Thursday, 24 May 2012

ధారుణి రాజ్యసంపద (బీడీలబాబు కథ)

"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి" పద్యం భీకరంగా మొదలయ్యింది. వింటున్న కొద్దీ గుండెలు ఉప్పొంగసాగాయి, మరుగుతున్న రక్తం మరిపోసాగింది, హృదయం ఉరకలు వెయ్యసాగింది. భుజంమీద గద వుంచుకుని, ఠీవీగా మీసం మెలేస్తున్న భీముడు కళ్ళముందు నిలిచాడు.

నాకు పద్యాలు అంటే యేంటో తెలీదు, అర్ధం అసలే తెలీదు, పాడిందెవరో కూడా తెలీదు. మరేం తెలుసు? భీముడు తెలుసు! తల్చుకుంటే ఆ సభలోని వాళ్ళనందరినీ గదతో మోది క్షణంలో చంపేయగలడు. కానీ - చంపనీకుండా ధర్మరాజు ఆపుతున్నాడు. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక భీముడు పద్యాలు పాడేశాడు, పాపం! అంతకన్నా భీముడు మాత్రం ఏం చెయ్యగలడు?

నా చిన్నతనంలో ఇప్పట్లా సంస్కృతిని, సంప్రదాయాన్ని పరిరక్షించే సంస్థలు లేవు. కళాబంధువులు, కళాసేవకులు అసలే లేరు. ఈ పనంతా ఒంటిచేత్తో శ్రీరామనవమి పందిళ్ళు చేసేవి. పాట కచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. అన్నీ కూడా శ్రీరామనవమి చలవే.

గుంటూర్లో వీధివీధికీ పోటాపోటీగా పందిళ్ళు ఉండేవి. రవి కాలేజీ ముందున్న పందిరి మా ఇంటికి బాగా దగ్గర. ఈ పందిరి నిర్వాహకులకి అక్కడ బడ్డీకొట్టుంది. వీరిది ఆ ఏరియాలో ఏకైక ముస్లిం కుటుంబం, అంచేత ఈ కొట్టుని 'సాయిబు కొట్టు'గా వ్యవహరించేవాళ్ళం. వీళ్ళు ఐదుగురు సోదరులు. వీరిలో సత్తార్, రజాక్ ముఖ్యులు.

ఈ పందిళ్ళల్లో - ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటకచేరీలు, డ్యాన్సులు, నాటికలు, నాటకాలు.. ఇలా రకరకాల ప్రోగ్రాంలు వుండేవి. రాత్రిళ్ళు భోంచేసి చాపలు తీసుకెళ్ళి స్టేజ్ ముందర పరిచేసేవాళ్ళం. ఒక్కొక్క చాప ఒక్కో కుటుంబానిది. వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, పాండవోద్యోగ విజయాలు, చింతామణి.. చాలా నాటకాలు పడుకునే చూసేవాళ్ళం. నాటక కళాకారులు యాంత్రికంగా ఎవరి పద్యం వాళ్ళు పాడేసేవాళ్ళు. పాత్రధారుల మేకప్ దట్టంగా వున్నందున మొహంలో ఫీలింగ్స్ కనబడేవి కాదు, అక్కడ నటన కన్నా పద్యాలకే ప్రాధాన్యం. కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం విచిత్రంగా అనిపించేది.

ఇప్పుడు మళ్ళీ అసలు కథలోకొద్దాం. పాండవ వనవాసము సినిమా రికార్డులో భీముడి పద్యాలు సైడ్ 'బి'లో ఉండేవి. సైడ్ 'ఎ' ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట - "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా" వుండేది. నాకీ పాటంటే చిరాకు, అస్సలు  నచ్చదు. అయితే - సైడ్ 'ఎ' పాట తరవాతే, సైడ్ 'బి' పద్యాలు వేసేవాళ్ళు. నాకా  మూణ్నిమిషాలు మూడుగంటల్లాగా అనిపించేది.

