అదొక చిన్నగది. అంతంత మాత్రం వెల్తుర్తో - దుమ్ముతో, బూజుతో బహుసుందరంగా వుంది. ఆ గది మధ్యన వయసుడిగిన టీపాయ్, దానిపై కాల్చి పడేసిన సిగరెట్ పీకల్తో ఒక ఏష్ ట్రే. ఆ పక్కనే గోల్ద్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్ పేకెట్.
టీపాయ్ ఎదురుగా ఒక పాతకుర్చీ. ఆ కుర్చీలో అతడు! అతడి వయసు సుమారు ముప్పయ్యైదేళ్ళు వుండొచ్చు. తెగులొచ్చి కొరుక్కుపోయిన జొన్నచేల్లా, ఏనుగులు తొక్కేసిన చెరకుతోటలా - అతడి జుట్టు పల్చగా, అడ్డదిడ్డంగా వుంది. అతడు పొడవూ కాదు, పొట్టీ కాదు. నలుపూ కాదు, ఎరుపూ కాదు.
గదికో పక్కగా ఓ డొక్కుబల్ల, దానిమీద చిందరవందరగా కొన్ని పుస్తకాలు. ఆ పుస్తకాలు ఆధార్ కార్డు లేని అనాధల్లా - దిగాలుగా, దీనంగా వున్నాయి. అతగాడికి పుస్తకాలు చదివే అలవాటుంది గానీ, వాటిని జాగ్రత్త చేసుకోడంలో శ్రద్ధ లేనివాడని తెలుస్తుంది.
కొద్దిసేపట్నుండీ అతనా సిగరెట్ పేకెట్‌ని దీక్షగా చూస్తున్నాడు. చూపు సిగరెట్ పేకెట్ మీదనే వుంది కానీ, అతడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపు - అతడా సిగరెట్ పేకెట్‌ని ప్రియురాలి అందమైన చిరునవ్వుని తొలిసారి గాంచినట్లు మురిపెంగా చూశాడు. మరికొద్దిసేపు - జ్యోతిలక్ష్మి క్లబ్బు డ్యాన్సుని ప్రభాకర్రెడ్డి చూసినట్లు మత్తుగా చూశాడు. ఇంకొద్దిసేపు - కరువు ప్రాంతంవాడు బిర్యానీ వైపు చూస్తున్నట్లు ఆబగా, ఆకలిగా చూశాడు.
అసలు విషయమేమనగా -
అతడికి నిన్నో పిడుగులాంటి వార్త, చిన్ననాటి మిత్రుడికి గుండెపోటు! స్నేహితుణ్ణి చూడ్డానికి హడావుడిగా ఆస్పత్రికి వెళ్ళాడు. రోగులు, వారి దుఃఖ బంధువులు, హడావుడి నర్సులు, సీరియస్ డాక్టర్లు.. భూలోకంలో యమలోకంలా వున్న ఆ వాతావరణం అతనికి భయం కలిగించింది.
గుండెపోటు స్నేహితుడు నీరసంగా అన్నాడు "నువ్వు సిగరెట్లు మానెయ్ మిత్రమా! నా స్థితి తెచ్చుకోకు." ఐసీయూ బయట అతని తల్లి బిగ్గరగా రోదిస్తుంది. "సిగరెట్లు మానైమంటే విన్నాడు కాదు బాబూ! ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు చూడు!" ఆ తల్లి రోదన అతనికి వికృతంగా, వికారంగా అనిపించింది. 'మా అబ్బాయి చేత ఆ పాడు సిగరెట్లు కాల్పించిన దొంగ వెధవ్వి నువ్వేరా?' అన్నట్లుగా కూడా అనిపించింది. ఒక్క వుదుట్న అక్కణ్నుండి బయటపడ్డాడు.
