Thursday 18 October 2012

సమాజానికి నా సందేశం

"ఏమిటోయ్ నీ వెధవ రాతలు? పొద్దస్తమానం ఉప్మాపెసరట్టు, సాంబారు అంటూ నానా చెత్త రాస్తావు! ఏదీ లేకపోతే చిన్నప్పటి దరిద్రపుగొట్టు జ్ఞాపకాలు. కొద్దిగా స్థాయి పెంచు. నువ్వు డాక్టరువి. సమాజానికి సందేశమిస్తూ గొప్ప సంగతులు రాయి. అంతేగానీ బురద పందులు, కోళ్ళూ, కుక్కల గురించి కాదు. "

హాస్పిటల్లోకి అడుగు పెట్టంగాన్లే నా క్లాస్ మేట్ "డా. సు. గాడు" దగ్గర్నుండి ఫోన్! సాధారణంగా వీడు నాకు ఫోన్ చెయ్యడు. చేసాడంటే ఏదో క్లాసు పీకడానికే అయ్యుంటుంది. లోకంలో తెలివైనవాళ్ళు చాలామందే ఉంటారు, అయితే తాము తెలివైనవాళ్ళమనే నమ్మకాన్ని కొందరే కలిగుంటారు. ఆ కొందర్లో ఒకడు ఈ డా.సు.గాడు. అంతేకాదు.. తమ తెలివితేటల నమ్మకాన్ని శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమిలి పించెం ధరించినట్లుగా.. సర్వకాల, సర్వావస్థలయందు ధరించియే ఉండవలెనన్నది డా.సు.గాడి ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కాదన్నవాడు, తెలివి తక్కువ మేధావి అని కూడా అతని నమ్మకం.  

"నాకు తోచింది రాస్తున్నాను. అయినా సమాజాన్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి తెలుగునాట యోధులైన మేధావులనేకులున్నారుగా! మళ్ళీ నేనెందుకు?" అన్నాను.

"నీ బొంద. నువ్వీ జన్మకి మారవు." అంటూ టపీమని  ఫోన్ పెట్టేశాడు నా స్నేహరత్నం.

నాకు మండిపోయింది. నా రాతలు బాలేకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. దానికీ ఓ పద్ధతుంది. అంతేగానీ ఇట్లా ఫోన్ చేసి మరీ తిట్టాలా? నా జీవితానికి ఈ డా. సు. గాడు శనిలా దాపురించాడు. పేషంట్లని చూస్తున్నానేగానీ డా. సు. గాడి వల్ల మూడాఫ్ అయిపోయింది.

లాభం లేదు. ఈ డా. సు. గాడికి బుద్ధి చెప్పాలి. ఒక గొప్ప సామాజిక స్పృహతో హెవీగా, గంభీరంగా ఒక సందేశం రాసేస్తే? అవును. రాసెయ్యాలి. అప్పుడు గానీ డా. సు. గాడు కుళ్ళుకుచావడు. అంతలోనే ఒక సందేహం. 'ఈ రోజుల్లో సందేశాలు చదివే వాడెవడు?'

అయినా చదివేవాడి తిప్పలు నాకెందుకు? ఈరోజుల్లో చదివేవాడి కన్నా రాసేవాళ్ళే ఎక్కువైపొయారు. అందుకే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. 'రాయుటకు నీవెవరు? చదువుటకు వాడెవడు? రాయునదీ చదువునదీ అంతా నేనే!' అంచేత నా కర్తవ్యము నేను నిర్వహించెద. ఈ డా. సు. గాడి నోరు మూయించెద!

"రవణ మావా! కాఫీ!" అంటూ వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బు రా! భలే సమయానికొచ్చావ్. తాజావార్త. ఇప్పుడే ఒక కఠోర నిర్ణయం తీసుకోబడింది. ఇకనుండి నా బ్లాగు సమాజిక స్పృహ, సందేశాలకి కేరాఫ్ ఎడ్రెసుగా మారబోతుంది." అన్నాను.

"నువ్వా! సందేశమా!!" ఆశ్చర్యపొయ్యాడు సుబ్బు.

"అవును." సుబ్బుని సీరియస్ గా చూస్తూ అన్నాను.

"సరే! నువ్వంత భీకర నిర్ణయం తీసేసుకుంటే కాదనడానికి నేనెవర్ని? ఇంతకీ ఏం సందేశాలు ఇవ్వబోతున్నావ్?" అడిగాడు సుబ్బు.

ఒక క్షణం ఆలోచించాను.

