వర్షం జల్లుగా కురుస్తుంది. పేషంట్లని చూడ్డం అయిపోయింది. విసుగ్గా వుంది. ఏం చెయ్యాలి? తెలుగు టీవీ వార్తలు చూసే ధైర్యం లేదు. పోనీ ఏదైనా ఒక తెలుగు కథ చదివితే ఎలా వుంటుంది? ఏమో! కష్టపడి కథంతా చదివాక.. తీరా అదో చెత్త కథైతే? ఇప్పుడంత రిస్క్ తీసుకునే అవసరముందా? లేదు కదా! మరైతే ఈ విసుగుని అధిగమించుట ఎట్లు? సింపుల్! చదివిన రచయితనే మళ్ళీ చదివేద్దాం.
ఎదురుగా టేబుల్ మీద రావిశాస్త్రి నవ్వుతూ నన్నే చూస్తున్నట్లుగా అనిపించింది. 'బాకీ కథలు' తీసుకున్నాను. 'ద్వైతాద్వైతం' కథ చదవడం మొదలెట్టాను. ఇప్పటికీ కథ ఎన్నిసార్లు చదివుంటాను? గుర్తు లేదు. కథ మొదటి భాగం పులి చెబుతుంది. రెండో భాగం నల్లమేక చెబుతుంది. క్రమంగా కథలో లీనమైపోయ్యాను. రావిశాస్త్రి సిమిలీల వర్షంలో తడిసి ముద్దైపోసాగాను. రావిశాస్త్రి శిల్ప చాతుర్యానికి అబ్బురపడుతూ (ఇది నాకలవాటు).. హోరున ప్రవహిస్తున్న వాక్యాల సుడిగుండంలో గింగరాలు తిరుగుతూ మునిగిపోతూ (ఇదీ నాకలవాటే) -
'ఆహాహా! ఏమి ఈ రావిశాస్త్రి రచనా చాతుర్యము! అయ్యా శాస్త్రిబాబు! నువ్వేగనక రాయకపోయినట్లైతే - తెలుగు సాహిత్యం గుడి మెట్ల మీద అడుక్కు తింటుండేది! అరిగిపోయిన సైకిల్ ట్యూబులకి పంచర్లు వేసుకుంటుండేది! దెబ్బ తగిలిన గజ్జికుక్కలా బీదగా, దీనంగా, బాధగా ఏడుస్తుండేది! నువ్వు తెలుగు కథకి రాజువి, రాజాధిరాజువి. నువ్వు మనిషివా? కాదు, కానే కాదు. దేవుడవు, దేవదేవుడవు. పూర్వజన్మలో నువ్వు మోపాసావి! కాదు కాదు చెహోవ్‌వి! కాదు కాదు ఇంకా అంతకన్నా వందరెట్లు ఎక్కువగా.. " అనుకుంటూ ఆనందడోలికలలో తేలియాడుచుండగా -
"రవఁణమావా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.
"రా సుబ్బూ! సమయానికోచ్చావ్! రావిశాస్త్రి అక్షరాన్ని ఆనందంగా అనుభవించేస్తున్నాను, మనసారా మజా చేస్తున్నాను! రావిశాస్త్రి ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్! కాదన్నవాణ్ణి కత్తితో కసకసా పొడిచేస్తాను. ఔనన్నవాడిని హృదయానికి ఘాట్టిగా హత్తుకుంటాను." కవితాత్మకంగా అన్నాను.
రావిశాస్త్రి సుబ్బుక్కూడా ఇష్టం. అంచేత ఎప్పట్లా నాతో వాదనలకి దిగలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నాలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
"సుబ్బూ! మనం మన రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలి. ఒక సొవనీర్.. ఒక కథల వర్క్ షాప్.. ఒక శిలావిగ్రహం.. ఏదైనా పర్లేదు. ఏదోటి చేసేద్దాం. ఏవఁంటావ్?" ఎక్సైటింగ్‌గా అన్నాను.
"రవణ మావా! రావిశాస్త్రికి నువ్వు చేసేదేముంది? ఆయన పోయి చాలా కాలమైంది. బ్రతికున్నట్లయితే మన దినకర్ పంపించిన సింగిల్ మాల్ట్ సీసాలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ఆ కాళ్ళకి నమస్కారం చేసి - 'మా రాచకొండకి మంగళారతులు! మా కథల తండ్రికి సీసాల దండలూ' అంటూ పాడి మన భక్తిని చాటుకునేవాళ్ళం." అన్నాడు సుబ్బు.
సుబ్బు మాటలకి నాకు నవ్వొచ్చింది.
