Friday, 6 July 2012

తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!

'తెలుగు సినిమాల్లో తెలుగెప్పుడో చచ్చిపోయింది, కొన్నాళ్ళుగా హీరోయిన్‌గా తెలుగమ్మాయీ చచ్చిపొయ్యింది. ఇప్పుడు బొంబాయి నుండి దిగుమతైన తెల్లతోలు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లు.' 

అతగాడు నా చిన్ననాటి స్నేహితుడు, సినిమా ప్రేమికుడు. ఇప్పటి తెలుగు సినిమాల దుస్థితి గూర్చి బోల్డంత బాధ పడ్డాడు. నాకతని బాధ అర్ధం కాలేదు. నా దృష్టిలో - సినిమా చూడ్డం దురదేస్తే గోక్కోడంలాంటిది. సిగరెట్లు తాగనివాడికి సిగరెట్ రేటు ఎంత పెరిగితే మాత్రం లెక్కేంటి! అలాగే - సినిమాలు చూడ్డం నేనెప్పుడో మానేశాను. నేను చూడని సినిమా బ్రతికినా చచ్చినా నాకనవసరం.

'మేం సినిమాలు కళాపోషణ కోసం తియ్యట్లేదు, మిర్చివ్యాపారంలా మాదీ ఒక వ్యాపారం' అని సినిమావాళ్ళే చెబుతున్నారు - కాబట్టి వాళ్ళతో పేచీ లేదు. తెల్లతోలు అమ్మాయిల్ని తెలుగువాళ్ళు చూస్తున్నారు కాబట్టే వాళ్ళని బొంబాయి నుండి నిర్మాతలు దిగుమతి చేసుకుంటున్నారు. నిర్మాతలకి వ్యాపార ప్రయోజనం తప్ప ఇంకే ప్రయోజనం వుంటుంది? వాళ్ళెవరికైనా డబ్బులివ్వాల్సిందే గదా! తెలుగు అమ్మాయిలు ఫ్రీగా నటిస్తారా?

ఇప్పుడు - 'తెలుగు ప్రేక్షకుడు తెల్లతోలు అమ్మాయిల్ని ఎందుకంతగా ఇష్టపడుతున్నాడు?' అనే ప్రశ్నకి సమాధానం ఆలోచిద్దాం. 

సినిమా అంటే వెండితెరపై కథ చెప్పడం. రచయిత కథని కాగితంపై రాసినట్లే, దర్శకుడు సినిమాని వెండితెరపై రాస్తాడు. కొన్ని కథలు బాగుంటాయి, మరికొన్ని బాగోవు. ఈ బాగోగులు అనేది మనం కథతో కనెక్ట్ కావడంపై ఆధారపడి వుంటుంది. ఇలా కనెక్ట్ కావడం అనేది విజయానికి కీలకం.

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు - డెబ్భయ్యో దశకంలో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలగు రచయిత్రీమణులు తెలుగు నవలా ప్రపంచాన్ని యేలేశారు. పడవకార్లు + రాజ భవంతులు + ఉన్నిసూట్లతో ఆరడగుల ఆజానుబాహు హీరోల్ని పాపులర్ చేశారు. హీరోలు - కల్యాణ్, రాజేష్, అవినాష్, సునీల్.. ఇలా కళకళ్ళాడే పరభాషా పేర్లతో వెలిగిపొయ్యారు. వీళ్ళందరికీ గురువు శరత్‌చంద్ర చటర్జీ అనే బెంగాలీ రచయిత. 

ఖరీదైన హీరో ఒక మధ్యతరగతి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయికేమో డబ్బున్నవాడు వెధవనీ, వాజమ్మనీ నమ్మకం. అంచేత హీరోగారి ఖరీదైన ప్రేమని కూడా గడ్డిపోచలా తిరస్కరిస్తుంది. ఆ అమ్మాయికి కావలసింది నీతి + నిజాయితీ +  ప్రేమించే స్వచ్చమైన మనస్సు!

ఆరోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలు స్కూల్ ఫైనల్ (అంతకన్నా ఆడపిల్లలకి చదువెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?) తరవాత తీరిగ్గా పెళ్లికోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళు. రాబోయే భర్త కోసం అందమైన కలలు కన్డానికి వాళ్ళోకో ముడిసరకు కావాలి. సరీగ్గా ఈ అవసరం కోసమే రచయిత్రుల నవలా సాహిత్యం పుట్టింది. అమ్మాయిలు ఆ నవలా హీరోయిన్లో తమని చూసుకుని మురిసిపోయ్యారు. దీన్నే 'ఐడెంటిఫికేషన్' అంటారు. 

హీరో అందగాడు, ధనవంతుడు. అతను తమవెంట పడటం అనే ఊహ (నిజజీవితంలో గుడికి వెళ్ళాలన్నా తమ్ముడు తోడు లేకుండా వెళ్ళలేని పరిస్థితి) ఆ అమ్మాయిలకి భలే 'కిక్' ఇచ్చి ఉంటుంది. ఇదీ ఐడెంటిఫికేషన్ గొప్పదనం. ఇట్లాంటి నవలలు రాయడం అనేది గుడి ముందు కొబ్బరికాయల వ్యాపారంలా మంచి గిట్టుబాటు వ్యవహారం.

మనమిప్పుడు 'ఐడెంటిఫికేషన్' పవర్ అర్ధం చెసుకున్నాం. ఇదే అవగాహనతో తెలుగు సినిమాల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అనాదిగా తెలుగు సినిమాల పోషకులు ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, చేతిపనివాళ్ళు, రైతుకూలీలు మొదలైనవాళ్ళు. వీరిలో ఎక్కువమంది డార్క్ స్కిన్‌తో అయిదున్నర అడుగులు మించకుండా వుంటారు. ఈ వర్గాలవాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవ్వగలిగితే హీరో విజయవంతంగా నిలబడగలడు. 

సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి హీరో స్థానంలో తనని ఊహించుకోవడం చాలా ఈజీ అవ్వాలి. అందుకే తమలో వొకడిగా కనపడే చిరంజీవిని తెలుగువాళ్ళు, రజనీకాంత్‌ని తమిళంవాళ్ళు పెద్ద హీరోలుగా మార్చేశారు. దీన్నే సినిమా పండితులు 'ఇమేజ్' అంటారు. చిరంజీవి సొఫెస్టికేటెట్‌గా ఉన్నా, రజనీకాంత్ నల్లగా లేకున్నా వారికిప్పుడున్న స్టార్‌డమ్ వచ్చేది కాదు. ఇలా తమకంటూ వొక ఇమేజ్ వున్న నటులతో కథ నడిపించడం దర్శకుడికి సులువు.  

సగటు సినిమా ప్రేక్షకుడి నిజజీవితం యెలా వుంటుంది? అతనికి గర్ల్ వుండదూ, ఫ్రెండూ వుండదు. యే అమ్మాయీ అతన్ని కన్నెత్తి చూడదు. తను కూలిపని చేస్తున్న ఇంటి యజమాని కూతురు.. రోజూ తన ఆటో ఎక్కే ఆంటీ.. తను కాలవలు క్లీన్ చేస్తుండే లేడీస్ హాస్టల్ అమ్మాయిలు.. వీరంతా అందంగా ఉంటారు (డబ్బుకీ అందానికి అవినాభావ సంబంధం వుంది). మనవాడికి వాళ్ళని తీరిగ్గా చూసే ధైర్యం ఉండదు. జీవితంలో వెలితి, అసంతృప్తి, చికాకు, అసహనం.

ఇప్పుడు 'ఫాంటసీ థింకింగ్' గూర్చి రెండుముక్కలు. మానవుడికి వాస్తవ ప్రపంచంలో అనేక సమస్యలు. ఈ సమస్యల ప్రపంచం నుండి గొప్పరిలీఫ్ ఫాంటసీ థింకింగ్! పేదవాడు పచ్చడి మెతుకులు తిని.. తన మహరాజా పేలెస్‌లో కన్యామణులు వింజామరలు వీచుచుండగా.. వైన్ సిప్ చేస్తూ బిరియానీ భోంచేస్తున్నట్లు ఈష్ట్‌మన్ కలర్లో (కనీసం గేవా కలర్లో) ఊహించుకోవచ్చు. దీనిక్కావలసిందల్లా దిండూ, దుప్పటి.. కించిత్తు ఇమాజినేషన్ (ఈ 'ఫాంటసీ థింకింగ్' ఒకస్థాయి దాటితే మానసిక రోగం అవుతుంది).

సినిమావాళ్ళు కలల వ్యాపారాలు. సామాన్యూల కలలకి అందమైన రంగులద్ది ఒక ఊహాప్రపంచం సృష్టించి ఆ ప్రపంచానికి ఎంట్రీ ఫీజు వసూలు చేసుకుంటారు. ఆ చీకటి గదిలో ప్రేక్షకుడే హీరో. ప్రేక్షకుది కలల ప్లాట్‌కి తగ్గట్టుగా చిరంజీవి, రజనీకాంత్‌లు భావాలు వ్యక్తీకరిస్తుంటారు. ఇదోరకమైన ప్లే స్టేషన్ విడియో గేమ్! 

ఈ ప్రేక్షకుడికి అర్జంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మనకి తెల్లతోలంటే పిచ్చి. ఇక్కడ తెల్లబడ్డానికి సబ్బులు, క్రీములకి మంచి గిరాకి. పెళ్ళప్పుడు పెళ్ళికూతుళ్ళకి మేకప్ తెల్లగా వేస్తారు. ఫొటోల్లో మొహం గొడకి కొట్టిన సున్నంలా తెల్లగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి హీరో పక్కన తెల్లతోలు పిల్లే కావాలి (రంగువిషయంలో రాజీపడే సమస్యే లేదు). ఆ తెల్లపిల్లతో విరగదీసుకుంటూ విచ్చలవిడిగా వొళ్ళంతా విరగదీసుకుంటూ భీభత్సంగా డ్యాన్సులు చెయ్యాలి. మన తెలుగువాళ్ళల్లో తెల్ల పిల్లలు తక్కువ, వున్నా వాళ్ళు exposing కి బిడియపడొచ్చు? ఈ సమస్యలేమీ లేకుండా అవకాశాల కోసం యెదురు చూస్తున్న తెల్ల పిల్లలు బొంబాయిలో బొచ్చదంతమంది. కాబట్టే హీరోయిన్లని దిగుమతి చేసుకోవడం!

సరే! మన ప్రేక్షకుడు (హీరో ద్వారా) హీరొయిన్‌తో డ్యూయెట్లు పాడేశాడు. కానీ.. ఇంకా ఏదో మిస్సవుతున్నాడు.. అదే ego satisfaction. ఇందుకోసం ఇద్దరు ఇద్దరు హీరోయిన్లుంటే బాగుంటుంది. హీరో 'నావాడంటే నావాడు' అంటూ ఆ ఇద్దరూ తన్నుకుచావాలి. అందుకోసం తమ చౌకబారు ప్రేమని వొలకబోస్తూ హీరోగారి కోసం వెంపర్లాడిపోవాలి. నడ్డి తిప్పుతూ, మెలికలు తిరిగిపోతూ హీరోగారితో పూనకం వచ్చినట్లు గంతులేయ్యాలి. అప్పుడా మజానే వేరు!

