Wednesday, 24 August 2011

ప్రాణంబుల్ ఠావున్దప్పె


"నేను బ్రతకను, చచ్చినా బ్రతకను. అసలు నేనెందుకు బ్రతకాలి? చావే నాకు గతి. మా అత్తో సూర్యాకాంతం, నన్ను రాచి రంపాన పెట్టడమే ఆ ముసల్దాని పని. నా మొగుడు చేతగాని సన్నాసి. తల్లి మాటలిని నామీద ఎగురుతుంటాడు. నాకు వైద్యం వద్దు, చిటికెడు విషం కావాలి." ఓ ఇల్లాలు భోరున విలపిస్తుంది.
                 
చాలా విసుగ్గా ఉంది. ఇవ్వాళెందుకో ఏడుపు కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
                     
ఇంతలో - వెయిటింగ్ హాల్లో 'దబ్బు'న  శబ్దం. పెద్దగా కేకలు, అరుపులు, ఆర్తనాదాలు.

హఠాత్తుగా డోర్ తెరుచుకుని అడ్డం వస్తున్న నర్సుని తోసేసుకుంటూ ఓ ఆరడగుల భారీవిగ్రహం సుడిగాలిలా లోపలకి దూసుకొచ్చింది. ఆ విగ్రహం నా పేషంట్ రాంబాబుది. ఇతను కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉద్యోగం చేసేవాడు, ప్రస్తుతం ఏవీఁ చెయ్యడం లేదు. లోపలకొచ్చి నిలబడి, నాకేసి తీవ్రంగా చూడసాగాడు. 

క్షణకాలం నాకేమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యాక కాళ్ళల్లో వణుకు మొదలైంది. ఇప్పుడెలా? కనీసం పారిపోయే అవకాశం కూడా లేదు. రాంబాబు బలిష్టుడు. ఒక్క గుద్దుకే నేను పైకి పోవడం కచ్చితంగా ఖాయం. నాకు మనసంతా బరువుగా అయిపొయింది, దుఃఖం ఆగలేదు. రౌడీ చివరాకరికి రౌడీ చేతిలో చచ్చినట్లు - నా చావు ఈ పేషంట్ చేతిలో రాసిపెట్టి ఉందన్నమాట! విధిరాత ఎవరు మాత్రం తప్పించగలరు?

మిత్రులారా! సెలవు, సెలవు, సెలవు. భగవాన్! నా తప్పులు మన్నించు. చిన్నప్పుడు మైసూర్ కేఫ్‌లో రెండుసార్లు సుబ్బుతో పాటు పీకల్దాకా టిఫిన్ మెక్కి బిల్లెగ్గొట్టాను. మెడికల్ కాలేజ్ లైబ్రరీలో ఎనాటమి బుక్కొకటి జాతీయం చేశాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే - చేసిన పాపం చెబితే పోతుందంటారు, అందుకే పొయ్యేముందు ఎవరికీ తెలీని నిజాలు చెబుతున్నా. దేవుడా! నీవింత నిర్దయుడవా? నేటితో నా టికెట్ చింపేస్తున్నావా?

సర్లే! చావెలాగూ ఖాయమైపోయింది. ఆ చావేదో నొప్పి లేకుండా వస్తే బాగుండునని కోరుకోవడం మినహా నాదగ్గర ఆప్షన్ లేదు. అంచేత - చావుకి సిద్ధమై కసాయివాని ముందు నిలబడ్డ గొర్రెవలే కడుదీనంగా రాంబాబుని చూస్తూ వుండిపొయ్యాను.

రాంబాబు రెండుచేతులూ జోడించాడు, వినయంగా నమస్కరించాడు! 

"గుడ్మార్నింగ్ డాక్టర్!" అన్నాడు.

ఇది కలా, నిజమా? ఆశ్చర్యపోయాను! మండుతున్న అగ్నిగుండం స్విమ్మింగ్ పూల్‌గా మారిపోయినట్లు హాయిగా అనిపించింది. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్నవాడికి బెయిలొచ్చినంత రిలీఫ్‌గా కూడా అనిపించింది. మనసులో ఓ మూల చిన్న సందేహం - కొంపదీసి ఇతగాడికి తన్నేముందు నమస్కారం పెట్టే అలవాటు ఉందేమో!
                 
