మొదటి సంఘటన :
విశాలమైన హాలు, మెత్తటి ముఖమల్ పరుపులు, చల్లని వాతావారణం, బయట వర్షం చిరుజల్లుగా పడుతోంది. మంద్రస్థాయిలో కోకిల వంటి గానం మత్తుగా, మధురంగా వినవస్తుంది. ఆ గాత్రానికి అనుగుణంగా చక్కని లయతో ఒక అపురూప సౌందర్యవతి మయూరి వలె నర్తించుచున్నది.
అహాహా! ఇదియే కదా స్వర్గమన్న! ఇవి నా జీవితంలో అత్యంత మధుర క్షణాలు. నా జీవితము ధన్యము. ఇన్నాళ్ళూ మెడికల్ జర్నల్సుల్లో, ప్రాక్టీసులో నా జీవితం ఎంతలా వృధా చేసుకున్నాను!
సర్లే! ఏదోకటి, ఇప్పటికైనా సుఖపడే రోజులొచ్చాయి. దేవుడా! ఈ ఆనందం శాశ్వతంగా నాదయ్యేట్లు చూడు. ఇన్నాళ్ళూ నువ్వు లేవనుకుని నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇవ్వాల్టినుండి నేను అన్నమయ్య, రామదాసు రేంజిలో నీ భక్తుడిగా మారిపోబోతున్నాను. ఆశీర్వదించుము తండ్రీ!
ఇంతలో -
టప్పున తీగ తెగినట్లు ఏదో చిన్న శబ్దం. పాట వినబడ్డం మానేసింది. ఆ సుందరీమణి నాట్యం చెయ్యడం కూడా ఆపేసింది. ఎదురుగానున్న సుందర దృశ్యం, ఒక ఫొటో మాదిరిగా నిశ్చలంగా అయిపోయింది.
ఓ దివ్యవాణీ! పాడుము, పాడుము.
ఓ లలనామణీ! నర్తించుము, నర్తించుము.
హయ్యో! నేనెంత అర్ధించినా, అరిచి మొత్తుకుంటున్నా, అక్కడ చలనం లేదేమి? దేవుడా! నా స్వర్గం నాకు మళ్ళీ ప్రసాదించవయ్యా! ఇప్పుడేగా? నేన్నీకు భక్తుడిగా మారాను! అంతలోనే నాకు పరీక్షా! ఇదన్యాయం, అక్రమం.
రెండో సంఘటన :
ఆకలి దంచేస్తుంది. నాకెంతో ఇష్టమైన మాసాలా దోసె తిందామని ఆనంద భవన్‌లోకి అడుగెట్టాను. కౌంటర్లో ఓనరుడు పురుషోత్తముడు లేడు, అతని కొడుకున్నాడు.
"చూడు నాయనా సర్వారావు! ఒక మంచి మసాలా దోసె దోరగా వేయించి, కొద్దిగా అల్లం పచ్చడి ఎక్కువేసుకుని తెచ్చుకో." ప్రేమగా ఆర్డరిచ్చాను. సర్వర్ నావైపు వింతగా చూస్తూ కిచెన్లోకెళ్ళాడు.
కొద్దిసేపటికి ఘుమఘుమలాడుతున్న మసాలా దోసె వచ్చింది. ఆ సువాసనకి నా ఆకలి రెట్టింపైంది. ఆత్రంగా, ఆబగా, కక్కుర్తిగా, మూడ్రోజుల్నుండి తిండిలేని వరద బాధితుళ్ళా.. ఆవురావురుమంటూ మసాలా దోసెపై దాడి మొదలెట్టాను.
అహాహా! ఏమి రుచి!
ఏవోఁయ్ మైడియర్ వెంకటేశం! రాసుకో!
సృష్టిలో అతి రుచికరమైన పదార్ధమేమి? మసాలా దోసె!
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదేమి? మసాల దోసె!
కత్రీనాకైఫ్ కన్నా కమ్మనైనదేమి? మసాలా దోసె!
ఇంతలో -
ఎక్కణ్నించి ఊడిపడ్డాడో - సర్వరుడు నాముందున్న మసాల దోసె ప్లేట్ విసురుగా లాగేశాడు. ఏం జరుగుతుందో నాకర్ధమయ్యేంతలోనే, ఆ ప్లేట్‌ని కిచెన్లోకి హడావుడిగా తీసుకెళ్ళిపొయ్యాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనకి బిత్తరపొయ్యాను.
