ఒక ముఖ్యమైన పెళ్లి. తప్పకుండా వెళ్ళాలి, వెళ్లి తీరాలి. అంటే పెళ్ళి ముఖ్యమైనదని కాదు. వెళ్ళకపోతే ఆ పెళ్ళికి పిలిచినవాడు రక్తకన్నీరు కారుస్తాడు, ఆపై నాతో స్నేహం మానేస్తాడు, నన్నో శత్రువుగా చూస్తాడు. ఈ వయసులో కొత్త స్నేహాల్ని వెతుక్కునే ఓపిక లేదు. అందుకని చచ్చినట్లు వెళ్ళాలి. ఆ రకంగా ఇది చాలా ముఖ్యమైన పెళ్లి.
మా ఊళ్ళో ఆటో ప్రయాణం నాకు ఇష్టమని చెబుతూ "నా పులి సవారి (ఇది చాలా డేంజర్ గురూ!)" అంటూ ఒక టపా రాశాను. అయితే నా ఆటో ప్రయాణ సాహస యాత్రలతో.. నాకున్న డస్ట్ ఎలెర్జీ వల్ల.. ఎలెర్జిక్ రైనైటిస్ (అర్ధం కాలేదా? జలుబు!) తిరగబెడుతుండటం వల్ల.. నాకు కారే గతని నా ముక్కు వైద్యుడు హెచ్చరించాడు. ఆల్రెడీ ముక్కుకి రెండు ఆపరేషన్లు చేయించుకున్న కారణాన.. ఆయన మాట గౌరవిస్తూ.. కారుని ఆశ్రయించాను.
నా డ్రైవర్ వయసులో నాకన్నా పెద్దవాడు. మంచివాడు. నిదానమే ప్రధానం అని నమ్మిన వ్యక్తి. అందుకే కారు స్లో మోషన్లో నడుపుతుంటాడు. ఒకసారి కొద్దిగా స్పీడ్ పెంచమన్నాను. 'మేడమ్ గారు ఊరుకోరు సార్!' అన్నాడు. అప్పట్నుండి నేనతనికి ఏమీ చెప్పలేదు. మన్మోహన్ సింగ్ లా బుద్ధిగా కూర్చుంటున్నాను. ఇదీ ఒకందుకు మంచిదే! నా పురము, నా పురజనుల్ని నిశితంగా, ప్రశాంతంగా గమనించే అవకాశం కలుగుతుంది.
అంచేత కార్లో వెళ్తూ పరిసరాల్ని పరికిస్తుంటే.. ఏదో శవపేటిక లాంటి డబ్బాలోంచి ఊరిని చూస్తున్న భావన కలుగుతుంటుంది. ప్రజలతో సంబంధాలు తెగిపోయిన రాజకీయ నాయకుళ్ళా ఫీలవుతాను. అయిననూ తప్పదు. వయసు, అనారోగ్యం.. దురదృష్టవశాత్తు.. నన్ను జయించాయి.
సరే! రోడ్లన్నీ ఆటోల సమూహం. చీమల్లా మందలు మందలుగా జనం. ఇరువైపులా తోరణాల్లా రంగుల ఫ్లెక్సీలు. ఏదో కొత్త సినిమా రిలీజనుకుంటా. అయితే నాకు ఆ ఫ్లెక్సీల్లో మొహాలు తెలీదు. ఒకడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇంకోడు నల్లకళ్ళజోడుతో.. చిత్రవిచిత్ర భంగిమలలో ఎవరెవరివో మొహాలు. వీళ్ళంతా కొత్త హీరోలా?
కాదు.. కాదు. పరిశీలనగా చూడగా.. ఆ మొహాలు హీరోలవి కాదు.. ఆ హీరోకి అభినందనలు చెబుతున్న అభిమానులవి! అయితే మరి మన హీరోగారెక్కడ? ఫ్లెక్సీలో ఓ మూలగా ఇరుక్కుని బేలగా చూస్తున్నాడు! అభిమానం హద్దులు దాటడం అంటే ఇదే కామోలు! డబ్బు పెట్టేవాడిదే ఫ్లెక్సీ.. ఫ్లెక్సీ పెట్టించినవాడే అభిమాని!
