అతను బార్లో పూటుగా తాగాడు. నాటుగా తిన్నాడు. నీటుగా లేచాడు. తూలుతూ బార్ బయటకొచ్చాడు. ఆ పక్కగా ఆపి ఉన్న ఆటోని పిలిచాడు. ఆటోవాలా తెగ సంతోషించాడు. 'ఈ తాగుబోతెదవ దగ్గర ఫుల్లుగా నొక్కేద్దాం!' అనుకున్నాడు. ఆశ్చర్యం! అతగాడు తూలుతూనే ఆటోవాలాతో గీచిగీచి బేరం చెయ్యసాగాడు. చివరాకరికి ఆటోవాలానే ఓడిపొయ్యాడు. చచ్చినట్లు మామూలు రేటుకే బేరం ఒప్పుకున్నాడు. బార్లో బోల్డు ఖర్చు చేసిన ఒక తాగుబోతు ఆటో దగ్గర అంతలా బేరమాడేమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ!
మనిషి జిరాఫీలా అరున్నరడుగులున్నా.. దున్నపోతులా నూటరవై కిలోలున్నా.. అతన్ని శాసించేది మాత్రం కొబ్బరికాయంత మెదడు మాత్రమే! అందులోనే మన ఆలోచనల కంట్రోలింగ్ సెంటర్ నిక్షిప్తమై ఉంటుంది. అర్ధరూపాయి మాట కోసం అరవై కోట్ల ఆస్తులొదిలేసుకున్న పెదరాయుళ్ళూ.. అదే అర్ధరూపాయి కోసం కుత్తకలు కోసే కత్తుల రత్తయ్యలు.. ఇలా మనుషుల ఆలోచనలని రకరకాలుగా శాసించేది ఈ మెదడే! హిట్లర్ లాంటి దౌర్భాగుల్ని, గాంధీ (సోనియా గాంధి కాదు) వంటి ఉన్నతుల్ని సృష్టించింది కూడా ఈ మెదడే!
మెదడులో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేందుకు 'ప్లెజర్ సెంటర్' ఉంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. బ్రహ్మ మన నుదుటిరాత రాసినట్లు.. ప్లెజర్ సెంటర్లలో కూడా ఫలానా అని 'రాసిపెట్టి' ఉంటుంది. మన తాగుబోతుకి ప్లెజర్ సెంటర్లో 'తాగుడు' అని రాసిపెట్టి ఉంది. కాబట్టే బార్లో బారెడు బిల్లు బోలెడు సంతోషంగా చెల్లించాడు. తాగుడికే అంత ఖర్చు చేసిన వాడికి డబ్బంటే లెక్కుండదనుకుని ఆటోవాలా పప్పులో కాలేశాడు! ఆ తాగువాడు తాగుడుకి మాత్రమే ఖర్చు చేస్తాడు. అంతా ప్లెజర్ సెంటర్ మహిమ! ఈ ప్లెజర్ సెంటర్ న్యూరో ఎనాటమి ఒక భారతం. అదిక్కడ అనవసరం (అసలు సంగతి.. సైన్స్ విషయాలు తెలుగులో రాయడం నాకు రాదు).
ఇందాకట్నుండి ప్లెజర్ సెంటర్ అని రాసినప్పుడల్లా.. నాకదేదో మసాజ్ పార్లర్లాగా, పబ్బులాగా ధ్వనిస్తుంది. అంచేత 'ప్లెజర్ సెంటర్' ని తెలుగులోకి అనువాదం చేసి రాస్తాను. 'ప్లెజర్' అనగా ఆనందం. 'సెంటర్' అనగా కేంద్రము. 'ఆనంద కేంద్రము'. నాకు ఇది కూడా నచ్చలేదు.. ఏదో 'పాలకేంద్రము'లా అనిపిస్తుంది. అంచేత ఇకనుండి 'ఆనంద నిలయం' అంటూ (పన్లోపని.. మా ఆనందభవన్ కూడా గుర్తొచ్చేలా) స్వేచ్చానువాదం చేసి రాస్తాను.