అయితే - ఈ ఏడుప్పాట వల్ల ఒక ప్రయోజనముంది. లౌడ్ స్పీకర్లో ఆ పాట మొదలవ్వంగాన్లే ఇంట్లోంచి  పరుగందుకుని పందిట్లో వాలేవాణ్ణి. పందిట్లో మూలనున్న సీతారాములకి ఒక దణ్ణం పడేసి, ప్రసాదం నోట్లో వేసుకుని, భీముడి పద్యాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండేవాణ్ణి. "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి.. " మొదలు. మళ్ళీ గుండెలు.. రక్తం.. హృదయం.. షరా మాములే!

నాకీ పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేదికాదు. రోజంతా వినాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ ఏం చెయ్యను? ఆ రికార్డులు వేసే వ్యక్తిని అడిగే ధైర్యం లేదు. అతని పేరు షేక్ బాబు. ఎర్రగా, పొడుగ్గా, పీలగా నలిగిపోయిన వానపాములా ఉండేవాడు. అతను పొద్దస్తమానం బీడీలు తాగుతుండేవాడు, దగ్గుతుండేవాడు. దగ్గుతూ కూడా దీక్షగా బీడీలు కాలుస్తుండేవాడు! అంచేత కొందరతన్ని 'బీడీలబాబు' అనేవాళ్ళు.

గ్రామఫోన్ రికార్డులు మట్టివి. అవి పెట్టడానికి వీలుగా నిలువు అరలతో భోషాణం లాంటి చెక్కపెట్టె. పక్కన రికార్డ్ ప్లేయెర్. ప్లేయర్‌కి మూల బుల్లిఅరలో సూదులు. 'కీ' ఇవ్వడానికి 'జెడ్' ఆకారపు స్టీల్ పరికరం. బాబు రికార్డుల్నీ, గ్రామ్ ఫోన్‌నీ సున్నితంగా, ఎంతో నైపుణ్యంతో హేండిల్ చేసేవాడు. రికార్డుల్ని ప్లే చెయ్యడంలో అతనికేదో క్రమం వుంది, అన్ని రికార్డులు సమానంగా అరిగిపోవాలనే నియమం అయ్యుండొచ్చు.

బీడీలబాబు పద్యాలు మళ్ళీ ఎప్పుడు పెడతాడు? ఆ పద్యాల కోసం ఎదురుచూస్తూ అక్కడే ఎంతసేపు పడిగాపులు కాయాలి? పోనీ ఒక గంటదాకా ఆ పద్యాలు వెయ్యడా? అదేంలేదు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔటాఫ్ ఆర్డర్లో వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగుసార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు ఏడుపొచ్చింది. 

అప్పటికి వందోసారి నిర్ణయించుకున్నాను. పెద్దయ్యాక నేనూ బీడీలబాబులా రికార్డులేసే ఉద్యోగంలోనే చేరతాను. పిల్లలు అడిగిన పాటలన్నీ వేస్తాను. భీముడి పద్యాలు వెంటవెంటనే వేసే బుద్ధి బాబుకి ప్రసాదించమని.. ద్రౌపది పాడినట్లు నేను కూడా 'హే కృష్ణా!' అంటూ ప్రార్ధించుకునేవాణ్ని. మనమెంత ప్రార్ధించినా ప్రయోజనం లేదని, బాబు సాయిబు అయినందున మన హిందుదేవుళ్ళు బాబు మనసు మార్చలేరని ఎదురింటి రాము అనేవాడు. పైన మబ్బుల్లో దేవుళ్ళంతా ఒకటేననీ, అక్కడ మన దేవుళ్ళు అల్లాకి రికమండ్ చేస్తారని పక్కింటి ఫణి వాదించేవాడు.

నా "ధారుణి రాజ్య సంపద.. " వీరాభిమానం కేవలం విన్డానికే పరిమితమా? కానేకాదు, ఇంట్లో భీముడుగా మోనో ఏక్షన్ చేసేవాణ్ని. పొయ్యి పక్కనున్న సరివికట్టె నా గదాదండము, దారం కట్టిన అట్టముక్క కిరీటం. ఈ రెండూ వొంటి మీదకి రాంగాన్లే నన్ను భీముడు పూనేవాడు. (లేని) మీసం మెలేస్తూ, తొడ కొడుతూ ఆవేశంతో ఊగిపొయ్యేవాణ్ణి.