"మీరు నాయందు దేవుడు డాక్టర్. ఇన్నాళ్ళూ నా మెదడులో మైక్రోచిప్ పెట్టి నా ఆలోచనలల్ని పాకిస్తాన్ వాళ్ళకి ప్రసారం చేస్తున్నవాడు దొరికేశాడు. వాడెవడో కాదు, నా సొంత అన్నే. డబ్బుకి కక్కుర్తిపడి శత్రుదేశానికి మన దేశరహస్యాలు అమ్ముతున్న దుర్మార్గుడు వాడు." అన్నాడు రాంబాబు.    
                   
ఏడుపుగొట్టు ఇల్లాలు కుర్చీలోంచి లేవబోయింది.

"కూర్చో అక్కా. ఈ డాక్టర్ దేవుడు. నువ్వీయనతోనే వైద్యం చేయించుకో. నీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అక్కా! ఎంతోమంది డాక్టర్ల దగ్గిర మందులు వాడాను, మైండంతా గజిబిజిగా ఉండేది. ఈ డాక్టరుగారి మందులు వాడాను, నా మైండ్ క్లీన్‌గా అయిపోయింది." అన్నాడు రాంబాబు.
                 
సో, రాంబాబుకి నామీద దాడిచేసే ఉద్దేశ్యం లేదు. ధైర్యం పుంజుకున్నాను. వణుకుతున్న గొంతుతో - "రాంబాబు, నీతో మాట్లాడాలి." అన్నాను. 
                 
రాంబాబు నాకు మళ్ళీ నమస్కారం చేశాడు.

"నాకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్. ఇక నాకు మీ మందులు అవసరం లేదు. మా అన్నని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి ఇంటికెళ్ళిపోతా. సారీ డాక్టర్! మా అన్నని చావగొట్టాను. పాపం! పేషంట్లు భయపడిపోయినట్లున్నారు. వెరీ సారీ, కానీ ఒక దేశద్రోహిని తన్నకుండా వదిలితే అది దేశద్రోహమంత నేరం." అంటూ ఒక్కఉదుటున తలుపు తీసి బయటకెళ్ళిపోయాడు.    
                 
ఆలోచనా రహితంగా అలా కూర్చుండిపొయ్యాను. 

నర్సు చెప్పింది - "రాంబాబు అన్న పారిపోయాడు సార్! అతని వెనకాలే రాంబాబు కూడా పరిగెత్తాడు."
                 
హుష్!  హమ్మయ్య! చల్లబడ్డ కాళ్ళూ, చేతుల్లోకి మళ్ళీ రక్తప్రసరణ మొదలయ్యింది. ఏసీలో పట్టిన చెమట చల్లగా అనిపిస్తుంది. వేగంగా కొట్టుకున్న గుండె నిమ్మళిస్తుంది. భయంతో ఎండిన గొంతుని ఐస్ వాటర్‌తో తడుపుకున్నాను. తుపాకీగుండు గురి చూసి గుండెల్లోకి పేల్చినా ఏమీ కాకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకలా ఉంది.
               
"నేను బ్రతికి ప్రయోజనమేంటి? ఒక విషం ఇంజక్షను ఇవ్వండి. పీడా వదిలిపోతుంది.." మళ్ళీ మొదలెట్టింది మన ఏడుపుగొట్టు ఇల్లాలు.

అబ్బబ్బ! అసలు చావు తప్పింది గానీ ఈ ఇల్లాలితో చచ్చే చావు ఛస్తున్నాను!  

(picture courtesy : Google)

3 comments:

  1. :-)
    Talk about the toughness of being a psychiatrist !

    In the film " Mr.Bean " , a police officer says this to the man who hosts Mr.Bean in America :-
    I have single handedly dealt with gangs carrying AK-47's , but let me tell you this -
    you're many times courageous than me. hahahaha.

    I remember that dialog when I read a post like this from you.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.