"కాదేది సందేశానికనర్హం? ఇవ్వాళ న్యూట్రిషన్ గూర్చి గొప్ప వ్యాసం రాసేస్తా. 'మీ తిండి గూర్చి తెలుసుకోండి. తినండి. తినిపించండి. పోషక పదార్ధాలతో కూడిన బలవర్దకమైన ఆహారము, అలవాట్లు.. శుచీ శుభ్రత.' ఎలా ఉంది?" అడిగాను.

"మిత్రమా! కొంచెం ఆలోచించు. మనం పీపాల కొద్దీ కాఫీ తాగాంగానీ ఏనాడన్నాగుక్కెడు పాలు తాగామా? టైం ప్రకారం భోంచేశామా? మన గురవయ్య హైస్కూల్ గోడ పక్కనుండే చంద్రం బండి ముందు ఉప్పూ, కారం రాసిన పచ్చిమామిడి బద్దలు లెక్కలేనన్ని తిన్నాం. దండిగా కలరు సోడాలు తాగాం. చంద్రం ఫుడ్ అంత శుచికరమైన ఆహారం కాదనుకుంటా! బ్రాడీపేట ఐదోలైన్లో తిన్న మిరపకాయ బజ్జీలు, బ్రిడ్జ్ డౌన్ లో తిన్న ముంతకింద పప్పు బలమైన ఆహారం అవుతుందా? కాకా హోటళ్ళ దగ్గరనుండి శంకర విలాస్ దాకా అన్నిహోటళ్ళకి మహారాజ పోషకులం. మరీ ఇంత ఘోరమైన అబద్దాలు ఆడుట నీకు తగునా?" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

నిజమే కదూ! కడుపు  చించుకుంటే  కాళ్ళ మీద  పడుతుంది. ఈ  ఏరియాలో  మన  ట్రాక్  రికార్డ్  పరమ  చండాలంగా ఉంది. మళ్ళీ  మరొక  క్షణం  ఆలోచించాను.

"ఐడియా. భారతీయ విద్యావిధానం  గూర్చి  చుక్కా రామయ్య  స్టైల్లో  రాసేస్తా. సంపూర్ణ  అక్షరాస్యత  ఆవశ్యకతని  నొక్కి  వక్కానిస్తూ.. అద్దిరిపొయ్యే  పోస్టొకటి  రాస్తా. 'విద్య  లేని వాడు  వింత పశువు. చదువనే  ఆయుధంతో  ఈ  అజ్ఞానాంధకారములని  పారద్రోలుదుము. చదువుకుందాం  రండి. రోజూ  బుద్ధిగా  చదువుకోండి. సమాజాభివృద్ధికి  మీ వంతు  కృషి  చెయ్యండి.' కాన్సెప్ట్  ఎలా  ఉంది? అదిరింది కదూ!" ఉత్సాహంగా  అడిగాను.

ఇంతలో  కాఫీ  వచ్చింది.

"ఏడిసినట్లుంది. యేడాదంతా  అడ్డగాడిదలా  పోలీస్  పరేడ్  గ్రౌండ్లో  క్రికెట్  ఆడుకుంటూ.. చూసిన  సినిమానే  మళ్ళీ మళ్ళీ  చూస్తూ.. పరీక్షల  ముందు  హఠాత్తుగా  స్పృహ  తెచ్చుకుని.. కొంపలు  మునిగిపోతున్నట్లు  హడావుడిగా  రాత్రింబవళ్ళు  చదివి  ఎక్జామ్స్  గట్టెక్కిన  నువ్వు  చదువు  గూర్చి  నీతులు  చెప్పినట్లయితే  జయమాలిని  జరీ చీర  కట్టినంత  ఎబ్బెట్టుగా  ఉంటుంది." కాఫీ  సిప్  చెస్తూ  అన్నాడు  సుబ్బు.

"ఏవిటోయ్  నీ  వెధవ గోల? అటు  శాస్త్రీయ విషయాల  చెప్పనీకుండా, ఇటు  చదువు వంటి  గొప్ప  సబ్జక్టు  రాయనీకుండా  అడ్డుపడితే.. నేను  సమాజానికి  సందేశమెలా  ఇవ్వాలి?" విసుక్కున్నాను.

"ఈ  సమాజం  ప్రస్తుతం  ప్రశాంతంగానే  ఉంది. నీ  అనవసరపు  బీభత్స సందేశంతో  దాన్ని  అల్లకల్లోలం  చేసేస్తావని  భయంగా  ఉంది. అసలింతకీ  ఈ  సందేశాల  గోలేంటి?" కుతూహలంగా  అడిగాడు  సుబ్బు.