"ఓరోరీ మాయాజూద వినోదా, మధు మదోన్మత్తా, దుర్యోధనా! నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా!" అని పెడబొబ్బలు పెట్టి, తొడ గొట్టుకుంటూ "ధారుణి రాజ్యసంపద" అంటూ గర్జిస్తూ పద్యం అందుకునేవాణ్ణి. ఇంటికి ఎవరొచ్చినా వారికి భీముణ్ణి చూపేవాణ్ణి. కొన్నిసార్లు నా ప్రదర్శనకి రెండుపైసలు పారితోషకం కూడా లభించేది. ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువైనందున, తొడ వాచిపోయి ఏడుస్తుంటే అమ్మ కొబ్బరినూనె రాసి ఓదార్చింది.

కొన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు - మా పక్కింటి సత్తిగాడి రూపంలో! సత్తిగాడు నాకన్నా ఒకేడాది పెద్ద. లావుగా, పొట్టిగా గుండ్రాయిలా ఉంటాడు. తండ్రికి పక్కవీధిలో కిరాణా కొట్టుంది. సత్తిగాడు మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం కేరేజ్ తీసుకెళ్ళేవాడు. తండ్రి అటుతిరిగి అన్నం తింటుంటే మనవాడు గల్లాపెట్టె వద్ద తన హస్తలాఘవం చూపేవాడు.

వచ్చేప్పుడు కేరేజ్ ఖాళీది తెచ్చేవాడు, జేబులు మాత్రం నిండుగా ఉండేవి. కొట్టుకొచ్చిన డబ్బుల్తో మాకు నిమ్మతొనలు, నువ్వు జీళ్ళు, తాటి చాపలు, కలరు డ్రింకులు ఇప్పిస్తుండేవాడు. మేం వాడి వంధిమాగధులం. వీధి మూలనున్న పొట్టి చెట్టుకున్న వంకర కొమ్మ మీద విలాసంగా పడుకుని మాతో పనులు చేయించుకునేవాడు. ఎంతయినా డబ్బుకున్న దర్జా దేనికీ లేదు!

పాండవవనవాసము, భీముడి పద్యాలు అంటూ సత్తిగాణ్ణి ఊదరగొట్టేశాను. నా అదృష్టవశాత్తు మా సత్తిగాడిక్కూడా భీముడి పద్యాలు తెగ నచ్చేశాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? సత్తిగాడు ఆర్డర్ పాస్ చేసేవాడు. బీడిలబాబు వినయంగా, డ్యూటిఫుల్గా 'ధారుణి రాజ్య సంపద' వేసేవాడు. చెవులారా వింటూ మైమరచిపొయ్యేవాణ్ని.

ఇంతకీ బీడీలబాబు సత్తిగాడి బంటు ఎలా అయ్యాడు? సింపుల్! బాబుకి, సత్తిగాడికి మధ్య బీడిల ఒప్పందం కుదిరింది. ఆ పద్యాలు ఒకసారి ప్లే చేస్తే రెండు హస్తం బీడీలు ఫ్రీ. లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. ఆ విధంగా భావిభారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్‌గా పనులవుతాయని గుర్తించితిమి.

ముగింపు -

చిన్నప్పటి నా యాంబిషన్ అయిన మట్టిరికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత, మనమందరం విధి చేతిలో పావులం!

మొన్న టీవీలో 'ధారుణి రాజ్యసంపద' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీలబాబు, సత్తిగాళ్ళే కనిపించారు. ఔరా! కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది!      

28 comments:

  1. 'అంకుల్! అంకుల్!.. ' అంటూ బాబుని బ్రతిమాలేవాళ్ళు.
    ----------------
    రమణ గారు బాగుంది . అప్పుడే అయిపోయిందా అనిపించింది .. అవును డాక్టర్ గారు ఈఅంకుల్ జబ్బు అప్పటి నుంచే ఉందా ? హత విధీ

    ReplyDelete
  2. /టీవీలో 'ధారుణి రాజ్య సంపద.. ' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీల బాబు, సత్తిగాడే కనిపించారు. ఔరా! కాలం /

    మరి రక్తాం వుడుకెక్కుడాలు, రోమాలూ నిక్కబొడుచుకోవడాలూ?!
    మీసాల్ మెలేయుడు, తొడగొట్టడూ? :D ;)

    ReplyDelete
  3. buddha murali గారు,

    ధన్యవాదాలు.

