Sunday, 21 August 2011

ఆధ్యాత్మికత - దోసె


"పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళలేవు. ఈ నడుమ కాలానికి నీకెందుకింత తాపత్రయం?"  

ఉదయాన్నే మెళుకువొచ్చి, ఏంచెయ్యాలో తోచక  టీవీ పెట్టంగాన్లే టీవీలోంచి ఓ గడ్డపు స్వామీజీ సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. గుండె ఝల్లుమంది. 

"జీవితం బుద్బుధప్రాయం. కోపతాపాలు జయించినవారే అనిర్వచనీయమైన ఆనందం పొందగలరు. ప్రశాంత మనసుతో లోకాన్ని జయించండి." 

'అవున్నిజం' అనుకుంటూ ఛానెల్ మార్చాను. మార్చిన చానెల్లో కూడా ఇంకో గడ్డం స్వామీజీ అబిభాషణ -

"సమస్త రోగములకు జిహ్వాచాపల్యమే కారణం. రుచి అన్న పదాన్ని జయించండి. శరీరమనే ఈ కట్టెని నిలుపుటకు ఇన్ని రుచులు అవసరమా?" 

చాల్చాలు, నాకు అద్భుత జీవిత సత్యాలు అర్ధమైపోయాయి. ఈరోజు నాజీవితంలో సుదినం. ఉదయాన్నే లేవడం నా అదృష్టం, గొప్ప జీవితసత్యాలు గ్రహించాను. ఈక్షణం నుండే కోపం, ఆకలి వంటి పదాలకి విడాకులిచ్చేస్తున్నాను. పోతే పోనీ సతుల్, సుతుల్, హితుల్. వస్తే రాని కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్. ఏమైనా కాని ఏమొచ్చినా కాని ఇక జీవితంలో కోపగించను గాక కోపగించను. 

'తివిరి ఇసుక నుండి.. ' పద్యం పాడుకుని, చివరి పాదం 'ఎవరు ఎంతకష్టపడిననూ ఈ జ్ణానికి కోపమ్ము తెప్పించలేరు' అని పూరించుకున్నాను.      
                        
ఒక్కసారిగా గుండెలనిండా గాలి పీల్చి వదిలి పరిసరాలు పరికించి చూశాను. మనసంతయూ ఆనందడోలికలలో తేలియాడుతున్నట్లుంది. ఏమి ఈమాయ! ఎంత ప్రశాంతంగా యున్నది!! ఎంత హాయిగా యున్నది!! ఇకనుండి టీవీలో స్వామీజీలకిమల్లే నేనుకూడా కోపమనే చీకటిని వదిలి ప్రశాంతమనే వెలుగులో, చిరునవ్వే ఆయుధంగా బతకాలి. 

నా జీవితంలో సంభవించిన ఈ పెనుమార్పులు ఫ్లాష్ న్యూస్‌గా నా స్నేహితులకి తెలియజెయ్యాలి. కోపతాపాల్లేని జీవితం ఎంతటి ఆనందమయమో వారందరికీ చెప్పి ఒప్పించి, వారిని కూడా నా శాంతిమార్గంలోకి తీసుకురాకపోతే స్నేహానికి విలువలేదు. ఇకనుండీ అందరికీ నాలో ఓ చిత్తూరు నాగయ్య, ఓ గుమ్మడి కనిపిస్తారు.
                          
"సార్! టిఫిన్ తెచ్చా. టేబుల్ మీద పెడుతున్నా." అన్న మాటకి ఇహలోకంలోకి వచ్చాను. అతను నా దగ్గర కొత్తగా చేరిన డ్రైవర్. ఆనందభవన్ నుండి తెచ్చిన మసాలాదోశ పార్సెల్ని వినయంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.  
                       
అన్నట్లు చెప్పడం మరచాను. ఇవ్వాళ మసాలాదోశ తినాలని నిన్నరాత్రే నిర్ణయించుకున్నాను. ఉదయాన్నే ఆనందభవన్‌కెళ్ళి మసాలాదోశ తెమ్మని పురమాయించాను. ఈలోపుగా టీవీ గడ్డం స్వామీజీలు జీవితరహస్యాలు చెప్పేశారు.   

