ఉదయం పదకొండు గంటలు. కన్సల్టేషన్ చాంబర్లో నా ఎదురుగా ఓ అందమైన యువతి. సుమారు ముప్పైయ్యేళ్ళు ఉండొచ్చు. వడ్డాది పాపయ్య బొమ్మలా ఒద్దికగా, పొందికగా ఉంది. పాలరాతి శిల్పం, దొండపండు పెదాలు అంటూ అనాదిగా ఆడవారి అందాన్ని పొగిడే పడికట్టు పదాలు రాసే ఓపిక నాకు లేదు. బ్రీఫ్ గా చెప్పాలంటే.. కాంచనమాల, మధుబాల, వైజయంతిమాలాల్ని కలిపి గ్రైండర్ లో పడేసి.. రుబ్బి అచ్చుపోస్తే.. అచ్చు ఆ యువతి రూపం వస్తుంది!
అట్టి నారీమణికి ఘోరమైన ప్రేమ సమస్య. పాపం! ఆఫీసులో తన సహచరుడంటే ఆమెకి వెర్రి ప్రేమ. అందుకే భార్యని వదిలెయ్యమని అతన్ని ఒత్తిడి చేస్తుంది. ఆ సుందరీమణి సమస్య పట్ల అవసరానికి మించిన ఆసక్తి చూపుతూ, తీవ్రంగా వింటూ (అంతకన్నా తీవ్రంగా దొంగ చూపులు చూస్తూ) ఫ్రాయిడ్ వలే (లేని) గడ్డాన్ని నిమురుకుంటూ, అప్పుడప్పుడు ప్రశ్నలడుగుతూ కేస్ నోట్ చేసుకుంటున్నాను.
"ఎందుకు? ఎందుకు రవి? నన్నింతలా వేధిస్తున్నావు? నీ భార్యని వదిలేసి నాతో లేచి రావటానికి నీకున్న ఇబ్బందేంటీ? నాతో పెట్టుకోకు. నా సంగతి నీకింకా తెలీదు. నీ పేరు మీద ఉత్తరం రాసి మరీ ఛస్తా! నిన్ను చచ్చి సాధిస్తా! నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను." అంటూ ఆవేశంతో నెత్తి కొట్టుకుంటూ, దుఃఖంతో భోరున విలపించసాగింది.
ఆ ముద్దుగుమ్మ ఏడుస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చింది!
'భగవంతుడా! ఎందుకయ్యా ఈ అపరంజి బొమ్మకి ఇంత కష్టం సృష్టించావ్! ఆ కష్టమేదో పనీపాట లేకుండా ఖాళీగా ఉన్న మా సుబ్బు గాడికి కల్పించొచ్చుగా! నో. ఈ సౌందర్యవతికి ఏ కష్టమూ రాకూడదు. రానివ్వను. వచ్చినా.. రక్షించడానికి నేనున్నాగా. డార్లింగ్! వలదు వలదు. భయం వలదు. నేనున్నా. నేనున్నాగా మై డియర్! వై ఫియర్? ఆ రవిగాడి పెళ్ళాన్ని లేపయ్యమంటావా? అసలా రవిగాణ్ణే లేపేసి నాకడ్డు తొలగించుకుంటే ఎలా ఉంటుంది?'
దాదాపు అరగంటసేపు ఆ కుందనపు బొమ్మకి అత్యంత శ్రద్ధాసక్తులతో ధైర్యం చెప్పా. 'అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే.. శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే' అంటూ వెలుగు నీడల్లో శ్రీశ్రీ రాసిన పాటని నా మాటగా మార్చుకుని ధైర్యం చెప్పా!
