సమయం రాత్రి ఒంటిగంట. అంతా నిశ్శబ్దం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 'జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీ'లొ రివ్యూ ఆర్టికల్ చదువుతున్నాను. విసుగ్గా ఉంది. తల పైకెత్తి చూస్తే ఎదురుగా నాన్న ఫోటో. ఫోటోలోంచి నన్నే చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది.
పుస్తకం మూసేశాను. నాన్న! నా జీవితంలో కొన్నేళ్ళపాటు ప్రతిరోజూ ప్రధానపాత్ర వహించిన నాన్న ఇవ్వాళ లేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు, మానవ సంబంధాలు.. మాకన్నీ చర్చనీయాంశాలే. ఇన్ని కబుర్లు చెప్పిన నాన్న.. పెద్దవాడైనాక.. నన్ను ఏదోక విషయంలో తిట్టేవాడు. కొన్నిసార్లు ఆయన నన్నెందుకు తిడుతున్నాడో ఆయన మర్చిపోయ్యేవాడు.. నాకూ గుర్తుండేది కాదు. ఆయన తిట్లు నాకంతగా అలవాటైపొయ్యాయి!
నాన్న 'బ్రోకర్ మాటలు!' గూర్చి ఒక పోస్ట్ రాశాను. 'బ్రోకరు మాటలు' అన్న మాట నాన్న సొంతం! ఆయనకి మతమన్నా, దేవుడన్నా చికాకు. పూజలు, పునస్కారాలు చేసే వాళ్ళని విసుక్కునేవాడు. ఆ లిస్టులో అమ్మ కూడా ఉంది. ఆ రకంగా నాన్నకి నేను కృతజ్ఞుడను. నాకెప్పుడూ 'దేవుడున్నాడా?' అనే సంశయం కూడా కలగకుండా చేశాడు.
ఆయన సిపీయం పార్టీ అభిమాని. ఆ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్యకి భయంకరమైన అభిమాని. ఆశ్చర్యమేమంటే.. నంబూద్రిపాద్ ని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా భావించేవాడు. ఎ.కె.గోపాలన్ కారణజన్ముడనేవాడు. ఇదేమి కమ్యూనిజం!
ఆయనో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. బ్రాడీపేటలోనే పుట్టి పెరిగిన కారణాన వీధివీధికి 'ఏరా!' స్నేహితులుండేవారు. ఆయన పేరు ధనుంజయరావు. స్నేహితులకి మాత్రం 'ధనంజి'. కనిపిస్తే రోడ్ల మీదే వాళ్ళతో కబుర్లు. ఆయన కబుర్లు ఎక్కువగా రాజకీయాల చుట్టూతానే. ఆయన స్నేహితులు ఇందిరాగాంధీని తిడుతుండేవాళ్ళు. మొరార్జీ దేశాయ్, కామరాజు నాడార్, వి.వి.గిరి మొదలైన పేర్లు విరివిగా వినబడుతుండేది.
నాన్న నన్ను చదువుకొమ్మని ఏ నాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన వల్ల చిత్రమైన హింసకి గురైనాను. ఆయనకి పులుసులంటే ఇష్టం. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, సొరకాయ పులుసు.. ఇదొక ఎండ్లెస్ లిస్ట్. ఆ రోజుల్లో అమ్మలు నాన్న మాట వినేవాళ్ళు! ఆయన తన పులుసులతో తీవ్రంగా బాధించేవాడు.
పోనీ సినిమాలైనా మంచివి చూపిస్తాడా అంటే అదీ లేదు. ఆయన కాంతారావు నటించిన కత్తి యుద్ధం సినిమాలన్నీ వరసగా చూపెట్టేవాడు! అన్నీ ఒకేరకంగా ఉండేవి. రాజ్ కపూర్ సినిమాలు చూపించేవాడు. ఒక్క ముక్క అర్ధమయ్యేది కాదు.
ఆయనది తన అభిరుచులే కరెక్ట్ అనుకునే హిట్లర్ మనస్తత్వం. కొంత వయసు వచ్చాక మాకు స్వాతంత్ర్యం లభించింది. పులుసుల నుండి విముక్తీ లభించింది. ఇంట్లో రకరకాల కూరలు. "ఛీ.. ఛీ.. ఇదేం వంట? గేదెలు కూడా తినవు. ఇంతకన్నా జైలు కూడు నయం." అంటూ ఒకటే సణిగేవాడు. ఇంట్లో పులుసులు తగ్గిపోడం ఒక ఇన్సల్ట్ గా భావించేవాడు.
