Monday 1 October 2012

బురద పంది.. ఒక అద్భుతజీవి

పొద్దున్నుండీ  ఒకటే  వర్షం. మా  అమ్మాయిని  కాలేజిలో  దించడానికి  హడావుడిగా  వెళ్తున్నాను. ఇంతలో  కారుకి  అడ్డంగా  ఒక  పంది.. దాని  పిల్లలు. పాపం! ట్రాఫిక్ లో  తికమక పడుతూ  రోడ్డు  దాటలేకపోతున్నాయి. కారు  ఆపేశాను. వెనక  ఆటో వాళ్ళు  'కీ'  మంటూ  ఒకటే రోద.

మా  అమ్మాయి  విసుక్కుంది. "అబ్బా! నాన్నా! అసలే  టైమై పొయ్యింది. పందే  కదా! పోనివ్వచ్చుగా. ఆపేశావే?"

"తప్పు తల్లీ! అలా  అనరాదు. పంది  చాలా  ఉత్తమ జీవి. పందుల్ని  గౌరవించడం  మన  సంప్రదాయం." అంటూ  చివరి  పంది పిల్ల  రోడ్డు  దాటే దాకా  ఆగి.. ఆ  తరవాతే  కారు  ముందుకు  పోనించాను. నా  కూతురు  నన్ను  విచిత్రంగా  చూసింది. నేను  చిన్నగా  నవ్వుకున్నాను.

జంతువులు  రకరకాలు. ఒక్కొక్కళ్ళకి  ఒక్కో  జంతువంటే  ఇష్టం. చాలామందికి కుక్కలంటే ఇష్టం, కొందరికి పిల్లుల్ని పిల్లల్లా పించుకుంటారు. మా గుంటూర్లో మానసిక వైద్యానికి పితామహుడైన డా.అమంచర్ల శంకరరావు గారింట్లో ఉన్న జంతువుల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. ఆయన దగ్గర జంతువుల మందే ఉండేది. డెబ్భయ్యేళ్ళ శంకరరావుగారు వాటితో చిన్నపిల్లాళ్ళా ఆడుకోటం అన్ను అబ్బురపరిచేది.  

నాకు  పంది  ఇష్టమైన  జంతువు. ఈ  ఇష్టానికి  అనేక  కారణాలున్నాయి. నేను  అయిదేళ్ళ  పాటు  మాజేటి  గురవయ్య  హై  స్కూల్ లో  చదువుకున్నాను. స్కూల్  ముందు  పెద్ద  బురద గుంట  ఉండేది. దాన్నిండా  అనేక  పందులూ, పంది పిల్లలు  సకల బంధు జన సమేతంగా  కాపురం  ఉండేవి.

నాకు  చిన్నప్పట్నించి  చదువు  తప్ప  మిగిలిన  అన్ని  విషయాల్లో  ఆసక్తి  మెండు. అంచేత  ఆ  పందులూ, పంది  పిల్లలూ  సహజంగానే  నా  దృష్టిని  మిక్కిలి  ఆకట్టుకున్నాయి. అ  విధంగా  ఒక behavioral scientist వలె  పందుల్ని  నిశితంగా  పరిశీలించి  మిక్కిలి  జ్ఞానాన్ని  మూట గట్టుకొంటిని.

పంది  కేరాఫ్  ఎడ్రెస్  బురద గుంట. బురదగుంటలో, అర్ధ నిమీలి  నేత్రాలతో, బుల్లి  తోకతో  ఈగలు, దోమల్ని  తోలుకొంటూ.. బద్దకంగా.. విశ్రాంతిగా.. ప్రశాంతమూర్తిగా  జీవించే  పందిలో  నాకు  ఒక  విశ్వవిజేత  కనిపించేవాడు. ప్రశాంతత లేకుండా నిత్యం ఆశాంతితో జీవించే ఏకైక జంతువు మనిషి అని నా నమ్మకం. నీకు తింటానికి, ఉంటానికి ఉందిగా? ఇంకా ఏడుపెందుకు? నా సంతానానికి ఈ సుఖం ఉంటుందో ఉండదో? తల్చుకుంటుంటేనే ఏడుపొచ్చేస్తుంది బ్రదర్.  

