Monday 19 November 2012

నేరము - శిక్ష (శునక శిక్షణ)


"ఓసి కుక్కమొహందానా.. బుద్ధిలేదా? ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా?" కోపంగా అరిచాను. వెంటనే నవ్వొచ్చింది. కుక్కని పట్టుకుని కుక్కమొహమని అనడం తిట్టు కిందకొస్తుందా?

విషయమేమంటే.. మా ఇంట్లో ఒక కుక్కముండ ఉంది. మగకుక్క కాబట్టి ఆంగ్లంలో అయితే 'ఉన్నాడు' అనాలి. కానీ మనది తెలుగుభాష కాబట్టి 'ఉంది' అనే రాస్తున్నాను. 

ఈ శునకుడి నామధేయము స్నూపీ. కుక్కలకి ఇంగ్లీషు పేర్లు పెట్టడాన్ని తెలుగు భాషోద్యమకారులు ఎందుకు ignore చేస్తున్నారు? బహుశా గ్రామసింహాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టుటయే కరెక్టని అనుకుంటున్నారేమో!  

స్నూపీకి క్రమశిక్షణ ఎక్కువ. ఠంచనుగా తింటుంది. సమయపాలనన్న మిక్కిలి మక్కువ. అందుకే అందరికన్నా ముందే AC బెడ్రూంలోకి దూరి గురకలు పెట్టి నిద్రబోతుంది. తెల్లారేదాకా బాంబులు పడ్డా నిద్ర లేవదు. 'జగమంతా కుటుంబం నాది!' అని నమ్ముతుంది. అంచేత ఇంట్లోకి ఎవరొచ్చినా పట్టించుకోదు.

ఆ మధ్య పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు వీధివీధంతా మేల్కొంది. అంతా గోలగోల. స్నూపీ మాత్రం తన గాఢనిద్రలోంచి మేలుకోలేకపోయింది. ఇరుగుపొరుగుల ముందు పరువు పోయింది. తల కొట్టేసినట్లైంది. ఇక్కడదాకా నాకేం ఇబ్బంది లేదు. 

కానీ ఈమధ్య ఉదయాన్నే నాతోబాటు వెనకాలే బాత్రూంలోకి దూరి.. తను కూడా bladder empty చేసుకుంటుంది. నిద్రమత్తులో నా వెనకాలే నీడలా వచ్చే ఈ నాలుక్కాళ్ళ జీవిని గమనించలేకున్నాను.
                          
లాభం లేదు. ఈ శునకాధముని క్రమశిక్షణలో పెట్టవలె. కానీ కుక్కకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? కుక్కకి child psychology అప్లై అవుతుందని విన్నాను. పిల్లల్లో discipline కోసం ఉపయోగించే behavioral techniques నాకు తెలుసు. పిల్లల కోసం అమలు చేసే privilege stop అనే శిక్షణలాంటి శిక్ష కుక్కలకి పనికొస్తుందా? ట్రై చేస్తే పోలా! 

తప్పు చేసిన పిల్లలకి వారి ఆటవస్తువుల్లాంటివి దాచడం privilege stop అంటారు. స్నూపీకి ఆట సామాగ్రి లేదు కాబట్టి ఆహారమే ఒక privilege. అంచేత తిండి పెట్టకుంటే అదే దారికొస్తుంది. కొద్దిగా మొరటు పధ్ధతి. కానీ తప్పదు.

స్నూపీకి రోజూ breakfast అలవాటు. మాతోపాటే ఇడ్లీలు, అట్లు తింటుంది. ఇవ్వాళ దీనికి breakfast కట్ చేస్తాను. అప్పుడు కుక్కలా (కుక్కలా ఏమిటీ? కుక్కే గదా!) దారికి వస్తుంది. 