ఏమిటీ అన్యాయం? నోటి దగ్గర మసాలా దోసె లాగేసిన వీడు మనిషా? దున్నపోతా? సర్లే! వాడు మనిషైతే నాకేంటి? దున్నపోతైతే నాకేంటి? కానీ - చేసిన పని మాత్రం అత్యంత దుర్మార్గమైనది, దుష్టమైనది.
నాక్కోపం నషాళానికంటింది. నా సంగతి ఈ సర్వరు గాడికి తెలీదు. నేను శాంతంలో ఎ.నాగేశ్వరరావుని, రౌద్రంలో ఆర్.నాగేశ్వరరావుని.
కోపంగా బర్రున కుర్చీ వెనక్కి నెట్టాను. పురుషోత్తం కొడుకు కౌంటర్లో చిల్లర లెక్కబెట్టుకుంటున్నాడు.
'ఏమిటీ బుద్ధిలేని పని? నీ సర్వరుగాడు నే తింటున్న మసాలా దోసె మధ్యలోనే లాక్కెళ్ళిపొయ్యాడు తెలుసా? వాణ్ణి అర్జంటుగా డిస్మిస్ చెయ్యి.. నాకింకో మసాలా దోసె తెప్పించు.' అతన్ని డిమాండింగ్‌గా అడిగాను.
ఆ ఓనర్ కుర్రాడు నావైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడు. వెనకనుండి సర్వాధముడు పుసిక్కున నవ్వాడు.
'నా సంగతి మీకు తెలీదులా వుంది? ఏదో మెత్తగా కనిపిస్తున్నానని వెధవ్వేషాలు వెయ్యకండి. నాగ్గనక తిక్క రేగితే ఈ విషయం ముఖ్యమంత్రి స్థాయి దాకా పోతుంది.' అన్నాను గట్టిగా.
నా అరుపులు పట్టించుకునేవాడే లేడు! నా కోపం ఉక్రోశంగా మారింది.
'ఇప్పుడైనా సరే, ఇంకో ఫ్రెష్ మసాలా దోసె తెప్పించి 'సారీ' చెప్పినట్లైతే క్షమించి వదిలెయ్యడానికి నేను సిద్ధం.' నా గొంతు నాకే దీనంగా వినబడింది.
అయినా - నా రోదన ఓ అరణ్యరోదనలా మిగిలిపోయింది.
'ఓరి మీ అమ్మ కడుపులు మాడ! మసాలా దోసె తినకపోతే చచ్చేట్లున్నాను, కనీసం ఇందాక నాదగ్గర్నించి లాక్కెళ్ళిన ప్లేట్లో మిగిలిన ఆ సగం దోసెనైనా నా మొహాన కొట్టి చావండ్రా, దరిద్రులారా! అదైనా తిని ప్రాణాలు కాపాడుకుంటాను.' కంఠం రుద్దమవుతుండగా.. సిగ్గు, అభిమానం వదిలేసి వాళ్ళని వేడుకున్నాను.
అక్కడ పరిస్థితిలో మార్పేమీ లేదు. అందరూ కట్టగట్టుకునే నాకు మసాల దోసె ద్రోహం తలబెట్టారనే సంగతి అర్ధమైంది!
(జరగని) ఈ రెండు సంఘటనలకి మూలం :
రావిశాస్త్రి 'రాజు - మహిషి' చదవడం ముగించాను (ఎన్నోసారి? గుర్తులేదు). నాకీ నవల ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంది. బయటకి 'రావిశాస్త్రి అసంపూర్తిగా రాస్తే మాత్రమేం? అదే చదువుకుని తరించండి.' అని వాదిస్తాను గానీ, లోలోపల మాత్రం కథ (పుస్తకంలో పేజీలు చిరిగి ఊడిపోయినట్లు) ఆగిపోవడం నాకు దుఃఖంగా వుంటుంది. ఇంత మంచి నవల రాయడం మొదలుబెట్టి మధ్యలో ఆపెయ్యడం రావిశాస్త్రి తెలుగు పాఠకులకి చేసిన అన్యాయంగా అనిపిస్తుంటుంది.
