Thursday, 30 April 2015

సిత్తర్లేగ్గాడు (రావిశాస్త్రి పాత్రలు - 2)


పేరు : సిత్తర్లేగ్గాడు (అసలు పేరు అప్పలసూరి)

వృత్తి : పిక్ పాకెటింగ్

అడ్రెస్ : 'మూడు కథల బంగారం'లో బంగారిగాడి కత.

(సిత్తర్లేగ్గాడి వివరాలన్నీ బంగారిగాడే చెబుతాడు, కథలో ఈ పాత్రకి సంభాషణలుండవు.)

రూపురేఖలు : 

ఆడికి పద్నాలుగేళ్ళుంటాయి గానీ, పన్నెండో పద్దకొండో ఏళ్ళవోళ్ళా ఉండేవాడు. ఆడి మొకం జూస్తె నిన్న పుట్టిన పాపమొకం ఆడిది. అంత ముద్దుగా అమ్మాయకంగా ఉండీవోడు. గిల్లితే పాలు కారతాడు. కొడితే ఒందలు యేలే కొడతాడు. ఆడికి ఉన్నన్ని ఒన్నెలూ శిన్నెలూ ఆ ఒయసులో ఉంకోడికి ఉండవు. అందుకే ఆణ్ని సిత్తర్లేగ్గాడని అనీవోరు.

మరిన్ని వివరాలు :

సిత్తర్లేగ్గాడూ, సత్తరకాయగాడూ, సిలకముక్కుగాడు ముగ్గురూ జాయింటుగా బిజినెస్సు (జేబులు కొట్టడం) చేసేవాళ్ళు. రైల్లో దొంగతనం చేస్తూ సిలకముక్కుగాడు పట్టుబడతాడు. పోలీసులకి అప్పజెబ్తారనే భయంతో నడుస్తున్న రైల్లోంచి దూకి చనిపోతాడు. సిత్తర్లేగ్గాడు వృత్తిలో చాలా ఆనెస్టీగా వుండేవాడు. ఈ విషయం మనకి 'నీలామహల్ సిన్మాలు కాడ ఆడపిర్రలోడి పర్సు' కొట్టేసిన ఉదంతంతో అర్ధమవుతుంది.

సిత్తర్లేగ్గాడు ఒయిసుకి సిన్నోడేగాని ఆడి అర్జన మీద మూడు కుటమానాలు కులాసాగ్గా ఎళ్ళిపొయ్యేవి. ఆడి అమ్మకీ అయ్యకీ ఆడు ఒక్కుడే కొడుకు. ఆడి అయ్యకి లెప్పరసీ ఉండేది. ఆడు బస్సులస్టాండు కాడ ముందల గోనె పరుసుకుని కూర్సుండీ వోడు. గోన్సంచ్చి మీద పడీ డబ్బుల్తొ ఆడికి దినం ఎళ్ళిపొయ్యేది. ఆడి పెళ్ళాం - అంటె సిత్తర్లేగ్గాడి తల్లి - ఒప్పుడో సచ్చిపొయ్యింది. ఆడికి ఓ పెద్దమ్మా ఓ పిన్నమ్మా ఉండీవోరు. ఆళ్ళిద్దరూ యెదవరాళ్ళే. ఇద్దరికీ ఆడపిల్లలే. సొలసొలమంటా డజినుమంది ఉండీవోరు. ఈడి సురుకుతనంతో సంపాయిచ్చిన డబ్బుతోనే ఆళ్ళ పోసాకారాలు ఈడి పోసాకారవూఁ గూడా జరిగీయ్యి.

సిత్తర్లేగ్గాడు కడదేరిన వైనం :

ఓ సుట్టు సిత్తర్లేగ్గాడు కొత్తమాసకి పిన్నమ్మకి కోక ఎటడానికి సేతల సఁవుఁర్లేక ఓ బట్టల సావుకారి సాపుకి ఎళ్లి ఓ కోక దాసీబోతా దొక్కిపొయ్యాడు.

పొగులు పది గంటలయ్యింది. సూరుడు పెచండంగ్గ కొత్త లా ఎండాడ్డరు సర్కిలు ముండ్ల కంపినీలు రెయిడు జేసినట్లు ఊర్ని రెయిడు జేసేస్తన్నాడు. రోడ్డు మీద పావొంతు నీడా ముప్పావొంతు ఎండా ఉన్నయ్యి. నీడ సైడు కొట్లోకెళ్ళి కోకతో దొక్కిపొయ్యేడు సిత్తర్లేక్క!