'పిచ్చివాడా! నువ్వెంత  సంపాదిస్తే  మాత్రం  ఏం  లాభం? చివరాకరికి  ఏదో రోజు  నువ్వు  కూడా  మా  బురదలో  కలిసిపోవలసినవాడవే!' అని  నాతో  అంటున్నట్లు  కానవచ్చే  పంది  ముఖంలో  నాకు  పెద్ద ఫిలాసఫర్ కూడా  కనిపించేవాడు! కాకపోతే పైసా ఖర్చు లేకుండా చెప్పే ఫిలాసఫీని మనిషి పట్టించుకోడు. అతనికి ఇట్లాంటి విషయాలు బోధపర్చడానికి కాషాయ వస్త్రధారి కావాలి.. చింపిరి తల, బారెడు గెడ్డంతో శిష్యపరివేష్టితుడైయ్యుండాలి.. అర్ధం కాని లాజిక్కుతో, మాటల్తో బురిడీ కొట్టించగలవాడైయ్యుండాలి. ఇవేవీ లేని కారణాన పంది ఫిలాసఫీని పట్టించుకునేవాడు లేకపొయ్యాడు.

పంది  పిల్లలు  ఎంత  ముద్దుగా  ఉంటాయి! బుజ్జి ముండలు. మూతి cut చేసిన  కేకులా  గమ్మత్తుగా  ఉంటుంది. అర డజనుకు  తక్కువ  కాకుండా.. తల్లి  పొదుగు  వద్ద  పాల  కోసం  కుమ్ముకుంటూ.. అప్పుడప్పుడూ  'కీ'  అని  అరుస్తూ.. ఆ  దృశ్యం  చూడ  ముచ్చటగా  ఉంటుంది. తల్లి  వెంట  సుశిక్షితులైన  సైనికులవలె  తిరుగాడుతుంటాయి. పంది, పంది పిల్లల  బంధం  ప్రకృతిలోని  తల్లీపిల్లల  అనుబంధానికి  గొప్ప చిహ్నం. ఈ  బంధం  తల్లిని  అనుకరిస్తూ  పిల్లలు  నేర్చుకునే  'learned behavior' కి  మంచి  ఉదాహరణ.

ఒంటి  నిండా బురద, ముక్కు బద్దలయ్యే  కంపూ  పందికి  సహజ కవచాలు. తనంతట  తాను  ఎవరి  జోలి  కెళ్ళదు. ఎవడన్నా  తన  జోలి కొచ్చాడా.. వాడు  వంద  లైఫ్ బాయ్  సబ్బులు  వాడినా  పోని  కంపూ.. బురదా.. ప్రాప్తిరస్తు! ఎంత  గొప్ప ఫిలాసఫి! ఎంత  గొప్ప సెల్ఫ్ డిఫెన్స్!
                         
జిమ్ కార్బెట్ ఎన్ని  పులుల్ని  చంపాడో  నాకు  తెలీదు. కానీ  ఒక్క  పందిని  కూడా  చంపలేడనీ.. కనీసం  పందిని  బురద  నుండి  కూడా  వేరు  చేయలేడని  ఘంటాపధంగా  చెప్పగలను! ఎలాచెప్పగలవ్? సింపుల్! ఆయన పులుల్ని ఎలా చంపాడో రాసుకున్నాడుగానీ, పందుల్ని ఎలా చంపాడో ఎక్కడా రాసుకోలేదు!
                         
పందిలా  తిని  పడుకుంటున్నాడని  తిడతారు. కానీ.. ఎక్కువ  తిని  అస్సలు  పని  చేయకపోవడం  పంది  తెలివికి  నిదర్శనం. అనగా  జంతువుల్లో లేబర్ లా ఉల్లంఘన  ఒక్క  పందికే  చాతనయింది. ఈ  మాత్రం  తెలివి లేని  దద్దమ్మలు  గానుగెద్దులు. అందుకే  గొడ్డు చాకిరీ  చేస్తుంటాయి. పందులలోని  ఈ  తెలివిని జార్జ్ ఆర్వెల్ కూడా  గమనించాడు. అందుకే  తన  'ఏనిమల్ ఫామ్' లో  పీడించే వర్గానికి  ప్రతినిధిగా  పంది జాతిని  ఎన్నుకున్నాడు.

