Wednesday 6 March 2013

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు!


ఈమధ్య 'ఎ బ్యూటిఫుల్ మైండ్' అనే ఇంగ్లీషు సినిమా చూశాను. ఇది అప్పుడెప్పుడో ఆదుర్తి సుబ్బారావు తీసిన మన తెలుగు 'మంచి మనసులు' సినిమాకి డబ్బింగ్ కాదు, అనేక ఆస్కార్ అవార్డులు పొందిన ఘనచరిత్ర కలిగిన ఒక హలీవుడ్ చిత్రరాజము. 

ఈ సినిమా చూడాలని కొంతకాలంగా అనుకుంటున్నాను, కారణం - ఈ సినిమా స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడిన ఒక ప్రొఫెసర్ ఆత్మకథ ఆధారంగా తీసార్ట, కొద్దిగా ప్రొఫెషనల్ ఇంటరెస్ట్. ఆడవాళ్ళకి ఏడుపు సినిమాలంటే, పిల్లలకి ఫైటింగు సినిమాలంటే, ఫ్యాక్షనిస్టులకి ఫ్యాక్షనిస్టు సినిమాలంటే ఆసక్తి. నాకూ అంతే!

నేనొక సినిమా చూడాలంటే, ముందు ఆ CD దొరకాలి. తరవాత తీరిగ్గా నా ట్రెడ్మిల్ (ట్రెడ్మిల్ అనగానేమి? కాళ్ళ కింద ఒక పట్టా కరెంటు సాయంతో కదుల్తుంటుంది, మనం పరిగెట్టకపోతే కిందపడి మూతిపళ్ళు రాల్తాయి. అంచేత - రొప్పుతూ, రోజుతూ.. కింద పడిపోకుండా మనని మనం కాపాడుకోటం కోసం ఆ పట్టా మీద పరిగెడుతూనే ఉండాలి. దీన్నే 'వ్యాయామం' అని కూడా అంటారు) సమయంలో చూస్తాను.

సరే! ఈ 'ఎ బ్యూటిఫుల్ మైండ్' సినిమా CD సంపాదించాను. సినిమా చూడ్డం కోసం రొండ్రోజుల నా ట్రెడ్మిల్ సమయం ఖర్చు పెట్టాను. ఈ సినిమా నేను ఒక సాధారణ ప్రేక్షకుడిలా వినోదం కోసం చూడలేదు. అనేకమంది స్కిజోఫ్రీనియా పేషంట్లని వైద్యం చేస్తున్న సైకియాట్రిస్టుగానే చూశాను (చూశారా! ట్రెడ్మిల్ సమయంలో కూడా నా వృత్తి ధర్మాన్ని ఎంత దీక్షగా నిర్వహించానో)!

ఇప్పుడు స్కిజోఫ్రీనియా వ్యాధి గూర్చి  సంక్షిప్తంగా రెండు ముక్కలు. స్కిజోఫ్రీనియా రోగులకి చెవిలో మాటలు (వారికి మాత్రమే) వినబడుతుంటాయి. ఇలా వినబడడాన్ని 'ఆడిటరీ హేలూసినేషన్స్' అంటారు. రోగులు తీవ్రమైన అనుమానాలు, భయాలకి గురి అవుతుంటారు. వీటిని 'డెల్యూజన్స్' అంటారు. వీరికి సరైన సమయంలో వైద్యం చేయించకపోతే రోగికి, కుటుంబానికి, సమాజానికి చాలా ప్రమాదం.

స్కిజోఫ్రీనియా వ్యాధితో (వైద్య సహాయం లేక) బాధ పడుతున్నవారిని మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. చిరిగిన బట్టలతో, పెరిగిన జుట్టుతో, తమలో తామే మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ.. కాయితాలు, చెత్త ఏరుకుంటూ.. మురుక్కాలవల్లో నీళ్ళు తాగుతూ.. కనబడుతుంటారు. ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి (వైద్యం చేయించకపోతే) అత్యంత తీవ్రమైనది.

'సినిమాలో స్కిజోఫ్రీనియాని ఎలా చూపించారు?'. ఈ సినిమాలో ఒక గొప్ప టెక్నిక్ వాడారు. సినిమా సగంలో మనం ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి. సినిమాలో అప్పటిదాకా మనం చూస్తున్న కొన్ని ప్రధాన పాత్రలు, సంఘటనలు నిజం కాదు. అవి హీరో ఊహల్లోని పాత్రలు. అతని ఆలోచనలకి దృశ్యరూపం. (అతడు అనుమానాలు, భయాలతో కొన్ని ఊహాజనిత పాత్రలు సృష్టించుకుని, వాటితో సంభాషిస్తుంటాడు.)

స్కిజోఫ్రీనియా వ్యాధిలో రోగికి చెవిలో మాటలు వినిపించడం (ఆడిటరీ హేలూసినేషన్స్) చాలా సాధారణం. ఆ మాట్లాడే మనుషులు కనబడటం (విజువల్ హేలూసినేషన్స్) అత్యంత అరుదు. అయితే సినిమాలో కొన్ని సంవత్సరాల తరబడి హీరోకి మూడు పాత్రలు కనబడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు హీరోతో సంభాషిస్తూనే ఉంటాయి!

ఒక సీనియర్ సైకియాట్రిస్ట్ (Christopher Plummer) యూనివర్సిటీ కేంపస్ లోకి వెళ్ళి, హీరోతో చెంప దెబ్బ తిని మరీ ఇంజెక్షన్ పొడిచి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు (ఇదేదో 'ప్రజల వద్దకు పాలన'లా ఉంది). అమెరికాలో అలా పేషంట్ల దగ్గరకి డాక్టర్లే వెళ్ళి, ఇంజక్షన్లు పొడిచి, వేన్లలో వేసుకుని మెంటల్ హాస్పిటల్స్ లో పడేస్తారేమో నాకు తెలీదు. మన డాక్టర్లకి మాత్రం హాస్పిటల్ దాటి బయటకి వెళ్ళే అలవాటు లేదు (రావిశాస్త్రి చెప్పినట్లు, ఇక్కడ పులి ఆహారం కోసం వెదకదు. ఆహారమే పులిని వెతుక్కుంటూ వస్తుంది).

