Tuesday, 21 April 2015

తప్పు చేశావ్ మైకీ!


వయసుతో పాటు మనుషులకి ఇష్టాయిష్టాలు కూడా మారుతుంటాయ్. నాకు ఒక వయసులో సినిమాలంటే చాలా ఇష్టం, ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే ఇష్టం. అప్పుడప్పుడు ఏదైనా సినిమా చూద్దామనిపిస్తుంది. కానీ ఆ 'ఏదైనా' సినిమా ఎలా వుంటుందో తెలీదు. తీరా చూశాక తలనొప్పి రాదని గ్యారెంటీ లేదు, అప్పుడు బోల్డెంత సమయం వృధా అయిపోయిందని బాధపడాలి. అంచేత నేనెప్పుడూ కొత్తసినిమా చూసే ధైర్యం చెయ్యను, ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ చూస్తాను. ఆ క్రమంలో ఈ మధ్య నేను బాగా ఇష్టపడే 'గాడ్‌ఫాదర్ పార్ట్ 2' మళ్ళీ చూశాను.

ఈ సినిమా నాకెందుకు బాగా నచ్చింది?

గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూస్తుంటే నాకు ఒక మంచి నవల చదువుతున్నట్లుగా అనిపిస్తుంది, క్రమేపి కథలో లీనమైపోతాను. ఆ దృశ్యాలు నాముందు జరుగుతున్నట్లుగా, వాటిలో నేనూ ఒక భాగం అయినట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించడం మంచి సినిమా లక్షణం అని ఎవరో చెప్పగా విన్నను.

ఒక సినిమా హిట్టైతే, ఆ సక్సెస్‌ని మరింతగా సొమ్ము చేసుకునేందుకు హాలీవుడ్ వాళ్ళు దానికి సీక్వెల్ తీస్తుంటారు. ఈ గాడ్‌ఫాదర్ పార్ట్ 2 కూడా అలా తీసిందే. సాధారణంగా ఇట్లా తీసిన సీక్వెల్స్ అసలు కన్నా తక్కువ స్థాయిలో వుంటాయి. అయితే, గాడ్‌ఫాదర్ పార్ట్ 2 అందుకు మినహాయింపు.

చదువుకునే రోజుల్లో - నేనూ, నా స్నేహితులు నిశాచరులం. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం పిశాచ లక్షణమా? లేక పూర్వజన్మలో మేం రాత్రిళ్ళు గోడలకి కన్నాలేసే దొంగలమా? అన్నది ఆలోచించవలసి వుంది. ఏది ఏమైనప్పటికీ - మేమంతా పగలు కంటే రాత్రిళ్ళే హుషారుగా వుండేవాళ్ళం! పరీక్షలుంటే టెక్స్టు పుస్తకాలు, లేకపోతే శ్రీదేవి బుక్ స్టాల్ అద్దె పుస్తకాలు రాత్రిపూట మా ఆహారం. సెక్సు పుస్తకాల దగ్గర్నుండి, ఇంగ్లీషు క్లాసిక్స్ దాకా - దేన్నీ వదిలేవాళ్ళం కాదు.

మేం చదివిన కొన్ని ఇంగ్లీషు నవలలు సినిమాగా వచ్చేవి. నవలకీ, సినిమాకీ మధ్య జరిగిన మార్పుల గూర్చి తీవ్రచర్చలు జరిగేవి. ఆ ప్రాసెస్‌లో మేరియో పూజో 'గాడ్‌ఫాదర్' నవలని చదివేశాం. చదవడమంటే అట్లాఇట్లా కాదు - పిప్పిపిప్పి చేశాం, పొడిపొడి చేశాం. 'ఆహా! నేరసామ్రాజ్యం ఎంత గొప్పది!' అని సిసీలియన్ల మాఫియా నేరాలకి ముచ్చటపడుతూ - వారి నేర విలువలకీ, నిజాయితీకీ అబ్బురపడుతూ - సినిమా చూసి మరింతగా ఆనందించాం.

