Wednesday 10 August 2011

లండన్ తగలబడుతుంది (మా సుబ్బు పరిచయం)


"రవణ మావాఁ! అయిదే అయిదు నిమిషాల్లో నీ ముందుంటా. మంచి కాఫీ తాగుతూ నీకో శుభవార్త చెప్పాలి." ఫోన్లో నా ప్రియమిత్రుడు సుబ్బు. 

'వార్నాయనో! శుభవార్త అంటున్నాడు! కొంపదీసి ఈ వయసులో పెళ్ళిగిళ్ళీ అంటూ ఏదైనా సాహస కార్యం తలబెడుతున్నాడా!' ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు - నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నది అయిదేళ్ళ వయసులో. మా సుబ్బు ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా వుండేవాడు. మావాణ్ని 'రుబ్బురోలు, గుమ్మడికాయ, గ్లోబ్' అంటూ వివిధ నామధేయాల్తో ఏడిపించేవాళ్ళు. పదోక్లాసు బోర్డువాళ్ళు మా సుబ్బుపై కక్షగట్టి పదేపదే అడ్డుపడ్డారు. దాంతో నేను మా సుబ్బుని వదిలేసి ముందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. మా సుబ్బు ఇంటరు దాటదామని తీవ్ర ప్రయత్నం చేశాడు గానీ - వల్ల కాలేదు. 

మా సుబ్బుతో నా స్నేహం ఈనాటికీ అవిచ్చిన్నంగా, డైలీ సీరియల్లాగా కొనసాగుతూనే వుంది. సుబ్బు నా రైట్ హేండని నేననుకుంటాను. నేనే తన రైట్ హేండని సుబ్బు ఫీలవుతాడు. ఎవడికి ఎవడు ఏ హేండయినా, మేమిద్దరం మాత్రం ఘోరమైన ఆప్తమిత్రులం - ఇది మాత్రం చచ్చేంత నిజం. 

సుబ్బుది బోర్లించిన గాంధీగారి సిద్ధాంతం. చెడు మాత్రమే వింటాడు, చెడు మాత్రమే చూస్తాడు, చెడు మాత్రమే మాట్లాడతాడు. మనిషి ఎంత మంచివాడో నోరంత చెడ్డది. సుబ్బుని యే అమ్మాయి చేసుకుంటుందో ఇబ్బంది పడుతుందనుకునేవాణ్ని. అదృష్టవశాత్తు మా సుబ్బు పెళ్ళి చేసుకోలేదు. తలిదండ్రులకి ఒక్కడే సంతానం. కూర్చుని తినేంత ఆస్తిపాస్తులున్నయ్.

మావాడు వైనంగా, ప్రశాంతంగా తింటాడు. తీరిగ్గా నాలుగైదు పేపర్లు తిరగేస్తాడు. గంటలకొద్దీ గుడ్లప్పగించి టీవీ వార్తలు ఫాలో అవుతాడు. కష్టపడి రోజూ రెండుపెట్టెల సిగరెట్లు ఊదేస్తాడు. నన్ను కలిసి కాఫీ తాగుతూ నాలుగు హడావుడి కబుర్లు చెప్పడం మావాడి హాబీ.  

ఆలోచిస్తుండగానే, సుబ్బు సుడిగాలిలా వచ్చాడు. 

"రవణ మావాఁ! లండన్ తగలడిపోతోంది. ఇక్కడ నువ్వింత ప్రశాంతంగా ఉన్నావేంటి? " మావాడి మోహం మతాబాలా వెలిగిపోతుంది. 
               


'ఏదో శుభవార్త చెబుతానని లండన్ గూర్చి మాట్లాడుతున్నాడేంటబ్బా!' అని ఆశ్చర్యపోతూ - 

"అవును సుబ్బు! ఇది చాలా ఘోరం." అన్నాను. 