అసలు  పందికి  బురదంటే  ఎందుకంత  ఇష్టం? పంది  చర్మంలో  స్వేద గ్రంధులు  ఉండవు. కావున  శరీర ఉష్ణోగ్రతని  కాపాడుకోవడానికి  చర్మానికి  ఎల్లప్పుడూ  తేమ  కావాలి. ఆ  తేమ  తొందరగా  ఆరకుండా  ఉండటం  కోసం  బురదలో  పొర్లుతుంటుంది. అంటే  బురద  వల్ల  శరీరం  తడి  ఆరకుండా  ఉంటుంది. ఆ  విధంగా  పందికి  సైన్స్  మీద  కూడా  పట్టుంది! ఈ  సంగతి  తెలిసిన  తరవాత  నాకు  పందిపై  గౌరవం  మరింత  పెరిగింది.

పంది  వైద్య శాస్త్ర  అభివృద్ధికి  కూడా  తోడ్పడింది. తోడ్పడుతుంది. అనాదిగా  మానసిక వైద్యంలో  ప్రపంచవ్యాప్తంగా  అమలవుతున్న  ECT  విధానానికి (కరెంట్  షాకులిచ్చే  వైద్యం) పందుల  ఫ్యాక్టరీలో  జరిగిన  పరిశీలనే  కారణం. ఇప్పుడు  పంది గుండెని  మనుషులకి  అమర్చడానికి  ప్రయోగాలు  జరుగుతున్నాయి.
                         
దశావతారాల్లో తొమ్మిది అవతారాల గూర్చి నాక్కొన్ని అనుమానులున్నయ్. కానీ  వరాహావతారాన్ని  మాత్రం  అర్జంటుగా  ఒప్పేసుకుంటున్నాను. మొన్నామధ్య  ఓ  పంది  దేవుడి  చుట్టూ  రోజుల  తరబడి  ప్రదక్షిణాలు  చేసింది. నమ్మక  తప్పదు!
                         
ఈ  మధ్య   పందుల  పెంచే వృత్తిలో  వున్న  ఓ  పేషంట్  చెప్పిన  లాభాలు   విని కళ్ళు  తేలేశాను. ఈ  రహస్యాలు  ఎవ్వరికీ  చెప్పకురా  అబ్బీ! నీకు  ఏ అంబానీ గాడో  పోటీదారుడవుతాడని  సలహా  ఇచ్చి  పంపేసాను.

మిత్రులారా! పంది  విశిష్టత  గూర్చి  నాకు  తెలిసిన  వివరాలన్నీ  మీతో  పంచుకున్నాను. పంది  గొప్పదనం  ఈ పాటికి  మీక్కూడా  అర్ధమైపోయుంటుంది. చివరగా  ఒక  విజ్ఞప్తి. ఇక ముందు  ఎప్పుడైనా  మీకు  పంది  తారసపడితే  ముక్కు  మూసుకుంటూ ఈసడించుకోకండి. గౌరవంగా  పక్కకి  తప్పుకోండి! ఎందుకంటే - బురద పంది  ఒక  అద్భుతజీవి!

33 comments:

  1. ప్రజా వుద్యమాలంటే అంత పరిహాసమా? మిలీనియం మార్చ్‌ను పరోక్షంగా హేళన చేసినంత అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు. తెలంగాణ వచ్చేదాకా ఈ ఉధ్యమం కొనసాగుతుంది. ఎవరడ్డొచ్చినా ఆగదు.

    ReplyDelete
    Replies
    1. OMG... don't you no that this blogger is a sympathizer of parties supporting T movement.

      Delete
    2. అజ్ఞాతా (16:02),

      మీ వ్యాఖ్య నాకర్ధం కాలేదు. బహుశా ఇంకో బ్లాగులో రాయవలసిన కామెంట్ పొరబాటున ఇక్కడ రాశారేమో. నా పోస్టుకీ, తెలంగాణాకీ ఏ మాత్రం సంబంధం లేదని తెలియజేసుకుంటున్నాను.