అంతేనా? ఇప్పుడు ఇంకొంచెం మసాలా! (ప్రేక్షకుల తరఫున 'నటన' అనబడే కూలి పని చేస్తున్న) హీరో ఆ అమ్మాయిల్ని గడ్డిపోచల్లా చూస్తాడు. ఛీ కొడుతూ humiliate చేస్తాడు. దీంతో పురుష దురహంకారం కూడా సంతృప్తి నొందుతుంది. అసలైన ego satisfaction అంటే ఇది! ఈ విధంగా - నిజజీవితంలో తనకి అందని ద్రాక్షపళ్ళయిన డబ్బున్న అందమైన ఆడపిల్లకి సినిమాహాల్లో రివెంజ్ తీర్చుకుంటాడు మన వర్కింగ్ క్లాస్ ప్రేక్షకుడు!      
                                           
మన సినిమా వ్యాపారస్తులు ఫ్రాయిడ్, ఎడ్లర్ కన్నా తెలివైనవాళ్ళు. అందుకే యెప్పుడూ నేలక్లాసు ప్రేక్షకుల కోసమే సినిమాలు తీశారు. హిందీ దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ 'క్లాస్' ప్రేక్షకులకి సినిమా నచ్చితే సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని కంగారు పడేవాట్ట! సినిమావాళ్ళకి ఎవరికోసం ఏం తియ్యాలో ఖచ్చితమైన అవగాహన ఉంది. లేనిదల్లా నా స్నేహితుడులాంటి అమాయకులకే! 

49 comments:

  1. Chala bagundi, early morning nee blog chadivithe adi oka " tuthi", idi oka jabba?

    ReplyDelete
    Replies
    1. నీ 'తుత్తి' సంగతేమో గానీ.. నాకు చాలా టైం వేస్ట్ అయిపొతుంది. ఎప్పటికప్పుడు ఇదే లాస్ట్ పోస్ట్ అనుకుంటూ పబ్లిష్ చెయ్యడం.. మళ్ళీ నాల్రోజులకి చేతుల్లో దురద మొదలవ్వడం!

      ముందు నా జబ్బు సంగతి చూసుకుని.. అటు తరవాత నీ జబ్బు గూర్చి ఆలోచిస్తానని మాటిస్తున్నాను!

      Delete
    2. Your proposition of giving up of writing blogs is totally unacceptable. on public demand you should continue writing. Your blogs have become something like "mass , masala movie". You may write another analysis regarding this.

      Delete
  2. Replies
    1. హాహహహ నా క్లాస్మేటొకడు తనకెవరైనా "Thank you so much" అని చెప్తే "Welcome too much" అని బదులిచ్చేవాడు :) మీ ఈరిప్లై చూస్తే తను గుర్తొచ్చాడు :))

      Delete
  3. ఇది చదివిన తర్వాత ఏదో శబ్దం వచ్చింది, ఏమిటని ఆలోచిస్తే అది నా కళ్ళు తెరుచుకున్న శబ్దం

    ReplyDelete
    Replies
    1. మీకు తరచు ఇలా శబ్దాలు వినిపించాలని కోరుకుంటున్నాను!

      Delete
  4. chaala baaga vrasaaru.Keep it up

    ReplyDelete
  5. అమ్మో, నేను సినిమా చూడడం లో ఇంత కధ ఉందా....దహా.

    ReplyDelete
    Replies
    1. ఇదంతా కథ వెనుక కథలేండి! ఒక సరదా కథ!

      Delete
  6. చాలా చక్కగా చెప్పారు.మంచి అనాలిసిస్.మన నిర్మాతలు అన్ని లెక్కలూ తెలిసిన మేధావులు అన్నారు. నిజమే. తమ సినిమాలకు విజయం చేకూర్చే ప్రేక్షకులకేం కావాలో వారికి స్పష్టంగానే తెలుసు గానీ అది ఎలా అందించాలో తెలియక అప్పుడప్పుడూ బోల్తా పడుతుంటారు.ఎంతో ఖర్చు చేసి తీసిన సినిమాలు చాలా మట్టుకు ఫ్లాప్ అవడానికి కారణం ఇదే.

    ReplyDelete
    Replies
    1. మన నిర్మాతలకి సినిమా అనే వంట చెయ్యడానికి కావలసిన దినుసుల గూర్చి అవగాహన ఉంది. అయినా కూడా చాలాసార్లు వంట చెడగొడుతుంటారు!

      Delete
  7. మీరు సినిమా కస్టమర్ల (audience) కోణం నుండి బ్రహ్మాండంగా విశ్లేషించారు. నేను మీ అంతటి వాడిని కాకపోయినా సినిమా సప్లయర్ల (industry) కోణం నుండి అదనపు (supplementary) మసాలా అందించ తలిచాను. అందుకొనుడి నా supply side థియరీ రాజము.

    5'6" పొడుగు, 90 కిలోల బరువు చామనచాయ సగం నత్తి డయలాగులతో రాజ్యం ఏలుతున్న నటన కూలీలకు కాలక్రమేణా విపరీతమయిన అహం ఎదిగింది. తమ వల్లే సినిమాలు నడుస్తున్నాయని, అదే ఎల్లకాలం కొనసాగాలని, తమ తరువాత తమ వారసులకూ అదే స్తాయి దక్కాలని పట్టుదల పెరిగింది. ఈ లక్ష్యం కోసం ముఠాలు, వంధిమాగధులు, వీరాభిమానుల బృందాలు, అభిమాన సంఘాలు, అభిమానుల కోసం బ్లడ్ బాంకులు/కాన్సరు ఆసుపత్రులు, ఇతరత్రా infrastructure ఏర్పరుచుకున్నారు. ఆడియో ఫన్క్షన్లూ, కుల పెద్దలతో మంతనాలు, రాజకీయ పోకడలు, కొడుకుల పెళ్ళిళ్ళూ, అప్పుడప్పుడూ కాల్పులు ఇతరత్రా మసాలా కార్యక్రమాలతో పబ్లిసిటీ చేసుకుంటూ తమ పొసిషన్ కాపాడుకుంటూ వచ్చారు.