స్కిజోఫ్రీనియా వ్యాధి, అందునా తీవ్రమైన హేలూసినేషన్స్ (భ్రమల) తో బాధ పడుతూ command hallucinations ని అనుసరించి కొడుకు చచ్చిపోయేంత పరిస్థితి తెచ్చుకుని భార్యపై దాడి చేసిన పేషంట్, అటు తరవాత మందులు వేసుకోకుండా, ఆ రోగంతోనే సహజీవనం చేసెయ్యడం ఆశ్చర్యమే కాదు, అసాధారణం కూడా. 

ఈ సినిమాలో చూపించినంత తీవ్రస్థాయిలో రోగ లక్షణాలు ఉన్నవారు, వైద్యం మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది. వారికి క్రమేపీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, జీవితం ఆసక్తి తగ్గి ఒక్కోసారి ఆత్మహత్యకి దారి తీయడం జరుగుతుంది. నా పేషంట్లలో కొందరు, పట్టించుకునేవారు లేక అలాగే ఉండిపోయి (catatonic state), ఆహారం లేక ఆకలితో మాడి చనిపోయినవారు ఉన్నారు (starvation deaths). అయితే - కొందరు స్కిజోఫ్రీనిక్స్ తమకి మాత్రమే వినబడే మాటలకి (auditory hallucinations) కి అలవాటైపోతారు. అయితే ఆ మాటలు స్నేహపూర్వకంగా కబుర్లు చెబుతుంటాయి, ఒక్కోసారి రోగిని మెచ్చుకుంటుంటాయి కూడా!

అయితే - సినిమాలో (హీరో ఊహాజనిత) డిటెక్టివ్ పాత్ర (Ed Harris) హీరోని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ డిటెక్టివ్ హీరో చెవిలో అదే పనిగా మాట్లాడుతూ (running commentary hallucinations) తో ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఊహాజనిత పాత్రలు హీరోని నీడలా వెంటాడుతుంటాయి! (నాకు Guy de Maupassant దెయ్యం కథకొటి గుర్తొచ్చింది.)

మానసిక వ్యాధితో బాధపడిన ప్రొఫెసర్ గారు తన కథ గొప్పగా రావడం కోసం నాటకీయత సృష్టించాడా? లేక కథ రాయడంలో ఆయనేమన్నా తికమక పడ్డాడా? లేక సినిమా కోసం కథలో మసాలా దినుసులు దట్టించారా? తెలీదు! అందుకే - symptoms ఇంత తీవ్రంగా ఉండి కూడా ఎకడెమిక్స్ లో బ్రిలియంట్ గా కంటిన్యూ అయిపోతాడు, నోబెల్ ప్రైజ్ కూడా కొట్టేస్తాడు!

ఆశ్చర్యం! ఇది ఒక నోబెల్ లారెట్ బయోగ్రాఫిక్ స్టోరీ. సినిమా కోసం 'వినబడే' మాటల్ని 'కనబడే' పాత్రలుగా మార్చేసి డ్రామా సృష్టించారు.. ట! హీరో నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ (ఆస్కార్ అవార్డ్ అందుకున్నట్లు) గొప్ప ఉపన్యాసం ఇచ్చేస్తాడు! అంతా గందరగోళంగా లేదు?

ఈ సినిమా గూర్చి ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నానంటే, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఈ సినిమా గూర్చి చెబుతూ, ఇదొక సీరియస్ రోగం గూర్చి గొప్ప రీసెర్చ్ చేసి తీసిన మంచి సినిమాగా చెప్పారు.. అందుకని. వాస్తవానికి ఈ సినిమాలో ఎక్కువ సీన్లు డ్రామా కోసం మాత్రమే సృష్టించబడ్డాయి.

సరే! హాలీవుడ్ వాడిని ఏదైనా అనేముందు 'మన సంగతేంటి?' అని మీరు అనొచ్చు. మన తెలుగు సినిమా దర్శకుల గూర్చి రాసేంత సాహసం నేను చెయ్యలేను (బియ్యంలో మట్టి గడ్డలు ఏరడం ఈజీ, బియ్యం ఏరడం కష్టం). మనవాళ్ళు అనాదిగా మానసిక రోగుల్ని జోకర్లుగా, శాడిస్టులుగా చిత్రీకరించారు. కారణాలు అనేకం. వారికి మానసిక రోగుల పట్ల కనీస గౌరవం, అవగాహన లేకపోవడం.. కథ రాసుకునేప్పుడు కనీసస్థాయిలో రీసెర్చ్ చెయ్యకపోవడం ప్రధాన కారణాలు.

చివరి తోక :

సుబ్బు ఈ సినిమా చూస్తే ఏమంటాడు?

"రమణ మామ! ఇదేం సినిమా? ఇదసలు సినిమానేనా? ఇంతా చేసి హీరో చివరాకరికి మానసిక రోగిగానే మిగిలిపొయ్యాడు. ఈ సినిమా బాపురమణలు తీసినట్లైతే హీరో భార్యతో రామకోటి రాయించి, ఆ భద్రాద్రి రాముడి కృపతో భర్త రోగం నయమైనట్లు చూపించేవాళ్ళు. ఆ విధంగా బాపురమణలు రామాయణంపై తమ భక్తిని నలభై లక్షల రెండోసారి ప్రదర్శించుకునేవారు.