నాన్న నేను పదో క్లాసు ఫస్ట్ క్లాస్ లో పాసయితే వాచ్ కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైతే కొనిస్తానన్నాడు. పాసయ్యాను. కొన్లేదు. మెడిసిన్ సీటొస్తే కొనిస్తానన్నాడు. సీటొచ్చింది. ఇంక తప్పలేదు. ఊరంతా తిప్పితిప్పి బేరం చేసిచేసి 173 రూపాయలతో హెన్రీ శాండెజ్ వాచ్ కొనిచ్చాడు. కొన్న వేళావిశేషం! దాన్ని ఎనాటమీ థియేటర్లో మూడో రోజే పోగొట్టుకున్నాను. ఆయన ఆ రోజు నన్ను తిట్టిన తిట్లకి చెవుల్లోంచి రక్తం వచ్చింది!
గుడిపాటి చలం చివర్లో ఆధ్యాత్మికత వైపు మళ్ళినట్లుగా.. నాన్న చివర్లో ఎన్టీఆర్ ని అభిమానించాడు. ఎన్టీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడని నమ్మేవాడు. పార్టీల పట్ల లాయల్టీలు మారినా ఆయనకి 'ఉద్ధరింపుడు నమ్మకాలు' మాత్రం మారలేదు! అయితే ఎందుకో ఆయన తను టిడిపి అభిమానిగా ఐడెంటిఫై అవడం ఇష్టపళ్ళేదు. బయటకి మాత్రం సిపియం అభిమానిగానే ఉండిపోయ్యాడు.
ఇక్కడే నేను ఆయన వీక్ పాయింట్ పట్టేశా. ఆయన సిపియం వన్నె టిడిపి! ఆయన మీద 'పులుసు' ప్రతీకారం, సినిమాల రివెంజ్ తీర్చుకోడానికి నాకో మంచి అవకాశం దొరికింది! ఆయనతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ని భయంకరంగా విమర్శించేవాణ్ణి. నా మీద విపరీతంగా ఆవేశపడేవాడు.
"ఎన్టీఆర్ ని అంటే నీకెందుకు కోపం? సిపియం పార్టీని ఏమన్నా అంటే అప్పుడను. టిడిపి ఒక బూర్జువా పార్టీ. అవునా? కాదా?" ఇదీ నా వాదన.
పాపం! ఆయన మింగలేక కక్కలేక సతమతమయ్యేవాడు. ఏమీ చెప్పలేక.. తన ఫేవరెట్ పంచ్ లైన్ వాడేవాడు.
"బ్రోకరు మాటలు మాట్లాడకు. నీలాంటి బ్రోకరు ఇంట్లో ఉంటేనే శని.. "
అమ్మ విసుక్కునేది. "భోజనాల దగ్గర ఈ గోలేంటి. వాళ్ళెవరో ఏదో చేస్తే మీరెందుకు పోట్లాడుకుంటారు?"
నా వాదనకి సమాధానం చెప్పలేక కుతకుతలాడిపోతున్న నాన్న కోపం అమ్మ మీదకి మళ్ళించేవాడు. ఆ రోజులు భర్తలకి స్వర్ణయుగం. అంచేత భర్తలు భార్యల్ని ఇంచక్కా తిట్టుకునేవాళ్ళు.
"అసలు దీనంతటికీ కారణం నువ్వే. వీడితో పాటు నాకు భోజనం పెట్టి నన్ను తిట్టిస్తావా? ప్రపంచంలో నిన్ను మించిన బ్రోకరు ఎవ్వరూ లేరు." అంటూ అమ్మ మీద ఎగిరేవాడు.
"నాన్నా! నేను నిన్ను తిట్టానా? లేదు కదా! నాకు టిడిపి అంటే ఇష్టం లేదు. అది నా ఇష్టం. ఇంతకీ మీ సిపియం వాళ్ళు టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నారా?" అలవోకగా నవ్వేవాణ్ని.
"ఈ దేశాన్ని రెండు శనిగ్రహాలు పీడిస్తున్నయ్యి. ఒకటి ఇందిరాగాంధీ. రెండు నువ్వు." అంటూ నాన్న ఆవేశపడేవాడు.
