Thursday, 2 April 2015

గోంగూర, వంకాయ తినొద్దు!


"డాక్టర్ గారు! గోంగూర, వంకాయ తినొచ్చా?"

"తినొచ్చు."

"తినొచ్చా!"

"తినొచ్చు."

"తినొచ్చా!!!"

"తినొచ్చు."

"మా ఇంటిదగ్గరోళ్ళు తినొద్దంటున్నారండీ!"

"నేన్చెబుతున్నాగా! తినొచ్చు!"

"తినొచ్చా!!!!!!!!!!!!!!"

ప్రాక్టీస్ మొదలెట్టిన కొత్తలో నాకీ గోంగూర వంకాయల గోల అర్ధమయ్యేది కాదు, చిరాగ్గా కూడా వుండేది!

కొన్నాళ్ళకి -

అతను నా క్లాస్‌మేట్, మంచి స్నేహితుడు కూడా. జనరల్ ప్రాక్టీస్ చేస్తాడు, బాగా బిజీగా వుంటాడు. సైకియాట్రీ కేసులకి కన్సల్టంట్‌గా నన్ను పిలిచేవాడు. పన్లోపనిగా ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చి కబుర్లు చెప్పేవాడు. ఆ రోజుల్లో నాకసలు వర్క్ వుండేది కాదు. కాబట్టి పిలవంగాన్లే వెళ్ళేవాణ్ని. నా స్నేహితుడిది భీభత్సమైన ప్రాక్టీస్. అతని కన్సల్టేషన్ గది ముందు పెద్ద గుంపు, తోపులాటలు!

కన్సల్టేషన్ చాంబర్లో డాక్టర్‌కి ఎదురుగానున్న కుర్చీలో కూర్చునేవాణ్ని. అతను పేషంట్లని చకచకా చూసేస్తుండేవాడు. నాకు జనరల్ ప్రాక్టీస్ తెలీదు. అంచేత - డాక్టర్ని, పేషంట్లని ఆసక్తిగా గమనిస్తుండేవాణ్ని.

డాక్టర్ మందులు రాశాక చాలామంది పేషంట్లు అడిగే ప్రశ్నలు దాదాపుగా ఒకటే!

"గోంగూర, వంకాయ తినొచ్చా?"

"వద్దు, మానెయ్!"

"దుంపకూరలు?"

"వద్దు, మానెయ్!"

"తీపి?"

"వద్దు, మానెయ్!"

"నీచు?"

"వద్దు, మానెయ్!"

"పాలు, పెరుగు?"

"పాలు మంచిదే! పెరుగు వాడకు. మజ్జిగ మాత్రం బాగా తాగాలి."

నా మిత్రుడి సలహాలు నాకర్ధమయ్యేవి కాదు, ఆశ్చర్యంగా వుండేది. కాఫీ తాగుతున్న సమయాన ఒక శుభ సమయాన -

"వంకాయ గోంగూర పాలు పెరుగు.. ఏవిటిదంతా?" అడిగాను.

"దీన్నే పథ్యం అందురు." అంటూ పెద్దగా నవ్వాడు నా స్నేహితుడు. ఆ తరవాత - ఒక క్షణం ఆలోచించి చెప్పసాగాడు.

"మొదట్లో నాకూ అర్ధమయ్యేది కాదు. పథ్యం లేని వైద్యం పన్జెయ్యదని పేషంట్ల నమ్మకం. వాళ్ళు 'అడిగారు' అంటేనే అవి 'తినకూడనివి' అనర్ధం!" అన్నాడు నా మిత్రుడు.

"పేషంట్లని ఎడ్యుకేట్ చెయ్యొచ్చు కదా!"

"ఎందుకు చెయ్యకూడదు? చెయ్యొచ్చు. ప్రయత్నించాను. వల్ల కాక వదిలేశాను!"

"ఎందుకు?"

"వాళ్ళని పథ్యం విషయంలో ఎడ్యుకేట్ చెయ్యాలంటే మనకి బోల్డంత సమయం పడుతుంది. ఎంత చెప్పినా పథ్యం లేని వైద్యంపై వారికి నమ్మకం వుండదు. వాళ్ళా గోంగూర, వంకాల్లాంటివి కొన్నాళ్ళపాటు తినకపోతే కొంపలేమీ మునిగిపోవు. కాబట్టి మనమే వాళ్ళ రూట్లోకి పోవడం సుఖం."

"కానీ - సైంటిఫిక్‌గా కరక్టు కాదు కదా?" అన్నాను.

"డెఫినిట్‌గా కాదు. ప్రాక్టికల్‌గా మాత్రం కరక్ట్! వాళ్ళు మన్దగ్గరకొచ్చేది వైద్యం కోసం, పథ్యం గూర్చి చర్చలక్కాదు! అంచేత - వాళ్ళతో వాదనలు అనవసరం." నవ్వుతూ అన్నాడు నా మిత్రుడు.

నాకతని వాదన కన్విన్సింగ్‌గా అనిపించలేదు. పథ్యం అనేది అతని వైద్యం USP పెంచుకోడానికి వాడుకుంటున్నట్లుగా అనిపించింది. కానీ నా మిత్రుడు చెప్పిందాట్లో - 'వాళ్ళు అడిగేవి తినకపోతే కొంపలేమీ మునగవు' అన్న మాట నాకు బాగా నచ్చింది.