పొద్దున  డా. సు. గాడి  ఫోన్  చేసి  మరీ  తిట్టిన  సంగతి  చెప్పాను. ఇప్పుడర్జంటుగా  ఉన్నత  విలువలతో, ఉదాత్తమైన  ఒక  టపా  రాసి  డా. సు. గాణ్ణి  దెబ్బ  కొట్టాలన్నదే  నా  జీవితాశయం.

"ఇందాకట్నుండి  నువ్వు  పడుతున్న  ఆవేశాయాసానికి  కారణం  ఇప్పుడర్ధమైంది! అయితే  సరే! నా  అభిప్రాయం  కూడా  విను. సమాజానికి  సందేశాలు, సుభాషితాలు  రాసేవారు  వేరే  ఉన్నారు. మనకి  రెండు రకాల  ప్రపంచాలున్నాయి. ఒక రకం  ప్రపంచంలో  మనలాంటి  సాధారణ  మనుషులుంటారు. మనకి  ఆకలేస్తే  తింటాం. దగ్గొస్తే  దగ్గుతాం. మన  గోల  మనదే. ఎవరికీ  సలహాలివ్వం. ఎవరికీ  హాని  కూడా  చెయ్యం. ఇది  వాస్తవ ప్రపంచం." అంటూ  ఖాళీ కప్పు  టేబుల్  మీద  పెట్టాడు  సుబ్బు.

"రెండో రకం?" ఆసక్తిగా  అడిగాను.

"మన  డా. సు. గాళ్ళ  లోకం. వారు  సభ్య ప్రపంచం  దృష్టిలో  ఉత్తమ జీవులు. 'గాలి పీల్చడం  ఎలా? అరటి పండు  తొక్కతో  తినాలా? తొక్క  వలిచి  తినాలా? దురద  పుడితే  ఎలా  గోక్కోవాలి?' అంటూ  మనకి  అనేక  విషయాల్లో  విజ్ఞానాన్ని  అందిస్తారు. దేవుడు  దగ్గర్నుండి  దేశభక్తి  దాకా  అన్నీ  పద్ధతిగా  విశ్లేషించి  మన  అజ్ఞానాన్ని  పారద్రోలుదురు. సమాజాన్ని  ఉద్ధరించడం  కోసం  తమ  జీవితాన్నే  త్యాగం  చేయుదురు."

"ఈ  సమాజంలో  అట్టి వారికే  గౌరవం." నవ్వుతూ  అన్నాను.

"అవును. వాళ్ళు  రాసేది  కూడా  ఆ  గౌరవం  కోసమే. కలిసొస్తే  కొన్ని  అవార్డులు, రివార్డులు  కూడా  నడిచొస్తాయి. అందుకే  వారి  సుభాషితాలు  ఎవరన్నా  ఫాలో  అవుతున్నారా? లేదా? అన్నది  వారికనవసరం."

"అంటే?"

"మన  గురవయ్య  హై  స్కూలు  హెడ్ మాస్టార్  గుర్తున్నారా? ఆయన  'సత్యము  పలుకుము.' 'పెద్దలను  గౌరవించుము.' అంటూ  మనకి  అర్ధంకాని  పెద్దపెద్ద మాటల్ని  స్కూలంతా  తాటికాయంత  అక్షరాల్తో  గోడల  మీద  రాయించారు. అవి  చదివి  మనమెప్పుడన్నా  నిజాలు  చెప్పామా? అబద్దాలు  చెప్పి  ఎన్నిసార్లు  స్కూలెగ్గొట్టలేదు? ఇంట్లో  కంబైన్డ్  స్టడీ  పేరు  చెప్పి  ఎన్నెన్ని  సినిమాలు  చూశాం! మనకేనాడన్నా  ఆ  సూక్తులు  ఫాలో  అవ్వాలనిపించిందా? లేదు  కదా! అదీ కథ. అనగా.. సందేశాలిచ్చి  మన  హెడ్ మాస్టరు గారు  ఆయన  పని  ఆయన  చేసుకున్నాడు. అవేవీ  పట్టించుకోకుండా  మన  పని  మనం  చేసుకున్నాం. సాధారణగా  నీతివాక్యాలకి  పట్టే  గతి  ఇదే!" అంటూ  టైం  చూసుకుని  లేచాడు  సుబ్బు.

"సుబ్బూ! మరీ  నెగెటివ్ గా  మాట్లాడుతున్నావ్." అన్నాను.