ప్రతి మనిషి మెదడులో ఈ ఆనంద నిలయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే.. ఒక్కో ఆనంద నిలయానికి ఒక్కో థీమ్ ఉంటుంది. అయితే ఈ థీమ్ యొక్క మంచీచెడూ, నైతికానైతికత అనేది చూసేవాడి దృష్టి, సమాజ విలువల్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు మచ్చుకు కొన్ని ఆనంద నిలయాల థీమ్స్ పరిశీలిద్దాం.
సుఖమయ జీవనానికి డబ్బు చాలా అవసరం. అయితే.. అవసరాలకి మించి ఎంతో ఎక్కువగా సంపాదించిన తరవాత కూడా.. చాలామందికి డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ తగ్గక పొగా.. ఇంకా పెరుగుతుంది! ఇలా మరింత శ్రద్ధగా డబ్బు సంపాదనకి పునరంకితమవ్వడం చూస్తే.. డబ్బు సంపాదన కూడా టెండూల్కర్ పరుగుల దాహం వంటిదని అర్ధమౌతుంది. అంటే వారి ఆనంద నిలయం డబ్బు సంపాదన!
మా మేనమామ మంచి ఆస్తిపరుడు. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. ఆయన శరీరం డెబ్భైయ్యేళ్ళ క్రితంది. వేసుకునే బట్టలు పదేళ్ళ క్రితంవి. గీసుకునే బ్లేడు మూడేళ్ళ క్రితంది. రుద్దుకునే టూత్ బ్రష్షు రెండేళ్ళ క్రితంది. ఇప్పుడు మీకు జంధ్యాల సినిమా, కోట శ్రీనివాసరావు జ్ఞప్తికొస్తే అది మా మేనమామ తప్పేగానీ.. జంధ్యాలది కాదు. బుద్ధి లేక.. మొన్నామధ్య బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోమని ఆయనకి సలహా ఇచ్చాను. 'ఎందుకు? డబ్బు దండగ. షుగరుంటే ఒంటేలుకి చీమలు పడతయ్యి గదా!' అన్నాడు. పిసినారితనమే మా మేనమామ ఆనంద నిలయం!
నాకో అన్నయ్య ఉన్నాడు. ఆయనకో ముఖ్యస్నేహితుడున్నాడు. అతను చాలా మంచివాడు. అయితే గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ పేకాడతాడు. పేక లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు వంటిదని అతని ప్రగాఢ నమ్మకం. అతని భాష కూడా పేక భాషే! ఎదైనా డబ్బు టాపిక్ వచ్చినప్పుడు ఐదు ఫుల్ కౌంట్లంటాడు. లేదా పది మిడిల్ డ్రాపులంటాడు. చంద్రునికో మచ్చలా ఆయనకి 'పేకాట' అనేది ఒక మచ్చ. కాకపోతే ఈయన మచ్చ పెద్ద సైజు పిడకంత ఉంటుంది. ఆ పిడకే ఆయనకి ఆనంద నిలయం.
నా స్నేహితుడొకడు మితభాషి. బాగా చదువుకున్నవాడు. ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతోద్యోగి. అయితే అతని ఆనందనిలయం 'పరాయి స్త్రీ' లలో దాగుంది. అతని పరాయి స్త్రీల సాంగత్య యత్నం ఒక యజ్ఞం స్థాయిలో ఉంటుంది. అందుకోసం ప్రాణాలకి కూడా తెగిస్తాడు. మొన్నామధ్య వడదెబ్బతో ఆస్పత్రిలో చేరాడు. ఎల్లప్పుడూ చల్లని ఏసీ (అదీ ప్రభుత్వ సొమ్ముతో) ఉండే మావాడికి వడదెబ్బ!
