"ఛీఛీ! అసలు తెలుగొక భాషేనా? కాదు. మరి భాషంటే ఎలా ఉండాలి? ఉర్దూలా ఉండాలి. ఉర్దూ భాషలో మావిడి కాయంత తియ్యదనముంది, నిమ్మకాయంత పులుపుంది, ఇడ్లీసాంబారంత కమ్మదనముంది. గొప్పభాషకి నిర్వచనం ఉర్దూ! ఆ భాష రానివాడిది జనాభా లెక్కకి తప్పించి ఇంకెందుకూ పనికిరాని జన్మ."
అప్పటికి మావాడు మమ్మల్ని రెండొందల నలభయ్యోసారి విసుక్కున్నాడు. మాకు ఉర్దూ రాదు, తెలుగు మాత్రమే వచ్చు. అంచేత - మేం కూడా అప్పటికి సిగ్గుతో రెండొందల నలభయ్యోసారి తల దించుకున్నాం.
"ఎవడ్రా రేడియోలో తెలుగు పాటలు పెట్టింది? పల్లెటూరి బైతుల్లారా! వివిధ భారతికి మార్చండి. మనోరంజన్ ప్రోగ్రాం పెట్టండి. ఎంతసేపటికీ ఆ గరగరలాడే ఘంటసాల పాటలేనా? ఇకనుండి రఫీ, కిశోర్ పాటలే వినండి - లైఫ్‌లో పైకొస్తారు." గద్దించాడు మావాడు.
"వివిధ భారతి రేడియో స్టేషన్ సరీగ్గా రాదు, తుఫానులో కుక్క ఏడుపులా తెరలు తెరలుగా వస్తుంది." మా వినయపూర్వక సంజాయిషీ.
"అయినా సరే! వివిధ భారతి పెట్టాల్సిందే. తెలుగంటే నాకు చిరాకు. రాత్రి బినాకా గీత్ మాలా వస్తుంది, అమీన్ సయాని హిందీని ఫాలో అవ్వండి, మీ బావిలో కప్ప జన్మ ధన్యమౌతుంది." ఆర్డర్ పాస్ చెయ్యబడింది.
'ఎందుకు? ఎందుకు మా బ్రతుకులిలా బుగ్గి పాలయ్యాయి? వేసని సెలవలు మా జీవితాల్ని ఎంతగా దగా చేశాయి! మేమీ తెలుగు నేలపై జన్మించనేల! మావాడు హైదరాబాద్ పోనేల!'
ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం -
అవి మాకు జూనియర్ ఇంటర్ సెలవలు. క్రికెట్ ఆడుకోడం, సరదా కబుర్లు, చిన్నచిన్న తగాదాలు, షికార్లు, సినిమాలు.. ఇదే మా స్నేహబ్రందం జీవితం. అయితే - మాలో ముఖ్యుడొకడు ఆ సెలవల నెలరోజులు మాయమైపొయ్యి, సీనియర్ ఇంటర్ క్లాసులు మొదలయ్యేప్పటికి ప్రత్యక్షమయ్యాడు.
ఇప్పుడు మా వాడి రూపు ఎన్టీఆర్్‌కి మారువేషం వేసినట్లుగా, పూర్తిగా మారిపోయింది. పొడుగు జుట్టు, బొచ్చె క్రాఫింగు, చేతికి కడియం, మందపాటి గోనెగుడ్డతో బెల్ బాటం ప్యాంటు. ఆ గోనెగుడ్డ ప్యాంటుని నెలకోసారి కూడా ఉతక్కూడదుట! అది మా గుంటూరు చెమటకి తడిసి, నాని.. పాడుకంపు కొడుతుండేది. ఆ కంపే ఫ్యాషన్ట! ఆ గోనెగుడ్డని 'జీన్స్' అంటార్ట!
మావాడు సెలవల్ని హైదరాబాదులో ఉంటున్న వాడి మేనమామ ఇంట్లో గడిపాడు. హైదరాబాదు ముచ్చట్లు డైలీ సీరియాల్లా రోజూ చెప్పేవాడు, మేం నోరు తెరుచుకుని వినేవాళ్ళం. మాకు మావాడి అనుభవాలు సింద్‌బాద్ అద్భుత యాత్రలా అనిపించింది. హైదారాబాదులో తెలుగు ఎవడికీ అర్ధం కాదుట. ఎక్కడ చూసినా గడ్డం సాయిబులు, షెర్వాణీలు, రూమీ టోపీలుట. కొండరాళ్ళు కొండల్లో కాదు, ఇళ్ళల్లోనే ఉంటాయిట!
ఈమధ్య మావాడు ఆలోచించడం కూడా ఉర్దూలోనే చేస్తున్నాట్ట! ఈ ఉర్దూ పాండిత్యం మావాడి స్థాయిని మేమందరం అసూయతో కుళ్ళుకునేంత ఎత్తుకి పెంచేసింది. ఈ విధంగా మావాడు తన ఉర్దూతో మాపై ఆధిపత్యం చెలాయించసాగాడు. మేం గుడ్ల నీరు కుక్కుకుంటూ మా బానిస జీవితాన్ని భారంగా ఈడుస్తున్నాం, అదీ కథ!
మా ఊరికి ప్రతి సంవత్సరం ఎక్జిబిషన్ వస్తుంది. పిట్టలు కొట్టే తుపాకీతో బుడగల్ని పేల్చటం, మడ్డినూనెలో వేయించిన బజ్జీలు, అప్పడాలు తిన్డం, తుప్పు పట్టిన జైంట్ వీల్లో తిరగడం.. మాగొప్పగా వుంటుంది! మా గుంటూరు సూర్యుడికి అతి తక్కువ దూరంలో వుంది, ఎండల వేడికి తారురోడ్లు కరిగిపోతుంటాయి. సాయంకాలాలు ఈ ఎగ్జిబిషన్ మాకు హాయినిచ్చేది.
గుంటూర్లో ఇంకేమి హాయి ఉన్నది? నాజ్ అప్సర ఉంది. ఎవరా అప్సర!? అబ్బే, అప్సర అంటే మనిషి కాదు, ఒక ఏసీ సినిమా హాలు! నా జీవితంలో మొదటి ఏసీ చల్లదనం అనుభవం అక్కడే. చల్లగా, సెంటు వాసనతో హాయిగా వుంటుంది. కానీ ఏం లాభం? అక్కడన్నీ హిందీ సినిమాలే, మాకు తెలుగు తప్ప ఏ భాషైనా పాళీభాషతో సమానం!
ఒకసారి 'పాకీజా' వెళ్ళాం. సినిమా మొదలవ్వంగాన్లే మాలో సగంమంది ఆ చల్లదనానికి నిద్రపొయ్యారు. నేను పట్టుదలగా నిద్ర ఆపుకుని మరీ సినిమా చివర్దాకా చూశాను. మీనాకుమారి డాన్సులు చేస్తుంంటుంది, డాన్సుల మధ్య ఏడుస్తుంంటుంది. అంతే అర్ధమైంది! ఏవీఁ అర్ధం కాకపోయినా, సినిమా గొప్పకళాఖండమని మాత్రం అర్ధమైంది.
ఎప్పట్లాగే ఆ యేడాది కూడా మిత్రులందరం ఎక్జిబిషన్‌కి వెళ్ళాం. ఇప్పుడంటే సెల్ ఫోన్లతో ఎడాపెడా ఫోటోలు తీసేస్తున్నారు గానీ, ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా అపురూపం. ఫొటోలో చక్కగా 'పడాలని' తపన పడుతూ బాగా 'దిగేవాళ్ళం'! అంచేత ఎక్జిబిషన్లలో ఫోటో స్టూడియో స్టాల్స్ చాలా పాపులర్. అక్కడ రూపాయికో ఫోటో తీస్తారు. నల్లటివాళ్ళని కూడా గోడక్కొట్టిన సున్నంలా తియ్యడం వారి స్పెషాలిటీ, బహుశా ట్రేడ్ సీక్రెట్ కూడానేమో!