మరింఁక ఆణ్ని కొట్టేరండీ సావుకార్లు! ఇటు ఒందగజాలు అటు ఒందగజాలూ దూరంల ఇట్టటు రొండు సైడ్లూ ఉన్న సావుకార్లందరొచ్చి ఆణ్ని గొడ్డుని బాదినట్లు బాదినారండి.

సిత్తర్లేక్కి ఊపిరెంతండి? ఆడు నిన్న పుట్టిన పాప గదండి! ఆడి ఊపిరెంతండి? సావుకార్ల కట్టుకీ పెట్టుకీ సిత్తర్లేక బలైపోనాడండి. రోడ్ల నెత్తురు కక్కోని రోడ్డు మీద పడిపొయ్యేడండి. సకబాగం ఎండ్ల ఉండిపొయ్యిందండి. సకబాగం నీడల మిగిలిపొయ్యిందండి.

నిన్న పుట్టిన పాప ఇయ్యాళ నెత్తురు కక్కొని ఈది మద్దె ఎండ్ల ఎలికిల బడిపొయ్యి సచ్చిపోతే దాని మొకం ఎలాగ్గుంటదండి? నా పుట్టక్కీ నా బతుక్కీ నా నవ్వుకీ ఏటి కారనం ఒవుడు కారనం అని పెశ్నించినట్టుగ్గ ఉంటుందండి. సచ్చిపొయ్యేక ఆ ఎండల సిత్తర్లేక మొకం సరిగలాగ్గె ఉన్నదండి.

సిత్తర్లేగ్గాడి చావు తరవాత అతని కుటుంబం ఏమైంది? :

సిత్తర్లేగ్గాడి పెద్దమ్మనీ పిన్నమ్మనీ ఓ పోలీసు యెడ్డుగోరు దేవుళ్ళా ఆదుకున్నాడు. ఆడియి లేడికళ్ళూ, లంజకళ్ళూను. తొత్తుకొడుకు. యెడ్డుగోరు పెద్దమ్మ, పిన్నమ్మల డజనుమంది ఆడపిల్లల్ని 'ఓడుకునీవోరు'. ఆళ్ళసేత దొంగసారా యేపారం ఎట్టిఁచ్చేడు. సంసారపచ్చెంగ ముండ్ల కంపినీ నడిపిఁచ్చేడు. ఆడి దయవొల్ల ఆళ్ళు ఇస్తరిల్లి రుద్దిలోకి ఒచ్చేరు.

ఇంతటితో సిత్తర్లేగ్గాడి సమాచారం సమాప్తం. 

P.S. - *italics belong to రావిశాస్త్రి

(picture courtesy : Google)

Wednesday, 29 April 2015

నాయుడు (రావిశాస్త్రి పాత్రలు -1)

పేరు : నాయుడు

వృత్తి : దొంగనోట్ల ముఠాకి 'బోకరు'. అంటే - దొంగనోట్లని చెప్పి చిత్తు కాయితాలిచ్చి మోసం చేసే ముఠాకి "ఎర్రిపీర్ల"ని తెచ్చే పని. 

అడ్రస్ : 'మూడు కథల బంగారం'లో బంగారిగాడి కత.

రూపురేఖలు : 'సిలక్కట్టూ కళ్ళీలాల్సోడు, యాపయ్యేళ్ళోడు'.

నాయుడి దగ్గర రాజ్యం గూర్చీ, రాజ్యస్వభావం గూర్చీ 'తీరీలు, సిద్దాంతాలు' చాలానే వున్నాయి.  

ఓపాలి బంగారిగాడికి ఏటి సెప్పేడంటే -

"(దొంగలం) మనం సోరీలూ సీటింగులూ సెయ్యడానికి మనకి అతాట్టి ఏటుంది? అతాట్టీ ఏటీ లెద్దు. రాజు రాజ్జెం జెయ్యడానికి ఆడికి అతాట్టి ఏటుంది? జెబ్బలఁవేఁ ఆడికి అతాట్టి. ఆ బలవేఁ ఆడు సేసీ పనులన్నింటికి అధాటీ! ఆ అతాట్టితో ఆడు ఏటి జేస్తడు? పన్నులేస్తాడు, పరిపాలిస్తాడు. అయితే, పెజల్ని పరిపాలిచ్చడానికి ఇన్ని పన్నులక్కర్లెద్దు. కానీ ఆడు అక్కర్లేని పన్నులొసూల్జేసి ఆడు బావుపడి ఆడి సపోటర్సుని బాగుజేస్తాడు. ఆడి సపోటర్సూ అంటే ఆళ్ళెవుళ్ళు? ఆళ్ళంతా కూడా ఆళ్ళ జెబ్బల బలమ్మీదే ఆ రాజుని నిలబెట్టినోళ్ళన్నమాట. మనం మన దొంగరాబడి ఓటాలేసుకున్నట్టె ఆళ్ళు కూడా ఓటాలేస్సుకుంటారన్నమాట. మనకీ అళ్ళకీ తేడా యేటంటే మనం రాస్యంగా ఓటాలేసుకుంటాం. ఆళ్ళు బాగాటంగ ఏసిస్సుకుంటారు. అయితే పెజలంతా కలిసి పెజల డబ్బు మీరిలా ఓటాలేసీసుకోడం ఏట్రా లంజాకొడకల్లారా అని తిరగబడకుండా ఉండానికి రాజుకి రొండుకళ్ళూ కాళ్ళూ సేతులూ ఉన్నయ్యి. కళ్ళు పోలీసోళ్ళు. మిల్ట్రీ కాళ్ళూ సేతులు.