      Delete
    3. రమణ గారు నాకు అలానే అర్థమయింది మీరు సమైఖ్యంద్ర ఉద్యమాన్ని పంది తో పోల్చారు అనిపించింది( ఇది మొదటి కామెంట్ కు సమాధానం మాత్రమే మిగిలిన వాటితో సంబంధం లేదు )

      Delete
    4. @anonymous 1 october 16.02
      ayya mahanubhava... tamari telanganaki, pandiki sambandam emito kinchithu kuda ardham kananduku chintisthunnanu

      Delete
    5. బుద్ధమురలి ఆ తెలాగాణ పంది తననే అనుకుంటున్నాడు. కాకపోవచ్చు.

      Delete
  2. అబ్బబ్బ.. ఏం వర్ణన అండి.. మెచ్చుకోలేకుండా వుండలెకపొతున్నాను.. :D:D

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! మెచ్చుకుంటూ ఉండలేకపోవడం ఎందుకండీ? ఇలా మెచ్చుకుంటూ ఉంటే ఒక పనైపోతుందిగా!

      Delete
  3. పని లేక వ్రాస్తూంటే పని లేక ఆస్వాదించాలి గాని పెడర్తాలేల.....మొదటి అఙాత మరీ తొందరపడ్డట్లు తోస్తుంది....నేనూ జై తెలంగానానే.....కానీ అన్నింట్లో అదే చూడవద్దు.....నేను వీడియొ చూడలేదు..కానీ రాసినదాంట్లో తెలంగాణా కు ఏమి వ్యతిరేకత లేదు...

    ReplyDelete
    Replies
    1. ఆ అజ్ఞాత అన్నది కవాతు తెలబాన్ల గురించే, అని నా అనుమానం. నిజాలు నిప్పులు అలా వచ్చేస్తుంటాయ్.

      Delete
    2. :) ROFL @Anon 17:38

      Delete
    3. తెలంగాణ వుద్యమం రాజకీయ పనిలేనివాళ్లదే బుద్ధిజీవులు అనుకుంటున్నారు(మీరు, బుద్ధ మురళి కాదు)

      Delete
  4. ఆ మొదటి అజ్ఞాతానందస్వామి ఎవరో గానీ..
    కెవ్వు కేక..
    -అజ్ఞాత భక్తుడు.

    ReplyDelete
  5. హహహహ మీ వరాహోపాఖ్యానము బాగుందండీ :-)
    మీరు అర్జంట్ గా ఓ మిత్రుడు రాసిన ఈ క్రింది పోస్ట్ చదివి తీరవలసిందే...
    పందిరాజము

    ReplyDelete
    Replies
    1. మీ పందిరాజము లింక్ చదివాను. నా టపా కన్నా ఎన్నో రెట్లు బాగుంది. ముందుగానే చదివినట్లైతే ఈ టపా రాసుండేవాణ్ణి కాదు.

      Delete
  6. ఇంకో అతి ముఖ్య మైన విషయం ఏమిటంటే పల్లెటూళ్ళల్లో సెప్టిక్ లెట్రిన్స్ వుండవు (వుండేవి కావు)..అక్కడ పంది రాజమే స్కావెంజర్.. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా శుభ్రపరుస్తుంది.. గాడ్ ఈజ్ గ్రేట్...నాకు కూడా పంది పిల్లలంటే చాలా ఇష్టం.. బుజ్జి ముండలు ముద్దొస్తూ వుంటాయి..

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! బ్లాగ్ రాస్తున్నప్పుడు కొంచెం సందేహాస్పదంగా 'మరీ పంది గూర్చి రాస్తున్నాడేంటి!' అనుకుంటారేమోననుకుంటూ రాశాను. ఇప్పుడు మీ కామెంట్స్ చూసి 'అమ్మయ్య!' అనుకుంటున్నాను.

      Delete
  7. మీకు , వరాహం అండ్ కో కు మధ్య క్విడ్ ప్రో క్వో కింద జరిగిన ఒప్పందం లో భాగంగానే ఈ పోస్టు పోస్టారని మా PBI వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి!! ఎందుకంటే, ఆ పందుల గుంటల్లోని దోమలు కుట్టి మైండ్ దొబ్బినవారు మీకు పేషేంట్లుగా వచ్చి క్షవరం చేయించుకుంటారు. వరాహాలవల్ల మీకు చాలా లాభం. ఈ పోస్టుద్వారా మీరు వారిని ఓదారుస్తూ ప్రజల్లో వారి ఇమేజ్ పెంచుతున్నారు. అన్నీ రాసి వాటి రుచి గురించి వ్రాయకపోవటం ఈ కేసులో కీలకమైన ఆధారం! అందుకే మీకు వాటికీ మధ్య చట్టవ్యతిరేక ఒప్పందం జరిగిందని మా అభియోగం. చెప్పండి ఎక్కడ వ్రాయమంటారు మీ పేరు, A1 గానా A2 గానా?