కె.విశ్వనాథ్ అయినట్లైతే నృత్యసంగీతాలతో హీరోగారి బుర్ర తిరిగిపొయ్యేట్లు చేసి, సారీ - నయం చేసి, మన కళల గొప్పదనాన్ని ఇరవై లక్షల నాలుగోసారి నిరూపించేవాడు. కనీసం దాసరి స్టైల్లో హీరో తలకి దెబ్బ తగిలి రోగం కుదిరినట్లు చూపించినా బాగుండేది. అసలీ సినిమానే రుచీపచీ లేని పెసరట్టులా ఉంటే, అందులో మళ్ళీ నీ బోడి ఎనాలిసిస్సొకటి!"

(photos courtesy : Google)

42 comments:

  1. సినిమా గురుంచి మరియు మానసిక రోగము గురుంచి మంచి సమాచారం అందించారు . నాకు చిన్న సందేహం మనకి వచ్చే కలలు కూడా ఏది ఐన మానసిన రోగామా ?

    ReplyDelete
    Replies
    1. ఒకప్పుడు ఫ్రాయిడ్ కలల్ని చాలా హైలైట్ చేశాడు.

      ప్రస్తుతం కలలకి (మానసిక వైద్యంలో) పెద్దగా ప్రాధాన్యత లేదు.

      Delete
  2. ఫ్యాక్షనిస్టులకి ఫ్యాక్షనిస్టు సినిమా చూడాలంటే ఉత్సాహం. నాకూ అంతే! అంతకు మించి ప్రత్యేకతేమీ లేదు.
    --------------------------------------------
    నేనూ ఈ సినీమా చూశాను (చాలా ఏళ్ళ క్రిందట). చూసిన తరువాత సానుభూతితో అబ్బుర పడ్డాము కానీ దీనిలో ఇంత ప్రగాఢమైన పరిజ్ఞానం ఉందని అనుకోలేదు. ఏది ఏమైనా కొంచెం పెద్ద యునివర్సిటీలలో ఇటువంటి వాళ్ళు కొందరు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది రియల్ స్టొరీ కదా. మేము మీ కళ్ళతో చూస్తూంటే వాళ్ళతో కొంచెం జాగర్తగా ఉండాలల్లె ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఈ సినిమా నాకూ నచ్చింది. స్కిజోఫ్రీనియా వ్యాధి గూర్చి చాలానే చూపించారు. ఈ మాత్రం వాస్తవికతతో తీసిన సినిమా నేనింతవరకూ చూళ్ళేదు.

      అయితే.. నే ముందే చెప్పినట్లు.. నా పోస్ట్ పూర్తిగా psychiatrist point of view.

      Delete
  3. క్షమించాలి, మీరు మానసిక వైద్యులు కాబట్టి మీ కోణంలో మీరు ఆలోచిస్తారు. బాపురమణలు రామభక్తులు కాబట్టి వారు ఆ కోణంలోనే పరిష్కారాన్ని ఆలోచిస్తారు, సూచిస్తారు. కళాతపస్వి కాబట్టి విశ్వనాధ్ గారు ఆ విధంగానే ఆలోచిస్తారు. ఎవరి నేపధ్యాన్ని బట్టి వారు సూచించే సొల్యూషన్ ఉంటుంది. మీరు ఎగతాళిగా అంటున్నారో లేక మామూలుగా అన్నారో తెలియదు.
    రామకోటి రాయడమంటే ఒక జీవితకాలపు కమిట్మెంట్ అవసరం.కొన్ని సంవత్సరాలు పట్టే ఒక మహా యజ్ఞం. వారూ వీరూ అనడం కాదు, మీరు ఒక సంవత్సరం పాటు రామనామం జపించి చూడండి, మీకే తెలుస్తుంది. అలాంటిమహాకార్యాన్ని హాస్యంకోసం వాడకండి.

    ReplyDelete
  4. సినిమా అన్నాక కొంత కల్పన ఉంటుంది. ఆమాత్రానికే అంత చిరాకు ఎందుకు లెండి. అయినా ఎక్కడా లేని (మాకు తెలిసినంతవరకూ) సుబ్బు మీ ఇంటికొచ్చి రోజుకో కప్పు కాఫీ ఫ్రీగా తాగేస్తూంటే తప్పులేనిది, సినిమాలో పాత్రలు కనబడితే తప్పేంటి? వినబడే ధ్వనుల ఆధారంగా మన మనసు ఊహా చిత్రాలు సృష్టించలేదా? ఏమో తనకి ఆ పాత్రలు మనోఫలకం మీద కనబడే చాన్సు ఉండొచ్చుగా.

    ఎప్పట్లాగే మధ్యలోకి విశ్వనాథ్ ని బాపు ని లాగి పడేసారు. ఈ మధ్య మీకు రాజకీయం వంటబట్టింది!. కాని డాట్రారు, మీ రావిశాస్త్రి చెప్పింది మీకెలా గొప్పగా అనిపిస్తుందో, బాపూనో, నాథో చూపించే సినిమాలు వారి వారి అభిమానులకి నచ్చవచ్చు. కెబ్లాస వారు చెప్పినట్లు ఇక్కడ "బ్లాగు రాసాక కెలకబడటం లేదు, కెలికించుకోవాలనే బ్లాగు రాయబడుతోంది!"

    కె విశ్వనాథ్ సినిమాలో మీకు సంగీత సాహిత్యాలే కనబడ్డాయిగాని, అంతర్లీనంగా తను చూపించిన అభ్యుదయ భావాలు మీకు కనబడకపోవటం విచిత్రం. ఏం చేస్తాం అందరి మైండ్లూ బ్యూటిఫుల్లేం కాదు కదా!