కారణాలు గుర్తులేవు గానీ, నేను గాడ్ ఫాదర్ పార్ట్ 2 ని కొన్నేళ్ళపాటు మిస్సయ్యాను. ఆ తరవాతెప్పుడో చూశాను. గాడ్‌ఫాదర్ కన్నా గాడ్‌ఫాదర్ పార్ట్ 2 బాగుందనిపించింది. అందుక్కారణం - తండ్రీ కొడుకుల కథని ముందుకు వెనక్కీ తీసుకెళ్తూ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నెరేట్ చేసిన విధం. ఈ విధానాన్ని నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటారు. క్వింటిన్ టరాంటినో సినిమాలు చూస్తే ఈ విధానం గూర్చి ఇంకా బాగా తెలుస్తుంది.

సరే! నలభయ్యేళ్ళ తరవాత గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి ఏముంటుంది? తెలుగు టీవీ చానెళ్ళవారిలా అల్ పచీనో, రాబర్ట్ డీ నీరో గొప్ప నటులనో.. కొప్పోలా మంచి దర్శకుడనో అరిగిపోయిన మాటల్తో సినిమా గూర్చి చెప్పబోవడం హైట్సాఫ్ భావదారిద్ర్యం. కాబట్టి నేనా పని చెయ్యబోవట్లేదు. 


గాడ్‌ఫాదర్ పార్ట్ 2 చూసినప్పుడల్లా, చివర్లో నాకు మనసు భారంగా అయిపోతుంది. అందుకు కారకుడు ఫ్రీడో కార్లియోనె! అమ్మయ్య! గాడ్‌ఫాదర్ పార్ట్ 2 గూర్చి రాయడానికి నాకో పాయింట్ దొరికింది. ఇప్పుడు ఫ్రీడో పట్ల నా సానుభూతి ఎందుకో రాస్తాను.

డాన్ వీటో కార్లియోనెకి ముగ్గురు కోడుకులు, ఒక కూతురు. పెద్దవాడు సాని డైనమిక్ ఎండ్ డేషింగ్. రెండోవాడు ఫ్రీడో మంచివాడు - కొద్దిగా అమాయకుడు, ఎక్కువగా అసమర్ధుడు. అందుకే శత్రువులు తండ్రిని కాల్చేప్పుడు చేతిలో తుపాకీ ఉంచుకుని కూడా తిరిగి కాల్చలేకపోతాడు. ఇక మూడోవాడైన మైకేల్ గూర్చి చెప్పేదేముంది? రెస్టారెంట్‌లో సొలొజొని చంపడంతో అతని ప్రతిభేంటో లోకానికి అర్ధమైపోతుంది.

సాని, వీటో కార్లియోనిల మరణం తరవాత మైకేల్ డాన్ అవుతాడు. జూదగృహాలు, వ్యభిచార గృహాల మీద పర్యవేక్షణ వంటి చిన్నపనులు ఫ్రీడోకి అప్పజెబుతాడు మైకేల్. వీటో కార్లియోని దత్తపుత్రుడైన టామ్ హేగన్‌ మైకేల్‌కి కుడిభజం. తననెవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం ఫ్రీడోని అసంతృప్తికి గురి చేస్తుంది. మైకేల్ ప్రత్యర్ధి హైమన్ రాత్ మనిషి జాని ఓలాకి సమాచారం (?) ఇస్తాడు (అది తన కుటుంబానికి ప్రమాదం అని ఫ్రీడోకి తెలీదు). ఫలితంగా బెడ్రూములో మైకేల్ మీద హత్యాయత్నం జరుగుతుంది.

కొన్నాళ్ళకి ఇంటిదొంగ ఫ్రీడోనేనని మైకేల్ అర్ధం చేసుకుంటాడు. క్యూబాలో ఫిదేల్ కేస్ట్రో నాయకత్వంలో తిరుగుబాటుదారులు బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేసేప్పుడు - 'ఫ్రీడో! అది నువ్వేనని నాకు తెలుసు!' అని చెవిలో చెబుతాడు మైకేల్. తమ్ముడు తనని బ్రతకనివ్వడని భయపడి న్యూయార్క్ పారిపోతాడు ఫ్రీడో. ఫ్రాంక్ పెంటంగలి వల్ల సెనెట్ కమిటీ విచారణని ఎదుర్కునే కష్టాల్లో పడతాడు మైకేల్. పారిపోయిన ఫ్రీడోని న్యూయార్క్ నుండి పిలిపించి కేసుకి కావలసిన సమాచారం రాబడతాడు మైకేల్.

