Friday, 13 July 2012

బీనాదేవి 'ఫస్ట్ కేస్'.. కొన్ని ఆలోచనలు!


కొన్నికథలు చదుతున్నప్పుడు బాగుంటాయి. మరికొన్ని కథలు చదివిన తరవాత కూడా బాగుంటాయి. అతికొన్ని కథలు చదివిన తరవాత చాలాకాలం వెంటాడుతుంటాయి, మన  ఆలోచనల్ని  ప్రభావితం  చేస్తుంటాయి. నన్నలా వెంటాడిన కథ 'ఫస్ట్ కేస్'. ఈ కథని 'బీనాదేవి' 1967 లో రాశారు. ఈ కథ సంక్షిప్తంగా - (ఎర్ర అక్షరాలు బీనాదేవివి).

డబ్బులో పుట్టి పెరిగిన ఆనందరావు డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. అతని సూట్లు టెర్లిన్వి. అతని సిగరెట్లు ఇంగ్లీషువి. అతని కారు ఫ్రెంచిది. అతని ఊహలు అమెరికన్వి. అమెరికా వెళ్దామన్న ఆలోచన ఉంది. అతనెలాంటివాడన్న ప్రశ్నకి, బహుశా అతనే చెప్పలేడేమో! అతని జీవితమంతవరకు కరగని కలలా ప్రశాంతంగా జరిగిపోయింది.

మిత్రుడు రాజు ఆహ్వానం మేరకు డాక్టర్ ఆనందరావు ఒక పల్లెటూరుకి వెళ్తాడు. రాజు ఇంటి నుండి కొంతదూరంలో పల్లె వస్తుంది. దాన్ని దాటుకుని పోతే రాజుగారి తోట వస్తుంది. ఒక శీతాకాలపు సాయం సమయాన ఆనందరావు ప్రకృతి అందాలని ఆస్వాదించు చుండగా -

ఎనిమిదేళ్ళ పిల్లొకర్తె వచ్చి నిలబడింది. దూరం నుండి చూస్తే కాకిపిల్లలా అసహ్యంగా ఉంది. ఆర్రోజులై అన్నం మొహం ఎరగనట్లుందా పిల్ల. "డిస్టింక్టిలీ ఏన్ ఎడ్వాన్సెడ్ కేస్ ఆఫ్ మాల్‌న్యూట్రిషన్." అనుకున్నాడానందరావా పిల్లని చూడగానే. ఆ కాకిపిల్ల తన చెల్లికి చాలా అనారోగ్యంగా ఉందని, వైద్యం చెయ్యమని ప్రాధేయ పడుతుంది.

డాక్టర్ పట్టా మాత్రమే పుచ్చుకున్న ఆనందరావు ఇంతవరకూ పేషంటుని చూళ్ళేదు. చూడమని అతన్ని ఎవరూ బ్రతిమాలనూ లేదు. ఈ కొత్త అనుభవాన్ని ఎంజాయ్ చెద్దామని ఆనందరావు ఆ  పిల్లతో పాటు వాళ్ళ గుడిసెకి వెళ్తాడు. అక్కడ కనిపించిన దరిద్రానికి ఖిన్నుడవుతాడు.

ఇంత దరిద్రం, ఇంత మంచిగా కనిపించే తన ప్రపంచంలోనే వుంటుందని అతనూహించలేకపోయాడు.

ఒక మూల తాళ్ళు తెగిన నులక కుక్కిమంచంలో విరిగిన బొమ్మలాంటి ఒక ఆరేళ్ళ పిల్ల పడుకునుంది. ఆరేళ్ళు కేవలం వాయుభక్షణం మాత్రం చేసినట్లుంది. చేపల్లాంటి ఆ పిల్ల కళ్ళు తెరచి వుండటం వల్ల చచ్చితేలిన ఎర్రచేపల్లా వున్నాయి.

నశించిపోతున్నాశలా మంచంవారనే ఆ పిల్ల తల్లి నిల్చొనుంది. ఆమెకెన్నేళ్ళుంటాయి? ఎన్నున్నా నూరేళ్ళు నిండిపోయినట్లుంది.