    ReplyDelete
  5. అసలీ సినిమానే రుచీపచీ లేని పెసరట్టులా ఉంటే.. అందులో మళ్ళీ నీ బోడి ఎనాలిసిస్సొకటి!
    cinema maatemo gaani analysis maata maatram meerannattu nijam!

    ReplyDelete
    Replies
    1. మీరు సినిమా చూశారా? నేను సినిమాని విమర్శించడం మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టిందా!!!

      మీ బాధల్లా ఆ చివరి వాక్యాల పట్ల అనుకుంటాను.

      తెలుగు దర్శక దేవుళ్ళని విమర్శించడం ప్రేక్షక భక్తకోటి తట్టుకోలేదని తెలుసు. అందుకే సుబ్బు ముందే అక్షింతలు వేసేశాడు!

      Delete
  6. డాక్టరుగారి మాటలు చదివి కొంత మంది ఆవేశపడిపోతున్నారు. కాని రమణగారు చెప్పినది నిజం. సినిమాలు తీసేవాళ్ళు యేదేశం వాళ్ళైనా, భాష వాళ్ళైనా పాత్రలని శాస్త్రీయదృక్పధంతో కాక నాటకీయతతోనే మలుస్తారనీ, ముగింపు విషయంలోనూ తర్కబద్ధతా శాస్త్రీయతా సహజత్వాలకన్నా అద్భుతరసం పండించే కోణంలోనే ప్రయత్నిస్తారనీ డాక్టరు గారి అభిప్రాయం.

    సినిమా అనేది ఒక అధ్భుతమైన మాధ్యమం. దీనితో సమాజానికి అవసరమైన వైజ్ఞానికమైన అవగాహనలు కలిగించే కథలను అందించే అవకాశం ఉన్న చోట కూడా సినిమా రచయితలూ దర్శకులూ ఇంకా నాటకీయతాచర్వితచరణపారవశ్యత లోనే తాము ములుగుతూ జనాన్ని ముంచుతూ యెంచుకున్న విషయానికి అన్యాయం చేస్తున్నారని రమణగారి ఆవేదన. దీనికి వారి మీద అసహనం ప్రదర్శించవలసిన అవసరం లేదు.

    డాక్టరుగారు యెవరి రామభక్తినీ యెద్దేవా చేయటమూ జరగలేదు, మన యే మహాదర్శకులవారి అభ్యుదయభావాలనూ కించపరచటమూ జరగలేదు. ఇక్కడ ఈ వ్యాసంలో యే రాజకీయమూ లేదు.

    ReplyDelete
    Replies
    1. మీ మాటను నేను సమర్థిస్తున్నాను...నా అభిప్రాయం కూడా ఇదే....

      కొందరికి ఎందెందు వెతికినా అందందె అదే కానవచ్చును కనుక తప్పు లేదు వారి వారి కి కనిపించింది"వినిపించింది" -అర్థం అయిందాన్నిబట్టీ కామెంటనీఎయండి!.
      కానీ సుబ్బుని మాత్రం ఏమనకండి మీఅభిమానం దర్శకుల మీద,నా అభిమానం సుబ్బు మీద!.

      Delete
  7. Have seen the movie "3", That also based on Schizophrenia, It is dealt well as for as my limited knowledge goes.

    ReplyDelete
  8. John Nash గారికి నోబెల్ వచ్చింది గణితశాస్త్రంలోకాదు. "స్కిజోఫ్రీనియాశాస్త్రం"లో. ఈ విషయంలో మీరు పొరబడడము కడుంగడు విచారకరము :).

    స్కిజోఫ్రీనియా ఉన్నా కొందరు ఇతరరంగాల్లో బాగానే రాణించవచ్చంటారే. అది నిజం కాదంటారా?

    మీ టపాకి సంబంధంలెని వ్యాఖ్య : ఈ మధ్య ఒక పుస్తకంలో సృజనాత్మకతకీ, పిచ్చికీ (పుస్తకంలో madness అనేవాడారు మరి) తేడా ఏంటి అని చర్చిస్తూ Good Will Huntingలోని Will Huntingకీ, A Beautiful Mindలోని John Nashకీ ఉన్నతేడా వంటిది అని చెప్పారు ఆధరులవారు. Noiseలోంచి patternsని కనుగొని వేరుచేయగలగటం creativity అవుతుంది, John Nashగారిలా అసలు ప్రతిదాంట్లోనూ నాయిసేలేకుండా అన్నీ ప్యాటర్నులేకనబడుతుంటే దాన్ని పిచ్చిగా పరిగణించాలి అంటాడు.

    ReplyDelete
    Replies
    1. Notable awards: John von Neumann Theory Prize (1978), Nobel Memorial Prize in Economic Sciences (1994)
      Ref: http://en.wikipedia.org/wiki/John_Forbes_Nash,_Jr.

      Delete
    2. శ్యామలీయం గారు : నేను స్కీజోఫ్రెనియాశాస్త్రం అన్నది సరదాకి మాత్ర్రమే.

      Game theoryలో చేసిన కృషికి గణితంలో ప్రైజువచ్చిందేమోననుకున్నాను. వచ్చినది ఆర్ధికశాస్త్రంలోననీ మీవ్యాఖ్యవల్ల తెలిసింది. ఈ ఆర్ధికశాస్త్ర నోబెల్ గురించి కూడా సమాచారం చదువుతున్నాను. Thank you very much.

      Delete
  9. పనిలో పని "లగే రహో మున్నాభాయ్" గురించి కూడ వ్రాసేయండి.
    మాకు కాస్త ఈజీగా అర్థమవుతుంది.

    ఉచిత సలహా: బాపు, విశ్వనాథ్, బాలు గార్లని విమర్శిస్తే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.