దార్లో అక్కడక్కడా.. కళ్యాణ మంటపాలు. మంటపాల ఎంట్రన్స్ వద్ద 'నేడే చూడండి' అన్నట్లు పెళ్లి చేసుకునేవాళ్ళ భారీ ఫ్లెక్సీలు! బరువైన నగలతో పెళ్ళికూతురు, శర్వాణిలో పెళ్ళికొడుకు.. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పడిపోయి.. దాదాపు కౌగలించుకున్నట్లున్న పోజులతో ఫోటోలు. వాటిపై ఫోకస్ లైట్లు. కొంపదీసి ఈ జంటలకి ఇంతకుముందే పెళ్ళైపోయిందా!
ఓహ్! ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా పెళ్ళి తరహాలో చేస్తున్నారు కదూ! బహుశా అప్పటి ఫోటోలై ఉంటాయి. అయితే.. ఆ ఫోటోలతో ఇంత గ్రాండ్ గా ఫ్లెక్సీలెందుకు పెట్టారబ్బా! బహుశా.. నాలాంటి ఆబ్సెంట్ మైండెడ్ ఫెలో పొరబాటున ఒక పెళ్ళికి వెళ్ళబోయి ఇంకో పెళ్ళికి వెళ్ళకుండా ఆపడానికయ్యుంటుంది. సర్లే! పెళ్ళంటే నూరేళ్ళ మంట! ఈ ఒక్కరోజైనా ఆర్భాటంగా ఉండనిద్దాం. మన సొమ్మేం పోయింది!?
పెళ్ళి జరుగుతున్న హాల్లో అడుగెట్టాను. అది చాలా పెద్ద హాల్. ఎదురుగా పెళ్ళికొడుకు, కూతురు.. నమస్కారం పెడుతున్నట్లు చేతులు జోడించి.. శిలావిగ్రహాల్లా కూర్చునున్నారు. ఒకపక్క అక్షింతలు వెయ్యడానికి ఓ పెద్ద క్యూ ఉంది. నేను కూడా క్యూలో నిలబడి.. అక్షింతలు వేస్తూ విడియోలో హాజరు వేయించుకుని 'హమ్మయ్య' అనుకున్నాను. నా స్నేహం నిలబడింది. శీలపరీక్షలో నెగ్గాను!
పెళ్ళికొడుకు మరీ అమాయకుళ్ళా ఉన్నాడు. వీడికి ముందుంది ముసళ్ళ పండగ. వాణ్ణి పరీక్షగా చూస్తే.. అమ్మోరికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకపిల్లలా అనిపించాడు. ఏం చేస్తాం? ఈ వెధవల గూర్చి "దీపం పురుగుల అజ్ఞానం!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను. సమాజానికి నా సందేశమైతే ఇచ్చాను గానీ.. చదివేవాడేడి?
సరే! వచ్చిన పని అయిపోయింది. ఇవ్వాళ ఆదివారం. కొంపలు ముంచుకుపోయే పన్లేమి లేవు. తెలిసినవాడెవడూ కనబడ్డం లేదు. కొద్దిగా ఆ భోజనాల వైపు వెళ్ళి చూస్తే పోలా! అనుకుంటూ అటుగా నడిచా. అక్కడందరూ చేతిలో ప్లేట్లతో దర్సనమిచ్చారు. క్షణకాలం ముష్టివాళ్ళు సామూహికంగా బిక్షాపాత్రలతో తిరుగాడుతున్నట్లుగా అనిపించింది.
నాకా పెళ్ళిలో భోంచేసే ఉద్దేశ్యం లేదు.. అయినా ఆహార పదార్ధాలు చూట్టం మూలంగా జిహ్వాచాపల్యం కలుగుతుందేమోనని భోజన పదార్ధాల వైపు దృష్టి సారించాను. నాకు తెలిసిన వంకాయ, బీరకాయ, దొండకాయల కోసం వెదికాను. ఎక్కడా కాయగూరల అనవాళ్ళు లేవు. అక్కడున్నవన్నీ చూడ్డానికి తప్పితే తినేందుకు పనికొచ్చేట్లుగా లేవు. మంచిదే. తినేవాడు తింటాడు. లేపోతే లేదు. ఎవడి గోల వాడిది.