    ReplyDelete
    Replies
    1. A1/A2.. మీ ఇష్టం. కానీ బైలొచ్చేదాకా నన్ను చంచల్ గూడా జైల్లోనే ఉంచే ఏర్పాట్లు చెయ్యండి. (సెలబ్రిటీ కావాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు!)

      Delete
  8. Replies
    1. పంది బురద మెచ్చు, కీప్ ఇట్ అప్

      Delete
  9. రమణ గారు.. పంది రాజం పట్ల మీకున్న అభిమానం ..చాలా గ్రేట్ అండీ! గొప్ప విషయం చెప్పారు.:)
    అబ్బో.. యాక్ అంటూ.. దూరంగా పారిపోయే సగటు మనిషిని నేను. ముక్కు మూసుకుని వెళుతున్నా.. ఒళ్ళు విదిలించిందంటే.. బురద పడితే ఇబ్బంది కదా !.

    ReplyDelete
    Replies
    1. కరుణశ్రీ 'పుష్పవిలాపం' వలె 'పందివిలాపం' రాద్దామనుకుని.. ఇలా రాసేశాను.

      Delete
  10. అన్నట్టు కొద్ది సేపటి క్రితం BBC లో చూసిన వార్త. US లో ఒక పందుల ఫారం లో ఒక వ్యక్తిని పందులు చంపి తినేసి ఏవో కొద్ది భాగాలు మాత్రమే మిగిల్చాయి. మీ బ్లాగు చూసి వాటిలో చైతన్యం వచ్చిందంటారా లేక అమాయక పందులని ఇరికించారా?

    ReplyDelete
    Replies
    1. అమాయక పందులని ఇరికించడానికి US పోలీసులకి ఆంధ్రా పోలీసులంత తెలివి ఉందంటరా? నాకనుమానమే!

      Delete
  11. ఏమీ బాగోలేదండి, డాక్టారూ. మరీ ఎంత పనిలేకున్నా, పందుల మీద వర్ణనకు తెగబడటం నా కస్సల్ నచ్చలేదు. యాక్..

    నెక్స్ట్ టపా ఏలికపాముల గురించి రాశారంటే మీ బ్లాగు లో మిలీనియం కవాతు చేయాల్సొస్తుందని మొదటి అజ్ఞాత తరపున శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతుల్లో హెచ్చరిస్తున్నాను. :)) :P

    ReplyDelete
    Replies
    1. నా స్నేహితుల అభిప్రాయం కూడా అచ్చు మీదే!

      ఇంతకు ముందు బ్రాయిలర్ కోళ్ళ గూర్చి రాశాను. ఇప్పుడు పంది గూర్చి రాశాను.

      ఏమిటో నా ఆలోచనలూ, బ్లాగు పోస్టులు నా కంట్రోల్లో ఉండట్లేదు.

      Thank you for the frank opinion.

