Thursday 30 April 2015

సిత్తర్లేగ్గాడు (రావిశాస్త్రి పాత్రలు - 2)


పేరు : సిత్తర్లేగ్గాడు (అసలు పేరు అప్పలసూరి)

వృత్తి : పిక్ పాకెటింగ్

అడ్రెస్ : 'మూడు కథల బంగారం'లో బంగారిగాడి కత.

(సిత్తర్లేగ్గాడి వివరాలన్నీ బంగారిగాడే చెబుతాడు, కథలో ఈ పాత్రకి సంభాషణలుండవు.)

రూపురేఖలు : 

ఆడికి పద్నాలుగేళ్ళుంటాయి గానీ, పన్నెండో పద్దకొండో ఏళ్ళవోళ్ళా ఉండేవాడు. ఆడి మొకం జూస్తె నిన్న పుట్టిన పాపమొకం ఆడిది. అంత ముద్దుగా అమ్మాయకంగా ఉండీవోడు. గిల్లితే పాలు కారతాడు. కొడితే ఒందలు యేలే కొడతాడు. ఆడికి ఉన్నన్ని ఒన్నెలూ శిన్నెలూ ఆ ఒయసులో ఉంకోడికి ఉండవు. అందుకే ఆణ్ని సిత్తర్లేగ్గాడని అనీవోరు.

మరిన్ని వివరాలు :

సిత్తర్లేగ్గాడూ, సత్తరకాయగాడూ, సిలకముక్కుగాడు ముగ్గురూ జాయింటుగా బిజినెస్సు (జేబులు కొట్టడం) చేసేవాళ్ళు. రైల్లో దొంగతనం చేస్తూ సిలకముక్కుగాడు పట్టుబడతాడు. పోలీసులకి అప్పజెబ్తారనే భయంతో నడుస్తున్న రైల్లోంచి దూకి చనిపోతాడు. సిత్తర్లేగ్గాడు వృత్తిలో చాలా ఆనెస్టీగా వుండేవాడు. ఈ విషయం మనకి 'నీలామహల్ సిన్మాలు కాడ ఆడపిర్రలోడి పర్సు' కొట్టేసిన ఉదంతంతో అర్ధమవుతుంది.

సిత్తర్లేగ్గాడు ఒయిసుకి సిన్నోడేగాని ఆడి అర్జన మీద మూడు కుటమానాలు కులాసాగ్గా ఎళ్ళిపొయ్యేవి. ఆడి అమ్మకీ అయ్యకీ ఆడు ఒక్కుడే కొడుకు. ఆడి అయ్యకి లెప్పరసీ ఉండేది. ఆడు బస్సులస్టాండు కాడ ముందల గోనె పరుసుకుని కూర్సుండీ వోడు. గోన్సంచ్చి మీద పడీ డబ్బుల్తొ ఆడికి దినం ఎళ్ళిపొయ్యేది. ఆడి పెళ్ళాం - అంటె సిత్తర్లేగ్గాడి తల్లి - ఒప్పుడో సచ్చిపొయ్యింది. ఆడికి ఓ పెద్దమ్మా ఓ పిన్నమ్మా ఉండీవోరు. ఆళ్ళిద్దరూ యెదవరాళ్ళే. ఇద్దరికీ ఆడపిల్లలే. సొలసొలమంటా డజినుమంది ఉండీవోరు. ఈడి సురుకుతనంతో సంపాయిచ్చిన డబ్బుతోనే ఆళ్ళ పోసాకారాలు ఈడి పోసాకారవూఁ గూడా జరిగీయ్యి.

సిత్తర్లేగ్గాడు కడదేరిన వైనం :

ఓ సుట్టు సిత్తర్లేగ్గాడు కొత్తమాసకి పిన్నమ్మకి కోక ఎటడానికి సేతల సఁవుఁర్లేక ఓ బట్టల సావుకారి సాపుకి ఎళ్లి ఓ కోక దాసీబోతా దొక్కిపొయ్యాడు.

పొగులు పది గంటలయ్యింది. సూరుడు పెచండంగ్గ కొత్త లా ఎండాడ్డరు సర్కిలు ముండ్ల కంపినీలు రెయిడు జేసినట్లు ఊర్ని రెయిడు జేసేస్తన్నాడు. రోడ్డు మీద పావొంతు నీడా ముప్పావొంతు ఎండా ఉన్నయ్యి. నీడ సైడు కొట్లోకెళ్ళి కోకతో దొక్కిపొయ్యేడు సిత్తర్లేక్క!

మరింఁక ఆణ్ని కొట్టేరండీ సావుకార్లు! ఇటు ఒందగజాలు అటు ఒందగజాలూ దూరంల ఇట్టటు రొండు సైడ్లూ ఉన్న సావుకార్లందరొచ్చి ఆణ్ని గొడ్డుని బాదినట్లు బాదినారండి.

సిత్తర్లేక్కి ఊపిరెంతండి? ఆడు నిన్న పుట్టిన పాప గదండి! ఆడి ఊపిరెంతండి? సావుకార్ల కట్టుకీ పెట్టుకీ సిత్తర్లేక బలైపోనాడండి. రోడ్ల నెత్తురు కక్కోని రోడ్డు మీద పడిపొయ్యేడండి. సకబాగం ఎండ్ల ఉండిపొయ్యిందండి. సకబాగం నీడల మిగిలిపొయ్యిందండి.