ఫ్రీడో ఇద్దరు సమర్ధులైన సోదరుల మధ్య పుట్టిన అమాయకుడు, అందుకే జానీ ఓలాని నమ్మాడు. అతనో ఫూల్, ఈడియట్. ఆ విషయం మైకేల్‌కీ తెలుసు. కుటుంబంలో సోదరుల మధ్య పోటీ వుంటుంది, వారిలోవారికి తమకన్నా సమర్ధులైనవారి పట్ల ఈర్ష్యాసూయలు వుంటాయి. దీన్ని 'సిబ్లింగ్ రైవల్రీ' అంటారు. జరిగినదానికి బాధ పడుతూ ఫ్రీడో కూడా అలాగే మాట్లాడతాడు. ఫ్రీడో మాటల్ని పట్టించుకోకుండా - జన్మలో నీ మొహం నాకు చూపించొద్దంటాడు మైకేల్. ఆ సీన్ ఇక్కడ ఇస్తున్నాను, చూడండి.


ఇక్కడ దాకా బాగానే వుంది. మైకేల్‌ వద్దన్నాక తమ్ముడికి దూరంగా ఎక్కడో తన బ్రతుకు తను బ్రతికేవాడు ఫ్రీడో. కానీ మైకేల్ దుర్మార్గుడు. ఈ విషయాన్ని మైకేల్ భార్య కే బాగా అర్ధం చేసుకుంటుంది, అందుకే అతన్ని అసహ్యించుకుని వదిలేస్తుంది. తల్లి బ్రతికున్నంత కాలం ఫ్రీడోని ఏమీ చెయ్యొద్దని ఆదేశిస్తాడు మైకేల్. అసలు మైకేల్‌కి ఫ్రీడోని చంపాల్సిన అవసరం ఏమిటి!?

తల్లి మరణించినప్పుడు - ఫ్రీడోని క్షమించమని చెల్లి ప్రాధేయపడటంతో ఫ్రీడోని చేరదీస్తాడు మైకేల్. కానీ - అతన్దంతా నటన, చెల్లెల్ని కూడా నమ్మించి మోసం చేస్తాడు మైకేల్. అర్భకుడైన అన్నని చంపడానికి ఇన్ని నాటకాలా! మైకేల్ తన తండ్రిలాగా మనుషుల్ని నమ్మడు, అన్నలాగా ఎమోషనల్ కాదు. అతనికన్నీ వ్యాపార ప్రయోజనాలే తప్ప విలువలు శూన్యం. అందుకే - ఫ్రీడోతో మంచిగా వున్నట్లుగా నమ్మించి చంపించేస్తాడు మైకేల్. ఫ్రీడో చావుతో సినిమా ముగుస్తుంది, సరీగ్గా ఇక్కడే నా మనసు భారంగా అయిపోతుంది!

ఈ సినిమాలో ఎట్లా చూసుకున్నా ఫ్రీడో హత్య సమర్ధనీయం కాదు. ఫ్రీడోకి తమ్ముడంటే ప్రేమ, కలలో కూడా అతనికి హాని తలపెట్టడు, పెట్టేంత సమర్ధత కూడా లేనివాడు. అట్లాంటి ఫ్రీడోని నమ్మించి, ఫిషింగ్ చేస్తున్నప్పుడు వెనకనుండి తలలోకి తుపాకీతో కాల్చి చంపించడం.. చాలా దుర్మార్గం కదూ!

సిసిలియన్లు మన తెలుగు వాళ్ళలాగే కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలవాళ్ళు. సొంత మనుషుల్ని చంపడం వారి ఆలోచనలకి, నియమాలకి విరుద్ధం. వీటో కార్లియోని తప్పు చేసినవారిని క్షమించగలడు, మైకేల్‌కి క్షమించడం అన్న పదానికి అర్ధం తెలీదు. అందుకే అన్నని చంపడానికి వెనకాడలేదు!

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల, మారియో పూజోలు ఈ అన్యాయమైన, అనవసమైన హత్య మైకేల్ చేత ఎందుకు చేయించారో అర్ధం కాదు. ఈ గిల్ట్ ఫీలింగ్ వల్లనే కావచ్చు - గాడ్‌ఫాదర్ పార్ట్ 3 లో అన్నని హత్య చేయించినందుకు మైకేల్ గిల్టీగా ఫీలవుతుంటాడు. నా అనుమానం ఆ గిల్ట్ మైకేల్‌ది కాదు - ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పూజోలది అని!