      Delete
  12. మిమ్మల్ని నిరుత్సాహపరిచే జనాలని పట్టించుకోకండి. అసలు మనకి అన్నం పెట్టే అమృతవల్లి కదండీ పంది! ఈ ప్రపంచం లో కొన్ని కోట్లమందికి తన శరీరాన్ని త్యాగం చేసే త్యాగమూర్తి మన వరాహం. ఆ త్యాగం చేయకుంటే ఇవాల మనకి పూజించటానికి గోవులో తినడానికి కాయగూరలో మిగిల్చేవారా ఈ నీచ మానవులు? కాని అటువంటి జీవిని అపవిత్ర జంతువుగా వెలేసారు. ఎంత అన్యాయం !!
    అసలు కుబేరుడు ప్రసన్నం కావాలంటే పందిని ఆరాధించాల్సిందే. అర్థం కాలేదా? కావాలంటే డబ్బున్న పిల్లలు పైసలు ఎక్కడ దాచుకుంటారో చెప్పండి, అందమైన ఓ పిగ్గీ బాంకులో. మరి మనం? ఏ మట్టి పిడతలోనో అన్నయ్య జేబులోనో ఉంచి అన్నీ పోగొట్టుకుంటున్నాం!!
    అంతే కాదు వరాహం ఓ మంచి వైద్యుడు కూడా. అది కూడా ఎలాగో చెబుతాను. ఎవరినా జబ్బు పడితే వారి మలాన్ని పంది తినదట. ఏనాడైతే ఆ మనిషి మలవిసర్జన చేస్తున్నపుడు అతన్ని తోసిరాజని ఆ మలాన్ని స్వీకరిస్తుందో ఆనాటితో మనవాడికి రోగవిముక్తి అయినట్లట!! ఈ విషయం పల్లెటూరి బామ్మలు చెప్తూ ఉంటారు. (హేతువాదుల భాషలో చెప్పాలంటే రోగిష్టివాడి మలం లో నానా మందుల అవశేషాలూ ఉండటం వల్ల పంది తృణీకరిస్తుందని ఒక వాదన!)
    యమధర్మరాజుకి చెందే సమవర్తి అనే బిరుదు మన వరాహానికి కూడా అర్హమైననదని నేను ఘంటాపథంగా చెప్పగలను. వాహనం నడిపేవారి వేగాన్ని నియంత్రించడం లో పంది ట్రాఫిక్ పోలీసుల్లా తారతమ్యాలు చూడదు. మీరైనా నేనైనా. కామెంటేవారైనా.. చివరికి జగనైనా బాబైనా దానికి సమానమే! అందరినీ సమానంగానే చూస్తుంది!!

    ReplyDelete
  13. నీ ఈ శ్రీ వరాహ ఉపాఖ్యానం అత్యద్భుతం.
    నువ్వు మిస్ అయ్యింది ఒకటే పాయింట్. పంది చాలా నాచురల్ స్కావెంజెర్. అందు వల్ల, మన ఈ తెల్ల వాడి సెప్టిక్ లెట్రిన్లు వచ్చే వరకు మన మానవ జాతిని రోగాల బారి నుండి కాపాడినవి పందులే. ఇప్పటి కైనా, ఎక్కడైనా ఒక తిరణాల జరిగితే అక్కడ ఒక వెయ్యి పండులని ఒదిలితే ఒక గంట లో పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రదేశం బాగు పడుతుంది. అయితే ఇది చాలా మంది గుత్తేదారులకు, కొందరు అధికార, అనధికారులకు నచ్చక పోవచ్చు.

    నల్ల వాడి దొడ్డి బాగు చేసిన పంది, తెల్ల వాడికి ఆహారం అయ్యింది. ప్రపంచ పోర్క్ అమ్మకాల వివరాలు నేను నీకు చెప్పక్కర లేదు.

    ఇక పంది వంటిపై బురద, దాని నివాసం ( బురద గుంట ) - దీనికి కారణం విష్ణు మూర్తే.
    దశావతారాలలో మూడవ అవతారము అయిన వరాహావతారం, సముద్రం లోంచి భూమిని బయటకు తీసింది. నీళ్ళలో నుంచి మట్టి తీస్తే బురద కాదా? మనం అన్ని చోట్లా ఇల్లు, పొలాలు ఏర్పాటు చేసుకొని డానికి చోటు లేకుండా చేస్తే మిగిలిన అతి కొద్ది స్థలం బురద గుంట ఐయింది. అయినా, దాని ఆశ చావక అక్కడే ఉంటోంది కానీ, మన ఇళ్ళ మీదకీ, పొలాలలోకీ రావటం లేదు కదా. ఎంత అల్ప సంతోషి జీవి.

    ఇన్ని మాట లేల? మనం ఇప్పుడు వున్నది శ్వేత వరాహ కల్పం లో. తిరుమల లో వెంకటేశ్వరునికి స్థలం ఇచ్చినది వరాహ స్వామే. అయినా, ఆయన కూడా తన దగ్గిరకు రాని VIPలని అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా...
    - పుచ్చా

    ReplyDelete
  14. పందికి స్వేదగ్రంధులు వుండవన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. సమాచారానికి ధన్యవాదాలు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.