"సుబ్బూ! కొందరు కాఫీ మాత్రమే తాగుతారు, దేశం గూర్చి అస్సలేమీ పట్టించుకోరు." వ్యంగ్యంగా అన్నాను.
ప్రశాంతంగా కాఫీ సేవిస్తున్న సుబ్బు నావైపు ఆశ్చర్యంగా చూశాడు.
"ఏం లేదు, దేశమంతా అన్నాహజారే ఉద్యమంతో అట్టుడిగిపోతుందిలే. విషయం నీదాకా వచ్చినట్లులేదు." నవ్వుతూ అన్నాను.
సుబ్బు ఒకక్షణం ఆలోచించి చెప్పసాగాడు.
"మిత్రమా! మనం రైలుని ఉదాహరణగా తీసుకుంటే విషయం ఈజీగా అర్ధమవుతుంది. రైల్లో ఏసీ పెట్టెలుంటయ్, జెనరల్ పెట్టెలూ వుంటాయి. ఏసీ పెట్టెవాడికి ఏసీ సరీగ్గా పన్జెయ్యట్లేదనీ, దిండు గలీబుల మీద మరకలున్నయ్యనీ చిరాకు పడుతుంటాడు. జెనరల్ పెట్టెవాడు తాగటానికి నీళ్ళు లేవనీ, ఉచ్చకంపు కొడుతుందనీ అరుస్తుంటాడు. ఒక తరగతివాడి ప్రాణసంకటం వేరొక తరగతివాడికి వినోదం. అవడానికి అందరూ ప్రయాణీకులే, కానీ ఒకడి గోల మరొకడికి పట్టదు. అదేవిధంగా మనదేశంలో పౌరసమాజంలో అనేక తరగతులున్నయ్. ఒక తరగతివాళ్ళు - వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకీ, అక్రమాలకీ కడుపు మండి.. తమ నాయకునిగా అన్నాహజారేని పెట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, మంచిదే కదా! ఇందులో ఎవరికి మాత్రం అభ్యంతరం వుండాలి? అడగనీ!"
"అంటే - అన్నాహజారే ఉద్యమంతో నీకు సంబంధం లేదా?" అడిగాను.
"ఉద్యమం నాకు సంబంధం లేని అంశాల మీద జరుగుతుంది. నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, పొలం లేదు. అంచేత - అన్నాహజారే లేవనెత్తిన విషయాలతో నాకు సంబంధం లేదు." అన్నాడు సుబ్బు.
"ఇది ఘోరమైన ఆలోచనా విధానం. నాదాకా వస్తేగానీ తెలీలేదు అన్నట్లుంది." విసుక్కుంటూ అన్నాను.
"ఇందులో ఘోరం ఏముంది! దున్నేవాడిదే భూమనో, ధాన్యం గిట్టుబాటు ధర పెంచాలనో - ఇంకో రెండు డిమాండ్లు అన్నాహజారే చేత చెప్పించు. అక్కడున్నవాళ్ళల్లో ఎంతమంది నిలబడతారో చూద్దాం. నీరా రాడియాతో పాటు బర్ఖాదత్ లాంటి వాళ్ళని అరెస్టు చెయ్యాలని కూడా హజారేతో చెప్పించు. రాంలీల మైదానంలో ఎన్ని టీవీ కెమెరాలు ఇరవై నాలుగ్గంటల లైవ్ కవరేజ్ కోసం మిగిలుంటాయో. ఇది నేను అన్నాహజారేని విమర్శించటానికి అనటం లేదు. ఎవడి దుకాణం వాడిది. రకరకాల దుకాణాలు, రకరకాల ఖాతాదారులు. కందిపప్పు ధర పెరిగిందని ఒకడు ఏడుస్తుంటే, విమానప్రయాణం పెనుభారమైందని ఆక్రోశించేవాడు ఇంకొకడు. ఎవడికివాడే తనది మాత్రమే న్యాయమైన డిమాండనీ, దేశమంతా తన సమస్య గూర్చే ఆలోచించాలంటాడు. సాధారణంగా ఈ కందిపప్పూ, విమానాల మధ్య పరస్పర సహకారం ఉండదు. ఎందుకంటే వీరిద్దరిదీ రాజకీయంగా పరస్పర విరుద్ధ వైఖరి. ఈ వైఖరే అన్ని ప్రభుత్వాలకి శ్రీరామరక్ష." అన్నాడు సుబ్బు.
"కేంద్రప్రభుత్వం దిగొచ్చింది. అన్నాహజారేనా! మజాకానా!" నవ్వుతూ అన్నాను.
"ఇటువంటప్పుడు రాజ్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. అసలు సమస్య ఏమిటో దానికి తెలుసు. ఆ సమస్య పరిష్కరించే ఉద్దేశం రాజ్యానికి వుండదు. కానీ - పరిష్కరిస్తున్నట్లు నటించడమే రాజ్యానికున్న ప్రస్తుత కర్తవ్యం. ఇక్కడ ఎవరి లెక్కలు వారికున్నయ్ - టేవీ చానెళ్ళవారికీ, అన్నా హజారేతో సహా!" అన్నాడు సుబ్బు.
"గ్రేట్ ఎనాలిసిస్, ఇవ్వాళ నీ పెసరట్టులో ఏదో కలిసింది." మెచ్చికోలుగా అన్నాను.
చిరునవ్వుతో ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
"నేవెళ్ళాలి. దారిలో అమ్మకి మందులు కొనుక్కెళ్ళాలి. ఇప్పటికే లేటయ్యింది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
(photo courtesy : Google)
బాగా చెప్పారండీ మన దేశం లో తాటాకు చప్పుళ్ళు చేసే వాళ్ళే తప్ప చిత్తశుద్ధి తో మాట్లాడేవాళ్ళు తక్కువే.
ReplyDeleteమేము సప్పోర్ట్ అంటే మేము సప్పోర్ట్ అని పెద్ద పెద్ద వాళ్ళంతా సందడి చేసారే కానీ ప్రతి అడ్డమైన బంద్ లకూ మూతపడే ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీలు కానీ స్వచ్చందంగా మూసివేసి ప్రభుత్వ వైఖరిని నిరసించలేక పోయాయి. ఎందుకంటే వాళ్ళు చేసే అడ్డగోలు పనులన్నిటికీ లైసెన్స్ లు సంపాదించటానికి లంచాలు తినిపించేది ముందు వాళ్ళేగా.
శ్రీరాగ
రాజుగారి అస్థానంలో ప్రజాసమస్యల పట్ల అవగాహన కన్నా రాజవంశ భక్తికే పెద్ద పీట.
ReplyDeleteచాలాబాగుంది
కాముధ