"ఒరే నాయనా! రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలంటే ఆయనకి వ్యక్తిగతంగా చెయ్యాలని కాదు. ఆయన జ్ఞాపకార్ధం ఏదైనా చెయ్యాలని! అర్ధమైందా?" అన్నాను.
సుబ్బు నవ్వుతూ అన్నాడు.
"అంటే ఇష్టమైన వాళ్ళకి ఏదోటి చేసి ఋణం తీర్చుకోవాలంటావ్! అంతేనా? అప్పుడు మన లిస్టులో చాలా వచ్చి చేరతాయి. ఉప్మా పెసరట్టు, ఫిల్టర్ కాఫీ, సింగిల్ మాల్ట్.. ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇవేం పాపం చేశాయి?"
ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.
"రుచిగా ఉండటం ఉప్మాపెసరట్టు ధర్మం. ఆ రుచికి మనం బానిసలం. ప్రతిరోజూ ఆ పెసరట్టు ముండని ప్రేమగా కొబ్బరిచట్నీతో నంజుకు తినుటయే దానికి నువ్విచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. అంతేగానీ ఉప్మా పెసరట్టుకి శిలావిగ్రహం పెట్టిస్తావా? పెట్టించవు గదా!"
"రావిశాస్త్రి రచనల్ని ఉప్మా పెసరట్టుతో పోలుస్తున్నావు. చాలించు నీ వితండ వాదం. నీతో ఇదే సమస్య. విషయాన్ని కాంప్లికేట్ చేసేస్తావు." విసుక్కున్నాను.
సుబ్బు నా మాట పట్టించుకోలేదు. చెప్పడం కొనసాగించాడు.
"రావిశాస్త్రి అత్యున్నత రచయిత. బుద్ధున్నవాడైనా కాదంటాడా? అంచేత ఆయన రాసి పడేసిన సాహిత్యం చదువుకో. తనివి తీరకపోతే మళ్ళీ చదువుకో, మళ్ళీమళ్ళీ చదువుకో, కళ్ళు నొప్పులు పుట్టేలా చదువుకో, కళ్ళజోడు అరిగిపొయ్యేలా చదువుకో! అయితే ఆయన ఎవరి కోసం, ఏ సమాజం కోసం రాశాడో వారి గూర్చి ఆలోచించు. అంతేగానీ - తెలుగు సినిమా హీరో అభిమానిలా వెర్రిగా ఆలోచించకు."
"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?" డిజప్పాయింటింగ్‌గా అడిగాను.
"'ద్వైతాద్వైతం' చదవడం అయిపోయాక 'రాజు-మహిషి' చదువుకో. నా దృష్టిలో 'రాజు-మహిషి' రావిశాస్త్రి ఆల్ టైమ్ బెస్ట్." అన్నాడు సుబ్బు.
"కానీ - రావిశాస్త్రి 'రాజు-మహిషి' కథ పూర్తి చెయ్యలేదుగా?" నిరాశగా అన్నాను.
"కథ ఎవడిక్కావాలోయ్! కథలే కావాలనుకుంటే చందమామ చదువుకో! అసలు రావిశాస్త్రి కలం నుండి జాలువారిన ప్రతివాక్యం ఒక అద్భుతం. రావిశాస్త్రి రచనల్లో కథ వెతుక్కునే నీలాంటి నిర్భాగ్యులు ఉండటం మన తెలుగు సాహిత్య దౌర్భాగ్యం."
"నాకదంతా తెలీదు సుబ్బు! నేను రావిశాస్త్రికి నివాళులు అర్పించాల్సిందే. ఏదైనా మార్గం చెప్పు." పట్టుదలగా అన్నాను.
ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.
"ఓకే! రాత్రికి మళ్ళీ కలుద్దాం. ఈలోపు నీ దగ్గరున్న రావిశాస్త్రి పుస్తకాలన్నీ ఒకచోటకి చేర్చు. అ పుస్తకాలన్నింటికి పసుపు రాయించి కుంకుమతో బొట్లు పెట్టు. నీదగ్గర రావిశాస్త్రి పటం ఉందిగా! దానికో పేద్ద పూలదండ వేయించు, అంబికా దర్బార్ బత్తి వెలిగించి.. "
"అర్ధమైంది. కొబ్బరికాయలు కొట్టి గంట గణగణ లాడించి ప్రసాదం పంచాలి." విసుక్కున్నాను.
"చెప్పేది పూర్తిగా విను మిత్రమా! దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. విఘ్నేశ్వరుడుకి ఉండ్రాళ్ళు, వెంకటేశ్వరుడుకి లడ్లు. అంటే ఏ దేవుడికి ఇష్టమైన పదార్ధం ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాం. కదా? ఇక్కడ మన దేవుడెవరు? రావిశాస్త్రి. కదా? మరి రావిశాస్త్రికి నైవేద్యంగా ఏం పెడతావు?"