మేఘన కాలేజీకీ, బుడుగు స్కూలుకి వెళ్ళిపోయారు. treadmill చేసుకుంటూ స్నూపీకి breakfast ఇవ్వొద్దని నా భార్యకి చెప్పాను. ఆవిడ హడావుడిగా హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. 

ఓరకంటతో స్నూపీని గమనిస్తూనే ఉన్నా. దానికి ఆకలేస్తుంది. ఎవరూ తనని పట్టించుకోకపోవడం దానికి అర్ధం కావట్లేదు. ఇంట్లోకి నేను ఎటు వెళితే అటే వచ్చి ఎదురుగా నిలబడి తీవ్రంగా తోక ఊపుతుంది.      

ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని.. కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ వేసుకున్నాను. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ.. నిదానంగా ఇడ్లీలు ఆరగించడం మొదలెట్టా. టీవీలో ఏదో రాజకీయ చర్చ జరుగుతుంది. చర్చ పరమ నాసిగా ఉంది.

స్నూపీకి ఇడ్లీలంటే ఇష్టం. ఎదురుగా నించొని ఇడ్లీలకేసి ఆశగా చూస్తుంది. నేను పట్టించుకోలేదు. ఇంక ఆగలేకపోయింది. తనక్కూడా ఆకలేస్తుందన్నట్లుగా ముందు కాలుతో నాకాలుని గీరడం మొదలెట్టింది. 

యాహూ! నా punishment regime విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు నేను punishment ఎందుకు ఇచ్చానన్నది స్నూపీ మైండ్ కి కనెక్ట్ కావాలి. ఇది నా థెరపీలో important step. అందుకోసం కొంత verbal reinforcement చెయ్యవలసి ఉంది. 

"స్నూపీ! you are a good boy. బాత్రూముల్లో ఉచ్చ పొయ్యకూడదు. తప్పు. open place లో పోసుకో. అప్పుడు నీకు బోల్డెన్ని ఇడ్లీలు పెడతాను. అర్ధమైందా?" 

నా నీతిబోధనా కార్యక్రమం పూర్తి కాకముందే.. తల పైకీ, కిందకి ఊపుతూ.. 'ఖయ్.. ఖయ్.. ఖయ్' మంటూ గోళీసోడా కొడుతున్నట్లు.. మూలుగుతున్నట్లు.. ఏడుస్తున్నట్లు.. విచిత్రంగా మొరగడం ప్రారంభించింది. 
                                         
స్నూపీ విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోయా. నా punishment వికటించి దీనికి పిచ్చిగానీ పట్టలేదు గదా! అర్జంటుగా ఇడ్లీ పెట్టకపోతే కరుస్తుందేమో! దీని మొహం. దీనికి పిల్లిని చూస్తేనే భయం. నన్ను బెదిరించి ఇడ్లీలు కాజేయ్యడానికి వేషాలేస్తుంది! కానీ.. ఏమో! ఎవరు చెప్పగలరు? basic animal instincts అంటూ ఉంటాయి గదా! 

ఒక్కక్షణం ఆలోచించా. నేనిప్పుడు దీని బెదిరింపులకి లొంగితే నన్ను పిరికిసన్నాసి అనుకుంటుంది. అప్పుడిక భవిష్యత్తులో నన్నసలు లెక్క చెయ్యదు. అంచేత స్నూపీకి ఇడ్లీలు పెడితే నేనోడి పోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లో నేనోడిపోరాదు. స్నూపి గెలవరాదు. కానీ.. ఎలా? ఎలా? ఏం చెయ్యాలి?

మెరుపు మెరిసింది. ఐడియా. స్నూపీకి మనుషుల తిండంటేనే ఇష్టం. బిస్కట్లు, కేకులు, స్వీట్లు, నూడిల్స్, ఇడ్లీలు, దోసెలు బాగా లాగిస్తుంది. కుక్కల ఆహారంగా చలామణి అయ్యే branded dog foods దానికస్సలు ఇష్టం ఉండదు. 