తిండిలేక ఎండిపోయిన ఆ పిల్లకి మందులతో పాటు ఆహారం కూడా కావాలని ఆనందరావుకి అర్ధమౌతుంది.

"పిల్లకేదేనా అర్జంటుగా తింటానికివ్వాలి."

"బిందెలో నీల్లూ, బొందిలో పానాలు తప్ప నాకాడేట్నేవు."

"దేశంలో ఇంత దరిద్రమా?" అని బాధపడ్డాడానందరావు. తను నమ్మిన దేవుడు తనని మోసం చేసినట్లూ, తను పెంచిన పావురం పెనుపక్షై గోళ్ళతో తన పీక పట్టుకున్నట్లు ఫీలయ్యాడు.

ఇది తన 'ఫస్ట్ కేస్'. ఎలాగైనా ఈ పిల్లని బ్రతికించాలి. అంచేత ఆ పిల్ల అక్కని తనతోబాటు మిత్రుడి ఇంటికి తీసుకెళ్ళి ఒక ఫ్లాస్క్ నిండా హార్లిక్స్ పోసి, త్వరగా ఇంటికెళ్ళి చెల్లికి తాగించమంటాడు. మందుల బీరువా తాళాలు వెతుక్కుని, సిరెంజి బోయిల్ చేసుకుని పరుగుపరుగున తన ఫస్ట్ కేస్ దగ్గరకి వెళ్తాడు ఆనందరావు.

ఆనందరావు వెళ్ళేప్పటికి ఆకలితో ఆ పేషంట్ చనిపోతుంది. ఆ పిల్ల అక్క దరిదాపుల్లో కనబడదు. తన ఫస్ట్ కేస్ ఇలా ఫెయిల్ అయినందుకు.. కాళ్ళు మొయ్యలేనంత బరువెక్కిపోయిందతని మనసు.

కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే! బాధతో మిత్రుడి ఇంటికి తిరిగి వెళ్తున్న ఆనందరావుకు దారిలో ఓ గోడకి ఆనుకుని నిద్రపోతున్న రోగి అక్క కనపడుతుంది. ఆ పిల్ల వెనక కసిగా పడగ విప్పి ఒక నల్లత్రాచు ఉంది. ఆ పిల్ల వెనకాల రాతిపలక మీదున్న ఖాళీఫ్లాస్కుని చూస్తాడు. ఆ పిల్ల అతనికి మరోపాములా కనబడుతుంది!

రోగికి చేరవలసిన హార్లిక్స్‌ని మధ్యలోనే అక్క తాగేసింది! చెల్లి ఆకలితో చచ్చిపోయింది! ఆకలితో కాలే కడుపుకి అనుబంధం, ఆత్మీయత గుర్తుండవు. మనిషిలోని అన్ని బంధాల్ని చెరిపేసే శక్తివంతమైనది ఆకలి.

కొంత ద్వైదీభావం తరవాత - ఆర్నెల్లలో అమెరికా వెళ్ళిపోవడం ద్వారా ఆనందరావు సమస్య పరిష్కారమైపోతుంది. టూకీగా ఇదీకథ.

నా మాట -

సరే! ఈ బీనాదేవి కథ తెలుగు సాహిత్యంలో చాలా ప్రముఖమైనది. ఈ కథ గుణగణాలని విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు. ఫస్ట్ కేస్ కథావస్తువు, శిల్పం వంటి ఎకడెమిక్  అంశాల్ని కొందరు విశ్లేషించారు. కాబట్టి ఆ విషయాలు పక్కన పెడదాం. అయితే - ఈ కథ నలభై అయిదేళ్ళ కన్నా ఇప్పుడే రిలవెంట్ అనుకుంటున్నాను.

మారుతున్న కాలం.. మారుతున్న సమాజం.. మారుతున్న విలువలు.. పెరుగుతున్న డబ్బు ప్రాధాన్యత.. వేగంగా వ్యాపారీకరించబడుతున్న వైద్యవిద్య, వైద్యం - ఈ కథ విలువని మరింతగా పెంచుతున్నాయి. ఎల్కేజీ నుండే వేల ఖర్చుతో.. సమాజానికి దూరంగా.. మెరిట్ కి దగ్గరగా.. కేవలం సబ్జక్ట్ విషయాల్నే వల్లె వేయిస్తూ.. డబ్బు సంపాదనే ధ్యేయంగా, ఆశయంగా ఈ సమాజం అనేక ఆనందరావుల్ని తయారుచేస్తుంది. మనం ఆనందరావుల్ని నిందించి ప్రయోజనం లేదు. బీనాదేవి కూడా ఆనందరావుని చెడ్డవాడిగా చెప్పలేదు.