"మరి ఎన్టీఆర్ ఏ గ్రహమో?" వ్యంగ్యంగా నవ్వేవాణ్ని.
"ఇంట్లో బ్రోకరు ముండాకొడుకులు ఎక్కువైపోయారు. నా సొమ్ము తింటూ ఎద్దుల్లా బలిసి కొట్టుకుంటున్నారు." అంటూ పళ్ళు పటపట లాడించేవాడు.
తనకి నచ్చని వాదనల్ని బ్రోకర్ మాటలంటూ విసుక్కునే నాన్నని తన బ్రోకర్ మాటలతో బుట్టలో వేసుకున్నాడు ఒక మాయల మరాఠి. పేరు ఎన్వీరమణమూర్తి. రమణమూర్తి గూర్చి నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు అంటూ ఒక పోస్ట్ రాశాను.
ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మానాన్న. మేడ పైన రెండు గదుల్లో నేనూ, నా చదువుల డెన్. డెన్ కీపర్స్ లో రమణమూర్తి ముఖ్యుడు. మెడిసిన్ టెక్స్ట్ బుక్స్ తక్కువగానూ, సినిమా మేగజైన్స్ ఎక్కువగానూ చదివేవాడు. శ్రీదేవి, రేఖ, దీప బొమ్మల్ని తదేకదీక్షగా చూస్తూ.. వేడిగా నిట్టూరుస్తుండేవాడు.
కొన్నాళ్ళకి నాన్న రమణమూర్తిని పైనుండి పిలిపించి మరీ సహభోజనం చెయ్యసాగాడు. ఓ నాడు ఆయన ఉన్నట్లుండి "మీ ఫ్రెండ్స్ అందర్లోకి రమణమూర్తి ఎంతో ఉత్తముడు. అతని తలిదండ్రులు అదృష్టవంతులు." అని ఓ భారీ డైలాగ్ కొట్టాడు. ఆశ్చర్యపోయాను. వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతుంది! ఏమిటది? మర్నాడు వాళ్ళిద్దరూ భోంచేస్తున్నప్పుడు.. డిటెక్టివ్ యుగంధర్ లా వారి సంభాషణ పై ఓ చెవేశాను.
రమణమూర్తి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కంచంలో తిరపతి కొండంత అన్నం రాసి! అందులో పప్పు కలుపుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. "ఎన్టీరామారావు ఇంటర్నేషనల్ ఫిగర్. అయన్ది అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల్సినంత రేంజ్. కనీసం భారతదేశానికి ప్రధాని అవ్వాలి. అవుతాడు కూడా. రవణ గాడి (అనగా నేను)కి బుద్ధి లేదు. అందుకే వాడికి ఎన్టీఆర్ గొప్పదనం అర్ధం కాదు. ఇందిరాగాంధీ ఎక్కడా? రామారావెక్కడా?" చెబుతూనే ఉన్నాడు.
ఆశ్చర్యపోయ్యాను. ఆరి దుర్మార్గుడా! నాకు తెలిసి రమణమూర్తికి రేఖ, రాఖీల మధ్య తేడా మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీల మధ్య తేడా మాత్రం ఖచ్చితంగా తెలీదు.
నాన్న ఆనందం పట్టలేకపోతున్నాడు. "మీ ఫ్రెండ్ గాడిదకి బుద్దొచ్చేట్లు నువ్వే చెయ్యాలయ్యా. ఏవే! పాపం రమణమూర్తి ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు. పప్పు మళ్ళీ వడ్డించు. ఇంకొంచెం వంకాయ కూర వేసుకోవయ్యా. నెయ్యి సరిపోదేమో.. "
ఇది మా రమణమూర్తి గాడి కుతంత్రం. నాకు నాన్నని చూస్తే జాలేసింది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు.. బ్రోకర్ మాటలంటూ ఎంతోమందిని విసుక్కున్న నాన్న రమణమూర్తి గాడి బ్రోకర్ మాటలకి పడిపొయ్యాడు. పాపం!
ఆయన నాతో కనీసం బిపి కూడా చూపించుకునేవాడు కాదు. "నువ్వు మెంటల్ డాక్టరువి. బిపి చూడ్డం నీకేం తెలుసు." అనేవాడు. ఎన్టీఆర్ ని విమర్శించే నేను.. ఒక పెద్ద తెలివితక్కువ దద్దమ్మనని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయనకి తన కోడలు కొడుక్కన్నా మంచి డాక్టరని కూడా నమ్మకం. అంచేత ఆవిడ సలహాలే తీసుకునేవాడు.