    ఇప్పుడు నాకు డౌటొస్తుంది.
    'అంకుల్' అనే అన్నారా?!

    ReplyDelete
  4. SNKR గారు,

    ఇప్పుడు అంత ఓపిక లేదులేండి. అదీగాక.. నేనిప్పుడు 'పెద్దమనిషి' ని!

    ReplyDelete
  5. ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట ఉంటుంది. "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా.. " అంటూ. నాకీ పాటంటే చిరాకు. అస్సలు నచ్చలేదు.
    :)))))

    హమ్మయ్య ! దీనికి ఒన్స్ మోర్ అంటారు అనుకున్నాను.
    బహు బాగు ..

    ReplyDelete
  6. budda murali గారు,

    i've deleted 'uncle' paragraph from the post. thanks for the suggestion.

    ReplyDelete
  7. డాక్టర్ గారు,
    బాగుంది సార్
    చిన్నప్పుడి సంగతులు గుర్తుచేసారు.
    చాలా నచ్చింది సార్

    ""ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔట్ ఆఫ్ ఆర్డర్లో ఎబ్రప్ట్ గా వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగు సార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు ఏడుపొచ్చింది""

    ""ఆ విధంగా భావి భారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్ గా పనులవుతాయని గుర్తించితిమి"'..

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  8. "కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం నాకు విచిత్రంగా అనిపించేది" good one.

    Emainaa konni gurtulu marchipolem. I watched only a few stage shown in my childhood.

    ReplyDelete
  9. "విధి చేతిలో పావులం" -- ఏమిటి, మీరేనా ఈ మాటంటున్నది !!!

    ReplyDelete
  10. వనజవనమాలి గారు,

    అప్పుడు నాకు ఆరేళ్ళు. ద్రౌపది పాట పొరబాటున కూడా నచ్చే అవకాశం లేదు!

    పెద్దవాళ్ళకి 'హిమగిరి సొగసులు.. ' నచ్చేది. నాకయితే ఆ పాట సినిమాలో ఉన్నట్లు కూడా తెలీదు!

    ReplyDelete
  11. sree గారు,

    ఏం చూడ్డం లేండి! పొద్దున్నే లేపి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు!

    ReplyDelete
  12. @ramaad-trendz,

    రమేష్ బాబు గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  13. రమణ గారు ,
    మేము కూడా గుంటూరు వాస్తావ్యులమే మేము మీ తరువాతి తరం వాళ్ళం మా అప్పటికి బ్రాడిపేట ప్రభ పోయి లక్ష్మిపురం ప్రభ మొదలు అయ్యింది . మాకు అన్ని లక్ష్మి పురం,చంద్ర మౌళి నగర్ ,గార్డెన్స్ మాత్రమే . నాకు రవి కాలేజీ తెలియదు మైసూరు కేఫ్ కూడా తెలియదు గీత కేఫ్ ,శంకర్ విలాస్ మాత్రం తెలుసు బ్రాడిపేట లో . మా ఇంట్లో ప్రతి పాత సినిమా కి వీరాభిమానులు ఉన్నారు భూ కైలాస్ ,మిస్సమ్మ ,గుండమ్మ కధ, దేవదాస్(నాకు ఈ సినిమా నచ్చదు ) , పాండవ వనవాసం ,శ్రీ కృష్ణ పాండవీయం (మత్తు వదల ర నిద్దర మత్తు వదలరా పాట ని మాకు విన పడాలి అని ఎక్కువ సౌండ్ పెట్టె వాళ్ళు ఇంట్లో వాళ్ళు ) దాని కి ప్రతి గా మేము జేబిలో డబ్బులు పోయినే పాట పెట్టె వాళ్ళము .మీ బ్లాగ్ చూసినప్పుడల్లా గుంటూరు(ఇండియా ని కుడా ) ని ఎంత మిస్ అవుతున్నామో తెలుస్తుంది NTR స్టేడియం , RTF ,దసపల్ల (గుంటూరు లో స్టేడియం దగ్గిర ఇంకో హోటల్ ) అన్నిటి కంటే ఎక్కువగా బజ్జీలు ,సినిమాలు,మసాల బళ్ళు .

