Thursday, 25 October 2012

కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది!


ఉదయం  పదకొండు గంటలు. కన్సల్టేషన్  చాంబర్లో  నా  ఎదురుగా  ఓ  అందమైన  యువతి. సుమారు  ముప్పైయ్యేళ్ళు  ఉండొచ్చు. వడ్డాది పాపయ్య  బొమ్మలా  ఒద్దికగా, పొందికగా ఉంది. పాలరాతి శిల్పం, దొండపండు పెదాలు  అంటూ  అనాదిగా  ఆడవారి  అందాన్ని  పొగిడే  పడికట్టు  పదాలు  రాసే  ఓపిక  నాకు లేదు. బ్రీఫ్ గా  చెప్పాలంటే.. కాంచనమాల, మధుబాల, వైజయంతిమాలాల్ని  కలిపి  గ్రైండర్ లో  పడేసి.. రుబ్బి  అచ్చుపోస్తే.. అచ్చు ఆ  యువతి  రూపం  వస్తుంది!
                               
అట్టి  నారీమణికి  ఘోరమైన  ప్రేమ సమస్య. పాపం! ఆఫీసులో  తన  సహచరుడంటే  ఆమెకి  వెర్రి ప్రేమ. అందుకే  భార్యని  వదిలెయ్యమని  అతన్ని  ఒత్తిడి  చేస్తుంది. ఆ  సుందరీమణి  సమస్య  పట్ల  అవసరానికి  మించిన  ఆసక్తి  చూపుతూ, తీవ్రంగా  వింటూ  (అంతకన్నా  తీవ్రంగా  దొంగ చూపులు  చూస్తూ)  ఫ్రాయిడ్ వలే  (లేని) గడ్డాన్ని  నిమురుకుంటూ, అప్పుడప్పుడు  ప్రశ్నలడుగుతూ  కేస్  నోట్  చేసుకుంటున్నాను.

"ఎందుకు? ఎందుకు రవి? నన్నింతలా  వేధిస్తున్నావు? నీ  భార్యని  వదిలేసి  నాతో  లేచి రావటానికి  నీకున్న  ఇబ్బందేంటీ? నాతో  పెట్టుకోకు. నా  సంగతి  నీకింకా  తెలీదు. నీ  పేరు  మీద  ఉత్తరం  రాసి  మరీ  ఛస్తా! నిన్ను చచ్చి సాధిస్తా! నాకు  దక్కని  నిన్ను  ఎవరికీ  దక్కనివ్వను." అంటూ  ఆవేశంతో  నెత్తి  కొట్టుకుంటూ, దుఃఖంతో  భోరున  విలపించసాగింది.

ఆ  ముద్దుగుమ్మ  ఏడుస్తుంటే  నాక్కూడా  ఏడుపొచ్చింది!

'భగవంతుడా! ఎందుకయ్యా  ఈ  అపరంజి బొమ్మకి  ఇంత  కష్టం  సృష్టించావ్! ఆ  కష్టమేదో  పనీపాట  లేకుండా  ఖాళీగా  ఉన్న మా  సుబ్బు గాడికి  కల్పించొచ్చుగా! నో. ఈ  సౌందర్యవతికి  ఏ  కష్టమూ  రాకూడదు. రానివ్వను. వచ్చినా.. రక్షించడానికి  నేనున్నాగా. డార్లింగ్! వలదు వలదు. భయం వలదు. నేనున్నా. నేనున్నాగా  మై డియర్! వై  ఫియర్? ఆ  రవిగాడి  పెళ్ళాన్ని  లేపయ్యమంటావా? అసలా రవిగాణ్ణే  లేపేసి  నాకడ్డు  తొలగించుకుంటే  ఎలా  ఉంటుంది?'
                     
దాదాపు  అరగంటసేపు  ఆ కుందనపు బొమ్మకి  అత్యంత  శ్రద్ధాసక్తులతో  ధైర్యం  చెప్పా. 'అగాధమౌ  జలనిధిలోనా  ఆణిముత్యమున్నటులే.. శోకాల  మరుగున  దాగి  సుఖమున్నదిలే' అంటూ  వెలుగు నీడల్లో  శ్రీశ్రీ  రాసిన  పాటని  నా  మాటగా  మార్చుకుని  ధైర్యం  చెప్పా!