ఈలోగా.. మదీయ మిత్రుడొకడు కనిపించాడు. వాడి పక్కన నగలు, పట్టుచీర మోస్తూ ఒక నడివయసు మహిళ.. అతని భార్య అనుకుంటాను.. నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వాడు. సన్నగా నవ్వుతూ ముందుకు సాగిపోయాను. భార్య పక్కన ఉన్నప్పుడు స్నేహితుల్తో మాట్లాడరాదనే నియమం నాకుంది. ఈ విషయంపై "నమస్కారం.. అన్నయ్యగారు!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను.
ఫంక్షన్ హాల్ బయటకొచ్చి డ్రైవర్ కోసం ఫోన్ చేశాను. అతను భోంచేస్తున్నాట్ట. రోడ్డుపై నిలబడి ఫంక్షన్ హాల్ వైపు దృష్టి సారించాను. కళ్ళు చెదిరే లైటింగ్! పక్కనే చెవులు పగిలే మోతతో జెనరేటర్లు! కొంపలు మునిగిపోతున్నట్లు హడావుడిగా లోపలకెళ్ళేవాళ్ళు.. బయటకొచ్చేవాళ్ళు. ఎందుకో!
"ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగులరాట్నం.. " అనే ఘంటసాల పాట జ్ఞాపకం వచ్చింది. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇంకోపక్క చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు! ఘంటసాల పాటలో ఎంత అర్ధం ఉంది!
(photos courtesy : Google)
చాలా బావుంది....మీ జీవితం..నిజంగా ఇలాంటి రచనలు మీరింకా రాయాలని కోరుకుంటూ...శుభోదయం....-:)
ReplyDeleteనా 'జీవితం' మాత్రం అంతగా బాగుండలేదు. టపాలైతే బాగుంటున్నాయని మీవంటి విజ్ఞులు చెబుతున్నారు. థాంక్స్!
Deleteపెళ్ళికొడుకు మరీ అమాయకుళ్ళా ఉన్నాడు. వీడికి ముందుంది ముసళ్ళ పండగ. ....లెస్స పలికితిరి.....లెస్స పలికితిరి...ఆ మాట అన్నందులకు మా ఇంటావిడ చితక్కొ ట్టేన్...
ReplyDeleteభర్త జాతి సమస్తము.. భార్య పీడన పరాయణత్వం!
DeleteThis comment has been removed by the author.
DeleteROFL. ;)
DeleteHilarious post
ReplyDeleteVery nice ramana garu
ReplyDelete@మన్మోహన్ సింగ్ లా బుద్ధిగా కూర్చుంటున్నాను.
ReplyDelete:D
అవును. కూర్చుంటున్నాను!
Deleteకొంచెం అబ్రప్ట్ గా ముగించేసినట్టుంది
ReplyDeleteచాల్లేద్దురు! ఇప్పటికే హీరోల ఫ్లెక్సీ అభిమానులు, కట్ ఔట్ పెళ్ళిజంటలు, చూడ్డానికి తప్ప తిండానికి పనికిరాని పెళ్ళి భోజనాలు.. ఇలా చాలామంది మనోభావాలు దెబ్బ తినేట్లు రాశా!
DeleteHahhahhahaa
Deleteఈసారి మాటలు బాగా పేలాయి.
ReplyDeleteఇది చదివినవాళ్ళెవ్వరూ మిమ్మల్ని పెళ్ళికి పిలవరు.
ఈ పెళ్ళికి పిలిచినవాళ్ళు చదివితే మీతో మాట్లాడరు.
హ.. హ.. హా!
