Tuesday, 2 August 2011

మిర్చిబజ్జీలు.. ఒక దారుణ హత్యాకాండ!


బంగాళాఖాతంలో వాయుగుండమట. రెండ్రోజులుగా ఒకటే వర్షం. ఎడతెరిపి లేకుండా సినిమా వానలా ఝాడించి కొడుతుంది. వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది. 

ఇట్లాంటి వాతావరణంలోనే పద్మరాజు 'గాలివాన' రాసి ఉంటాడు. నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా భార్యకి కూడా నచ్చుటచే వంటిల్లు బజ్జీలతో సిద్ధమైంది.

అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా వినిపిస్తుంది కదూ! మన 'భోజనం'లోని మొదటి రెండక్షరాల్లోంచి పుట్టుకొచ్చిన పదంలా ఉంటుంది. అందువల్ల బజ్జీ లేని విందుభోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని అనుకోవచ్చు. 

ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు, మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా బజ్జీల్లో రకాలు రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో దాదాపు ప్రతి సాయంకాలం మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు చెప్పుకోవడం.. నాకు నిన్నమొన్నలా అనిపిస్తుంది. మా 'బజ్జీ సాయంకాలపు' కబుర్ల వివరాలు నా మిత్రులు ఈ రోజుకీ చెబుతుంటారు. 

అప్పటిదాకా సౌమ్యంగా ఉండే 'రాముడు మంచి బాలుడు' కూడా మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే వీరావేశంతో ఊగిపోయేవాడు.. గుంటూరు మిర్చి ఘాటు ప్రభావమేమో! కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల గ్రూపులు.. అమెరికా అనుకూల, ప్రతికూల గ్రూపులు.. గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. కాదేది వాదనకనర్హం? అదో పెద్ద ఓపెన్ ఫోరం. వాదనలు క్రమేపి అరుపులుగానూ, వ్యక్తిగత దూషణలుగానూ రూపాంతరం చెందేవి.    

నా పిల్లలిద్దరికీ బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. నా ఆహారపు నియమాల్ని కాసేపు వదిలేసి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. 

కంట్లోంచీ, ముక్కుల్లోంచి నీళ్ళు కారుతుండగా, నోరు కారంతో మండుతుంది. 'ఉఫ్ ఉఫ్' అంటూ కారంతో మండుతున్న నోటిని ఊదుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని నివారుస్తూ,  భోరున కురుస్తున్న వర్షాన్నితిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నా.   

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. పిల్లలిద్దరూ మిరపకాయ బజ్జీలని మిరపకాయలుగానూ, బజ్జీలుగానూ విడగొట్టుకుని (బజ్జీలకి తోళ్ళూడగొట్టి), మిరపకాయలని వేరే ప్లేట్లో పడేసి, బజ్జీ పిండిభాగాన్ని టొమేటో సాస్‌తో నంజుకుంటూ - 

"నాన్నోయ్! నువ్వు చెప్పినట్లే వర్షం కురుస్తున్నప్పుడు బజ్జీలు తింటుంటే భలే రుచిగున్నయ్!" అన్నారు. 

నా మనసు చివుక్కుమంది. గుండె బరువెక్కింది. మిరపకాయ లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి టొమేటో సాసొకటి! 

ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల వలే అత్యంత విషాదంగా, దయనీయంగా పడున్నాయ్. 

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చేసే హక్కు ఈ పిల్లకాకులకి ఎవరిచ్చారు?  తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగువంటకాలని కూడా రక్షించే ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానులని శిక్షించడానికి కొత్తరకం చట్టాలు అవసరమేమో! 

(picture courtesy : Google)

31 comments:

  1. చట్టాలు శిక్షలు ఎందుకు బాబూ...ఆ మిరపకాయల కారం తట్టుకోలేక నేనూ వాటికి పక్కనపెట్టేస్తా...ఆ మిర్చీ ఫ్లేవర్ వస్తే చాలన్నమాట. :)

    మీ బజ్జీ కబుర్లు మా యూనివర్సిటీ రోజులను గుర్తుతెచ్చాయి. రోజూ సాయంత్రం బంగాళదుంప బజ్జీ, మిరపకాయ బజ్జీ తినేవాళ్ళం టీ తో పాటు. ఆ సమయంలోన్ ఏ ప్రాపంచిక విషయాల గురించి చర్చ...ఓహ్ అద్భుతమైన రోజులు!

    ReplyDelete
  2. :) నిజమే. ఈ ఉద్యమంలో నేను సైతం...

    ReplyDelete
  3. 
 చదివిన తర్వాత మనసు బరువైపోయింది, మా పిల్లలూ ఇంతే.