    ఏతావాతా ప్రతి నాయకుని చుట్టూ ఒక పెద్ద పరిశ్రమే వెలిసింది, maintenance ఖర్చులూ పెరిగాయి. This is like riding a tiger: you can't get off.

    ఇంతటి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అడ్డంకులు ఉండవా? హీరోల ఏకచత్రాధిపత్యం సాగాలంటే మిగిలిన సినీ కూలీల ప్రాముఖ్యత తగ్గి వారు నాయకులకు జోహుకుం చెయ్యాలి. హీరో గారి చలువతో అన్నం తింటున్న దర్శకులు & టెక్నీషియన్లు తొందరగా లొంగిపోతారు కానీ నాయికలకు ఈగో అడ్డం వస్తుంది. వారిలో కొందరికి మహానటి/సూపర్ హీరోయిన్/లేడీ అమితాభ్/ఊర్వసి లాంటి బిరుదులు కూడా ఉండి చచ్చాయి. కొద్దో గొప్పో అభిమాన సంఘాలు & ఇతర సరంజామా కూడా ఉంది.

    మగ మహారాజులం మనం ఆడంగులతో పోటీ పడాలా అని ఆలోచిస్తే ఒక మహత్తరమయిన పరిష్కారం కనిపిస్తుంది. దీంట్లో మొదటి భాగం నాయికల పాత్రను ఎక్స్త్రాకు ఎక్కువ వాంపుకు తక్కువగా మార్చడం. పనిలో పనిగా తెలుగు రాని ముంబాయి పిల్లను (ఆవిడది గోవా, హరియానా, కేరళ ఏదయినా మనకు ముంబాయి) పెట్టుకుంటే మనకు అడ్డం రాదు. సొంత ఊరిలో సినిమాలు దొరికే అవకాశం లేదు కాబట్టి మనన్నే బాకా పడుతుంది. భాష రాదు కాబట్టి ఇంగ్లీషులో ఇంటర్వ్యూలు ఇస్తుంది అదో సరదా.

    తొండ ముదిరి ఊసరవెల్లి కాకుండా ఒకటి రెండు సినిమాల తరువాత పిల్లను మార్చేస్తే సరి. ఈ బాపతు అమ్మాయలందరూ దాదాపు ఒకే లాగుంటారు కాబట్టి మన కస్టమర్లకు సమస్య లేదు. దుమ్ము సినిమాలో "నటించిన" రైనాకు, రొచ్చు సినిమాలో ఐటెం బాంబిన రూనాకు తేడా సగటు ప్రేక్షకులకే కాదు, ఇంకెవరికీ తెలీదు. The show goes on..

    ReplyDelete
    Replies
    1. నా పోస్టు కన్నా మీ ఎనాలిసిస్ అద్భుతంగా ఉంది. చక్కగా రాశారు. వేసుకోండి రెండు వీరతాళ్ళు!

      Delete
    2. థాంక్సండీ. అయితే నేను మీ టపాను అనలైసు చేయలేదని మనవి.

      మీరు ఈ పరిమాణం ప్రేక్షకులకు (customer or demand side) ఎందుకు నచ్చుతుందో చెబితే నేను ఈ వ్యవహారం సినిమా ఉత్పత్తి (production or supply side) ప్రముఖలయిన హీరోలకు ఎందుకు కలిసొచ్చిందో చూసాను.

      Delete
    3. @జై గొట్టిముక్కల,

      మీరు ఆ రంగం వరకు వెళ్లారు. ఇది ప్రతి చోట ఉండేదే. మా వూరిలో ఇల్లు కడుతూంటే మేస్రి గాడు తెచ్చిన కులీ వాళ్లందరు శ్రీకాకుళంకు చెందినవారు. ఉండూరు వాడిని ఒక్కడిని పెట్టుకోలేదు. చుట్టుపక్కల ఎవరూ లేనపుడు, ఆయన ఆడకూలీలతో సరసాలు చేస్తూ, పని చేసుకొంటూంటాడు. ఇక వాళ్లు పని చేసినందుకు వచ్చే డబ్బులలో కూడా, ఇతను, ఇతనికి పై అతను పని ఇప్పిచినందుకు కమిషన్ నొక్కెసేవాళ్లు. ఈ శ్రీకాకుళం కూలీల దెబ్బకి మావూరిలో కూలీలు,రిక్షావాళ్లు ఊరు వదలి పని కొరకు వేరే ఊళ్లకెళ్లారు (చెన్నై, బెంగుళూరు )
      SriRam

      Delete
  8. meerusaradaga raste me post enjoy cheyochemo kaani konchem bayataku okkasari chudandi ee rojullu hero chese vatini vuhunchuni sthayi nundi nijamgane girlfreinds/boyfreinds tho tiregesthnaru.meeru inka 90 lo vunnatu anipinchindi

    ReplyDelete
    Replies
    1. నేను ఇంకా తొంభైల్లో ఉన్నట్లు నాకే అనిపిస్తుంది. మీ observation కరక్టే!

      తెలుగు సినిమాల్ని పోషిస్తున్న వర్కింగ్ క్లాస్ లో కూడా girl friend / boy friend కల్చర్ ఉందంటారా! నాకు తెలీదు.

      Delete
  9. ఇప్పటి ప్రేక్షకులు భౌతికంగా వర్కింగ్ క్లాస్‌లో లేకపోయినా... మానసికంగా అంతకంటె దిగువ స్థాయిలో ఉన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్‌లో; ఎంబీయే, ఎంసీయేలో చదివినా... ప్రొఫెషనల్ జాబ్స్‌లో ఉన్నా... పోస్ట్ మోడర్న్‌గా ఉంటూ... హీరోయిన్ అందాలను ఇంగ్లీష్ బూతులతో ఆస్వాదిస్తారు, నేల క్లాసోడు దానె** అంటే బాల్కనీ వాడు ఫ** హెర్ అంటాడు. అంతే తేడా.

