ ఎండ్ పనిష్‌మెంట్' కూడా గుర్తొచ్చింది. అయితే రాస్కల్నికోవ్‌ది మరీ దుర్భరమైన అసహాయ స్థితి.

డాక్టర్ కేశవరెడ్డి గొప్ప స్టోరీ టెల్లెర్ (ఈ వాక్యం 'కొత్తావకాయ ఘాటుగా వుండును' టైపులో వుందని తెలుసు, కానీ - ఫ్లో కోసం రాయక తప్పింది కాదు). ఆయన మనని సులువుగా కథలోకి లాక్కెళ్ళిపోతాడు. అంచేత - ఆయా పాత్రలతో పాటుగా మనం కూడా ఏడుస్తాం, నవ్వుతాం, కోపగించుకుంటాం. మిత్రులారా! ఈ కేశవరెడ్డి మనని పూర్తిగా తన అధీనంలోకి తీసుకుని పెట్టే అవస్థలు అన్నిన్ని కావు! ఇవన్నీ గొప్ప రచయితల లక్షణాలని విజ్ఞులు చెబుతారు.

'సిటీ బ్యూటిఫుల్' కొన్ని గంటల పాటు సాగిన దేవీదాస్ ఆలోచనల సమాహారం. అవి చదువుతూ అనుభవించాల్సిందే గానీ - ఆ ఉద్వేగాన్ని 'ఫలానా' అంటూ వివరించడం కుదరదు. నా దృష్టిలో - ఇదో మాస్టర్ పీస్. ఇంకా చెప్పాలంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇంతకన్నా వర్ణించడానికి నేను రావిశాస్త్రిని కాదు (ఈ సృష్టిలో రావిశాస్త్రిని మించిన రచయిత లేడు, ఉండటానికి వీల్లేదు).

మొన్నామధ్య 'శంకర్‌దాదా MBBS' సినిమా టీవీలో వచ్చినప్పుడు చూశాను. నాకా సినిమాలో అనేక factual errors కనిపించాయి. అయితే - తెలుగు సినిమాల్లో లాజిక్ వెదకడం, స్టార్ హోటల్లో రుచికరమైన భోజనాన్ని ఆశించడం లాంటిదనే వాస్తవిక దృక్పధం నాలో వున్నందున నోర్మూసుకుని సినిమా చూశాను.

'సిటీ బ్యూటిఫుల్‌'లో ఒక విషయం నాకర్ధం కాలేదు. అర్ధం కాని విషయాల్ని వదిలెయ్యడానికి ఇదేమీ తెలుగు సినిమా కాదు, కేశవరెడ్డి రచన!

మెడికల్ కోర్సు మొదట్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ అనే మూడు సబ్జక్టులు వుంటాయి. వీటిని ప్రి - క్లినికల్ సబ్జక్టులు అంటారు. తరవాత ఆస్పత్రిలో రెగ్యులర్ పోస్టింగ్ (బెడ్ సైడ్ టీచింగ్ కోసం) వేస్తారు. అంటే - ఎనాటమీ పాసయ్యేదాకా స్టూడెంట్‌కి ఆస్పత్రితో ఏ సంబంధమూ వుండదు. అందువల్ల ప్రి - క్లినికల్ బ్లాకులు ఆస్పత్రికి సంబంధం లేకుండా విడిగా, దూరంగా వుంటాయి (గుంటూరు మెడికల్ కాలేజి కేంపస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కేంపస్‌లు వేరువేరుగా వుంటాయి).

'సిటీ బ్యూటిఫుల్‌'లో ఎనాటమీ డిపార్ట్‌మెంట్ హాస్పిటల్ ఆరో అంతస్తులో వున్నట్లుగా వుంది - నాకర్ధం కాలేదు. కేశవరెడ్డి ప్రస్తావించిన పాండిచేరీ హాస్పిటల్ నేనెప్పుడూ చూళ్ళేదు. అంచేత - పాండిచేరీ గవర్నమెంటు సర్వీసులో స్థిరపడ్డ నా స్నేహితుడు డాక్టర్ రమణమూర్తికి ఫోన్ చేశాను. అతని సమాచారం మేరకు - కేశవరెడ్డి చదివిందీ, నవల్లో ఆయన రాసిందీ - JIPMER గూర్చి. అక్కడ ఎనాటమీ డిపార్ట్‌మెంట్ అలానే వుంటుందిట, ఇంకా అలానే వుందిట!