"నువ్వే చెప్పు."
"మనం రావిశాస్త్రికి నైవేద్యంగా 'గ్లెన్‌ఫెడిచ్' పెడదాం. ఆ పక్కనే బిస్లరీ సోడాలు, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు పెడదాం." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.
"తరవాత?" ఆసక్తిగా అడిగాను.
"ఇప్పుడు మనం వినాయక చవతి పూజ మోడల్‌ని ఫాలో అవుదాం! అయితే ఈ పూజలో మనం చదివబొయ్యేది రావిశాస్త్రి సాహిత్యం."
"నేను అల్పజీవి చదువుతాను." ఉత్సాహంగా అన్నాను.
"నీ ఇష్టం. అల్పజీవి కాకపొతే సారాకథలు చదువుకో! దీన్నే 'రావిశాస్త్రి పూజావిధానం' అందురు. పూజా సమయంలో గ్లెన్‌ఫెడిచ్ బాటిల్, సిగరెట్ పెట్టెలు రావిశాస్త్రి పటం ముందుంచాలి. చివర్లో - 'ఓం! గ్లెన్‌ఫెడిచ్ సమర్పయామి! ఓం! గోల్డ్‌ఫ్లేక్ సమర్పయామి!' అని మూడుసార్లు అనాలి. అప్పుడవి ఆటోమేటిగ్గా ప్రసాదంగా మారిపోతాయి."
"మారిపోతే?"
"పిచ్చివాడా! దేవుని ప్రసాదాన్ని ఏం చేస్తాం? అవతల పడేస్తామా? అది మహాపాపం. ఆరగిస్తేనే పూజాఫలం దక్కేది. అందునా ఆ ప్రసాదం ఎవరిది? మన ఇష్టదైవమైన శాస్త్రిబాబుది!"
"అంటే ఆ విస్కీ తాగేయ్యాలా?"
"అవును. విస్కీ తాగేయ్యాలి. సిగరెట్లు ఊదేయ్యాలి. ఆ విధంగా సుబ్బయ్య, ముత్యాలమ్మ, సార్వభౌమరావు, రత్తాలు-రాంబాబు, మరిడి మహాలక్ష్మి, వియత్నాం విమల-బంగారి గాడు, దూదిపులి, సూర్రావెడ్డు సాక్షిగా.. ఆ మహానుభావునికి నివాళులర్పిద్దాం." అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! దీన్ని నివాళి అనరు. రావిశాస్త్రి పేరు చెప్పుకుని మందు కొట్టడం అంటారు. గ్లెన్‌ఫెడిచ్ వరకు ఓకే, కానీ సిగరెట్ మాత్రం నా వల్లకాదు. ఒక సిగరెట్ ఏడు రోజుల జీవితాన్ని తగ్గిస్తుంది."
"త్యాగయ్య, అన్నమయ్యలు జీవించిన కర్మభూమి మనది. ఏం? నీ దైవం కోసం ఓ మూణ్ణెల్లు ముందు చావలేవా? నువ్వసలు భక్తుడివేనా!? నేన్నీలా స్వార్ధపరుణ్ణి కాదు! ఎంత కష్టమైనా సరే! ఆ సిగెరెట్లన్నీ కాల్చిపడేస్తాను."
"ఈ నివాళి నాకు సమ్మతం కాదు. నీ ప్రపోజల్ నేనొప్పుకోను." స్థిరంగా అన్నాను.
సుబ్బు లేచాడు.
"నీ ఖర్మ! మంచి మాటలు నువ్వెప్పుడు ఆలకించావు గనక! ఇప్పటికే మాతృభాషా ప్రేమికుల సంఘం, గురజాడ భజన మండలి అంటూ పనికి మాలిన సంస్థలు చాలానే ఉన్నాయి. నువ్వు కూడా 'రావిశాస్త్రి అభిమాన సంఘం' అంటూ ఒకటి పెట్టుకో. ఆయన పుట్టిన్రోజు, పోయిన్రోజుల్ని పండగల్లా జరిపించు. ధర్మాసుపత్రిలో యాపిల్సు పంచు. రక్తదాన శిబిరం పెట్టు. నీలాంటి చౌకబారు అభిమాని రావిశాస్త్రికి ఉండటం ఆయన దురదృష్టం. ఏం చేస్తాం? పోయినవాళ్ళకి హక్కులుండవు గదా!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
విన్నపం -
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పూజలు వ్యక్తిగతం. ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు. రావిశాస్త్రిని తలచుకుంటూ సరదాగా రాసేశాను. సో.. టేకిట్ ఈజీ!
(pictures courtesy : Google)