Deleteనా గూర్చి నా స్నేహితులకి బానే తెలుసు. అందుకే.. 'మా ఇంట్లో పెళ్ళి. తెలియజేస్తున్నాం. నువ్వు రాకపోతే మంచిది/బాగుండు!' అన్నట్లుగా పెళ్ళికి పిలుస్తుంటారు. నేకూడా సాధ్యమైనంతవరకు వారి అభిప్రాయాన్ని గౌరవిస్తుంటాను.
దాటేరు బాబు గారూ,
ReplyDelete"అంచేత కార్లో వెళ్తూ పరిసరాల్ని పరికిస్తుంటే.. ఏదో శవపేటిక లాంటి డబ్బాలోంచి ఊరిని చూస్తున్న భావన కలుగుతుంటుంది" ఈ వాక్యం చదువుతూంటే నాకేదో డౌటు వస్తోంది !
మంచి కాలం శవ పేటిక నించి లేచి వచ్చిన దయ్యం లా చూస్తున్నా అనలేదు సుమీ !
చీర్స్
జిలేబి.
జిలేబి జీ,
Delete'ఇరుగ్గా ఉండే పెట్టె'.. శవపేటిక గుర్తొచ్చి అలా రాసేశాను. నాకు మీ దెయ్యం డౌట్ కూడా బానే ఉంది. ఈసారెప్పుడైనా వాడతాను.
"మా అమ్మాయిని దృష్టిలో ఉంచుకుని నా భార్య ఇతన్ని డ్రైవర్ గా నియమించింది"
ReplyDeleteహ హ హ good one!
నవ్వించే నిజాలు చెప్పారు. నవ్వలేక నవ్వుతూనే ఈ వ్యాఖ్య
ReplyDeleteధన్యవాదములు
ha:-)ha:-)బాగుంది
ReplyDeleteExcellent, sir.
ReplyDelete"మా అమ్మాయిని దృష్టిలో ఉంచుకుని నా భార్య ఇతన్ని డ్రైవర్ గా నియమించింది"
మిత్రోత్తములారా,
ReplyDelete>>"మా అమ్మాయిని దృష్టిలో ఉంచుకుని నా భార్య ఇతన్ని డ్రైవర్ గా నియమించింది"<<
చిన్న వివరణ. నాకు ఇద్దరు పిల్లలు. కూతురు 19, కొడుకు 16. విజయవాడలో చిన్నారి వైష్ణవి హత్య తరవాత ఆడపిల్లల పేరెంట్స్ కి డ్రైవర్ల పట్ల 'అనుమానం' మొదలైంది. ఇది అహేతుకం అయినా వాస్తవం. అంచేత మా అమ్మాయి ఒక్కదాన్ని 'భయం' లేకండా తిప్పడానికి మంచి డ్రైవర్ కోసం చాలా వెతాకాల్సొచ్చింది. మా డ్రైవర్ భార్య నా భార్యకి GGH లో పేషంట్. అతనికి నలుగురు ఆడపిల్లలు. ముగ్గురికి పెళ్ళి చేశాడు. నిదానస్తుడు. ఇవన్నీ ఆడపిల్ల తల్లిగా నా భార్యకి బాగా నచ్చాయి.
ఈ వివరణ ఎందుకు రాస్తున్నానంటే.. ఈ టపా మళ్ళీ చదివితే.. నేరాసిన టపాలో నాకే కొంత ద్వందార్ధం ధ్వనించింది. అందుకని.
(సరదా పోస్టుకి సీరియస్ వివరణ ఇచ్చినందుకు మిత్రులు మన్నించగలరు.)
This comment has been removed by the author.
ReplyDeleteJust to clear any confusion, my comment was in regards to the humor in that line, nothing more than that :) I am sorry if I did bother you inadvertently.
ReplyDelete- Kumar N
భలేవాళ్ళే! నాదే పొరబాటు. ఫ్లోలో రాసేశాను. తరవాత చూసుకోలేదు. ఇప్పుడు ఆ వాక్యం పీకి అవతల పడేస్తున్నాను.
Deleteచురకలు బాగా అంటించారు :-)
ReplyDelete