కళ్ళేటి సేస్తయంటే కనిపెడుతుంటయి. ఎక్కడ ఎవుడు మన అతాట్టిని అటకాయిస్తడు, ఎక్కడ ఎవుడు ఏ అల్లరి సేస్తన్నాడు, ఎవుణ్ని మనం ఒప్పుడు అణిసెయ్యాల? ఇల్లాటియన్ని కళ్ళు కనిపెట్టి రాజుకి ఓర్తలు సేరేస్తుంటయ్యన్నమాట. సిన్నసిన్న టకాయిఁప్పులైతే పితూరీలే అయితే పోలీసోళ్ళే సరదీసుకుంటరు. టకాయిఁప్పు దిరుగుబాటైతే రాజు అప్పుడు ఫీల్డులోకి మిల్ట్రీ దిఁచ్చతుడన్నమాట. కళ్ళు లేపోతే రాజు గుడ్డోడన్నమాటే గదా మరి! మరిఁక్క కాళ్ళూ సేతులూ దెబ్బదినీసినయ్యంటే ఆడి అతాట్టి పొయ్యినట్టే గదా మరి. అందకే కళ్ళూ కాళ్ళూ సేతల సంరచ్చన కోసరం రాజులు కోట్లు కర్సు సేస్తుంటరు. డబ్బెవుడిది? పెజల్ది! ఆ డబ్బుతో పాతెయ్యడం ఒవుళ్ని? పెజల్ని!"

దొంగలు పోలీసులకి లంచం ఎందుకిస్తారు? ఎందుకో నాయుడికి బాగా తెలుసు.

"అతాట్టి లేకండా మనం సోరీలు సేసి రాజుని యెతిక్కరిస్తం గాబట్టి ఆడి దెబ్బకి మనం దొరక్కుండా ఉండాలంటే మనం ఆడి కళ్ళు కప్పాల. ఆడి కళ్ళు ఒవుళ్ళు? పోలీసోళ్ళు. ఆళ్ళకి నువ్వు కళ్ళు అప్పగలవా? కప్పలెవ్వు. ఎంచేత? ఆళ్ళు తెల్లార్లెగిస్తే దొంగలమద్దే తిరుగులాడతారు. నువ్వు దొంగతనం సేయిస్సి ఇయ్యాళ కనబడకండబోయినా మరి నాలుగు దినాలకైనా కానరాకుండా పోవు. అంచేత్త ఆళ్ళ కళ్ళు కప్పలేం. కప్పలేనప్పుడు ఏటి జెయ్యాల? ఆలోసిచ్చాల. ఆలొసిచ్చి, కళ్ళకి బెత్తెడు కిందిని పెతీవోడికీ నోరున్నట్లుగనే పెతి పోలీసోడిక్కూడా నోరుంటదని దెలుసుకుని ఆ నోటికి లంచఁవనే కంచం అందిచ్చాల. అందిచ్చగనే కన్ను కూసింతసేపు మూసుకుంటది. కాకపోతె ఉంకో దిక్కుకి తిరుగుద్ది. ఆ టయాంల మన పన్లు మనం సక్కబెట్టుకోవాల. అంచేత, ఏంటంటే : సోరీయే అవనీ సీటింగే అవనీ లేపొతె కొట్టాటే గానీ, మనం మన పన్లు సాటుగా సేసుకోడవేఁగాదు పోలీసోడి సపోటుతో ఆడికి సెప్పి సేసుకోడం బెస్టు. సపోటు లేకండా పన్లు మనం సేసుకుంటే సేసుకొవ్వొచ్చు. కానీ, దొరికిపొయిన్నాడు పాతాలలోకానికి పయనం కాడానికి మూటా ముల్లే సరుదుకు సిద్ధంగ ఉండాల్సిందే! పుల్లూ పాఁవుఁలూ ఏనుగులు పగోణ్ని మరిసిపోవంట. పోలీసోడు గూడా అంతే."