    ReplyDelete
  14. puranapandaphani గారు,

    ఏమో! నాకు అలానే అనిపిస్తుంది!!

    ReplyDelete
  15. జిన్నాటవరు నుండి మార్కెట్ మీదుగా హిందూ కాలేజీ మూల వరకు ఒఖ్ఖటే పెద్ద పందిరుండేది,అలాగే పట్నం బజారులోనూ.
    అన్నట్టు రమణ గారు నాజ్-నాజ్ అప్సర బిల్డింగ్ పైన పాండవవనవాసం xxx ఈ బోర్డుతో ఉన్న సినిమా మీకెప్పుడన్నా తగిలాయా?

    ReplyDelete
  16. >>>>>
    తరవాత నా యాంబిషన్ అయిన మట్టి రికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత. మనమందరం విధి చేతిలో పావులం!

    <<<<

    :) పాపం.. ఈ విషయం లో పాపం .. మీకు నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను..

    ReplyDelete
  17. సూపర్!
    --
    "ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువై.. తొడంతా వాచి ఏడుస్తుంటే.. అమ్మ కొబ్బరి నూనె రాసి ఓదార్చింది."
    --
    హహ్హ్హహ! భలే భలే! భళీ భళీ!

    ReplyDelete
  18. రమణ గారు మీరు సినిమాలు చూసింది 4 /7 బ్రోడిపేట్ లో చిన్న సాయి బాబా గుడి దగ్గరేనా? గత నాలుగు సవత్సరాల ముందు వరకు కూడా అక్కడ శ్రీ రామ నవమి కే సినిమాలు వేస్తూ ఉండేవాళ్ళు..ఇప్పుడు వెయ్యడం లేదు.నేను పాయిన సరి చూసినప్పుడు అక్కడ ఏదో పాత సినిమా ప్రొజెక్టర్ లో వేస్తునారు. సాయి బాబా గుడి దగ్గర ఉండే నలుగురు వృద్ధులు మాత్రమే అక్కడ కూర్చొని సినిమా చుస్తునారు.

    ReplyDelete
  19. sai krishna alapati గారు,

    మీరు నిజంగానే గుంటూర్ని మిస్ అవుతున్నారండి! ఇక్కడ ఎండలు, పవర్ కట్, ఉక్కపోత.. ఎంత హాయిగా ఉందో!

    >>బ్రాడిపేట ప్రభ పోయి లక్ష్మిపురం ప్రభ మొదలు అయ్యింది.<<

    ఇందులో మళ్ళీ ప్రాంతీయ భావాలు ఎందుకులేండి! 'గుంటూరు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది.' అని పాడేసుకుందాం!

    ReplyDelete
  20. రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు,

    >>నాజ్-నాజ్ అప్సర బిల్డింగ్ పైన పాండవవనవాసం xxx ఈ బోర్డుతో ఉన్న సినిమా మీకెప్పుడన్నా తగిలాయా?<<

    ఇక్కడ పుట్టి పెరిగిన నాకే కనపడని బోర్డు.. చుట్టం చూపుగా వచ్చిన విశాఖవాసికి ఎలా కనపడింది చెప్మా!

    నాకు 'సంస్కారవంతమైన సోపు' xxx సబ్బు మాత్రమే తెలుసు!!

    ReplyDelete
  21. కృష్ణప్రియ గారు,

    హ.. హ.. హా!

    బాబు బీడీలు కాల్చుకుంటూ.. రికార్డులు తిప్పుకుంటూ.. హేపీగా బ్రతికేశాడు. ఆ హేపీనెస్ కి కారణం రికార్డులా? బీడీలా?

    ReplyDelete
  22. Krishna Palakollu గారు,

    ఆవేశం భాషలో ఉండాలి. తొడ కొట్టుకోవడంలో ఉండరాదు. ఈ విషయం తెలీక బాధ ననుభవించాను.