    ReplyDelete
    Replies
    1. వాడెవడో హాలీవుడ్ వాడు అప్పుడెప్పుడో ఏదో సినిమా తీశాడు. సొమ్ము చేసుకున్నాడు. నేనది దశాబ్దం తరవాత గుంటూర్లో చూశాను. చూసి ఊరుకోకుండా ఒక పోస్ట్ రాశాను. నాకు బుద్ధి లేదు. కాబట్టే సమయం వృధా చేసుకుంటున్నాను.

      ఇప్పుడు మీరు హొమ్ వర్క్ ఇచ్చినట్లు ఇంకేదో సినిమా (?) గూర్చి రాయమని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం.

      మీ ఉచిత సలహాకి ధన్యవాదాలు. నా భావాలు నిర్మొహమాటంగా వ్యక్తీకరించే స్వేచ్చ నాకు ఉందని నమ్ముతున్నాను. అవి జనరంజకంగా ఉండాలని నేను భావించట్లేదు. నా 'మనోభావాలు' వ్యక్తం చేసినందువల్ల కొందరి 'మనోభావాలు' దెబ్బ తింటే తిననివ్వండి. ఎవరి గోల వారిది.

      (ఇంట్లో గుమ్మడి.. బయట చిత్తూరు నాగయ్య.. ఇంక బ్లాగుల్లో కూడా ఎక్కడ నటించేది!)

      Delete
    2. మీకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా నా వ్యాఖ్యలు తొలగించవలసిందిగా కోరుతున్నాను.

      Delete
    3. బోనగిరి గారు,

      నా సమాధానం రంగనాయకమ్మ స్టైల్లో మరీ నిర్మొహమాటంగా ఉంది. సారీ!

      నాకస్సలు ఇబ్బంది కలగలేదు. I always enjoy your comments in my blog. Thank you.

      Delete
  10. స్కిజోఫ్రీనియా వ్యాధి సంపన్నులకు మాత్రమె వస్తుందని అనుకున్నాను.సోమరిపోతుగా ఉంటూ భార్యా పిల్లలచే నిర్లక్ష్యం చెయ్యబడి, బండువులలో కూడా మర్యాదని కోల్పోయిన వారు ఈ వ్యాధి పీడితులై ఉండే అవకాసం ఉందన్నమాట. అయ్యో

    ReplyDelete
    Replies
    1. Schizophrenia effects nearly 1% of population. disturbance in the dopaminergic neurotransmitters pathway is considered to be the etiopathology.

      కావున స్కిజోఫ్రీనియాకి వర్గబేధం లేదు!

      Delete
  11. @పనిలో పని "లగే రహో మున్నాభాయ్" గురించి

    bonagiri గారు చాలా షార్ప్ గా పట్టేశారు :)

    ReplyDelete
  12. Ramana sir,

    Let me answer to few questions of yours, sorry for using English.


    ముందుగా, అదెదో సినిమాలో స్వాతి చెప్పినట్టు, జాన్ నాష్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి :-)

    John Nash is no ordinary person, when he came to our university in 2007, our College arranged a meeting with Nash and students, for that our faculty received calls from President of SL, our PM personally recommending few students for that meeting. Ofcourse he dint bothered to answer any question, he was in his own state.

    He contributions to Differential Geometry and Economics are enormous.

    >>. అమెరికాలో అలా పేషంట్ల దగ్గరకి డాక్టర్లే వెళ్ళి.. ఇంజక్షన్లు పొడిచి.. వేన్లలో వేసుకుని మెంటల్ హాస్పిటల్స్ లో పడేస్తారేమో నాకు తెలీదు.

    He is no ordinary person sir, US govt. is not like ours to let such people rot to hell (ex. C.P.Ramanujam), infact he waged legal wars against such a practice, and finally he won after spending 5 months in involuntary hospitalization, later in his live this happened many times.

    >>
    ఈ సినిమాలో చూపించినంత తీవ్రస్థాయిలో రోగ లక్షణాలు ఉన్నవారు.. వైద్యం మానేస్తే.. వ్యాధి ముదిరిపోతుంది.
    >>

    You are partly correct, he extensively suffered from audio hallucinations, but he says he suffered with visual hallucinations for a brief period, but able to over come that.

    He never took any medicines after 1970. And he is not such one, there is another Polish Mathematician who never took any medicines for Schizophrena, and worked life long in Maths, produced many beautiful and important results.

    >>ఆయన ఎకడెమిక్స్ లో బ్రిలియంట్ గా కంటిన్యూ అయిపోతాడు. నోబెల్ ప్రైజ్ కూడా కొట్టేస్తాడు!

    This is completely wrong, you can see in movie when Nash's fren comes to his home after birth of first child, he says he works on some open problem on Differential Geometry (the problem is still open and he still says he is working on that problem), you can see there is nothing on it except some non sense (you can observe that from his frens reactions too).

    Infact after their child born in early 60s he stopped his work completely saying he can't think rationally due to delusions.

    You can see his publications at
    http://web.math.princeton.edu/jfnj/texts_and_graphics/

    and the same is written at

    http://www.nobelprize.org/nobel_prizes/economics/laureates/1994/nash-autobio.html#

    His Nobel prize award is for his work which he did on Nash Equilibrium, every thing was before 1960, the movie portrays the same.

    >>హీరో నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ (ఆస్కార్ అవార్డ్ అందుకున్నట్లు) గొప్ప ఉపన్యాసం ఇచ్చేస్తాడు

    He never took any medicines after 1970 and he never stable after 1960, this speech is not true.

    To add, there are few other people like Nash (I cant recollect their names now) who suffered with schizophrenia (visual delusions) but did very excellent work, but most of them (almost all of them) either committed suicide around 40years (or late 30s) or died of starvation when some one whom they believed died.