    "ఛీ, కడుపున చెడబుట్టారు" అని తిట్టుకున్నాను ఒక సారి.

    తిండి పిచ్చి అనుకోకపోతే, బ్లాగులో "భోజనాలు- భయాలు" పెట్టండి. నాకు బాగా ఇష్టం.

    ReplyDelete
  4. అంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా? ..మీరేదో ఒకటి చేసి, ఆ చేసిందేదో మాక్కూడా చెబుతారు కదా అనుకుంటూ చదివితే, ఇలా ప్రశ్నించి వదిలేస్తారా? ఇది బజ్జీకి జరిగిన మరో అన్యాయం.. తీవ్రంగా ఖండిస్తున్నా.. (సులువుగా చెయ్యగలిగే పని ఇదొక్కటేనండీ మరి!!)

    ReplyDelete
  5. మీ పిల్లలను శిక్షించగలిగేది మీరే. కానీ అంతకంటె ముందు మీ దోషాన్ని ఒప్పుకోండి. ఇన్నాల్లూ వాళ్ళకు మిర్చి బజ్జీ రుచిని ఆస్వాదించే విధంగా శిక్షణ ఇవ్వనందుకు మీరే బాధ్యులు. ఒప్పుకోండి. హ్హ హ్హ. హ్హ.

    ఏది ఏమైనా మిర్చి బజ్జీలో సెక్సీనెస్ చూడగలిగిన మీ చాతుర్యానికి అభినందనలు.

    ఫణి.

    ReplyDelete
  6. "...తెలుగు వంటకాలని కూడా రక్షించే ఉద్యమం చేపట్టాలేమో..." You are right.

    అవును పాత వంటకాలను రక్షించే ఒక ఉద్యమం రావాలి. లేకపోతే "రెండు నిమిషాల నూడిల్స్" తల్లులు, వాళ్ళకి చేతకాని వంటకాలన్నీ మోటు అనేసి, చెత్త తిండినంతా మప్పుతున్నారు ఈనాటి పిల్లలకి. పాపం వీళ్ళకి ఆవడలు తెలుసా, పాఠోడి పచ్చడి తెలుసా, జీలకర్ర వేసిన చక్కటి కంది పచ్చడి తెలుసా, వంకాయ ఇగురు పచ్చడి తెలుసా, అరటి పొడి తెలుసా! ఎప్పుడు చూసినా బర్గర్లు, సాస్ నలుచుకోవటం,నూడిల్స్ పీక్కు తినటం, లేకపోతే కాప్సికం తో చప్పిడి కూరలు పాపం ఈ నాటి పిల్లలు. కూరలూ అట్లాంటివే దొరుకుతున్నాయి, దేశవాళీ కూరలన్నీ కనుమరుగయ్యి, ఎక్కువ దిగుబడి వచ్చే సంకర విత్తనాలతో పండించిన కూరలే. వాటిల్లో ఎక్కువ దిగుబడేకాని,రుచి మృగ్యం.

    ReplyDelete
  7. " తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు.. రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల వలే."...........
    .ఇది చదివాక ఇక బజ్జీలను తోలుతీసి తినటానికి ఎవరు మాత్రం సాహసిస్తారండి ?

    ReplyDelete
  8. మీలోని మిరపకాయబజ్జీ ప్రేమికుడి భావుకతని చూసి గుండె కరిగిపోయింది!

    ReplyDelete
  9. My children also done same to same in their childhood.. very nice post

    ReplyDelete
  10. I know Y.Ramana sends his blog to only people he knows very well ( I grew up with him ,knew each other from 9th class ). I am really surprised to see comments from "Anonymous " here . Ramana ,don't you want to introduce your blog friends to our "Brodiepet Gang ".

    Suryam Ganti

    ReplyDelete
  11. బుడుగుకి జట్కా వాడు హీరో అయినట్లుగా మాకు మిరపకాయి బజ్జిలకు వేగముగా ఉల్లిపాయలు కోసే అతను పెద్ద హీరో.

    ReplyDelete
  12. నేను చేసిన తప్పెంటంటే మీ post ని ఆఫీసు లో కూర్చొని, లంచ్ చేస్తూ చదవటం. మనసారా నవ్వుకోలేక కొంచం ఇబ్బంది పడ్డాను. చాలా బాగుంది. మా University రోజులు గుర్తుకు తెచ్చారు.

    ReplyDelete
  13. నిజమేనండీ, నేనూ ఇటువంటి దారుణాలు చూసి భోరున ఏడ్చాను. మీరు కన్న తండ్రి కాబట్టి పిల్లలని దారిలో పెట్టండి ప్లీజ్.

