'ఈ టీవీ' లో చంద్రబాబు నాయుడు పాదయాత్రని చూస్తున్నాను. మనిషి బాగా చిక్కిపోయ్యాడు. కర్రకి బట్టలు తోడిగినట్లున్నాడు. కోట్ల రూపాయిలున్నాయి. అయినా ఏం లాభం? పాపం! కడుపు నిండా తినలేడు. కంటినిండా నిద్రపోలేడు. ఏమిటీ ఖర్మ? నా మనసు దిగులుగా అయిపొయింది.
"రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బూ! పాపం చంద్రబాబుని చూడు. వృద్ధాప్యంలో ఎన్నికష్టాలు పడుతున్నాడో!" దిగాలుగా అన్నాను.
సుబ్బు ఆశ్చర్యపొయ్యాడు. క్షణకాలం టీవీలో చంద్రబాబుని చూశాడు.
"నీ దుఃఖానికి కారణం అర్ధం కావట్లేదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంది తనకి పెన్షన్ అందట్లేదనో, ఇంటిస్థలం పట్టా కావాలనో కాదు. ఆయనక్కావలసింది ముఖ్యమంత్రి పదవి. అది మన చేతిలోనే లేదు. చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా నీకులా జాలిపడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తారేమో. కానీ నాకెందుకో అది చాలా కష్టం అనిపిస్తుంది." అన్నాడు సుబ్బు.
"కష్టమా! ఎందుకని?" అడిగాను.
"అసలు చంద్రబాబు ఏం చెబుతున్నాడో నాకర్ధం కావట్లేదు. ఒక పక్క అభివృద్ధి చేశానంటాడు. ఇంకోపక్క తప్పులు తెలుసుకున్నానంటాడు. మారిన మనిషినంటాడు. అంటే ఇంతకుముందు ఆయన చేసిన తప్పు రాష్ట్రాన్నిఅభివృద్ధి చెయ్యడమేనా? అంటే తను చేశానని చెబుతున్న అభివృద్ధిని disown చేసుకుంటున్నట్లే కదా!" అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! చంద్రబాబు 'మారిన మనిషి' సందేశం పార్టీ కాడర్ కోసం. పార్టీపరంగా తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకుంటున్నాడు." అన్నాను.
ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.
"రాజకీయాల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు లెక్కలే ఉండవు! ఎక్కాల ప్పుస్తకంలో రెండురెళ్ళు నాలుగనే ఉంటుంది. రాజకీయాల్లో రెండురెళ్ళు పది అవ్వచ్చు. సున్నా కూడా కావచ్చు."
"సుబ్బు! నీకు లెక్కలు రావన్న సంగతి నాకు తెలుసు. కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పు." విసుక్కున్నాను.
"రాజకీయంగా ఇవ్వాళ ఉన్నపరిస్థితి రేపు ఉండదు. కొత్తసమస్యలు రావచ్చు. పాతసమస్యలు పెద్దవిగా మారవచ్చు. ఉన్నట్లుండి కొన్నికారణాల వల్ల పరిస్థితి పూర్తిగా ఒకపార్టీకి అనుకూలంగా మారిపోవచ్చు. దరిద్రం నెత్తి మీదుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల్లాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.
"సుబ్బు! ఎప్పుడో అరుదుగా జరిగే ఎమోషనల్ సంఘటనలని ప్రస్తావించడం రాజకీయ విశ్లేషణ అవ్వదు. కష్టేఫలి అన్నారు పెద్దలు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కష్టపడుతున్నాడు. కష్టపడ్డప్పుడు ఫలితం ఎందుకుండదు?" చిరాగ్గా అన్నాను.
"కూల్ డౌన్! ముందుగా నువ్వు గ్రహించవలసింది నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే. రాజకీయాల్లో భగవద్గీతలకీ, తెలుగు నిఘంటువులకీ కూడా చోటులేదు. అంచేత కష్టం, ఫలితం వంటి మాటలకి విలువ లేదు. అదృష్టం బాగుంటే పదవి ఫెవికాల్ లా పట్టుకుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు?"
"అవును గదా!" సాలోచనగా అన్నాను.