"వాస్తవాలు  మాట్లాడుతున్నాను. ముందు  నువ్వా  డా. సు. గాడి  ప్రభావంలోంచి  బయటికి  రా! ఓపెన్ మైండ్ తో  ఆలోచించు. ఈ  రోజుల్లో  గిరీశాలకి  గిరాకీ! అవకాశం  దొరికితే  ప్రతొక్కడూ  సౌజన్యారావు పంతులే! 'కన్యాశుల్కం' లో  నా  ఫేవరెట్  క్యారెక్టర్  మధురవాణి. ఆ  నాటకంలో  ఒక్క  మధురవాణి  మాత్రమే  ఫెయిర్  థింకింగ్  పెర్సన్  అని  నా  అభిప్రాయం. సౌజన్యారావు పంతులు  మార్కు  నీతులు  చెప్పే  దేవతల  భాష  నా  వంటికి  సరిపడదు. నువ్వా  కేటగిరీలోకి  వెళ్ళాలని  ముచ్చట  పడితే  బెస్టాఫ్ లక్! నీక్కావలసిన  గౌరవం, కీర్తి  టన్నుల  కొద్దీ  లభించుగాక!" అంటూ  నిష్క్రమించాడు  సుబ్బు.

'ఇప్పుడు  నేను  సమాజానికి  సందేశం  ఇవ్వాలా? వద్దా?' బుర్ర  గోక్కున్నాను!

(photo courtesy : Google)

40 comments:

  1. నా మొట్ట మొదటి అన్సర్వేషన్. ఇవాల కాఫీ పొగలు కక్కలేదు !!

    ReplyDelete
    Replies
    1. అవును. ఇక నుండి ఈ బ్లాగులో కాఫీ పొగలు కక్కదు!

      మొన్నామధ్య ఈ పొగలు కక్కడం వెనక ఫిజిక్స్ అడిగారు. నాకంత ఫిజిక్స్ జ్ఞానం లేదు. అంచేత కాఫీ పొగలు కక్కడం మానేసింది!

      Delete
    2. ఆయన ఎవరో ఏదో అన్నారని మీరు మీ పంథా మార్చేసుకోటం బాలేదు డాట్రారు! పోనీ కక్కటం ఇష్టం లేకపోతే చిమ్మటం అనుకుందాం. "పొగలు చిమ్ముతూ కాఫీ వచ్చింది" ఇది బావుంటుందేమో ట్రై చెయ్యండి. అంతే గాని వట్టి "కాఫీ వచ్చింది" అంటే కోల్డ్ కాఫీ నా/హాట్ కాఫీనా/పంచదార వేశారా/ఎన్ని చెంచాలు అని ఇలా మాకు బోలెడు ప్రశ్నలు వచ్చేస్తాయి.

      Delete
    3. sree గారు,

      >> "పొగలు చిమ్ముతూ కాఫీ వచ్చింది" ఇది బావుంటుందేమో ట్రై చెయ్యండి.<<

      ఓకే! ఇకనుండి ఇలాగే రాస్తాను. అయితే.. 'కాఫీ పొగలు ఎలా చిమ్ముతాయి?!' అని ఎవరైనా ధర్మసందేహం అడిగితే మీరే సమాధానం చెప్పాలి!

      Delete
  2. సందేశాలు ఇవ్వడానికి ఈ మద్య పుట్ట గొడుల్లా మన వెంట పడుతున్నారు. ఏ పేపర్లొ చుసినా వాళ్ళె. ఏ పుస్తకా షాపుకెళ్ళినా వాళ్ళె. T.V లలొ వాళ్ళె. మీ జబ్బులు నయం చేస్తాం, మీ ఆర్దిక ఇబ్బందులు తొలగిస్తాం మా ఉంగరం కొనండి అంటారు. ఒక్క కొక్క సమస్యకు ఒక్కొక్క మంత్ర యంత్రము కనిపెట్టారు.

    యండమూరి, పట్టాభిరాం , లాంటి వాళ్ళు వ్యతిత్వవికాస నిపుణులుగా అవతారమెత్తారు. పుంకాను పుంకాలుగా పుస్తకాలు రాసి పడేశారు. డబ్బును సంచయనం చెయ్ సంచాయం సంచయనం, అంటూ మన చెవల్లొ జొరీగల్లాగ ఒకటే మొత. ఏ కొటీస్వరుడికొ వ్యతిగతంగా ఎవొ కొన్ని అలవాట్లు వుంటాయి.. ఇక వాటి గురించి వూదరకొడతారు. ఆ అలవాట్లవల్లనే కొటీస్వరుడైనట్టు. దేశ జనాబలొ గాని , ప్రపంచ జనాబాలొ గాని పేదతనం నుంచి ఉన్నతస్తాయికి ఎదిగిన వాళ్ళు వుంటారు. వాళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇక వాళ్ళగురించి చిలవలు పలవులుగా గుక్కతిప్పుకొకుండా మాట్లడతారు. అలా ఎదగడానికి దొహదం చేసింది ఎంటనేది వాళ్ళకు అనవసరం. ప్రతివక్కడూ ఎదగడానికి సమాజనిర్మాణంలొ ఆస్కారం వుందా అనేది వాళ్ళకు పట్టదు. ఇక నీతివాఖ్యాలు వల్లించడంలొ వాళ్ళకు వాళ్ళె సాటి. సమాజ పునాదిని పట్టే మనుషులు వ్యవహరిస్తారు గాని నీతిని బట్టి వ్యవహరించరనే విషయం వీళ్ళు గుర్తించరు.
    raam