నేను చేసేది స్పెషాలిటీ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీసంత కష్టం వుండదు. కానీ - గోంగూర, వంకాయల విషయంలో నేనంటూ ఒక స్టాండ్ తీసుకోకపోతే నా పేషంట్లు నాకసలు వైద్యమే తెలీదనుకునే ప్రమాదముంది! అంచేత - నేను నా ప్రాక్టీసులో మధ్యేమార్గంగా ఒక స్పష్టమైన అస్పష్ట విధానాన్ని ఎన్నుకున్నాను. 

అదేమిటనగా -

"గోంగూరా, వంకాయ తినొచ్చా?"

"తినకపోతే మంచిదే! తిన్నా నష్టం లేదు!"

పేషంట్లకి ఈ సలహా అర్ధం కాక.. బుర్ర గోక్కుంటూ బయటకి నడుస్తారు! అస్పష్టమైన సలహాలివ్వడం సైకియాట్రిస్టులకి అలవాటే లేండి

(picture courtesy : Google)

22 comments:

  1. మీ మందేసుకున్నాక సాయంకాలం సినిమా కెళ్ళొచ్చా?

    ReplyDelete
    Replies
    1. సినిమాకెళ్ళకపోతే మంచిది! వెళ్ళినా నష్టం లేదు! :)

      Delete
  2. డాక్టరు గారూ, పంటి నొప్పి కి మందులు తీసుకుంటున్నాను వంకాయ గోంగూరల జోలికి పోము లెండి కానీ నాన్-వెజ్ తినొచ్చా?

    ReplyDelete
    Replies
    1. చికెనొద్దు - వేడి చేస్తుంది! ఫిష్ మంచిది - తినండి! :)

      Delete
    2. విస్కీ తాగుతూ అపోలో ఫిష్ తినొచ్చా? విస్కీలో సోడా కలపాలా నీళ్ళా? ఐస్ వేసుకోవచ్చా?

      Delete
  3. డాటేరు బాబు గారు పని లేని డాటేరు బాబు గారు అనుకున్నా ! పంటి డాటేరు కూడా నన్న మాట ! :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఒక్క పన్నేమిటి? డబ్బులిస్తే గుండెక్కూడా ట్రీట్మెంటిస్తా! :)

      Delete


  4. అవును.పథ్యం సరిగా చెప్పక పోతే ఈ డాక్టరుకేమీ తెలియదనుకొంటారు.అంచేత పథ్యం,అనుపానం చెప్పాలిసిందే.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      నా పోస్ట్ చదివి కామెంటినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. మీ మందు వేసుకున్నాకా ఆ మందు పుచ్చుకోవచ్చా లేక మీ మందుకి ముందే ఆ మందు పుచ్చుకోవాలా? లేకపోతే మీ మందూ ఆ మందూ కలిపి పుచ్చుకోవాలా? ఇంకా మీ మందుని పిండిగా నలిపేసి ఆ మందులో కలిపి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుందంటారా! ఓ చేత్తో మీ మందూ మరో చేత్తో ఆ మందూ పట్టుకొని అడుగుతున్నాను మరీ.

    ReplyDelete
    Replies
    1. నా మందు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ముందు ఆ మందు వేసుకోండి. తరవాతే ఏదైనా! :)

      Delete
  6. అప్పుడప్పుడు పతంజలి ని వాడుతాను.... మధ్యలో రావి శాస్త్రి ని వాడొచ్చా.... లేకపోతే మీ బ్లాగ్స్ సరిపోతాయా.... ?

    ReplyDelete
    Replies
    1. ఎల్లప్పుడూ రావిశాస్త్రినే వాడండి. ఈ సృష్టిలో రావిశాస్త్రిని మించిన పథ్యం మరేదీ లేదు! :)

      Delete
  7. డాట్రు గారో.....తూర్పు వైపు తిరిగి వేసుకోవాలా....పడమర వైపా...

    ReplyDelete
  8. నల్లకుక్క తెచ్చుకున్నాను. నీళ్లు కలుపుకోవచ్చా..

    ReplyDelete
  9. నల్లకుక్క తెచ్చుకున్నాను. నీళ్లు కలుపుకోవచ్చా..

    ReplyDelete
  10. కామెంట్లు రాసిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ!

    ReplyDelete
  11. నేను ఇన్నాళ్ళూ ఈ నియమాహారాన్ని పత్యం అనుకున్నానే! అది పధ్యమా?

    ReplyDelete
    Replies
    1. dear BSR,

      రాసేప్పుడు నాకూ అదే డౌటొచ్చింది. అంచేత - 'గెస్ ఎండ్ రివర్స్' అనే పాలసీని అనుసరించాను. ఇప్పటిదాకా ఎవరూ సరిచెయ్యలేదు కాబట్టి.. ప్రస్తుతానికి పథ్యమే కరెక్ట్! :)

      Delete
    2. పధ్యమే కరక్టట!
      http://www.andhrabharati.com/dictionary/

      Delete
  12. సార్, నేను మానెయ్యను -గోంగూరని కాదు- కామెంట్లుని.!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.