అందుకే - ఇవ్వాళ కూడా నాకు దిగులుగా వుంది (రావిశాస్త్రి సగం రాసి వదిలేసిన నవల అదేపనిగా చదవనేల? ఆపై ఇలా ఏడవనేల? అని మీరడిగితే నాదగ్గర సమాధానం లేదు). అంచేత, ఆ దిగుల్లో - బద్దలైన నా గుండెనీ, చెదిరిన నా హృదయాన్నీ ఉపశమన పరుచుకునేందుకు పై రెండు (ఊహా) సంఘటనలు రాసుకున్నాను.
మందుల భీముడు నన్ను చికాకు పెట్టిన విధము :
'రాజు - మహిషి' ఎప్పుడు చదివినా నా అభిమాన పాత్ర మాత్రం గిరీశం ఛాయలున్న మందుల భీముడే. మరి - ఇంత తెలివైన మందుల భీముణ్ని గేదెల రాజమ్మ ఎలా దెబ్బ తీయగలదు? నాకీ ప్రశ్న ఎప్పుడూ మెదుల్తూనే ఉంటుంది. రావిశాస్త్రి మదిలో ఏదో మాస్టర్ ప్లాన్ వుండే వుంటుంది! ఏదేమైనా - ఆయన కథ మొత్తం రాస్తే ఈ విషయం తెలిసేది.
ఇంతలో కళ్ళు జిగేల్మనే మెరుపు.
ఎదురుగా కుర్చీలో ఒక సగం బట్టతలాయన! తాపీగా చుట్ట కాల్చుకుంటూ కూర్చునున్నాడు. ఆయనకి యాభయ్యేళ్ళుండవచ్చు. బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు.
ఎవరీ అగంతకుడు? వేళకానివేళలో ఏకంగా బెడ్రూములోకే వచ్చేశాడు! ఆయన.. ఆయన.. మందుల భీముడు!
మందుల భీముడు నన్ను చూసి మందహాసం చేసేడు.
"సూడు డాట్టరు బాబూ! నువ్వెర్రోళ్ళకి వైజ్జిగం చేసేదాంట్లో మొగోడివే, ఒప్పుకుంటున్నా. అది నీ పెసల్ సబ్జిక్టు. కానీ గురుడా! ఆడదాన్ని సదవడం అంత వీజీ కాదు. అది నా పెసల్ సబ్జిక్టు. నన్నా విందిరాగాంధి ఒచ్చినా ఏటీ సెయ్యలేదు. ఒకేళొచ్చినా ఆయమ్మ నాతో ఏటంటదో తెల్సా? ఒరే భీమా! నువ్వు నా కాంగిరేసులో సేరిపోరా నైనా! నీకు ముక్యమంత్రి పోస్టింగిచ్చేస్తాన్రా నైనా అంటది! అప్పుడు మా బావ సైర్మన్ గోడి ఏడుపు మొకం సూడాలా! జొరవొచ్చిన గున్నేగులా గిలగిల్లాడిపోడూ! అట్టాంటిది - నన్నా పేడ పిసుక్కునే రాజమ్మ ముండేంజేస్తది? ఏదీ సెయ్యలేదు." దర్జాగా అన్నాడు మందుల భీముడు.
నాకు మందుల భీముడి పద్ధతి నచ్చలేదు.
"భీముడూ! నువ్వు తెలివైనవాడివే కావచ్చు. కానీ నువ్వు రావిశాస్త్రి అనే ఒక ప్రపంచస్థాయి రచయిత సృష్టించిన పాత్రవి. రాజమ్మ నిన్నే విధంగా దెబ్బ తీసేదో ఆయన రాస్తేనే కదా మాకు తెలిసేది?"
మందుల భీముడు నా మాట నచ్చినట్లు లేదు. సమాధానంగా విసురుగా చుట్ట కొస కొరికి తుపుక్కున ఊశాడు. కొద్దిసేపు ఏదో ఆలోచించి నక్కలా నిశ్శబ్దంగా నవ్వాడు.