కథ మొదటిసారి చదివినప్పుడు చెల్లి చావుకి కారణమైన అక్కని కోపగించుకున్నాను. పాఠకుణ్ణి ఆకట్టుకోవడానికి రచయిత చేసిన జిమ్మిక్ లాగా కూడా అనిపించింది. కడుపు నిండినవాడికి కడుపు కాలేవాళ్ళ పనులు అరాచకంగానూ, అకృత్యాలుగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడయితే ఈ ముగింపే ఈ కథని ఎంతో గొప్పగా ఎలివేట్ చేసిందని నమ్ముతున్నాను.

ఈ కథ ప్రతి మెడికల్ కాలేజి వార్షిక మ్యాగజైన్లలో ప్రచురించాలని, ప్రతి వైద్యుడూ తప్పక చదవాలని - ఆ రోజుల్లో మా స్నేహితులం అనుకుంటుండేవాళ్ళం. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన ఈ కథని చదవనివారు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా చదవనివారు ఉంటే దయచేసి చదవండి. ఈ పోస్ట్ ఉద్దేశ్యం కూడా ఇదే!

(photo courtesy : Google)

35 comments:

  1. very good story. i remember reading this one.

    ReplyDelete
    Replies
    1. yes. excellent story line. very much contemporary.

      Delete
  2. చాలా సార్లు చదివించి మరిన్ని సార్లు ఆలోచింప చేసే కధా రత్నం.
    - పుచ్చా

    ReplyDelete
    Replies
    1. అవును.

      (ముఖ్యంగా వైద్యవృత్తిలో ఉన్నవారు..)

      Delete
  3. 1205 పుటల బీనీదేవి సమగ్ర రచనలు ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి ఈపుస్తకంగా. వివరాలకు ఈ లింకు చూడండి http://kinige.com/kbook.php?id=932

    ReplyDelete
  4. నేను ఈ కథ ఇదివరకు చదవలేదు.. ఈ పోస్ట్ తర్వాత చదవాలనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. 'అనిపించటం' ఏంటండి? చదివి పడెయ్యండి. ఒక పనయిపోతుంది!

      Delete
  5. నేను ఈ కథ చదివి అదిరిపడి మా అన్న కి చెప్పాను. సాహిత్యం తో పరిచయం లేని అతను అతను ఈ కథ చదివి చప్పరించేశాడు.

    ReplyDelete
    Replies
    1. మీ అన్నయ్య ఎందుకు చప్పరించేశారో ఆలోచించవలసి ఉంది. సమాజం గూర్చి అర్ధం చేసుకోవడానికి మంచి సాహిత్యం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అయితే.. ఇటువంటి కథలు కేవలం సాహిత్యాభిమానులకే కాక మీ అన్నయ్య వంటివారిని కూడా ఆలోచింప చెయ్యగలగాలి. అప్పుడే 'ఫస్ట్ కేస్' ప్రయోజనం నెరవేరేది.

      కానీ.. చదివే అలవాటున్న వారంతా ఒకవైపు ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటారు (మన బ్లాగర్లతో సహా). నాకెందుకో ఈ సాహిత్య చర్చలు డాక్టర్లు పేషంట్ల గూర్చి, లాయర్లు క్లయింట్ల గూర్చి చర్చించుకుంటున్నట్లుగా ఒక section కే పరిమితమైపోయి.. సాహిత్య ప్రయోజనం కుంచించుకుపోయినట్లుగా అనిపిస్తుంది.

      (ఈ వ్యాఖ్యలు మీ అన్నయ్యని ఉద్దేశించి అన్నవి కావు. జెనరలైజ్ చేశాను. గమనించగలరు.)