సృష్టిలో అత్యంత దుర్వాసన వచ్చు పదార్ధ మేమి? 'pedegree' నామధేయ బహుళజాతి కుక్కల ఆహారం. నా ముక్కుకి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. వాసన శక్తి బాగా తక్కువ. ఇదొకరకమైన అంగవైకల్యం. అటువంటి నాక్కూడా 'పెడిగ్రీ' దుర్వాసన భరింపరానిదిగా అనిపిస్తుంది. 

ఆ కంపుకొట్టే బహుళజాతి కుక్కల ఆహారం దాని ప్లేట్లో పోసాను. ప్లేట్లోని గుళికల్ని పైపైన వాసన చూసింది. ఆవదం తాగిన మొహం పెట్టింది. మళ్ళీ నా దగ్గరకొచ్చి ఆశగా ఇడ్లీల వైపు చూస్తుంది. అయితే ఇప్పుడా విచిత్ర ప్రవర్తన మానేసింది. 

ధైర్యం పుంజుకుని మళ్ళీ నా క్లాస్ మొదలెట్టాను. "బాత్రూములో ఉచ్చ పొయ్యకు. understand?" అంటూ ఇడ్లీ తుంచుకుని కొబ్బరి పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాను. ఇడ్లీపై ఆశలొదిలేసుకున్న స్నూపీ నిరాశగా, దీర్ఘంగా నావైపు చూసింది. 

నిదానంగా దాని ప్లేట్ దగ్గరకి వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపు 'పెడిగ్రీ'ని వాసన చూసింది. 'ఇవ్వాల్టికి నాకిదే ప్రాప్తం. ఖర్మ!' అనుకున్నట్లుంది. దిగులుగా, అత్యంత నిదానంగా 'పెడిగ్రీ' తిని ఆకలిబాధ తీర్చుకుంది.

అమ్మయ్య! నా థెరపీ పూర్తయ్యింది. ఇక స్నూపీతో నాకే ఇష్యూ లేదు. అంచేత దాని ప్లేట్ లో రెండిడ్లీ వేశాను. స్నూపీ కళ్ళల్లో వెలుగు! ఆవురావుమంటూ ఆ ఇడ్లీలని క్షణంలో మింగేసింది. గిన్నెలో మంచినీళ్ళన్నీ గటగటా తాగేసింది.  

ఆపై నా దగ్గరకి వచ్చి తోకని విపరీతంగా ఊపుతూ, తన ఒళ్ళంతా నా కాళ్ళకేసి రుద్దుతూ.. నా ఎడమ చెయ్యిని నాకసాగింది. దాని కళ్ళనిండా ప్రేమ. కృతజ్ఞత. 'థాంక్యూ బాస్!' అన్న భావన!     
                
'అయ్యో పాపం! దీన్ని ఇంత ఇబ్బంది పెట్టానా?' అనిపించి జాలేసింది. 

అసలు స్నూపీ చేసిన తప్పేంటి? పిల్లలు గారాబం చేసి దీన్ని ఇట్లా తయరుచేసారు. ఇప్పుడిది తను కుక్కనన్న సంగతి మర్చిపోయింది. తను కూడా ఓ మనిషి ననుకుంటుంది. అందుకే బెడ్రూంలోంచి నేరుగా బాత్రూంలోకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటుంది.  

పిల్లలు చేసిన తప్పుకి నోరులేని జీవిని శిక్షించడం న్యాయం కాదు. కాబట్టి నేను పోలీసు మార్క్ మొరటు శిక్షలు మాని.. ఏదైనా sophisticated పద్ధతి ఆలోచించాలి. ఆ పద్ధతులేంటబ్బా?! 


చివరి తోక.. ఇది ఒక యదార్ధ గాధ!

(photos courtesy : meghana & budugu)    

15 comments:

  1. meeru narrate chesina vidhaanam super ga undi!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      ఈ పోస్ట్ నా పిల్లల కోసం రాశాను. వాళ్ళు కష్టపడి ఫొటోలు కూడా తీశారు.