చేతులు వాష్ చేసుకుంటూ ఒకక్షణం ఆలోచించాను.  

'బుద్బుధప్రాయమైన జీవితానికి ఈ మసాలాదోశ అవసరమా? ఈ అశాస్వత శరీరానికి తుచ్ఛమైన జిహ్వాచాపల్యమేల? అర్జంటుగా ఈ మసాలాదోశని త్యజించాలి. నా నిగ్రహశక్తికి పరీక్ష మసాలాదోశతోనే ప్రారంభం. 

అయితే ఒక చిన్న ధర్మసంకటం - 
                     
ఇవ్వాళ మసాలాదోశ తినాలనేది నాకు జ్ఞానోదయం కాకముందు తీసుకున్న నిర్ణయం. కావున ఇక్కడ వ్రతభంగమేమీ కలుగలేదని నా అభిప్రాయం. అయినా - తెచ్చుటకు డ్రైవరెవ్వడు? తినుటకు నేనెవడిని? అంతా పైవాడి లీల. ఈరోజు నేను మసాలాదోశ తినవలెనని ఎప్పుడో నిర్ణయమైపోయుంటుంది. తుచ్చ మానవులం - కాదన్డానికి మనమెవ్వరం? 

అయినప్పటికిన్నీ - మిత్రులారా! నాజీవితంలో ఇదే చివరి మసాలాదోశ అని హామీ ఇస్తున్నాను. ప్రేయసిని కడసారి చూసుకుంటున్నట్లు అపురూపంగా, ఆప్యాయంగా నా 'చివరి మసాలాదోశ' పార్సెల్ విప్పాను.
                         
గుండెల్లో గునపం దిగిందా? నెత్తిమీద పిడుగు పడిందా? పార్సెల్ చుట్ట లోపల ఉంది మసాలాదోశ కాదు. ప్లెయిన్ దోశ. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొచ్చింది. ఆవేశంతో, ఆగ్రహంతో మొహమంతా వెచ్చగా ఆవిర్లు. 

ఈ బక్కపీచు, చెరుగ్గడ డ్రైవరుగాడికి మెదడు మోకాల్లో ఉందా? చెవిటిముండాకొడుకు. దరిద్రుడు, పంది, దున్న, ఎద్దు, కుక్క. దరిద్రుణ్ని కుక్కల్తో కరిపించాలి, పందుల్తో పీకించాలి.  
                      
డ్రైవర్‌ని రమ్మని కబురంపించాను. బిక్కుబిక్కుమంటూ వచ్చాడు. నన్ను చూడంగాన్లే భయపడ్డట్టు వెనక్కి తగ్గాడు. 

"ఏమయ్యా! నీకు బుర్ర లేదా? నేను చెప్పిందేమిటి, నువ్వు తెచ్చిందేమిటి?" 
                     
నా మాటలకన్నా నా ఉగ్రరూపం అతన్ని భయపడేలా చేసుండాలి. 

"పొరపాటయింది సార్" ఏదో నసుగుతున్నాడు. 

దొంగ రాస్కెల్! నాకు కోపం నషాళానికంటింది. ఎదురుగా ఉన్న దోశని విసిరి నేలకేసి కొట్టాను. దోశ, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి, అరిటాకులు.. చిందరవందరగా గచ్చుమీద పడ్డాయి. క్షణంలో డ్రైవర్ మాయమైపోయాడు.
                       
ఆగ్రహం క్రమేపి దుఃఖంలోకి మారింది. అయ్యో! మసాలాదోశ తిందామని ఎంత ఆశపడ్డాను! మసాలా అట్టు తల్చుకోంగాన్లే నోట్లో నీరూరుతుంది. బంగాళదుంపకూరని అట్టుముక్కతో చుట్టి కొబ్బరీ, అల్లం చట్నీలతో కలిపి నోట్లోకి నెడితే - నాసామిరంగా, ఆ రుచిని ఏమని వర్ణించను? కొలిస్తే స్వర్గానికి బెత్తెడు దూరం! 