      Delete
    2. అతనికి ఈ కథ లో "స్టోరీ" పెద్ద గా లేదు. straight forward narration. మలుపులూ, త్రిల్లూ, సస్పెన్సూ, రొమాన్సూ ఉండే యండమూరి లాంటి కథలు నచ్చుతాయి.

      Delete
  6. రమణ గారూ నిన్ననే 'బీనాదేవి సమగ్ర రచనలు' పుస్తకం దొరికింద౦దండీ..మీ సమీక్ష చూసి కథ చదివాను. ఇలాంటి కథలు నేలమీద నడిపిస్తాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. నా కథా పరిచయాన్ని చదివి మీరు కథ చదివినందుకు ధన్యవాదాలు. మీకు వీలైతే బీనాదేవి 'ఎ మేటర్ ఆఫ్ నో ఇంపార్టెంస్' పరిచయం చెయ్యండి. ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే!

      నాకు 'ఫస్ట్ కేస్' కథలో తోట గూర్చి వర్ణన ఎక్కువగా ఉన్నట్లనిపించింది. కొన్ని వాక్యాలు అంత్య ప్రాసలతో రావిశాస్త్రిని గుర్తుకు తెస్తుంటాయి. ఆ మాటకొస్తే బీనాదేవిని చదువుతున్నంతసేపూ రావిశాస్త్రి గుర్తుకొస్తూనే వుంటాడు. ఇది ఒక రకంగా బీనాదేవి దురదృష్టం.

      నేను రచయితనీ, కథనీ రివ్యూ చెయ్యబోను. అప్పుడు చాలా అంశాలలోకి వెళ్ళాల్సొస్తుంది. నా కథా పరిచయాలన్నీ.. 'ఫలానా హోటల్లో కాఫీ నాకు చాలా బాగుంది. మీరూ వెళ్ళి తాగండి. ఎంజాయ్ చెయ్యండి.' టైపులో ఉంటాయి. ఇలా రాయడమే నాకిష్టం.

      (కథ చదవని వారిని అ కథ చదివించేందుకు ఇట్లాంటి కుట్రలు పన్నుతుంటాను!)

      Delete
  7. Is the lesson here is that - when you visit really poor family as a Doctor its prudent to pack enough food & milk to cover all, not just the patient (just in case), & personally make sure the food/medicines actually reaches the patient?

    To generalize, I guess for any help we do for a good cause, we need to make sure that we follow it up with precision so that no slip-ups occurs with proper contingency planning. Thank you for sharing.

    ReplyDelete
    Replies
    1. ఆహాహా! చాతకం గారూ, భలే భలే బాగా చెప్పారు...
      సిరికిన్ చెప్పడు, శంఖ చక్రయుగమున్ సంధిపడు, .. గరుడికైనా చెప్పడు... ఏమి చేయడానికెళ్ళాడు? తమాషా చూటానికా! అని శ్రీనాథుడు పోతనని పరిహసించిన సీన్ గుర్తొచ్చింది. :P
      Snkr :)

      Delete
  8. ఈ బీనాదేవి ఎవరండీ మరో జిలేబీ యా ?


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. అబ్బే! మరీ జిలేబీ అంత కాదులేండి!

      Delete
  9. Very contemporary indeed. Shades of Premchand's Kafan.

    ReplyDelete
  10. నేను రచయితనీ, కథనీ రివ్యూ చెయ్యబోను. అప్పుడు చాలా అంశాలలోకి వెళ్ళాల్సొస్తుంది. నా కథా పరిచయాలన్నీ.. 'ఫలానా హోటల్లో కాఫీ నాకు చాలా బాగుంది. మీరూ వెళ్ళి తాగండి. ఎంజాయ్ చెయ్యండి.' టైపులో ఉంటాయి. ఇలా రాయడమే నాకిష్టం.
    పోస్ట్ కన్నా మీ ఈ వ్యాఖ్య బాగుందండీ!!
    నేను బీనా దేవి గారి రచనలు ఏవి చదవలేదండీ! ఇప్పుడు చదివే ప్రయత్నం చేస్తాను. థాంక్ యు!!

    ReplyDelete
    Replies
    1. అయితే మీకు నా బ్లాగు బొమ్మల గూర్చి కొంత చెప్పాల్సి ఉంది.