ఆయన చివరి రోజుల్లో మంచాన పడ్డాడు. మనిషి ఎముకల గూడులా అయిపొయ్యి మంచానికి అతుక్కుపోయ్యాడు. మనం చెప్పేది అర్ధమయ్యేది కాదు. ఒకసారి ఆయన చెవిలో "నాన్నా! ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడు." అన్నాను. ఆయన కళ్ళల్లో వెలుగు! ఆయన చనిపోయినప్పుడు ఆయనకి తన బాధల నుండి విముక్తి లభించినందుకు సంతోషించాను. తను ఎంతగానో అభిమానించిన సుందరయ్య, ఎన్టీఆర్ ల దగ్గరకి వెళ్ళిపొయ్యాడనుకున్నాను.
నాన్న నాకు గడియారంలో టైం చూడ్డం నేర్పాడు. సైకిల్ తొక్కడం నేర్పించాడు. ఆంధ్రపత్రిక చదవడం నేర్పించాడు. క్యారమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు. అమ్మకి తెలీకుండా ఆనందభవన్ లో మసాలా అట్టు తినడం ఎలానో నేర్పాడు. ఆయన మహానుభావుడు కాదు. ఒట్టి భావుడు మాత్రమే! చాలా సాదాసీదాగా జీవించిన ఏ ప్రత్యేకతా లేని సగటు జీవి.
నాన్న ఫోటోని చూస్తూ..
"నాన్నా! ఎన్టీఆర్, నంబూద్రిపాద్, సుందరయ్యలు అసలు లీడర్లే కాదు! ఇందిరా గాంధీ నా అభిమాన రాజకీయ నాయకురాలు" అన్నాను.
సమాధానం లేదు. నిశ్శబ్దం! నాన్నకి కోపం రాలేదు. ఫోటోలోంచి అలాగే నన్ను నవ్వుతూ చూస్తున్నాడు! నాన్న నన్ను ఇక ఎప్పటికీ తిట్టడు. తిట్టలేడు. కాలం ఎంత క్రూరమైనది!
"నాన్నా! ఐ మిస్ యు. ఐ మిస్ యువర్ తిట్లు."
నా కళ్ళల్లో తడి.. కళ్ళు మసకబారాయి!
క్షమాపణ..
నేను చాలా తప్పు చేశాను. నాన్నతో నా వాదనల సమయానికే ఆయనలో డిమెన్షియా లక్షణాలు మొదలయ్యాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గాయి. అంచేత.. నాతో వాదించలేక.. మొండిగా మారిపోయ్యాడు. అందుకే ఆయనకి విపరీతమైన కోపం వచ్చేది. నాకా విషయం అప్పుడు తెలీదు. అందుకే ఆయన్ని నా చెత్త వాదనలతో ఇబ్బంది పెట్టాను.
(photos courtesy : నాన్న ఫోటో : బుడుగు, others : Google)
Very nice writing Ramana. No dad is ordinary and every dad is extraordinary in their own way. Thanks for the beautiful and moving words memorializing your dad and all our dads as well.
ReplyDeleteI will tell a little story of my own. I asked my dad to come for my high school graduation (I was school first or something) and my late dad said, "why should I come?, that is your duty. On the other hand if you don't do well, I will come to the school for sure". He repeated the same for my graduation from Loyola and Guntur Medical College and never showed up for any thing related to my education or career. But, I knew he was incredibly proud of me. I gave an IMA lecture in Eluru a few of years before he passed away. Finally, my dad showed up and sat in the back taking in my talk and the applause and accolades and was beaming with pride telling everyone in his earshot that I was his son.
I wish I was there with him more often. I miss him a lot.