    Finally
    http://usatoday30.usatoday.com/news/opinion/2002/03/04/ncguest2.htm

    In the movie, Nash — just before he receives a Nobel Prize — speaks of taking "newer medications." The National Alliance for the Mentally Ill has praised the film's director, Ron Howard, for showing the "vital role of medication" in Nash's recovery. But as Sylvia Nasar notes in her biography of Nash, on which the movie is loosely based, this brilliant mathematician stopped taking anti-psychotic drugs in 1970 and slowly recovered over two decades. Nasar concluded that Nash's refusal to take drugs "may have been fortunate" because their deleterious effects "would have made his gentle re-entry into the world of mathematics a near impossibility."

    ReplyDelete
    Replies
    1. తార గారు,

      నా పోస్ట్ కన్నా మీ కామెంటే బాగుంది. చాలా వివరంగా వివరాలతో రాశారు. థాంక్యూ!

      I wrote this post keeping the natural course of floridly symptomatic paranoid schizophrenics i see regularly in my clinic.

      "schizophrenia Bulletin" journal publishes first person account of psychosis. sometimes i read them.

      Today we have the luxury of having so many newer anti psychotics and we see a good prognosis in schizophrenia. But some sixty years ago.. probably the medication is more painful than the actual disorder.

      About 'John Nash'.. i don't know much about this case per se. Thanks for adding so much of information.

      Delete
  13. రమణ గారు,
    నా అభిమాన సినిమా గురించి వ్రాసినందుకు ధన్యవాదాలు. నేను మూడవ సారి చూసినప్పుడు అర్థం అయ్యింది ఎవరు నిజమైన పాత్రలు, ఎవరు జాన్ నాష్ ఉహల్లొ పాత్రలు అని. నేను ఈ సినిమా కనీసం పది, పదిహేను సార్లైనా చూసి ఉంటాను. నాకు బాగా నచ్చిన సీన్-
    జాన్ నాష్ కు నోబెల్ ఇస్తున్నారు అని చెప్పడానికి ఒక ప్రతినిథి వస్తాడు. జాన్ నాష్ , అప్పుడే ఒక క్లాసు లో పాఠం చెప్పి బయటకు వస్తుంటాడు, ఆ ప్రతినిధి ని ఒక స్టూడెంట్ కు చూపించి, నీకు కనిపిస్తున్నాడా అని అడుగుతాడు.
    నోబెల్ తీసుకున్న తరువాత చేసే ప్రసంగం కుడా చాల motivating గా ఉంటుంది. నాటకీయత ఎక్కువ అవ్వడం, శాస్త్రీయం గా లేకపోవడం నిజమే కావచ్చు. సినిమా లో చూపించి నట్లు గా, నోబెల్ వచ్చే సమయానికి జాన్ నాష్ భార్య కుడా ఆయనతో కలిసి లేదు. ఈ సినిమా జాన్ నాష్ జీవితాన్ని ఆధారం గా చేసుకొని తీసిందే కాని, జీవితాన్ని యధా తథం గా తీసింది కాదు అనుకుంటా. అయినా ఆ మాత్రం డ్రామా లేక పోతే సినిమా కు డాక్యుమెంటరీ కి తేడా ఏముంటుంది.
    A Dangerous Method నేను గత సంవత్సరం చుసిన ఇంకో psychology కి సంబంధించిన సినిమా. ఇది Carl Jung,Sigmund Freud ల పాత్రలు ఉన్న సినిమా. మీరు రాసినా ఏదో ఒక పోస్ట్ లో Sigmund Freud గురించి చదివాను. సినిమా నాకు పెద్దగా అర్థం కాలేదు. మీకు వీలైతే చూడండి . ఆ సినిమా గురించి కుడా మీరు ఎనాలిసిస్ వ్రాస్తే చదవాలని ఉంది అని అడగాలి అని ఉంది గాని, పైన చెప్పేశారు కదా అసైన్మెంట్స్ ఇవ్వొద్దు అని.

    ReplyDelete
    Replies
    1. డియర్ చంద్ర,

      నాకీ సినిమా ఇంత పాపులర్ అని తెలీదు. తెలిస్తే రాసి ఉండేవాణ్ని కాదు. లేదా.. ఇంకొంచెం జాగ్రత్తగా రాసేవాణ్ని. ఏదో చూసేశాను. చేతిలో బ్లాగుంది. రాసేశాను.

      ఈ సినిమాతో మీలా ఎందుకు కనెక్ట్ కాలేకపొయ్యాను?

      వృత్తిరీత్యా రోజూ స్కిజోఫ్రీనిక్స్ తో మాట్లాడుతూనే ఉంటాను. వారి బాధలు దారుణం. వారి కుటుంబ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కొందరు క్రమేపి బిక్షకులుగా మారిపోతారు. ఇంకొందరు ఆత్మహత్య చేసుకుంటారు. గుండెజబ్బు, ఎయిడ్స్ జబ్బు వంటి రోగాలు ఒక వ్యక్తినే బాధిస్తాయి. స్కిజ్ మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేస్తుంది. మన గ్రామాల్లో మానసిక రోగుల్ని ఎగతాళి చేస్తుంటారు. ఒక్కోసారి ఈ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నానా అని దిగులేస్తుంది. రోజూ తిట్టించుకుంటూ, తిండికి అలమటించే స్కిజోఫ్రీనిక్స్ ని చూస్తుండే నేను.. ఒక ప్రొఫెసర్ గారి పోరాటాన్ని ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు.

      Delete
  14. నాగయ్య , సూర్యకాంతం గారి సినిమాలు అన్ని చూసేసాను. మీతో పాటు విశ్లేషించడానికి రెడీ అయిపోయాను కుడా.
    హాలీవుడ్ సినిమాలు కూడా చూడాలా ? :(

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,

      సారీ!