ఇంతటితో నేను రాద్దామనుకున్న పాయింట్ పూర్తయ్యింది. గాడ్‌ఫాదర్ పార్ట్ 2 సినిమా చూడనివాళ్ళకి ఈ పోస్ట్ విసుగ్గా అనిపించొచ్చు. అందుకు సారీ చెప్పుకుంటున్నాను. నేను సినిమాలు చూసే వయసులో వచ్చిన సినిమా కాబట్టి - ఒక కేరక్టర్ గూర్చి నా అభిప్రాయం వివరంగా రాయగలిగాను. ఇప్పుడైతే నాకు నవల చదివే ఓపికా, సమయం లేవు. చర్చించుకోడానికి స్నేహితులూ లేరు. సినిమా చూడాలనే ఆసక్తీ లేదు. అందువల్ల - ఇదే సినిమా ఈ పాతికేళ్ళల్లో వచ్చినట్లైతే బహుశా నేను చూడను కూడా చూసేవాణ్ని కాదేమో!   

(photos courtesy : Google)   

12 comments:

  1. మళ్ళీ చూడాలనిపించేంత గొప్పగా వ్రాసారు, పార్ట్ టూ గుఱించి. అప్పట్లో మాకు / ఇప్పటికి కూడా మొదటి భాగం ఉన్నంత గొప్పగా మిగతావి లేవు అనిపిస్తుంది.

    ఇప్పటికి చిరాకుగా ఉన్నప్పుడు చూసే అతి కొద్ది సినిమాలలో ఇది ఒకటి. బ్రాండో కోసం, ఆల్ పచినో కోసం చూడాల్సిన సినిమా ఇది. అయినా మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ చూస్తాను పార్ట్ త్రీని.

    ఈ మధ్య ఆ సుబ్రహ్మణ్యం చూసాను...వాళ్ళందరూ గొప్పగా ఉందంటే...నిరుత్సాహమే మిగిలింది. అఫ్‌కోర్స్ పిల్లలు బాగానే చేసారు కాని కథనం విషయంలో పెద్ద మైనస్. ఆ అమ్మాయి పేరు తెలియదు కాని కనబడినంత సేపు నాకు శోభన గుర్తువచ్చింది.

    తెలుగులో కొత్త సినిమాలు చూసే ధైర్యం, సాహసం చెయ్యగలుగుతున్నాను, ఇంకా.... చి న.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అనిల్ గారు,

      అవును, గాడ్‌ఫాదర్ ఓ మాస్టర్‌పీస్. మార్లన్ బ్రాండో నటన గూర్చి ఎంత రాసినా తక్కువే. పార్ట్ 1 & 2 లలో ఏది బెటర్? కష్టమైన ప్రశ్న. ఫస్ట్ పార్ట్‌ని బేస్ చేసుకుని సెకండ్ పార్ట్‌ని అంతే గొప్పగా తియ్యడం ఆశ్చర్యం. అందునా బ్రాండో యువకుడిగా వున్నప్పటి పాత్రని రాబర్ట్ డీ నీరో చేత చేయించడం!!

      నో డౌట్! కొప్పోలా ఈజే జీనియస్.

      మూడో పార్ట్ కేవలం గాడ్‌ఫాదర్ బ్రాండ్‌ని కేష్ చేసుకోడానికి తీసిన సినిమాగానే నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు.

      Delete
  2. మొన్న శనివారం ఈ సినిమా ఏదో చానల్ లో వేశారు. అది చూసాక మీకు జ్ఞాపకాలు గుర్తొచ్చాయా సర్?
    గాడ్ ఫాదర్-1 సినిమాలో కోన్ని భర్తని మైకీ చంపేయిస్తాడు. దాని వల్ల నేను ఫ్రీడోని కూడా చంపేస్తాడు అనుకున్నాను అలానే చేశాడు. ఫ్రీడోని చంపకుండా ఉంటే క్యారక్టర్ జస్టిఫికేషన్ ఉండేది కాదు కదా..
    నాకు ఇంగ్లీష్ సినిమాలు మంచి డైలాగ్స్ వల్ల నచ్చుతాయి. ఈ సినిమాలో కూడా సూపర్బ్ డయలాగ్స్ ఉన్నాయి కదా:
    "Keep your friends close but enemies closer"
    "The boy is Moe Green and the city he built is Las Vegas"
    "If history has taught us anything, it is that we can kill anyone anywhere"