ఆస్పత్రికి పరామర్శగా వెళ్ళిన నాకు రహస్యంగా చెప్పాడు. అతగాడికి ఎప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక స్త్రీ రత్నం కోసం.. ఎర్రటి ఎండలో బస్టాండు ముందు తిండితిప్పలు మానేసి మరీ పడిగాపులు కాశాడు. ఆ స్త్రీ రత్నం రాలేదుగానీ.. మావాడికి జ్వరం మాత్రం వచ్చింది. నా స్నేహితుడికి ప్రేమగా, ఆప్యాయంగా పళ్ళరసం తాగిస్తున్న అతని భార్యని చూస్తే జాలేసింది!
ఆనంద నిలయాలు అంటూ వ్యసనాల్ని కూడా హైలైట్ చేస్తూ రాస్తున్నానని మీరనుకోవచ్చు. అయితే మన మెదడు.. సమాజం మంచిచెడ్డలు నిర్ణయించక ముందే అభివృద్ధి చెందింది. దానికి సభ్యత, సంస్కారం వంటి క్లిష్టమైన పదాలు అర్ధం కావు. కానీ అది మనని శాసిస్తుంది. ఫ్రాయిడ్ ఈడ్, సూపర్ ఈగో అంటూ కొంతమేరకు విశ్లేషించాడు గానీ.. ఇప్పుడెవరు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.
మనకి నచ్చని ఆనంద నిలయాల్ని వ్యసనం అన్న పేరుతో చిన్నచూపు చూస్తాం. స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్ వంటి వాటిని ఏ చూపూ చూడం. అయితే సాహిత్యసేవ, ప్రజాసేవ, కళాసేవ వంటి వాటిని గ్లోరిఫై చేస్తాం. కొందరు వారిని ఆరాధిస్తారు కూడా. కానీ ఇవి కూడా వ్యసనాలకి 'ఆదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్' గా నాకు అనిపిస్తుంది.
శ్రీశ్రీని గుప్పిలి బిగించి దమ్ము లాగుతూ, పెగ్గు మీద పెగ్గు మీద బిగిస్తూ 'మహాప్రస్థానం' రాయమని మనం అడిగామా? లేదే! మరాయన ఎందుకంత కష్టపడిపోతూ 'మహాప్రస్థానం' రాశాడు? మనం వద్దన్నా శ్రీశ్రీ రాయడం ఆపేవాడా? ఖచ్చితంగా ఆపేవాడు కాదు. పైగా.. 'నీదీ ఒక బ్రదుకేనా? కుక్కా, నక్కా.. సందులో పంది!' అంటూ తన పాళీతో మన కంట్లో పొడిచేవాడు!
ఆ మాటకొస్తే గద్దర్ ని పాటలు పాడమని మాత్రం ఎవరడిగారు? పాడొద్దంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఆవేశం ఉప్పొంగగా.. 'అరెరె.. ఈ పాట నాదిరా.. ఆ గోచి నీదిరా! ఈ పల్లె నాదిరో.. ఆ బ్లాగు నీదిరో!' అంటూ స్టేజి ఊగిపొయ్యేట్లు చిందులెయ్యడా? దటీజ్ ఆనంద నిలయం!
ఆయన ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి నాయకుడు. తొమ్మిదేళ్ళపాటు కనీసం నిద్ర కూడా పోకుండా అలుపెరుగని ప్రజాసేవ చేశాడు. 'నాకు ప్రజాసేవలో తనివి తీరలేదు. ఇంకా చేస్తాను. ఇంకోక్క అవకాశం ఇవ్వండి. ప్లీజ్!' అంటూ ఈ వృద్ధాప్యంలో, ఈ మండుటెండలో వేల కిలోమీటర్లు నడవటమేమిటి! ఆ ప్రజానాయకుడి తపన కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. అంతా ఆనంద నిలయంలోనే ఉంది!