ఆ రోజు మేం ఫొటోలు 'దిగిన' స్టూడియో స్టాల్ నార్తిండియావాళ్ళది. వాళ్ళల్లో ఒకడు ఎర్రగా, పొడుగ్గా ఉన్నాడు. ఏదో ఆకుని గారపళ్ళతో మేక నమిలినట్లు పరపరా నముల్తున్నాడు. రూపాయి టికెట్లు కొనుక్కుని కృష్ణతో ఫైటింగ్ పోజు, ఎన్టీఆర్‌తో షేక్ హ్యాండ్ పోజు.. రకరకాలుగా ఫొటోలు దిగాం. ఆ ఆకులు నమిలేవాడు ఓ గంట తరవాతొచ్చి ఫొటోలు తీసుకొమ్మన్నాడు.
సరే! కొంతసేపు బజ్జీలు, అప్పడాలు నమిలాం. పన్లోపనిగా కనబడ్డ అమ్మాయిల్ని కూడా నమిలేసేట్టు చూశాం. ఆవిధంగా ఉదరపోషణా, కళాపోషణా చేసుకుని గంట తరవాత ఫోటో స్టూడియో స్టాల్‌కి వెళ్ళాం. స్టూడియో ముందు ఒక తెల్లగుడ్డ ఏటవాలుగా వేళ్ళాడుతుంది. ఆగుడ్డ మీద తడితడిగా ఫోటోలు వున్నాయి, ఓ మూలగా వెకిలి నవ్వుతో మా సుందర వదనాలు. ఫోటోలకి పక్కనే ఆకులు నముల్తూ గారపళ్ళ స్టూడియోవాడు. వీడింక అన్నం తినడా? రోజంతా మోపుల కొద్దీ ఆకుల్ని నమిలేసి బ్రతికేస్తుంటాడా!
గారపళ్ళ మేకకి మా ఫోటోల తాలూకా కౌంటర్ ఫాయిల్స్ ఇచ్చాం, వాడు ఆ ఫాయిల్స్ వెనక్కి తిప్పి చూశాడు. ఉర్దూలో ఏదో చెప్తూ వెనక్కిచ్చేశాడు, ఒక్కముక్క అర్ధం కాలేదు. ఇంతకీ వాడు చెప్పేది ఏంటబ్బా! కొద్దిసేపటికి అర్ధమైందేమనగా - మేం వాడికి ఇంకా కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉందిట. టికెట్ల వెనక ఏదో మా అప్పు తాలూకా యేదో అంకె వేసి ఉంది, వాస్తవానికి మేం ఒక్కపైసా కూడా ఇవ్వనక్కర్లేదు. మాక్కోపం తన్నుకొచ్చింది, కానీ నోరు తెరిచే అవకాశం లేదు, భాషా సమస్య!
"మేం డబ్బులు మొత్తం ఇందాకే ఇచ్చేశాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకివ్వాలి?" అంటూ మాలో ఒకడు ధైర్యం చేసి తెలుగులో ఘోషించాడు.
"తెలుగు నహీ ఆతా, ఉర్దూ మే బోల్" అన్నాడు స్టూడియోవాడు విసుగ్గా.
మాలో ఇంకోడు ఇంకో అడుగు ముందుకేశాడు.
"భాయ్ సాబ్! హమ్ ఉర్దూ నహీ, డబ్బులు భీ నహీ!" అంటూ గొణిగాడు.
"ఉర్దూ మే బోల్!" అంటూ విదిలించాడు మేకాధముడు.
లాభం లేదు. ఇక్కడ తెలుగుభాష దారుణంగా ఓడిపోయింది. తెలుగు నేల మీద తెలుగుభాష పనికి రాకుండా పోయింది! హఠాత్తుగా గుర్తొచ్చింది, మా హైదరాబాదీ ఉర్దూ మాస్టర్ ఉన్నాడుగా! ఇప్పటిదాకా అనవసరంగా మేకగాడితో కష్టాలు పడ్డాం, అవమానాలూ పడ్డాం, ఎక్కడ్రా వాడు? మావాడు ఆ పక్కగా కొద్దిదూరంలో ఒక అమ్మాయి దృష్టిలో పడ్డానికి తన పొడుగు జుట్టు స్టైల్‌గా ఎగరేస్తూ, ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని పోజులు కొడుతున్నాడు.
'ఇంక చాల్లే! నీ జీవితమంతా ఇక్కడే గడిపినా, ఆ అమ్మాయి నీ దరిద్రప్మొహాన్ని చూసే చాన్స్ లేదు.' అంటూ వాణ్ణి ఫోటో స్టూడియోకి లాక్కొచ్చాం, సమస్య వివరించాం.
'ఇంక నీ ఇష్టం. ఈ మేకారావుని వాడి భాషలోనే దంచు, మన ఫొటోలు సంపాదించు.' అని ముందుకు నెట్టి గర్వంగా పక్కన నించున్నాం.
మా హైదరాబాద్ ఉర్దూగాడు నోరు తెరవలేదు, అలా చూస్తూ నించున్నాడు. మేగ్గాడు ఈసారి స్వరం పెంచాడు. వాడు మమ్మల్ని తిడుతున్నాడని అర్ధమైంది.
"మాట్లాడు, మన ఫొటోలు లాక్కో!" అంటూ మావాణ్ని వెనకనించి గిల్లుతున్నాం.
ఎంత గిల్లినా మావాడు ఉలకడు, పలకడు. మా గిల్లుడు రక్కుడుగా మారి, బాధ భరింపరానిదిగా తయారైన కారణాన, ఎట్టకేలకు మావాడు నోరు తెరిచాడు -
"గల్తీబాత్ మత్ కరో భాయ్!"
మేకగాడు ఈసారి రంకెలెయ్యడం మొదలెట్టాడు. మా హైదరాబాదుగాడు ఆ తిట్లన్నీ ఓపిగ్గా పడుతున్నాడు. ఎంతసేపటికీ అరిగిపోయిన రికార్డులా ఒకటే మాట -
"గల్తీబాత్ మత్ కరో భాయ్!"
కొంతసేపటికి - మావాడికి 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' మించి పరాయి భాషలో ఇంకోముక్క కూడా రాదని మాకు అర్ధమైపోయింది.
ఓరి దరిద్రుడా! ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంతలా హింసించావ్? అయ్యో! మా ఫొటోలు వదిలేసుకోవలసిందేనా? భగవంతుడా! దారి చూపవయా!
భగవంతుడు దారి చూపాడు - రజాక్ రూపంలో! రజాక్ కుటుంబానికి మా ఇంటి దగ్గర బడ్డీ కొట్టుంది. ఆ కొట్టు మేం పుట్టకముందు నుండీ వుంది. దాన్ని సాయిబు కొట్టుగా అనేవాళ్ళు. సాయిబు కొట్టు రజాక్‌కి మా గోడు వెళ్ళబోసుకున్నాం.
ఇంక చూడండి! నా సామిరంగా! రజాక్ అగ్నిహోత్రుడైపొయ్యాడు. ఉర్దూలో ఆ మేకాధముణ్ణి తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. స్టాల్ పీకిచ్చేస్తానని బెదిరించాడు. మాలో ఒకడు పెద్ద పోలీసాఫీసరు కొడుకని బెదిరించాడు.
సడన్‌గా మేక కాస్తా పిల్లిలా మారిపోయింది!
"మాఫ్ కర్నా సాబ్!" అంటూ గుడ్డమీద ఫొటోల్ని అత్యంత వినయంగా ఇచ్చాడు.
"ఫొటోలన్నీ వచ్చాయో లేదో చూసుకోండి. తాగున్నాడు సాలాగాడు, పిల్లలు గదాని బెదిరించి డబ్బులు గుంజుదామనుకున్నాడు." అంటూ రజాక్ వెళ్ళిపొయ్యాడు.