ఆ రోజుదాకా అతడు నిర్లక్ష్యంగా, కులాసాగా, దిలాసాగా, సరదాగా బ్రతికేశాడు. 'ఆరోగ్యమే మహా భాగ్యం' అని విన్నాడే గానీ, ఏనాడూ ఆరోగ్యం గూర్చి ఆలోచించిన పాపాన పోలేదు. అతడు తన స్నేహితుడి దుస్థితికి మిక్కిలిగా చింతించాడు. సిగరెట్ అలవాటుని అర్జంటుగా మానెయ్యాలని ఆ క్షణానే నిర్ణయించేసుకున్నాడు. అనుకున్నాడే గానీ - ఆచరించడం అనుకున్నంత సులభంగా అనిపించట్లేదు. నిన్నట్నుండి సిగరెట్లు కాల్చకపోడం మూలానా నాలుక పీకేస్తుంది. నోరంతా బండ బారినట్లుగా, రక్తప్రసరణ ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది.
అతడు నిదానంగా సిగరెట్ పాకెట్ ఓపెన్ చేసి ఒక సిగరెట్ బయటకి తీశాడు. చూడ్డానికి - తెల్లగా, పుల్లలా, అందంగా.. ముద్దొస్తుంది బుజ్జిముండ! సిగరెట్‌కి చివర్నున్న ఫిల్టర్ దర్జాగా దొంగోట్లతో గెల్చిన ఎమ్మెల్యేలా గర్వంగా చూస్తుంది. అతనా సిగరెట్‌ని కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు మధ్యన వుంచుకున్నాడు. సిగరెట్‌ని చూస్తూ ఆలోచించసాగాడు.
ఈ సిగరెట్టు తనకెంత సేవ చేసింది! తను కాలి బూడిదైపోతూ కూడా, తన బ్రతుకు బుగ్గి చేసేవాడికి గొప్ప సుఖాన్నిచ్చే ఈ సిగరెట్టు ఎంత నిస్వార్ధమైనది! అట్టి త్యాగశీలియైన ఈ సిగరెట్టుకి ఎవరైనా ఒక ఎవార్డో, కనీసం ఒక ప్రశంసా పత్రమో ఇస్తే బాగుణ్ణు!
అతడు దీర్ఘంగా నిట్టూర్చాడు. 'ధూమపానము వల్ల త్వరత్వరగా, వడివడిగా చచ్చెదరని వైద్యశాస్త్రములెల్ల అవిరామముగా ఘోషించుచున్నవి. అట్టి మహమ్మారి అలవాటు యెడల నీవింత ప్రీతిపాత్రమైన ఆలోచనలని దరిజేరనీయరాదు. ఇట్టి ధోరణి నిక్కముగా నీకు నష్టము కలుగజేయును.'
అతడు తల విదిలించాడు. 'ఐ గేవప్ స్మోకింగ్. నో సెకండ్ థాట్స్!' అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ ఆలోచనలు!
'సిగరెట్ వల్ల ఉపయోగమేమి? పొగాకులోని నికోటిన్ అను రసాయన పదార్ధము మన నరముల్ని, అందుగల న్యూరోట్రాన్మిటర్లని వాషింగ్ పౌడర్ నిర్మా వలే శుభ్రము చేయును, తద్వారా మన ఆలోచనల్ని పదును పెట్టును.'
'నిజమా! అందుకు సాక్ష్యమేమి?'
'ఎవిడెన్స్ ఈజ్ ప్లెంటీ! ఈ సిగరెట్టు సాయంతో దోస్తవస్కీని దోసెలాగా నమిలెయ్యలేదా? కాఫ్కాని కాఫీలా తాగెయ్యలేదా? ఈ సిగరెట్టే లేకపోతే - వాళ్ళ సంగతటుంచు, కనీసం జేమ్స్ హేడ్లీ చేజ్ అయినా నీకర్ధమయ్యేవాడా? కాదుకదా!
ఈ సిగరెట్ పాఠకులకే కాదు, రచయితల మనోవికాసానిక్కూడా ఎంతగానో తోడ్పడింది! సిగరెట్ తాక్కపోయినట్లైతే శ్రీశ్రీ 'మహాప్రస్థానం' రాసేవాడుకాదు! డాక్టర్ కేశవరెడ్డి 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్' రాసేవాడు కాదు! 'లవబుల్ గాడ్' అంటూ మిల్స్ ఎండ్ బూన్ టైపులో ఇంకేదో రాసేవాడు! 'రాజు - మహిషి' రావిశాస్త్రితో రాయించడానికి లెక్కలేనన్ని సిగరెట్లు ఆత్మాహుతి చేసుకున్నాయట!