    ReplyDelete
    Replies
    1. రామ్ గారు,

      మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete
  3. బాగుంది మాస్టారు ఈసారి మీ పోస్ట్, నిజంగానే రొటీన్ కి భిన్నంగా :-)

    ReplyDelete
    Replies
    1. పోస్ట్ బాగుందా?! నేను నీతులు రాయకపోవడం బాగుందా?!!

      Delete
  4. డాట్రు గారూ...మీరు కూడా నీతి వాఖ్యాలు రాస్తే, ఇంకా మేము ఎవరివి చదవాలి.
    ఆల్రెడీ బ్లాగుల్లో , ఇండియన్ పీనల్ కోడ్ నుండి ఇంట్లో తినే పకోడీ వరకు రాసే వాళ్ళు ఉన్నారు.
    గృహ హింస నుండి ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే హింస వరకు విశ్లేషించే వాళ్ళు కోకొల్లలు.
    పక్కింట్లో ఏం జరుగుతుందో చూసి, ప్రపంచాన్ని విస్లేశించామని జబ్బ చరుచుకునే వాళ్ళకి లెక్కేలేదు.
    ఇంకొంతమంది అయితే, ఎప్పుడు, ఎలా, ఎక్కడ,ఎందుకు రాస్తారో కూడా తెలియదు.
    మీ అసున్తోల్లు, ఇలా రాస్తే, ఇక మా గోడు ఎవరితో సేప్పుకోవాలి, కుసింత దొడ్డ మనసు సేసుకుని మాములుగా రాయండి సారూ.
    :venkat

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,

      మీరేం వర్రీ అవకండి. నేను నీతివాక్యాలు రాద్దామనుకున్నా మా సుబ్బు రాయనివ్వడు లేండి (ఈ టపాలో అదే చేశాడు).

      అయితే.. ఇష్టం లేకపోయినా జీవితంలో రెండు సార్లు నీతి బోధనలు చెయ్యవలసొచ్చింది. ఒకసారి చాలా ముఖ్యులు ఒత్తిడి చెయ్యడం వల్ల ఒక స్కూల్లో జెండా ఎగరేసి మరీ నీతులు చెప్పేశాను. ఇంకోసారి నా పిల్లల వత్తిడి మూలానా వాళ్ళ స్కూల్లో జ్ఞాపకశక్తికి చిట్కాలు చెప్పాను!

      Delete
    2. వాళ్ళూ, నా లాంటి వాళ్ళు అందకారంలొ పడి వున్నాం మరి ఈ వెంకట్ లాంటి వాళ్ళు గడ్డన పడవేయ వచ్చు కదా ఉహూ పిరికి గుండెలు అలాంటి పని చేయవు గడ్డనవుండి రాళ్ళు వేయడంలొ మహా దిట్ట.
      raam

      Delete
    3. హ హ హ..హే రాం, కూల్ dude. its not you I addressed, my comment is generalized one.
      ఆల్రెడీ మన సొసైటీ కులం, మతం, వర్గాలాతో, ఉప కులం, ఉప మతం, ఉప వర్గాల తో విడిపోయి బూతులు తిట్టుకుంటూ R.Narayana murthy,త్రిష కలిపి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మన చదువులు వీటన్నింటికి అతీతంగా సాగుతాయి అందువల్ల ఈ గొడవలు, కొట్లాటలు పోయే సమస్యే లేదు. ఓ మంచి జాబు, మంచి కంట్రీ చూసుకుని అక్కడ సెటిల్ అయిపోవడం బెటర్. అల కాదు, మార్పు మార్పు అని అరిస్తే, నీతో పాటు అరవడానికి మనుషులని కొనుక్కుని పెట్టుకోవాలి తప్పితే ఎవడు రాడు, కావాలంటే నువ్వు మార్పు కోసం పెట్టిన పోస్ట్ కి ఫెసుబూక్ లో ఓ వేయి లైకేలో , ఓ వంద షేర్ లో వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను పెట్టిన కామెంట్ నీకేమో అని నీ ఆవేశం చూసి ముచ్చట పడి చెప్పాను, అంతే కాదు నాకు ఎవ్వడి పీడా రాలేయడమో, గట్టున పడేయడమో లాంటి ఆలోచనలు లేవు.
      :venkat

      Delete
    4. నిజం చెప్పండి, ఞ్నాపక శక్తికి చిట్కాలన్నీ చెప్పారా లేక ఏదన్నా మర్చిపోయారా? ఏదీ ఒకసారి ఆ చిట్కాలన్నీ మాకూ చెప్పండిపుడు?