      'బీనాదేవి' అనేది కలం పేరు. భార్యాభర్తలైన బి.నరసింగరావు + బాలాత్రిపుర సుందరమ్మ గార్లు 'బీనాదేవి' పేరుతో రచనలు చే్శారు.

      బ్లాగ్ మొదట్లో బి.నరసింగరావు గారి బొమ్మ. మధ్యలో రచయితలిద్దరి బొమ్మ (మనసు ఫౌండేషం రాయుడు గారి 'సమగ్ర రచనలు' పుస్తకం కవర్). చివరి బొమ్మ ఇప్పటి సుందరమ్మ గారిది.

      బీనాదేవి 'హేంగ్ మి క్విక్' నవలతో తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టించారు.

      Delete
  11. నేను ఈ కథ ఇంతవరకూ చదవలేదు.
    కానీ ప్రధాన సన్నివేశం (రోగికి మందులకంటే ఆహారం ముఖ్యం అని డాక్టర్ భావించడం)చాలా సినిమాలలో చూసినట్టు, వేరే కథల్లో చదివినట్టు గుర్తు.
    అయితే ఇలాంటి క్లైమాక్స్ వినలేదు.

    మీరు డాక్టర్ అవడంవల్లనే బహుశా మీకు ఈ కథ ఇంతగా నచ్చి ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఆకలి మనిషి స్థాయిని ఎంతగానో హీన పరుస్తుంది. ఎమిలీ జోలా 'ద ఎర్త్', దోస్తవస్కీ 'క్రైం అండ్ పనిష్మెంట్' నవలలు మంచి ఉదాహరణలు.

      తిలక్ కూడా ఒక కథ రాశాడు (పేరు గుర్తుకు రావడం లేదు). దరిద్రం, ఆకలి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబుతున్న వ్యక్తి.. కూతురు 'తప్పు' చేస్తుందన్న విషయాన్ని విని.. కోపంగా ఇంటికి వస్తాడు. వంటింట్లో గిన్నె నిండా అన్నం. చూసి ఎన్నాళ్ళయిందో! ఆవురావురమంటూ తినేస్తాడు. ఆ అన్నాన్ని కూతురు 'తప్పు' చేసి సంపాదిస్తుంది. ఏడుస్తున్న కూతుర్ని 'నువ్వేం తప్పు చెయ్యలేదమ్మా!' అంటూ సముదాయిస్తాడు.

      ఇటువంటి కథే గైడీ మొపాసాది కూడా చదివినట్లు గుర్తు. (dementia వల్ల పేర్లు గుర్తు రావట్లేదు. క్షమించగలరు.)

      Delete
    2. >> ఏడుస్తున్న కూతుర్ని 'నువ్వేం తప్పు చెయ్యలేదమ్మా!' అంటూ సముదాయిస్తాడు
      సముదాయించడనుకుంటాను. మరో శైలిలో ఉంటుంది ఈ సన్నివేశం ....

      Delete
  12. బీనాదేవిగారి భర్త నరసింగరావు గారు జడ్జీ .వారిద్దరూ కలిసి కథలు రాసేవారట.కాని వారి కథనం,శైలీ, అంతా రా.వి.శాస్త్రి గారి అనుకరణగా ఉంటుంది.రా.వి.శా.స్వయంగా లాయర్ ఐనా ,అతని తమ్ముడు, చెల్లి, డాక్టర్లు ఐనా ఆ రెండు వృత్తులూ అంటే ఆయనకు పడేవి కాదు.ఆ ధోరణే బీ నా దేవి కథల్లో కూడా కనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. తెలుగు దేశంలో రావిశాస్త్రి వీరశూర అభిమానులకి కొదవ లేదు. రావిశాస్త్రి రచనా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోకుండా ఉండగలగడం చాలా కష్టం.

      బీనాదేవి కూడా ఉత్తరాంధ్ర యాసలో, సిమిలీల మోజుతో రాయడంతో రావిశాస్త్రిని అనుసరించినట్లుగా ఉంటుంది. ఐతే.. స్వయంగా రావిశాస్త్రే చెప్పినట్లు (రావిశాస్త్రీయం).. ఇది బీనాదేవి స్థాయి తగ్గించడమే! బీనాదేవి కథనం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇందుకు 'రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది.' ఒక ఉదాహరణ.