ఆవిడకి ఎంత ధైర్యం వచ్చిందో తెలీదు గానీ.. నా మనసు మాత్రం తేలికయ్యింది. లోలోపల నాకు నేనే ఒక ఆమీర్ ఖాన్, మహేష్ బాబులా ఫీలై పోవడం మొదలయ్యింది. 'ముత్యాలజల్లు కురిసె.. రతనాల మెరుపు మెరిసె.. వయసూ, మనసూ పరుగులు తీసె అమ్మమ్మా!' అంటూ మనసంతా తలపుల వర్షంతో తడిసి ముద్దైపోయింది!
నా డ్రీమ్ గాళ్ కుర్చీలోంచి లేచి నిలబడింది. సందేహిస్తున్నట్లు నావైపు చూసింది. (యండమూరి వీరేంద్రనాధ్ తన నవలల్లో వెయ్యి చోట్ల రాసినట్లు) క్షణంలో వెయ్యోవంతు సేపు నా దవడ కండరం బిగుసుకుంది. ఏం జరగబోతుంది? క్యా హోతా హై? వాట్ హేపెన్స్?
'పూవులాంటి తన మెత్తటి చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తుందా? ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని నాలాంటి డాక్టరు ఎందెందు వెదకినా కానరాడు అని ఎమోషనల్ అయిపోతుందేమో! ఇవన్నీ కావెహె. ఏకంగా ముద్దు పెట్టుకుని.. కమాన్ డార్లింగ్ లేచిపోదాం అంటుంది. నో! నెవర్. నా భార్యకి అన్యాయం చెయ్యలేను. చెయ్యను. ప్లీజ్! సమ్బడీ హెల్ప్ మీ. హే భగవాన్! ఏమిటి నాకీ అగ్ని పరీక్ష! ఒక నాస్తికుడిని ఇంత తీవ్రంగా పరీక్షించుట నీకు న్యాయమా?'
కుర్చీలోంచి లేచిన ఆ యువతి రెండు చేతులు జోడించింది.
"నమస్కారం బాబాయ్ గారు! మీరు నాకు కొండంత ధైర్యం ఇచ్చారు. మీ మేలు మర్చిపోలేను. మీరేమనుకోకపోతే చిన్న మాట. మీరు అచ్చు మా బాబాయిలా వున్నారు. ఆయన కూడా మీకు మల్లే పొట్టిగా, బట్టతలతో ఉంటాడు. తెలివైనవాడే కానీ కొంచెం తిక్కమనిషి. నాకు చాలా ధైర్యం చెప్పేవాడు. తను మాత్రం పిన్ని పెట్టే కష్టాలు తట్టుకోలేక ధైర్యం కోల్పోయి.. ఇల్లొదిలి పారిపోయ్యాడు. అందుకే మిమ్మల్ని బాబాయ్ అని పిలవాలనిపించింది. నమస్తే!" అంటూ డోర్ తెరచుకుని నిష్క్రమించింది .
అరిగిపోయిన తెలుగు భాషోపమానలతో నా దుస్థితిని వర్ణిస్తూ.. మొహం మీద ఈడ్చి తన్నినట్లు.. నెత్తి మీద పిడుగు పడినట్లు.. భూమి కంపించినట్లు.. గుండెల్లో గునపాలు దించినట్లు.. అంటూ చాలా రాయొచ్చు. కానీ ప్రస్తుతం నేను దుఃఖించ వలసియుంది. అంచేత ఇంతకన్నా రాయలేను. పోస్ట్ రాస్తూ.. అర్ధాంతరంగా ముగిస్తున్నందుకు క్షమించండి (నేను తీరిగ్గా ఏడ్చుకోవాలి)!
చివరి తోక : ఈ కథ పూర్తిగా కల్పితం!
(సైకాలజీ పట్ల ఆసక్తి చూపే నా స్నేహితుడు మొన్నామధ్య కలిసినపుడు 'సైకోథెరపీలో countertransference అంటే ఏమిటి?' అనడిగాడు. అతనికి సమాధానంగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నప్పుడు ఈ కథ ఐడియా పుట్టింది.)
(picture courtesy : Google)