"ఛస్.. నీకసలు బుద్ధుందా? బ్రిటోషోడు మన్ని రెండొందల యేళ్ళు లూటీ చేశాడుగదా. వాడి కొంప తగలడుతుంటే ఆనందించక ఘోరం ఆంటావేంటి! మన ఉసురు ఇన్నాళ్ళకి తగిలింది ఆ దౌర్భాగ్యుడికి." అన్నాడు సుబ్బు. 

"నువ్వు విషయాన్ని రాజకీయంగా మాట్లాడు సుబ్బూ. అంతేగానీ - పిల్లి శాపనార్ధాల టైపులో మాట్లాడకు." విసుగ్గా అన్నాను. 

"ఏవిటోయ్ నీ బోడి రాజకీయం. నేనేమీ హిందూ పేపరుకి ఎడిటోరియల్ రాయట్లేదు. నీ మర్యాదస్తుడి కామెంట్లు నీదగ్గరే ఉంచుకో. అమ్మా, అమ్మా, తెల్లతోలు గాడ్దెకొడుకులు. ఇట్లాంటి లూటీలు, దహనాలు మన అలగా దేశాల్లోనే సాధ్యమన్నట్లు ఎంత పోజు దొబ్బేవాళ్ళు. తిక్క కుదిరింది పాలిపోయిన పాచిమొహం సన్నాసులకి."

ఈలోపు కాఫీ వచ్చింది. ఆవేశంతొ కాఫీ గబగబా తాగేశాడు. 

"వచ్చిన పని అయిపోయింది. మళ్ళీ రేపు కలుస్తాలే. లండన్ శుభవార్త నీ చెవిలో వేసేదాక నాకు కాలూచెయ్యి ఆడలేదు." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు నా ప్రియమిత్రుడు సుబ్బు. 

(photos courtesy : Google)              

12 comments:

  1. funny but true!
    i live in london.

    whats happening is just inhumane, result of not following any ethics for generations except money and market capitalism.

    ReplyDelete
  2. Excellent Sir.

    ReplyDelete
  3. I believe this Subbu guy (obviously your inner personality) will come out to be a smart guy!!! Keep it going Ya Ra!

    ReplyDelete
  4. కామెంట్ చేసినవారందరికీ పేరు పేరునా ( నాకు అజ్ణాతల పేర్లు తెలీనప్పటికీ! ) ధన్యవాదాలు.

    ReplyDelete
  5. నిజం కదండీ.. మర్యాద వంకన పైకి అనకపోయినా బాగా జరిగింది అని ఒక్క క్షణమైనా అనిపించక మానదు..

    ReplyDelete
  6. @ మురళిగారు, థాంక్యూ. మీ కామెంటుకి మా సుబ్బుకి తెలియజేస్తాను.

    ReplyDelete
  7. చాలా బాగుంది . సుబ్బు గారిలా సంతోష పడ బోయి ఆగిపోయాను.

    లండన్ లో మా చుట్టం పిల్లాడు గుర్తొచ్చి.

    ఇంతకీ సుబ్బు అనే ఫ్రెండు నిజంగా ఉన్నాడా? ఆ మధ్యెప్పుడో పేరు బాగుందని వాడాను. శివాలయం రోడ్డులో ఎముకల డాక్టరు గారిని కనుక్కుంటే, ఉన్నాడంటావా అని నన్నే ఎదురు అడుగుతున్నారు.

    ReplyDelete
  8. @chandu s గారు, ధన్యవాదాలు. సుబ్బు ఉన్నాడు. రేపు సుబ్బుని కలిసినప్పుడు మీ కామెంట్ తెలియజేస్తాను.

    ReplyDelete
  9. hammayya,mee subbu chala baga cheppadu,tellavallavi double standards,

    ReplyDelete
  10. నువ్వు , నీ సుబ్బు రూపంలో చెప్పింది చాలా నిజం. ఈ తెల్ల వెధవలు ఇన్నాళ్ళు బయట దేశాలని 'కామెంట్' చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి తెలిసొస్తోంది. ఇదంతా 'organised crime '.
    గో వె ర

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.