    ReplyDelete
    Replies
    1. ఈ ఇంటర్నెట్ రోజుల్లో ఉన్నత చదువుల వారు సినిమాలు చూట్టం తగ్గించారని (ఒకప్పటితో పోలిస్తే) నా అభిప్రాయం. ఇప్పుడు తెలుగు సినిమాని పోషిస్తుంది వర్కింగ్ క్లాస్ ప్రేక్షకులని అనుకుంటున్నాను.

      సినిమాని ఎంజాయ్ చెయ్యడంలో స్థాయి తేడా ఉంటుందని అనుకోను. టీనేజ్ లో హీరోయిన్లని సెక్సువల్ ఆబ్జక్ట్స్ గా పరిగణించడం మానసికంగా, శారీరకంగా కరెక్టేననుకుంటున్నాను.

      ఇన్ని నీతులు రాస్తున్న నేను 'ఆకుచాటు పిందె తడిసె.. ' అంటూ వర్షంలో తడిసిన శ్రీదేవిని చూడ్డానికి 'వేటగాడు' సినిమాని ఆరుసార్లు చూసి తరించిపొయ్యాను!

      Delete
  10. మీరు రాసింది సరదాగా బాగుంది.కాని నాదొక సందేహం.తెరమీద నలుపు,తెలుపు, తెలియకుండా చెయ్య వచ్చుకదా. మన తెలుగు హీరోయిన్లలో కొందరు నల్లగానో ,చామనచాయగానో ఉండేవారు.ఉదాహరణకి సావిత్రి ,వాణిశ్రీ,భానుప్రియ,రోజా వంటి వారు.వాళ్ళు తెరమీద తెల్లగా,అందంగానే కనిపించే వాళ్ళు కదా.వేరే ఇంకేమైనా కారణాలు ఉండవచ్చునేమో యీ బొంబాయి అమ్మాయిల్ని దిగుమతి చేసుకొడానికి.

    ReplyDelete
    Replies
    1. అవును. ఇంకొన్ని కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. టెక్నాలజీ వల్ల భాషా సమస్య పోయింది. నటన అవసరం లేని చోట అందచందాలకే ప్రాధాన్యం.

      మీరు చెప్పిన హీరోయిన్లు తమ 'సహజ చర్మపు రంగు'తో కూడా బాగుంటారు. కానీ ఆ చర్మాన్ని పాలిపోయినట్లు లైట్ కలర్లో చూపడానికి మేకప్ మేన్, సినిమాటోగ్రాఫర్ తీవ్రంగా శ్రమించేవాళ్ళు. దీనికి మనం సినిమావాళ్ళని నిందించడం అనవసరం.

      మన సమాజంలోనే ఈ వివక్షత ఉందనుకుంటున్నాను.

      నాకు 'ప్రేమనగర్' వాణిశ్రీ కన్నా బాపు తీసిన 'గోరంత దీపం' వాణిశ్రీయే నచ్చింది. కానీ నాకులా ఎంతమందికి నచ్చిందో తెలీదు.

      Delete
    2. సినిమాలు ఈరోజులలో వారమో రెండో ఆడతాయి. విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, ప్రోమోలు వగైరా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. నిజానికి ఎన్నో సినిమాలలో అసలు బొమ్మ కన్నా ఇవే ఎక్కువ కాలం మన్నుతాయి.

      ఈ బాపతు లైవు షోలలో తెల్లగా కనిపించాలంటే ఎంత మేకుప్ వేసుకున్నా సరిపోదు. అందుకే తళతళలాడే original తెలుపు అవసరం.

      Delete
  11. ఇలా ప్రేక్షకుడి మనసుల్లోకి వెళ్ళిపోయి.. తెలుపూ నలుపుల్ని కరాఖండిగా వేరుచేసి చూపించేసి.. ఆపైన "పూర్తిగా హైపొథెటికల్ " అంటారేంటండీ!!! మీరు చెప్పిన ప్రతి విషయం అక్షరసత్యం! :-)

    థాంక్స్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇవ్వాళే మీ బ్లాగులోకి ప్రవేశించాను.. ఇక ఈ చుట్టుపక్కలే తిరుగుతుంటాను :))

    ReplyDelete
    Replies
    1. ఇన్నాళ్ళూ 'పని లేక.. ' ఏదో రాస్తున్నాన్లే అనుకున్నాను. ఇప్పుడు మీరు నేను అక్షరసత్యాలు రాస్తున్నానని అంటున్నారు. నా సంగతేమో గానీ.. మీరు మాత్రం 'అక్షరసత్యం' రాశారు. థాంక్యూ!

      Delete
  12. చాలా విశ్లేషణ చేశారు. బహుశా అది కరక్టేనేమో కూడా (నేను చదివితే!). కానీ టపా టైటిలు చూసి నూజివీడు చిన్నరసాల్ని ఊహించుకుంటూ లొట్టలేసుకుంటూ లోపలికొస్తే, తాటితాండ్ర చేతిలో పెట్టి పంపించారు :)

    ReplyDelete
    Replies
    1. నాకు టపా టైటిల్ నచ్చలేదు. స్త్రీ బ్లాగర్లు హర్ట్ అవుతారేమోననే సందేహం కూడా ఉంది. ఇంకో టైటిల్ తోచలేదు. అందుకే తప్పించుకోవడానికి వీలు కోసం చివర్లో ఒక disclaimer పడేశాను.

      ఈ సారికి సర్దుకుపోండి!