ఇంకో విశేషం - ఆ రోజుల్లో కెమిస్ట్రీ కూడా ఒక సబ్జక్టుగా (PPF - ప్రి ప్రొఫెషనల్ కోర్స్ అనేవాళ్ళు) వుండేది. అటు తరవాత డెబ్భైలలో ఆ కోర్స్ ఎత్తేశారు (అంచేత ఇప్పుడా కోర్స్ లేదు). కావున - డెబ్భైల తరవాత డాక్టర్ కోర్సులో చేరినవారికి దేవీదాస్, లావణ్యల 'కెమిస్ట్రీ ఆఫ్ లవ్' ఇన్ కెమిస్ట్రీ లేబ్ అర్ధం అయ్యే అవకాశం లేదు.

సిటీ బ్యూటిఫుల్ చదివే సాధారణ పాఠకుల కోసం (విషయం సులభంగా అర్ధమవడానికి) డాక్టర్ కోర్సు గూర్చి కొద్దిపాటి సమాచారం ఇస్తే బాగుండేది. కారణం - 'మూగవాని పిల్లనగ్రోవి' చదివేప్పుడు వ్యవసాయం సంగతులు తెలీక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి ఇబ్బందే నాన్ మెడికల్ పాఠకులకి ఈ నవల చదివేప్పుడు కలుగుతుందని నా అనుమానం.

కృతజ్ఞతలు -

ఈమధ్య నా బ్లాగ్ విషయం మర్చిపొయాను. ఆ విషయం గుర్తు చేసిన మిత్రులు - తిరుపాలు, అనిల్ అట్లూరి గార్లకి.  

9 comments:

  1. "ఇంబైసల్ ముండాకొడుకులు" అందరూ అని దేవిదాస్ ఆ రోజుల్లో అనుకోవడం...బహుశ ఆనాటి సాహిత్యంలో అదే బూతు అయిఉంటుంది. ఏకబిగిన చదివిస్తాయి కేశవరెడ్డి నవలలు.
    కాశీభట్ల అన్నట్టు ఇన్‌టర్నల్ మోనలాగ్ ...అందుకనే అంత వీజీగా చదివిస్తుంది. అన్నట్టు మీ 'రుబ్బేయ్యడం' ఎంత వరకు వచ్చింది?

    ReplyDelete
    Replies
    1. రుబ్బడానికి పప్పు కొరత ఏర్పడింది. :)

      (బానిసలు - భగవానువాచ, శ్మాశానం దున్నేరు, రాముడుండాడు - రాజ్యముండాది కోసం వెదకుతున్నాను).

      దేవీదాస్ సైకాలజీ expert. అందుకే 'అందంగా' ఇంబసైల్ ముండాకొడుకులు అనుకుంటాడు. తెలివైనవాళ్ళ తిట్లు అర్ధం చేసుకోడం కష్టం. :)

      Delete
    2. కొంత పప్పు బజారులో దొరకనిది పంపాను...చూసారా?

      Delete
  2. సీరియల్ గా వచ్చినప్పుడు , కాలేజి జీవితం తో పోల్చు కుంటూ, బాగా ఎంజాయ్ చేసాను.గుర్తుకు తెచ్చిన మీకు చాలా ధన్య వాదాలు

    ReplyDelete
    Replies
    1. తెలుగువాళ్ళకి ఒక గొప్ప రచన అందించిన కేశవరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకుందాం.

      Delete
  3. ఉన్నత వ్యక్తిత్వమున్న కేశవరెడ్డి వంటి సంస్కారి గురుంచి, మీ బ్లాగ్ ద్వారా నాలాంటి అజ్ఞానికి తెలిపినందుకు ధన్యవాదములు.

    నిజానికి పవిత్రుడు తెరేష్ బాబు గురించి కూడా, మీ బ్లాగ్ ద్వారానే నాకు తెలిసింది.

    ReplyDelete
    Replies
    1. నాకు మీ కామెంట్ అర్ధం కాలేదు.

      (నా దృష్టిలో కేశవరెడ్డి మంచి రచయిత. తెరేష్ బాబు మంచి కవి. అంతకుమించి - వారి వ్యక్తిగత విషయాలు నాకు తెలీదు.)

      Delete
  4. మిమ్మల్ని సమ్మోహనం లో ముంచెత్తిన డాక్టర్ కేశవ రెడ్డి గారికి వందనములు .
    మీరు బ్లాగ్ ను గుర్తు తెచ్చుకుందుకు అభి వందనంలు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వెరీ మచ్!

      Delete

comments will be moderated, will take sometime to appear.