Tuesday, 17 March 2015

నా బ్లాగ్ రీడర్లకో విజ్ఞప్తి


నేను రెండు దశాబ్దాలకి పైగా వైద్యవృత్తిలో వున్నాను, రోజులో ఎక్కువసేపు పేషంట్లని చూస్తుంటాను. ఒక్కోసారి విసుగ్గా వుంటుంది. అంచేత - రిలీఫ్ కోసం మెయిల్స్ ద్వారా నా ఆలోచనలు స్నేహితులతో పంచుకోటం మొదలెట్టాను. మొదట్లో ఇంగ్లీషులో రాసినా, కొన్నాళ్ళకి తెలుగులో ఎలా రాయాలో తెలుసుకున్నాను. స్నేహితుల సూచనతో - మూడేళ్ళ క్రితం బ్లాగ్ పోస్టులు రాయడం మొదలెట్టాను.

నాక్కొన్ని అభిప్రాయాలున్నాయి. ఆ అభిప్రాయాల్ని నాకిష్టమైన రీతిలో రాస్తుంటాను. బ్లాగ్ యొక్క పర్పస్ కూడా ఇదేనని నా నమ్మకం. నా అభిప్రాయాలు ఎవర్నీ నొప్పించకుండా వుండాలనీ గానీ, అవి జనరంజకంగా వుండాలనీ గానీ - నేనెప్పుడూ అనుకోలేదు. కారణం - కొందరి అభిప్రాయాలు నాకు నచ్చవు. అలాగే - నా అభిప్రాయాలూ చాలామందికి నచ్చకపోవచ్చు. 

నేను బ్లాగ్లోకంలోకి వచ్చిన చాలారోజుల దాకా comment moderation లేదు - 'అన్నిరకాల అభిప్రాయాల్ని తెలుసుకోవాలి' అనుకోవడం వల్ల. అయితే - కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నందున - చిరాకేసింది. నేను బ్లాగ్ రాస్తుంది హాబీగానే గానీ - లెక్చర్లు ఇప్పించుకోటానికో, తిట్టించుకోటానికో కాదు. అప్పట్నుండీ comment moderation ఎనేబుల్ చేశాను.

నేనెప్పుడూ - నేన్రాసిన 'విషయాన్ని' విమర్శిస్తూ రాసిన కామెంట్లని పబ్లిష్ చెయ్యడం ఆపలేదు. ఈ విషయం మీకు నా పాత పోస్టులు చూస్తే తెలుస్తుంది. కొందరు విపరీతమైన వెటకారం, అనవసరపు వ్యంగ్యం వాడినప్పుడు - నాకు నచ్చక, ఆ కామెంట్లని పబ్లిష్ చెయ్యలేదు. అలా చెయ్యడం బ్లాగ్ ఎడ్మిన్‌గా నాకున్న హక్కుగా భావిస్తున్నాను. ఏదేదో రాసి - 'ఎలాగూ ఈ కామెంట్ పబ్లిష్ చెయ్యరని మాకు తెలుసు!' అనేవారిని చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. ముందే తెలిస్తే కష్టపడి కామెంట్ రాయడం దేనికి!?

నన్ను కించపరిచే వారి కోపానికి ప్రధాన కారణం - నా రాతలు వారి రాజకీయ అభిప్రాయాలకి వ్యతిరేకంగా వుండటం. ఇది వారి సమస్య, నా సమస్య కాదు. ఇంకొందరు అప్పుడా విషయం రాయకుండా ఇప్పుడీ విషయం ఎందుకు రాస్తున్నావంటూ దబాయిస్తారు. ఇది నా బ్లాగు. ఒక పోస్ట్ రాయడం, రాయకపోవడం అన్నది నా ఇష్టాఇష్టాలు, మూడ్స్, సమయానుకూలత - మొదలైన అనేక అంశాల మీద ఆధారపడి వుంటుంది. 'ఎప్పుడు రాయాలి? ఏది రాయాలి? ఎంత రాయాలి? అసలు రాయాలా వద్దా?' ఇవన్నీ నిర్ణయించుకునే హక్కు నాకు మాత్రమే వుంది.