ఇన్ని విషయాలు గ్రహించాడు కనుకనే నాయుడు సూర్రావెడ్డు పట్ల చాలా గౌరవంగా మెసలుకుంటాడు. సీను సస్సెస్‌ఫుల్‌గా జరిపించీసి తన ఓటా తనుచ్చేసుకుని మరింక కనపడ్డు. 

నాయుడూ! నీ తెలివికి హేట్సాఫ్ మేన్! 

P.S. - *italics belong to రావిశాస్త్రి

(photo courtesy : Google)

Tuesday, 21 April 2015

తప్పు చేశావ్ మైకీ!


వయసుతో పాటు మనుషులకి ఇష్టాయిష్టాలు కూడా మారుతుంటాయ్. నాకు ఒక వయసులో సినిమాలంటే చాలా ఇష్టం, ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే ఇష్టం. అప్పుడప్పుడు ఏదైనా సినిమా చూద్దామనిపిస్తుంది. కానీ ఆ 'ఏదైనా' సినిమా ఎలా వుంటుందో తెలీదు. తీరా చూశాక తలనొప్పి రాదని గ్యారెంటీ లేదు, అప్పుడు బోల్డెంత సమయం వృధా అయిపోయిందని బాధపడాలి. అంచేత నేనెప్పుడూ కొత్తసినిమా చూసే ధైర్యం చెయ్యను, ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ చూస్తాను. ఆ క్రమంలో ఈ మధ్య నేను బాగా ఇష్టపడే 'గాడ్‌ఫాదర్ పార్ట్ 2' మళ్ళీ చూశాను.

ఈ సినిమా నాకెందుకు బాగా నచ్చింది?

గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూస్తుంటే నాకు ఒక మంచి నవల చదువుతున్నట్లుగా అనిపిస్తుంది, క్రమేపి కథలో లీనమైపోతాను. ఆ దృశ్యాలు నాముందు జరుగుతున్నట్లుగా, వాటిలో నేనూ ఒక భాగం అయినట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించడం మంచి సినిమా లక్షణం అని ఎవరో చెప్పగా విన్నను.

ఒక సినిమా హిట్టైతే, ఆ సక్సెస్‌ని మరింతగా సొమ్ము చేసుకునేందుకు హాలీవుడ్ వాళ్ళు దానికి సీక్వెల్ తీస్తుంటారు. ఈ గాడ్‌ఫాదర్ పార్ట్ 2 కూడా అలా తీసిందే. సాధారణంగా ఇట్లా తీసిన సీక్వెల్స్ అసలు కన్నా తక్కువ స్థాయిలో వుంటాయి. అయితే, గాడ్‌ఫాదర్ పార్ట్ 2 అందుకు మినహాయింపు.

చదువుకునే రోజుల్లో - నేనూ, నా స్నేహితులు నిశాచరులం. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం పిశాచ లక్షణమా? లేక పూర్వజన్మలో మేం రాత్రిళ్ళు గోడలకి కన్నాలేసే దొంగలమా? అన్నది ఆలోచించవలసి వుంది. ఏది ఏమైనప్పటికీ - మేమంతా పగలు కంటే రాత్రిళ్ళే హుషారుగా వుండేవాళ్ళం! పరీక్షలుంటే టెక్స్టు పుస్తకాలు, లేకపోతే శ్రీదేవి బుక్ స్టాల్ అద్దె పుస్తకాలు రాత్రిపూట మా ఆహారం. సెక్సు పుస్తకాల దగ్గర్నుండి, ఇంగ్లీషు క్లాసిక్స్ దాకా - దేన్నీ వదిలేవాళ్ళం కాదు.

మేం చదివిన కొన్ని ఇంగ్లీషు నవలలు సినిమాగా వచ్చేవి. నవలకీ, సినిమాకీ మధ్య జరిగిన మార్పుల గూర్చి తీవ్రచర్చలు జరిగేవి. ఆ ప్రాసెస్‌లో మేరియో పూజో 'గాడ్‌ఫాదర్' నవలని చదివేశాం. చదవడమంటే అట్లాఇట్లా కాదు - పిప్పిపిప్పి చేశాం, పొడిపొడి చేశాం. 'ఆహా! నేరసామ్రాజ్యం ఎంత గొప్పది!' అని సిసీలియన్ల మాఫియా నేరాలకి ముచ్చటపడుతూ - వారి నేర విలువలకీ, నిజాయితీకీ అబ్బురపడుతూ - సినిమా చూసి మరింతగా ఆనందించాం.