కావున మిత్రులారా! ప్రతి మెదడుకీ ఓ ఆనందనిలయం ఉంటుంది. అది ఆ వ్యక్తికి శిలాశాసనం. ఆయా సమాజాల్లోని కట్టుబాట్లు, సంస్కృతిని అనుసరించి ఆ ఆనందనిలయాల మంచిచెడ్డలు నిర్ణయించడతాయని మొదట్లోనే చెప్పాను. అయితే వ్యక్తి ఇష్టాయిష్టాల్ని గౌరవించడంలో సమాజానిక్కూడా కొన్ని సమస్యలుంటాయి. నా స్నేహితుడు స్త్రీ సేవ చెయ్యని యెడల.. సమాజసేవ చేసేవాడేమోనని నేననుకుంటుంటాను. అలాగే వైస్ వెర్సా.
"నీ బ్లాగ్ చదవాలంటే ఏం చెయ్యాలి?"
"నీకో నమస్కారం. నా బ్లాగ్ చదవద్దు." అన్నాను.
స్నానం చెయ్యడానిక్కూడా టైమ్ లేనంత బిజీ ప్రాక్టీసున్న అతను నా బ్లాగ్ చదవడం అసంభవం. కానీ గత కొంతకాలంగా అతను నన్నలాగే పలకరిస్తున్నాడు.
నా సమాధానానికి అతను హర్టయ్యాడు. అంచేత తను చదవని నా బ్లాగ్వాపకం చెడ్డదని నిరూపించ నడుం కట్టాడు.
"అసలు నువ్వు బ్లాగులెందుకు రాస్తున్నావు?" సూటిగా చూస్తూ అన్నాడు.
"పని లేక.. " నాకీ సమాధానం చెప్పడం సంతోషాన్నిస్తుంది.
"నీకు పన్లేదంటే నేన్నమ్మను. చెప్పు. బ్లాగులెందుకు రాస్తున్నావు?" పోలీసువాడు 'లైసన్సుందా?' అనడిగినట్లు రెట్టించి అడిగాడు.
వదిలేట్టు లేడు. ఒక క్షణం ఆలోచించి "ఆనంద నిలయం!" అన్నాను.
"అంటే?" మొహం చిట్లించాడు.
"ఏం లేదు." అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
(photos courtesy : Google)
we are also satisfying our pleasure centres through your blogs.nice article.please write more articles based on your profession.
ReplyDeleteవిషయం అవసరం అయినప్పుడు ఒకట్రెండు సైకాలజీ పాయింట్లు రాస్తూనే ఉన్నాను. అయితే ప్రత్యేకంగా సైకాలజీ మీదనే రాయాలంటే నాకు చేతకాదు (ఆ సంగతి ఈ పోస్టులో రాశాను).
Deleteమంచిమంచి బ్లాగులు చదవమని మా ఆనందనిలయాలు మమ్మల్ని శాసిస్తున్నాయండీ మరి
ReplyDeleteథాంక్సండి! ఇంతకు ముందులా మీరు నా రాతల్లో తప్పులు తెలిజేయట్లేదు. నేను బెటర్ గా రాస్తున్నానా? లేక విసుగు చెంది మీరే వదిలేశారా?
Delete(ఇప్పుడు నేను పెద్దబాలశిక్ష మొదలుకుని శంకరనారాయణ dictionary వరకు పకడ్బందీగా ఉంటున్నాను.)
రమణగారూ, యేదో చాదస్తం కొద్దీ నా దృష్టికి వచ్చిన భాషాదోషాలను యెత్తి చూపిస్తూ ఉంటాను. అది నా బలహీనత. కాని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. ఒకవేళ మీరు అలా భావించిన పక్షంలో నన్ను క్షమించ వలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఒకరి తప్పులెన్న నేనెంత వాడను! మీ శైలి అమోఘం కాబట్టి మీ బ్లాగును తప్పక చదువుతాను.