    ReplyDelete
    Replies
    1. ఈ సినిమాని ట్రెడ్‌మిల్ చేస్తూ హోం థియేటర్‌లో నాలుగు ముక్కలుగా నాల్రోజుల పాటు చూశాను. నాకు సినిమాల్ని ముక్కలుగా చూడ్డం అలవాటు. :)

      గాడ్‌ఫాదర్ - 1 లో కోనీ భర్త కార్లో. అతను తన బావ సానీని బయటకి రప్పించి హత్య చేయించే వ్యూహంలో భాగంగానే భార్య కోనీని చావగొడతాడు, కోనీని కొడితే సానీ ఊరుకోడని అతనికి తెలుసు కాబట్టి. అంచేత కార్లోని చంపడానికి మైకేల్‌కి గట్టి కారణమే వుంది.

      ఫ్రీడోని మాత్రం మైకేల్ అనవసరంగా చంపేశాడనే ఉద్దేశంతో ఈ పోస్ట్ రాశాను.

      అవును, గాడ్‌ఫాదర్ సినిమాలో quotable quotes చాలానే వున్నాయి.

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
    2. ఫ్రీడో ని మాత్రం మైకేల్ అనవసంగా చంపేశాడనే ....

      అబ్బబ్బ, ఎంత పని లేక పోతే మాత్రం, సినిమాల్లో కూడా లాజిక్కులు వెతకాలా !! ఏమిటో మరి కాలం మారి పోయిందిస్మీ ! ఈ కాలం లో ఎవరికీ పని లేకుండా పోయినట్టు ఉంది నిరుద్యోగీ శత మర్కటకహ అని ఊరికే అన్నారా పెద్దలు ఆయ్ !

      చీర్స్
      జిలేబి

      Delete
    3. జిలేబి జీ,

      గత నాలుగేళ్ళుగా నే చేస్తుంది (బ్లాగింగ్) పన్లేని పనేగా! :)

      Delete
  3. గుడిపాటి చలపతిరావుగారు నాకు గురువుగారు. ఈ విషయం ఆయనకి గుర్తుండకపోవచ్చు. ఆయన బస అమెరికాకి మార్చక ముందు గుంటూరు మెడికల్ కాలేజిలో జెనరల్ మెడిసిన్‌ సబ్జక్టులో PG చేశారు. ఆ సమయంలో ఆయన నాలాంటి అర్భకులకి bedside classes చెప్పేవారు. దీన్నే clinical teaching అంటారు. ఆయనెప్పుడూ మాకు పెద్ద విషయాలు చెప్పలేదు. చాలా చిన్న విషయాలే చెప్పేవారు. పల్స్, బీపిల్లాంటి సాధారణ విషయాలు ఫైనల్ డయాగ్నోసిస్‌కి ఎంతగా అవసరమో చెప్పేవారు. ఎక్కడా స్టూడెంట్లని భయపెట్టకుండా రెండో ఎక్కం చెప్పినంత ఈజీగా, హాయిగా చాలా పెద్ద విషయాలే బోధించారు. ఇలా చెప్పడం చాలా కష్టమనీ, మంచి టీచర్ లక్షణమనీ నా అభిప్రాయం. అంచేత ఆయన క్లాసులు ఎన్టీవోడి సిన్మాలా కిటకిటలాడేవి.

    నాకు చదువు చెప్పిన టీచర్ల పట్ల నాకు అపారమైన గౌరవం. చలపతిరావుగారు నేన్రాసిన ఈ గాడ్‌ఫాదర్ పోస్టు చదివి ఫేస్బుక్కులో కామెంట్ రాశారు. ఇందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భంగా ఆయన నాకు చెప్పిన క్లాసులు గుర్తు చేసుకుంటూ, పన్లోపనిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను.