ఈమధ్య కొందరు - కూడలి, మాలిక ఎగ్రిగేటర్ల వారికి ఫిర్యాదు చేసి నా బ్లాగు పీకేచ్చేస్తామని బెదిరిస్తున్నారు. నాకా ఎగ్రిగేటర్ల ఎడ్మిన్లు తెలీదు. కావున - వీళ్ళు చెబితే వాళ్ళెందుకు వింటారో అంతకన్నా తెలీదు. అయినా - వాళ్ళలా చేయగలిగితే అది నాకు సహాయం చేసినట్లుగానే భావిస్తాను. ఎందుకంటే - అప్పుడు నా రాతలకి చదువరులు దొరక్క, విసుగు పుట్టి - నేనే రాయడం మానెయ్యొచ్చు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే - నా బ్లాగ్ రెగ్యులర్‌గా చదువుతున్న వారికి ఈ విషయాలు తెలియాలని.

నా బ్లాగ్ రీడర్లకో విజ్ఞప్తి :

నమస్కారం! మీపట్ల నాకు గౌరవం వుంది. మీరు నా రాతలు చదివితే సంతోషం, చదవకపోయినా సంతోషమే! ఇబ్బందిగా వుంటే ఇటు రాకండి. అంతేకానీ - నన్ను విసిగించకండి. సమయం విలువైనది, మీ సమయం వృధా చేసుకుంటూ నా సమయం కూడా వృధా చేయకండి. థాంక్యూ!    

(picture courtesy : Google)

21 comments:

  1. పోస్ట్ నచ్చలె ....... మేము కామెంటేది మీకు మా అభిప్రాయం చెప్పటానికి .... ఆ కామెంటు ఆ పోస్టు వరకె అన్నది ముఖ్య విషయం.
    మీరు బ్లాగడం మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికే కానీ ఎవరినో ఇంప్రెస్స్ చేయడానికి కాదు .....
    అలాంటప్పుడు పిచ్చివాళ్ళ చర్యలకి మీరు ఇంతగా ఇది అయిపోయి ఒక పోస్ట్ పెట్టడం నాకు నచ్చలే.
    గతంలో నేనూ కొన్ని పోస్టుల పై నెగెటివ్ కామెంట్లు రాసిన విషయం గుర్తుంది ... కా నీ అవి ఆ పోస్ట్ వరకే ... అలాంటప్పుడు మీరు వాటి గురించి ఆలోచించడం అనవసరం.
    మీ బ్లాగు అగ్రిగేటర్లలో చూడాల్సిన స్థాయి దాటిపోయింది ...... గూగులమ్మ ని యారమన అనో పనిలేక బ్లాగ్ అనో అడిగితే ఇట్టే వెతికిస్తుంది .... కావున ఒకనాటికి రాయడం మానేయొచ్చు అనే ఆలోచన డిలీట్ చేయండి.

    ReplyDelete
    Replies
    1. అవును. నాక్కూడా మీ కామెంట్లు డిలీట్ చేసిన గుర్తుంది.

      Delete
  2. మన అభి ప్రాయాలు మనం చెప్పుకోవడం వల్ల ఎవరికి ఏ నష్టం ఉండదు. అవతలి వారి అభి ప్రాయం మనం విన్నందు వల్ల కూడా మనకు నష్టం ఉండక్కర్లేదు. కాక పోతే కొందరిలో తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే తాము ఆత్మ రక్షణలో పడినట్లు బ్రమలో ఉంటారు ( ఆత్మ న్యునతా భావం కలిగిన వారు) . అందువల్ల వచ్చిన చిక్కే ఇది. అయినప్పటికి భావ సంఘర్షణ అనేది, ఎవరు వద్దన్నా కాదన్నా, ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అది మనకు మాత్రమే పరిమితం కాదు. మనతోనే అది కునారిల్లి పోదు. మానవ సమాజం ఉన్నంత వరకు అది ఉండనే ఉంటుంది. కాక పోతే అది మనకు సమబందిచిన విషయమేమో అని పీలవు తుంటాము. ఎవరికి ఇష్టమున్న లేకున్నా కాలం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందుకే ఆగదు ఏ నిముషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము అని ఓ సిని కవి పాడు కోవడం మన్మ్ విన్నాం.