Dear BSR,
Deleteఅమ్మానాన్నల జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. మీ నాన్నగారి జ్ఞాపకాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
చూచాయగా అందరు నాన్నలూ ఒకవిధంగా ఇల్లాగే ఉంటారని అనిపిస్తుంది. ఎందుకా వాదనలు ---- దానివలన సాధించినదేమిటి? అనిపిస్తుంది. వాదించి గెలిచామనే పైశాచిక త్రుప్తి తప్ప సాధించినదేమీ ఉండదు. మీ ఫ్రెండుగా రమణమూర్తి ఉన్నందుకు మీరు సంతోషించవలసిన విషయం. నాన్నగారికి ఆనందం ఇవ్వ కలిగాడు. మన నాన్నలకి మనం ఇవ్వాల్సినది పూర్తిగా ఇవ్వలేదు అని బాధపడటం సహజమేనేమో. ఎప్పటికీ ఇవ్వలేమో కూడా. కొంచెం హెవీ టాపిక్ తీసుకున్నారు ఈ తడవ.
ReplyDeleteఅవును. రమణమూర్తి ఆయన రూట్లోకి వెళ్ళి మెప్పు పొందాడు. వాడే కరెక్ట్. నేను కూడా అదే చేసి ఉండాల్సింది. ఆ గిల్ట్ ఫీలింగ్ నాలో ఇప్పటికీ ఉంది.
Delete(ఈ విషయం పోస్ట్ చివర్లో రాశాను.)
" ఆ రోజులు భర్తలకి స్వర్ణయుగం" ...ఇప్పుడు కాదంటారా?
ReplyDeleteచాలా బాగుందండీ..
ReplyDeleteలోకానికి ఏమైనా కానీ చాలామంది నాన్నలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి మాత్రం మహానుభావులేనండీ.
ఆ రోజులలో వాళ్ళ విలువ తెలుసు కో లేక పోయాము.
ReplyDeleteఈ రోజు అది చెబుదామంటే వాళ్ళు లేరు. మనని వినలేరు.
పుచ్చా
మీ నాన్న గారికి జ్ఞాపక శక్తి ఏకాగ్రత తగ్గి ఉండకపోతే మీరు వాదనలో ఓడిపోయి ఉండేవాళ్ళే మో ! అయినా పిల్లలకి పెద్దవాళ్ళని అర్ధం చేసుకునే సమయం వచ్చే సరికి వాళ్ళు ఉండరు :(
ReplyDeleteనాన్న తో మీ జ్ఞాపకాలు బాగున్నాయి
ఎంత గొప్ప రచయితైనా ఇటువంటి సజీవమైన పాత్రలను సృష్టించి కథ చెప్పలేడు. అందుకే నాకు ఇలాంటి అనుభవాలు చదవడమే ఇష్టం.మీరు చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
ReplyDeleteనాన్న ను మిస్ అవ్వడం దురదృష్టం నాకుకూడా
ReplyDeleteఅందరికీ వాళ్ళ వాళ్ళ నాన్నలతో గడిపిన మధురానుభూతులతో పాటు, చాలాసార్లు అలాకాకుండా ఇంకోలా చెయ్యలేదేమిటా అని బాధపడే విషయాలు కూడా గుర్తు చేసుకునేట్లు రాసావ్! ధన్యవాదాలు. ఇంత స్పూర్తితో రాయటం అందరి వల్లా కాదు రమణా! అభినందనలు - గౌతం
ReplyDelete
ReplyDeleteప్చ్! క్షమించా లేవోయ్ అని ఒక మాట అనరాదూ ఆ ఫోటో నాన్నారు ఈ డాటేరు బాబుని ?
జిలేబి.
చాలా బాగుంది.
ReplyDeleteఇంత కంటే ఏం చెప్పగలను.
నాకళ్ళూ చెమర్చాయిలే డాట్రు గారూ! చెమర్చాయి...హా!!
ReplyDeleteఇవ్వాలనుండి వారం రోజులు మా ఇంట్లో రోజూ సొరకాయ, బెండకాయ ఇత్యాది పులుసులే (కోపం వస్తే దీన్ని మించిన అస్త్రం లేదని అర్ధం అయ్యింది)
ReplyDeleteఒకే తిట్టుని ఇన్ని విధాలుగా తిట్టించుకొన్న మీరు మహానుభావులు.
@ఆ రోజుల్లో అమ్మలు నాన్న మాట వినేవాళ్ళు!
ఇలాంటి చిన్న చిన్న వివరాలు కూడా వదిలివెయ్యకుండా వ్రాసి చదవడం లో సంతోషాన్ని వందశాతం అందిస్తారు.. ఇది రావిశాస్త్రి ప్రభావమా (ఆయన రచనలు చదవలేదు)
మీ నాన్నగారు అప్పట్లో సి పి ఏం నుండి రామారావు వైపు మారినట్లే, తర్వాత బాలగోపాల్ గారి లాంటి వాళ్ళు కూడా స్వంత పంధాలో నడిచారనుకుంటాను.