కారణాలు గుర్తులేవు గానీ, నేను గాడ్ ఫాదర్ పార్ట్ 2 ని కొన్నేళ్ళపాటు మిస్సయ్యాను. ఆ తరవాతెప్పుడో చూశాను. గాడ్‌ఫాదర్ కన్నా గాడ్‌ఫాదర్ పార్ట్ 2 బాగుందనిపించింది. అందుక్కారణం - తండ్రీ కొడుకుల కథని ముందుకు వెనక్కీ తీసుకెళ్తూ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నెరేట్ చేసిన విధం. ఈ విధానాన్ని నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటారు. క్వింటిన్ టరాంటినో సినిమాలు చూస్తే ఈ విధానం గూర్చి ఇంకా బాగా తెలుస్తుంది.

సరే! నలభయ్యేళ్ళ తరవాత గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి ఏముంటుంది? తెలుగు టీవీ చానెళ్ళవారిలా అల్ పచీనో, రాబర్ట్ డీ నీరో గొప్ప నటులనో.. కొప్పోలా మంచి దర్శకుడనో అరిగిపోయిన మాటల్తో సినిమా గూర్చి చెప్పబోవడం హైట్సాఫ్ భావదారిద్ర్యం. కాబట్టి నేనా పని చెయ్యబోవట్లేదు. 


గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూసినప్పుడల్లా, చివర్లో నాకు మనసు భారంగా అయిపోతుంది. అందుకు కారకుడు ఫ్రీడో కార్లియోనె! అమ్మయ్య! గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి నాకో పాయింట్ దొరికింది. ఇప్పుడు ఫ్రీడో పట్ల నా సానుభూతి ఎందుకో రాస్తాను.

డాన్ వీటో కార్లియోనెకి ముగ్గురు కోడుకులు, ఒక కూతురు. పెద్దవాడు సాని డైనమిక్ ఎండ్ డేషింగ్. రెండోవాడు ఫ్రీడో మంచివాడు - కొద్దిగా అమాయకుడు, ఎక్కువగా అసమర్ధుడు. అందుకే శత్రువులు తండ్రిని కాల్చేప్పుడు చేతిలో తుపాకీ ఉంచుకుని కూడా తిరిగి కాల్చలేకపోతాడు. ఇక మూడోవాడైన మైకేల్ గూర్చి చెప్పేదేముంది? రెస్టారెంట్‌లో సొలొజొని చంపడంతో అతని ప్రతిభేంటో లోకానికి అర్ధమైపోతుంది.

సాని, వీటో కార్లియోనిల మరణం తరవాత మైకేల్ డాన్ అవుతాడు. జూదగృహాలు, వ్యభిచార గృహాల మీద పర్యవేక్షణ వంటి చిన్నపనులు ఫ్రీడోకి అప్పజెబుతాడు మైకేల్. వీటో కార్లియోని దత్తపుత్రుడైన టామ్ హేగన్‌ మైకేల్‌కి కుడిభజం. తననెవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం ఫ్రీడోని అసంతృప్తికి గురి చేస్తుంది. మైకేల్ ప్రత్యర్ధి హైమన్ రాత్ మనిషి జాని ఓలాకి సమాచారం (?) ఇస్తాడు (అది తన కుటుంబానికి ప్రమాదం అని ఫ్రీడోకి తెలీదు). ఫలితంగా బెడ్రూములో మైకేల్ మీద హత్యాయత్నం జరుగుతుంది.

కొన్నాళ్ళకి ఇంటిదొంగ ఫ్రీడోనేనని మైకేల్ అర్ధం చేసుకుంటాడు. క్యూబాలో ఫిదేల్ కేస్ట్రో నాయకత్వంలో తిరుగుబాటుదారులు బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేసేప్పుడు - 'ఫ్రీడో! అది నువ్వేనని నాకు తెలుసు!' అని చెవిలో చెబుతాడు మైకేల్. తమ్ముడు తనని బ్రతకనివ్వడని భయపడి న్యూయార్క్ పారిపోతాడు ఫ్రీడో. ఫ్రాంక్ పెంటంగలి వల్ల సెనెట్ కమిటీ విచారణని ఎదుర్కునే కష్టాల్లో పడతాడు మైకేల్. పారిపోయిన ఫ్రీడోని న్యూయార్క్ నుండి పిలిపించి కేసుకి కావలసిన సమాచారం రాబడతాడు మైకేల్.