ఆవిడకి  ఎంత  ధైర్యం  వచ్చిందో  తెలీదు గానీ.. నా  మనసు  మాత్రం  తేలికయ్యింది. లోలోపల  నాకు  నేనే  ఒక  ఆమీర్ ఖాన్, మహేష్ బాబులా  ఫీలై పోవడం  మొదలయ్యింది. 'ముత్యాలజల్లు  కురిసె.. రతనాల  మెరుపు  మెరిసె.. వయసూ, మనసూ  పరుగులు  తీసె  అమ్మమ్మా!' అంటూ  మనసంతా  తలపుల  వర్షంతో  తడిసి  ముద్దైపోయింది!
                           
నా  డ్రీమ్ గాళ్  కుర్చీలోంచి  లేచి  నిలబడింది. సందేహిస్తున్నట్లు  నావైపు  చూసింది. (యండమూరి వీరేంద్రనాధ్ తన  నవలల్లో  వెయ్యి చోట్ల  రాసినట్లు) క్షణంలో  వెయ్యోవంతు సేపు  నా  దవడ కండరం  బిగుసుకుంది. ఏం  జరగబోతుంది? క్యా హోతా హై? వాట్  హేపెన్స్?

'పూవులాంటి  తన  మెత్తటి చేత్తో  షేక్ హ్యాండ్  ఇస్తుందా? ఆనందంతో  గట్టిగా  కౌగిలించుకుని  నాలాంటి  డాక్టరు  ఎందెందు వెదకినా  కానరాడు  అని  ఎమోషనల్  అయిపోతుందేమో! ఇవన్నీ  కావెహె. ఏకంగా  ముద్దు  పెట్టుకుని.. కమాన్  డార్లింగ్  లేచిపోదాం  అంటుంది. నో! నెవర్. నా  భార్యకి  అన్యాయం  చెయ్యలేను. చెయ్యను. ప్లీజ్! సమ్బడీ  హెల్ప్ మీ. హే భగవాన్! ఏమిటి  నాకీ  అగ్ని పరీక్ష! ఒక  నాస్తికుడిని  ఇంత  తీవ్రంగా  పరీక్షించుట  నీకు  న్యాయమా?'
                             
కుర్చీలోంచి  లేచిన  ఆ  యువతి  రెండు చేతులు  జోడించింది.

"నమస్కారం  బాబాయ్ గారు! మీరు  నాకు  కొండంత  ధైర్యం  ఇచ్చారు. మీ  మేలు  మర్చిపోలేను. మీరేమనుకోకపోతే  చిన్న మాట. మీరు  అచ్చు  మా  బాబాయిలా  వున్నారు. ఆయన  కూడా  మీకు మల్లే   పొట్టిగా, బట్టతలతో  ఉంటాడు. తెలివైనవాడే  కానీ  కొంచెం  తిక్కమనిషి. నాకు  చాలా  ధైర్యం  చెప్పేవాడు. తను మాత్రం  పిన్ని  పెట్టే  కష్టాలు  తట్టుకోలేక  ధైర్యం  కోల్పోయి.. ఇల్లొదిలి  పారిపోయ్యాడు. అందుకే  మిమ్మల్ని  బాబాయ్  అని  పిలవాలనిపించింది. నమస్తే!" అంటూ  డోర్  తెరచుకుని  నిష్క్రమించింది .        

అరిగిపోయిన  తెలుగు  భాషోపమానలతో  నా  దుస్థితిని  వర్ణిస్తూ.. మొహం మీద  ఈడ్చి తన్నినట్లు.. నెత్తి మీద  పిడుగు  పడినట్లు.. భూమి కంపించినట్లు.. గుండెల్లో  గునపాలు  దించినట్లు.. అంటూ  చాలా  రాయొచ్చు. కానీ  ప్రస్తుతం  నేను  దుఃఖించ వలసియుంది. అంచేత  ఇంతకన్నా  రాయలేను. పోస్ట్  రాస్తూ.. అర్ధాంతరంగా  ముగిస్తున్నందుకు  క్షమించండి (నేను  తీరిగ్గా  ఏడ్చుకోవాలి)!

చివరి తోక : ఈ  కథ  పూర్తిగా  కల్పితం!