రాజకీయ నాయకుడికి అవినీతి ఆరోపణలు శోభనిస్తాయి. అలాగే సాహిత్యానికి సిగరెట్టు సొగసునిస్తుంది. అంచేత - గొప్ప సాహిత్యం పుట్టుక, పెరుగుదలలకి ప్రత్యక్ష కారణం ధూమపానమేనని చరిత్రకారులు, సాహిత్య విమర్శకులు, ఇంకా అనేకమంది జ్ఞానులు, విజ్ఞానులు, అజ్ఞానులు కోడై కూస్తున్నారు, నొక్కి వక్కాణిస్తున్నారు. వారి మాటలు నీవు ఆలకింపుము, ఆచరింపుము, సజ్జనుడవు కమ్ము.
అతడు భారంగా నిట్టూరుస్తూ తలని రెండు చేతుల మధ్య పట్టుకున్నాడు. ఒక్కో పదం స్పష్టంగా ఒత్తి పలుకుతూ తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా అనుకున్నాడు. 'నేను స్మోకింగ్ మానేశాను.'
చేతిలోనున్న ఆ వెలిగించని సిగరెట్‌ని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఆపై ఆ సిగరెట్ ముక్కు దగ్గర తీసుకుని వాసన చూశాడు. కమ్మని పొగాకు వాసన అతని ముక్కుపుటాల్ని మిక్కిలి ఆనందపరిచింది. 'ఆహాహా! ఏమి ఈ సువాసన!'
ఇప్పుడీ సిగరెట్ మానేసి తను సాధించేదేముంది? పక్కింటి పంకజాక్షి మొగుడు రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు కాల్చి నూరేళ్ళు బతకలేదా? సిగరెట్ వాసనంటేనే పడని ఎదురుంటి ఏనుగులాంటి ప్లీడరు గుండెపోటుతో గువ్వలా ఎగిరిపోలేదా? ఎవరెంత కాలం, ఎలా బతుకుతారో నిర్ణయించేది ఆ పైవాడే కానీ - మానవుడు కాదు, కాజాలడు. ఈ నగ్నసత్యం వేదాల్లో కేపిటల్ లెటర్సుతో రాయబడింది. కావున - అనవసర భయాల్తో సిగరెట్టు మానేసి ఈ జీవితంలో వున్న ఆ కొద్ది సుఖాన్ని పోగోట్టుకోలేను!
అతడు స్టైలుగా పెదాల మధ్య సిగరెట్ పెట్టుకున్నాడు, అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ మంటని సిగరెట్ కోన దాకా తెచ్చాడు. సిగరెట్ వెలిగించకుండా.. అలా కాలుతున్న అగ్గిపుల్లతోనే (మళ్ళీ) ఆలోచన్లో పడ్డాడు.
'లేదులేదు! స్మోకింగ్ ఖచ్చితంగా చావుకి పాస్‌పోర్ట్ వంటిది. కాదంటూ శుష్కవాదన నెత్తినెత్తుకోవడం ఆత్మవంచన. తనిన్నాళ్ళూ స్మోకింగ్‌ని ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు మానేసే టైమొచ్చేసింది. ఇకనైనా సిగరెట్లు మానేసి ఆరోగ్య సూత్రాలు పాటించడం నాకూ, నా కుటుంబానికి మంచిది.'
అగ్గిపుల్ల మంట చివరిదాకా వచ్చి వేలుకి తగిలి చురుక్కుమంది. ఆ వేడికి 'స్' అనుకుంటూ పుల్లని పడేశాడు. ఇప్పుడతనో నిర్ణయానికొచ్చాడు. నిదానంగా ఆ సిగరెట్‌ని ముక్కలుగా తుంచేసి ఏష్ ట్రేలో పడేశాడు. సిగరెట్ పేకెట్‌ని కిటికీలోంచి బయటకి గిరాటేశాడు. అతని మనసు ప్రశాంతంగా వుంది!
అవును! అతడు సిగరెట్‌ని జయించాడు!
(picture courtesy : Google)
ఇంబెసైల్ ముండాకొడుకు కూడా సిగరెట్టు తాగాడు. అన్నట్టు తాగాడా, పీల్చాడా? సిగరెట్టు తాగి, పొగ పీల్చాడు అని చెప్పొద్దు మరి!