ఫ్రీడో ఇద్దరు సమర్ధులైన సోదరుల మధ్య పుట్టిన అమాయకుడు, అందుకే జానీ ఓలాని నమ్మాడు. అతనో ఫూల్, ఈడియట్. ఆ విషయం మైకేల్‌కీ తెలుసు. కుటుంబంలో సోదరుల మధ్య పోటీ వుంటుంది, వారిలోవారికి తమకన్నా సమర్ధులైనవారి పట్ల ఈర్ష్యాసూయలు వుంటాయి. దీన్ని 'సిబ్లింగ్ రైవల్రీ' అంటారు. జరిగినదానికి బాధ పడుతూ ఫ్రీడో కూడా అలాగే మాట్లాడతాడు. ఫ్రీడో మాటల్ని పట్టించుకోకుండా - జన్మలో నీ మొహం నాకు చూపించొద్దంటాడు మైకేల్. ఆ సీన్ ఇక్కడ ఇస్తున్నాను, చూడండి.


ఇక్కడ దాకా బాగానే వుంది. మైకేల్‌ వద్దన్నాక తమ్ముడికి దూరంగా ఎక్కడో తన బ్రతుకు తను బ్రతికేవాడు ఫ్రీడో. కానీ మైకేల్ దుర్మార్గుడు. ఈ విషయాన్ని మైకేల్ భార్య కే బాగా అర్ధం చేసుకుంటుంది, అందుకే అతన్ని అసహ్యించుకుని వదిలేస్తుంది. తల్లి బ్రతికున్నంత కాలం ఫ్రీడోని ఏమీ చెయ్యొద్దని ఆదేశిస్తాడు మైకేల్. అసలు మైకేల్‌కి ఫ్రీడోని చంపాల్సిన అవసరం ఏమిటి!?

తల్లి మరణించినప్పుడు - ఫ్రీడోని క్షమించమని చెల్లి ప్రాధేయపడటంతో ఫ్రీడోని చేరదీస్తాడు మైకేల్. కానీ - అతన్దంతా నటన, చెల్లెల్ని కూడా నమ్మించి మోసం చేస్తాడు మైకేల్. అర్భకుడైన అన్నని చంపడానికి ఇన్ని నాటకాలా! మైకేల్ తన తండ్రిలాగా మనుషుల్ని నమ్మడు, అన్నలాగా ఎమోషనల్ కాదు. అతనికన్నీ వ్యాపార ప్రయోజనాలే తప్ప విలువలు శూన్యం. అందుకే - ఫ్రీడోతో మంచిగా వున్నట్లుగా నమ్మించి చంపించేస్తాడు మైకేల్. ఫ్రీడో చావుతో సినిమా ముగుస్తుంది, సరీగ్గా ఇక్కడే నా మనసు భారంగా అయిపోతుంది!

ఈ సినిమాలో ఎట్లా చూసుకున్నా ఫ్రీడో హత్య సమర్ధనీయం కాదు. ఫ్రీడోకి తమ్ముడంటే ప్రేమ, కలలో కూడా అతనికి హాని తలపెట్టడు, పెట్టేంత సమర్ధత కూడా లేనివాడు. అట్లాంటి ఫ్రీడోని నమ్మించి, ఫిషింగ్ చేస్తున్నప్పుడు వెనకనుండి తలలోకి తుపాకీతో కాల్చి చంపించడం.. చాలా దుర్మార్గం కదూ!

సిసిలియన్లు మన తెలుగు వాళ్ళలాగే కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలవాళ్ళు. సొంత మనుషుల్ని చంపడం వారి ఆలోచనలకి, నియమాలకి విరుద్ధం. వీటో కార్లియోని తప్పు చేసినవారిని క్షమించగలడు, మైకేల్‌కి క్షమించడం అన్న పదానికి అర్ధం తెలీదు. అందుకే అన్నని చంపడానికి వెనకాడలేదు!

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల, మారియో పూజోలు ఈ అన్యాయమైన, అనవసమైన హత్య మైకేల్ చేత ఎందుకు చేయించారో అర్ధం కాదు. ఈ గిల్ట్ ఫీలింగ్ వల్లనే కావచ్చు - గాడ్‌ఫాదర్ పార్ట్ 3 లో అన్నని హత్య చేయించినందుకు మైకేల్ గిల్టీగా ఫీలవుతుంటాడు. నా అనుమానం ఆ గిల్ట్ మైకేల్‌ది కాదు - ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పూజోలది అని!