      బీనాదేవి, రావిశాస్త్రి రచనల పోలికలు, వైరుధ్యాల గూర్చి మనలో ఎవరైనా టపా రాశారా? రాస్తే ఆ లింక్ ఇస్తే చాలా సంతోషిస్తాను.

      Delete
  13. ఆకలి దరిద్రానికే కాదండీ డాక్టేరు గారూ అప్పుడప్పుడూ ఆనంద్ భవన్ నుంచి అట్టు లేదా దోశ టైం కి రాకపోతే ఆ ఆకలి బాధ మీకు కూడా తెలిసే వుంటుందే!!

    ReplyDelete
  14. *రావిశాస్త్రి రచనా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోకుండా ఉండగలగడం చాలా కష్టం.*

    రమణ గారు,

    ఈ రావిశాస్త్రి గారి పుస్తకాలు ఎక్కడా దొరకటంలేదు. మావూరికి వెళ్లినపుడు కనిపించిన ప్రతి షాప్ లో అడిగాను. మీరు ఆయనని ఇలా పొగుడుతూంటే ఎమీటాయన ప్రత్యేకత అని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఆ ఆరు సారా కథలలో ఒక్క సారా కథనైనా బ్లాగులోకి ఎక్కించగలరా?

    SriRam

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతం రావిశాస్త్రి రచనలు కనుమరుగయ్యాయి. మనసు foundation రాయుడు గారు 'రావిశాస్త్రి రచనా సాగరం' పేరిట complete works ప్రచురించారు (రాయుడు గారు ప్రస్తుతం గురజాడ complete works పనిలో ఉన్నారు). రావిశాస్త్రి గారి పిల్లల రెమ్యూనరేషం డిమాండ్స్ తట్టుకోలేక పుస్తక కాపీలన్నీ రావిశాస్త్రి గారి పిల్లలకే పంపించేశారు. 'రచనా సాగరం' సాఫ్ట్ కాపీ నెట్లో లభ్యం. చాలామంది చదువుతున్నారు కూడా.

      Delete
    2. శ్రీరాం గారు,

      ఆరు సారా కథలు' లో ఒక కథ 'మాయ' ని మనోజ్ఞ గారు చక్కగా రివ్యూ చేశారు.

      http://manognaseema.blogspot.com/2011/11/blog-post.html

      Delete
    3. Thank you so much Ramana gaaru

      SriRam

      Delete
  15. మంచి కథ. ఒక చిన్న ఆలోచన

    >> "కడుపు నిండిన వాడికి కడుపు కాలేవాళ్ళ పనులు అరాచకంగానూ, అకృత్యాలుగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు""

    నిజమే అనిపిస్తుంది చూడగానే చాలా మందికి అవునుకదా అనికూడా అనిపిస్తుంది. కడుపు కాలే వాడికి కడుపు నిండినోడి ఆలోచనలూ, పనులూ విలాసాలుగానూ బాధ్యతారాహిత్యంగానూ అనిపిస్తే అర్థం చేసుకోవచ్చు ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. కానీ కడుపు నిండినోడికి కడుపుకాలేవాడు అర్థం కాకపోవటం నాకు మాత్రం ఆశ్చర్యం గానే ఉంటుంది. బహుశా కడుపు నిండినోళ్ళకి ఆలోచించడానికి మహా బద్దకం అయ్యుండొచ్చు.

    ReplyDelete
  16. Been Devi's " Dabbu Dabbu Dabbu " is one of superb short stories written in most sarcastic, humorous with similis spread over. Pl read both parts of this short story. I apologise for writing comment in English as I am not able to locate Telugu script here. For Andhra public, like Sri Sri, Beena Devi is a Gift which has decorated Telugu Sahityam.

    ReplyDelete
  17. Been Devi's " Dabbu Dabbu Dabbu " is one of superb short stories written in most sarcastic, humorous with similis spread over. Pl read both parts of this short story. I apologise for writing comment in English as I am not able to locate Telugu script here. For Andhra public, like Sri Sri, Beena Devi is a Gift which has decorated Telugu Sahityam.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.