ReplyDeleteఅవును మీ రుబ్బుడు కార్యక్రమం ఇంకా ఉందా...ముగిసిందా?
బాంది.
రుబ్బుడు తుదిదశకి చేరుకుంది.
Deleteఇంబసైల్ ముండాకొడుకులకి సిగరెట్ తాగే (పీల్చే) తెలివెక్కడేడిచింది! వాళ్ళు పరీక్షల్లో మార్కుల కోసం మాత్రమే బ్రతుకుతుంటారు. :)
పునర్జన్మల మీద మీకు నమ్మకం లేదు కాబోలు ' పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ ' అన్న గిరీశాన్ని మర్చి పోయారు. చాలా ముసలి వాడనా? మీరు వాడిన పద చిత్రాలు (కొత్త కాక పోయినా) చాలా భాగున్నాయి. నాలాంటి ఇంబైసెల్ ముండాకుడుకులకు బుర్రకెక్కేలా :)
ReplyDeleteఅయ్యో! ఎంతమాట! ధూమపాన పితామహుడు గిరీశాన్ని మర్చిపోవడమే! లేదులేదు. (గిరీశం కాల్చింది చుట్టలు కదా!)
Deleteఅబ్బబ్బ !
ReplyDeleteఈ డాటేరు బాబులకి 'సిగ' రెట్టు ల మీద అంత ఖచ్చ ఎందుకో తెలీదు ! ప్చ్ ప్చ్ ! ఒక కాలం లో చేత సిగరెట్టు పట్టి హీరో మాట లాడితే, పొగ వదిలితే ఆ హా ఏమి ఆ వైభవము అని మురిసి పోయిన జనాలు ఈ మధ్య సినిమా మొదలయ్యే ముందే ఓ కాన్సరు ఎడ్ జూసి జడుసు కుంటే , సినిమా మొత్తం లో సవాలక్ష మార్లు దారూ తాగడం, సిగరెట్టూ తాగడం జూపించేస్తూ , క్రింద చిన్న అక్షరాల తో 'injurious to health' అంటూ ఓ స్లోగన్ పడేస్తే సరి పోయే అన బడే రోజులకి వచ్చేసాం !!
ప్చ్ ప్చ్ ! డానికి తోడు, ఒక కాలం లో సిగరెట్టు సువాసన అయితే , ఈ కాలం లో దానికో కంపు వాసన కలిపి బెదర గొట్టే స్తున్నారు !
ప్చ్ ప్చ్ ఐ టీ సి కంపెనీ ఏమి కాను ! బీడీ , సిగరెట్టూ కార్మికులు ఏమి కాను ??
జిలేబి
జిలేబి జీ,
Delete>>బీడీ, సిగరెట్టూ కార్మికులు ఏమి కాను??<<
ఒకప్పుడూ నాకూ ఈ సదుద్దేశమే వుండేది! ఆ తరవాత 'తనకు మాలిన ధర్మం పనికిరాద'ని తెలుసుకున్నాను. :)
ఈ పోస్ట్ కథా సమయం 8 జూలై, 1997 (ఆరోజు నాకు కొడుకు పుట్టాడు).
అతడు అడివి ని జయించాడు లో ముసలి వాడు... ఓడి గెలిచాడు... మరి ఇక్కడేమో డైరెక్ట్ గా గెలుపు.... సారీ సార్.... అందుకే కొంచెం నార్మల్ గా అనిపించింది...
ReplyDeleteమీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పినందుకు థాంక్స్!
Deleteపోస్టుని ఇప్పుడు మళ్ళీ చదివాను. నాకు నచ్చలేదు. ఎందుకు రాశానో తెలీదు. ఒప్పుకుంటున్నాను - ఒక గొప్పరచనని ఇలా అన్వయించడం తప్పే!
నా బ్లాగ్ రీడర్లకి సారీ చెప్పుకుంటూ - పోస్టు చివర్లో డాక్టర్ కేశవరెడ్డి ప్రస్తావన తొలగిస్తున్నాను. ఇకముందు జాగ్రత్తగా వుంటాను.