పైన నవ్వుతున్న ఫోటో చాలా బాగుంది, పెద్దలఫోటో లు అలా పెట్టడమే కాని, ఇంతగా జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇదే మొదటిసారి చూడడం.
నాకళ్ళూ చెమర్చాయి....నిజం. చాలా బాగా వ్రాశారు
ReplyDelete@ఆ రోజుల్లో అమ్మలు నాన్న మాట వినేవాళ్ళు!
ReplyDelete:)
బాగుందండి పోస్ట్. డిమెన్షియ వచ్చినవాళ్ళతో ఎలా నడుచుకోవాలి?
రమణగారూ
ReplyDeleteమా నాన్నగారి స్మృతులకు అక్షరరూపం ఇవ్వాలని చాలా కాలంగా ఒక కోరిక నాలో ఉన్నది, మీరు దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు. మీ అంత అందంగా వ్రాయలేక పోయినా ప్రయత్నిస్తాను. పెద్దల స్మృతికి అక్షరరూపం ఒక అధ్బుతమైన ఆనందాన్నిస్తుంది వ్రాసుకున్న వాళ్ళకూ చదివే వాళ్ళకూ కూడా అని మీ నాన్నగారి గురించిన మీ వ్యాసం చక్కగా నిరూపించింది.
చాలా చాలా బాగా వ్రాసారు.
కళ్ళు చెమర్చాయి డాక్టర్ గారు .మా నాన్న గారు పోయే ముందు రోజుల్లో ఏంటో వీడు మూడు నిమిషాలు మాట్లాడ దమన్నా దొరకడు నాకు కూడా పెద్ద ఆఫీసర్ అయిపోయాడు అంటే ఆ విలువ అయన పోయాక తెలిసింది .అయ్యో రోజుకు కొంత సేపన్నా ప్రేమ గా మాట్లాడి వుంటే బావుండేదని .వున్నప్పుడు వాటి విలువ మనకి తెలిదు . గుడ్ అర్టికాల్ .
ReplyDeleteబ్రోకర్ మాటలు మాట్లాడుతూ మీ నాన్నను బుట్టలో వేసుకున్నాడని మీరు ఆరోపించిన రమణమూర్తి గారే నాకు మహానుభావుడిలా కనిపిస్తున్నారు. మీ నాన్న అభిమతమెరిగీ కూడా ఏమీ ఎరగనట్టే ఎన్నీఆర్ ను నిందించిన మీరే పరమ శాడిస్టులా కనపడుతున్నారు. సాధారణంగా ఏ పాఠకుడైనా రచయిత కోణం నుంచే చూస్తాడు కదా. కానీ ఎంత ప్రయత్నించినా నాకు ఇలా రివర్సులో కనిపిస్తుందేమిటి? ఏదేమైనా మీరు రాసింది చాలా బాగుంది. కానీ... మీ నాన్నగారి ప్రాభవం తగ్గుతున్న కొద్దీ మీ హయాం వస్తున్నకొద్దీ పులుసు కూరలు వండకపోవడాన్నిమాత్రం నేను త్రీవ్రంగా ఖండిస్తున్నాను. ... యాసీన్
ReplyDeleteనా పోస్ట్ చదివి స్పందించిన మిత్రులకి పేరుపేరునా ధన్యవాదాలు.
ReplyDelete(వ్యక్తిగతంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని ఉన్నా.. సమయం కుదరట్లేదు. మరీ ఆలస్యం అయిపోయేట్లుగా ఉంది. మన్నించగలరు.)
అమ్మానాన్నల కబుర్లు రాయడం నాకెంతో ఇష్టం. ('అమ్మ.. నేను.. పెళ్ళి కబుర్లు' లో అమ్మ గూర్చి రాశాను.) మనం తలిదండ్రులతో గడిపే క్షణాలు అపురూపమైనవి. ఈ విషయం మనకి అప్పుడు తెలీదు. తెలిసేప్పటికి వారు మనతో ఉండరు.
హాస్పిటల్ ICU లో ఉన్నప్పుడు.. నాన్నకి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయింది. ఆయనకి నా రక్తం మాత్రమే match అయ్యింది! నాన్నకి రక్తం ఇచ్చాను.