(సైకాలజీ  పట్ల  ఆసక్తి  చూపే  నా  స్నేహితుడు  మొన్నామధ్య  కలిసినపుడు  'సైకోథెరపీలో  countertransference  అంటే  ఏమిటి?' అనడిగాడు. అతనికి  సమాధానంగా  కొన్ని  ఉదాహరణలు  చెబుతున్నప్పుడు  ఈ  కథ  ఐడియా  పుట్టింది.)

(picture courtesy : Google)      

29 comments:

  1. I like the disclaimer.... LOL - Gowtham

    ReplyDelete
    Replies
    1. డియర్ గౌతం,

      నా పోస్టుకి ఈ 'చివరి తోక' చాలా ఇంపార్టెంట్. లేనిచో చదివినవారు సైకియాట్రిస్టుల్ని అపార్ధం చేసుకునే డేంజరపాయం కలదు.

      Delete
  2. డియర్ రమణ, కౌంటర్ ట్రాన్స్‌ఫరెన్స్ కథ అదిరింది! ఐతే, నీ సినిమా హీరొయిన్ల టేస్ట్ లో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. కాంచనమాల - పాతా. కొత్తా? పోని, కాంచన అయినా బాగుండేది (హైట్ మిగతా ఇద్దర్తో ఫిక్స్ చెయ్యొచ్చు). వైజయంతిమాల? ఆర్ యు కిడ్డింగ్?! మధుబాల పర్లేదు. ఈ యెస్టర్ ఇయర్ హీరొయిన్లని పిక్ చేసింది అందానికంటే ప్రాసకొసం లా ఉంది (మాల, మాల, బాల)!
    బి ఎస్ ఆర్

    ReplyDelete
    Replies
    1. డియర్ బి ఎస్ ఆర్,

      అవును. కొద్దిగా ప్రాస కోసం పాకులాడుతూ ఉంటాను. ఇదో రోగం. అయితే నే రాసిన 'మాల, బాల, మాల'లు వారి ప్రైం టైం లో అందగత్తెలుగా గుర్తింపు పొందారు. కాబట్టి ప్రాస కూడా కుదిరింది!

      మీకు కాంచనమాల తెలీకపోవడం ఆశ్చర్యం! ఆవిడ చిత్తూరు నాగయ్య హీరోయిన్. (some information about Kanchanamala not related to the topic - she suffered from paranoid schizophrenia.)

      Delete
    2. బుల్లబ్బాయ్25 October 2012 at 10:31

      ఈయన్ని బాబాయ్ గారూ అని ఊరికే అన్లేదు... అమ్మడి కి టెలీపతీ వుండుంటది.. డాట్రు గారి బుర్రలో తిరుగుతున్న హీరోవిన్లని పసికట్టుంటది

      Delete
    3. డియర్ బుల్లబ్బాయ్,

      చూస్తుంటే మీకు ఆవిడ నన్ను 'బాబాయ్!' అని పిలవడం అనందం కలగజేసినట్లుంది. ఇంకా నయం! 'తాతయ్యగారు!' అననందుకు సంతోషం.

      Delete
  3. డాక్టర్ గారు,


    మీరు పొట్టీ అనుకుంటున్నారు గాని మీరు పొట్టేమి కాదు సార్,


    అదేవిదంగా మీరు "ఈ కథ పూర్తిగా కల్పితం" అని రాసారు బహుశా ఇది పూర్తి అబద్దం అనుకుంటా.ఇంట్లో వాల్లని సాటిస్ఫై చేయడానికి అలా రాసివుంటారు.

    "ఏకంగా ముద్దు పెట్టుకుని.. కమాన్ డార్లింగ్ లేచిపోదాం అంటుంది"
    అహా ఇలా జరిగితే మీరు చాలా అద్రుష్టవంతుడిలాగా ఫీలయ్యే వారేమొ.

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
    Replies
    1. డియర్ రమేష్ బాబు,

      నేను countertranference మీద సరదాగా ఒక సన్నివేశం రాశాను. ఆ సంగతి చాలా స్పష్టంగా చెప్పాను కూడా! అయినా మీరు నమ్మకపోవటం అన్యాయం.