మిత్రులారా! ఇంతటితో కథ అయిపోయింది, ఉర్దూ రాదని తేలిన మరుక్షణం మావాడి ప్రభ తగ్గిపోయింది. అప్పటిదాకా తెలుగు మాత్రమే తెలిసి ఉన్నందుకు సిగ్గుతో దించుకున్న మా మొహాలు 'తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది' అంటూ గర్వంగా తలెత్తుకున్నాయి.
థాంక్యూ! థాంక్యూ మై డియర్ ఎక్జిబిషన్!
అటు తర్వాత మావాడు ఏం చెప్పినా - 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' అంటూ గద్దించాం, నోరు తెరిచే అవకాశం లేకుండా సీల్ చేసేశాం. ఆ విధంగా హైదరాబాదు ఉర్దూని శాశ్వతంగా నిర్మూలించేశాం, గుంటూరా మజాకా!
మా చదువులు అయిపొయ్యాయి. మావాడు బ్యాంకు ఉద్యోగస్తుడయ్యాడు. అప్పట్నించి నాకు భారత బ్యాంకింగ్ వ్యవస్థ కుప్ప కూలిపోతుందేమోనని భయం పట్టుకుంది. రెండో ఎక్కం కూడా సరీగ్గారాని మావాడు కంప్యూటర్ల సాయంతో ఉద్యోగం లాక్కొస్తున్నాడు.
మొన్నామధ్య కలిసినప్పుడు మావాణ్ని హెచ్చరించాను - "ఉద్యోగం జాగ్రత్తరోయ్!"
మావాడు పెద్దగా నవ్వి అన్నాడు - "గల్తీబాత్ మత్ కరో భాయ్!"
అన్యాయం రమణ గారు. తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళే ఇలా అనుకోరు.
ReplyDelete"తెలుగు మాత్రమే తెలిసి ఉన్నందుకు సిగ్గుతో దించుకున్న మా మొహాలు 'తెలుగు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది"
నేను అసలు ఒప్పుకోను.
ఇతర బాషలు బలవంతంగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఎల్లప్పుడూ అంటారు.
మాకు తెలుగు తప్ప ఏ భాషైనా పాళీ భాషతో సమానం!:)))))
ఎప్పటిలాగే..చురకలు,చమక్కులు,నిజాలు ..అన్నీ.. కలిపి
సూపర్ పోస్ట్ .
ఆహా...మనూరి ఎగ్జిబిషనూ, ఏకైక ఏసీ హాలూ,మనూరుకున్న రిక్రియేషను లేమి ఎంతబాగా చెప్పారండి. ముందు ఫోటోలు ఒక్క నిముషం అర్ధం కాలేదు తరువాత గుర్తొచ్చింది అవును కదా సినిమా హీరోలతో తీసుకోండని కర్టెన్లమీద వాళ్ళ పేయింటింగులు (బహుశా సినిమా బానర్లు రాసే వాళ్ళు వేసేవాళ్ళేమో)పక్కన నిబడి ఫోజిచ్చి తీయించుకునేవాళ్ళు.ఒకే ఒక్క సారి వెళ్ళి విరక్తితో మానేసాను. కానీ నా సిబ్లింగ్స్ మాత్రం ప్రతి ఏడాదీ అదో విధిగా వెళ్ళేవారు. ఇప్పటికీ ఉందనుకుంటా గుంట గ్రవుండులొ. ఎప్పుడన్నా వేసవి సెలవులకి గుంటూర్లో ఉంటే మా పిల్లలని తీసుకెళ్ళేవాడు తమ్ముడు.షరా మామూలుగా గుంటూరు హిందీ కష్టాలు బాగా రాసారు:)))మేము అంటే మిగిలిన గుంటూరోళ్ళం (ఇక్కడ) ఓ మూడేళ్ళకిందటే మా మా హిందీ కష్టాలను ఇక్కడ వెళ్ళబోసుకున్నాం:)) మీకంత టైముండదు కనుక మీకు లింకులివ్వడంలేదు:)))
ReplyDeleteఒక పెద్ద గొయ్యిలో బైకాయన విన్యాసాలూ, కొండచిలువకు అమ్మాయి ముఖమూ చెప్పడం మర్చిపోయారు.
ReplyDeleteబాగుంది అండి టపా ...మొదట్లో హైదరాబాదు అంటే నచ్చేది కాదు అందుకే..అంధ్ర లొ భాగం అయినా గానీ, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా పళ్ళు, పూలు కొండానికి కూడా హైదరాబాదీ హిందీ మాట్లాడేవాళ్లు...నాకు ఎంత ఆశ్చర్యం గా అనిపించేదో
ReplyDeleteడియర్ య ర, ఇదిమన జీవితంలో జరిగిన ఘట్టాలతో సమీక్షించి రాసినా, నీ సన్నివేశ వివరణ, వర్ణనా శైలి అమోఘంగా ఉన్నాయ్. చిన్ననాటి ఙ్నాపకాలని గుర్తు చేసి (మరిస్తే కదా) కడుపుబ్బ నవ్వించావ్ ఈ మదర్స్ డే నాడు. విజయక్కూడా వినిపించా, పొట్ట చెక్కలయ్యింది! మనం "గల్తీ బాత్ మత్ కరో భాయ్" అని ఎందుకు నవ్వుకొంటామో తనకిపుడు అర్ధం అయ్యింది. ఈ వారాంతం కాల్ చాలా బిజీగా ఉండటం వల్ల వచ్చిన చికాకంతా రెండు నిమిషాల్లో పటాపంచలై మనసు దూది పింజలాగా తేలికయ్యింది. అందుకే ఉండబట్టలేక ఫోన్ చేశా! Keep it up buddy.
ReplyDeleteగౌతం
నేనూ అర్ధం కాని హిందీ సినిమాలు బోలెడన్ని చూశాను.
ReplyDeleteమొట్టమొదట హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా బావ నేర్పింది "దావాఖానా కే పాస్", ఇల్లు తప్పిపోతే ఇల్లా అడగమన్నాడు. అల్లాగే పారిస్ లో పాలు కొనాల్సి వచ్చింది. మన దేశస్తుడే ఒకాయన "లే ట్రో" అని అడుగుతూ వెళ్ళు పాలు అమ్మే చోటు చూపెడుతారు అన్నాడు. చివరికి సాధించాను.
మీ వాడికి "గల్తీ బాత్ మత్ కరో భాయ్!" అని వాళ్ళ అంకుల్ ఎందుకు నేర్పాడా అని ఆలోచిస్తున్నాను.
రహ్మాన్ భాయ్,
ReplyDeleteకుచ్ కుచ్ గీత్ మాలా బినాకా సునాతా హాయ్ !
కహానీ అదుర్స్ హాయ్
చీర్స్
జిలేబి.
Bahut achchee baat bola hai, shukriya. Jo Urdu ka shaukeen hai woh doosre zubanonki tauheen nahi karega.
ReplyDeleteఅర్ధం కాకపొతే రజాక్ గారితో తర్జుమా (?) చేయుంచుకోండి.
//సమాధానంగా మేక వాడు "హిందీ మే బోల్!" అంటూ విదిలించాడు.//
ReplyDeleteనిజమేనండి..! హిందీవాళ్లలో సగం కన్నా ఎక్కువమందికి ఇదో రోగం.. ఈ దేశానికి హిందీ మాత్రమే భాష అన్నట్టు ఫీలైపోతూ ఉంటారు.