"ఓరే! నీ తలతిక్క వాదనలతో నాన్నని బాగా విసిగించావ్. అందుకే ఇవ్వాళ నాన్న నీ రక్తం కళ్ళ జూశాడు." అంటూ అక్క నన్ను ఆట పట్టించింది!
See this link sir. your liking for balayya will be doubled....
ReplyDeletehttp://www.youtube.com/watch?v=Wagd9KzkCTk
నా కళ్ళు తడిచేసారు. మీరు దూకుడు సినిమా చూశారా? చూడకపోతే ఒక్కసారి చూడండి.
ReplyDeleteథాంక్యూ! దూకుడు డివిడి చూశాను. బాగుంది.
Deleteనాన్న స్మారక టపాని కూడా మీదైన శైలిలో హాస్యభరితం చేశారు.
ReplyDeleteస్మారక టపాలు గంభీరంగా రాస్తుండటం తెలుగులో అనవాయితీ. అయితే అది మనం ఎవరి గురించి స్మారక టపా రాస్తున్నామో.. ఆ వ్యక్తి జ్ఞాపకాలపై ఆధారపడి ఉంటుంది.
Deleteఉదాహరణకి నా మిత్రుడు చంద్ర గూర్చి సీరియస్ గానే రాశాను. నాన్న గూర్చి మాత్రం సరదాగానే రాయాలి. ఎందుకంటే ఆయన సరదాగా, హడావుడిగా ఉండేవాడు. ఆయన తిట్టినా నవ్వొచ్చేది. నా స్నేహితులు ఆయనక్కూడా స్నేహితులే!
వ్యాఖ్యకి ధన్యవాదాలు.
నాన్న గురించి చాలా బాగా రాసావు రమణ. బ్రాడీపేట రెండవ లైనులో ముందులో ఒకటవలైనులొతరువాతి కాలంలో అంటె ఇల్లు మారినతరువాత రెండవలైనులో నాన్న సైకిలు రై మంటూ తొక్కడం నాకు ఇంకా గుర్తు .ఆయన ఒక్కడే నన్ను ప్రకాష్ అని పిలిచేవాడు .ఒక ప్రత్యేక మైన అభిమానం చూపించేవారు ,నేను నాకు తెలిసిన ,ఇష్టమైన సినెమాలు గురించి మాత్రమే మాట్లాడే వాడిని ఆయనతో పాలిటిక్స్ తెలియక. అయన దగ్గరనుంచి కన్నాంబ ,భానుమతిల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను .నీ బ్లాగు చదివిన తరువాత గతం చాల గుర్తుకొచ్చినది .నీవు వ్రాసే ప్రతీ బ్లాగు చదువుతునే వున్నను నీకు వచ్చే ప్రశంసలు చూచి చాల ఆనందిస్తున్నాను . నా ఆనందాన్ని కామెంట్ రూపమలో తెలియచేయాలని ఎప్పటి కప్పుడు ప్రయత్నించి విఫలుడౌతున్నాను . అది నా దురద్రుష్టం . మన గౌతం భాష లో నీవు నా లంగోటీ మిత్రుడవని చెప్పుకోవడానికి చాల గర్వపడుతున్నాను .
ReplyDeleteప్రియ మిత్రమా,
Deleteమంచి కామెంట్ రాశావు. థాంక్యూ!
ఆయనకి నీపై ప్రత్యేకాభిమానానికి ఒక కారణం ఉంది. నీవల్లనే నాకు medicine seat వచ్చిందని ఆయన నమ్మకం. (ఆయన నా సీట్ క్రెడిట్ అంతా నీ ఖాతాలో వేసేశాడు. ఇది అన్యాయం.)
నాన్న జ్ఞాపకాలు నీకు నచ్చాయంటే.. నేను బాగానే రాశానని అనిపిస్తుంది. (ఎందుకంటే నీకాయన బాగా తెలుసు కనుక).
ఆర్ధ్రమైపోయింది మనసు, 'వాదించలేక మొండిగా మారిపోవడం' ముసలితనానికే పరిమితం కాదేమో.
ReplyDeleteఇటువంటి వాదనలు మా ఇంటికే ప్రత్యేకమనుకునేదాన్ని. కాదని తెలుసుకున్నా...