      Delete
  13. అధ్యక్షా, ముందుగా ఈ పోస్ట్ లో చిరంజీవి బొమ్మలు మాత్రమే వాడడాన్ని నేను ఖండిస్తున్నాను :))
    తెల్లతోలు సంగతెలా ఉన్నా ఈ ఐడెంటిఫై చేస్కోగల్గడమనే విషయాన్ని మాత్రం బాగా పట్టుకున్నారండీ, అలా ఐడెంటిఫై చేస్కునేలా చేసి ప్రేక్షకులను ఒక ఫాంటసీ ప్రపంచంలో తిప్పగలిగే సినిమాల హిట్ కు ఎలాంటి ఢోకా ఉండేదికాదు ఒకప్పుడు. కానీ ఈమధ్య ప్రేక్షకులుకూడా కాస్త తెలివి మీరుతున్నారు :)

    ReplyDelete
    Replies
    1. >>ముందుగా ఈ పోస్ట్ లో చిరంజీవి బొమ్మలు మాత్రమే వాడడాన్ని నేను ఖండిస్తున్నాను.<<

      నేను చివర్లో చెప్పానుగా.. నా వాదనకి అనుకూలంగా ఉండే అంశాలనే చెప్పానని!

      Delete
  14. datru garu
    nenu me regular patient ayipoyanu. mi post chudadam vyasanamga marindi. manchi vyasaname anukondi.savitri, bhanumathila nunchi genilia, sada laku prayanamlo urbanisation patra okati pakkana bettinattunnaru. bahusa dry avuddani bhayapadinattunnaru. inko nalugu kalalu sagalsina manchi article. chala rojulninchi cinema meeda rayalani korika. baddakam valla theeradam ledu. mee piece chusaka korika durada ganu darada theeta ganu rupantharam chenduthoni. inspire chesinaduku thanks. annattu navatharangam chustuntara. manalanti cinema durada vunnavallaki eerubanatho veepu gokkunnatha hayiga untundi( chuse durada ledani cheppukonnappatiki meeku cinema durada naku lage pramadakara sthayilo unnadani na nammakam.)

    ReplyDelete
    Replies
    1. సైంటిఫిక్ పేపర్లో చివర స్టడీ ఫైండింగ్స్ పై డిస్కషన్ ఉంటుంది. దాంట్లో ఆ స్టడీకి ఉన్న లిమిటేషన్స్ కూడా వివరంగా రాస్తారు. అలాగే నా రాతలకున్న లిమిటేషన్స్ వీలయినప్పుడల్లా చెబుతూనే ఉన్నాను. సినిమాల గూర్చి నా నాలెడ్జ్ పరిమితమైనది.. పురాతనమైనది. అప్పుడప్పుడు బుర్రలోకి వచ్చే ఐడియాలకి బట్టలు తొడిగేసి బ్లాగులోకి గెంటేస్తున్నాను. ఇదంతా ఒక సరదా వ్యవహారమే. మీరు ఆలోచించి రాస్తారు. నేను రాసి ఆలోచిస్తాను. మనిద్దరికీ ఉన్న తేడా ఇదే! మీ సినిమా వ్యాసం కోసం ఎదురు చూస్తూ...

      Delete
  15. Brahmanandam Gorti8 July 2012 at 11:18

    ఆ మధ్య సదా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనుకుంటా. సరిగ్గా గుర్తులేదు.

    రకరకాల భంగిమల్లో నటీమణులని చూపిస్తారు. యాక్షన్ పేరు చెప్పి చాలా వెకిలిగా ఉంటాయి వారి చేష్టలు. మొదట్లో తెలుగు రాక బ్రతికిపోయాను. నటన కోసం నేర్చుకున్నాక అర్థమయ్యింది, వీళ్ళందరూ ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతారోనని చెప్పింది. లైటు బాయ్ దగ్గర్నుండి నిర్మాత బామ్మర్ది వరకూ సెట్స్‌పై చొంగలు కార్చుకునేవారే. స్త్రీలంటే గౌరవం లేని ఒక పరిశ్రమ అది.

    ఇవన్నీ తెలిసిన తెలుగమ్మాయిలెవరూ ముందుకొస్తారని నేననుకోను. టెక్నాలజీ ముందుకీ, సంస్కారం వెనక్కీ వెళ్ళే దిశగా సినిమా ఇండస్ట్రీ వుంది. There are so many untold outcrys behind the folded layers of the skin; white or black - it doesn't matter.

    -బ్రహ్మనందం గొర్తి

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ..

      మనమందరం గిరీశం గాడి సంతతి. నైతికత గూర్చి కబుర్లు బాగానే చెబుతాం. ఆచరణలో మాత్రం ఆమడ దూరం! ఏ రంగంలోనైనా పరాయి స్త్రీ ని ఆశగా చూస్తూ చొంగ కార్చుకునే వారికి కొదువ లేదు. కాకపోతే సినిమా రంగంలో అవకాశాలు ఎక్కువ. పబ్లిసిటీ కూడా ఎక్కువే. కాబట్టి వారి గూర్చి మాత్రమే మనకి సమాచారం ఉంటుంది.

      Delete
  16. *చిరంజీవి సొఫెస్టికేటెడ్ గా ఉన్నా*

    అప్పట్లో రామారావు రిటైర్డ్ అయినాడు, నాగేశ్వర రావు మెడను కనపడనీయకుండా(జారి పోయిన ముసలి తోలు దాచుకోవటానికి )రౌండ్ నేక్ కాలర్ చొక్కాలు, ఫుల్ షర్ట్ తో వేసుకొని శ్రీదేవితో శ్రీరంగనీతులు,జయసుధ,అప్పుడే మార్కేట్లొ వచ్చిన రాధికతో రాముడు కాదు కృష్ణుడు, రాగాదీపం మొద|| సినేమాలతో ప్రేక్షకులను హింసిస్తూ, కాలం నేట్టుకొస్తూండేవాడు. ఇక శోభన్ బాబు,కృష్ణ చూడటానికి బాగా ఉండేవారు. కాని వారినటన (35% maarks)గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా చిన్నా చితక కొత్త హీరోలు కూడా కొన్ని విజయవంత మైన సినేమాలలో నటించినా వారు ఎక్కువగా అప్పటి ట్రెండ్ ను అనుసరించి పోయేవారు. మాదాల రంగారావు లాంటి వారు ఎర్ర మార్క్ విప్లవశంఖం లాంటి సినేమాలు మంచి విజయం సాధించేవి.