నేను ఉత్తరాదికి వచ్చిన మొదట్లో నా హిందీ చూసి, ఎందుకలా మాట్లాడుతున్నావంటే, "హిందీ అలవాటులేక" అని చెప్పి, "ఎంతైనా హిందీ నా మాతృభాష కాదు కదా బాగా మాట్లాడడానికి" అంటే, హిందీవాళ్ళు నాకు జ్ఞానోదయం చేయబోయారు. ఇక్కడ కాబట్టి నా మాతృభాష తెలుగు అని చెప్పగలిగాననీ, వేరే దేశం వెళితే నా మాతృభాష హిందీ అని చెప్పాల్సి ఉంటుందనీనూ మొదలెట్టెసరికి నాకు తిక్కరేగి వాళ్లనందరినీ కడిగి పారేసాను. అది వేరే విషయం. కానీ నూటికి అరవైమంది హిందీవాళ్ళలో ఈ పెడధోరణి ఉంది.
ఇంకో విషయం ఏంటంటే, వాళ్లకి తమిళం తప్ప ఇంకో భాష పేరు గుర్తే పెట్టుకోరు. అదేంటో మన తెలుగువారి ఖర్మ.
రమణగారు..! ఎప్పటిలాగే మీ టపా అదిరింది.
అదిరింది, రమణ గారు. :)
ReplyDeleteమాకూ వచ్చు లేండి హిందీ...
అరె వో సాంబ, కిత్‌నే ఆద్మీ హై. తీన్ ఆద్మీ హై సర్కార్. ...
ఠాకూర్ ఎ గబ్బర్ సింగు కా నాము మిట్టీమే మిలాదియా.
------
/Jo Urdu ka shaukeen hai woh doosre zubanonki tauheen nahi karega.
అర్ధం కాకపొతే రజాక్ గారితో తర్జుమా (?) చేయుంచుకోండి. /
అర్థం కావాలన్న పట్టింపుల్లేవు, మీరెంత చెబితే అంత. షౌకీన్, జుబాన్, తౌకీన్, వొయిచ్చు, వొత్తాచు... ప్రాస బాగుంది అది చాలదూ... మరీ మీరంతగా చెప్పాలా!
అందుకే కదా హైద్రాబాద్ వదలాలంటే మనసొప్పట్లేదు, అర్థం చేసుకోరూ... :)) :P
----
/వేరే దేశం వెళితే నా మాతృభాష హిందీ అని చెప్పాల్సి ఉంటుందనీనూ మొదలెట్టెసరికి నాకు తిక్కరేగి వాళ్లనందరినీ కడిగి పారేసాను. అది వేరే విషయం. కానీ నూటికి అరవైమంది హిందీవాళ్ళలో ఈ పెడధోరణి ఉంది./
:)) అలా కడిగేస్తే సరిపోదండి, వామన గీత గారు. అదేంటి ... ఆ .. ధులాయి కర్‌నా హై, అంతే! :)
వనజవనమాలి గారు,
ReplyDeleteథాంక్యూ!
ఈ పోస్ట్ పూర్తిగా వాస్తవం. జరిగింది జరిగినట్లు రాసేశాను.
doctor gaaru,
ReplyDeletebaagundi sir,
Ramesh babu
gudivada
sinita గారు,
ReplyDeleteప్రస్తుతం మన గుంట గ్రౌండులో ఎక్జిబిషన్ ఉందండి. సాయంకాలం మా అమ్మాయి వెళ్తుంది. ఇప్పటి ఫోటో స్టూడియో స్టాల్స్ స్థితి కనుక్కుంటాను.
పెళ్ళయిన కొత్తలో నా భార్యతో కలిసి ఎక్జిబిషన్ వెళ్ళాను. జనాలు కిటకిటలాడుతున్నారు. నేను పరధ్యానంగా ఆవిడతో కలిసి నడుస్తున్నాను. కొద్దిసేపటికి చూస్తే ఆవిడ నా భార్య కాదు. గతుక్కుమన్నాను. ఒక్కసారిగా భయమేసింది. నా భార్య ఎక్జిబిషన్ మొదట్లోనే ఆగిపొయ్యి ఏవో హేండ్ బ్యాగ్స్ చూస్తుంది. అటు తరవాత ఈ ఇరవై యేళ్ళలో మళ్ళీ ఎప్పుడూ ఎక్జిబిషన్ల జోలికి పోలేదు.
@SNKR:
ReplyDeleteI used the word "tauheen". I don't know what 'taukeen" means.
ఇంతకీ ఉరుదూని నెత్తికి ఎక్కుంచుకొని తెలుగును అవహేళన చేసిన వ్యక్తికి ఉరుదూలో ఒక వాక్యం తప్ప ఇంకేమీ రాదనే విషయం తమరు గమినించినట్టు లేదు.
మా ఫ్రెండొకడున్నాడు.. గుంటూరు సాహెబు.. ఉర్దూ అంటే ఆమడ దూరం పరిగెడతాడు.
ReplyDelete@ Jai Gottimukkala
-- కానీ తెలుగు షౌకీన్‌లు ఇతర భాషల సొగసులనూ నెత్తిన పెట్టుకుంటారు. :)
వహ్వా వహ్వా!
ReplyDeleteపోస్ట్ సూపర్! పూర్తిగా మీ మార్కు టపా! అందులోను జరిగినదే అంటున్నారు!
వహ్వా అంటే ఉర్దూ పదమే కదండీ, నాకు ఉర్దూ లో అదొక్కటే వచ్చు :-)
హహ్హ! కాలేజీ లో ఉన్నప్పుడు నెనూ ఓసారి మా చెల్లి అనుకోని ఇంకో అమ్మాయి చెయ్యి పట్టుకుని 'పద' అని లాక్కెళ్ళి పోయా, మా వురి ఎక్షిబిషన్ లో!
డాక్టర్ గారు...
ReplyDeleteమాది కూడా బ్రాడిపేట బ్యాచే ..........బాగుంది టపా :))
sunita గారు,
ReplyDeleteప్రస్తుతం మన గుంట గ్రౌండులో ఎక్జిబిషన్ ఉందండి. సాయంకాలం మా అమ్మాయి వెళ్తుంది. ఇప్పటి ఫోటో స్టూడియో స్టాల్స్ స్థితి కనుక్కుంటాను.
పెళ్ళయిన కొత్తలో నా భార్యతో కలిసి ఎక్జిబిషన్ వెళ్ళాను. జనాలు కిటకిటలాడుతున్నారు. నేను పరధ్యానంగా ఆవిడతో కలిసి నడుస్తున్నాను. కొద్దిసేపటికి చూస్తే ఆవిడ నా భార్య కాదు. గతుక్కుమన్నాను. ఒక్కసారిగా భయమేసింది. నా భార్య ఎక్జిబిషన్ మొదట్లోనే ఆగిపొయ్యి ఏవో హేండ్ బ్యాగ్స్ చూస్తుంది. అటు తరవాత ఈ ఇరవై యేళ్ళలో మళ్ళీ ఎప్పుడూ ఎక్జిబిషన్ల జోలికి పోలేదు.
Vineela గారు,
ReplyDeleteహైదరాబాదులో ఉన్నందుకు.. నెలరోజులకే మావాడు తెలుగు మర్చిపొయ్యాడు. కాబట్టి ఏదైనా సాధ్యమే!
@TJ "Gowtham" Mulpur,
ReplyDeleteఈ టాపిక్ పూర్తిగా మన బ్రాడీపేట గేంగ్ కి సంబంధించింది. అందరికీ అర్ధం కాకపోవచ్చు. రాయాలా వద్దా అని సందేహించాను. పర్లేదు. మన హిందీ కష్టాలు, ఎక్జిబిషన్లలో చేసే హడావుడీ.. అందరిదీ ఒకటే కథ!
Rao S Lakkaraju గారు,
ReplyDeleteమావాడికి ఉర్దూ కొద్దిగా వచ్చుననుకుంటా! కాకపోతే స్టూడియో వాడితో పోట్లాడేంత ఉర్దూ/హిందీ వచ్చి ఉండకపోవచ్చు. అందుకే బండి ముందుకు కదల్లేదు.
జిలేబి జీ,
ReplyDeleteషుక్రియా జీ!