      Delete
  5. అంచేత నే చెప్పేదేమంటే డాక్టర్ గారు చెత్త, వెధవ రాతలు రాయాలి, చివాట్లు పెట్టేందుకు అగినాతలకు ఓ సువర్ణావకాశాన్ని అవకాశం నెలకు రెండు సార్లైనా ఇవ్వాల్సిందేనని తీర్మానించడమైనది.

    ReplyDelete
    Replies
    1. నాకీ వ్యాఖ్య అర్ధం కాలేదు.

      Delete
  6. "సందేశాలు ఇవ్వకూడదు" అన్న మీ సందేశం నాకు నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      >>'ఇప్పుడు నేను సమాజానికి సందేశం ఇవ్వాలా? వద్దా?' బుర్ర గోక్కున్నాను!<<

      మీరన్నది నిజమే సుమీ! నేను అవసరంగా బుర్ర గోక్కున్నానే!

      Delete
  7. ఈ డాట్రారు గారు ఎవరండీ బాబు,

    పనిలేక, సమాజానికి నా సందేశం అంటున్నారో, లేక
    పని లేని సమాజానికి నా సందేశం అంటున్నారో, లేక

    పని, లేక, సమాజానికి నా సందేశం అటున్నారో లేక
    నా సందేశం సమాజానికి పనికి లేక పోయిందంటున్నారో

    అబ్బా, ఏమి కన్ఫ్యూషన్ బాబోయ్

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,

      సమాజం వ్యక్తుల కన్నా చాలా తెలివైనది. దానికి ఎవరి సందేశం అక్కర్లేదు లేండి!

      మీరు కన్ఫ్యూజ్ అయ్యారా! ఇన్నాళ్ళూ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఇవ్వాళ నేను బదులు తీర్చుకున్నా లేండి!

      Delete
  8. నీతులు ఆచరించకుండా నీతులు చెప్పకూడదనే నీతి చెప్పేరు. చాలా మంచి నీతి.

    కాముధ

    ReplyDelete
    Replies
    1. ఏదో అలా వర్కౌట్ అయ్యిందండి!

      Delete
    2. కాముధ

      నీతి కాని నీతి అంటావ్, అంతేనా ?

      Delete
  9. రమణ గారు.. మీ స్టైల్ లో మీరు వ్రాసేయండీ!!

    నీతులు చెప్పడం,సమాజ సేవ చేయడం వద్దు లెండి. అందుకు బోలెడు మంది బ్లాగర్ లు ఉన్నారు. (నాలా ) చదవాడానికి ఆలోచనలు పదును తేలడానికి మాకొక బ్లాగ్ కావాలోచ్!!

    ReplyDelete
    Replies
    1. కామెంట్లాటలు మాని ఆ పనేదో మీరే చేయొచ్చుగా.

      Delete
    2. వనజా వనమాలి గారు,

      నాకు సందేశాలు ఇవ్వడం రాదులేండి! అంచేత ఇచ్చేవారిపై కొంచెం సెటైరికల్ గా రాశాను.

      Delete
    3. Anonymous గారు.. కామెంట్లాటలు మాని.. ఆ పనేదో.. మీరే చేయవచ్చుగా..

      భలే చెప్పారండి.

      కామెంట్లాటలు ఆడటంలో నేను చాలా పూర్ అండీ! కావాలంటే బాగ్లులని జల్లెడ పట్టి చూడండి. నా ఉనికి చాలా తక్కువ ఉంటుంది. మాహాజ్ఞానులు వ్రాసింది నాకు అర్ధం కాదు కాబట్టి కామెంట్ చేయలేను.

      ఇక వ్రాయడం సంగతి అంటున్నారే ! నేను వ్రాసింది నచ్చి మెచ్చి చదువుతున్నారో..లేదో.. పేజ్ వ్యూస్ చెపుతున్నాయి కదండీ! ఇంకా "ముంజేతి కంకణం కి అద్దమెందుకు " చెప్పండి.!?

      Delete
    4. వనజవనమాలి గారు..