నిన్న పుట్టిన పాప ఇయ్యాళ నెత్తురు కక్కొని ఈది మద్దె ఎండ్ల ఎలికిల బడిపొయ్యి సచ్చిపోతే దాని మొకం ఎలాగ్గుంటదండి? నా పుట్టక్కీ నా బతుక్కీ నా నవ్వుకీ ఏటి కారనం ఒవుడు కారనం అని పెశ్నించినట్టుగ్గ ఉంటుందండి. సచ్చిపొయ్యేక ఆ ఎండల సిత్తర్లేక మొకం సరిగలాగ్గె ఉన్నదండి.

సిత్తర్లేగ్గాడి చావు తరవాత అతని కుటుంబం ఏమైంది? :

సిత్తర్లేగ్గాడి పెద్దమ్మనీ పిన్నమ్మనీ ఓ పోలీసు యెడ్డుగోరు దేవుళ్ళా ఆదుకున్నాడు. ఆడియి లేడికళ్ళూ, లంజకళ్ళూను. తొత్తుకొడుకు. యెడ్డుగోరు పెద్దమ్మ, పిన్నమ్మల డజనుమంది ఆడపిల్లల్ని 'ఓడుకునీవోరు'. ఆళ్ళసేత దొంగసారా యేపారం ఎట్టిఁచ్చేడు. సంసారపచ్చెంగ ముండ్ల కంపినీ నడిపిఁచ్చేడు. ఆడి దయవొల్ల ఆళ్ళు ఇస్తరిల్లి రుద్దిలోకి ఒచ్చేరు.

ఇంతటితో సిత్తర్లేగ్గాడి సమాచారం సమాప్తం. 

P.S. - *italics belong to రావిశాస్త్రి

(picture courtesy : Google)

4 comments:

  1. మూడు కధల బంగారం అపుడెపుడో ' ఆంధ్ర జ్యోతి' లో సీరియల్ గా వస్తుంటే తెలిసి ఒకటి తెలియక ఒకటి చదువు కున్నాము. ఆ తర్వాత పుస్తక రూపమ్ లో చదువు కుందామంటే... కొడవల్ల హనుమంతు రావు గారని ఒకాయన అరువుస్తే చదువుకున్నాను. అయితే ఒక ముక్క గుర్తు లేదు. ఎక్కడైనా దొరుకుతుందేమో చెప్పగలరా ? పుణ్యం ఉంటుంది లెండి.

    ReplyDelete
    Replies
    1. నేనూ 'ఆంధ్రజ్యొతి'లోనే మొదటిసారి చదివాను. రావిశాస్త్రి రచనల గూర్చి ఆయన కుటుంబ సభ్యులక్కూడా అవగాహన లేదు, ఆసక్తి లేదు. ప్రస్తుతానికైతే అలభ్యం.

      నాదగ్గర మనసు ఫౌండేషన్ వాళ్ళ 'రచనా సాగరం' మాత్రమే వుంది. దాన్ని పదిభాగాలుగా విడగొట్టించి (మెడికల్ బుక్స్ ఇలాగే చేస్తారు) చదువుతున్నాను. అది కూడా నలిగిపోయి జీర్ణావస్థలో వుంది.

      Delete

  2. ఇవన్నీ కాలం తీరిన కథలేమో ? ఈ e-కాలం లో వీటి ని చదివే వాళ్ళు ఉంటా రంటారా ? (యాద్గార్' దినాలు!)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      రావిశాస్త్రి సాహిత్యానికి కాలం తీరిపోయిందా?

      తీరిపొయుండొచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం పెద్దలే చెప్పాలి.

      నాకు మాత్రం ఈ రోజుకీ రావిశాస్త్రి సాహిత్యంలో గొప్ప ప్రపంచం కనిపిస్తుంది, జీవితం కనిపిస్తుంది. పిల్లలు బొమ్మల్తో ఆడుకున్నంత fascinating గా కూడా వుంటుంది. నాకు రాయాలనే ఆసక్తిక్కూడా రావిశాస్త్రే కారణం! అయితే - ఇలా అందరికీ అనిపిస్తుందని నేను అనుకోవట్లేదు.

      రావిశాస్త్రి సృష్టించిన పాత్రలు తెలుగు సాహిత్యంలో చాలా పాపులర్. అయితే - కొన్ని పాత్రలు unsung heroes లాగా మిగిలిపొయ్యాయని నా భావన. వాళ్ళని బయటెయ్యడానికి blog format బాగుందనిపించి రాశాను.

      మొదట్నుండి నా పోస్టులన్నీ అప్పటికప్పుడు రాస్తున్నవే గానీ - ప్లానంటూ ఏదీ లేదు. చూద్దాం. అనవసరం అనిపిస్తే 'రావిశాస్త్రి పాత్రలు' ఆపేస్తాను.

      Delete

comments will be moderated, will take sometime to appear.