"నువ్వో ఎర్రి డాట్టరువు, నీ గురుడా చాత్రిబాబు! సరీపోయింది. సన్నాసీ సన్నాసీ రాసుకుంటే బూడిద రాలిందంట! చాత్రిబాబు పేరేంది? ఇస్సనాదసాస్రి. అంటే ఎవురు? పరమ సివుడు. సివుడికి మన గేదెల గంగరాజుగాళ్ళా పర్సనాల్టీ ఉంటాదేగాని, తలకాయలో మా కర్రిరాద కున్నంత తెలివి కూడా వుండదు. అందుకే తపస్సు చేసిన పెతి కేడీ నాకొడుక్కీ పరమ వీజీగా సివుడు వరాలిచ్చేస్తాడు. అదే ఇష్ణుమూర్తులోర్నే సూడు. 'అసలెవుడీడు? ఈడిది నిజం తపస్సా? దొంగ తపస్సా? ఈడికి ఒరం ఇస్తే నాకేటొస్తాది?' ఇట్లా సేలా ఆలోసిస్తాడు. అబ్బే! సివుడికా తెలివేది? కమ్మలింటి రాజుగాళ్ళా తనో దానకర్నుడనుకుంటాడు. అందుకే నీ చాత్రిబాబు నాకు అప్పనంగా కొంపల్దీసే తెలివిచ్చాడు, కొంపల్నిలిపే లవుక్యవూ ఇచ్చాడు. మనం గనక కేసు టేకప్ చేసినాఁవంటే ఓ సుట్టు చూడందే వణ్ణం కూడా ముట్టవంతే! పట్టుదలొస్తే ఆడ అమిరికావోడు, ఈడ ఈ మందులోడు! చాత్రిబాబు తన కథ కోసం నాకన్నీ ఇచ్చేసి - ఇప్పుడు ఆ గేదెల రాజమ్మ లాంటి అణాకానీ లంజతో నన్ను దెబ్బ కొట్టాలని సూస్తన్నాడు. ఆయన ప్లీడరైతే ఎవుడిగ్గొప్ప? నాకాడ ఓల్ ఇసాపట్నాన్ని అదరేసే ప్లీడర్ ముకుందబాబే వున్నాడు! ఈ మందుల భీవుడు మంచితనానికి పేణాలిస్తాడు, తేడా ఒస్తే పేణం తీస్తాడు. అది చాత్రిబాబైనా సరే! ఎర్రిడాట్టరైనా సరే! బస్తీ మే సవాల్!" అని పులిలా గాండ్రించి, హైనాలా విషపు నవ్వొకటి నవ్వాడు.
పాఠకులారా! ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. 'రాజు - మహిషి' మందుల భీముడు పాత్ర నాకు ఇష్టం లేదు. నాకెందుకో - రావిశాస్త్రి మందుల భీముడికి 'లార్జర్ దేన్ లైఫ్' పాత్రనిచ్చి తప్పు చేసినట్లనిపిస్తుంది.
"ఇదో ఎర్రి డాట్టరు బాబూ! అన్నట్టు నీకో పెసల్ నూసు! నీ గురుడు చాత్రిబాబుకి నన్నెట్టా దెబ్బ తియ్యాలో తెలీక, కథ రాసీటవే ఆపు జేసేడు. అదీ మందెబ్బంటే! ఏంది డాట్టరు బాబు! పెద్ద తెలివైనోణ్ణంటావ్! ఆ మాత్తరం ఆలోసన సెయ్యకపోతే ఎట్టా?" అంటూ ఏదో రహస్యం చెప్పినట్లు పోజు కొట్టి నన్ను విసుక్కున్నాడు మందుల భీముడు.
రావిశాస్త్రిని విమర్శించేవాళ్ళంతా నా శతృవులే! ఇందులో నాకేవిధమైన కన్ఫ్యూజన్ లేదు. అంచేత (కోపంతో) - నేనేమీ మాట్లాడలేదు. చుట్ట తాగడం పూర్తిజేసిన మందుల భీముడు నాకేసి కొద్దిసేపు జాలిగా చూసి బెడ్రూములోంచి నిష్క్రమించాడు.
అమ్మయ్య! ఇప్పుడు నాకు హాయిగా వుంది.
అంకితం :
రావిశాస్త్రి పాదపద్మములకి..
(photo courtesy : Google)