      ఇక నా సంగతి ప్రస్తావించారు కాబట్టి చిన్న వివరణ. నేను నర్స్ పక్కన లేకుండా ఆడవారిని వంటరిగా చూడను. కాబట్టి నాకు ఈ పోస్టులో రాసిన పరిస్థితి రాదు.

      ఈ పోస్ట్ సరదాగా కాకుండా ఇంకోలా అర్ధం చేసుకోకూడదనే పబ్లిష్ చెయ్యడానికి సందేహించాను. జాగ్రత్తగా disclaimer రాశాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు.

      దయచేసి ఈ పోస్టులోని 'నేను' నేను కాదని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

      Delete
    2. @ ఇక నా సంగతి ప్రస్తావించారు కాబట్టి చిన్న వివరణ. నేను నర్స్ పక్కన లేకుండా ఆడవారిని వంటరిగా చూడను. కాబట్టి నాకు ఈ పోస్టులో రాసిన పరిస్థితి రాదు.

      అక్కడ నర్సు ను పురమాయించింది ఎవరండీ ?

      Delete
  4. ఆనల్లని వీపు రుద్దని జీవితం ఎందుకు. నా మెడచుట్టూ హారం వలే చేతులు వేచి నా చేతిలొ ఇమడక పొగరుతొ ఎదురు తిరిగే నా సఖి యక్కడ. పేలిపొయిన మొహంతొ ఉస్స్ కస్స్ అబ్బ నొప్పి వదలండి అనే ఈ పొయ్యకాడి బర్యలెక్కడ. ఆ చిరునవ్వు కొసం ఈ రాత్రికి నా బార్యను చంపడానికైనా సిద్దం.

    ReplyDelete
  5. >> అసలా రవిగాణ్ణే లేపేసి నాకడ్డు తొలగించుకుంటే ఎలా ఉంటుంది?

    ఈ డాక్టర్ నాకు తెలుసు. గత జన్మలో టి.బి. స్పెషలిస్టు. పేరు Colenso Ridgeon. :P

    >> దాదాపు అరగంటసేపు ఆ కుందనపు బొమ్మకి అత్యంత శ్రద్ధాసక్తులతో ధైర్యం చెప్పా.

    ఇలా ఐతే కథ నడిచేదెలాగండీ? "ఇదిగో మాల+బాల+బేలా! ఆ రవి గాడికి కొంచెం కౌన్సెలింగు చెయ్యాలి. వాణ్ణి నాకు అప్పజెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటా" అని చెప్పాలి. :)

    ReplyDelete
    Replies
    1. డియర్ త్రివిక్రమ్,

      మంచి వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఈ పోస్ట్ రాసి పొరబాటు చేశానా? అన్న డైలమాలో ఉన్నాను.

      Delete
  6. టపా ఆద్యంతం హాస్యంగా ఎంతో నవ్వును తెప్పించిందండి.

    అయితే, మహిళా రోగులు మానసిక ఆసుపత్రికి వెళ్ళి తమ కష్టాలను చెప్పుకోవాలంటే కొంచెం ఆలోచించవలసివచ్చేటట్లుంది.

    ReplyDelete
    Replies
    1. anrd గారు,

      డాక్టర్ కూడా మనిషే. సమాజంలో గల ఆవలక్షణాలు వాడికీ ఉంటాయి. సైకియాట్రీ ట్రైనింగ్ లో (మొదటి రోజుల్లో) కుర్ర డాక్టర్లు ఆపోజిట్ సెక్స్ పేషంట్లకి ఆకర్షితులవడం అక్కడక్కడా కనబడుతుంది. ఈ సమస్య వల్ల ఆ డాక్టరు కూడా ఇబ్బంది పడతాడు. అయితే.. కన్సల్టెంట్ స్థాయికి చేరుకున్న తరవాత ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ వస్తుంది. క్లినికల్ ఇష్యూస్ తప్ప మైండ్ లోకి వేరే విషయాలు పోవు. కాబట్టి ఆడవారు నిరభ్యంతరంగా డాక్టర్లని కలుసుకోవచ్చు.