Deleteశ్యామలీయం గారు,
Deleteమీరు (అప్పుడప్పుడు కొత్తపాళీ గారు) ఇంతకుముందు నా భాషలో కొన్ని పొరబాట్లు చెప్పారు. అవి నేను వెంటనే సరిజేసుకున్నాను. అందుకు నేను కృతజ్ఞుడను.
(భాషలో దోషాల్ని చెప్పడం నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది?! ఖచ్చితంగా కాదు. అది నాకు మీరు చేసిన సహాయం గానే భావిస్తున్నాను. అందుకనే నా query.)
శ్యామలీయం గారి మాటే నా మాటా నండీ! నా ఆనందనిలయం ఎక్కడుందో నాకు తెలిసి పోయింది . థాంక్ యు వెరీ మచ్
ReplyDeleteగమనిక.
Deleteనా టపాల వల్ల ఎవరికైనా కొత్త విషయాలు తెలిసిన యెడల.. ఫీజు చెల్లించవలసినదిగా విజ్ఞప్తి!
తప్పకుండా.., కామెంట్ల రూపం లో ఫీజు చెల్లించు కుంటాం.
Deleteguruvu gaaru soniya gandhini braketlo pettaru ? naaku ardam ayindi sir
ReplyDeleteహహహ ఆనందనిలయం కాన్సెప్ట్ బాగుందండీ.. మంచివైనా చెడువైనా వ్యాపకాలకూ వ్యసనాలకూ అన్నిటికీ మూలకారణం ఆనందనిలయమేనంటారనమాట శుభం :-) మీ వైద్యస్నేహితుల్లాంటి కొందరు నామిత్రులడిగే కొన్ని ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో దారిచూపించారు థాంక్స్ :-)
ReplyDeleteమీకూ నా స్నేహితుల్లాంటివారున్నారన్న మాట! కంగ్రాట్స్!
Deleteబాగుంది.
ReplyDeleteఆనంద నిలయం అంటే తిరుమల ఆలయం గురించి వ్రాస్తారనుకున్నాను. మెదడులోని ఆలయం గురించి వ్రాసారన్నమాట.
ఇకపై మీ బ్లాగు పేరుని "పని లేక.." నుంచి "ఆనంద నిలయం" కి మారిస్తే క్లాసిగ్గా బాగుంటుందేమో ఆలోచించండి.
రమణగారో, మీ బ్లాగు పేరును కాసిగ్గా ఉంటుందని ఆనందనిలయం అని మార్చరో, మీకే ప్రమాదం. క్లాసిక్ అనిపిస్తే అనేకమంది పెడముఖం పెట్టే అవకాశాలు హెచ్చు.
Deleteబోనగిరి గారు,
Deleteపెద్దలు శ్యామలీయం గారు హెచ్చరించారు. కాబట్టి బ్లాగ్ పేరు మార్చే ధైర్యం చెయ్యను.
(మీ సలహా పాటించి ఒక కథ పేరుని మార్చాను. థాంక్యూ.)
"దూల" is more simple & appropriate word. ;)
ReplyDelete"ఆయన శరీరం డెబ్బై ఏళ్ళ క్రితంది" వహ్ వా, ఏమి చెప్పారండి రమణ గారు!.
ReplyDeleteశరీరాన్ని మిగతా అన్ని వస్తువులతో పోల్చి ఒక వాక్యం లోనే ఎన్నో అర్థాలు వచ్చేలా రాసారు.
రోజుకోసారి మీ బ్లాగ్ చెక్ చేసే అబ్సెషన్ లోంచి బయటపడలేకపోతున్నాను మాస్టారూ ! ఆనంద నిలయాన్నే దురద అనికూడా అనొచ్చా?