Jai Gottimukkala గారు,
ReplyDeleteమీ కామెంట్ ఒక్క ముక్క అర్ధం కాలేదు. అయినా బాగుంది (పాకీజా సినిమాలా!).
వామనగీత గారు,
ReplyDeleteధన్యవాదాలు. ఎదుటివారిని డామినేట్ చెయ్యడానికి, దబాయించడానికి, ఇబ్బందికి గురి చెయ్యడానికి భాషని అస్త్రంగా వాడతారులేండి!
SNKR గారు,
ReplyDeleteధన్యవాదాలు.
అయ్యబాబోయ్! మీ హిందీ పాండిత్యం నాకన్నా చాలా ఎక్కువండి బాబు!
@ramaad-trenz,
ReplyDeleteరమేష్ బాబు గారు,
థాంక్యూ!
puranapandaphani గారు,
ReplyDeleteఅలాగా!
నాకు ముస్లిం పేషంట్లు ఎక్కువ. చాలామందికి తెలుగు కొంచెం కూడా అర్ధం కాదు. నాకు ఉర్దూ అర్ధం కాదు. నాకు ఉర్దూ అర్ధం కాదన్న విషయం వాళ్ళు నమ్మరు!
Krishna Palakollu గారు,
ReplyDeleteఅమ్మయ్య! మీరు నాకు తోడు దొరికారు!
శేఖర్ (Sekhar) గారు,
ReplyDelete>>మాది కూడా బ్రాడిపేట బ్యాచే.<<
అవునా! గుండెని టచ్ చేశారు గదండీ!
"నాకు ముస్లిం పేషంట్లు ఎక్కువ. చాలామందికి తెలుగు కొంచెం కూడా అర్ధం కాదు"
ReplyDeleteఅలాంటి వారు గుంటూరులో కూడా ఉన్నారన్న మాట. ఇన్నేళ్ళు హైదరాబాద్ గురించే విన్నాను.
@puranapandaphani:
ReplyDelete"కానీ తెలుగు షౌకీన్‌లు ఇతర భాషల సొగసులనూ నెత్తిన పెట్టుకుంటారు. :)"
నిజమే, ఉ. శరత్ చంద్రుని పేరు పిల్లలకు పెట్టుకునే వారు కొల్లలు. దాశరధి ఘాలిబ్ గీతాలు మరో చక్కని ఉదాహరణ.
అయితే తెలుగు వారే కాదు అందరూ అంతే. ఒక (తమ) భాషను మాత్రమె గౌరవిస్తామని చెప్పుకునే వారు చూపించేది గర్వం, గౌరవం కాదు.
ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఇలాగే ఉందండి హైదరాబాదు
ReplyDeleteలో. తెలుగు తప్ప హింది రాదు. పూలు, పళ్ళు అమ్మేవాడి నుండి అందరూ హింది లొ మాట్లాడుతారు. నీను తెలుగులొ మాట్లాడినా, తిరిగి హిందీలొ సమాధానం చేబుతారు.
అందుకే నేను మూగ భాషను
ఉపయౌగిస్తున్నాను.
మీరు ఫోటోలో దిగేవారా, మేం పడేవాళ్ళం.
ReplyDeleteనేను మొట్ట మొదటి సారి ఒక ఉత్తర భారతీయుడి తో హిందీ లో మాట్లాడితే "నేను ఇంగ్లిష్ నేర్చుకుంటాను కానీ మీరు హిందీ లో మాట్లాడకండి" అని ప్రాధేయపడ్డాడు.
ఎప్పటిలాగే మీ మార్కు టపా బ్రహ్మాండం గా ఉంది.
నవ్వు ఆపుకోలేక పోతున్నాను గురూ గారు
ReplyDeleteనిజంగా హిందీ వాళ్ళు అంతే. నిమిషానికోసారి హిందీ నహిన్ ఆతా హై? హిందీ జాంతా హై అను అడుగుతూ ఉంటారు. హైద్రాబాదులో అయితే ఈ దరిద్రం ఇంకా ఎక్కువ. ఆటో వాడి దగ్గిర్నుంచి అందరూ ఎలా దోచుకుందామా అనే బిజినెస్సులో ఎక్కేటప్పుడు తెలుగూ, దిగేటప్పుడు హిందీ!! ఇది మన ఆంధ్ర దేశంలో ఉన్న దౌర్భాగ్యం. మద్రాసులో కానీ, కేరళాలో కానీ ఇంకే సిటీలో కాని కనపడని అతి పెద్ద దౌర్భాగ్యం మనకే ఉంది. గర్విద్దామా? మొహం మాడ్చుకుని ఏడుద్దామా?
ఏదైనా కానివ్వండి. మొత్తమ్మీద విజయవాడ ఎగ్జిబిషన్ చూసిన రోజులు గుర్తుకొచ్చాయి. చిన్న అప్పడం ముక్క వేయించండి అది పడి అడుగులు అయిపోతుంది అని అంటగట్టేవారు. కొనుక్కుని ఇంటికొచ్చాక వేయిస్తే ఒక్క అంగుళం మాత్రమే వచ్చేది. ఇదొక రకం ఖూనీ. ఫలపుష్ప ప్రదర్శన అని ఒకటి ఇందులో మళ్ళీ.
Balaji Madabhushi గారు,
ReplyDeleteమూగ భాషని వాడుతూ పూలు, పళ్ళూ బేరాలు చేస్తున్నారా! మీరు అసాధ్యులండి!
బులుసు సుబ్రమణ్యం గారు,
ReplyDeleteఏం దిగడం లేండి! దిగీ, దిగీ.. దిగలేక చచ్చేవాళ్ళం! తీసేవాడికి చెయ్యి వణికి కొన్ని, తీయించుకునేవాడు కదిలాడని ఇంకొన్నీ, ఈ రెండూ కుదిరినా సరీగ్గా 'కడగక పోవడం' వల్ల మరికొన్నీ వృధా అయ్యేవి.
మాస్టారు! నా టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ!
@మిత్రులారా! కథ అయిపోయింది.
ReplyDeleteఈ పారా చదువుతుంటే ఏదో గుర్తుకువచ్చింది :)
"హైద్రాబాదులో అయితే ఈ దరిద్రం ఇంకా ఎక్కువ. ఆటో వాడి దగ్గిర్నుంచి అందరూ ఎలా దోచుకుందామా అనే బిజినెస్సులో ఎక్కేటప్పుడు తెలుగూ, దిగేటప్పుడు హిందీ!! ఇది మన ఆంధ్ర దేశంలో ఉన్న దౌర్భాగ్యం"
ReplyDeleteMumbai is the same. Almost everyone speaks Hindi (Mumbaya style).
Urdu is the lingua franca of Hyderabad for the last hundreds of years. Why should the city change when just because of subsequent political developments?
హైదరాబాదులో తెలుగు మాట్లాడరని బాధ పడే వారికి రెండు ప్రశ్నలు:
1. హైదరాబాదులో ఉర్దూ మాట్లాడతారని 1956లో తెల్వదా?
2. ఈ తురక మేళం తెలుగు వారికి ఎందుకు? హాయిగా గుంటూరులోనే ఉండొచ్చు కదా! పైగా మేమే హైదరాబాదుని ఉద్దరించామని ప్రచారం అవసరమా?
రమణ గారూ, మీ బ్లాగులో తెలంగాణా లొల్లి తెచ్చినందుకు క్షమించండి. మీకు అభ్యంతరమయితే మానేస్తాను.
సరదాగా చాలా బాగుందండి. ఇంకెప్పుడైనా మీ టపాలతో విభేదించాల్సివస్తే "गल्ती बात मत करो भै" అంటాము.