    హాబీగానే కాకుండా - ఒక విషయం గూర్చి నేనెలా ఆలోచించానో గుర్తుంచుకోడానికి నేను బ్లాగు రాస్తుంటాను. అంచేత Godfather part 2 కి సంబంధించిన నా ఆలోచనలన్నీ ఒక చోటే పడుంటాయని చలపతిరావుగారి కామెంట్, దానికి సమాధానంగా రాసిన నా కామెంట్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. తెలుగు బ్లాగుల్లో తెలుగే రాయాలనే నియమం నాకుంది. అయితే - ఈ కామెంట్లు ఆంగ్లంలో వున్నాయి. అందుకు నన్ను మన్నించగలరు.

    Chalapthirao Gudipati :

    I think it is justified. Not only one should never betray his family or even give the impression that there are differences in the family to an outsider. Thats what happened in part 1 by sunny. and resulted assassination attempt on Godfather. Fredo has weakness with alcohol and women and thus corruptible .

    Ramana Yadavalli :

    Thanks for the nice comment. Now i have to write a lengthy comment, because i was waiting for somebody justifying Fredo's murder.

    Sonny was always flamboyant, dashing and emotional. As you mentioned, he made the mistake and paid the penalty with his life.

    Michael killing brother in law Carlo is justified, because Carlo actively conspired to kill Sonny.

    But why Fredo? Puzo and Coppola consistently showed Fredo as incompetent and not fitting into family business module. Remember Fredo always loved his younger sib (he even appreciated Michael joining the army). According to Michael "Fredo is a good man with a weak heart."

    Fredo walked into Roth's trap unknowingly that it would lead to an assassination attempt on Mike. But what was the deal? What was there for Fredo!? We don't know.

    Puzo and Coppola could have easily written a scene against Fredo (they did it with Carlo) and justify the murder of Fredo. But they didi not! why? The reason is, according to me, they did not know how to conceive it, because they knew pretty well that Fredo would never act against Michael.

    Instead of killing Fredo, Michael could have easily disowned and ignored Fredo. He tells the same to Fredo (see the video clip). But what changed his mind to kill Fredo!? We don't know.

    I also feel Puzo and Coppola wanted to end the movie with the death of Fredo, but failed to write 'justification' scene. This is like making a diagnosis in advance and not been able to write a proper case sheet to support it.

    so, this is my argument on behalf of poor Fredo.

    ReplyDelete
  4. సినిమాల్లో ఒరిజినల్ (అంటే మొదటి పార్ట్) కి ఉన్న ఫ్లేవర్ సీక్వెల్స్ కి రాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మొదటి భాగానికి వచ్చిన ఆదరణని మరింత సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సీక్వెళ్ళు అనిపిస్తుంది (నా మట్టుకు).

    (గుడిపాటి వేంకటాచలపతి రావు మా రెండో మేనమామ కొడుకు. చిన్నప్పట్నుంచీ చదువులో చురుకైనవాడు. టీచింగ్ లో కూడా ప్రతిభ కనబరిచేవాడని మీద్వారా తెలుస్తోంది, సంతోషం. మొదటినుంచీ అతను చదువుతో బాటు జనరల్ రీడింగ్ హాబిట్, సినిమాలంటే ఆసక్తి కూడా వున్నవాడు.)

    ReplyDelete
  5. Sri YV Ramana garu.
    I am Also Gunturian.I studied there.
    I also took hiredbooks from Sridevi stall.
    UR Blog is fascinating. I read Godfather novel in 1985 and equally charmed by Italian mafia.
    Thanks for your review of film.
    Sorry I couldnot write in Telugu as iam sending through mobile

    ReplyDelete
  6. Sir, I would like to present my view from slightly a different angle. I don't think that Mike killed Friedo as a revenge or punishment. It is a question of policy for the safety of the business. Once he was used (though unknowingly) ... There is the possibility of being used again and that too with a motivation to settle scores for ever. One cannot rely upon the other's inability to retaliate and not in that business atleast. After tthe whole episode Friedo too cannot live peacefully (I mean he can never trust Mike and vice versa) Even shunning him from the family cannot ensure any kind of immunity. As the Telugu saying goes 'peeka Meedi katti' only way one can settle the issue is by killing and burying the mistake forever.

    ReplyDelete
    Replies
    1. ఈ విషయంలో మీరూ, మైకీ ఒక పార్టీ. నేను ఫ్రీడో పక్షం :)

      Delete

comments will be moderated, will take sometime to appear.