    ReplyDelete
  14. @శ్రీ గారు..
    పిల్లల్ని గాడిన పెట్టేంత సమర్ధుణ్ణి కాదు.
    వాళ్ళ అరాచకాల్ని ఇట్లా పోస్టుల్లో రాసుకుని సంతృప్తి చెందుతుంటా!
    ధన్యవాదాలు.

    ReplyDelete
  15. రమణ గారూ...
    చాలా బాగుంది మీ పోస్టు. మా పిల్లలూ అంతే.
    రాము
    ఏపీ మీడియా కబుర్లు

    ReplyDelete
  16. మీ బజ్జీల ప్రహసనం భలే నోరూరించిందండీ. అంత కంటె ఎక్కువగా ఆ వర్ణనకి పొట్టని నవ్వులతో నింపేసారు. సాయంకాలం ఐతే చాలు ఇంటి దగ్గర యెవరో ఒక కుర్రాణ్ణి పట్టుకుని బాబ్బాబు వెళ్ళరా నికు ఒక బజ్జీ ఇస్తాను అని బ్రతిమలాడుకుని బజ్జీల్ని రప్పించుకున్న రోజుల్ని గుర్తు చేసారు. టపా చాలా బాగుందండీ..
    "అప్పుడు నా కంట పడిందో దారుణ ద్రుశ్యం. పిల్లలిద్దరూ మిరపకాయబజ్జీలని మిరపకాయలు గానూ, బజ్జీలు గానూ విడగొట్టుకుని ( బజ్జీలకి తోళ్ళూడగొట్టి ).. మిరపకాయలని వేరే ప్లేట్లో పడేసి.. బజ్జీ భాగాన్ని టొమేటో సాస్ తో నంజుకుంటూ.. " నువ్వు చెప్పినట్లే వర్షం కురుస్తున్నప్పుడు బజ్జీలు తింటుంటే భలే రుచిగున్నయ్ నాన్నా " అన్నారు.
    నా మనసు చివుక్కుమంది. గుండె బరువెక్కింది. మిరపకాయలేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి! పైగా వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి టొమేటో సాసొకటి! ప్లేట్లో.. తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు.. రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల వలే.. అత్యంత విషాదంగా, దయనీయంగా పడున్నాయ్." ఇవి నాకు చాలా నచ్చిన వాక్యాలు

    ReplyDelete
  17. సుభ గారు..
    ఈ బజ్జీలు ఎప్పుడో రెణ్ణెల్ల క్రితం వండాను.
    ఈ రోజుకీ మీకు రుచికరంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  18. CHALA SARADAGA UNDANDI. SURESH kOTA

    ReplyDelete
  19. డా.సురేష్ గారూ..
    నా బ్లాగుకి స్వాగతం.
    ధన్యవాదాలు.
    'పని లేక' ఈ మధ్య పిచ్చి రాతలు రాస్తున్నాన్లేండి!

    ReplyDelete
  20. Wow.. last lo aa ulli payalu dattinchina murchi bajji chustunte.. ahhh anipinchindi :)

    ReplyDelete
  21. గుండె పిందేసారు

    ReplyDelete
  22. బజ్జీలు మూణ్నెల్ల క్రితంవైనా భావాలు ఫ్రెష్ గానే ఉన్నాయండీ.

    మిరపకాయల్లో కారంలేనివి ఉంటాయండీ. బొద్దుగా, చాలా బారుగా, ముదురురంగులో ఉంటాయవి. బజ్జీలకి మాత్రమే వాడతారు వాటిని. ఆ బజ్జి మిర్చి టేస్ట్‌లో క్యాప్సికం రుచిలా అనిపిస్తాయి. ఈ సారి వాటితో చేసి పెట్టండి. మీ పిల్లలు మీ దార్లోకి వచ్చేస్తారు.

    అప్పుడు మీకు... ఆస్వాదించాల్సిన వేళలో హత్యాకాండ చూసే బాధ తప్పుతుంది.

    * పోస్ట్ మిర్చి బజ్జీల్లా చాలా టేస్టీగా ఉంది *

    ReplyDelete
  23. "" తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు.. రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల వలే."
    Guess this is a bit over the board.

    Otherwise i liked the post.

    Dr.

    ReplyDelete
  24. "ఆస్వాదించాల్సిన వేళలో హత్యాకాండ చూసే బాధ తప్పుతుంది "! పోస్ట్ తో కామెంటు కుడా బాగుందండి !

    ReplyDelete
  25. baboi mee bajjila gola bale bagundi sar ...maa intlo kuda maa papa kuda ilage bajjila tolu teesestundi

    ReplyDelete
  26. BAJJI VALLA ENNI KASTALO ...........
    AYINA KUDA NAKISTAM.............................

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.