ReplyDeleteజై గారూ గల్తీ బాత్ మత్ కరో భాయ్
ReplyDeleteజైగో, 'గల్లీ కా లొల్లి బాత్ ఇధర్ మత్ కరో భాయ్', యే హాథ్ నైయ్యి, పైర్ అనుకో. ఉధరు జావ్వొచ్చుగా, ఇధరు కైకూ? వాళ్ళీద్దరూ బేకార్ పఢ్కే బులాయెసో హై. హమ్మయ్య ఈ మధ్య నాకు అటోవాళ్ళ జుబాను అచ్చగా పిచ్చ పిచ్చగా వచ్చేస్తోంది, ఇక పరవాలే హైద్రాబాద్ వదిలే ప్రసక్తే నయ్యి హై.
ReplyDeleteSnkr
గొట్టిముక్కల గారూ..
ReplyDeleteతెలుగులు తెలుగును వదిలేసి కూడా ఇతర భాషల అందాలను ఆస్వాదిస్తారు. కానీ మరే ఇతర భాష వారూ అంతలా ఉండరు. ఉర్దూ (ఆ మాటకొస్తే మరే ఇతర భాషల) షౌకీన్‌లు తెలుగును కనీసం ఆదరించిన దాఖలాలు (కనీసం నాకు తెలిసినంత వరకూ) లేవు.
Mauli గారు,
ReplyDeleteథాంక్యూ!
తెలుగు భావాలు గారు,
ధన్యవాదాలు.
>> ఇంకెప్పుడైనా మీ టపాలతో విభేదించాల్సివస్తే "गल्ती बात मत करो भै" అంటాము.<<
తప్పకుండా! you are most welcome.
Jai Gottimukkala గారు,
ReplyDeleteSNKR గారు,
SHANKAR.S గారు,
puranapandaphani గారు,
మీ కామెంట్లు ఒక్క ముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకంతా పాకీజా సినిమాలా ఉంది. but i am enjoying.
రమణ గారూ.... :)
ReplyDelete"నాకంతా పాకీజా సినిమాలా ఉంది"
ReplyDeleteరమణ గారూ, పాకీజా చిత్ర నాయకురాలు మీనా కుమారి గుర్తుందా? మీ అభిమాన తార సావిత్రికి ఈవిడే ఆదర్శం. వీరిద్దరి జీవితాలలో కూడా చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
@puranapandaphani:
ReplyDeleteతానీషా మొదలుకొని సుబ్రమణ్య భారతి వరకు ఎందరో తెలుగేతరులు తెలుగుని గౌరవించారనే దాఖలాలు కొల్లలు. ఈరోజు కూడా కొందరు ముస్లిం మిత్రులు తెలుగులో బ్లాగులు నడుపుతున్నారు.
ఇతర భాషల వారు తెలుగుని గౌరవించరని అనుకోవడం అపోహ. ఈ అపోహ వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొందరు తెలుగు వారికి ఉన్న అభద్రత (insecurity) కూడా ఒకటి.
హైదరాబాదులో ఉర్దూ (ముంబాయిలో హిందీ) స్తానాన్ని గుర్తిస్తే కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. రాష్ట్ర రాజధాని అయినంత మాత్రాన అందరూ తెలుగులో (మరాథిలో) మాట్లాడాలని పట్టు పడితే వైషమ్యాలు పెరుగుతాయి. ఉర్దూ (హిందీ) పరాయి భాష కాదని, తెలంగాణా (ముంబాయి) సంస్కృతిలో ముఖ్యభాగమని ఒప్పుకుంటే ఏ తగాదా రాదు.
Jai garoo,
ReplyDeleteUrdu is neither mother tongue for majority of Hyderabadis (it's Telugu), nor it is a national language like Hindi (if you wish to be considerate towards the outsiders). So why should Urdu be the common language in Hyderabad? Urdu is only a legacy of Islamic past of Hyderabad.
*హైదరాబాదులో ఉర్దూ (ముంబాయిలో హిందీ) స్తానాన్ని గుర్తిస్తే కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. *
ReplyDelete@జై,
హైదరాబాదులో ఉర్దూ కి అంత సీన్ లేదు. మీకు తెలంగాణ పిచ్చి ముదిరి పాకానపడింది కనుక ఉర్దు మీద ప్రేమ మొదలైంది. ఉర్దు మీద మీ ప్రత్యేక ప్రేమ వెనకాల, రాజకీయ స్వార్థం తప్ప ఇంకేమి ఉంది? వారిభాషను,సంస్కృతిని మీరు గౌరవించినట్లు నటించి వారిని తేలంగాణా ఉద్యమం లో బాగ స్వామ్యులను చేయాలనే గా మీ ఎత్తుగడ.
ఇన్ని సం||పట్టి హైదరాబాద్ లో ఉండే ఉర్దు మాట్లాడే వారు కనీసం తెలుగు లో నాలుగు ముక్కలు నేర్చుకోవాలని అనుకోరా? మీ బోటి వారు,వార్ని కాకా పడుతూ, ఎంత వెన్న పూసినా ( ఒక సినేమాలో స్వంత ఊరు అభిమానన్ని కేష్ చేసుకోవటానికి నీది తనాలే నాది తెనాలే అనే సన్నివేశంలో లాగా) మిమ్మల్ని నమ్మటానికి వారేమి చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. అందువనలనే అసదుద్దిన్ గారు తెలంగాణా ను వ్యతిరేకిస్తాడు. ఇక అందరికి సానియా మిర్జా పెళ్లి తో వారికి గల తెలంగాణా మీద ప్రేమ అర్థమయింది. మీరు పాపం అన్నివిలువలకు తిలోదకాలిచ్చి మీ తెలంగాణ వాదన కోసం సమర్ధించుకొంటున్నారు. జై గారు మీరు రోజు రోజుకి మరి దిగజారిపోతున్నరు. తెలంగాణ కొరకు మరి అంతగా దిగజారవలసిన అవసరంలేదు. కొంచెమ్మన్న ఆత్మాభిమానం కాపాడుకోండి.
'గల్తి బాత్ మత బోలో' తో మొదలుపెట్టి చాల చాలా జోకులు చెప్పినందుకు కంగ్రాట్స్!
ReplyDeleteసరదా విషయాలు సరదాగాను, సీరియస్ విషయాలు సీరియస్గాను చూడాలి కాబట్టి.. వేరే చర్చ లోకి పోకుండా నేను కూడా కొన్ని నిజమయిన జోకులు చెబుతాను.
తమిళనాడులో ఎటువంటి పరిస్థితుల్లోను తెలుగు మాట్లాడరు..హిందీ అయినా మాట్లాడుతారు కాని.
నిజానికి హైదరాబాది ఉర్దూ చాలా చాలా బాగుంటుంది (పాకీజా సినిమా లాగ).
నేను చాలా చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన రోజుల్లో ఆటోలు తక్కువగాను, రిక్షాలు చాలా ఎక్కువగాను ఉండేవి. అవి కూడా ఆ సైడ్ లాంటివి కావు. రిక్షాలో కూర్చుని మొకాళ్ళకి గడ్డం ఆనించుకుని కూర్చుని చుట్టుతా చూస్తుంటే వూరేగుతున్నట్టు వుండేది. నాకేమో రిక్షా యక్కాలనే సరదా, భాషా సమస్య సరే! ధైర్యం చేసి 'ఆయేగా' అని అడిగితె 'కహా జాన?'. ఫలానా చోటుకు అని చెప్పంగానే 'దేడ్ రుపయ్య దేదో' అనేవాడు. నాకు అప్పటికి వచ్చిన హిందీలో అంకెలు, సంఖ్యలు అసలు లేవు - పైగా దేడ్ రుపయ్య అంటే రెండున్నర అని ఘాట్టి నమ్మకం. సో, సీరియస్ గ మొహం పెట్టి 'నహి దొ రుపయ్య దేతే' అనే వాణ్ణి. వీడు బకరా అని అర్థం కనగానే రిక్షా డ్రైవర్ అప్పటిదాక సీట్ మీద కుర్చున్నవాడు గబుక్కున దిగి తలగుడ్డ తీసి సీట్ తుడిచి 'భైటో సాబ్' అనేవాడు. బాష రాకపోయినా బేరం ఆడగలిగానన్నవిజయగర్వంతో రిక్షా ఎక్కి ఇంటికి చేరేవాణ్ణి. చాల కాలం తర్వాత తెలిసింది దేడ్ రుపయ్య అంటే రూపాయిన్నర అని. ఇప్పటికి ఎప్పుడన్నా, ఎక్కడన్నా దేడ్ రుపయ్య అని వినిపిస్తే నాలో నేనే నవ్వుకుంటాను - చూసేవాళ్ళు ఏమనుకున్నా!