      నే రాసింది కేవలం హాస్యం కోసం మాత్రమే. తెలుగు బ్లాగర్లు ఈ పోస్ట్ చదివి డాక్టర్లని అపార్ధం చేసుకోరనే అభిప్రాయంతో రాశాను. ఒకవేళ నా రాత ఆ అభిప్రాయం కలుగచేస్తున్నట్లయితే ఈ పోస్ట్ ఉపసంహరించుకోవటానికి నేను రెడీ. నా బ్లాగ్ రాతలు అప్పటికప్పుడు పుట్టుకుచ్చే ఆలోచనలకి అక్షర రూపం. వాటికంత ప్రాధాన్యత లేదు.

      Delete
    2. అందరు ఆడవాళ్ళకు ఇబ్బందులు వుండవు. ఆకర్షణీయంగా, అందంగా అనిపించే వారికి మాత్రమే అని చెప్పాలి. వుదాహరణకు మా పక్కింటి బోండాం ఆంటి. నాలుగిళ్ళవతల వుండే నల్ల తుమ్మ అమ్మాయి.

      Delete
  7. బాధ పడకండి డాట్టరు గారూ! కీచకుడు, దుర్యోధనుడు లాంటి మహామహులకే తప్పలేదీ బాధలు, మనమెంత!! పాపం ఆమె ఇచ్చిన షాక్ కి మీ మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది. మీ నర్సు కి చెప్పి మోకాలిపై చిన్న సుత్తితో నెమ్మదిగా కొట్టించండి. ఫలితం కనబడొచ్చు :) మాకు మల్లెమాల, గులాబీ మాల, సంపెంగ మాల గ్రైండర్ లో వేసి పేడలా తయారుచెయ్యటం వచ్చుగాని ఇలా కాంచనమాల, మధుబాల, వైజయంతీమాల లని కూడా గ్రైండర్ లో వేసి రుబ్బొచ్చా? హొమిసైడ్ కేసు అవుతుందేమో! మీ వివరణ బట్టి మీ క్లినిక్ కి వచ్చిన అమ్మాయి ఎవరో మాకు తెలుసు. "టాటా బిర్లా మధ్యలో లైలా" అని ఓ సినిమాలో లైలా గా నటించింది ఆ అమ్మాయే కదూ!

    ReplyDelete
    Replies
    1. డియర్ శ్రీ సూర్య,

      సలహాకి ధన్యవాదాలు. ఆ షాకుకి మెదడు మొద్దు బారడమేం ఖర్మ! ఏకంగా పని చెయ్యడమే మానేసింది. అంచేత మోకాలికి రెండు కరెంటు షాకులు ఇప్పించుకున్నా. ఇప్పుడు పర్లేదు. కొద్దిగా గుణం కన్పిస్తుంది.

      Delete
  8. Very informative. Thanks for sharing. After searching the word 'countertransference' I get to learn more about it now. I think even common folks that are not related to medical profession can feel this. It could be a manger listening to problems faced by his employees or a father/mother listening to kids complaining thus personal feelings effect decision making and result in favoritism. Ofcourse this story is fiction and those who took it to be real thing needs a special session from you ;) thank you for simplifying the concept in a humorous story.

    ReplyDelete
    Replies
    1. చాతకం గారు,

      ఈ రోజుల్లో డాక్టర్లు మీడియా ద్వారా అవసరం అయిన దానికన్నా ఎక్కువే ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇది వారి ప్రాక్టీస్ పెరగడానిక్కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీషు రానివారి కోసం కష్టపడి ఈ మెడికల్ సైన్స్ ని అనువాదం చేసేవారు కూడా ఉన్నారు. ఇందువల్ల సమాజానికి ఎంతమేరకు ఉపయోగం అన్నది ఆలోచించవలసి ఉంది. నేనీ టపా ఎడ్యుకేషనల్ పర్పస్ తో రాయలేదు. హాస్యం కోసం మాత్రమే రాశాను. నేనిలా రాయడం నా కొలీగ్స్ కొందరికి ఇష్టం లేదు.. సీరియస్ సబ్జక్టుని అపహాస్యం చేస్తున్నట్లు అవుతుందని. అదీ నిజమే. పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం.