ReplyDeleteభార్యా లోలుడు, భార్యా హేటుడూ కూడా ఆనంద నిలయ జాబితాలోకి వస్తాయి అనుకుంటా. మళ్ళా వీటిల్లో టెంపోరరి, పర్మేనేంట్ స్థితులు కూడా ఉంటాయా?
ReplyDeleteఈ భవభందాల శ్రుంఖలాల నుండి బయటపడే మార్గామేదన్నా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి డాక్టరు గారూ?
బయటపడే మార్గం? అన్వేషిస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి నాకైతే ఏమీ తోచడం లేదు. ఇదంతా మన తలరాత. అనుభవించక తప్పదు.
Deleteఐతే వైద్యులుగారు,
ReplyDeleteమనం మనలా ఉండటానికి, ఆనంద నిలయమే కారణమంటారా?? దానికి మనమేం చెయ్యలేమా??
(ఇది నిఝంగా నిజాయీతీగా అడుగుతున్న ప్రశ్న )
కృష్ణ
ఇప్పుడు విషయం అంతా neurotransmitters మీదుగా పోతుంది. ఒకప్పుడు సిగరెట్ తాగడం ఓ అలవాటుగా భావించేవారు. ఇప్పుడు దానిక్కూడా dopamine కారణం అంటున్నారు. ఇవన్నీ బయలాజికల్ ఇష్యూస్.
Deleteతమ pleasure seeking behaviour కరెక్టనే చాలామంది అనుకుంటారు. అతి కొద్దిమంది.. when their behaviour is terribly uncomfortable and socially unacceptable.. may try to change. Then the issue of ego syntonic and ego dystonic will come into the picture.
ఈ గోలంతా ఇప్పుడు, ఈ పోస్టుకి అనవసరం (తెలుసుకుని బుర్ర పాడుచేకోవడం తప్పించి)!
"మన మెదడు.. సమాజం మంచిచెడ్డలు నిర్ణయించక ముందే అభివృద్ధి చెందింది. దానికి సభ్యత, సంస్కారం వంటి క్లిష్టమైన పదాలు అర్ధం కావు. కానీ అది మనని శాసిస్తుంది"
ReplyDeleteఈ జగత్తుని దేవుడే శాచిస్తాడు అనేదానికీ పైన మీరు చెప్పిందానికీ ఏ మైనా తేడా వుందా రమణ గారూ. మానచిక వైద్యుడు చెట్టునే తప్ప, అడవిని చుడరు ఒక వ్యెక్తి పులిని చూచి బయపడితే ఆ భయానికి మెదడులొ జరిగే ఏవొ రసాయనాల సమ్మేళణం తప్ప ఎదుటనున్న పులి కాదు. ఇలా వుంది మీరు చెప్పింది. మీరు కొన్ని టపాలలొ వ్యెక్తం చేసిన దాన్ని బట్టి నాస్తికులుగా తెలుస్తుంది. కాని ఇక్కడ మాత్రం పూర్తిగా భావవాదం లొకి కూరుక పొయారు.
మీకు నచ్చిన దానినే తీసుకుంటారు మిగిలింది అనవసరం అది తార్కికంగా వుందా లేదా అనేదానితొ సంభందం లేకుండా. రంగనాయకమ్మలొ మీకు నాస్తికత్వమే నచ్చింది అంతవరకే తీసుకున్నారు కాని మార్కిజాన్ని మాత్రం విమర్శించారు దానిగురించి తెలియకుండానే!!!!!!!!!!!!!!!!!!.
నాకు చాలా విషయాల పట్ల అవగాహన లేదు. అర్ధం చేసుకునేంత తెలివీ లేదు. దయచేసి మీరు నా టపాలని సీరియస్ గా తీసుకోకండి (నేనే సీరియస్ గా తీసుకోను). ఇవన్నీ సరదాగా రాస్తున్నవే.