      నా తరవాత టపా ఏంటో నాకే తెలీదు. ఏదో ఆలోచన వస్తుంది. ఏ అర్ధరాత్రిళ్ళో కూర్చుని ఒక ఫ్లోలో రాసేస్తాను. పొద్దున్నే అప్పుతచ్చులు సరిచేసి పబ్లిష్ చేసేస్తాను ('యోగి వేమన' మాత్రం బుర్ర పెట్టి రాశాను). నా రాతలు చదువుతున్నందుకు ధన్యవాదాలు.

      Delete
  15. రమణ గారూ,
    మీ నుంచి ఈ సినిమా గురించి వేరే లాంటి దృష్టికోణం వస్తుందనుకున్నాను. మీరే అన్నట్లు తార గారి వివరణ ఈ సినిమాని, ఈ రోగాన్ని, న్యాష్ గారిని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. "Zen and the art of motor cycle maintenance" రచయిత కూదా 'sanity అంచులనుంచి insanity లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రెండిటీనీ అర్థం చేసుకోగలిగాడు అనిపిస్తుంది ఆ పుస్తకం చదువుతుంటే. ఎంత భ్రమలకు లోనైనా, తనది రోగం అని తెలిశాక ఆ భ్రమలని బయటినుంచి గమనించి తనంతట తానుగా భ్రమ అని అర్థం చేసుకున్నట్టు చూపించారు సినిమాలో. అలా అర్థం చేసుకోగలిగాడు కనుకే ఆయన మందులు లేకుండా నెగ్గుకు రాగలిగారు. చివరి స్పీచ్ ఊరికే ఎఫెక్ట్ కోసం. అది నిజం కాదని తెలిసిన తర్వాత కూడా విషయం విలువ తగ్గదు. అలాగే ప్రేక్షకులు మందులు వాడంక్కరలేదనుకుంటారనే ఆయన పాత్ర మందులు తీసుకున్నట్టు చూపించారుట ట, అందరూ న్యాష్ లాంటి వారే కానక్కర్లేదు కాబట్టి. ఈ రోగం గురించి, బైపోలార్ డిజార్డర్ గురించి వివరిస్తే బావుంటుంది మీ లాంటి వారు. sixth sense సినిమా చూశారా మీరు? ఈ సినిమా చూశాక ఆ సినిమా ఎంత బాగా తీసినా, జనాలని తప్పు దోవ పట్టించేలా ఉందనిపించింది నాకు.

    ReplyDelete
    Replies
    1. లలిత గారు.

      డ్రామా వేరు. వాస్తవం వేరు. క్రియేటివ్ లిబర్టీ అనేది దర్శకుని హక్కు. పైన శ్యామలీయం గారి కామెంట్ చూడండి.

      నేను చిత్తూరు నాగయ్య 'యోగి వేమన' గూర్చి చాలా గొప్పగా రాశాను. అయితే.. చరిత్రకారుల కోణం నుండి ఆ సినిమా ఒక చెత్త. కానీ నాకు బాగా నచ్చింది. ఈ బ్యూటిఫుల్ మైండ్ కూడా అంతే!

      అలాగే ఈ సినిమా కథాకాలం 1947. అప్పుడు ట్రీట్మెంట్లు చాలా మొరటుగా ఉండేవి. బహుశా నాష్ వైద్యాన్ని కాదనుకోడానికి అదొక కారణం కావచ్చు.

      మన దేశంలో ఇంగ్లీషు మందులు దీర్ఘకాలం వాడటానికి చాలా భయాలు ఉన్నాయి. బిపి, డయాబెటిస్ మందులు వాడటానికి కూడా భయపడేవారు నాకు తెలుసు. అయితే ప్రస్తుతం psychopharmacology లో చాలా మార్పులు వచ్చాయి. పేషంట్లు హాయిగా ఉంటున్నారు (measured with social functioning scales). ఈ రోజుల్లో మానసిక వైద్యం చాలా సులువైపోయింది.

      కావున మందులు సహాయం లేకుండా.. తమంతట తామే బయటకి రావడం అనే concept ఈ రోజుల్లో అనవసరం. హాయిగా ఒక మాత్ర వేసుకుని ఉద్యోగాలు చేసేసుకోవడమే!

      Delete
  16. మిత్రులకి ఒక వివరణ.

    స్కిజోఫ్రీనియా ఒక మానసిక వ్యాధి. పరమ దుర్మార్గమైనది. అన్ని విభాగాల్లోలాగే మానసిక వైద్యంలో కూడా అనేక మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు దాదాపు షుగర్, బిపి వ్యాధుల స్థాయిలో వైద్యం చేయబడుతుంది.

    Psychotics suffer from delusions and hallucinations. In psychiatry DSM (Diagnostic and Statistical Manual) is followed to make a diagnosis basing on the symptoms and their duration. This is a very clearly defined procedure.

    By definition psychotic symptoms lack 'insight'. Persons refuse to accept that their thoughts and experiences are abnormal (if they accept, then it is not psychosis. you are making a wrong diagnosis).

    Many schizophrenics give a detailed account of their suffering (when they were actively psychotic) once they come out of the problem (called remission). Partial responders express some doubts about their experiences, but continue to hold strong delusions.

    For a schizophrenic.. suffering from florid symptoms, staying away from medicines and still be normal in activities (especially using higher intellectual functions) is not possible. Schizophrenia is a "disease" affecting brain. Patients land up in "negative state" if left untreated.

    This is my understanding basing on schizophrenia research. This understanding is the basis for this post.

    సమయాభావం వల్ల ఇంగ్లీషులో రాసేశాను. క్షమించగలరు. (అసలు ఈ విషయాలు బ్లాగుల్లో రాయవచ్చునా?!)

    ReplyDelete
  17. రమణగారు,

    ఎప్పుడైనా www.schizophrenia.com:8080/jiveforums/ చూసారా? ఇక్కడ ఎంతో మంది మందులు వాడకుండా ఎలా నార్మల్‌గా జీవిస్తున్నారో వారి అనుభవాలను చదవచ్చు. అలానే మందులు వాడి, వాడితే మంచిది అనేవాళ్ళు ఎక్కువే.
    >>అసలు ఈ విషయాలు బ్లాగుల్లో రాయవచ్చునా?