"చంద్రబాబు ఈ రాష్ట్రానికి CEO నని తనకితానుగా ప్రకటించుకున్నాడు. CEO లు ప్రభుత్వాలకి ఉండరు. కార్పొరేట్ కంపెనీలకి ఉంటారు. తధాస్తు దేవతలు ఆయన్ని దీవించారు. అందుకే తెలుగు దేశం పార్టీకి CEO గా మిగిలిపొయ్యాడు. అయితే ఈ TDP కంపెనీ పాతబడిపోయింది." అంటూ ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
ఒకక్షణం ఆలోచించి నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.
"ఒకప్పుడు కారంటే ఎంబాసిడర్ మాత్రమే కారు. కలర్ టీవీ ఒక పెద్ద డబ్బాలా ఉండేది. సెల్ ఫోన్ కిలో బరువుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబాసిడర్ కారు చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అన్నిఇళ్ళల్లో విస్తరాకుల్లాంటి LED లు. అందరి చేతుల్లోనూ తమలపాకుల్లాంటి ఐ ఫోన్లు. మార్పు ప్రకృతి ధర్మం. ఇప్పుడెంత కష్టపడ్డా చంద్రబాబు తన పాత మోడల్ కారు, టీవీ, సెల్ ఫోనూ అమ్మడం కుదరదు. రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలు కుర్రాళ్ళు. లేటెస్ట్ మోడల్ కార్లు, 3D LED, సామ్సంగ్ గెలాక్సీల్లాగా పెళపెళ లాడుతున్నవారు. వాళ్లకి ఆ మేర ఎడ్వాంటేజ్ ఉంది. మన CEO చంద్రబాబుకి ఈ సంగతి తెలియనిది కాదు. కానీ ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు."
"సుబ్బు! నువ్వు చెప్పే కార్లు, టీవీల బిజినెస్ థియరీ రాజకీయాలకి వర్తించదు. నేను ఒప్పుకోను." అన్నాను.
"పోనీ ఇంకోభాషలో చెబుతా విను. తెలుగు దేశం పార్టీ ఒక పెద్ద ఇల్లు వంటిది. ఒకప్పుడు ఆ ఇల్లు లేటెస్ట్ మోడెల్. కళకళలాడింది. ఇప్పుడది పెచ్చులూడిపోయిన పాతబడ్డ బిల్డింగ్. మామూలు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మాసికలు వేయించి, దట్టంగా wall care పెట్టించి ఏదోరకంగా నెట్టుకొచ్చేవాడే. కాకపొతే ఆ పాతబిల్డింగ్ కి తెలంగాణా వాదం అనే పెద్ద తొర్ర పడింది. బిల్డింగ్ ఒక వైపు కూలిపోయింది. రిపైర్ చేయించడానికి ఇసుక, సిమెంట్ సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడు. అయితే రిపైర్ పనులు ముందుకు సాగనీయకుండా ఢిల్లీ KCR అనే మేస్త్రీని కాపలా పెట్టింది. KCR పని ఆ తొర్ర పూడకుండా, వీలయితే ఇంకా పెద్దదయ్యేట్లు చెయ్యటమే! అందుకే ఒక్కోసారి పాతఇల్లు రిపైర్ చేయించేకన్నా కొత్తఇల్లు కట్టుకోవటం సులువు." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.
"సుబ్బూ! నువ్వు వంద చెప్పు. చంద్రబాబుని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ వయసులో చంద్రబాబు అంత కష్టపడటం అవసరమా?" అన్నాను.
"పూర్తిగా అనవసరం. ఈ బుట్టలల్లడాలు, ఇస్త్రీ చెయ్యడాలు, చెప్పులు కుట్టడాలు చేస్తే మిగిలిది ఆయాసం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎసెంబ్లి స్థాయి నాయకులు ఓట్లడుక్కునేప్పుడు చేసే చౌకబారు విన్యాసాలు. చంద్రబాబు స్థాయి చాలా ఎక్కువ. ఆయన తన హయాంలో ఆర్ధిక సంస్కరణలు ప్రజలకి మేలు చేస్తాయని నమ్మాడు. వేగవంతంగా అమలు చేశాడు. ఆ విధంగా భారత రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు." అంటూ తలుపు తీసుకుని వెనక్కి తిరిగాడు సుబ్బు.
"మళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు." అంటూ హడావుడిగా వెళ్ళిపొయ్యాడు సుబ్బు.
(photos courtesy : Google)