      Delete
  2. ఇంతకీ కుక్కను ఎందుకు పెంచుకుంటారనేదానికి రకరకాలుగా చెప్తున్నారు ఇంటికి కపలాకొసమని ఒకరు తొడుకొసమని ఒకరు ఒంటరిగా ఉండలేకని ఒకరు పిల్లలు లేరు కాబట్టి పెంచుకుంటున్నామని ఒకరు. పైవన్నిటితొపాటు సమాజంలొ హొదా వస్తుందని ఒకరు ఇంతకీ మీరు దేనికి పెంచుకుంటున్నారు? డాక్టరు గారూ.

    ReplyDelete
    Replies
    1. పెంపుడు జంతువులు పిల్లలకి నేస్తాలు. పిల్లలు కూడా హాయిగా రిలాక్స్ అవుతారు.

      మా పిల్లలకి పెట్స్ అంటే ఇష్టం. వాళ్ళ ఇష్టమే నా ఇష్టం.

      Delete
  3. బావుంది మీ narration:)

    ReplyDelete
  4. "సృష్టిలో అత్యంత దుర్వాసన వచ్చు పదార్ధ మేమి? 'పెడిగ్రీ' నామధేయ బహుళజాతి కుక్కల ఆహారం."-- మొత్తం మీద బహుళజాతి సంస్థల మీద 'అభిమానం' చూపారుగా. :)

    ReplyDelete
    Replies
    1. ఫణి గారు,

      నా 'అభిమానం' గుర్తించారు. ఏదో.. అంతా నా పట్ల మీ 'అభిమానం!'

      Delete
  5. పొద్దున్న లేవగానే దాన్ని వాకింగ్ కి తీసుకెళ్తే పోలే? ఎందుకూ ఇడ్లీలు, అట్లు దాని నోట్లోంచి కొట్టడం? పాపం రాదూ? :-) వచ్చే జన్మలో మీరు కుక్కగా పుట్టి అది సైకాలజిస్టు అయితే తెలిసి వస్తుంది మీకు. హా హా

    ReplyDelete
    Replies
    1. >>పొద్దున్న లేవగానే దాన్ని వాకింగ్ కి తీసుకెళ్తే పోలే?<<

      ముందు నేను పొద్దున్నే లేవాలి. లేవను. వాకింగ్ చెయ్యను. ఒకసారి స్నూపీతో వాకింగ్ చేయిద్దామని watchman ముచ్చట పడ్డాడు. మెళ్ళో గొలుసు (అలవాటు లేదు) వేయించుకోటానికి తీవ్రంగా మొరాయించింది.

      పిల్లలు పెట్స్ ని బాగా గారం చేస్తారు. అంచేత అవి lethargic గా తయారైపోతాయి.

      Delete
  6. కాదేది బ్లాగుకనర్‌హం అని నిరూపించారు. టపా చాలా బాగుంది.

    ReplyDelete
  7. అగ్గిపుల్ల గురించి ఎప్పుడు రాస్తారు

    ReplyDelete
  8. @kamudha,

    ధన్యవాదాలు.

    ఇంతకుముందు 'సబ్బుబిళ్ళ' రాశాను. 'అగ్గిపుల్ల' రాద్దామనే ఆలోచనయితే ఉంది.

    ReplyDelete
  9. మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతాను, మీరు సబ్బుబిళ్ల మీద రాసేరని తెలుసు. అందుకే అగ్గిపుల్ల గురించి అడిగాను

    ReplyDelete
  10. Snoopy is a beautiful Ramana. I don't know whether your reward and punshment scheme worked (It seemed not tied to the task at hand), but, I am also a softie when it comes to our dogs. We have three Maltese, Rambo, Rocky and Roxy and I can tell you that they have us trained well.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.