    ఓ సుబ్బరంగా, మీరు వ్రాసిన ఈ టపా వలన నాకు చాలా తెలిసింది, ముఖ్యంగా ఈ వ్యాధి ఎంత ఎక్కువగా ఉన్నదో ఎంత కామనో ఈ టపాకి ముందు తెలియదు, ఎక్కడో ఎవరో గణిత శాస్త్రవేత్తలకే వచ్చింది అని తెలుసుకానీ, మన చుట్టూ ఉండేవాళ్ళలో ఈ వ్యధిగ్రస్తులు ఉన్నారని నాకు ఇప్పటివరకూ తెలియదు, అనుమానం కుడా కలగలేదు, అదేదో ఇతర మానసిక జబ్బులు అనుకునేవాడ్ని.

    ReplyDelete
  18. ఇక్కడేదో తీక్షణమైన చర్చ జరుగు తున్నది.

    పొగ కూడా కనబడు తున్నది.

    నిప్పు ఇంకా రగిలించ టానికి మరింత మంది ఇక్కడకు రావాలహో !


    జిలేబి.
    (స్కిజో నారదా!)

    ReplyDelete
  19. This comment has been removed by the author.

    ReplyDelete
  20. As far as I know, John Nash was on Olanzepine 3 to 4 yrs ago. Not sure if he is still on that. He is still symptomatic, not as much as before. He is socially awkward, keeps to himself and internally preoccupied. However he is well respected in and around Princeton University

    ReplyDelete
    Replies
    1. Thanks for the information.

      Indian psychiatrists are having different problems. (our food is different. acceptance to medication is also a problem.)

      I regularly use inj.Olanzapine to control acute cases and try to avoid Olanzapine tablets for the long term management of schizophrenia as it may cause diabetes, weight gain and dyslipidemia. Schizophrenics are lethargic and heavy smokers. All these factors might precipitate MI. So i go for more friendly and bland medications like Aripiprazole, Amisulpride, Iloperidone and Asenapine etc. for long term use.

      Delete
  21. రస్సెల్ నటన మాత్రం అద్బుతం అండి :)

    ReplyDelete
    Replies
    1. మీకలా అనిపించిందా!

      నాకు Robert De Niro అంటే చాలాచాలాచాలా ఇష్టం. Daniel Day Lewis చాలా (ఒక్కసారే) ఇష్టం. వీళ్ళిద్దర్లో ఎవరైనా 'నాష్' అయితే.. ఇంకా బాగుండేదనిపించింది.

      Russell Crowe కూడా బాగానే చేశాడు. కానీ నాకు 'గ్లాడియేటర్'గా గుర్తొస్తూనే ఉన్నాడు. తప్పు నాదే. Crowe ఏం చేస్తాడు పాపం!

      Delete
  22. డియర్ రమణ,
    గీ డి మూపసోన్ గారి దెయ్యం కథ రెఫరెన్స్ నాకు నచ్చింది. "ది హోర్ల" అందరు చదవాల్సిన షార్ట్ స్టోరీ!
    బి ఎస్ ఆర్
    http://www.eastoftheweb.com/short-stories/UBooks/Horl.shtml

    ReplyDelete
    Replies
    1. Dear BSR,

      ఈ దెయ్యం కథ గూర్చి ఒక జ్ఞాపకం.

      అప్పుడు మేం పీజీ ఎంట్రన్స్ కోసం చదువుకుంటున్నాం. మన శరత్ (తరవాత రోజుల్లో సైకియాట్రిస్ట్) ఏదో కథ చదివి బిగుసుకుపోయ్యాడు. ఉన్నట్లుండి అనుమానంగా కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. చిన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడుతున్నాడు. నాకు చికాగ్గా అనిపించింది. విసుక్కున్నాను.

      రెండ్రోజుల తరవాత "ఇది మొపాసా కథ. భలేగుంటుంది. చదువు.. చదువు." అంటూ ప్రాణం తీసి "ద హొర్లా" నాతో చదివించాడు. అద్భుతమైన కథనం. ఏకబిగిన చదివేశాను. చదివాక నాది కూడా శరత్ పరిస్థితే! అసలే దయ్యాల్లా మనవి రాత్రి పూట చదువులు. బాత్రూం కెళ్ళాలన్నా ఏదో బెరుకు. గజగజా వణికిపొయ్యాను. ఒకపక్క శరత్ గాడి రాక్షసానందం! (ఆ తరవాత నేను కూడా ఓ ఇద్దరు ముగ్గురితో ఈ కథ చదివించి అదే ఆనందం పొందాననుకోండి.)

      నాకు తెలిసి పేరనాయిడ్ సైకోసిస్ ని (కథ కోసం) ఇంత అద్భుతంగా డిస్క్రైబ్ చేసిన రచయిత మరొకరు లేరు. సూపర్బ్ స్టోరీ. కథ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

      (ఇక్కడ మేం గై డీ మొపాసా అంటున్నాం. మీరేంటి ఇంకో రకంగా అంటున్నారు!?)

      Delete
    2. Dear Ramana,
      Yes, I agree with you 100%. Stephen King types don't even compare to Guy de Maupassant! Here is the pronunciation for monsieur Guy de Maupassant: http://www.howjsay.com/index.php?word=Guy+de+Maupassant
      Sante!
      BSR

      Delete
    3. The real John Nash story, A Brilliant Madness, a PBS documentary in its entirety:
      http://www.youtube.com/watch?v=b5Y74lKhPlA
      BSR

      Delete

comments will be moderated, will take sometime to appear.