    ఇప్పడు తొడ కొట్టుకుంటున్న సినిమా నటులు ఎన్ని కష్టాలు పడుతున్నారో! పాపం!1

    ReplyDelete
  23. hareen గారు,

    అవును. అక్కడే. కాకపోతే నేను 1960 ల గుంటూరు వైభవం రాశాను. అప్పుడు మీరు చెబుతున్న సాయిబాబా గుడి లేదు. నాకు తెలిసి అరండల్ పేటలో ఒకటే సాయిబాబా గుడి ఉండేది. ఇప్పుడు వందల కొద్ది వెలిశాయి.

    టీవీల యుగంలో ఈ శ్రీరామనవమి పందిళ్ళు ప్రాభవం కోల్పోయాయి. మొక్కుబడిగా ఒక చిన్న పందిరి వేసి.. ఒక పాత సినిమా వేసి జరిపించేస్తున్నారు. ఇప్పడు గ్రూప్ యాక్టివిటీస్ కనపడవు. దీన్నే డెవలప్మెంటంటారు!

    ReplyDelete
  24. రమణ గారు - చాలా జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారండి. మా కొత్తపేటలో విజయా టాకీసు, గౌరీశంకర్, రాధాకృష్ణా సినిమాహాళ్ళ దగ్గర, మార్కెట్ దగ్గర, గౌడీయమఠం దగ్గర పందిళ్ళు వేసేవారు. తగరం కళ్ళజోళ్ళు పెట్టుకొని, నీటి బూరలతో ఆడుకుంటూ అవన్నీ తిరిగేవాళ్ళం ప్రతి సాయంకాలం. ఐదు ఆరు తరగతుల వరకు అప్పటికే పరీక్షలు ఐపోయేవి కాబట్టి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమాలే కాకుండా, బాలనాగమ్మ, పల్నాటియుద్ధం, చింతామణి లాంటి నాటకాలు కూడా వేసేవాళ్ళు.

    ReplyDelete
  25. హహ్హ!

    ఇప్పుడు తొడలు కొట్టడం కూడా గ్రాఫిక్స్ ఏమో కదండీ :-)
    హీరో గారు తొడ కొట్టగానే ఆకాశం బద్దలై పోతుంది, చుట్టూ సామాన్లు ఎగిరిపోతాయి ఆయన తొడకి మాత్రం ఎమీ కాదు???

    ReplyDelete
  26. చాలా రోజులు సంవత్సరాల తరువాత నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి రమణ గారూ. నాజ్ సెంటర్, గుంట గ్రౌండ్ , పాండవ వనవాసం.... సినిమా గుర్తుకొచ్చింది . అందునా శ్రీరామ నవమి పందిళ్ళు, పాండవ ఉద్యోగ విజయాలు శ్రీ కృష్ణ రాయబారం, ఎన్నో మంచి మంచి నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు ఇలా వుండేవాళ్ళు. తెల్లవార్లూ నాటకాలు వేసేవాళ్ళు. చిన్న పిల్లలం కాబట్టి మేము 12 గంటలు వరకే చూసేవాళ్ళం. మేము మా చిన్నాప్పుడు అన్ని పందిళ్ళు సాయంత్రం అవగానే అందరు అమ్మాయిలం మా అమ్మవాళ్ళతో కలిసి తిరిగి వచ్చే వాళ్ళం. కూచి పూడి డాన్సు లు, భామా కలాపం , బాల తరంగం ఇలా నవమి తొమ్మిది రోజులూ ఎదో ఒక కార్యక్రమం వేసేవాళ్ళు. భోజనాలు చేసి వచ్చి మరీ చూసేవాళ్ళం. మేము విజయా టాకీస్ దగ్గర పందిట్లో చూసేవాళ్ళం. మీరు చెప్పిన కృష్ణ మహల్ వీధి పందిరి కూదా పెద్దదే! మీరు ఈ పోస్ట్ పెట్టి సంవత్స రాలు గడిచినా చదువుతుంటే ఇప్పుడే జరిగినట్లు గా వుంది. thank you డాక్టర్ గారూ. ఇప్పటికీ గుంటూరు అంటే వీరాభిమనమే!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.