చక్రవర్తి మద్రాసులో ఉన్న రోజుల్లో ఓసారి మద్రాసు వెళ్ళాను. రిటర్న్ రిజర్వేషన్ కోసం సెంట్రల్ స్టేషంకి వచ్చి చక్రవర్తి టూ వీలర్ పార్క్ చేసి.. పనిచూసుకుని వచ్చేసరికి మా టూ వీలర్ పక్కనే ఓ కనిస్థ్తీబు వాడు నుంచుని మేము ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్నాడు. అహో! ఒక్కక్క వెహికలకి ఒక్కొక్క పోలీసు యెంత గొప్పది మద్రాసు అనుకుంటూ తాళం
తీసే లోపల.. చెయ్యి పట్టుకుని తమిళం లో ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. అతను చాలాసేపు మాట్లాడిన తర్వాత చక్రవర్తి 'ఎనకు తమిళ్ తెరియాదు' అన్నాడు. ఆ పోలిసాయన మళ్ళి చాల సేపు మాట్లాడాడు. నాకయితే ఏమి అర్థం కాకపోయినా ఏదో గుర్తు వచ్చింది. తమలపాకులు నములు, దవడతో మాట్లాడు, తానె వచును తమిళు ఓ కూనలమ్మ - అని ఆరుద్ర రాసిన కవిత. సరే! ఇలా చాల సేపు పోలీసు - చక్రవర్తి ల సంభాషణ కొనసాగంగా, కొనసాగంగా.. నాకు వినిపించింది మాత్రం.. పోలిసాయన వాక్ప్రవాహం, చకవర్తి ఎనకు తమిళ్ తెరియాదు - కొంతసేపు గడిచిన తర్వాత ఓ తమిళ-ఆంధ్రుడు వచ్చి రక్షించాడు. తమిళంలో మాట్లాడుతూ తమిళ్ తెరియాదు అంటాడు ఇతను అని పోలీసు, నాకు వచ్చిన తమిళం అంతా అది ఒక్కటే అంటాడు చక్రవర్తి. ఇంతకీ మేము నో పార్కింగ్ జోనులో పార్క్ చేసాముట. కట్టాల్సిన ఫైన్, ఇవ్వాల్సిన ముడుపు చెల్లించి బయట పడ్డాము
నీతి: భాష అంటే ఒక వాక్యమే కాదు!
గోపరాజు రవి
@Nag:
ReplyDeleteUrdu is neither a foreign language nor exclusive to Muslims. It is an Indian language as much as any others.
Cities develop their own lingua franca over a period of time. Politics can't change this natural phenomenon.
How many people in Bombay speak Hindi as the first language? Very few (definitely less than Marathi native speakers). This can't prevent Hindi from being Mumbai's first language.
If you are against Urdu, try Hindi instead. Hindi is slowly taking over the first spot in Hyderabad (possibly in Bangalore too in the future).
రమణాజీ.. ఆప్‌కే జగహ్ కా ఇస్తేమాల్ కర్‌నే కే లియే మాఫ్ కీజియేగా....
ReplyDeleteసీమ సంగతి నాకు పూర్తిగా తెలీదు కానీ తీరాంధ్రలో హిందీ మూడొంతుల మందికి రాదు. అదే సమయంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ పుణ్యమా అని ఆ భాష నేర్చుకున్న వారూ ఉన్నారు. చిత్రమేమంటే... మదరాసు సభ వారి పరీక్షలే కోస్తాలో బాగా ప్రాచుర్యంలో ఉండేవి, హైదరాబాదులోనూ ఆ సభ శాఖ ఉన్నా. ఇంక ఉర్దూ వచ్చిన వాళ్ళు ముస్లిములతో సహా, నామ మాత్రమే. మత పెద్దలూ, భాషా పండితులూ... అలాంటి వారికి మాత్రమే ఉర్దూ బాగా వచ్చేది. ఇంకో మాట... ఉర్దూ వచ్చిన ముస్లిములు కూడా బయట వ్యవహరించేటప్పుడు తెలుగులోనే మాట్లాడుతుండే వారు.
గొట్టిముక్కల గారూ.... తెలుగు వారికి అభద్రతా భావం దేనికి? ఈ విషయం అర్ధం కాలేదు.
సుందర తెలుంగు అన్న మాట కూడా భారతి అధ్వాన్న అరవ లోనే రాశాడు. :) మహానుభావులు వాళ్ళు.
నేను సాధారణ జనాల గురించి మాట్లాడుతున్నాను. జనసామాన్యంలో సాధారణంగా తమ మాతృభాష తప్ప మరో దానిపై మోజుండదు కొన్ని మినహాయింపులు తప్పిస్తే. ఒక తమిళుడో, మరాఠీయో, వంగ భాషీయుడో, హిందీ వాడో తెలుగు గడ్డ మీద నిలబడినా తెలుగును పట్టించుకోనవసరం లేదన్నట్టే ప్రవర్తిస్తారు, నేను చెప్పినది దాని గురించి మాత్రమే.
ఉదాహరణకి రమణగారి కథలోని మేక వాడు తెలుగు నడి గడ్డన వ్యాపారం చేసుకుంటూ తెలుగు నహీ ఆతా హిందీ మే బోల్ అన్నాడు చూడండి. ఇప్పటికీ అవే పద్ధతులు.
నేనన్నది తెలుగు వాడికి తమ ఇంటి గోంగూర (గుంటూరుదా రమణ గారూ :)) కంటె పొరుగింటి పుల్లకూరే రుచి అని. (మీరిప్పుడు దీనికి హైదరాబాదులో తీరాంధ్రుల భాషా దురహంకారం వంటి పోలికలు పెడితే నేనేం చేయలేను.)
రమణాజీ.. ఆప్‌కే జగహ్ కా ఇస్తేమాల్ కర్‌నే కే లియే మాఫ్ కీజియేగా....
ReplyDeleteసీమ సంగతి నాకు పూర్తిగా తెలీదు కానీ తీరాంధ్రలో హిందీ మూడొంతుల మందికి రాదు. అదే సమయంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ పుణ్యమా అని ఆ భాష నేర్చుకున్న వారూ ఉన్నారు. చిత్రమేమంటే... మదరాసు సభ వారి పరీక్షలే కోస్తాలో బాగా ప్రాచుర్యంలో ఉండేవి, హైదరాబాదులోనూ ఆ సభ శాఖ ఉన్నా. ఇంక ఉర్దూ వచ్చిన వాళ్ళు ముస్లిములతో సహా, నామ మాత్రమే. మత పెద్దలూ, భాషా పండితులూ... అలాంటి వారికి మాత్రమే ఉర్దూ బాగా వచ్చేది. ఇంకో మాట... ఉర్దూ వచ్చిన ముస్లిములు కూడా బయట వ్యవహరించేటప్పుడు తెలుగులోనే మాట్లాడుతుండే వారు.
గొట్టిముక్కల గారూ.... తెలుగు వారికి అభద్రతా భావం దేనికి? ఈ విషయం అర్ధం కాలేదు.
సుందర తెలుంగు అన్న మాట కూడా భారతి అధ్వాన్న అరవ లోనే రాశాడు. :) మహానుభావులు వాళ్ళు.