    ReplyDelete
    Replies
    1. ఈ సమస్య తెలుగు బ్లాగుల్లో ఎక్కువనుకుంటున్నాను.

      Delete
  3. అసలు నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా పెట్టారు ?? నేను ఎవరో తెలుసా ,నా వెనుక ఎవరున్నారో తెలుసా మీకు !! పీకించేస్తా మీ ఇంటెర్నెట్ కనెక్షన్ పీకేస్తా !! ఆ....... ఆ......... ఆ....

    ReplyDelete
    Replies
    1. మీరు పొరబడుతున్నారు. అది ఖచ్చితంగా నా ఫొటోనే!

      Delete
  4. మానసిక వైద్యులే మానసిక రోగులపై విసుక్కుంటే ఎలాగండీ?

    ReplyDelete
    Replies
    1. ఫీజు కట్టకపోతే విసుగ్గా వుండదా మరి? :)

      Delete
  5. రమణ గారు మీ blogకి నేనొక అజ్ఞాత readerని. మీరు వ్యక్తిగతంగా నాకు తెలియకపోయినా ఈ blog ద్వార సుపరిచితులు. మీరు నాకు చిత్తూరు నాగయ్య నుండి సిగ్మండ్ ఫ్రాయిడ్ దాక చాలామంది వ్యక్తుల్ని, యోగి వేమన నుండి ఆర్ద్ సత్య దాక సినిమాల్ని, ఓహో మేఘమాలా నుండి pink floyd దాక చాలా పాటల్ని, ఇంకా చాలా వాటిని పరిచయం చేసారు. మీ blog ద్వారానే బాలగోపాల్ని తెలుసుకున్నాను. మీరు రాసే చాలా వాటిని ఆస్వాదించాను మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా(కొన్ని).
    శ్రీశ్రీని వెతుకుంటూ(googleల్లో రెండేళ్ళ క్రిందట) మీ blog దాక వచ్చాను. అప్పటి నుండి చదువుతున్నాను regularగా. ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నానంటే మీకు ఎగ్రిగేటర్ల అవసరం లేదని చెప్పటానికే.
    నేను రోజూ మీ blog చూస్తాను ఈ రోజు ఏం రాసుంటారా అనే ఉత్సాహంతో. నాలాంటి ఎంతోమంది అజ్ఞాతంగానే మిమల్ని అభిమానిస్తున్నరు అనే నేననుకుంటున్నాను. నాలాంటివాళ్ళకోసమైనా రాస్తూ ఉండండి.


    ReplyDelete
    Replies
    1. >>ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నానంటే మీకు ఎగ్రిగేటర్ల అవసరం లేదని చెప్పటానికే. <<

      ఈ విషయం నిజంగా నాకు తెలీదు.

      మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
    2. నిఝంగా నిజమేనండి.. నేను blog చదవడం మొదలుపెట్టినప్పుడు ఈ ఎగ్రిగేటర్ల గురించి తెలీదు. ఇక్కడే వాటినిగురించి తెలుసుకున్నాను. googleలో ‘srisri’ అని search చేస్తే మీ blog లింక్ కూడ చూపింది. అలా మీ blog పరిచయమైంది. Thanks to google rao.