      ((((((((చదవాడానికి ఆలోచనలు పదును తేలడానికి మాకొక బ్లాగ్ కావాలోచ్!!))))
      (((((((((నేను వ్రాసింది నచ్చి మెచ్చి చదువుతున్నారో..లేదో.. పేజ్ వ్యూస్))))))

      అవుతే..మీ బ్లాగు మీరే చదువుకున్తూ ఉంటారా, ఆలోచనలు పదును తేలడానికి?

      రమణాయ్ సందేశం ఇస్తే ఆలోచన పదును తేలను అందా ?

      Delete
    5. anonymous ..గారు :(

      అజ్ఞానం శమించుగాక ! సెలవు.

      Delete
    6. పేజ్ వ్యూస్ లెక్క అంతమంది అభిమానులవనా? నిజమే, అజ్ఞానం శమించుగాక !

      Delete
  10. రమణగారు,

    పుట్టినప్పటినుంచి స్వంత ఊరూలో చదివుకొని, అక్కడే స్థిరపడి, డాక్టర్గా ప్రాక్టిస్ చేస్తూ, మీ టాలేంట్ ను ప్రపంచవ్యాప్తం గా అందరు తెలుసుకొనే విధంగా తెలుగు బ్లాగులలో టపాలు రాస్తూ వాళ్లన్ని ఆనందింప చేస్తూ, అప్పుడప్పుడూ ఆలోచింపచేస్తూ ,ఒక మంచి బాధ్యతగల తండ్రిగా పిల్లలని స్కుల్ లో వదలిపెడుతూ,వాళ్లని ఇంటికి తీసుకొని వస్తూ, తీరిక చేసుకొని బంధుమిత్రుల పెళ్లిళ కు హాజరౌతూ ఇలా రాస్తూ పోతే ఎన్నో మంచి గుణాలు ఉన్న మీరు సందేశం ఇవ్వకపోతే ఎలా? మీలోని మంచి నాయకత్వ లక్షణాలను మీరే గుర్తించ పోవటం చాలా బాధాకరం. ఎవరు గుర్తించిన గుర్తించక పోయినా మీలోని పాసిటివ్ క్వాలిటిస్ నేను గుర్తించాను. మీరు తప్పక సందేశాలు ఇవ్వవచ్చు.

    SriRam

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      థాంక్యూ! నాలో ఇన్ని పాజిటివ్ అంశాలున్నాయని నాక్కూడా తెలీదు.

      నా భార్య మాత్రం నాకున్న ఆవలక్షణాలకి బ్లాగులు రాయడం కూడా తోడైందని గట్టిగా నమ్ముతుంది.

      Delete
    2. రమణగారు,

      ఇంకొకటి రాయటం మరచిపోయాను స్నేహితుల విజయాలను, వారిలోని విశేషాలను నలుగురికి నచ్చేరీతిలో మీబ్లాగు ద్వారా చెప్పటం. అదికూడా మిడిల్ ఏజ్ లో కొనసాగించటం మంచి విషయం.

      మేడం గారి ప్రోత్సాహం పెద్దగా లేకపోయినా మీరు బ్లాగులు రాస్తున్నారంటే, ప్రతిపక్షం సహకరించినా, సహకరించకపోయినా అసెంబ్లిని నడిపించే ముఖ్యమంత్రిగారి మాదిరిగా, మీరు చాలా గట్టి నాయకులు అని అర్థమౌతున్నాది :-)

      దేశంలో మేట్రో సిటిలన్నిటిలో పని చేసి, విదేశాలు తిరిగిన తరువాత స్వంత ఊరులో వృత్తిరిత్య స్థిరపడినవారు మీలాంటి వారు నాకు విజేతలుగా అగుపించారు.

      చివరిగా రాజకీయ పరంగా, ప్రభుత్వ పాలన పరంగా పూర్తిగా దివాలా తీసిన మనదేశం, ప్రస్తుతం ముక్క చెక్కలు కాకుండా ఇంకా ఒకటిగా ఉన్నాది అంటే, దానికి కారణం కుటుంబం,తల్లిదండృలు,భార్యా,పిల్లలు,మిత్రులు, సమాజం మొద||వారికి తగిన ప్రాముఖ్యతను ఇస్తూ, ఎంతో తెలివిగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తూ, విభిన్న రకాలా పాత్రలు చాకచక్యంతో పోషించే మీలాంటి "మగవారి" వల్లే అది, మీలాంటి వారి విలువ తిరువనంతపురం గుడిలో సంపద అంత విలువైనదని తెలియ జేసు కొంట్టున్నాను.