నేను సాధారణ జనాల గురించి మాట్లాడుతున్నాను. జనసామాన్యంలో సాధారణంగా తమ మాతృభాష తప్ప మరో దానిపై మోజుండదు కొన్ని మినహాయింపులు తప్పిస్తే. ఒక తమిళుడో, మరాఠీయో, వంగ భాషీయుడో, హిందీ వాడో తెలుగు గడ్డ మీద నిలబడినా తెలుగును పట్టించుకోనవసరం లేదన్నట్టే ప్రవర్తిస్తారు, నేను చెప్పినది దాని గురించి మాత్రమే.
ఉదాహరణకి రమణగారి కథలోని మేక వాడు తెలుగు నడి గడ్డన వ్యాపారం చేసుకుంటూ తెలుగు నహీ ఆతా హిందీ మే బోల్ అన్నాడు చూడండి. ఇప్పటికీ అవే పద్ధతులు. (మీరిప్పుడు దీనికి హైదరాబాదులో తీరాంధ్రుల భాషా దురహంకారం వంటి పోలికలు పెడితే నేనేం చేయలేను.)
నేనన్నది తెలుగు వాడికి తమ ఇంటి గోంగూర (గుంటూరుదా రమణ గారూ :)) కంటె పొరుగింటి పుల్లకూరే రుచి అని.
@Anonymous:
ReplyDelete"హైదరాబాదులో ఉర్దూ కి అంత సీన్ లేదు"
అంత సీను ఉందనే కాదు బ్లాగరు అంటున్నది. మీరు చెబితే సీను మారిపోతుందా?
"మీకు తెలంగాణ పిచ్చి ముదిరి పాకానపడింది కనుక ఉర్దు మీద ప్రేమ మొదలైంది"
FYVKI ఉర్దూ భాష నా చిన్నప్పడి నుంచే (తెలంగాణా అంశం గురించి ఏమీ తెలవక ముందరే) మాట్లాడుతున్నాను. అప్పటిలో నేనవరినో మీకు తెలవదు కాబట్టి మీకీ అపోహ కలిగింది.
"ఉర్దు మీద మీ ప్రత్యేక ప్రేమ వెనకాల, రాజకీయ స్వార్థం తప్ప ఇంకేమి ఉంది?"
తెలంగాణకు కానీ ఉర్దూకు కానీ ఏమాత్రం సంబంధం లేని ఈ బ్లాగులో నేను చేసే "ప్రచారం" అసద్ "భాయి"కి, సానియాకు చేరుతుందనే అత్యాశ నాకయితే లేదు.
"వారిభాషను,సంస్కృతిని మీరు గౌరవించినట్లు నటించి"
ఈ భాష, సంస్కృతి వారిదొక్కరిదే కాదు, నాది కూడా. భాష, సంస్కృతి మీద ఎవరికీ కాపీరైటులు ఉండవు.
సానియా మిర్జా ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకేంటి? ఆవిడ పెళ్ళికి తెలంగాణకు లింకేంటి?
@puranapandaphani:
ReplyDelete"వాటిలో కొందరు తెలుగు వారికి ఉన్న అభద్రత (insecurity) కూడా *ఒకటి*"
Perhaps I can explain better in English. Please also note the *ఒకటి* (not the only or even the most important reason).
When a person who only speaks Telugu visits Hyderabad for the first time, he is a little unsure of himself. A large city can be imposing. Add culture shock (different lifestyle, difficult to understand language, strange sights etc.) to this. He becomes defensive ("why can't these people speak Telugu?") or offensive ("ఛీ! ఛీ! తెలుగూ ఒక భాషేనా? భాషంటే ఉర్దూ భాష") in order to cope. This "shield" may reduce over time but perhaps not go away completely.
This is what I meant by "అభద్రత".
I know this is an over generalized picture.
Dr. Ramana, please comment on the psychology I described.
మిత్రులారా,
ReplyDeleteశాంతి. శాంతి. శాంతి.
నేనేదో సరదా కోసం రాస్తున్నాను. మీరు కూడా సరదాగానే తీసుకోండి. ఈ బ్లాగింగ్ అనేది మనం రిలాక్స్ అవడానికి మాత్రమే. అంతకు మించి పైసా ప్రయోజనం లేదు. విజ్ఞులు అర్ధం చేసుకోగలరు.
>> హైదరాబాదులో తెలుగు మాట్లాడరని బాధ పడే వారికి రెండు ప్రశ్నలు:
ReplyDelete1. హైదరాబాదులో ఉర్దూ మాట్లాడతారని 1956లో తెల్వదా?
2. ఈ తురక మేళం తెలుగు వారికి ఎందుకు? హాయిగా గుంటూరులోనే ఉండొచ్చు కదా! పైగా మేమే హైదరాబాదుని ఉద్దరించామని ప్రచారం అవసరమా?
<<
The above was commented when I posted as anon. So I will reply here and say Au Revoir. Will not reply again later.
My comment was neither for Telanga nor for the language. I was saying why does *not* the auto driver who speaks telugu first, speak the same language when I get out of the auto. And why does this happen with every auto walla and every shop owner in Hyd? I never said Urdu is bad or Hyd is bad. Every language has its glory. Let us leave that part aside. Neither did I say Guntur is good. At best I lived in both Guntur or Hyd only as a visitor.
I used daurbhagyam word because people use two languages to cheat despite knowing telugu. And if I said that to anyone in person, they retort - why do not you learn Hindi? Great stuff. I am asking the same question again. Why should I learn Hindi when you already know a language Telugu which I already know?
BTW the Tamil speaking auto wallas in Madras are much worse in cheating but at least in language part they keep talking Tamil. Ditto about Bombay or Kolkata. I did live in Bombay for years but never once got cheated by an autowalla. Not once.
If I say "a" or "a" or "ee" then if you pull Telangana stuff into this, God bless you, leave me alone. Please use your dirt throwing on someone else. I am not interested. I am only asking why would you speak two languages with me knowing that I know Telugu and you already know telugu? It does not matter whether I know Hindi or not. It is a different question. Is it for just cheating?
Again this daurbhagyam (I stand by that word) is only in Hyd. None of the other Indian cities has this.
@జై,
ReplyDeleteమీకు పని పాటాలేదనే విషయం అందరికితెలిసందే. తెలంగాణా సమస్యను రావణకాష్ట్టం లా గా కాలుతూంటే లాభం. కారణం మీరెదో వీరుల లాగ బ్లాగులో చేరి గలభా చేయవచ్చు. మీబోటి ఇన్సేక్యురిటిగాళ్లతో ఉండటం ఎవరికి ఇష్ట్టంలేదు. నిద్దర లేచినమొదలు మీకే చరిత్ర తెలుసనే విధంగా బ్లాగులో చేరి రచ్చ చేస్తూ, ఆఖరికి అయ్యలయ్య గారిని కూడా మద్దతుగా మాట్లాడుతున్నారంటే మీరేంతకు దిగజారుతారో అర్థమౌతున్నాది.
బ్రహ్మాండంగా ఉంది అనే బాక్స్ పెట్టించాలి రమణా! ఈ పోస్ట్ బాగుంది అంటే నిన్ను అవమానించినట్లే. జస్ట్ అదిరిపోయింది! నవ్వి నవ్వి డొక్కలు నొప్పెట్టాయి. నీ సాహిత్య సౌరభం వర్ధిల్లాలని కోరుకుంటూ
ReplyDeleteబి ఎస్ ఆర్
@GIdoc,
ReplyDeleteడియర్ బి ఎస్ ఆర్,
థాంక్యూ!
ఈ పోస్ట్ రాయడానికి బుర్ర వాడాల్సిన అవసరం రాలేదు. జరిగింది జరిగినట్లు రాసేశాను. భాష అర్ధం కాక పడే పాట్లు సరదాగా ఉంటాయి. వీలయితే/కుదిరితే ఇంగ్లీషు కష్టాలు కూడా రాస్తాను.