Friday, 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.



కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

16 comments:

  1. మీరు రాసిన disclaimer చూసాక,మాకు చదవాలన్న అకాంక్ష పెరిగింది.అదేనండి..మగవారికి ప్రత్యేకం అంటూ. నిజం చెప్పండి మానసిక వైద్య నిపుణులు కదా మీరు? మేము చదవాలనే ఆ disclaimer కదు? :)
    మీరు సరదాగానే రాసినట్టు, నేను సరదాగానే అడిగాను లెండి..

    ReplyDelete
    Replies
    1. హ.. హ.. హా!

      "పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు." - కిరీటిరావు

      ఇవి రావిశాస్త్రి విరచిత 'గుర్రపుకళ్ళెం అను మరిడిమహాలక్ష్మి కథ (లేక) గోవులొస్తున్నాయి జాగ్రత్త!' నవల ఓపెనింగ్ రిమార్క్స్.

      నేనా కాన్సెప్ట్ కాపీ కొట్టేశా! అంతకుమించి దురాలోచనలేమీ లేవు!

      Delete
  2. ఆడవారికో‌ నీతిసూత్రం: కవిత్వం చెప్పే వాళ్ళకు దూరంగా మసలవలెను.
    మగవాళ్ళకో‌ నీతిసూత్రం: కవిత్వం కూడు పెట్టదు.
    అందరికీ కలిపి నీతిసూత్రం: కవిత్వం ఒక కాలక్షేపం మాత్రమే.
    అనుమానించాల్సిన వ్యక్తి: డబ్బున్న కవి.

    ReplyDelete
    Replies
    1. కవిత్వం ఒక యోగం.
      అది EMI లు కట్టగలిగినవాడికో భోగం.
      కట్టలేనివాడికో రోగం!

      (జంధ్యాల చెప్పింది మార్చాను.)

      Delete
  3. ఏమిటో ఈ కాలపు బ్లాగులోల్ల కష్టాలు !

    మా కాలం లో ఇవన్నీ లేవు సుమీ సొ నో ప్రాబ్లం !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబిజీ,

      ఎవరికీ ఏ కష్టాలు లేవులేండి.

      నిన్న ఉగాది సందర్భంగా అస్సలు 'పని లేక..'(ఉగాదినాడు డాక్టర్ మొహం చూడ్డానికి జనాలు ఇష్టపడరు).. నాకు బాగా ఇష్టమైన రెండు ఘంటసాల పాటల్ని కలుపుతూ ఒక టపాగా రాశాను. కేవలం పాటలకి తగ్గట్టుగా.. సరదాగా ఒక కథ అల్లాను. అంతే! అదీ సంగతి!

      Delete
  4. వద్దంటే చేయడం మా హక్కు కదా చదివేసాను హ...హ:-)

    ReplyDelete
    Replies
    1. అవును. వద్దన్న పని చెయ్యడంలో ఎంతో ఆనందం ఉంటుంది. మీతో చదివించాలనే దురుద్దేశంతోనే.. చదవద్దన్నాను. మీరు చదివేశారు. హ.. హ:)

      Delete
  5. @"పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు." - కిరీటిరావు

    ఇవి రావిశాస్త్రి విరచిత 'గుర్రపుకళ్ళెం అను మరిడిమహాలక్ష్మి కథ (లేక) గోవులొస్తున్నాయి జాగ్రత్త!' నవల ఓపెనింగ్ రిమార్క్స్.

    నేనా కాన్సెప్ట్ కాపీ కొట్టేశా! అంతకుమించి దురాలోచనలేమీ లేవు!

    ----------------------------------------

    ఈ కధ చదివేనాటికి మీరు ధనవంతులయ్యారా మరి? ఏం లేదు రావి శాస్త్రి పలానా తన కధ మగవాళ్ళు చదవకూదంటే ఇంట్లో ఆడవాళ్ళతో చదివిన్చుకోనేవాళ్ళ అండి ?

    ReplyDelete
    Replies
    1. రావిశాస్త్రి కిరీటిరావు మనస్తత్వ పరిచయం ఓ నాలుగు పేజీలు రాశాడు. అందుకోసం 'పేదలెవ్వరూ.. ' అంటూ వ్యంగ్యంగా ఒక ఉపశీర్షిక పెట్టాడు (ఇది మారోజుల్లో చాలా పాపులర్).

      (అసలు.. 'ధనవంతుడు' రావిశాస్త్రిని చదువుతాడా!? వాళ్ళు చదుకోడానికి, సన్మానించుకోడానికి వేరే దుకాణాలున్నాయిగా!)

      Delete
  6. మీరు ఇలాంటి పోస్ట్స్ రాస్తే మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా ?
    అసలే ఇప్పటి అమ్మాయిలు తిక్క తిక్క గా ఉన్నారు. నాకెందుకో నా లైఫ్ కనిపిస్తుంది మీ పోస్ట్ లో .
    మీరు మరీ వీడియో లుతో సహా చూపించేసరికి చెమటలు పడుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. నీటిలో దిగేముందు లోతు తెలుసుకుని దిగడం మంచిది. ఇటువంటి పోస్టులు మీవంటివారి అవగాహన పెంచడం కొరకే్!

      (EMI రెడీ చేసుకుని పెళ్ళి చేసుకోండి. మీకు శుభం కలుగు గాక!)

      Delete
  7. ఈ కథని నేను రివర్స్ లో చదువుకున్నాను అంటే.. అరరే ! నాకు ఆ ఐడియా రాలేదే ? అంది నా ఫ్రెండ్

    disclaimer రాసిన తర్వాత కూడా చదివితే అంతే మరి అన్నాను.

    ఇంతకీ నేను చదివినట్టా .. లేనట్టా ?

    ReplyDelete
  8. (ఉగాదినాడు డాక్టర్ మొహం చూడ్డానికి జనాలు ఇష్టపడరు)

    mari doctor gaari family sangathaenti:-)

    ReplyDelete
  9. Good writing mate! I am sure it inspires ladies to read it after your disclaimer.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.