    చిరంజీవి ఒక్కడే ఎంతో తెలివిగా పాత ట్రెండ్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను, తిన్నగా మొదట్లో తన నటనతో, తరువాత ఫైట్స్ తో, డాన్స్ ల తో ప్రేక్షకులను తన కనుకూలంగా మార్చుకొన్న ఏకైక నటుడు. దానికి ఆయనకి యండమూరి కథలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక అతను నటించిన ట్రెండ్ సేట్టార్ ఖైది సినేమా కి ముందు హీరో గారు ఒకసారి జైలుకి వెళితే కోర్టులో తేలేవాడు. కాని ఖైదీ సినేమాలో పోలిసువారిని బాగా కొట్టి హీరో పారిపోవటం అనే పాయింట్, అప్పటివరకు తెలుగు సినేమాలలో వచ్చినట్లు గుర్తు లేదు. పోలిసువారిని ఏ సిద్దాంతం లేకుండా వ్యక్తిగత స్థాయిలో, తనకు జరిగిన అన్యాయానికి చావ చితక కొట్టటం అనేది ఖైది తో మొదలైన ట్రేండ్. ఇది ప్రేక్షకులను చాలా ఆకట్టుకొనింది. కారణం సోషలిజం వ్యవస్థ పూర్తిగా 1980 దశాబ్దం వచ్చేసారికి పూర్తిగా విఫలం చెందిది. అప్పటి వరకు వచ్చిన ఎర్ర సినేమాల లో ఎక్కువగా ప్రభుత్వం పైన, ఉద్యోగుల పైనా విమర్శలను చేస్తూ సినేమాలు తీసేవారు. పోలిసులమీద పెద్ద ఫొకస్ చేసేవారు కాదు. ఖైది సినేమాలో పోలిసులను సామాన్య ప్రజలకు (హీరో పాత్ర తో ప్రజలు తమ కష్టాలను ఐడేంటిగికేషన్ చేసుకొంటారు) వ్యతిరేకం చూపిస్తూ, హీరో వారి మీద ఇన్స్టంట్ గా తిరగబడే విధంగా చూపిస్తారూ. ఈ తిరగబడటం ఒక వ్యక్తిగత స్థాయికి పరిమితం చేశారు, ఎర్ర సిద్దాంతం అండతో తిరగబడినట్లు చూపించరు. కాకపోతే నిర్మాత,దర్శకులకు సినేమా విజయంవంతం కావాలి,డబ్బులు రావాలి కనుక, ఆ వర్గ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి హీరొ తలకి ఒక ఎర్ర రిబ్బన్ కట్టి పరోక్షంగా సిoబాలిజం తో గుర్తుకు తెస్తూ,ఆవర్గ ప్రేక్షకులను తృప్తి పరుస్తారు.పరుచూరి బ్రదర్స్ మార్క్ కమ్యునిజం, వంటి మీద ఎర్ర శాలువా, మొహం మీద కుంకుమ బొట్టు, రాసేవి కమ్యునిజం డైలాగులు (పేద ప్రజల కష్టాల గురించి ), పని చేసేది పెట్టుబడిదారి వర్గానికి.

    మోహన్ బాబు కూడా ( బిర్లా రంగా )హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించినా, అతని వదనంలో, అతి సహజంగా ఉండే రౌడి కళ వలన నెగ్గుకు రాలేకపోయాడు. అదికాక ఆయన అప్పటికే చాలా రౌడి పాత్రలను వేసిన కారభ్ణంగా, ఆయన హీరో సినేమా వాల్ పోస్టర్లు చూసిన వారికి రౌడిగానే గుర్తుకు వచ్చేవాడు. అతను హీరో కావటానికి పాపం , అల్లుడు గారు వరకు వేచి చూడవలసి వచ్చింది. అందులో తన రౌడి ఇమేజ్ నుంచి బయటపడటానికి, మూగదైన మొదటి భార్యను పెళ్లి చేసుకోవటం, ఆమేతో ఒక బిడ్దను కనటం, ఆవేశంలో అపార్దం చేసుకొని ప్రేమించిన పెళ్లాం ను చంపి జైలుకి వేళ్లటం , బిడ్డ పెంపకానికి డబ్బుకోసం రెండో పెళ్లి తాత్కాలింగా చేసుకోవటం, పేళ్లి చేసుకొన్న అందమైన రెండో భార్యతో కాపురం చేయకుండా, ఉరిశిక్ష కోసం జైలుకి వేళ్లటం, సినేమా మొదలు నుండి చివరిదాకా, అడుగడుగునా మొహన్ బాబు తన మీద ప్రేక్షకులలో ప్రత్యక్ష, పరోక్ష్యంగా, తానునటించని సీన్లో కూడా, తనపాత్రకు సానుభూతి ఉండేటట్లు, సినేమాలో మూడూ గంటలు సింపతీ(సానుభూతి ని) ని విజయవంతంగా సృష్ట్టించుకొని, తన విలన్ ఇమేజిని సానుభూతి సహాయంతో ప్రేక్షకుల సమక్షంలో చంపేశాడు. వారి మనసులో నుంచి చెరిపివేయటంతో విజయవంతమైన తరువాత హీరోగా మారాడు :)

    పాత రోజులు గుర్తుకొచ్చాయి. డాక్టర్ గారు అలా రాసుకొంట్టు వెళ్లి పోయాను. చాలా పెద్ద వ్యాఖ్య రాశాను.
    I am Sorry.