ఇంతటితో నేను రాద్దామనుకున్న పాయింట్ పూర్తయ్యింది. గాడ్‌ఫాదర్ పార్ట్ 2 సినిమా చూడనివాళ్ళకి ఈ పోస్ట్ విసుగ్గా అనిపించొచ్చు. అందుకు సారీ చెప్పుకుంటున్నాను. నేను సినిమాలు చూసే వయసులో వచ్చిన సినిమా కాబట్టి - ఒక కేరక్టర్ గూర్చి నా అభిప్రాయం వివరంగా రాయగలిగాను. ఇప్పుడైతే నాకు నవల చదివే ఓపికా, సమయం లేవు. చర్చించుకోడానికి స్నేహితులూ లేరు. సినిమా చూడాలనే ఆసక్తీ లేదు. అందువల్ల - ఇదే సినిమా ఈ పాతికేళ్ళల్లో వచ్చినట్లైతే బహుశా నేను చూడను కూడా చూసేవాణ్ని కాదేమో!   

(photos courtesy : Google)   

Thursday, 2 April 2015

గోంగూర, వంకాయ తినొద్దు!


"డాక్టర్ గారు! గోంగూర, వంకాయ తినొచ్చా?"

"తినొచ్చు."

"తినొచ్చా!"

"తినొచ్చు."

"తినొచ్చా!!!"

"తినొచ్చు."

"మా ఇంటిదగ్గరోళ్ళు తినొద్దంటున్నారండీ!"

"నేన్చెబుతున్నాగా! తినొచ్చు!"

"తినొచ్చా!!!!!!!!!!!!!!"

ప్రాక్టీస్ మొదలెట్టిన కొత్తలో నాకీ గోంగూర వంకాయల గోల అర్ధమయ్యేది కాదు, చిరాగ్గా కూడా వుండేది!

కొన్నాళ్ళకి -

అతను నా క్లాస్‌మేట్, మంచి స్నేహితుడు కూడా. జనరల్ ప్రాక్టీస్ చేస్తాడు, బాగా బిజీగా వుంటాడు. సైకియాట్రీ కేసులకి కన్సల్టంట్‌గా నన్ను పిలిచేవాడు. పన్లోపనిగా ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చి కబుర్లు చెప్పేవాడు. ఆ రోజుల్లో నాకసలు వర్క్ వుండేది కాదు. కాబట్టి పిలవంగాన్లే వెళ్ళేవాణ్ని. నా స్నేహితుడిది భీభత్సమైన ప్రాక్టీస్. అతని కన్సల్టేషన్ గది ముందు పెద్ద గుంపు, తోపులాటలు!

కన్సల్టేషన్ చాంబర్లో డాక్టర్‌కి ఎదురుగానున్న కుర్చీలో కూర్చునేవాణ్ని. అతను పేషంట్లని చకచకా చూసేస్తుండేవాడు. నాకు జనరల్ ప్రాక్టీస్ తెలీదు. అంచేత - డాక్టర్ని, పేషంట్లని ఆసక్తిగా గమనిస్తుండేవాణ్ని.

డాక్టర్ మందులు రాశాక చాలామంది పేషంట్లు అడిగే ప్రశ్నలు దాదాపుగా ఒకటే!

"గోంగూర, వంకాయ తినొచ్చా?"

"వద్దు, మానెయ్!"

"దుంపకూరలు?"

"వద్దు, మానెయ్!"

"తీపి?"

"వద్దు, మానెయ్!"

"నీచు?"

"వద్దు, మానెయ్!"

"పాలు, పెరుగు?"

"పాలు మంచిదే! పెరుగు వాడకు. మజ్జిగ మాత్రం బాగా తాగాలి."

నా మిత్రుడి సలహాలు నాకర్ధమయ్యేవి కాదు, ఆశ్చర్యంగా వుండేది. కాఫీ తాగుతున్న సమయాన ఒక శుభ సమయాన -

"వంకాయ గోంగూర పాలు పెరుగు.. ఏవిటిదంతా?" అడిగాను.

"దీన్నే పథ్యం అందురు." అంటూ పెద్దగా నవ్వాడు నా స్నేహితుడు. ఆ తరవాత - ఒక క్షణం ఆలోచించి చెప్పసాగాడు.

"మొదట్లో నాకూ అర్ధమయ్యేది కాదు. పథ్యం లేని వైద్యం పన్జెయ్యదని పేషంట్ల నమ్మకం. వాళ్ళు 'అడిగారు' అంటేనే అవి 'తినకూడనివి' అనర్ధం!" అన్నాడు నా మిత్రుడు.

"పేషంట్లని ఎడ్యుకేట్ చెయ్యొచ్చు కదా!"

"ఎందుకు చెయ్యకూడదు? చెయ్యొచ్చు. ప్రయత్నించాను. వల్ల కాక వదిలేశాను!"

"ఎందుకు?"