Deleteఈ సమాధానం పలాయనవాదం కాదంటారా! :)
Delete@జయహొ,
Deleteనేను రాయాలనుకున్నది రాశాను. అది ఏ వాదమో మీరే నిర్ణయించుకోండి. నేనేం కొంపలు మునిగిపోయ్యే విషయాలు రాయను. బుర్రలో తట్టే ఆలోచనకి అక్షర రూపం ఇస్తుంటాను. అంతే! :)
ReplyDelete"ఇందాకట్నుండి ప్లెజర్ సెంటర్ అని రాసినప్పుడల్లా.. నాకదేదో మసాజ్ పార్లర్లాగా, పబ్బులాగా ధ్వనిస్తుంది"
మా కుర్ర కారు ఆనందనిలయాలని ఇట్లా కించ పరుస్తూ రాయడాన్ని ఖండిత్తన్నాం!!
ఐనా డాట్టరు గారూ, మాకు తెల్వకడుగతా.. మీ అనందనిలయంలో జ్ఞానపీఠం వస్తే ఆ పాకుడురాళ్ళ గురించి ఇంకా ఇక్కడేం రాయలేదేం?
నేను మూడు జ్ఞానపీఠాల్లో ఒక్క పీఠాన్ని కూడా చదవని అజ్ఞానిని. కాబట్టి.. రాయడానికి నా దగ్గర విషయం లేదు.
Deletehttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/e/e1/Indian_rupees.png/252px-Indian_rupees.png
ReplyDeleteI paid..........! :)
అయితే తప్పు కాదు నాది కాదన్న మాట ...అంతా ఆ ఆనంద నిలయం లో ఉందన్న మాట .
ReplyDeleteఅరే ఒక సిగరెట్ తాగకూడదు అంటారు .
పేక అస్సలు ముట్టుకోకూడదంట .
వర్షం వచ్చినప్పుడు ఓ రెండు పెగ్గులు వేస్తానంటే ఒప్పుకోదు .
ఈ టపా నా గర్ల్ ఫ్రెండ్ కి చూపించి తప్పు నాది కాదు , అంతా ఆ ఆనంద నిలయం లో ఉంది అని చెప్తాను .
హమ్మయ్య బ్రతికించారు .
కాస్త ఇలాంటివి విరివిగా రాస్తుండండి .
మీరు గర్ల్ ఫ్రెండ్ దగ్గరే పర్మిషన్లు తీసుకునే స్థాయిలో ఉన్నారేమిటి? భవిష్యత్తు గూర్చి జాగర్త!
Deleteబోర్ అనిపించినా అదే పని అప్పుడప్పుడు చేస్తుంటాము ( ఉదా: బ్లాగులు చదవడం ). దీన్నేమంటారు గురూజీ ?
ReplyDeleteఏమీ అనరు. 'పని లేక.. ' అంటారు! :)
Deleteఏమో ఈ డాటేరు బాబు గారూ,
ReplyDeleteమొదట్లో మందు బాబు ఫుటో పెట్టి ఆఖర్లో మెదడు ఖాళీ ఖాళీ చేసి, కపాల మోక్షం కలిగించేరు
దీన్నే బ్రెయిన్ వాష్ అందు రేమో మరి !!
ఆనంద నిలయ వాసా వేంకటేశా గోవిందా గోవిందా ! కపాల మోక్షకారకా యా రమణా యా రమణా !!
జిలేబి.
ఆ శరీరం 70 యేళ్ళది, టూత్ బ్రష్ 2 యేళ్ళది. ఇవి చదువుతుంటే రావి శాస్త్రి లా వినిపించారు.
ReplyDelete"ఒకప్పుడామె అందంగ ఉండుంటుంది, పెద్దకొప్పుని చక్కగ ముడుచుకొని ఉండుంటుంది, ఆమె కట్టుకున్న నల్లకొక, ఒకప్పుడు కొత్తదై ఉండుంటుంది."
నిజంగా! థాంక్యూ!
Delete(మీకు నేనో పార్టీ బాకీ)