పూర్వం మగధ దేశాన్ని సుందరసేనుడనే మహారాజు పాలిస్తుండేవాడు. అతను ప్రజలని దోచుకుంటూ అన్యాయాలు, అక్రమాలు చేయసాగాడు. పన్నుల భారంతో ప్రజలనడ్డి పూర్తిగా వంచేశాడు.
ఆ కాలంలో ఈ రోజుల్లో భారతదేశంలోలాగే నిరక్షరాస్యులు ఎక్కువ. చదువుకున్న అతికొద్దిమందీ.. ఈ దినాల్లో ఉద్యోగస్తులవలె కరణాలుగా పనిచేసేవారు. పల్లెసీమల్లో పన్నులన్నీ వసూలు చేసి భటుల ద్వారా రాజధానికి పంపిస్తుండేవారు. అయితే కరణాలు చిన్నజీతాలతో బతుకుతుండేవారు. వారికి వేతనశర్మ అనేవాడు నాయకుడు.
మగధ దేశంలో ఓసారి క్షామపరిస్థితి ఏర్పడింది. ఆ క్షామంలో చాలామంది పేదలు పిట్టల్లా రాలిపోయేరు. అన్యాయాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయేయి. రాజబంధువులంతా చాలా బాగుపడ్డారు.
ఆ రాజ్యంలో మార్కండేయులు అనే ఋషిసత్తముడు ఉండేవాడు. ప్రజలే రాజులైతే తప్ప ప్రజలు మరింక బాగుపడరని ఆ మహర్షి గ్రహించేడు. "రాజుని పారదోలండి. మీ రాజ్యం మీరేలుకోండి!" అంటూ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. ఆ తిరుగుబాటులో రాజు తరఫున గ్రామాల్లో పన్నులు వసూలు చేస్తుండే కరణాలు కూడా పాల్గొంటారు. రాజు కుయుక్తులతో మార్కండేయుణ్ణి దోషిగా చిత్రించి చంపించివేస్తాడు.
ఆ వెంటనే, తిరుగుబాటుదార్లందరినీ ఏ విచారణా అవసరం లేకుండానే హింసించి చంపమని సుందరసేనుడు తన సైన్యానికి ఆజ్ఞ జారీ చేసేడు. నేలంతా నెత్తురుమయమయింది. గాలంతా హాహాకారమయింది. ఆకాశం చేతగాని సాక్షిగా మిగిలిపోయింది.
సైన్యం అందర్నీ వేటాడినట్లే కరణాలని కూడా వేటాడనారంభించింది. చదువుకున్న గాడిద కొడుకులకి బుద్ధి చెప్తే మిగతావాళ్ళక్కూడా బుద్ధొస్తుందనే నమ్మకం వల్ల మహారాజు సైన్యం కరణాలని ఎక్కువగా హింసించసాగింది.
ఆ పరిస్థితుల్లో, కరణాల నాయకుడైన వేతనశర్మ ఓ పగలూ, ఓ రాత్రీ కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని "నేనెవర్ని?" అని ప్రశ్నించుకొని "నేను కరణాన్నే కాని మరెవణ్నీకాను." అని ఖచ్చితంగా తేల్చుకొని, అందువల్ల ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి, తన కరణపు అనుయాయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు.
"ఈ దోపిడీ అనేది ఉండటం వల్ల మనకి ఏం నష్టం ఉంది? ఈ దోపిడీ నశిస్తే మనకి ఏమి లాభం చేకూరుతుంది? ఈ దోపిడీ రాజ్యం నశించిపోయి ప్రజారాజ్యం వచ్చిందనే అనుకుందాం. అప్పుడు మనకి వచ్చేదేముంది? ఏ మనిషయినా, సంఘమైనా తనకి కావలసినదేమిటో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. సమాజాలు పూర్తిగా మారితేనేగానీ జీవితాలు బాగుపడనివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విప్లవాలు తెస్తారు. చావుకి తెగిస్తారు. మనం ఆ కోవకి చెందుతామా? చెందం. మాకు వేతనాలతోనే సంబంధం ఉంది, కానీ విప్లవాలతో సంబంధం లేదు అని రాజుకి స్పష్టంగా చెప్పినట్లయితే వారు మనకి ఓ పిడెకెడు జీతం పెంచుతారు." అంటూ తోటికరణాల్ని 'ఎడ్యుకేట్' చేస్తూ సాగుతుంది వేతనశర్మ ఉపన్యాసం.
ఉపన్యాసం విన్న కరణాల కళ్ళన్నీ జ్ణానకిరణాలతో మెరిసిపోయేయి. జీవితంలో వారు సాధించుకోవలసిన లక్ష్యాలని వేతనశర్మ స్పష్టంగా తెలియజేసినందుకు మురిసిపోయేరు. వేతనశర్మని ఆశీర్వదించి.. రాజవర్గంతో తమ తరఫున సంప్రదింపులకి పంపారు. చర్చలు సఫలం అయ్యాయి. అందరికీ తలా చిటికెడు చొప్పున జీతాలు పెరిగాయి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వోద్యోగులంతా ప్రభువు నుండి జీతాలు తీసుకోడమే కాకుండా, వారికి ప్రజల నుండి పారితోషకాలు కూడా పొందే హక్కు కలదని ఆనాటి నుండి గుర్తింపబడింది. ఇది వేతనశర్మ సాధించిన విజయాల్లో చాలా ఘనవిజయం.
రావిశాస్త్రి కథని ఈ మాటలతో ముగిస్తాడు.
"ప్రభుత్వోద్యోగులకి వేతనశర్మే మొట్టమొదటి పీఠాధిపతి. ఆ తరవాత వేతనశర్మలే కార్మికనాయకులుగా కూడా రూపొందడంతో ప్రభువులంతా సకల ధనకనకవస్తువాహనాలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవించుకు వస్తున్నారు. ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప, సమసమాజం కోసం విప్లవాలు వద్దంటారు ప్రభువులు. అవునంటారు ప్రభుత్వోద్యోగులు."
1971లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కధని.. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి జరిగిన ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అదే ఆంధ్రజ్యోతిలో అప్పటి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ పునర్ముద్రించారు.
'అసలేం జరుగుతుంది? మనం ఎవరం? ఎటువైపు? ఎందుకు?' అంటూ చిన్నచిన్న లాజిక్ లతో సాగే వేతనశర్మ ఉపన్యాసం.. ఈ కథకి హైలైట్. ఈ కధలో రావిశాస్త్రి ట్రేడ్మార్కైన సిమిలీలు తక్కువ. అయినప్పటికీ.. చదువరిని కట్టిపడేసే ఆయన మాటల మాయాజాలం, 'కిక్'.. షరా మామూలే!
ఈ చిన్నకథ రాజ్యం, రాజ్యస్వభావం గూర్చి చర్చిస్తుంది. ప్రజలని దోపిడీ చేసే వర్గసమాజంలో ఉద్యోగులు ఎటు ఉంటారో వివరిస్తుంది. ఒక క్లిష్టమైన రాజకీయ అంశాన్ని సరళతరం చేస్తూ, కధారూపంగా మలచటానికి రావిశాస్త్రి జానపద నేపధ్యాన్ని ఎన్నుకున్నాడు. ఈ కధ 'బాకీ కధలు' సంపుటంలో ఉంది. వేతనశర్మ కథాశిల్పాన్నే.. ఇదే సంపుటంలోని 'పిపీలికం' లో కూడా రావిశాస్త్రి అనుసరించాడు.
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
(photos courtesy : Google)