      Delete
  6. పైన తేజ పల్లి గారు చెప్పింది కరెక్ట్ .
    నేను కూడా మీ బ్లాగ్ ద్వారా, చాలా మంది రచయతలని , వాళ్ళ రచనలని , తెలుసుకున్నాను , కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు గురించి మరింత సమాచారం మీ ద్వారానే తెలిసింది . ఉదాహరణ లాయర్ చంద్ర గారు . మీ పోస్ట్ లు ద్వారా కొన్ని విషయాల్లో నా ఆలోచనా విధానం మార్చుకున్నాను , మచ్చుకి కవులు / రచయత లకి చేసే సన్మానం లో శాలువా బదులు వాళ్లకి ఉపయోగపడేవి ఇవ్వచ్చు కదా అని . మనుషుల మనస్తత్వాల గురించి మీరు రాసే పోస్ట్ లు భలే ఉండేవి , ఈ మధ్యన అవి లేవు . సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కామెంట్స్ అన్ని మీరు ప్రచురించారు (జస్ట్ ఇప్పుడే దీనికి ముందు రాసిన ఒక కామెంట్ తప్ప ) , ఒక కామెంట్ పరుషంగా రాసినా కూడా . నిజం చెప్పాలంటే అగ్రిగేటర్ అవసరం మీకు లేదు . బిజెపి కన్నా మోడీ ఎలా ఎదిగిపోయాడో, మీరు కూడా అంతే ..

    ReplyDelete

  7. ఆయ్ , అట్లాగే నండీ !

    గుర్తు పెట్టు కుంటా మండీ ! ఇంతకీ మీ బ్లాగు పేరేమి టండీ !! జేకే !!

    ఆ మధ్య జిలేబి అనే ఆవిడ ప్రజ అనే బ్లాగు లో ఈ మాట రాసేర టండి - అది ఇక్కడ 'కాఫీ' పేష్టు చేస్తున్నా నండీ ! ఆయ్

    " కోట్:

    బ్లాగులో కామెంట్లు ఎలా ఉండాలి?

    ఏనుగు కుంభస్థలం మాడు పగుల గొట్టేలా ఉండాలి !

    వ్యాఖ్యాతల పట్ల బ్లాగరు ఎలా ఉండాలి?

    నెమ్మదిగా , నిమ్మళం గా, ఏమండీ , అట్లాగా అండీ అంటూ తల ఊపుతూ వారు చెప్పే దంతా వినేలా ఉండాలి !!

    అన్కోట్"

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      అవునా? ఈ విషయం తెలీక బహు ఆయాసపడ్డానే! :)

      Delete
  8. ఎవరేమన్ననూ, తోడు రాకున్ననూ,
    ఒంటరిగానే, పోరా, బాబూ పో..
    నీదారి నీదే సాగిపోరా..
    నీ గమ్యం (?) చేరుకోరా..

    ReplyDelete
    Replies
    1. గాలివానలో
      వాననీటిలో
      పడవ ప్రయాణం
      తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం! :)

      Delete
  9. సర్, నేను మీ బ్లాగ్ ప్రతి రోజు చూస్తాను. ఒక సమస్యకు నేను ఆలోచించే కోణంలో కాకుండా విభిన్నముగా మీరు చూస్తారు. విశ్లేషిస్తారు. కొన్ని సార్లు అది నాకు అది ఇలాకూడా ఉంటుందా అనిపిస్తుంది.మీరు ఇలాగె రాయండి. ఇష్టం లేని వాళ్ళు చదవడం మానేయోచ్చు.

    మనోహర్

    ReplyDelete
  10. సర్, మీ బ్లాగ్ పరిచయమైనప్పటినుండి నన్ను చికాకు పరచిన ఎన్నో సమయాలనుండి, ఈ మధ్యనే మా అమ్మ వెళ్ళిపోయిన దుఃఖ సమయాల్నించి బయటపడేందుకు కూడా నేను మీ బ్లాగ్‌ని ఆశ్రయించాను. మీరు రాయటాన్ని మానొద్దండి.
    సుధ

    ReplyDelete
    Replies
    1. అలాగా! అయాం సారీ!

      డోంట్ వర్రీ! రాయడం మానెయ్యన్లేండి.

      (ఇవ్వాళ హడావుడిగా ఓ పోస్ట్ రాశాను.)

      Delete

comments will be moderated, will take sometime to appear.