      SriRam

      Delete

  11. ఈ బ్లాగుతో సంబంధం లేదుకాని, మీ బ్లాగులు చదివి, నేను కూడా నాగయ్య గారి అభిమానిని అయ్యాను. అంతకు ముందు కూడా, నాగయ్య నటన అంటే ఇష్టం వున్నా, నాగయ్య హీరోగా వేసిన సినిమాలు చూడాలని అనిపించింది. ఈటీవీ వారు రాత్రిపూట ఇచ్చే పాత సినిమాలు ఇవ్వటం మానేసారు. అందుకని, నేనే యూట్యూబ్ నుండి భక్త పోతన, భక్త రామదాసు, త్యాగయ్య, యోగి వేమన డౌన్లోడ్ చేసుకున్నాను. భక్త పోతన చూసా. పాటలు పాడుకుంటున్నాము కూడా. మీరు మరిన్ని సినిమా బ్లాగులు వ్రాయాలని కోరుకుంటున్నా.

    ReplyDelete
  12. ఈ సారి మీ స్నేహితుడు ఫోన్ చేసినపుడు మీరు ఈరకంగా అతనికి బదులివ్వవచ్చు (just on the lighter side)::
    డా.సు! అక్షరాలని నీ ఇష్టం వచ్చినట్లు అతికించేసి ఇజాన్ని కెక్కెయ్యటమేనటయ్యా సందేశం? డా.సూ! తెలుగు బడిలో చదివిన బాబు "అమ్మా" అని ఒక విధంగా అంటాడు. ఎదురు ఇంగ్లీషు స్కూలు లో

    చదివిన బిడ్డ "mummy" అని మరొకలాగ అంటాడు. బ్లాగుల్లో కెలకబడి తిక్కరేగిన పాపడు (poor fellow) "వీడమ్మ." (కడుపు బంగారం గాను) అని మరొక విధంగా అంటాడు. ఒక్కో సందేశానికి

    ఒక్కో నిర్దిష్టమైన బ్లాగు ఉంది, లింకుందీ, రచ్చ ఉంది. ఆ కూడలి లోని ప్రతి బ్లాగు వెనుక "ఆతృత" నిండి ఉంది డా.సు! బాగా ఎక్కువైన ఒక మహా ముదురు నోటి లోతుల్లోంచి తనకు తానే లాలాజలం లా

    పెల్లుబికిన ఇజం అది, సందేశమనేది. మిడి మిడి ఙ్ఞానం తో సందేశం పేరిట అందరూ ఆస్వాదించే బ్లాగు ని వివాదాస్పదం చేయకయ్యా! మన బ్లాగు చదువుకోటానికి వచ్చిన ఉత్తమోత్తమమైన పాఠకులకి

    మతిభ్రంశం చేయకు!!

    -ఏ స్టైలో అర్థం అయ్యి ఉండాలి మీకీపాటికి!!

    ReplyDelete
    Replies
    1. శ్రీ సూర్య గారు,

      వ్యాఖ్య చాలా చాలా చాలా బాగుంది. థాంక్యూ!

      కనీసం పదిసార్లు చదివాను. పగలబడి నవ్వుకున్నాను. మీ వ్యాఖ్య నా పోస్టుని డామినేట్ చేసేసింది. హేట్సాఫ్ టు యువర్ హ్యూమర్!

      Delete
  13. Sri surya gari comment super.Ha ha ha.

    ReplyDelete


  14. సీరియస్ బ్లాగులకీ,సందేశాలకీ నా లాటి పెద్దవాళ్ళం ఎలాగూ ఉన్నాం. కాస్త నవ్వుకోడానికి పనికొచ్చే మీ లాంటి బ్లాగర్లు కూడా సందేశాలు,సీరియస్ రచనలు సాగిస్తే ఎలా.దయచేసి మీ ఒరిజినల్ పద్ధతి లోనే రాయండి.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      మీరు సందేశాలు వద్దంటున్నారు. పెద్దవారు. మీరు సలహా ఇచ్చిన తరవాత పాటించక తప్పదు. అలాగే రాస్తాను.

      (అసలు విషయం నాకు సందేశాలు రాయడం రాదు. అందుకే.. రాద్దామనుకుంటే సుబ్బు అడ్డం పడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాను.)

      Delete
  15. ఈ టపాలో ఉన్న సందేశం ఖచ్చితం గా చెప్పిన వారిలో పదిమంది ని డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేసి రమణగారి అభిమానులుగా గుర్తించబడుదురు. :)

    క్లూ: satirical message

    ReplyDelete
  16. కుళ్ళు జోకులేసుకుని నలుగురిని నవ్వించే పుణ్యకార్యం చాల్లెండి మనకి.
    సందేశాలు ఇవ్వటానికి మనవేవన్నా రమణ మహర్షులమా చెప్పండి ఉత్త
    యా.రమణలమే కానీ ఏతంటారు????

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.