    SriRam

    ReplyDelete
    Replies
    1. అవును. చిరంజీవికి పరిస్థితులు కలిసొచ్చాయి. దానికి అతని కామన్ మేన్ లుక్స్ కూడా ఉపయోగపడ్డాయి అని నా భావన. ఇక అతను ఎంత గొప్ప నటుడు అన్నది అతని అభిమానులకి వదిలేద్దాం లేండి!

      Delete
    2. నిస్సందేహంగా చిరంజీవి తన తరంలో ప్రజలను రంజింప చేసిన ఒక గొప్ప నటుడు. ప్రత్యేకంగా యువతను చిరంజీవి ఆకట్టుకొన్నట్లు మిగతా ఏ హీరోలు, ఏ భాషలోను అంతకాలం ఆకట్టుకొలేదనిపిస్తుంది. అతని సినేమా యాంగ్రి యంగ్ మాన్ కథ కాకపోతే ప్లాప్ అవ్వటమే అందుకు నిదర్శనం.

      చిరంజీవి = శివాజి గణేషన్ (నటన)+కమల హాసన్ (డాన్స్)+రజనీకాంత్(హీరొయిజం)

      ఈ ముగ్గురి ప్రత్యేకతలను తనలో ఇముడ్చుకొని, తనదైన నటనా శైలి గల నటుడు అని
      "కే. బాలచందర్ " అభిప్రాయం. నాది కూడ అదే అభిప్రాయం. దానితో పాటుగా ఇండియన్ సినేమాలోని పాటలను తన డాన్స్తో tO దశ,దిశ మార్చినవాడు. 1980 కాలంలో హింది సినేమాలో పాటలు మరి భావాత్మకం గా ఉండేవి. వాటిని ఎక్కువగా కాష్మీరి వాలి లో తీసేవారు, లేకపోతే ఒక సేట్టింగ్లో సాయంత్రం పార్టి పాటలు గా తీసేవారు, హీరో పాడుతూంటాడు, హీరొయిన్ పార్టికి వచ్చిన అథిదులకు డ్రింక్స్ సర్వ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూంట్టుంది, ఆమే భర్త హీరోని, హీరొయిని అనుమానం గా చూస్తూ గ్లాస్ చేతిలో పుచ్చుకొని రౌండ్ గా తిరుగూతూంటాడు. ఇటువంటి ముక్కిపోయిన హింది సినేమాపాటలు, చిరంజీవి బ్రేక్ డాన్స్ చేయటం మొదలుపెట్టిన తరువాత వాటిని అనుకరిస్తూ గోవిందా అక్కడ పరిస్థితి మార్చేశాడు. తరువాత మిగతా హీరోలకు బాగా డాన్స్ వచ్చి ఉండాలనుకోవటం ఒక తప్పనిపరిస్థితి అయింది.

      SriRam

      Delete
    3. తెలుగు సినిమాకి చాలామంది నటులున్నారు. అందరికీ అభిమానులున్నారు. ఎవరి అభిప్రాయం వారిది. మీకు చిరంజీవి గొప్ప నటుడయినట్లే ఇంకొందరికి బాలకృష్ణ గొప్ప నటుడు అవ్వొచ్చు. నే చూసిన సినిమాలన్నీ స్నేహితులతో కాలక్షేపంగా చూసినవే. అంతా సరదా వ్యవహారం. బహుశా అందువల్లనే కావచ్చు.. నాకు హీరోల పట్టింపు లేదు.

      Delete
    4. "అతి సహజంగా ఉండే రౌడి కళ వలన" -- :)

      Delete
  17. Thanks Doctor garu, Mee Psycho analytcal autopsy on telugu cinema excellent.

    A big fan of you

    ReplyDelete
  18. Hai ANDHRA FRAEUD dummu lepestunnavu,we are getting addicted to your blogs.
    sateesh

    ReplyDelete
    Replies
    1. ANDHRA FREUD! thanks! i need to grow my beard!!

      Delete
  19. యేవండోయ్ మీరు చిరంజీవినో ఇంకొకళ్లనో యేవన్నా అనుకొండి
    `గిరీశంగాడి ఏమిటండీ'??? వారు మా గురువు గారు
    ఖండిస్తన్నా

    ReplyDelete
  20. "చిరంజీవికి పరిస్థితులు కలిసొచ్చాయి. దానికి అతని కామన్ మేన్ లుక్స్ కూడా ఉపయోగపడ్డాయి అని నా భావన"

    కష్టపడకుండా కామన్ మేన్ లుక్స్ ఉన్నంత మాత్రానో లేదా పరిస్థుతులు కలిసిరావడం వలనో అంత మార్కెట్ రాదు. పిల్లల దగ్గర్నుండి పెద్దవాళ్ళ వరకు తన నటనతో మెప్పిస్తే తప్ప అంత స్టార్ ఐపోడు. టాలెంట్ ఉండి కూడా మంచి సినిమాలు చెయ్యలేదు అని మాత్రం నాకనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే,
    ఇహ మీ ఎనాలిసిస్ చాలా బాగుంది.

    ReplyDelete
  21. వాణిశ్రీ, శారదా, జయసుధ వంటి తెలుగు హీరోయిన్లను తలచుకొని తెగ బాధపడి నెట్సముద్రములో వెతుకుతూంటే మీ అధ్బుతమైన “తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!” చదివాను.
    ముళ్ళపూడి-బాపు సినిమా చూసినంత ఆనందం వచ్చింది. చాలా థాంక్యూలు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.