మిత్రులారా! ఆనందభవన్ మసాలాదోశ నన్ను రారమ్మని పిలుస్తుంది. ఇంక నేను ఆగలేను. నేనిప్పుడే ఆనందభవన్ కి వెళుతున్నా. టాటా! బై బై!

మీకు చెప్పదలచిన విషయం నేనేమీ మర్చిపోలేదు. కోపాన్నీ, జిహ్వాచాపల్యాన్నీ జయించే చిట్కాలు మీకు నేను చెప్పవలసి ఉంది . అది నా బాధ్యత. 

కానీ - అర్జంటుగా మసాలాదోశ తినకపోతే చచ్చేట్టున్నాను! తర్వాత తీరిగ్గా చెబుతాలే!!

(picture courtesy : Google)

7 comments:

  1. మీ దోసోపవాక్యానం అద్భుతం . మీరు ఉపదేశం ఆలస్యం చేసినందుకు కించిత్తు కోపం వచ్చినా ఈ లోపల నా జిహ్వ చాపల్యం తీర్చుకునే అవకాశం ఇచ్చారు . మనసారా మరో దోశ తిని ఆ తర్వాతా మీరు చెప్పినది చదివి దోశ తినుట మానేస్తాను .

    ReplyDelete
  2. హహ్హహ్హ.. చాలా బాగా రాశారు. ఇది చదివాక అర్జంటుగా మసాలాదోశ తినకపోతే నేనూ చచ్చేట్టున్నాను. దగ్గరలో ఎక్కడా ఆనందభవన్ కూడా లేదు. మీరు చెప్పబోయే జిహ్వ చాపల్యాన్ని జయించే చిట్కాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

    ReplyDelete
  3. hahahaa...bhalE baagundi...

    ReplyDelete
  4. :) సరే గబ గబా తినేయండి. మేమూ ఈలోగా నాలుగు ఇడ్లీలు, కారప్పోడీ,నెయ్యీ, అల్లం పచ్చడి, పల్లీల పచ్చడీ అవీ తినేసి, ఫిల్టర్ కాఫీ తాగేసి వస్తాం..

    ReplyDelete
  5. మరేమీ.. ఇంచక్కగా గెడ్డం పెంచేసి మీరు కూడా టీవీ స్వామీజీ అవతారం ఎత్తేయొచ్చు.. తిండినీ, కోపాన్నీ జయించడాన్ని గురించిన మీ జ్ఞాన బోధకి మీ సుబ్బూ గారు ఎలా రియాక్టయ్యారో రాయడం మర్చిపోకండి.. అసలే ఆయనకీ నాలాగే ఉప్మా పెసరట్టన్నా, ఫిల్టర్ కాఫీ అన్నా ప్రాణం కూడాను..

    ReplyDelete
  6. @rajasekhar Dasari గారు, శిశిర గారు, Ennela గారు, క్రిష్ణప్రియగారు & మురళిగారు, మీకు నా ఆధ్యాత్మికత నచ్చినందుకు ఆనందంగా ఉంది. మీ కామెంట్లు నా టపాకి కొనసాగింపుగా చక్కగా ఇమిడిపోయి నిండుదనాన్ని తెచ్చాయి. ధన్యవాదాలు.
    చిన్నప్పుడు 'దంతవేదాంతం' అని ఒక నాటిక చదివాను. రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి అనుకుంటాను. ఆ రచన గుర్తు తెచ్చుకుని.. ఆ ఐడియాని నాకిష్టమైన మసాలా దోశకి అన్వయించుకుంటూ రాశాను. అదీ కధ.

    ReplyDelete
  7. దంత వేదాంతం భమిడిపాటి రాధాక్రిష్ణ అనుకుంటా

    కాముధ

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.