      Delete
  9. " నాకు చాలా ధైర్యం చెప్పేవాడు. తను మాత్రం పిన్ని పెట్టే కష్టాలు తట్టుకోలేక ధైర్యం కోల్పోయి.. ఇల్లొదిలి పారిపోయ్యాడు"

    ఈ వాక్యం అదిరింది. నిజమే సైక్రియార్టిస్ట్ లు చాలా ధైర్యంగా మాట్లాడుతారు,వారంతటి ధైర్యం ,కాంఫిడేన్స్ ఈ దేశ ప్రధానికి కూడా ఉండవేమో అని అనిపిస్తుంది. కొన్ని రోజుల తరువాత తెలిసిందేమిటంటే వీరు చిన్నసైజు బాబాల లాంటి వారు. మాటలతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. మరి తేడ కేసుకనిపిస్తే నిద్ర వచ్చే మాత్రలు రాసిస్తారు. ఇంకా మొండిగటాలు తగిలితే లిథియం ట్రిట్మెంట్ ఇస్తారు. ఇంతకుమించి మనిషి మైండ్ ను రిపేర్ చేయటానికి ఎమీ కొత్తగా కనుగొన్నట్లు లేదు.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాతా,

      పిన్ని బాధ తట్టుకోలేక పారిపోయిన బాబాయ్ సైకియాట్రిస్ట్ కాదు. పోస్ట్ మరొకసారి చదువుకోగలరు.

      సైకియాట్రిస్టులు చిన్న సైజు బాబాల వంటివారనే మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను!

      Delete
  10. అమ్మాయ్ ఎంటపడతా వస్చా ఉన్యా, లటక్కున మాయం అయ్యింది. నీకాడికొచ్చిందా మాయ్యా
    [తను మిమ్ము బాబాయ్ అంటే మీరు మా అందరికీ మాయ్యే కదా డాట్రు మాయ్యా]

    ReplyDelete
    Replies
    1. అయ్యా కీచక రామరాజు గారు,

      తమరి కళాహృదయం నేనేరుగనిదా! కానీ ఇది నిండు బ్లాగు. ఈ బ్లాగు మర్యాద కాపాడుట మీ కర్తవ్యం.

      'నీవా నాకు బ్లాగు మర్యాద నేర్పునది. తెల్లవారే లోపు ఆ సుందరి నా మందిరానికి రావాలి. లేదా.. నీ బ్లాగు మండలాన్నే సర్వనాశనం చేస్తా.'

      ('నర్తనశాల' చూసే ఉంటారు.)

      Delete
    2. కీచక రామరాజు
      ____________

      KEVVVVVVVVV!

      Delete
    3. కీచక రామరాజు
      ____________

      KEVVVVVVVVV!

      Delete
  11. ఎదురు గా ఉన్న భామా మణి ఫ్లాషు బ్యాకు కాలపు హీరోయిన్ ల మేలైన కలయిక గాను, డాట్రారు గారి ఫీలింగు ఈ కాలపు మహేష్ బాబు అమీరు పోలి ఉండడమును సైకాలజీ పరిభాషలో ఏమందురో డాట్రారు గారు సవివరం గా వివరించ వలెను!

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      మామూలు మనుషుల ఆలోచనలని అర్ధం చేసుకోవడమే కష్టంగా ఉంది. ఇంక సైకియాట్రిస్ట్ గాడి ఆలోచనలు కూడా విశ్లేషించడం మొదలెడితే బుర్ర పేలిపొతుంది. కాబట్టి అదేదో మీరే చేసుకోవలసిందిగా విజ్ఞప్తి!

      Delete
  12. బాగుందండి అయినా డాక్టర్ గారు మనసులో ఉన్న కోరికలే ఇలా ఏదో ఒక రూపం లో బయట పడతాయని అంటారు కదా ? మీ సంగతేమిటి ?
    చిన్న మాట క్షణం లో వెయ్యో వంతు మాట యండమురిది కాదనుకుంట ... మధుబాబు షాడో అని అలంటి వారిది

    ReplyDelete
    Replies
    1. buddha murali గారు,

      ఆకర్షణీయంగా ఉండే ఆపోజిట్ సెక్స్ మీద అవసరానికి మించిన శ్రద్ధ చూపించడం మానవ నైజం! కాదనడానికి మనమెవరం?!

      నేను కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలన్నీ చదివేశాను. మధుబాబుని చదివిన గుర్తు లేదు. (మరప్పుడు ఈ క్షణంలో వెయ్యోవంతు ఎక్కణ్ణుంచొచ్చిందో!)

      Delete

comments will be moderated, will take sometime to appear.