"వాళ్ళని పథ్యం విషయంలో ఎడ్యుకేట్ చెయ్యాలంటే మనకి బోల్డంత సమయం పడుతుంది. ఎంత చెప్పినా పథ్యం లేని వైద్యంపై వారికి నమ్మకం వుండదు. వాళ్ళా గోంగూర, వంకాల్లాంటివి కొన్నాళ్ళపాటు తినకపోతే కొంపలేమీ మునిగిపోవు. కాబట్టి మనమే వాళ్ళ రూట్లోకి పోవడం సుఖం."

"కానీ - సైంటిఫిక్‌గా కరక్టు కాదు కదా?" అన్నాను.

"డెఫినిట్‌గా కాదు. ప్రాక్టికల్‌గా మాత్రం కరక్ట్! వాళ్ళు మన్దగ్గరకొచ్చేది వైద్యం కోసం, పథ్యం గూర్చి చర్చలక్కాదు! అంచేత - వాళ్ళతో వాదనలు అనవసరం." నవ్వుతూ అన్నాడు నా మిత్రుడు.

నాకతని వాదన కన్విన్సింగ్‌గా అనిపించలేదు. పథ్యం అనేది అతని వైద్యం USP పెంచుకోడానికి వాడుకుంటున్నట్లుగా అనిపించింది. కానీ నా మిత్రుడు చెప్పిందాట్లో - 'వాళ్ళు అడిగేవి తినకపోతే కొంపలేమీ మునగవు' అన్న మాట నాకు బాగా నచ్చింది.

నేను చేసేది స్పెషాలిటీ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీసంత కష్టం వుండదు. కానీ - గోంగూర, వంకాయల విషయంలో నేనంటూ ఒక స్టాండ్ తీసుకోకపోతే నా పేషంట్లు నాకసలు వైద్యమే తెలీదనుకునే ప్రమాదముంది! అంచేత - నేను నా ప్రాక్టీసులో మధ్యేమార్గంగా ఒక స్పష్టమైన అస్పష్ట విధానాన్ని ఎన్నుకున్నాను. 

అదేమిటనగా -

"గోంగూరా, వంకాయ తినొచ్చా?"

"తినకపోతే మంచిదే! తిన్నా నష్టం లేదు!"

పేషంట్లకి ఈ సలహా అర్ధం కాక.. బుర్ర గోక్కుంటూ బయటకి నడుస్తారు! అస్పష్టమైన సలహాలివ్వడం సైకియాట్రిస్టులకి అలవాటే లేండి

(picture courtesy : Google)

Wednesday, 1 April 2015

'రావిశాస్త్రి' నా అభిమాన కవి!


"నీ అభిమాన కవి పేరు చెప్పుము."

"ఓస్! అంతేనా.. శ్.."

"ఆగు. ఆ కవి పేరు 'శ' తో మొదలవ్వకూడదు."

"ఇదన్యాయం."

"నాకు తెలుసు, నువ్వు శ్రీశ్రీ, శివసాగర్, శివారెడ్డిల్లో ఏదోక పేరు చెబ్తావని!"

"ఆరి దుష్టుడా! ప్రశ్న వెనక చాలా కుట్ర దాగుందే! కొంచెం ఆలోచించుకోనీ!"

"హీహీహీ.. భలే కష్టమైన ప్రశ్నడిగా కదా?"

"గాడిద గుడ్డేం కదూ! రాసుకో - నా అభిమాన కవి 'రావిశాస్త్రి'."

"హోల్డాన్! రావిశాస్త్రి కవి కాదు నాయనా!"

"ఆ విషయం నాకూ తెలుసు. కాకపోతే - నీలాంటివాడికి తెలీని విషయం ఒకటుంది."

"ఏంటది?"

"రావిశాస్త్రి కవితల్నే కథలుగా రాశాడు."

"అర్ధం కాలేదు."

"నీకర్ధం కావాలంటే ఓ పన్జెయ్! రావిశాస్త్రి రాసిన కథ, నవల - ఏదైనా సరే! అందులోంచి ఒక పేరాగ్రాఫ్ తీసుకో!"

"ఆఁ! తీసుకుని?"

"ఇప్పుడా పేరాగ్రాఫ్‌ని చిన్నచిన్న ముక్కలుగా నరికెయ్!"

"ఆఁ! నరికేసి?"

"ఆ ముక్కల్ని పంక్తులుగా రాసుకో."

"ఆఁ! రాసుకుని?"

"ఆరి అమాయకుడా! ఇంకా అర్ధం కాలేదా? ఇప్పుడది ఒక బ్యూటిఫుల్ పొయిట్రీ అయిపోయిందోయ్!"

"అవును కదూ!" 

(picture courtesy : Google)